సమకాలీన ఉదారవాద, పోస్ట్-మోడర్నిస్ట్ మేధావులు విప్లవ రచయితల సంఘం (విరసం)పై చేస్తున్న దాడి కేవలం ఒక సాహిత్య సంస్థపై చేస్తున్నది కాదు. అది మార్క్సిస్ట్ రాజకీయ అర్థశాస్త్ర పునాదులపై, వర్గపోరాట అవసరాన్ని నొక్కిచెప్పే చారిత్రక భౌతికవాద దృక్పథంపై పథకం ప్రకారం జరుగుతున్న దాడి. సెప్టెంబర్ 21 సోమవారం ఆంధ్రజ్యోతిలో విక్టర్ విజయ్‌కుమార్ రాసిన వ్యాసం (కాలం చెల్లిన ‘విరసం’) అలాంటిది,
విరసం అవగాహనకు కాలం చెల్లిందని, వారు 1970ల నాటి ‘యాంత్రిక పదజాలాన్ని’ పట్టుకుని వేలాడుతున్నారని ఆయన చేసిన తీవ్రమైన విమర్శ పైపైన ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ, ఒక సమాజపు ఉత్పత్తి సంబంధాలను, భౌతిక పరిస్థితులను విస్మరించి కేవలం ఉపరితల పరిణామాల చుట్టూ తిరిగే ఈ విమర్శలలో సైద్ధాంతిక దారిద్య్రం, బూర్జువా భావజాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సమాజాన్ని విశ్లేషించాల్సింది గాలిలో తేలియాడే భావనల ఆధారంగా కాదు, నేలమీద మనుషుల మధ్య ఉన్న వాస్తవిక ఆర్థిక, ఉత్పత్తి సంబంధాల ఆధారంగా. ఈ చారిత్రక దృష్టి లోపించినందుకే సదరు విమర్శకుడు తీవ్రమైన అవగాహనా లోపంతో కుప్పకూలారు.
విరసం ‘‘భూస్వామ్య, బూర్జువా’’ పదాలను యాంత్రికంగా వాడుతోందని, భారతదేశంలో అత్యంత కీలకమైన ‘‘బ్రాహ్మణీయత’’ గురించి తక్కువగా మాట్లాడుతోందని ఆయన ఆరోపించారు. కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు’ లాంటి రచనలు విరసం నుండి ఎందుకు రాలేదన్నది వారి ప్రశ్న. ఇక్కడే ఉదారవాద, అస్తిత్వవాద మేధావుల ప్రాథమిక లోపం బయటపడుతుంది. కులం, బ్రాహ్మణీయత అనేవి కేవలం సాంస్కృతిక భావజాలాలు కావు. పల్లెల్లో నెలకొన్న అర్ధ-భూస్వామ్య వ్యవస్థ అనే గట్టి భౌతిక పునాదిపై పెనవేసుకున్న చారిత్రక సామాజిక నిర్మాణమే కులం. కులాన్ని, భూమి యాజమాన్యాన్ని వేరుచేసి చూడటం అంటే శ్రమ దోపిడీకి ఉన్న ఆర్థిక మూలాలను కప్పిపుచ్చడమే.
