వ్యక్తిగత జీవితానికీ, నమ్మే భావజాలానికీ తప్పక సంబంధం ఉండాలి : వి. చెంచయ్య

మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి.
నేను 1950 జులై 10న పుట్టాను. బహుశా రెండేళ్ళ వయసులో అనుకుంటాను- ఒకరోజు ఉదయాన్నే కిరసనాయిలు బుడ్డి (దీపం) ముందు కూర్చొని ఏదో బొమ్మల పుస్తకం చూస్తున్నాను. ఆ దీపం మంట నా తల వెంట్రుకలకు అంటుకుంది. అప్పటికింకా వెంట్రుకలు తియ్యలేదు గనక పొడవుగా ఉన్నాయి. పైగా ముందురోజే తలస్నానం చేయించారు. అందువల్ల మంట సులభంగా అంటుకుంది. మా అమ్మ బయట కళ్ళాపి చల్లుతూ చూసి, పరుగెత్తుకుంటూ వచ్చి ఆ కళ్ళాపి నీళ్ళనే నా తలపై చల్లింది. ఆ రోజుల్లో పల్లెల్లో మంగళివాళ్ళు పెళ్ళిళ్ళకు మంగళ వాయిద్యాలు వాయించడమే గాకుండా, నాటువైద్యం కూడా చేసేవారు. వెంట్రుకలు రాలడం వల్ల తల (ముఖం) పై భాగంలో రెండువైపులా బాగా వాసింది. పెద్ద బొబ్బలు ఏర్పడ్డాయి. ఆ మంగలి వేసిన వత్తులతో (ప్లాస్టర్ లాంటిది) ఆ బొబ్బలు తగ్గిపోయాయి. ‘దేవుడి’కి ఇవ్వాల్సిన నా తల వెంట్రుకలు అలా అగ్నికి ఆహుతై పోయాయి. దైవానికీ, నాకూ పడకపోవడం ఇలా చిన్నప్పుడే మొదలైందేమో. నా బాల్యంలో నాకు గుర్తున్న తొలి సంఘటన ఇదే. నా జీవితం నా ప్రమేయం లేకుండానే అగ్నితో మొదలైందన్నమాట. ఆ కాలిన మచ్చలు నా ముఖంపైన ఇప్పటికీ ఉన్నాయి.

    అప్పట్లో మా వూరు సాయిపేటలో (నెల్లూరు జిల్లా) ప్రాథమిక పాఠశాల ఉండేది. దాన్ని మేం ‘బడి’ అనేవాళ్ళం. విద్యార్థులు 70మందికి పైగా ఉండేవాళ్ళు. అయ్యవార్లు ఇద్దరే. పెద్దయ్యవారు, చిన్నయ్యవారు అనేవాళ్ళు. వాళ్ళ పేర్లు మాకు తెలియదు. 1955లో అయిదేళ్ళ వయసులో నన్ను బళ్ళో చేర్పించారు. ఒక గుడ్డసంచిలో పలక, బలపం మాత్రమే వేసి బడికి పంపారు.

    నేను మూడవ తరగతిలో ఉన్నప్పుడు- అంటే ఎనిమిదేళ్ళ వయసులో మా అమ్మానాన్న తిరుపతి వెళుతూ నన్ను కూడా రమ్మన్నారు. “తిరుపతి వస్తే నాకు చదువు పోతుంది. నేను రాను” అన్నాను`అదేదో పెద్ద చదువై, ర్యాంకు పోతుందన్నటు. నాకు గుర్తున్న రెండో సంఘటన ఇది. ఇప్పుడాలోచిస్తే నాకనిపిస్తుంది- దేవుడికీ, నాకూ పడదేమోనని. నా స్నేహం అగ్నితో మొదలైంది.

    అయిదేళ్ళ వయసు నుండే మా అమ్మతోబాటు నేను కూడా పొలానికి వెళ్ళేవాణ్ణి. బడిలేని రోజుల్లో గడ్డికోసి, కట్టకట్టి మా అమ్మ తలకెత్తుకోవడానికి సిద్ధపడుతుంటే, నేను కూడా ‘ఒక గడ్డిమోపు నెత్తిన పెట్టు మోస్తా’నన్నాను. వద్దులేరా అన్నది. నేను మొండికేశాను. మళ్ళీ కాస్త గడ్డికోసి చిన్న మోపుకట్టి నా నెత్తిన పెట్టింది. అప్పుడుగానీ నేను బయల్దేరలేదు. ఇలా మొండికేసిన అన్ని సందర్భాల్లో నేను చేస్తానన్న పనులు మంచిపనులు కావడంతో నన్ను నివారించలేకపోయేవాళ్ళు. తెలియకుండానే నా వ్యక్తిత్వానికి కలిసొచ్చిన అంశం ఇది.

    ఒకరోజు మా అమ్మ పొలానికి పోతూ నన్ను కూడా రమ్మని పిలిచింది. వెంటనే నేను-‘అమ్మా… మనం పోయేసరికి ఆ పొలం లేకపోతే ఎలా?’ అని అడిగాను. మా అమ్మ నవ్వి- ‘పొలం ఎక్కడికి పోతుందిరా?’ అన్నది. ‘అదిగాదు, ఒకవేళ పొలం లేదనుకో, అప్పుడెలా?’ అని మళ్ళీ అడిగాను. ఇలా మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నాను. చివరకు ‘పొలం లేకపోతే ఏం చేద్దామమ్మా’ అని అడిగాను. ‘తిరిగి ఇంటికి వద్దాం లేరా’ అన్నది. అప్పుడు బయల్దేరాను. నా ప్రశ్నకు ఏదోఒక సమాధానం రావాలి. అప్పట్లో నా ప్రశ్న తెలివితక్కువ ప్రశ్నలాగ వాళ్ళకనిపించిందిగానీ, పెద్దయ్యాక ఫిలాసఫీ చదువుకున్న తర్వాత అది తెలివితక్కువ ప్రశ్నలా నాకనిపించలేదు. ఎందుకంటే ఈనాడున్నది కొంతకాలానికి లేకపోవడం అన్నది ప్రకృతి ధర్మం. ఉనికిలోకి వచ్చిందేదైనా ఒకనాటికి అది దాని ఉనికిని కోల్పోతుంది` నాశనం కావచ్చు లేదా రూపం మార్చుకోవచ్చు.మా ఇంట్లోవాళ్ళతోనే గాక ఎవరితోనైనా సరే మాటల సందర్భంలో నేను ప్రశ్నలు వేస్తుండేవాణ్ణి. నా ప్రశ్నలకు చాలామంది సమాధానం చెప్పలేక ‘నువ్వు లాయర్ కోర్సు చదవరా’ అనేవాళ్ళు. దాదాపు 50ఏళ్ళ క్రితం- 1970లోనే ఆరుద్ర రాసిన ‘రాముడికి సీత ఏమవుతుంది?’ అనే పుస్తకం చదివాను. రాముడికి సీత ఏమవుతుందనే ప్రశ్న తెలివితక్కువ ప్రశ్న అనుకుంటారు. కానీ అది తెలివితక్కువ ప్రశ్న కాదు. ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల్లో దొరికే రామాయణాన్ని చూస్తే ఎవరైనా ఈ ప్రశ్న వేసుకోవాల్సిందే. ప్రశ్న అనేది లేకపోతే విజ్ఞానం లేదు. అభివృద్ధి లేదు. మానవ సమాజ పురోగమనం లేదు.

