ఈ తరాలని రక్షించుకోగలమా…

ఎమిలీ జోలా ‘నానా’ చదువుతూ కూర్చుంది శోభ. పుస్తకంలో లీనమైపోయిన ఆమెకు గదిలో మోగుతున్న ఫోన్ వినిపిస్తున్నా, లేవాలనిపించలేదు. గగన్ ఒక చేత్తో తడి తువాలు మరో చేతిలో ఫోన్ తో ఆమె దగ్గరకు వచ్చాడు.

“పుస్తకంలో తల దూర్చితే మరేమీ పట్టదు కదా… ఇంత శ్రద్దగా కాలేజీ పుస్తకాలు చదివి ఉంటే, హాస్పిటల్ లో నాకు మరో డాక్టర్ అవసరమే ఉండేది కాదు కదా” అంటూ తెచ్చిన ఫోన్ ఆమె ఒడిలో పడేసి తయారవడానికి లోపలికి వెళ్లాడు.

“సరిపోయింది. అర్ధరాత్రుల్ల దాకా రోగాలు, ఆపరేషన్లు అంటూ సతమయమయే అదృష్టం కోసం చదివే చదువు నాకు వద్దు లేద్దు” అంటూ నవ్వుతూ భర్త అందించిన సెల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేసింది శోభ.

అవతలి పక్కన శిరీష హడావిడిగా మాట్లాడుతుంది. ‘శోభా అనిరుద్ద్ ని తీసుకుని హాస్పిటల్ కు వచ్చాం. తేజస్ అని గగన్ కొలిగ్ అట అడ్మిట్ చేసుకుని లోపల ఏదో పరీక్ష చేస్తున్నారు. మమ్మల్ని ఏమిటేమిటో అడుగుతున్నారు. వాడు నిద్రమాత్రలు మింగాడని అంటున్నారు. మాకేం అర్ధం కావట్లేదు. గగన్ ఊర్లో లేరట కదా”అంది.

శోభకు శిరీష గొంతులోని భయం కలవరపెట్టింది. “గగన్ రాత్రే ముంబయ్ నుండి వచ్చాడు. హాస్పిటల్ కే బయలుదేరుతున్నాడు. ఇవాళ కాస్త ఆలస్యం అయింది… వచ్చేస్తున్నాడు. తేజస్ వెరీ ఎఫీషియంట్, భయం లేదు. ఏమయింది అనిరుద్ద్ కి’ అడిగింది శోభ.

“అదే తెలీదు శోభ. రాత్రి మామూలుగానే మాకు గుడ్ నైట్ చెప్పి చదువుకోవడానికి తన రూం లోకి వెళ్ళాడు. ప్రొద్దున్నే నిద్ర లేపుదాం అని వెళితే స్పృహలో లేడు. వెంటనే భయం వేసి మన హాస్పిటల్ కే తీసుకొచ్చాం. వీళ్ళేమో వాడు నిద్రమాత్రలు మింగాడంటున్నారు. స్టమక్ వాష్ చేస్తున్నారు. మాకు భయంగా ఉంది గగన్ ని త్వరగా పంపించు శోభా”…

అంతా వింటున్న గగన్ పక్క నుండి ఫోన్ అందుకున్నాడు. “మీరేమీ కంగారు పడకండి శిరీష. నేను అరగంటలో అక్కడ ఉంటాను. తేజస్ మంచి డాక్టర్. హి విల్ డూ ది రైట్ థింగ్” అంటూ డైనింగ్ టేబిల్ పై సర్దిన ప్లేట్ల వైపు చూడనన్నా చూడకుండా హడావిడిగా డ్రైవర్ ను కారు తియ్యమని అంటూనే పోర్టికో లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

శోభ మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఆమెకు ఇది మామూలే. చేసి పెట్టిన బ్రేక్ ఫాస్ట్ కలిసి తింటామని కాని డిన్నర్ టైం కి ఇంటికి గగన్ వస్తాడని కాని గారంటీ ఉండదు. అయినా పద్దతిగా ఆమె అన్నీ సిద్దం చేస్తూ వెళ్ళిపోతుంది. చాలా సార్లు ఒంటరిగానే భోంచేయడం ఆమెకు మామూలయిపోయింది. హాస్పిటల్ లో భర్త ఏదో ఒకటి తింటాడని తెలిసినా, సమయానికి తినలేకపోతున్నాడనే బెంగ ఆమెను రోజూ బాధిస్తూ ఉంటుంది.

గగన్ వెళ్ళిపోయాక శోభకు ఇక పుస్తకం చదవాలనిపించలేదు. టేబిల్ మీదవన్నీ సర్దేసి పడకగదిలోకి వచ్చి కూర్చుంది. అనిరుద్ద్ గుర్తుకొస్తున్నాడు. ఎలా ఉందో ఏమో పిల్లాడికి. శిరీష ప్రాణం అంతా వాడే. ఇంకో సంవత్సరంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎం.ఎస్. కోసం లండన్ వెళతాడని అందరూ అనుకుంటున్న సమయంలో ఇదేంటి.

శోభ, శిరీష ఇద్దరూ వైజాగ్ లో ఒకే కాలనీలో పెరిగిన స్నేహితులు. శోభ భర్త గగన్ సిటీలో ప్రముఖ యూరాలజిస్ట్. పదేళ్ళ క్రితం నలుగురు స్నేహితులతో కలిసి సికింద్రాబాద్ లో ఓ హాస్పిటల్ పెట్టారు. శిరీష భర్త శరత్ కుమార్ ఎన్. జి. ఆర్. ఐ లో సైంటిస్ట్. శిరీష ఎన్. ఐ ఎన్. లో లాబ్ సూపర్వైజర్ గా పని చేస్తోంది. రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంది. శోభ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కొన్నాళ్ళు బ్యాంక్ లో పని చేసినా ఆ జీవితం మనస్కరించక ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక ఎన్. జీ. వో లో పని చేస్తోంది.

అనిరుద్ద్ శిరీష శరత్ ల ఏకైక సంతానం ఎమ్సెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకుని సిటీ లో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నాడు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ కు వచ్చాడు. శోభ కూతురు ఫిలిప్ఫిన్స్ లో తండ్రి బాటలోనే మెడిసిన్ చదువుతోంది.