కంచ ఐలయ్య లాంటి మేధావులు బ్రాహ్మణీయతను సాంస్కృతిక, ఉపరితల స్థాయిలో తీవ్రంగా, ఆకర్షణీయంగా విమర్శించగలరు. కానీ ఆ బ్రాహ్మణీయతకు ఊపిరిలూదుతున్న, దానికి భౌతిక రక్షణ కల్పిస్తున్న భూస్వామ్య, పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాల సమూల కూల్చివేతను (వర్గపోరాటాన్ని) వారు ఎన్నటికీ ప్రతిపాదించలేరు. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ ఘటన అయినా, మహారాష్ట్రలోని ఖైర్లాంజీ అయినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కారంచేడు, చుండూరు, లక్ష్మిపేట దాడులు అయినా వీటిని కేవలం ‘అంటరానితనంస, సామాజిక, సాంస్కృతిక అహంకారం అనే ఒకే కోణంలో చూస్తే అసలు వాస్తవం మరుగున పడుతుంది. ఈ దాడుల వెనుక ఉన్న అసలు కారణం భూమిపై, వనరులపై, గౌరవప్రదమైన వేతనాలపై నిలదీసిన దళిత, ఆదివాసీ వ్యవసాయ కూలీల, కౌలు రైతుల వర్గ చైతన్యాన్ని అణచివేయడం. శ్రమ దోపిడీకి కులం ఒక భౌతిక సాధనంగా, సైద్ధాంతిక ఆయుధంగా ఉపయోగపడుతోంది. భూస్వామ్య ఉత్పత్తి సంబంధాలను బద్దలు కొట్టకుండా, కేవలం సాంస్కృతిక రంగంలో బ్రాహ్మణీయతను విమర్శించడం వల్ల కుల నిర్మూలన జరగదు. విరసం ఈ మార్క్సిస్ట్ రాజకీయ అర్థశాస్త్ర సత్యాన్ని గుర్తిస్తుంది కాబట్టే, నకిలీ అస్తిత్వవాద భ్రమలకు లోనుకాకుండా, కులమనే సామాజిక అస్తిత్వాన్ని దాని భౌతిక పునాది నుంచి అన్ని సాంస్కృతిక వ్యక్తీకరణల్లో చూస్తోంది. అన్ని రూపాల్లో కొనసాగుతున్న కులానికి వ్యతిరేకంగా నిర్దిష్టంగా పోరాడాలని అంటోంది. భూస్వామ్య, దళారీ పెట్టుబడిదారీ వ్యతిరేక వర్గపోరాట చైతన్యంతో కుల నిర్మూలనా చైతన్యాన్ని కలిపి పోరాడాలని నిక్కచ్చిగా చెబుతుంది. భారతదేశంలో ఫాసిజం బ్రాహ్మణీయ హిందుత్వ పునాదుల నుంచి, దళారీ కార్పొరేట్ శక్తుల ఆసరాతో వచ్చింది. ఈ దేశంలో కుల ఆధారిత భూస్వామ్యం ఉన్నట్లే, ఫాసిజం కూడా కుల వ్యవస్థ పునాది ఉన్న సనాతన ధర్మం, హిందుత్వ నుంచి వచ్చిందని విరసం మొదటి నుంచీ చెబుతున్నది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల శ్రమ విలువ ఎలా మారుతోంది, ప్లాట్‌ఫామ్ లేబర్ కార్మిక వర్గాన్ని ఎలా పునర్నిర్మిస్తోంది, గిగ్ ఎకానమీ కార్మిక రాజకీయాలను ఎలా సవాలు చేస్తోంది లాంటి ప్రశ్నలపై విరసానికి అవగాహన లేదని, ఇది వారి ‘‘భావజాల స్తబ్దత’’ అని వ్యాసకర్త తేల్చిచెప్పారు. కానీ ఇక్కడ స్తబ్దుగా ఉన్నది విరసం కాదు, విమర్శకుడి అవగాహనా రాహిత్యం.
సాంకేతికత రాకతో పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీ ‘‘రూపాలు’’ మారాయే తప్ప, ‘‘దోపిడీ సారాంశం’’ ఏమాత్రం మారలేదు. కార్ల్ మార్క్స్ తన ‘కాపిటల్’ గ్రంథంలో వివరించిన శ్రమకు, పెట్టుబడికి మధ్య ఉన్న ప్రాథమిక వైరుధ్యం నేటి గిగ్ ఎకానమీలో మరింత క్రూరంగా రూపుదిద్దుకుంది. నేడు స్విగ్గీ, జొమాటో, ఉబర్, ఓలా, అర్బన్ కంపెనీ లాంటి యాప్ ఆధారిత సంస్థలు లక్షలాది మంది కార్మికులను ‘‘భాగస్వాములు’’ అని దగాకోరు పదజాలంతో పిలుస్తున్నాయి. కానీ వాస్తవానికి వీరు ఎలాంటి కనీస వేతనం, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్, విశ్రాంతి లేని ఆధునిక బానిసలు.