    1961 మార్చికి ప్రాథమిక పాఠశాలలో నా చదువు పూర్తయింది. మా వూళ్ళో హైస్కూల్ లేదు. 5 మైళ్ళ దూరంలోని పెదపవనిలో ఉంది. రోజూ 10 మైళ్ళు నడవాలి. అలా రోజూ 10 మైళ్ళు నడిచి చదువుకోవడానికి సిద్ధపడ్డాను. 10 రోజులు వెళ్ళాను. ఆ తర్వాత మా అమ్మా, నాన్న బలవంతంగా ఆపేశారు.

    ఈ విషయం తెలిసి స్థానిక కమ్యూనిస్టు పార్టీ నాయకుడు దామా చెంచయ్య నన్ను నెల్లూరు జిల్లాలోనే గూడూరు దగ్గర ఉన్న వాకాడు హైస్కూల్‌లో చేర్చాడు. హాస్టల్‌లో ఉచిత భోజన వసతులున్నాయి. అప్పట్లోనే దాదాపు 2000 మందికి పైగా విద్యార్థులుండేవారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల పేద విద్యార్థులకు చదువుకోవడానికి అదొక సదవకాశంగా ఉండేది. ఆ విద్యాసంస్థను స్థాపించింది నేదురుమల్లి బాలకృష్ణారెడ్డిగారు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి అప్పుడు లెక్కల టీచర్‌గా పనిచేసేవాడు. బాలకృష్ణారెడ్డిగారి అన్న కుమారుడే ఆయన. బాలకృష్ణారెడ్డి మరణానంతరం ఆ విద్యాసంస్థ ఆయన ఆధీనం కింద నడిచింది. బాలకృష్ణారెడ్డిగారు పెద్ద భూస్వామి అయినా పేదలపట్ల ఉదారస్వభావం కలిగినవారు. అప్పట్లో ఈ విద్యాసంస్థ లేకపోయినట్లయితే నా చదువు 5వ తరగతిలోనే ఆగిపోయి ఉండేది.

    వాకాడు హైస్కూల్‌లో నేను 8వ తరగతి చదివేటప్పుడు 1964లో మా వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా కావాలి కాలేజీ ప్రిన్సిపల్ శ్రీరాం వేంకట భుజంగరాయశర్మగారు వచ్చారు. ఆయన ఉపన్యాసం విన్న తర్వాత, కాలేజీ చదువంటూ చదివితే కావలి కాలేజీలోనే చదవాలని నిర్ణయించుకున్నాను. 1967 మార్చికి S.S.L.C. అయిపోయింది. ఎసఎసఎల్‌సి అంటే 11వ తరగతి. అప్పట్లో స్కూల్ ఫైనల్ అంటే ఇదే. కాలేజీలో డిగ్రీకి ముందు ఒక సంవత్సరం P.U.C. (ప్రి యూనివర్సిటి కోర్స్) ఉండేది. ఆ తర్వాత S.S.L.C., P.U.C.ని కలిపి 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ చేశారు.

    మళ్ళీ నా చదువు అగమ్యగోచరంగా తయారైంది. డబ్బులు పెట్టి చదివించే శక్తి మా యింట్లో లేదు. అప్పటికి సంవత్సరం క్రితమే వాకాడు విద్యాసంస్థ యాజమాన్యమే పక్కనే ఉన్న కూడలి అప్ప దగ్గర కాలేజీ పెట్టారు. ఎసఎసఎల్‌సిలో మంచి మార్కులు వచ్చినవాళ్ళకు ఉచిత హాస్టల్ వసతి ఇస్తామన్నారు. ఆ కాలేజీ పెట్టిన ప్రాంతానికి వారు ‘విద్యానగర’ అని పేరుపెట్టారు. అక్కడ ఉచితం అనే విషయం మా వాళ్ళకు చెబితే అక్కడే చదవమంటారు. అందుకే నేను చెప్పలేదు. అయితే అనుకోకుండా నాకో అవకాశం వచ్చింది. మా చిన్నాన్న బసవయ్యకు పల్లెలో ఉండి వ్యవసాయం చెయ్యడం ఇష్టం లేదు. కూలిపని చేసుకునైనా టౌన్‌లో ఉండాలని ఆయన కోరిక. అప్పటికే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా తిరుగుతుండేవాడు. ఆయన ఒక ప్రతిపాదన పెట్టాడు` ‘నేను పనిచేసుకుంటూ చెంచయ్యను చదివించుకుంటాను. మీరేమీ డబ్బులు పంపక్కర లేదు’ అని మా యింట్లో చెప్పాడు. వాళ్ళు ఒప్పుకున్నారు. అలా కావలికి చేరాం.

    కాలేజీకి వెళ్ళి అప్లికేషన్ తీసుకున్నాను. వెంకట్రావు అనే క్లర్క్‌ను అడిగాను. P.U.C.లో చేరాలి, అన్ని గ్రూపుల్లో తక్కువ ఫీజులున్న గ్రూపు ఏది’ అని. ఆయన వెంటనే ‘వరల్డ్ హిస్టరీ, అడ్వాన్స్‌డ్ తెలుగు తీసుకో’ అన్నారు. కళ్ళుమూసుకొని అదే రాశాను. రెండు రోజులు కాలేజీకి వెళ్ళానో లేదో ఆ సబ్జెక్టులపై నాకు అమితమైన ఆసక్తి కలిగింది. నిజానికి అదే ఫీజులున్న గ్రూపులు ఆర్ట్స్‌లో మరో రెండుమూడు గ్రూపులున్నాయి. కానీ ఆ క్లర్క్ హిస్టరీ, తెలుగు ఎందుకు చెప్పారో తెలియదుగాని, నాకు అవే ఇష్టమైన సబ్జెక్టులైపోయాయి. గ్రూపులో తెలుగు ఉంది కాబట్టి సెకండ్ లాంగ్వేజ్‌గా హిందీ తీసుకున్నాను.