ఈ మధ్యే కూతురి దగ్గర ఓ మూడు నెలలు ఉండి వచ్చింది శోభ. అంతకు ముందు ఉన్న బిజీ వల్ల కూడా శిరీషను గడిచిన ఆరు నెలలలో కలవడం కుదరలేదు. అనిరుద్ద్ ఇలా ఎందుకు చేసి ఉంటాడో మాత్రం ఊహకందట్లేదు. ఈ వయసులో అందరి పిల్లలలాగే ప్రేమ వ్యవహారం ఏమో అనుకుంది. హాస్పిటల్ కు ఫోన్ చేయాలనుకున్నా ఆగిపోయింది. అక్కడ గగన్ ఎంత హడావిడిగా ఉన్నాడో, తన ఫోన్ అతనికి డిస్టర్బెన్స్ అవుతుంది తప్ప లాభం ఉండదు. అయినా ఎందుకో మనసు ఆగట్లేదు.

ఇక ఆలోచించకుండా కాబ్ బుక్ చేసుకుని హాస్పిటల్ కు బైలుదేరింది శోభ.

హాస్పిటల్ కారిడార్ లో దిగాలుగా కూర్చున్న శిరీష, శరత్ లను చూడగానే భయం వేసింది. వెళ్ళి శిరీష పక్కనే కూర్చుంది.

శోభను పట్టుకుని ఏడ్చేసింది శిరీష. శరత్ కళ్ళలోనూ నీరు. ఆ దంపతులను అలా చూడడం శోభకు చాలా బాధనిపించింది.

కాసేపటికి గగన్ వీళ్లిద్దరి దగ్గరకు వచ్చాడు. శరత్ వైపుకు తిరిగి “ప్రమాదం తప్పింది. స్టమక్ వాష్ చేసాం. కొంచెం డెలీరియస్ గా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నాడు. డ్రిప్ పెట్టాం. కొంచెం అన్కంఫర్టబుల్ గానే ఉంటాడు ఈ రోజంతా” అన్నాడు. అక్కడే ఉన్న శోభ, శిరీషలతో “వెళ్ళి చూడండి కాని ఏమీ మాట్లాడకండి. రెస్ట్ తీసుకోనివ్వండి” అన్నాడు.

శరత్ గగన్ చేయి పట్టుకుని, “నిజంగానే సూసైడ్ అటెంప్టా.. నిజంగా” అంటున్నప్పుడు అతని క్రింది పెదవి వణకడం కనిపించింది.

గగన్ శిరీషతో “మీరు వెళ్ళి చూడండి.” అంటూ శరత్ ని అక్కడున్న త్రీ సీటర్ పై కూర్చోబెట్టి తానూ పక్కన కూర్చున్నాడు.

గగన్ సైగను గమనించి తేజస్ ఔట్ పేషంట్లను చూడడానికి వెళ్లాడు. అతని డిపార్ట్మెంట్ డెర్మటాలజీ. ఈ మధ్యనే ఆ హాస్పిటల్ లో చేరినా, పేషెంట్లను అతను డీల్ చేసే విధానానికి సీనియర్లందరూ అతన్ని ఇష్టపడతారు. కొన్ని సున్నితమైన కేసులను డీల్ చేసిన విధానం అతన్ని చాలా మందికి దగ్గర చేసింది.

శోభ, శిరీష అనిరుద్ద్ దగ్గరకు వెళ్ళారు. మంచంపై ఉన్న అనిరుద్ద్ ని చూసి శోభ ఆశ్ఛర్యపోయింది. చిక్కి శల్యమై ఉన్న అతన్ని గుర్తు పట్టలేకపోయింది. శిరీష పక్కన లేకపోతే అసలు కనుక్కోలేకపోయేది. ఆరు నెలలో ఇంత మార్పు ఎలా….

శిరీష కొడుకు చేతిని పట్టుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టింది. శోభను అక్కడ చూసిన నర్సులు శిరీషను గట్టిగా మందలించలేక భయం భయంగా “మేడం డిస్టర్బ్ అవుతుంది” అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అనురుద్ద్ మగతగా నిద్రపోతున్నాడు. ఒక ఐదు నిముషాలు అక్కడ ఉన్నాక శిరీషను బైటకు తీసుకొచ్చింది శోభ. బైట గగన్ శరత్ లు లేరు. బహుశా శరత్ కాబిన్ లోకి వెళ్లి ఉంటారు.

కుర్చీలో కూలబడిన శిరీష కొంచెం తేరుకున్నాక శోభతో “చూసావు కదా ఎలా చిక్కిపోయాడో. ఈ మధ్య మార్కులు సరిగ్గా రావట్లేదని విపరీతంగా స్ట్రెస్ కి గురి అవుతున్నాడు. అప్పటికీ ఆయనా నేను చెప్పి చూసాం. థర్డ్ ఇయర్ కు వచ్చాక అంత టెన్షన్ అవసరం లేదని, ఒకటి రెండు బాక్ లాగ్స్ ఉండిపోయినా నష్టం లేదని. కాని ఇరవైనాలుగు గంటలు ఆ సిస్టం ముందే కూర్చుని ఉండేవాడు. తిండి కూడా గుర్తు చేస్తే తప్ప తినేవాడు కాదు. ఆ మార్కుల భయమే వాడితో ఈ పని చేయించి ఉంటుంది. అందరూ తల్లి తండ్రులు స్ట్రెస్ ఇస్తారని అంటారు. కాని నిజం శోభా మేము ఎంతో చెప్పేవాళ్లం. వాడు విపరీతంగా నలిగిపోతున్నాడని అనిపించినప్పుడు కూడా ఒక సెమిస్టర్ రాయకపోయినా పర్లేదు అన్నాం. కాని వాడిలా” కొంగులో మొహం దాచుకుంది శిరీష.

కాసేపు అక్కడే శిరీషకు తోడుగా ఉండి ప్రమాదం నుండి అనిరుద్ద్ బైటపడ్డాడని స్పష్టంగా తెలిసాక ఇంటికి వచ్చింది శోభ.

ఆ రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు గగన్. అతను భోంచేసేదాకా శోభ ఏమీ మాట్లాడలేదు. గగన్ స్నానం చేసి భోజనం అయిందనిపించి బెడ్ రూం లోకి వచ్చాడు. అనిరుద్ద్ ఎలా ఉన్నాడని అడిగింది శోభ. పర్లేదని, రాత్రి కాస్త ఆహరం తీసుకున్నాడని చెప్పాడు గగన్.

“ఏం పిల్లలో ఏమో ఆ మార్కుల కోసం ఇంత వేదన పడాలా, ప్రాణాలు తీసుకోవాలా, తల్లి తండ్రుల గురించి కూడా ఆలోచించరా… ఏమంటున్నాడు అనిరుద్ద్” భర్తను అడిగింది శోభ.

గగన్ సమాధానం ఇవ్వలేదు.

