Arunodaya Vimala – The Revolutionary Balladeer

చరిత్ర పుటల్లో చెరగని నిలువెత్తు నెత్తుటి సంతకం తెలంగాణా ప్రజల సాయుధ పోరాటం. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన సమరమిది. అది గడ్డిపోచల్ని మరఫిరంగుల్లా మార్చింది. ‘బాంచెన్ నీ కాల్మొక్త’ అన్న జనాన్ని బరిగీసి నిలబడి కలబడేలా చేసింది. దోపిడీ, పీడనపై తిరుగుబాటు చేయించింది. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సంస్థాన ప్రజలు సాగించిన మహత్తర పోరాటమిది. కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభల నాయకత్వాన ఐదేళ్ల పాటు (1946 – 1951) కొనసాగింది. ఈ పోరాటంలో నాలుగు వేలమంది ప్రాణాలర్పించారు. వెట్టి చాకిరీ అంతమైంది. దోపిడీ, పీడన నిర్మూలనమైంది. భూస్వాముల పెత్తనం రద్దయింది. మూడువేల గ్రామాల్లో గ్రామరాజ్యాలు స్థాపించుకున్నారు. పది లక్షల ఎకరాలకు పైగా భూములు పంచుకున్నారు. భూముల రక్షణకు ఆయుధాలు చేపట్టారు. ఇది వీరోచిత సాయుధ వ్యవసాయిక విప్లవం. లక్షలాది మందిని సంఘటితం చేసిన చారిత్రాత్మక పోరాటం. ఇది భారత రైతాంగ సాయుధ విప్లవానికి భూమికగా నిలిచింది.

ఈ తిరుగుబాటులో ప్రజల్ని సాయుధం చేసింది పాట. కొలిమంటుకున్నట్టుగా పల్లెపల్లెనూ రగిలించింది. దొరలు, భూస్వాముల గడీల పునాదుల్లో బర్మార్‌లై పేలింది. “బండెనక బండిగట్టి ఏ బండ్లె పోతవ్ కొడుకో… నా కొడక ప్రతాపరెడ్డీ” అంటూ జన్నారెడ్డి ప్రతాపరెడ్డి దోపిడీని ఎదిరించింది. భూస్వాముల, జమీందార్‌ల, రజాకార్‌ల మారణకాండలో నెత్తురోడిన జనం గొంతుల్లో ఉప్పెనై హోరెత్తింది. ఎక్కడా వెనుదిరగలేదు. పీడితజన విముక్తే లక్ష్యంగా యుద్ధభూమిలోకి నడిచింది. తెలుగు నేలన ఆ కాలం, ఆ పోరాటం అద్భుతమైన వాగ్గేయకారుల్ని కన్నది. నిమ్మల యాదగిరి, సుద్దాల హనుమంతు, తిరునగరి రామాంజనేయులు, రాజారామ్, నాజర్, గరికపాటి రాజారావు, ముక్కామల నాగభూషణం, కోడూరి అచ్చయ్య, లక్ష్మీకాంత మోహన్, మఖ్దూం మొహియుద్దీన్, సుంకర సత్యనారాయణ, వేములపల్లి శ్రీకృష్ణ, కోగంటి గోపాలకృష్ణయ్య, కోసూరి పున్నయ్యలాంటి అనేకమంది పాటకవులు, రచయితలు ప్రజల పాటల్ని కైగట్టారు. ప్రజానాట్య మండలి కళాకారులు వివిధ జానపద కళారూపాల ద్వారా ప్రజా సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. చైతన్యం చేశారు. తెలంగాణా సాయుధ పోరాట కాలంలో రైతాంగ ప్రజల జీవనంతో, ఆశలు, ఆకాంక్షలు, పోరాటాలతో సాహిత్యం, కళలు పెనవేసుకున్నాయి. ప్రజానాట్యమండలి, అభ్యుదయ రచయితలు, కవులు ప్రజల జీవితాన్ని శక్తివంతమైన కళారూపాలుగా మలిచారు. తీర్చిదిద్దారు. అట్టడుగు వర్గాలనుండి ప్రతిభావంతమైన కవులు, గాయకులు, కళాకారులు ఎదిగారు. ప్రజాసాహిత్యం, కళలు వికసించాయి. ఇట్లా అనేకమంది పాటల్ని కైగట్టి ప్రజల్ని సాయుధం చేశారు. తెలంగాణా ప్రజలకు విముక్తినందించారు.

