మాకేం కావాలో
భూమి పొరల నిండా రాసుకునే, దాసుకునే వున్నం
మట్టి లిపి చదవటానికి వస్తుందా
వేలిముద్రలో అర్థాల్ని వెదకడానికి రామచిలుక సొంటి మనసుండాలె గద
గుండెసవ్వడులను పదిలంగా చూసుకునే దామగుండం
భగభగల రాడార్ కావాలని
ఎవరు కోరుకున్నరు
పక్షి పాట నది పాయ చెట్టు పండు
ఎటు పోవాలె
చెమట చుక్కల్లో వొలికిన కలలకు
ఏలిన వారి పాలన మొగ్గ తొడగటం లేదేం
దేహమంతా, దేశమంతా విభజన రేఖ పాకుతూ
బుసలు చిమ్ముతుంటది
ఒడిని, అనుబంధాల ముడిని
వాదనకు, వేదనకు గురి చేస్తుంటది
భూమి పుత్రులు
పరాయి పరాయి లుగా , విద్వేషాలు విద్వేషాలుగా చీల్చబడుతుంటరు
గద్దె మారినప్పుడల్లా అభివృద్ధి
ఒక్క పైస తక్కువ తొంభై తొమ్మిది తో నయా సంతర్పణల నిర్వచనాలతో కొమ్ములు విసురుతుంటది
గత ఏలుబడి అనే దుర్నామస్మరణతో ఐదేళ్ళ
పుణ్య కాలం కోపోద్రిక్త భాషతో
వెంటాడుతుంటది
అన్నాలు, హక్కులు,
ఎవరి జాగ్రత్త, వారి పరిధి లోకే
చట్టం బుజం జారవిడుస్తుంటది
ప్రతిష్టించిన దేవళంబులే, నాయక చిత్ర పట పాలాభిషేకాలే, స్వీయ బృంద భజన తన్మయత్వాలే
సంస్కృతోద్దరణ మంత్రంగా
రాచనగరి మంత్రాలోచనలే
భూమి గుండెల మీద
గుది బండలుగా పాతుకుంటయి
ఏ గాలో వైరస్ నంటుకొని వచ్చినా,
ఏ కరువో , ఏ జీవో నో
నిద్రను, భద్రతను దూరం చేసినా, మొండి పంతం స్వంత యుద్దం రాజేసినా
అర్థాల కందని మూగభాషే
వెదజల్ల బడుతుంటది.
అరుపులు, ఆక్రోశాలు చర్చల్లో వేడెక్కి, సెగ తగలక
చల్లారి పోవటమే ఫలశృతి.
కన్ను మలపనీయని హామీల ఊరింపులు,
‘నేనే తప్ప ఇతః పరంబు’ లేనే లేదనే వాచకోల్మీలనాలు,
గెలిచీ ఓడీ , ఓడీ గెలిచీ, గెలిచీ ఓడీ ల రాజకీయ ప్రయాణ ప్రహసనంలో
యధా బుద్ది- తథా రాజా ల ప్రతిభా పనితనాలు
అనుభవించీ, అనుభవించీ
అంచుకున్న ఆయింత పచ్చదనం కోల్పోయి ఎడారులమైనం, వెలుగుల శ్వాసందని బిడారులమైనం, పొట్ట కట్టుకొని పోయే గుడారాలమైనం.
సకల కళల మేళవింపుల, (అ)ప్రదర్శిత రాజకీయాలూ మీకు శతధా వందనం. నిష్క్రమణకు వేళయ్యింది
మళ్ళో కొత్త అవతారమా!
మీరంటున్న, మా అసొంటి
అలగా జనం కోసరం
మేం మా మట్టి మీద గట్టిగ
పిడికిళ్ళ ధైర్యంతో నిలబడే వున్నం.
అర్కీజ్ మా కెవండ్లు అద్దు…!