“అడిగేది నిన్నే గగన్. అనిరుద్ద్ తో మాట్లాడి ఉంటావు కదా.. ఏమంటున్నాడు” అడిగింది ఈ సారి కాస్త గట్టిగా

గగన్ వీపు వెనుక దిండ్లు పెట్టుకుని మంచానికి ఆనుకుని కూర్చున్నాడు. “శోభా అనిరుద్ద్ సమస్య మార్కులు కాదు” అన్నాడు.

“మరి ప్రేమ వ్యవహారం అయ్యుంటుంది” అంది శోభ.

కాసేపు ఆమెను చూస్తూ ఉండిపోయాడు గగన్. ఎదో నిశ్చయానికి వచ్చినట్లు కాళ్ళు మడుచుకుని నిటారుగా కూర్చున్నాడు. శోభ అతని పక్కన కూర్చుంది. భర్త ఏదన్నా సీరియస్ గా తనతో చర్చించాలంటే ఈ భంగిమలో కూర్చుంటాడని ఆమెకు తెలుసు. అందుకే అతనేం చెప్తాడా అని చూస్తోంది.

తల క్రిందకు దించి ఆలోచిస్తున్నవాడల్లా శోభను చూసి “చూడు ఇప్పుడు నేను చెప్పేది నువ్వు ఎవరితోనూ ఎక్కడా పొరపాటున కూడా బైటపెట్టకూడదు. అసలు ఈ విషయం ఇప్పుడే నీకు తెలిసినట్లు శోభ శరత్ ల దగ్గర ప్రవర్తించవద్ధు సరేనా”

భర్త వైపు భయంగా చూసింది శోభ.

“ఏమైంది శరత్. అంతగా దాచాల్సిన విషయం ఏంటి?”

“శోభా… కొన్ని సందర్భాలలో ఆచి తూచి అడుగు ముందుకు వేయాలి. ముఖ్యంగా ఇది అనిరుద్ధ్ జీవితానికి సంబంధించిన విషయం. ప్రాణాలకు సంబంధించిన విషయం. అత్యుత్సాహంతో ఈ విషయాన్ని డీల్ చేస్తే అవతల ఒక కుటుంబం దెబ్బ తింటుంది. బాలెన్స్డ్ గా వ్యవహరిస్తానంటేనే ఈ టాపిక్ మాట్లాడుకుందాం. “ అన్నాడు గగన్.

“ప్రాణాలకు ముప్పు కలిగించే విషయం అని తెలిసాక నేను తప్పు చేస్తానా గగన్. అదీ అనిరుద్ద్ విషయంలోనా? నువ్వు చెప్పినట్లే నాకేమీ తెలియనట్లే ఉంటాను. నాకు తెలియడం అవసరం అంటేనే చెప్పు. అనిరుద్ద్ బావుంటే అంతే చాలు” అంది శోభ.

ఒక రెండు నిముషాలు మౌనం తర్వాత చెప్పాడు గగన్…

“శోభా అనిరుద్ద్ కి సిఫిలిస్”

అదిరిపోయింది శోభ. మంచం పై కూర్చున్నదలా అధాట్టుగా లేచి

“ఏమిటీ అనిరుద్ద్ కా… వాడిగా….” అంది. బ్లాంక్ గా తననే చూస్తున్న శోభను తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు గగన్…

“శోభ కామ్ డౌన్”…

శోభ ముఖం కోపంతో ఎర్రబడింది.

“ఇదేం బుద్ది వాడికి. నిండా ఇరవై ఏళ్లన్నా రాకముందే సుఖవ్యాదా.. అంత డిసిప్లిన్డ్ గా పెరిగిన వాడికా… ఇదేంటి గగన్ ఏం చెప్తున్నావు నువ్వు” శోభ ముఖంలో బాధా, కోపం, అసహ్యం అన్నీ కలగా పులగంగా కనిపిస్తున్నాయి. కోపంతో మాట తడబడుతోంది.

శోభ భుజం పై చేయి వేసాడు అనిరుద్ద్.

“శోభ ఆవేశపడకు. శిరీష, శరత్ ల పరిస్థితి ఆలోచించు. శిరీష ఇది విన్న వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది. “

శోభ కోపంతో వణికిపోయింది. ఒక్కగానొక్క కొడుకని శిరీష అనిరుద్ద్ ని ఎలా పెంచిందో ఆమెకు బాగా తెలుసు. వాడెక్కడ చెడుదారిలో పడతాడోనని ఎన్ని కాపలాలు కాసిందో మరి ఇదేంటి? ఇంట్లో పేరెంట్శ్ స్ట్రిక్ట్ గా ఉంటే ఇలా అవుతుందా? కాని వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవారో అంతే స్నేహంగానూ కొడుకుతో మసిలేవాళ్ళు అసలెందుకిలా జరిగింది…

ఒకొక్కటిగా శోభ వేస్తున్న ప్రశ్నలను మౌనంగా వింటున్నాడు గగన్. అనిరుద్ద్ గురించి తెలిసాకా ఆమె చాలా డిస్ట్రబ్ అవుతుందని అతనికి తెలుసు. మరెవరి విషయంలో నయినా సరే కాని అనిరుద్ద్ పై శోభకు ఎంతో నమ్మకం. అందుకే “అనిరుద్ద్ ఇలానా…” అంటూ పదే పదే అంటున్న ఆమెను వారించ దల్చుకోలేదు అతను. శోభను ప్రిపేర్ చేస్తే తప్ప శిరీషకు ఈ సమయంలో సహాయం దొరకదు. ఆ భార్యా భర్యల మంచితనం, ఆతిధ్యం అన్నిటికి అనుభవించిన వ్యక్తిగా గగన్ వారి కష్టకాలంలో సపోర్ట్ గా ఉండదల్చుకున్నాడు. అందుకే శిరీష్ ఆవేశం సంగతి తెల్సి కూడా ఆమెను ప్రిపేర్ చేయాలనుకున్నాడు.

