కలెక్టరేట్ ముందు ఎర్రషామియానాలు

ఎప్పుడైనా
ఉత్తుత్తిగా తిరగబళ్ళేం
మాట తూటాలా పేలడం మాజాక్ కాదు
మనిషి మందుగుండు దట్టించిన బందూక్ గావాలంటే
దగా పడ్డవాళ్ళ దూప తెలియాలి
ఒక పూటన్నా పస్తులుండాలి

కలెక్టరేట్ ముందు వేసిన
ప్రతి ఎర్ర షామియానా అర్ధాకలితో పూసిన
మందారప్పూల చెట్టులా ఉండేది
రక్తంతో తడిచిన నేల కడుపులోంచి తప్ప
మిగతా చోట్ల పూలకీ పుటక ఉండదు
ఎదిరించడంలో ఉండే సౌందర్యం
ఎంత సుకుమారమైనది !

బంగరు మాగాణాల్ని కలగన్నవాళ్ళు
పరిహారం కోసమో – పని కోసమో
మోసపోయిన వాళ్ళు
వాళ్లీ షామియానాల కింద
ఆశల పసి కందుల్ని ఒళ్ళో వేసుకుని
నిద్రాహారాల్లేని నినాదాలయ్యేవారు
కలెక్టరేట్ రోడ్డు కాస్తా
ఎండబెట్టిన మిరపకాయల కళ్ళంలా కనిపించేది

ఆచి తూచి అడుగేసేవాణ్ణి
భావావేశాల్ని నెమలీకల్లా అందంగా దాచుకునేవాణ్ణి
నేనీదార్లో ఆఫీసుకెళ్తున్నప్పుడల్లా
ఒక ఆడబిడ్డ కన్నీటి ఎసట్లో వండిన
అన్నం ముద్ద నా అరచేతుల్లో పెట్టేది
కొందరు పోరగాళ్ళు మండే తమ గుండె కడవల్లోంచి
దోసిట్లోకి కాసిన్ని మంచి నీళ్ళొంపేవారు

ఇక్కడి తిరుగుబాటు రుచి వేరు
లడాయిలో లౌక్యపు బడాయి మాటలకన్నా
నిరసన రాగం ఖుల్లం ఖుల్లాగా గొంతెత్తి పాడేది
లులిపడ్డం కన్నా ఉసురు తీసుకోవడం
ఇక్కడ దూరపోసంత తేలిక
ప్రజాయుద్ధాల కోసమే బిడ్డల్ని కన్న తల్లి తెలంగాణ

ఈ షామియానాల నీడ
‘నీకోసం నేను
నాకోసం నువు తప్ప’ – వేరే సూర్యోదయం లేని ఆకాశంలా
పరుచుకునేది

ప్రతిఘటించడాన్ని ప్రేమించడమెలాగో
ఈ అమ్మ కొంగే నాకు మళ్లీ నేర్పించింది

(కరీంనగర్ కలెక్టరేట్ ముందు అంగన్వాడీల సమ్మె జరిగినప్పుడు కలిగిన భావాల కలయిక ఈ కవిత)

పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో 'కవితా ఓ కవితా' శీర్షిక నిర్వహిస్తున్నారు. 'అద్వంద్వం' తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

Leave a Reply