అట్లాంటి రక్తసిక్త తెలంగాణ నేలలో పుట్టిన రగల్ జెండా పాట కామ్రేడ్ విమల. యాభై ఏళ్లుగా తెలుగు నేలంతా పల్లవిస్తున్న పాట విమల. తెలంగాణా, నక్సల్బరీ, శ్రీకాకుళం, జగిత్యాల, సిరిసిల్లా, గోదావరిలోయ పోరాటాలను గానం చేస్తున్న నల్లకోయిల. ఆమె బాల్యమూ, యవ్వనమూ, జీవితమంతా ప్రజల కోసమే. ధిక్కార పాటల యుద్ధభేరి ఆమె.

విమల నల్లగొండ జిల్లా ఆలేరులో 1964లో పుట్టింది. తల్లిదండ్రులు నర్సమ్మ, బండ్రు నర్సింహులు. ఆయన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీల్లో పనిచేశాడు. ఆ ఇంట్లోనే పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర పుల్లారెడ్డి లాంటి కమ్యూనిస్టు, విప్లవ నాయకులు ఆశ్రయం తీసుకొనేవాళ్లు. ఇంట్లో ప్రజాస్వామిక వాతావరణం ఉండేది. బండ్రు నర్సింహులు రైతుకూలీ సంఘం నాయకుడు. విమల తమ ఇంటికి వచ్చే విప్లవ నాయకుల కథలు వింటూ పెరిగింది. తండ్రితో కలిసి సభలకు వెళ్లేది. ఆమెకు చిన్ననాటి నుంచే విప్లవ పాటతో పరిచయం. ప్రవేశం. పన్నెండేళ్ల వయసులోనే విప్లవగీతిక ఆలపించింది. ఎమర్జెన్సీకి ముందే (1974) ఆలేరులో జరిగిన రైతుకూలీ సంఘం మహాసభ వేదికపై విప్లవించిన ఆమె గొంతు దేశమంతా పరీవ్యాప్తమైంది. ఎమర్జెన్సీలో బండ్రు నర్సింహులు ముషీరాబాద్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. ములాఖాత్‌కు వెళ్లిన చిన్నారి విమల తండ్రి ఒడిలో కూర్చొని,
“భూగోళం తిరుగుతోందీ సిరిచుట్టూ
నీతీ న్యాయం అన్నీ తీసికట్టూ” అనే పాట పాడుతుంటే అక్కడున్న జనమంతా కోరస్ ఇచ్చినట్టు ప్రత్యక్షంగా చూసినవాళ్లు అనేకసార్లు ప్రస్తావించారు. ఈ పాట రచయిత ఎన్.నరసింహారావు. ఆయన జనగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్. జనగామకు చెందిన గాయకుడు రాంసత్తెయ్య ప్రేరణతో చిన్నారి విమల కళారంగంలోకి వచ్చింది. డిగ్రీ భువనగిరిలో చదివింది. ఒకవైపు చదువు. మరోవైపు పాట ఆమె జీవితాన్ని పెనవేసుకున్నాయి. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం ఆమెకు నూతన ప్రజాతంత్ర, ప్రగతిశీల దృక్పథం నేర్పాయి. ఈ రెండు జమిలి ప్రవాహాలు నవయవ్వనంలో ఆమె నెత్తుటి నరాల్లో పాటలై పోటెత్తాయి. అవి నెత్తుట తడిసిన భూమి పొరల్లో మోదుగుపూలై విరబూశాయి. అడవినీ, మైదానాన్నీ అల్లుకున్నాయి. నిలువ నీడలేని జనం గుండెల ప్రతిధ్వనులయ్యాయి.