“హాస్పిటల్ కు తెచ్చినప్పుడు అనిరుద్ద్ స్పృహలో లేడు. టాబ్లెట్లు మింగాడని తెలుసుకోవడానికి తేజస్ కు పది నిముషాల పైనే పట్టింది. అప్పుడే అనిరుద్ద్ అరచేతులపై అరికాళ్లపై రాష్ ను గమనించాడు తేజస్. అతనికి అనుమానం వచ్చింది. నేను వెళ్ళేసరికే స్టమక్ వాష్ పూర్తి చేసారు. తనకు కలిగిన అనుమానాన్ని అప్పుడు బైట పెట్టాడు తేజస్. అనిరుద్ద్ శరీరంపై ఆ రాష్ ను చూడగానే నాకు అతని అనుమానం నిజం అని అర్ధం అయింది. తేజస్ ఈ విషయంలో అనుభవం ఉన్న డాక్టర్. వెనరాలజీ అతని సబ్జెక్ట్ కూడా. అప్పుడే బ్లడ్ సాంపిల్స్ తీసుకున్నాడు. నేను వెళ్లాక అతను చెప్పింది విని ఫ్లూయిడ్ టెస్ట్ కూడా చేయించాను. ఇందాకే రిపోర్ట్ వచ్చింది. పాజిటివ్”

“శిరీషకు చెప్పావా”

“శిరీష, శరత్ లకు చెప్పక తప్పలేదు. ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుంది. వాడి ప్రాణాలకు ఏమి ముప్పు ఉండదు. కాని ఆ వెయిట్ లాస్, స్పృహలోకి వచ్చాక వాడి పిచ్చి చూపులు ఇవి ప్రస్తుతం మనం ఆలోచించాల్సిన విషయాలు. నువ్వు చూడలేదా ఎంత సన్నబడ్డాడో” అన్నాడు గగన్.

“అవును చాలా చిక్కాడు. అంటే ఇంకేదైనా ఉంటుందా… ఈ బరువు తగ్గడం హెచ్. ఐ వి కి సంబంధించినది కాదు కదా” శోభకు చెమట్లు పడుతున్నాయి.

“శోభా. నీ అనుమానం నాకు అర్ధం అయింది. కాని ఇది కాదు నీ దగ్గర నేను ఆశించేది. వాడు పిల్లాడు. తప్పులు చేసి ఉండవచ్చు. కాని దానికి మించిన సమస్యేదో ఉందని నా అనుభవం చెబుతోంది. వాడు మానసికంగా సరిగ్గా లేడు. ఇది చదువుకు సంభందించిన స్ట్రెస్ మాత్రం కాదు. ఇప్పుడు ఏ మాత్రం తప్పుగా ప్రవర్తించినా ఒక ప్రాణం పోతుంది. ఇప్పటికే వాడు సూసైడ్ అటెంప్ట్ చేసాడు. సమయానికి శిరీష చూసింది కాబట్టి లేకపోతే ఈ పాటికి మట్టిలో కలిసిపోయేవాడు. వాడిని మామూలు మనిషిని చేయాలి. ఎవ్రీ బడీ షుడ్ బీ గివెన్ ఏ సెకెండ్ చాన్స్. వాడే ఊబిలో ఇరుక్కున్నాడో తెలుసుకోవడం అవసరం. ఇప్పుడు వాడి కారెక్టర్ అసాసినేషన్ కాదు నువ్వు చేయాల్సింది” అన్నాడు గగన్ కాస్త కోపంగానే.

శోభ వాక్ప్రవాహానికి అడ్డుకట్ట తగిలింది. “మరిప్పుడు ఏం చేద్దాం” అడిగింది దిగులుగా.

“శిరీష వాడే రెస్టిల్ టాబ్లెట్శ్ అన్నీ కలిపి ఒకేసారి ఉదయం నాలుగింటికి వేసుకున్నాడట. ఐదుకు శిరీష వాడిని చదువు కోసం లేపడానికి గదిలోకి వెళ్లి చూడబట్టి వాడిని సేవ్ చేయగలిగాం. ఇప్పుడు ఇదీ తెలిసింది. దీని ట్రీట్మెంట్ కూడా మొదలెట్టాలి. కాని దీనికన్నా ముఖ్యం ఆ తల్లి తండ్రులకు ఈ పరిస్థితిని ఫేస్ చేయడానికి కావలసిన ధైర్యాన్నిఅందివ్వడం. అది నువ్వు చేయాలి. శిరీష బాధ చూడలేకపోయాను. షి నీడ్స్ సపోర్ట్. విషయం బైటికి వస్తే ఆ ఇంట్లో ఒకటి కాదు మూడు శవాలు లేస్తాయి. అందుకే నువ్వు తెలివిగా వ్యవహరించాలి” అన్నాడు గగన్.

“సూసైడ్ ఎటెంప్ట్ తర్వాత ఇప్పుడున్న స్థితిలో అనిరుద్ద్ కి మూడు రోజుల అబ్జర్వేషన్ అవసరం. రేపు కౌన్సలింగ్ మొదలెడతాడు తేజస్. నాతో ఉన్న పరిచయం కారణంగా అనిరుద్ద్ నా దగ్గర ఓపెన్ అవకపోవచ్చు. అందుకే తేజస్ నే డీల్ చేయమని చెప్పాను. ప్రతిదీ నా వరకు వస్తుంది కదా. చూద్దాం. ఈ మూడు రోజులు మన హాస్పిటల్ లోనే ఉంటాడు” అంటూ దిండుపై తలవాల్చాడు గగన్.

అలసిపోయిన గగన్ కాసేపటికే నిద్రపోయాడు. శోభ తానూ నిద్రపోవాలని ప్రయత్నించింది. కాని అనిరుద్ద్ చిన్నప్పటి రోజులు, వాడితో తాను ఆడుకున్న ఆటలు ఒకొక్కటిగా గుర్తుకువచ్చి నిద్ర పట్టలేదు. శిరీష పరిస్థితి ఏంటో తలచుకుంటే భయం వేసింది. ఆమెతో మాట్లాడాలనిపించింది. కాని ఏమని పలకరించాలో అర్ధం కాలేదు. రాత్రంతా అన్యమస్కంగానే గడిచిపోయింది.

తెల్లవారు జామునెప్పుడో నిద్రపోయిందేమో ఆలస్యంగా మెలకువ వచ్చింది శోభకు. లేచేటప్పటికే గగన్ తయారవుతున్నాడు. సుజాత వంటింట్లో చేయాల్సిన పని చేస్తుంది.

పక్కనే ఔట్ హౌస్ లో భర్త శంకర్ తో ఉంటుంది సుజాత. శంకర్ గగన్ దగ్గర నమ్మకంగా పని చేసే డ్రైవర్. ఇంట్లో పని సుజాత చూస్తూ ఉంటుంది. వాళ్ల పిల్లలు ఆ పక్కన ఉన్న స్కూల్ లోనే చదువుతున్నారు.