గతంలో భౌతికంగా కళ్లెదుట కనిపించే “మేస్త్రీ” సూపర్ వైజర్ స్థానంలో, నేడు స్మార్ట్ ఫోన్ లోని ‘అల్గారిథమ్’ వచ్చి చేరింది. ఈ అల్గారిథమ్ ఆధునిక అదృశ్య మేస్త్రీగా మారి, కార్మికుల ప్రతి కదలికను, కాలాన్ని మైక్రో-సెకన్ల స్థాయిలో నియంత్రిస్తూ, రోజుకు 12 నుంచి 15 గంటల పాటు వారి శ్రమను అత్యంత పాశవికంగా పిండుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మార్క్స్ వివరించిన ‘స్థిర మూలధనం’ తాలూకు అత్యంత ఆధునిక రూపం. ఇది మనుషుల శ్రమను తగ్గించి వారికి విశ్రాంతినివ్వడానికి బదులు, కార్పొరేట్ల లాభాలను అనంతంగా పెంచుకోవడానికి, కార్మికుల స్థానాన్ని ఆక్రమించి వారి బేరసారాల శక్తిని దెబ్బతీయడానికి వాడుతున్న వర్గ సాధనం. అమెజాన్ వేర్‌హౌస్‌లలో నిమిషాల వ్యవధిలో ప్యాకింగ్ చేయాలని వర్కర్లను యంత్రాల్లా మార్చేస్తున్న తీరు, ఐటీ రంగంలో ఏఐ పేరుతో జరుగుతున్న సామూహిక ఉద్యోగాల కోత ఇవన్నీ సామ్రాజ్యవాద శ్రమ దోపిడీకి పరాకాష్ట.
సాంకేతికత రూపం మార్చుకున్న ప్రతిసారీ వర్గపోరాట ప్రాథమిక సిద్ధాంతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆధునిక ఆన్లైన్ అదృశ్య శ్రమ దోపిడీని అంతం చేయడానికి కూడా పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని కూలదోయడమే ఏకైక మార్గం అని చారిత్రక భౌతికవాదం స్పష్టం చేస్తుంది.
‘దళారీ బూర్జువా’, ‘సామ్రాజ్యవాదం’ అనేవి 1970ల నాటి పాత పదాలని విమర్శించడం, నేటి నిరంకుశ రాజకీయ, ఆర్థిక వాస్తవాలను కప్పిపుచ్చే కుట్రలో భాగమే. వ్యవస్థలు ఎలా నడుస్తున్నాయో కనీస అవగాహన ఉన్న వారెవరికైనా ఈ పదాల సజీవత్వం అర్థమవుతుంది. నేడు దేశంలోని పోర్టులు, విమానాశ్రయాలు, బొగ్గు గనులు, విద్యుత్ ఉత్పత్తి, టెలికాం, రిటైల్ మార్కెట్, చివరకు వ్యవసాయ రంగాన్ని కూడా తమ గుప్పిట్లో పెట్టుకున్నది ఎవరు? ప్రభుత్వ విధానాలను, చట్టాలను (రద్దు చేయబడిన మూడు క్రూరమైన వ్యవసాయ చట్టాలు ఇందుకు సజీవ సాక్ష్యం) తమకు అనుకూలంగా మార్చుకుంటూ, రాజ్య యంత్రాంగాన్ని తమ ప్రైవేట్ కాపలాదారుగా వాడుకుంటున్న అదానీ, అంబానీలు నేటి దళారీ బూర్జువా వర్గానికి అత్యంత కచ్చితమైన ఉదాహరణలు కారా? ఈ వర్గ దోపిడీ ఉన్నంత వరకు దళారీ బూర్జువా, సామ్రాజ్యవాదాల గురించి మాట్లాడాల్సిందే. ఆ మాటలు పాతవి అని వదిలేయడమంటే శ్రామిక వర్గానికి ద్రోహం చేయడమే.