సి.పి.ఐ.(ఎం.ఎల్.) చండ్రపుల్లారెడ్డి వర్గం అనుబంధ విద్యార్థి సంఘం పీడీఎస్‌యూ నుంచి విమల తెలంగాణలోని ప్రతి కాలేజీకి వెళ్లింది. తన మాట, పాట, ఆటలతో విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచింది. ప్రగతిశీల మహిళా సంఘంలో ఆమె పాట మరింత పదునెక్కింది. ‘ఆకాశంలో సగం మనం, అనంతకోటి నక్షత్రాల్లో మనం’ అంటూ ఉద్యమించింది. వర్గ సమాజంలో పురుషాధిక్యతకు వ్యతిరేకంగా ఉద్యమించింది. పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాదం యుగంలో మరయంత్రంగా మారుతున్న స్త్రీలను సంఘటితం చేసింది. పోరాటాల్లోకి నడిపించింది. వంటింటికీ, పునరుత్పత్తికీ పరిమితం చేసిన పితృస్వామ్యంపై అలుపెరగని పోరాటం ఒక్కటే మార్గమని నినదించింది. అరుణోదయ పాటల్లో పెనుమంటల కెరటాలైంది. విముక్తి గీతాన్నాలపించింది. ‘హక్కులకై పోరాడుదామురా చెల్లెమ్మా’, ‘సమాన హక్కుల స్త్రీ స్వేచ్ఛకై విముక్తి పోరులో రండమ్మా’ అంటూ స్త్రీలందరికీ పిలుపునిచ్చింది. ‘బీడీల చేతుల పిడికిళ్లెత్తండి జాయి మొయిలాలి’ అంటూ బీడీ కార్మికుల్లో తిరుగుబాటు లేవనెత్తింది. అమాస చీకటి అర్ధరాతిరి ఇల్లు దాటిన, పల్లె దాటిన కోట్లాది చెల్లెళ్ల వేదనల్ని పాడింది. ‘స్త్రీవిముక్తి నృత్యగానం’, సారా వ్యతిరేక పోరాట పాటలతో తెలుగు నేలంతా తిరుగుబాటు బావుటా ఎగరేసింది. ఊరూవాడల్ని సంఘటితం చేసింది. అణగారిన జనం గుండెల్ని మీటింది. పాటపాటకూ పరవశించేలా చేసింది. ఆమె పాట ఎగిసెగిసిపడిన గోదావరి. రెపరెపలాడే ఎర్రజెండా. ఆమె పాట అడవి మల్లెల్లాంటి పల్లెల్ని చుట్టింది. అలలు అలలుగా లేచింది. అలగాజనం గుండె గోసల్ని పాడింది. అవి తరతరాల జనం వేదనల్లోంచి పెల్లుబికిన పాటలు. ఇవి సామాన్య జనాన్ని ఆలోచింపజేశాయి.

విమల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో చేరాక పాటే ప్రపంచమైంది. అరుణోదయ శిక్షణలో పాటను సాయుధం చేసింది. ఆమె గొంతులో జలపాతాల సంగీతం ఉన్నది. గంధక గనులున్నాయి. దిక్కులన్నీ పిక్కటిల్లేలా ప్రతిధ్వనించే మందుపాతరలున్నాయి. వేలాది వేదికలపై వసంత మేఘ గర్జనైంది. ఆమె ఎర్రజెండా పట్టి, ‘ఓ అరుణపతాకమా… నీకివిగో రెడ్ శెల్యూట్స’ అని పిడికిలెత్తితే, నింగీనేలా దద్ధరిల్లుతాయి. పాటల ప్రవాహమవుతాయి. ఆమె పాట లక్షలాది జనం గుండెల్లో ప్రతిధ్వనించే అరుణోదయం. అది`దోపిడీ, పీడనపై ఎక్కుపెట్టిన ధిక్కార పాట. చీకటికి నిప్పు పెట్టిన పాట. ప్రతిఘటనా పోరాటాల వెల్లువలో సాయుధమైన పాట.