సుజాతకు ఆ రోజు చేయాల్సిన కొన్ని పనులు చెప్పి, కాఫీ కలుపుకుని వచ్చింది శోభ. గగన్ ఏవో జర్నల్స్ చదువుతున్నాడు. ఈ సమయంలో ఎలాంటి డిస్ట్రబెన్స్ ఇష్టపడడు. కాసేపయ్యాక స్నానానికి వెళ్ళిపోయాడు. శోభకు భర్తను ఏమీ అడగాలనిపించలేదు. కాని శిరీషను చూడాలని ఉంది. అందుకే టిఫెన్ తింటున్న భర్తతో “నేను హాస్పిటల్ కు రానా” అడిగింది శోభ.

“శిరీష, శరత్ లకు కొంత స్పేస్ ఇద్దాం. ఈ రోజు నేను వారిద్దరితో మాట్లాడవలసిన విషయాలు ఉన్నాయి. ఏ విషయం చెప్తాను. ఇవాళ్టికి కావాలంటే పలకరించే నెపంతో శిరీషకు ఫోన్ చేయి” అన్నాడు గగన్.

భర్త నిర్ణయంపై పూర్తి నమ్మకం శోభకు. అందుకే ఇంకేం అనలేదు. పైగా ఇప్పుడే శిరీషను కలవడానికి తానూ సిద్దంగా లేనేమోనని ఆమెకూ అనిపించింది.

రాత్రి ఇంటికి వచ్చాక గగన్ అనిరుద్ద్ కోలుకున్నాడని ఇతర టీట్మెంట్లు మొదలయ్యాయని, తేజస్ ఆ భార్యా భర్తలిద్దరితోనూ మాట్లాడుతున్నాడని చెప్పాడు.

శోభ శిరీషతో మాట్లాడాలని ఫోన్ చేసింది. కాని శిరీష తీయలేదు. శోభకు అర్ధం అయింది శిరీష మొహం చాటేస్తోందని. ఆ దంపతులకు కొంత స్పేస్ అవసరం అన్న భర్త సూచన అప్పుడు ఇంకా బాగా అర్ధం అయింది.

ఒక వారం రోజుల పాటు అనిరుద్ద్ హాస్పిటల్ లో ఇన్ పేషెంట్ గా ఉన్నాడు. ఈ వారం రోజులు అనిరుద్ద్ బలం పుంజుకుంటున్నాడని తప్ప శోభకు ప్రత్యేకంగా ఇంకే విషయం చెప్పలేదు గగన్. శిరీష శరత్ లతో తేజస్ డీల్ చేస్తున్నాడని, ముగ్గురితోనూ అతనే మాట్లాడుతున్నాడని, తమ మధ్య ఉన్న పూర్వ పరిచయం కారణంగా తాను డైరెక్ట్ గా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వట్లేదని, ఇదే అనిరుద్ద్ కు మంచిదని చెప్పడంతో శోభ భర్తను హాస్పిటల్ సంగతులు అడగట్లేదు. కాని మనసంతా విరక్తితో నిండిపోయి అసహనంగానే ఆ వారం రోజులు గడిపింది.

ఆ రోజు ఆదివారం. అర్జెంట్ కేసులేవీ లేవని ఆ ముందు రాత్రే గగన్ చెప్పడంతో ఆదివారం కాస్త ఆలస్యంగానే లేచారు భార్యా భర్తలిద్దరు.

కాఫీ తాగుతున్న భార్యతో “తేజస్ ఇవాళ లంచ్ కు ఇంటికి వస్తున్నాడు. అనిరుద్ద్ విషయం వివరంగా మాట్లాడాలని రమ్మన్నాను.” అన్నాడు గగన్.

“అనిరుద్ద్ నిన్ననే డిస్చార్జ్ అయి వెళ్ళిపోయాడు కదా” అడిగింది శోభ.

“అవును హాస్పిటల్ కేసులతోనూ శిరీష, శరత్ ల ఎదుట మాట్లాడుకునే అవకాశం మా యిద్దరికీ రాలేదు. ఫోన్ లో అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. డిస్చార్జ్ అప్పుడు కూడా తనే చూసుకున్నాడు. కౌన్సలింగ్ సెషన్స్ డా. నిరంజన్ తో ఈ బుధవారం నుండి మొదలవుతాయి. దాని గురించే వివరంగా మాట్లాడడానికి ఇంటికి రమ్మన్నాను”.. చెప్పాడు గగన్.

సుజాతకు ఏం వండాలో చెప్పడానికి లోపలికి వెళ్లింది శోభ. తేజస్ ఆ ఇంటికి కొత్తవాడేమీ కాదు. గగన్ కన్నా పదిహేనేళ్లు చిన్నవాడవడంతో శోభ దగ్గర కూడా అతనికి చనువుంది. వీళ్లిద్దరూ ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకుని హాస్పిటల్ విషయాలు మాట్లాడుకోవడం మామూలే.

అనుకున్నట్లుగానే ఒంటిగంటకు వచ్చాడు తేజస్. భోజనాలు చేసి ముగ్గురూ హాలులో కూర్చున్నారు.

“అనిరుద్ద్ విషయం తెలిసి బాగా డిస్టర్బ్ అయింది శోభ. వాడిని చిన్నప్పటి నుండి చూసింది కదా. ఇది జీర్ణించుకోలేకపోతోంది” అన్నాడు గగన్.

“సారి మేడం మీకు నేను ఇలా చెప్పడం నచ్చకపోవచ్చు కాని ఇలాంటివి ఇప్పటి తరం పిల్లల జీవితాలలో వచ్చీ పోయే ఎపిసోడ్శ్ మాత్రమే. నైతికత విషయంగా మీ తరానికి ఈ తరానికి మధ్య ఛాలా అంతరాలున్నాయి. వాటిని అంగీకరించక తప్పదు” అన్నాడు తేజస్.

“కాని అనిరుద్ద్ ని అలా ఊహించలేకపోతున్నాను తేజస్. నా చేతిలో పెరిగిన పిల్లవాడు” శోభ మొహంలో విషాదం.

“మేడం చిల్. అది పెద్ద విషయం కానే కాదు. కాని భయపడాల్సినది అనిరుద్ద్ ఈ ప్రమాదంలో ఇరుక్కున్న పద్దతికే” అన్నాడు తేజస్.

అర్ధం కానట్లుగా చూసారు శోభ గగన్ ఇద్దరూ.

“వివరంగా చెప్పు తేజస్… హౌ బాడ్ ఈజ్ ది సిట్యూయేషన్” అడిగాడు గగన్.

“విషయం బైటపడకుండా ఉంటే చాలా సీరియస్ సిట్యుయేషనే” అని శోభ వైపు చూస్తూ మాటలాపేసాడు తేజస్.

గగన్ కు అర్ధం అయింది. తేజస్ శోభ ముందు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడు.