ఎలక్టోరల్ బాండ్ల పేరుతో వేల కోట్లు అధికార రాజకీయ పార్టీలకు చట్టబద్ధమైన లంచాలుగా ఇచ్చి, దేశ ఆర్థిక మూలాలను కొల్లగొడుతున్న ఈ క్రోనీ క్యాపిటలిజం ఉన్నంత కాలం “బూర్జువా”, “సామ్రాజ్యవాద దాస్యం” అనే పదజాలం పాతబడిపోదు. అది నిత్యం రక్తం పీల్చే వాస్తవం. అదానీ, అంబానీ, సంఘ్ పరివార్ లాంటి సంస్థల్లో ఉన్న “విమర్శ – ఆత్మవిమర్శ” విరసంలో లేదని, విరసం ‘ఎకో చాంబర్’ గా మారిపోయిందని వ్యాసకర్త అత్యంత హాస్యాస్పదమైన పోలిక తెచ్చారు. ఇది బూర్జువా మేధో దివాలాకోరుతనానికి నిలువెత్తు అద్దం. ఒక కార్పొరేట్ సంస్థ తన లాభాలను ఎలా పెంచుకోవాలి, మార్కెట్ లో తన గుత్తాధిపత్యాన్ని ఎలా విస్తరించుకోవాలి, కార్మికులను మరింతగా ఎలా దోచుకోవాలి అనే దానిపై బోర్డ్‌రూమ్‌లలో చేసుకునే “మేనేజ్మెంట్ సమీక్ష”ను, పీడిత ప్రజల విముక్తి కోసం కమ్యూనిస్టులు సాగించే చారిత్రక “వర్గ ఆత్మవిమర్శ”తో పోల్చడం ఎవరి సైద్ధాంతిక అజ్ఞానానికి నిదర్శనం? విరసం ఆత్మవిమర్శ అనేది మూసివున్న గదుల్లో లాభాల లెక్కలు వేసుకునే వ్యాపారం కాదు, అది వర్గపోరాటక్షేత్రంలో, ప్రజల మధ్య నిరంతరం సాగే గతితార్కిక ప్రక్రియ.
విరసం కేవలం వార్తల్లోకి వచ్చేది రాజ్యం విధించే నిషేధాలు, అరెస్టులు, పర్మిషన్ నిరాకరణల ద్వారానే అని, ఇది విరసం సాహిత్యం వల్ల కాదని వ్యాసకర్త తేలికగా తీసిపారేశారు. విప్లవ కవితా శిల్పం, వస్తువు గడ్డకట్టిపోయాయని ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. కానీ, ఇక్కడ విమర్శకుడు అత్యంత కుటిలంగా విస్మరించిన భౌతిక వాస్తవం ఒకటుంది. విరసం సాహిత్యం నిజంగానే గడ్డకట్టుకుపోయి ఉంటే, దానికి ప్రజల్ని కదిలించే శక్తి లేకపోతే, ప్రపంచంలోని అత్యంత బలమైన సైనిక, పోలీసు యంత్రాంగం ఉన్న భారత రాజ్యం ఎందుకు ఒక సాహిత్య సంస్థను చూసి అంతగా వణికిపోతోంది?
గత ఇరవై ఏళ్లలో విరసం నుంచి చెప్పుకోదగిన రచన రాలేదని ఈ విమర్శకుడు అన్నారు. అంత వెనక్కి పోనవసరం లేదు. ఇటీవల వచ్చిన కొన్ని రచనలు గమనిస్తే ఆయన ఎంత అంధకారంలో ఉన్నారో తెలుస్తుంది. అల్లం రాజయ్య రాసిన సైరన్, విముక్తి నవలలు, నల్లూరి రుక్మిణి రాసిన చుక్కపొడుపు, పద్మకుమారి కథల సంకలనం అపురూప, కరుణ కథా సంకలనం విభజనరేఖ, అనూరాధ కథలు అవునా..నువు దళిత్వా? , పాణి నవల అనేక వైపుల, వడ్డెబోయిన శ్రీనివాస్ కవిత్వం పాలపుంత, ఫెలోట్రావెలర్ వ్యాసాలు కగార్ రిపబ్లిక్ మొదలైనవి ప్రస్తుత సమాజ స్థితిని తెలిపే రచనలు. ఇవిగాక విప్లవ సాహిత్యోద్యమంలో భాగమైన వియుక్క కథా సంపుటాలు ఆరు, మిడ్కో రచనలు కూడా ఈ మధ్యే వచ్చాయి. ఇవి మన సామాజిక సాంస్కృతిక ప్రపంచాలను సమగ్రంగా తెలుసుకోడానికి పనికి వస్తాయి. ఇవేవీ ఈ విమర్శకుడి దృష్టిలో ఉన్నట్లు లేదు.