అప్పటికే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకుడిగా కూర దేవేందర్ (కె.డి.) అనేక పాటలు రాశాడు. అనేక వేదికలపై పాడాడు. విద్యార్థి, యువజనాన్ని పోరాటాల్లోకి కదిలించాడు. వేములవాడ బెస్తవాడలో పుట్టిన ఎర్రచేప అతడు. దేవేందర్ చిన్ననాటి నుంచే ఏటికి ఎదురీదే సాహసి. దేవేందర్ పాటకవి. తన పూర్వీకులు చేపల వల అల్లినట్టుగా పాటను అల్లాడు. అది శ్రమైక జీవన సౌందర్యం నిండిన అల్లిక. అది మానేటి పాట. మూలవాగూ, గంజివాగుల్లో పోటెత్తిన పాట. అది తెలంగాణ తెగువను పాడిన పాట. దోపిడీ, పీడనలకు నిప్పంటించే పాటలు రాసిన కూర దేవేందర్‌కూ, పాటల జలపాతమై ప్రవహించే విమలకూ జతకలిసింది. ఈ జమిలి పాటల ప్రవాహం విముక్తి పాటై తెలుగు నేలంతా హోరెత్తింది. అప్పటికే అతడు సి.పి.ఐ.(ఎం.ఎల్.) జనశక్తిలో ‘అమర’ పేరుతో అజ్ఞాత నాయకత్వంలో ఉన్నాడు. అతని సాహితీ సృజన పేరు మిత్ర. ‘విమల`అమర’ జీవిత సాహచర్యం ప్రకటించాక విమల పాట మరింత పదునెక్కింది. మిత్ర సహచరి విమల గొంతులో మానేటి పాటలూ, మంజీర నాదాలూ కలిసి తెలుగు నేలంతా హోరెత్తాయి. పల్లెపల్లెనా శ్రామికజన విముక్తి గీతాలై. ఆ పాటలన్నీ రాసింది మిత్ర. ఐనా, పల్లెల్లో విమల పాటలుగానే ప్రాచుర్యం పొందాయి. మిత్ర పాటనూ, విమల పాటనూ విడదీయలేం.

అతనెక్కడో అడవుల్లో. కొండల్లో. కోనల్లో. వెంటాడే రాజ్యాన్ని సవాల్ చేస్తూ. జన సంద్రంలో కలిశాడు. ఏయే అడవుల్లోనో పచ్చని చెట్ల కింద కూర్చొని, ఆకుపసరుతో పాటలు రాసుకున్నాడు. ఆ పాటలు మైదానాల్లో విమలకు చేరాయి. ఆమె గొంతుల్లో గళ గర్జనల జడివానలయ్యాయి. జనం పాటల ప్రభంజనమయ్యాయి. వసంత మేఘ గర్జనలయ్యాయి. పోరుతప్ప మరో దారిలేదని చాటాయి. ఎత్తిన తుపాకీ ఎన్నటికీ దించమని శపథం చేసిన వీరుల జాడలయ్యాయి. దుక్కిని దున్నే రైతులు, నాట్లేసే కూలితల్లులు, రాళ్లుగొట్టే కూలీలు, రిక్షా కార్మికులు, హమాలీలు, దగాపడ్డ చెల్లెళ్లు… అందరి నోటా అవే పాటలు.