    మీ సాహిత్య ప్రస్థానం ఎలా మొదలైంది?
    హిందీ లెక్చరర్ పి.వి.రత్నంగారు చాలా మంచివ్యక్తి. నేను ఆయనకు దగ్గరయ్యాను. నా ఆసక్తిని చూసి ఆయన P.U.C.లోనే నా చేత మహాదేవీ వర్మా, సుమిత్రానంద్ పంత్, సూర్యకాంత త్రిపాఠీ, నిరాలా వంటి కవుల కవిత్వాన్ని, ప్రేమ్‌చంద్ వంటి రచయితల నవలల్నీ చదివించారు. ప్రేమ్‌చంద్ రాసిన గోదాన్, గబిన్, నిర్మల, కర్మభూమి మొదలైన నవలల్ని చదివాను. హిందీలో కవితల్ని రాసి హిందీ సాహితీ సమావేశాల్లో చదివాను. వ్యాస రచనలోనూ, కవిత్వంలోనూ రెండవ, మూడవ బహుమతులు వచ్చాయి. హిందీలో గొప్ప సాహిత్యం చదివే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషించాను.

    మీ గురువులు ఎస్వీ భుజంగరాయ శర్మ, కేవీఆర్, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, మాదిరెడ్డి పఠాభిరామిరెడ్డి, గొట్టిముక్కల రామకృష్ణమూర్తి, (వేదిక్ నక్సలైట్), యనమండ్రు సుబ్రహ్మణ్య శాస్త్రిలతో అనుబంధం గురించి చెప్పండి.
    P.U.C.లో మాకు వచ్చిన తెలుగు అధ్యాపకులలో ఇద్దరు బాగా పాఠం చెప్పేవాళ్ళు. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు బాసుడు రాసిన ప్రతిమా నాటకాన్ని చెప్పారు. దాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదం చేసింది ఆయనే. సంస్కృత నాటక కర్తలలో బాసుడు అంటే ఆయనకు చాలా ఇష్టం. మాకూ ఆ ఇష్టాన్ని కలిగించారు. కాళిదాసు నాటకాలలో కవిత్వం బాగుంటుంది గాని, బాసుడి నాటకాలలో నాటక శిల్పం విలక్షణంగా ఉంటుంది. ప్రతిమ అంటే విగ్రహం. రాముడు అరణ్యవాసం వెళ్ళాక తండ్రి దశరథుడు చనిపోతాడు. ఆ విషయం రాముడికి తెలియదు. వనవాసం పూర్తయి తిరిగివచ్చాక అంటే పన్నెండేళ్ళ తర్వాత రాజమందిరమంతా కలియతిరుగుతాడు. ఒక గదిలో తాత ముత్తాతల విగ్రహాలతో బాటు తండ్రి విగ్రహం కూడా చూసి నిర్ఘాంతపోతాడు. చనిపోయినవాళ్ళ విగ్రహాలు గదా ఇక్కడుండేది, తన తండ్రి విగ్రహం ఇక్కడ ఎందుకుంది? అని ఆశ్చర్యపోతాడు. అలా తన తండ్రి మరణవార్త తెలుస్తుంది. ఇది బాసుడి కల్పన. అలాగే బాసుడిదే ‘ఊరు భంగం’ అని మరో నాటకం ఉంది. ఊరువులు అంటే తొడలు. కురుక్షేత్ర యుద్ధంలో భీముడు దుర్యోధనుని తొడలు విరగ్గొట్టడం సన్నివేశం. తొడలు విరిగి నేలకూలిన దుర్యోధనుడి దగ్గరకు అతని కుమారుడు చిన్నపిల్లవాడు వచ్చి, ‘నాన్నా, నీ తొడలపై కూర్చుంటా’నంటాడు. తొడలు విరిగి భరించలేని నొప్పితో ఉన్న దుర్యోధనుడు కుమారుడి కోరికను కాదనలేకపోతాడు. ‘ఆ మాట భీముణ్ణి అడుగు నాయనా’ అంటాడు. ప్రేక్షకుల గుండెలు పిండే సన్నివేశం అది. ఇలాంటి నాటకీయ సన్నివేశాన్ని కల్పించడంలో బాసుడు మహా దిట్ట.

      P.U.C.లో మాకు పాఠం చెప్పిన మరొక అధ్యాపకుడు గొట్టిముక్కల రామకృష్ణమూర్తి గారు. ‘మధురా విజయం’ అనే చారిత్రక నవలను పాఠం చెప్పారు. ఆయన శంకరాద్వైతి. వేదాంతోపన్యాసాలు ఇస్తుంటారు. అద్వైత వేదాంతాన్ని కూడా తార్కికంగా చెబుతారు. అద్వైతం ఏమోగాని, ఆయన తర్కం నాకు బోధపడింది.

      మరొక తెలుగు అధ్యాపకుడు వై.ఎస్.శాస్త్రిగారు. పూర్తిపేరు యనమండ్ర సుబ్రహ్మణ్యశాస్త్రి. క్లాసులో పాఠం చెప్పడం ఆయనకు మాత్రం రాదు. ఏదో కాలక్షేపం చేసేవారు. ఆయన ‘హిదూ ధర్మ ప్రచారములు’ అని ఒక సంస్థను స్థాపించి, హిందూ ధర్మ ప్రచారం చేసేవారు. భగవద్గీతలోని ఒక అధ్యాయంలోని శ్లోకాలను టీకా తాత్పర్యాలు రాసి చిన్నచిన్న పుస్తకాలుగా వేసి, వాటిని పాఠం చెప్పి, పరీక్షలు పెట్టి, మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు ఆధ్యాత్మిక పుస్తకాలను బహుమతులుగా ఇస్తుండేవారు. విషయం ఏదైనా నేర్చుకోవాలనే తపన నాకుండేది. రోజూ సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళేవాణ్ణి. నాకొక్కడికే పాఠం చెప్పేవారు. పరీక్ష తేదీని 10 రోజుల ముందే ప్రకటించారు. నూటికి నూరు మార్కులు వచ్చిన వారికి ఐదారు మంచి పుస్తకాలను బహుమతిగా ఇస్తామన్నారు. నాకు ఉత్కంఠ మొదలైంది. నూరు మార్కులు తెచ్చుకోవాలనే తపన ఎక్కువైంది.