“పర్లేదు తేజస్. శోభ చేసే పనిలో ఇలాంటి విషయాల పట్ల అవగాహన కూడా చాలా అవసరం. నాకు తెలిసి సెక్స్ గురించి ఆబ్జెక్టివ్ గా ఎవరమూ మాట్లాడకపోవడం చాలా ప్రమాదాలకు మూలం. శోభ గురించి నువ్వు మొహమాట పడక్కర్లేదు. చెప్పు నీ కౌన్సలింగ్ లో ఏం తెలిసింది”?

“మీరు చెప్పింది చాలా రైట్ సర్. మన సమాజంలో సెక్స్ గురించి ఎవరం ఆబ్జెక్టివ్ గా మాట్లాడం. అదో దొంగ చాటు వ్యవహారంలానే చూస్తాం. బాగా చదువుకున్న అనిరుద్ద్ పేరెంట్స్ తరం కాస్త ప్రొగ్రసివ్ అయి పిల్లలతో కమ్యునికేట్ అయే సమయానికి అన్ని రకాల సమాచారాలు సోషల్ మీడియా పుణ్యమా అని అబద్దాల కూడికలతో టీనేజర్లను ముంచేస్తున్నాయి. ఎంత కన్ప్యూజన్ అనుభవిస్తుంది ఈ తరం? మీ రోజుల్లో అస్సలు కమ్యునికేషన్ ఉండేది కాదు. అది కొంత నయం. మా తరం అత్యుత్సాహాన్ని ప్రదర్శించాలనుకున్నా మాధ్యమాలు పూర్తిగా అందుబాటులో లేవు. మేము కూడా బయటపడిపోయాం. కాని ఈ తరం చాలా ప్రమాదకర స్థితిలో ఉంది. వీళ్ళ మధ్య అవసరం ఉండీ లేనీ ఎంతో సమాచారం కుప్పలు తెప్పలుగా పడిపోతుంది. అందులో నిజం ఎంత, అబద్దం ఎంత అని నిర్ణయించుకునే సమయం కూడా వీళ్ళకు ఉండట్లేదు. అది క్రియేట్ చేసే కన్ప్యూజన్ కు బలయిన వాడే అనిరుద్ద్ కూడా.

“వివరంగా చెప్పు తేజస్” అడిగింది శోభ.

“మేడమ్ పది పన్నెండేళ్ల వయసు నుండే ఇప్పటి తరానికి తమ శరీరంపై ఆసక్తి మొదలవుతుంది. పదమూడేళ్ళ నుండే ఆపోజిట్ సెక్స్ పట్ల కుతుహాలం మొదలవుతుంది. స్నేహితుల మధ్య తెలిసీ తెలియని సంభాషణలను ఎవరమూ ఆపలేం. తల్లి తండ్రులెంత ప్రోగ్రెసివ్ గా ఉన్నా ఈ విషయాల గురించి స్నేహితులతో జరిపే చర్చే వారికి కంఫర్టబుల్ గా ఉంటుంది. ఆ స్నేహితులు కూడా ఎవరు? వీరి వయసు వాళ్ళే. యూ ట్యూబ్, నెట్ లో వెదజల్లబడిన వీడియోలను చూసి ఆ తెలిసీ తెలియని వయసులో కొన్ని అజంప్షన్స్ ను ఏర్పరుచుకుంటున్నారు వీళ్లు. వీళ్ళ ఉత్సాహాన్ని కాష్ చేసుకునే పోర్న్ సైట్లకు లెక్కలేదు. వీళ్ళకు అందుబాటులో కొచ్చిన పోర్న్ ద్వారా తమ సందేహాలను, ఆసక్తిని తీర్చుకుందామనుకుంటూ వాటికి అడిక్ట్ అయిపోతున్నారు.”

“అనిరుద్ద్ పురుషాంగం చిన్నగా ఉంటుందనే అనుమానం అతనిలో పదమూడేళ్ళ వయసులోనే పడింది. పిల్లలందరూ టాయలెట్లలో ఆ వయసులో చేసే డిస్కషన్ అదే. ఎవరిది పెద్దదో వాడే మగాడు అనే ఓ కాంపటీషన్ టాయలెట్లలో నడుస్తూ ఉంటుంది. కాస్త బెరుకుగా ఉండే అనిరుద్ద్ బాడీ షేమింగ్ కి గురయ్యింది ఆ వయసులోనే. పురుషుడి అంగం పెద్దగా ఉంటే అదే పురుషత్వం అనే భావం అనాదిగా మన సమాజంలో పాతుకుపోయింది. ఇది రకరకాల పద్దతులలో బైట పడుతూ ఉంటుంది. ఈ ఆలోచన తల్లి తండ్రుల నుండి పిల్లలలోకీ పాకుతుంది. ఇక పోలికలు మొదలవుతుతాయి. చాలా మంది మగపిల్లలలో ఇది విపరీతమైన అభద్రతా భావానికి గురి చేస్తుంది.”

“అనిరుద్ద్ పదమూడేళ్ళ వయసులో ఉండగానే అతనిలో ఈ అనుమానం ప్రవేశించింది, అది అతనితో పాటే పెరుగుతూ పోయింది. దాని ద్వారా చెలరేగే అనుమానాలు, స్నేహితుల హేళనలను తప్పించుకుని తనలో వచ్చే మార్పులను అర్ధం చేసుకునే ప్రయత్నంలో తొందర తొందరగా ఏదో తెలుసుకోవాలి,తనను తాను బాగు చేసుకోవాలి అనే ఆతృతతో స్నేహితుల సలహా మీదా పోర్న్ చూడడానికి అలవాటు పడ్డాడు. క్రమంగా ఆపోజిట్ సెక్స్ అవసరం కలుగుతూ పోయింది”.

“ఇలాంటి ఆతృత, ఆదుర్దాల నడుమ ఆడపిల్లలతో చేసే స్నేహాలు సహజంగా ఉండవు. అనిరుద్ద్ లోని ఈ అనుమానం, ఆతృత, అతను స్నేహం చేసే ఆడపిల్లల దగ్గర ఐడెంటిటీ క్రైసిస్ గా బయటపడుతూ ఉండడంతో ఆడపిల్లల స్నేహాలు అతనికి మంచి అనుభవాలను ఇవ్వలేదు. దానితో కన్ప్యూజన్ పెరిగి పెరిగి త్వరగా తానేంటో తేల్చుకొవాలని, తానూ మగవాడినని అనిపించుకోవాలని జరిగిన ప్రయత్నంలో ఓ రెండు లవ్ అనుకున్న రిలేషన్ షిప్లు దెబ్బతిన్నాయి. ఇతన్ని గమనిస్తున్న స్నేహితుల నడుమ పీర్ ప్రెజర్ పెరిగి ఆ సెక్స్ జరిపేసి తాను మగాడినని అనిపించికోవాలని, తన అంగం చిన్నదవడంతో సెక్స్ సరిగ్గా జరపలేనేమో అన్న అనుమానంతోనూ ప్రొటెక్షన్ లేకుండా సెక్స్ వర్కర్లతో కలిసేవాడు.”