మిత్ర పాటల్లో పాండిత్యం ఉండదు. అర్థంకాని ఛందస్సు ఉండదు. ఆ పాటలంతటా అమ్మ చనుబాల తీపి ఉంటది. జంగిడిబర్ల పిలగాని ఊపిరిలోంచి అలవోకగా పిల్లంగోవిలోకి దూకే పాటల ఊటలా ఉంటది. మిత్ర ప్పు్రల చరిత్ర, సంస్కృతి, కళల్ని అత్యంత ఇష్టంగా ప్రేమించాడు. తన శ్రామిక జీవితం నుంచి జనసంద్రంలోకి ఒడుపుగా ఒల విసిరి పాటల్ని పట్టుకున్నాడు. పల్లవుల్ని ఊపిరిలో నింపుకున్నాడు. అందుకే అతని పాటకు అంత పదును. అది కైతల కవాతై తెలంగాణ జనవిముక్తి గీతాలను ఆలపిస్తున్నది. ఆ పాటలు విమలక్క గొంతులోంచి మన రక్తనాళాల్లోకి పరీవ్యాప్తమయ్యే రక్తచలన సంగీత శ్రుతిలా పోటెత్తుతుంది. ఆమె ఊపిరిలోంచి ఉబికిన పాట తెలంగాణమైంది. తెలంగాణ బతుకు పాటైంది.

1980లలో తెలంగాణలో నక్సల్బరీ పోరాటం పునరుత్థానమైంది. పల్లెలన్నీ పోరాటాల్లోకి కదిలాయి. వీరతెలంగాణ జైత్రయాత్ర గురించి…
“ఎంత సాహసమైనదీ తెలంగాణ
ఎర్రజెండే ఎరుపు ఈ నేలపైనా
ఎవరి రక్తమ్మిచట ఏరులై పారెనో
ఎవరి త్యాగం పోరు నారులై మొలిచెనో
ఆ అమరవీరులను మదినిండ దలుచుకో (మానేటి పాట; 1994, పుట:35)
వారు చూపిన బాట వదలకా నడుచుకో…” అంటూ వీరతెలంగాణ తెగువను చాటాడు మిత్ర. తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమింపజేసి, శాంతి పరివర్తనమని చెప్పిన కమ్యూనిస్టుల పార్లమెంటరీ పంథా ద్రోహాన్ని చెప్పాడు. ఎన్నెన్ని దాడులు ఎదురైనా ఎత్తిన తుపాకీ దించని వీరుల తొవ్వల్ని గానం చేశాడు. ఈ నేల విముక్తి కోసం గొంతెత్తి నినదించి నేలకొరిగిన వీరుల త్యాగాల దారుల్లో నడవాలని చెప్పాడు. పీడిత ప్రజల విముక్తి దారిని ఎన్నటికీ వదలొద్దని చెప్పిన పాట ఇది. ఈ పాట అరుణోదయ సాంస్కృతిక సైన్యమై కవాతు చేసింది. విమల గొంతులో పల్లెపల్లెకూ వ్యాపించింది.

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పాలనలో తెలంగాణలో నెత్తురు ఏరులై పారింది. మిస్సింగ్‌లు. హత్యలు. దొంగ ఎదురుకాల్పులు. కోవర్ట్ ఆపరేషన్‌లు. విప్లవించే ప్రజలపై తీవ్ర అణచివేత. నిర్బంధాల్లోంచే జైత్రయాత్రగా మారిన పోరాటాలపై మిత్ర పాట, ‘పోరాటాల యాతర’…
“ఖాకి ఖాకి బట్టలోల్ల లాఠీల మోతజూడ
దెబ్బ దెబ్బ దెబ్బలకూ ఎగిసిన పిడికిళ్ల జూడ
అణచివేత ప్రతిఘటనై సాగిన ఆ తీరు జూడ (మానేటి పాట; 1994, పుట:40)
మూల నుండి జిల్లంత అల్లుకున్న పోరుజూడ…” అంటూ కరీంనగర్ జిల్లాలో పెల్లుబికిన పోరాటాల జాతరను, ఆనాటి వర్తమాన రాజ్యహింసను చిత్రించాడు. విమలక్క ఈ పాట పాడుతుంటే జనంలో ధిక్కారం రగులుతుంది. ఆమె పాట సాంస్కృతిక జనరాగమైంది. తెలంగాణ విముక్తి కోసం ప్రతిఘటనా జ్వాలగా మారింది. డప్పుల దరువేసింది.