      పరీక్ష రానేవచ్చింది. ఆ రోజుల్లోనే (1968) ఆయన ఆబ్జెక్టివ్ మెథడ్‌లో పరీక్షలు పెట్టేవారు. నూరు ప్రశ్నలు. ఒక్కోదానికి నాలుగు సమాధానాలు. సరైనదానిని టిక్ పెట్టాలి. అన్నీ సులభంగానే అనిపించాయి. 99 ప్రశ్నలకు సులభంగానే గుర్తుపెట్టాను. ఒక్క ప్రశ్న దగ్గర మాత్రం ఆగిపోయాను. ‘గీతా పారాయణం వల్ల ప్రయోజనం?’ అన్నది ఆ ప్రశ్న. 1. మోక్షం వస్తుంది, 2. శుభం కలుగుతుంది, 3. పుణ్యం వస్తుంది, 4. ఏ ప్రయోజనం లేదుఇవీ నాలుగు సమాధానాలు.

      నాకేమో ఏ ప్రయోజనం లేదని గుర్తుపెట్టాలని, కానీ ఇది గుర్తుపెడితే మార్కు పోతుందని భయం. ఆ ఒక్క ప్రశ్న కోసమే దాదాపు 15 నిమిషాలు కేటాయించాను. నూరు మార్కులు రావాలంటే ఇది గుర్తుపెట్టకూడదు. నచ్చిన సమాధానం గుర్తు పెడితే ఒక మార్కు పోతుంది. చివరకు మార్కు పోతే పోయిందని మనసు చంపుకోలేక ఏ ప్రయోజనం లేదనే దాన్నే గుర్తుపెట్టాను. మిగతావాళ్ళందరూ ఇది తప్ప, మిగతా మూడింటిలో ఏదోఒకటి గుర్తుపెట్టారు. నాలుగైదు రోజుల తర్వాత పేపర్లు దిద్ది ఇచ్చారు. పట్టలేని ఆనందం. నాకొక్కడికే నూటికి నూరు మార్కులు వచ్చాయి. నేను గుర్తుపెట్టిందే కరక్టయింది. పారాయణం అంటే అర్థమైనా కాకపోయినా చదవడం, అర్థం చేసుకోకుండా చదవడం వల్ల ఏ ప్రయోజనం లేదనే ఆయన అభిప్రాయం కూడా. అర్థం చేసుకొని భగవద్గీతను జీవితంలో అనుసరించాలని ఆయన ఉద్దేశం. ఒకరోజు సభ పెట్టి, చిన్న ఉపన్యాసం ఇచ్చి నాకు పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు. వాటిలోనే నా వ్యక్తిగత గ్రంథాలయం ప్రారంభమైంది. ఆయన చాదస్తుడు కాదని నాకర్థమైంది. హిందూ ధర్మం గురించే ప్రచారం చేసినా, ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఇచ్చేవారు.

      అందుకే మా ఇంకో అధ్యాపకుడు, ఆధ్యాత్మికవాది అయిన గొట్టుముక్కల రామకృష్ణమూర్తి గారు ఆయనకు ‘వేదిక్ నక్సలైట్’ అని పేరు పెట్టారు. నిజంగానే ఆయనకు నక్సలైట్లంటే గౌరవం ఉండేది. నాతోనే‘ఈ దేశానికి అలాంటివాళ్ళు అవసరం’ అని ఒకటి రెండుసార్లు అన్నారు. వై.ఎస్. శాస్త్రిగారు ఆయుర్వేద వైద్యుడు కూడా. ఇంట్లో స్వయంగా ఆయుర్వేద మందులు తయారుచేసేవారు. చాలామంది ఊహలో కూడా లేని ఇంకో విషయం ఏమిటంటే కొండపల్లి సీతారామయ్య గారికి ఆయన ఆయుర్వేద మందులు ఇచ్చేవారట. ఈ విషయం నాకు చాలా కాలం తర్వాత తెలిసింది, కె.వి.ఆర్. ద్వారా.

      ఒకరోజు లైబ్రరీకి వెళ్ళాను. ఎన్ని పుస్తకాలు తిరగేసినా, నాకు నచ్చిన పుస్తకం దొరకలేదు. అలా వెతుకుతూ ఉంటే సంజీవదేవ్ రాసిన ‘రస రేఖలు’ అనే పుస్తకం దొరికింది. అందులో చాలా వ్యాసాలున్నాయి. వాటిలో ‘ఏది ఉత్తమ కళ?’ అనేది ఒకటి. లైబ్రరీలోనే ఆ వ్యాసం చదివాను. నాకు బాగా నచ్చింది. ఆ పుస్తకాన్ని టికెట్‌పై తీసుకుని ఇంటికొచ్చాను. సెలవుల్లో దాన్ని ఎన్నిసార్లు చదివానో తెలియదు. దాన్ని గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. మనసులోనే మాట్లాడ్డం ప్రాక్టీస్ చేశాను. సెలవుల తర్వాత జరిగే మొదటి సాహితీ సమావేశంలోనే 20 నిమిషాల సేపు మాట్లాడాను. ఇంకో ఇద్దరు ముగ్గురు డిగ్రీ విద్యార్థులు కవితలు చదివారు. గొట్టిముక్కల రామకృష్ణమూర్తి గారు చివర్లో సమీక్ష చేశారు. 10 నిమిషాల సేపు నా ఉపన్యాసం గురించే మాట్లాడారు. ఒక P.U.C. విద్యార్థి ఇంత లోతైన విషయం గురించి తడబడకుండా మాట్లాడ్డం గొప్ప విషయం అన్నారు. నా జీవితంలో మొదటి ఉపన్యాసం అదే. నేను సాధించిన తొలి అవార్డు అది. ఇంతకూ నేను మాట్లాడింది సంజీవదేవ్ గారి వ్యాసంలోని విషయం అనేదాన్ని ఎవరూ ప్రస్తావించలేదు. ఆ ఉపన్యాసం ద్వారా నేను భుజంగరాయశర్మ గారి దృష్టిలో పడ్డాను. క్యాంపస్‌లో ఆయన ఎదురైనప్పుడు నవ్వుతూ పలకరించేవారు. నా జన్మ ధన్యమైందనుకున్నాను.