విప్లవ కవులు, రచయితలు, మేధావులపై దేశద్రోహం కేసులు ఎందుకు నమోదవుతున్నాయి? సమాజంలోని అసమానతలను, కార్పొరేట్ దోపిడీని ప్రశ్నిస్తూ, అణగారిన ప్రజల గొంతుకగా మారినందుకే, దశాబ్దాలుగా ప్రజల పక్షాన నిలబడిన వరవరరావు లాంటి కవులను వృద్ధాప్యంలో జైలు పాలు చేసింది రాజ్యం. 90 శాతం వైకల్యంతో చక్రాల కుర్చీకే పరిమితమైన ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబాను అక్రమ కేసులతో అండాసెల్‌లో బంధించి, ఆయన ఆరోగ్యాన్ని చిదిమేసి, ఆయన మరణానికి కారణమైంది ఈ వ్యవస్థ కాదా? గిరిజనుల ‘జల్-జంగిల్-జమీన్’ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఫాదర్ స్టాన్ స్వామిని జైలు గోడల మధ్యే ప్రాణాలు తీసింది ఈ దోపిడీ రాజ్యం కాదా? ఇదంతా రాజ్యం పాలకులకు విప్లవ భావజాలం పట్ల ఉన్న ప్రాణభయాన్ని సూచిస్తుంది.
రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకుల మధ్య, చీకటి జైలు గోడల మధ్య నిలబడి ప్రజల కోసం చేసే ఆత్మవిమర్శకు… ఎసి గదుల్లో సురక్షితంగా కూర్చుని, నిర్భీతితో ఎన్కౌంటర్లు చేసే పాలకులకు వత్తాసు పలికే ఉదారవాద వ్యాసాలకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. విప్లవ సాహిత్యం ఎప్పుడూ ప్రజా పోరాటాల నుంచే, అణగారిన వర్గాల చెమట నుంచే, రాజ్య నిర్బంధంపై చేసే ధిక్కారం నుంచే పుడుతుంది. అది జనరేటివ్ (ఉత్పాదక) శక్తి కాబట్టే అది పాలకుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
చివరగా, విరసం ప్రత్యామ్నాయంగా తమను తాము రద్దు చేసుకోవాలని, రెండు సంవత్సరాలు విరామం ప్రకటించి, అప్పుడు తర్వాతి కార్యక్రమం ఆలోచించుకోవాలని వ్యాసకర్త ఇచ్చిన ఉచిత సలహా, మార్క్సిజం పట్ల ఉదారవాదులకు ఉన్న వర్గ శత్రుత్వానికి ప్రతిరూపం. అణచివేత వ్యవస్థను కాపాడే శక్తులు, యథాతథ స్థితిని ప్రేమించే మేధావులు ఎప్పుడూ విప్లవ శక్తులను కనుమరుగవ్వమనే కోరుకుంటారు.
సమాజంలో వర్గ దోపిడీ ఉన్నంత కాలం, ఆ దోపిడీకి గురయ్యే ప్రజలు ఉన్నంత కాలం, దానికి వ్యతిరేకంగా పోరాడే వర్గ చైతన్యం అవసరం ఉంటుంది. ఆ చైతన్యానికి సాహిత్య రూపమే విరసం. వ్యవస్థాగత మార్పు అనేది మేధావులు తమ సోఫాల్లో కూర్చుని ఇచ్చే విరామాల వల్ల రాదు. అది ఉత్పత్తి శక్తులకు, ఉత్పత్తి సంబంధాలకు మధ్య జరిగే చారిత్రక, భౌతిక ఘర్షణ ద్వారా మాత్రమే వస్తుంది. విరసం రద్దు కాదు, నేటి అసలైన చారిత్రక అవసరం ఈ దళారీ బూర్జువా-అర్ధ భూస్వామ్య దోపిడీ వ్యవస్థ రద్దు. నిరంతరం రూపాలు మార్చుకుంటున్న పెట్టుబడిదారీ వ్యూహాలను చారిత్రక భౌతికవాద దృక్పథంతో ఛేదిస్తూ, కార్మికులు, రైతులు, దళితులు, ఆదివాసుల పక్షాన విరసం గళం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. వర్గపోరాటం ముగిసేదాకా ఆ గొంతుకు విరామం లేదు.