“ఆడుదాం డప్పుల్ల దరువెయ్యర
పల్లె తెలంగాణ పాటపాడరా
కోలాటమూ జెడ కొప్పెయ్‌రా
దూలంటూ అల్వాపై దుంకాడరా…” అంటూ ఎగిరి దుంకిన విమలక్క పాట జనం నెత్తుటి నరాల్లో పోటెత్తే సంద్రమైంది. గాలిలో అలలు అలలుగా తేలియాడుతూ గుండె గుండెనూ చేరింది. తెలంగాణ ఊపిరైంది. ఒకవైపు ప్రపంచీకరణ విధ్వంసం, మరో వైపు ఆధిపత్య సాంస్కృతిక దోపిడీ తెలంగాణను ఎట్లా ధ్వంసం చేస్తున్నాయో పాడింది. 26 ఏళ్లుగా ఈ పాట జనం గొంతుల్లో మార్మోగుతూనే ఉన్నది. ఎర్రచీర, భుజానికి డప్పు, చేతిలో ఎర్రజెండాతో విమలక్క వేదిక ఎక్కితే చాలు. తెలంగాణంతా మత్తడి దుంకుతుంది. అలుగువారుతుంది. ఆమె డప్పుల లయకు అడుగేస్తే చాలు, ఆకాశం దద్ధరిల్లుతుంది. ఆమె కాలిమువ్వలు ఫిరంగుల గర్జనలవుతాయి. “పాడరా పాడరా మన పాట, జన తెలంగాణమని ప్రతినోట” అంటూ తెలంగాణ సాంస్కృతిక చరిత్రనూ, ధిక్కారాన్నీ పాడింది. “ఊరిడ్సినా నేను ఊరిడ్సినా” పాటలో అభివృద్ధి పేరిట కొనసాగుతున్న విధ్వంసాన్ని పాడింది. ప్రజల్ని సామ్రాజ్యవాద అభివృద్ధి నమÖనాతో ఎట్లా విస్తాపనకు గురిచేస్తున్నారో చెప్పిన పాటిది. ఈ పాట విస్తాపితులు, నిర్వాసితుల దు:ఖాన్ని పాడింది.

ఆమె పాటల్లో ధనధన మోగే డప్పులు. జముకుల దరువులు. సన్నాయి సైరన్‌లు. భూకంపం రేపే డోల్ దెబ్బలు. తుడుం మోతల యుద్ధభేరి. ‘ఛలో ధూం`ధాం తెలంగాణ జాతరొచ్చెరా’ అంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2006 నుంచి పల్లె పల్లెనా నగారై మార్మోగింది. మలిదశ తెలంగాణ లడాయికి ఊపిరిపోసింది.
జానపద బాణీలే విమల పాటకు ప్రాణం. ఒగ్గుకథ, బైండ్ల కథ, గొల్ల సుద్దులు, బతుకమ్మ పాటలు, కోలాటం, గుస్సాడీ, డప్పు దరువు… వీటితోనే పాట నడిపిస్తుంది. డప్పు చప్పుడుకు అనుగుణంగా ఆమె గొంతులో మారే జీర అందర్నీ ఉర్రూతలూగిస్తుంది. విమలక్క పాటలో ఆవేశం, ఆర్తి ఉంటుంది. ఆమె గొంతెత్తితే పాటలో జీవిస్తది. నిలువెల్లా పాటై పరవశిస్తది. గొంతులో కోపం. దు:ఖం, ఆవేదన, ధిక్కారం అన్నీ వినిపిస్తాయి. విప్లవోద్యమ వీరయోధుల త్యాగాలను పాడేటప్పుడు ఆమె కన్నీళ్లలో సింగిడి మెరుస్తది. ఆ పాట వినేవాళ్లు ఏడ్చీఏడ్చీ, గొంతు నొప్పితోనే కోరస్ ఇస్తరు. వాళ్ల గొంతు దు:ఖంతో పూడుకుపోతది.