      P.U.C.లో తెలుగుకు ముగ్గురు అధ్యాపకులు వచ్చినా, హిస్టరీకి మాత్రం ఒక్కరే వచ్చారు. ఆయన పేరు మలిరెడ్డి పట్టాభిరామిరెడ్డి. ఎంపీఆర్ అనేవాళ్ళు. ఆయన వరల్డ్ హిస్టరీ చెప్పారు. పాఠం చెబుతుంటే మా దృష్టి పక్కకు మళ్ళేది కాదు. కంచు కంఠం. ఇంగ్లీషులో వాక్యాలకు వాక్యాలు అలా దొర్లుతూ వస్తుండేవి. ఆయన పాఠం వింటుంటే గోదావరి బ్రిడ్డిపైన గూడ్సు రైలు పోతున్నట్టుండేది. ఇక హిందీ లెక్చరర్ పి.వి.రత్నం గారి గురించి ముందే చెప్పాను. ఇంతమంది మంచి అధ్యాపకులు నాకు గురువులైనందుకు నా ఆనందానికి హద్దుండేది కాదు.

      ఇంకో వ్యక్తి గురించి చెప్పాలి. నేను P.U.C.లో ఉన్నప్పుడు ఆయన ప్రిన్సిపాల్. ఆయన పేరు కె.వి.గోపాలస్వామి. విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా చేసి రిటైరయ్యారు. కావలి కాలేజీ ‘జవహర్ భారతి’ యాజమాన్యం ఆయనను ప్రిన్సిపాల్‌గా తీసుకొచ్చింది. అప్పటికే నాకు ఆ పేరు పరిచయమైనదే. హిందీ ‘విశారద’లో ఒక తెలుగు పేపర్ ఉండేది. తెలుగు సిలబస్‌లో నాటకరంగంపై ఆయన రాసిన ఒక పుస్తకం అప్పటికే చదివున్నాను. P.U.C.లో ఉండగానే విశారద పరీక్షలు రాయవలసి వచ్చింది. హాల్‌టికెట్‌పైన గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలి. కావలిలో నాకెవరూ తెలియదు. ప్రిన్సిపాల్ దగ్గరకే వెళ్ళాను. నువ్వు ఈ కాలేజీ స్టూడెంట్‌వని నాకు రుజువెట్లా? అనడిగారు. ఎలా రుజువు చేసుకోవాలో నాకర్థం కాలేదు. గంటలో పరీక్ష. ఆయన సంతకం పెట్టకపోతే పరీక్షలు రాయలేను. ఆయన తప్ప నాకు అప్పుడు గత్యంతరం లేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చివరకు తెగించి ఇలా అన్నాను`“సార్… నేను ఈ కాలేజీ విద్యార్థిని. మీరు ఈ కాలేజీ ప్రిన్సిపాల్. మీరే కాదంటే నాకు దిక్కెవ్వరు సార్?” అని. అంతే. ఏమనుకున్నారో ఏమో, నా చేతిలోని హాల్ టికెట్ లాక్కొని సంతకం చేసి ఆఫీసు వెళ్ళి ముద్ర వేయించుకోపో అన్నారు. నాకు పోయిన ప్రాణం లేచొచ్చినట్టయింది. వెంటనే జెడ్‌పీ హైస్కూల్‌లో పరీక్ష హాల్లోకి వెళ్ళాను. అక్కడి ఇన్విజిలేటర్లు నా హాల్ టికెట్‌పై గోపాలస్వామి గారి సంతకం చూసి, ఎంతో మర్యాదతో బెంచీపై నా సీటు చూపించి కూర్చోబెట్టారు.

      కె.వి.గోపాలస్వామి గారు ఆంధ్రా యూనివర్సిటిలో ఉన్నప్పుడు ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి హేమాహేమీలకు నాటక రంగంలో గురువని నాకు తర్వాత తెలిసింది, ‘అంత గొప్ప వ్యక్తితోనా, నేనలా మాట్లాడింది’ అని. అప్పుడు నాకు భయం వేసింది. అలా P.U.C. ఒక సంవత్సరం ఆనందంగానే గడిచిపోయింది.

      1969 జూన్‌లో డిగ్రీకి అప్లికేషన్ పూర్తిచేసి ప్రిన్సిపాల్ దగ్గరికెళ్ళాను. గోపాలస్వామి గారు వెళ్ళిపోవడంతో P.U.C.లో మాకు హిస్టరీ పాఠం చెప్పిన పట్టాభిరామిరెడ్డి గారు ప్రిన్సిపాల్ అయ్యారు. ఆయనకు నాపై మంచి అభిప్రాయమే ఉంది. డిగ్రీలో కూడా నేను తెలుగు, హిస్టరీ, పాలిటిక్స్ (టిఎచ్‌పి) గ్రూపునే అప్లై చేశాను. అది చూసి ప్రిన్సిపాల్ గారు‘బి.కాం.కు మంచి భవిష్యత్తు ఉంది. నీలాంటి విద్యార్థి బి.కాం. చదవాలి. P.U.C.లో నీకు కామర్స్ లేకపోయినా బి.కాం.లో సీటిస్తాను. అందులో చేరు’ అన్నారు. నేను మెల్లగా‘నాకు కామర్స్‌పై ఆసక్తి లేదు సార’ అన్నాను. వెంటనే ఇంకేమీ మాట్లాడకుండా అప్లికేషన్‌పై సంతకం పెట్టారు. అలా డిగ్రీ మూడేళ్ళు ‘జవహర్ భారతి’లోనే పూర్తిచేశాను.