“కాని ఏ అనుభవమూ అతనిలోని భయాన్ని పోగొట్టకపోగా అతన్ని ఇంకా అభద్రతా భావంలోకి నెట్టేసేది. దానితో స్ట్రెస్, ఆంగ్జయిటీ విపరీతంగా పెరిగిపోయేవి. అవి అతని కాన్పిడెన్స్ ను పూర్తిగా నాశనం చేసాయి. దాంతో అతనిలో ఒక విధమైన డెస్పరేషన్ మొదలయింది. అంగం పెరగడానికి ఆయుర్వేదం అంటూ ఏవో మందులు వాడడం. దాన్ని టెస్ట్ చేసుకోవాలనుకోవడం. నిజానికి నరకం అనుభవించాడు ఈ చిన్న వయసులో.”

“స్నేహితులందరూ వారి వారి గర్ల్ ఫ్రెండ్స్ తో గడపడాన్ని గొప్పగా చెప్పుకోవడం, తాను ఎవరినీ ఆకర్షించలేకపొవడం, తనలో ఏదో లోపం ఉందన్న అనుమానం, తెలిసి తెలియక భయంతో డబ్బిచ్చి కొనుక్కున స్త్రీల దగ్గర సరయిన అనుభవాన్ని పొందలేకపోవడం, ఈ విషయంలో ఎంతో నైపుణ్యం ఉన్న ఆ స్త్రీలు ఇతని బలహీనతను గుర్తించి చులకన చేసి ఎక్కువ డబ్బు గుంజే ప్రయత్నం చేయడం ఇవన్నీ అతన్ని దాదాపు పిచ్చివానిగా మార్చేసాయి. ఒకో విషయాన్ని అతను చెబుతూ ఉంటే నాకే ఆ అబ్బాయి మీద జాలి వేసి కన్నీళ్లు వచ్చాయి.”

“ఈ డెస్పరేషన్ అతన్ని పూరిగా జీవం లేని వ్యక్తిగా మార్చేసింది. తన శరీరంపై వచ్చిన రాష్ ఎందుకో నెట్ ద్వారానే కనుక్కున్న తర్వాత అనిరుద్ద్ కి బ్రతకాలనిపించలేదు. పోర్న్ చూడకుండా ఉండలేకపోవడం, రాత్రుల్లు అతన్ని నిద్రకు దూరం చేసింది. కంప్లీట్ గా అనిరుద్ద్ బాడీ సిస్టం దెబ్బతింది. స్ట్రెస్ పెరిగి డిప్రెషన్ లోకి దారి తీసింది. చనిపోతే ఈ బాధ తప్పిపోతుందని అనిపించింది.”

“ఈ సమయంలో తల్లి తండ్రుల నిష్కల్మషమైన ప్రేమ, చదువు విషయంలోకూడా ఎంతో కో ఆపరేటివ్ గా ఉండే వాళ్ళ మంచితనాన్ని అనుభవిస్తున్నప్పుడు తాను మంచివాడిని కానని, తానంటూ లేకపోతే వారిద్దరి జీవితాలు బావుంటాయని, తాను చెడిపోయానని, చెడిపోతూనే ఉంటానని, ఇక తనకు మంచి జీవితం ఉండదని, తాను మంచి కొడుకుని కాలేననే భావంతో నలిగిపోయాడు. అతను నాతో అన్న మొదటి మాటే “మా అమ్మా నాన్నలకు నేను తగను డాక్టర్” అని. అనిరుద్ద్ చెడ్డవాడు కాదు మేడం. హీ ఈజ్ ఏ విక్టిం ఆఫ్ దిస్ ఎలక్ట్రానిక్ ఎరా”

‘డిప్రెషన్ సినారియో ఏంటీ తేజస్’ అడిగాడు గగన్.

“టోటల్ ఐజొలేషన్ లోకి వెళ్ళిపోయాడు. అనిరుద్ద్ పేరెంట్శ్ ఎగ్జామ్స్ లో ఫర్ఫార్మ్ చేయలేకపోతున్నాననే భయంతో అతను అలా మారిపోతున్నాడేమో అని చాలా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. వాళ్లు అతనికి ధైర్యం చెప్తున్న కొద్దీ గిల్ట్ మోడ్ లోకి వెళ్ళిపోయేవాడు.”

“విషయం అంతా తెలుసుకున్నాక శరత్ అనిరుద్ద్ లాప్ టాప్ మొత్తం సెర్చ్ చేసారు. అనిరుద్ద్ సెర్చ్ హిస్టరీ లోకి వెళ్ళి ఆ పోర్న్ సైట్శ్ చూసి చాలా భయపడ్డాడు. ఈ పోర్న్ అడిక్షన్ కి ఎన్ని జంటలు బలవుతున్నాయో, ఎంత మంది భార్యా భర్తల సంబంధాలు చెడిపోతున్నాయో ఆ గణాంకాలు తలచుకుంటే భయం వేస్తుంది. ఇలాంటి అనుభవాలతో టీనేజీ జీవితాన్ని బలిపెట్టి, ముప్పై ఏళ్ళకే ఎసెక్చ్యువల్ గా మారిపోతున్న యువత సంఖ్య పెరుగిపోతోంది” ఆగాడు తేజస్.

వింటున్న శోభ తల తిరిగిపోతోంది. “భగవంతుడా ఏలాంటి రోజులివి. ఎంతో చదువుకుని జాగ్రత్తపడుతూ పిల్లలను డెమొక్రెటిక్ గా పెంచే శిరీష శరత్ ల బిడ్డకే ఇలాంటి స్థితి ఉంటే ఇక మిగతా తల్లితండ్రుల సంగతేంటీ? ఎవరిని తప్పు పట్టాలి. పిల్లలని ఎలా రక్షించుకోవాలి… ఆమె మనసులో రకరకాల ప్రశ్నలు.

“అనిరుద్ద్ లో ఎదైనా సైకలాజికల్ డిజార్డర్ ఉండి ఇంత బలహీన మనస్కుడిగా తయారయ్యాడేమో కదా గగన్” అంది.

కాసేపు ఆలోచనలో పడ్డారు గగన్, తేజస్.