“దండులో కలిసిన బిడ్డవో…
నా గుండెలో మాయని గురుతువో
పోరులో నీ పేరు వినిపిస్తువున్నా
పొలిమేరనైనా కనిపించవమ్మా…” అని పాడుతుంటే రాజ్యం కాల్పుల్లో దారుణ హత్యకు గురైన బిడ్డల తల్లులు కంటికి పుట్టెడు ఏడుస్తరు. తమ బిడ్డలు గుర్తొచ్చి తల్లడిల్లుతరు. విమల పాట ఆ దు:ఖంలోంచే వీరత్వాన్ని పలికిస్తుంది.
“పోరులో ఒరిగిన బిడ్డవో
పోరు జెండయ్యి నిలిచిన జాడవో
సాలు సాలుకు మీ నెత్తురొలికిందీ
పంటచేలూ మీ త్యాగమై పండింది….” అంటూ కన్నబిడ్డల త్యాగాలు గుండెల్ని తాకేలా పాడుతుంది. విమల పాటలు తాకని తెలుగు పల్లె లేదు. ఆమె పాటలకు కోరసివ్వని మనుషుల్లేరు. గుండె గుండెనూ మీటిన పాట అది. మిత్ర కలంలోంచి కాయితంపైకి ప్రవహించిన తడారని పాటల్ని విమల మందుపాతరల్ని చేసింది.

ఆమెది సెరువు అలుగులు దుంకిన పాట. సిలుక వన్నెల సెలుకలో చిగురించిన మొలకల పున్నమి పాట. ఆమె గొంతు ఓ ఊట సెలిమె. చీకటి రోజుల్లో వెలుతురు పాటలు పాడింది. మొగులుపై ఎన్నెలైంది. మొగిలిపూల వెన్నెలైంది. ఎన్నెన్ని శిశిరాలు రాల్చినా చిగురించే వసంతగీతమైంది. తన గొంతులో వేనవేల జలపాత సంగీతాల్ని సృష్టించింది. ఒక్కమాటలో విమలక్క ‘పీపుల్స్ కల్చరల్ లెజెండ’. ప్రజల బాణీలను విప్లవీకరించి, సాయుధం చేసిన లెజెండ్. రెవల్యూషనరీ పీపుల్స్ కల్చరల్ లెజెండ్. రెవల్యూషనరీ బల్లాడీర్. చరిత్ర పుటల్లో చెరగని నిలువెత్తు సంతకం కామ్రేడ్ విమలక్క పాట.

**

(సందర్భం : యాభై రెండేళ్ల అరుణోదయలో యాభై ఏళ్ల విమలక్క పోరుపాటల ప్రస్థానం; ‘ప్రజాకళా జాతర’ (26, 27, 28 సెప్టెంబర్, 2026; హైదరాబాద్)

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. అధ్యాపకుడు. 'కొలిమి' వెబ్ మేగజీన్ సంపాదకవర్గ సభ్యుడు. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార (సమాజ సాహిత్య సంబంధాల విశ్లేషణ), 2. ఏరువాక (సాహిత్య విమర్శ); 3. ములాఖాత్ (విప్లవ రచయితలతో ఇంటర్వ్యూలు), సంపాదకత్వం : ఎరుక (ఆదిమ అర్ధసంచార తెగ ఎరుకల కథలు), తొలకరి (అల్లం రాజయ్య కథల వెనుక కథ), మట్టి మనుషులు (వడ్డెరల జీవన గాథలు), ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.

One thought on “Arunodaya Vimala – The Revolutionary Balladeer”

  1. థ్యాంక్యూ అనేకమైన విషయాలు తెలియజేశారు

Leave a Reply