      యాదృచ్ఛిక సంఘటనలు ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి. డిగ్రీ ఫస్టియర్‌లో మొదటిరోజు కాలేజీకి వెళ్ళాను. మొదటి క్లాసుకే భుజంగరాయశర్మ వచ్చారు. జవహర్ భారతిలో P.U.C.లో చేరాక కూడా ఆయన పాఠం కోసం సంవత్సరం ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ కల డిగ్రీ ఫస్టియర్‌లోనే నెరవేరింది. అందరం లేచి నమస్కారం చేశాం. ఆయన ప్రతినమస్కారం చేసి కూర్చోండి అన్నారు. అంతా నిశ్శబ్దం. రెండు నిమిషాల తర్వాత ఆయన మాట్లాడారు. ‘మీకు నేను బాలవ్యాకరణం చెబుతాను’ అన్నారు. సాహిత్యం చెబుతారనుకుంటే వ్యాకరణమా? అని నిరాశ కలిగింది. మొదటి క్లాసులోనే ఆ నిరాశను పటాపంచలు చేశారు. ఆయన వ్యాకరణం చెప్పడమే మంచిదనిపించింది. సాహిత్యం ఎవరైనా చెబుతారు. కానీ వ్యాకరణాన్ని అందరూ బాగా చెప్పలేరు. భుజంగరాయ శర్మ గారు వ్యాకరణాన్ని కూడా రసవత్తరంగా చెబుతారు. తర్వాత్తర్వాత తెలిసింది`ఆంధ్రా యూనివర్సిటీలో ఆయన బీఏ ఆనర్స్ చదివేటప్పుడు ఆయనకు వ్యాకరణం చెప్పిన గురువు దువ్వూరి వేంకటరమణ శాస్త్రి గారని. బాలవ్యాకరణానికి ఆయన రాసిన వ్యాఖ్యానానికి ‘రమణీయం’ అని పేరు పెట్టడంలోనే, వ్యాకరణాన్ని కూడా రమణీయంగా చెప్పొచ్చన్న ఆయన ఉద్దేశం తెలుస్తోంది.

      సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పాలి. తిరుపతి ఎస్వీ యూనివర్సిటిలో నేను తెలుగు ఎం.ఏ.లో చేరాక, సెలవులకు కావలి వచ్చాక త్వరలో వెంకటరమణ శాస్త్రి గారు కావలికి వస్తున్నారని భుజంగరాయ శర్మ గారు నాతో అన్నారు. అయితే అప్పుడు నేనూ వస్తానని చెప్పాను. 1973 సెప్టెంబర్‌లో ఆయన రానేవచ్చారు. శర్మ గారు నాకు టెలిగ్రామ్ ఇచ్చారు. వెంటనే నేను కావలి వచ్చాను. శాస్త్రి గారు వారం రోజులుంటారని తెలిసింది. నాకు పండగే. అంత గొప్ప వ్యక్తితో వారం రోజులపాటు కలిసి మాట్లాడే అవకాశం లభించడం సాధారణంగా జరగదు. ఆ అవకాశం నాకు దొరికింది. దువ్వూరి వెంకటరమణ శాస్త్రిగారు, భుజంగరాయ శర్మగారు, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు, ఆ దిగ్గజాల పక్కన నేను`ఎం.ఏ. చదువుకున్న కుర్రాణ్ణి, శాస్త్రి గారు శర్మ గారికి నన్ను పరిచయం చేశారు. నన్ను పరీక్షించడానికేమో, వెంకటరమణ శాస్త్రి గారు నాకొక ప్రశ్న వేశారు. అప్పుడే ఇంద్రగంటి గారి ‘కాళిదాస కళా మందిరం’ అనే పుస్తకం వచ్చింది. “బాబూ, నీకొక ప్రశ్న, సమాధానం చెబుతావా?” అన్నారు. చెబుతానన్నాను. ‘కాళిదాస కళా మందిరం’ పుస్తకాన్ని ఎవరు రాశారు?’ అని ప్రశ్న. ‘నేనే రాశా’నన్నాను. శాస్త్రిగారు, శర్మగారు నిర్ఘాంతపోయారు. అంతగొప్ప వ్యక్తితో పరాచకాలా? అన్నట్టు శర్మగారు నావైపు చూశారు. ఇంద్రగంటి గారు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఆయనకు అసలు రహస్యం తెలుసు.

      నేను డిగ్రీ చదివేటప్పుడు ప్రతిరోజూ సాయంత్రం 2 గంటల పాటు ఇంద్రగంటి గారింటికి వెళ్ళేవాణ్ణి. ఆయన డిక్టేట్ చేస్తుంటే ఆ పుస్తకం మొత్తం నా చేత్తో నేనే రాశాను. ఈ విషయం తెలిశాక అందరూ పెద్దగా నవ్వారు. వెంకటరమణ శాస్త్రిగారు ` “ఓరి భడవా… మా సరసన ఉండదగినవాడవే” అన్నారు. వాళ్ళ సరసన కూర్చొని మాట్లాడే అర్హత సాధించినట్టయింది. ఆ వారం రోజులు నాది శ్రోత పాత్ర. ప్రధాన వక్త వెంకటరమణ శాస్త్రిగారే. ఎన్నో విషయాలు చెప్పారు. మచ్చుకు ఒక్కటి చెప్పాలని ఉంది.

      దువ్వూరి వెంకటరమణ శాస్త్రిగారు విద్యార్థి దశలో జరిగిన సంఘటన. ఒకసారి ఆ పాఠశాలకు డి.ఇ.వో. వచ్చారట. సరిగ్గా అప్పుడు వ్యాకరణం క్లాసు జరుగుతూ వుంది. డి.ఇ.వో.కు వ్యాకరణం అంటే చాలా ఆసక్తి. అందుకని వ్యాకరణంలో ఒక ప్రశ్న వేశారు. విద్యార్థులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సమాధానం ఎవరికీ తెలియదు. చివరకు వెంకటరమణ శాస్త్రిగారు లేచి సమాధానం చెప్పారట. నిజానికి ఆ ప్రశ్నకు సమాధానం. వాళ్ళ గురువు గారికి కూడా తెలియదు. విద్యార్థులెవరూ చెప్పకపోతే తాను చెప్పాల్సి వస్తుందని ఆయన భయపడుతున్నారట. ఎలాగో వెంకటరమణ శాస్త్రి అనే విద్యార్థి గట్టెక్కించాడు. దానికి సంతోషపడి తన జేబులో ఉన్న పెన్నును శాస్త్రి గారికి బహుమతిగా ఇచ్చారట. ఇదీ ఆ సన్నివేశం. అయిపోయింది గదా అని భుజంగరాయశర్మ గారి సంకేతంతో నేను ఇంద్రగంటి గారిని పిల్చుకు రావడానికి లేచాను. “బాబూ, కూర్చో” అన్నారు వెంకటరమణ శాస్త్రి గారు. ఇంట్లోకి వెళ్ళి ఆ పెన్నును తెచ్చి చూపించారు. ఆశ్చర్యపోవడం మా వంతయింది. ఎంత లేదనుకున్నా, ఆ పెన్ను వయసు దాదాపు 60 సంవత్సరాలుంటుంది.