“ప్రతిదీ సైకాలజికల్ డిజార్డర్ గా చూస్తూ సామాజిక ప్రభావాన్ని మనం పట్టించుకోక ఇప్పటి తరాన్ని ఇంకా సమస్యలలోకి తోస్తున్నాం కదా శోభ. అనిరుద్ద్ లో ధైర్యం తక్కువ కావచ్చు. కాని చిన్నతనంలో అన్నీ మరచి ఆడుకునే వయసులోనే శరీరాల పట్ల, శరీర నిర్మాణం పట్ల ఆసక్తిని అసహజంగా పెంచే పరిస్థితుల నడుమే కదా ఇప్పటి పిల్లల బాల్యం నడుస్తుంది. ఇక ఆ చానెళ్లు, సైట్లు, సినిమాలు, నెట్ లో వచ్చే వీడియోలు, పోర్న్ అన్నీ ఒక బటన్ నొక్కితే పిల్లల ముందు వాలుతున్నాయి. సెక్చ్యువాలిటిని మాచోయిజాన్ని హైప్ చేసే సంస్కృతిలోనే వీళ్లు పెరుగుతున్నారు. తినే తిండి కెమికల్స్ మయం. ఆ ప్రభావం హార్మోన్లపైనా ఉంటుంది. ఇక సెక్స్ ఎప్పుడూ అతి పెద్ద ఆకర్షణే. అదే మగతనానికి కొలమానం కూడా. స్త్రీని సెక్స్ తోనే లొంగదీసుకోవాలని, అది పురుష ప్రధాన నైజం అన్ని బోధించే విష సంస్కృతి ఎందరో మగపిల్లల సహజ ప్రవర్తనను కలుషితం చేస్తోంది.”

“కొత్త కొత్త సెక్చ్యువల్ ఎక్స్పెరిమెంటేషన్లను విజువల్ గా చూపిస్తూ ఎంత అసహజంగా ఆ పోర్న్ వీడియోలను తయారు చేస్తున్నారో చూస్తే కడుపు రగిలిపోతుంది. ఒకే రోజులో ఎన్ని సార్లు సెక్స్ జరపవచ్చో, ఎలా జరపాలో, ఇవన్నీ పోర్న్ లో చూసి, అవి గొప్ప అనుభవాలని, నిజంగా సాధించగలిగే వాస్తవాలని నమ్మి, వాటిని ప్రయత్నించి ఫలించక, పార్టనర్లు మానసికంగా శారీరికంగా గాయాలపాలయి, ఆ హింస భరించలేక హత్యలకు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఎందరి జీవితాలు బలవుతున్నాయో ఊహిస్తే ఇది కేవలం సైకలాజికల్ సమస్య అని ఎలా అనగలం? ఇది వ్యక్తిగత వైఫల్యం అనో, కుటుంబ వైఫల్యం అనో ఎలా వదిలేయగలం? ఎన్ని జీవితాలు ఈ విష సంస్కృతికి బలి అవుతున్నాయో.” ఆగాడు గగన్.

“ఈ మధ్య వార్తలకెక్కిన అత్యాచారాల విషయాలలోనూ విపరీతమైన సైకో బిహేవియర్ కనిపిస్తుంది. అది రేప్ కావచ్చు. కాని ఈ రేప్ లో ఎంతో హింసాత్మకత కనిపిస్తుంది. సాధారణ సెక్స్ వారికి సరిపోవట్లేదు. ఇంకా ఏదో అనుభవం కావాలి అంటూ పైశాచికంగా వ్యవహరిస్తున్న వారిని గురించి వింటున్నప్పుడు కూడా దీన్ని కేవలం మానసిక సమస్యగానే చూడాలనిపించట్లేదు” అన్నాడు తేజస్.

“కాని ఇలాంటివి సూసైడ్ వరకు కూడా వెళతాయా” భయంగా అడిగింది శోభ.

“ఇప్పుడు యువతలో ఆత్మహత్యలు పెరగడం వెనుక సెక్స్ ప్రధానంగా పని చేస్తొంది శోభా. సెక్స్ వారికి అనుభవం మాత్రమే ఇవ్వట్లేదు. చాలా మందిలో అవేశాన్ని, అనుమానాన్ని, ఆధిపత్యాన్ని ఎన్నో రెట్లు పెంచుతోంది. అనిరుద్ద్ లాంటి వారిలో అభద్రతా భావం, ఆ తరువాత గిల్ట్ పెరగడానికి కారణం అవుతోంది. ఇవన్నీ వినాశనం వైపుకే దారి తీస్తాయి. వారి చుట్టూ ఉన్నవారు, కొన్ని సార్లు వాళ్ళు కూడా ఈ నెగెటివ్ ఎమోషన్లకు, హైపర్ బిహేవియర్ కు బలవుతూనే ఉన్నారు”.

“మరి ఎలా తేజస్. ఎలా ఈ తరాన్ని రక్షించుకోవడం. ఎక్కడ మొదలవ్వాలి” అడిగింది శోభ.

“సరయిన సెక్స్ ఎడ్యుకేషన్ తో”

“అది ఇంత కాంప్లెక్స్ సమాజంలో ఎలా ప్రారంభించాలి. ఎలా సాగించాలి? ఒక వేళ సెక్స్ ను పూర్తి నిడివితో సిలబస్ గా బోధించే రోజులే వచ్చినా అది ఎలాంటి పర్యావసానాలకు దారి తీస్తుంది. మీరు చెబుతున్న ఇన్ని మాధ్యమాల విపరీత బోధన నుండి పిల్లలను రక్షించుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది. అసలు సాధ్యం అవుతుందా. లేదా పరిస్థితి ఇంకా విషమిస్తుందా” ఆగింది శోభ.

మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయారు తేజస్, గగన్ లు…

“అప్పటి దాకా అనిరుద్ద్ లాంటి పిల్లల పరిస్థితి” శోభ ప్రశ్నల పరంపర ఆగనంటోంది.

“ప్రస్తుతానికి థెరపి మొదలెడుతున్నాం. కాని అతను కోలుకోవడానికి, తరువాత మామూలు జీవితం సాగించడానికి, ఆరోగ్యవంతమైన రిలేషన్ షిప్స్ కు సిద్దపడడానికి చాలా సమయం పడుతుంది” అన్నాడు తేజస్.

శోభకు భయం వేసింది. అనిరుద్ద్ ను తలచుకుని, ఫిలిఫిన్స్ లో ఉన్న కూతురిని తలచుకుని, రాబోయే తరాలను తలచుకుని. ఈ తరాలని రక్షించుకోగలమా…

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

Leave a Reply