      అప్పట్లో బాల్ పెన్నులు లేవు. ఇంకు పెన్నులే. ఆ గురు శిష్యుల చేతిలో ఆ పెన్ను షష్ఠిపూర్తి చేసుకున్నది. అది ఆ పెన్ను గొప్పదనమో! దాన్ని జాగ్రత్తగా వాడిన ఆ గురు శిష్యుల గొప్పదనమో!

      భుజంగరాయ శర్మగారు డిగ్రీలో మూడు సంవత్సరాలుగా మాకు వ్యాకరణమే చెప్పినా, ఇంట్లో మాత్రం నాకు ఎన్నో సాహిత్య విషయాలు చెప్పారు. అధ్యాపకుల ఇళ్ళకు వెళ్ళడం, వారితో మాట్లాడడం నాకు బాగా కలిసొచ్చిన అంశం. డిగ్రీలో హిస్టరీకి పట్టాభిరామిరెడ్డి గారు, వకుళాభరణం రామకృష్ణ గారు వచ్చేవారు. వారి ఇళ్ళకూ వెళ్ళేవాణ్ణి. అప్పట్లో అధ్యాపకులు కూడా కొంత టైం కేటాయించి మాట్లాడేవారు.

      రాజనీతి శాస్త్రానికి కె.వి.రమణారెడ్డి, కె.వి.కోటిలింగం గార్లు వచ్చేవారు. కోటిలింగం గారి క్లాసు సరదాగా గడిచిపోయేది. రమణారెడ్డి క్లాసు సీరియస్‌గా ఉండేది. ఆయన ఇంటికి వెళ్ళడానికి విద్యార్థులు సాహసించేవారు కాదు. డిగ్రీ సెకండియర్‌లో ఉండగా నేనొకసారి వెళ్ళాను. ఆయనతో మాట్లాడాలనే కోరిక బలంగా ఉండేది. 1970లో ఏర్పడిన విప్లవ రచయితల సంఘానికి ఆయన కార్యదర్శిగా ఉండేవారు. మాది కమ్యూనిస్టు కుటుంబం గనక నాకూ ఆ వాసనలుండేవి. అందుకే రమణారెడ్డి గారిని ఇంట్లో కలవాలనే కోరిక. వెళితే ఏం మాట్లాడాలి? అదొక మిలియన్ డాలర్‌ల ప్రశ్న. నేను వారింటికి వెళ్ళేసరికి ఆయన మంచంమీద పడుకొని చదువుకుంటున్నారు. నన్ను చూసి లేచివచ్చారు. “ఏం?” అని గద్దించినట్టు అన్నారు. ముందుగానే నేను లైబ్రరీకి వెళ్ళి పొలిటికల్ థాట్‌పైన ఒక పుస్తకం పేరును, రచయిత పేరునూ చూసి గుర్తుపెటుకుని పోయాను. ఆ పుస్తకం కావాలన్నాను. వెంటనే ఇంట్లోకి వెళ్ళి రెండు నిమిషాల్లో ఆ పుస్తకం తెచ్చిచ్చారు. “ఇంకేం?” అన్నారు. “ఏమీ లేదు సార” అని వచ్చేశాను. కాసేపు కూర్చోమని మాట్లాడతారేమోనని ఆశించిన నాకు ఆశాభంగమే అయింది. ఆయన అలా ఎందుకు ఉండేవారో తర్వాత నాకు తెలిసింది.

      1970కి ముందు ఆయన అభ్యుదయ రచయితల సంఘంలో కూడా నిజాయితీగా ఉండేవారు. విరసం ఏర్పడ్డాక దానికి కార్యదర్శి అయి ఆ బిజీ అలాగే కొనసాగింది. మీటింగుల కోసం ప్రయాణాలు, చదవడం, రాయడం ఆయన నిత్యకృత్యాలు. అందుకే టైం చాలేది కాదు. నేను లెక్చరర్ అయి, విరసం సభ్యుణ్ణి అయ్యాక మాత్రమే ఆయనకు దగ్గరయ్యాను. మొదట ‘అరుణతార’ పత్రిక సంపాదకత్వంలో నేను సహకరించేవాణ్ణి. అప్పుడు ప్రతిరోజూ సాయంత్రం ఆయనింటికి వెళ్ళేవాణ్ణి. వేసవిలో ఒక చివర నేను, మరో చివర ఆయన ఉండేవాళ్ళం. కనీసం 2 కి.మీ. దూరం నడిచి వెళ్ళేవాణ్ణి. అలా నాకు నడక బాగా అలవాటయింది.

      76 సంవత్సరాల వయసులో ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాను. డిగ్రీ చదివేటప్పుడు సైకిల్ తొక్కేవాణ్ణి గానీ, ఆ తర్వాత అదీ పోయింది. నా ఆరోగ్య రహస్యం నడకే అని చాలామంది మిత్రులు అంటుంటారు.

      మీ విద్యార్థి జీవితంలో ‘భుజంగరాయశర్మ-మహాప్రస్థానం’ విషయం గురించి చెప్పండి.
      డిగ్రీ ఫస్టియర్‌లో చేరాక భుజంగరాయ శర్మగారికి బాగా దగ్గరయ్యాను. అవకాశం ఉన్నప్పుడల్లా ఇంటికి వెళ్ళేవాణ్ణి. గంటసేపైనా ఆయన తీరిగ్గా మాట్లాడేవారు. ఒకరోజు ఆయన శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ పుస్తకం ఇచ్చి చదవమన్నారు. ఇంటికివెళ్ళి చదవడం మొదలుపెట్టాను. పూర్తయిందాకా వదల్లేదు. ఏకబిగిన చదివేశాను. మనసంతా అలజడి. మనసు అటూ ఇటూ పరుగెత్తినట్టయింది. ఆ రాత్రంతా అదే ఆలోచన. అంతవరకు నేను తెలుగు సాహిత్య చదవలేదు, టెక్ట్సు పుస్తకాలలోని పాఠాలు తప్ప. ఆ పాఠాల్లో ఇలాంటి సాహిత్యం ఎక్కడా తగల్లేదు. మహాప్రస్థానం గీతాలు చదివాక మనసంతా మండుతున్న కొలిమిలా అయింది. తెల్లారి దాకా కూర్చొని మహాప్రస్థానం గురించి రాయడం మొదలుపెట్టాను. ఒక పెద్ద వ్యాసం రాసేశాను. ఏం రాస్తున్నానో నాకే తెలియదు. అలా ఐదారు అరఠావు పేజీలు రాశాక గాని నా తపన చల్లారలేదు. తెలుగులో ఇంతగొప్ప సాహిత్యం ఉందా? అని ఆశ్చర్యపోయాను. అంతవరకు శ్రీశ్రీ సినిమా పాటల రచయితగా మాత్రమే తెలుసు. మహాప్రస్థానం చదవడంతోనే శ్రీశ్రీ విశ్వరూపం తెలిసింది. తెలుగు సాహిత్యంపైన ఆసక్తి మొదలైంది. ప్రతిరోజూ లైబ్రరీకి వెళ్ళి దొరికిన తెలుగు పుస్తకమల్లా తిరిగెయ్యడం ప్రారంభించాను. ఒకరోజు బసవరాజు అప్పారావు గారి గేయాలు దొరికాయి. వాటిలోని భావం నాకు నచ్చకపోయినా రచనా విధానం నన్నాకర్షించింది. వాటిలో కొన్ని కోయిల పాటలున్నాయి.
      “కోయిలా కోయిలా కూయబోకే
      గుండెలూ బద్దలూ సేయబోకే”
      అనే చరణాలు కనిపించాయి. అక్కడ చదవడం ఆపేసి ఆలోచించడం మొదలుపెట్టాను. కోయిలను కూయవద్దంటాడేమిటి? కోయిల కంఠం కమ్మగా ఉంటుంది గదా? కోయిల కూతతో గుండెలు బద్ధలవుతాయా? ఇలా ఆలోచనలు సాగాయి. ఇది నాకు నెగెటివ్ ఇన్‌స్పిరేషన్‌గా పనిచేసింది. కాగితం, కలం తీసుకొని రాయడం మొదలుపెట్టాను.
      “కోయిలా కోయిలా ఎక్కడున్నావే?
      నేడు నీ పాటలే మా బాటలవ్వాలి
      నీ అమర గానమే మా నాదమవ్వాలి” అంటూ ప్రారంభించి,
      “తీయ తీయని గానమీనాడు కొరగాదు
      అగ్ని కణములు చిమ్మ గొంతెత్తి పాడవే” అంటూ కొనసాగించాను. ఇది ఆ సంవత్సరం కళాశాల మ్యాగజైన్‌లో మొదటి కవితగా అచ్చయింది. తెలుగులో నా సాహితీ వ్యాసంగం ఇలా మొదలైంది.

        అప్పట్నుండి తరచుగా కవితలు రాయడం ప్రారంభించాను. నేను రాసిన ఒకటి రెండు కవితలు భుజంగరాయ శర్మ గారు క్లాసులో చదివి వినిపించారు కూడా. వారి ప్రోత్సాహం మరువలేనిది.

        డిగ్రీ ఫైనల్‌లో రాసిన ‘అరుణకాంతులు చిమ్మే దీపాన్ని’ కవిత నేపథ్యం చెప్పండి.
        మా జవహర్ భారతి కళాశాలలో అధ్యాపకుల మధ్య ఆధ్యాత్మిక వాదం నుండి మార్క్సిజం దాకా అన్ని సిద్ధాంతాలపై చర్చలు జరుగుతుండేవి. ముఖ్యంగా గొట్టిముక్కల రామకృష్ణమూర్తి గారు ‘నేను’ అంటే ఏమిటో తెలుసుకో అంటుండేవారు. నేను విద్యార్థిని గదా? ఆయనతో చర్చించే అవకాశం లేదని డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉండగా ‘నేను’ అంటే ఏమిటో నా దృష్టిలో వివరిస్తూ ఒక కవిత రాశాను. ఆ కవిత పేరు ‘నేను’.
        “అరుణకాంతులు చిమ్మే దీపాన్ని
        అధికంగా పెచ్చరిల్లుతున్న తాపాన్ని” అంటూ ప్రారంభించి,
        “సకల ప్రపంచానికీ దక్కవలసిన ధనాన్ని
        వ్యాకుల మానవాళికి చక్కని సాధనాన్ని
        విప్లవ యంత్రానికి
        వినియోగింపబడు ఇంధనాన్ని” అంటూ ముగించాను.
        ఈ కవిత ఆ సంవత్సరం (1971 – 72) కళాశాల మ్యాగజైన్‌లో అచ్చయింది. ఈ కవితను మొదట ‘తెలుగు సాహితి’ సమావేశంలో చదివాను. నాతోపాటు నా సహాధ్యాయులు కోటంరాజు, రాఘవులు కూడా కవితలు చదివారు. భుజంగరాయ శర్మ గారు చివర సమీక్షిస్తూ ఈ మూడు కవితలూ రేడియోలో ప్రసారం కాదగిన స్థాయిలో ఉన్నాయన్నారు. ఆ మాట ఇప్పటికీ మాకొక అవార్డులా అనిపించింది.

          1972లో బి.ఏ. పూర్తి కాగానే ఎస్వీ యూనివర్సిటీలో తెలుగు ఎం.ఏ.లో చేరాను. అక్కడున్న రెండేళ్ళలో కూడా అప్పుడప్పుడూ కవితలు రాసి సమ్మేళనాలలో చదివేవాణ్ణి. 1973 ఆగస్టు 15నాడు హైదరాబాద్ రేడియో కేంద్రం వాళ్ళు ప్రముఖ కవులతో నిర్వహించిన ఒక సమ్మేళనాన్ని ప్రసారం చేశారు. అప్పట్లో రేడియోలో ప్రసారమయ్యే కవి సమ్మేళన కవితల్ని చాలా ఆసక్తితో వినేవాణ్ణి. ఆ రేడియో కవి సమ్మేళనానికి శ్రీశ్రీ రాలేకపోవడం వల్ల ఆయన గేయాన్ని ఆరుద్ర చదివాడు.
          “ఓ మహాత్మా, ఓ మహర్షీ
          ఓ క్షమా పీయూష వర్షీ
          ఎక్కడయ్యా నీ అహింస?
          ఏడ నీ కరుణా రిరంసం?” అని సాగుతుంది ఆ గేయం. ఆ గేయాన్ని శ్రీశ్రీ ఎంత బాగా రాశాడో. ఆరుద్ర అంత బాగా చదివాడు. తర్వాత అది ఒక పత్రికలో అచ్చయింది. దాన్ని ఎన్నిసార్లు చదువుకున్నానో లెక్కలేదు. అది నాపై బలమైన ప్రభావం వేసింది.

          ఆ సమయంలోనే చిత్తూరు జిల్లాలోని పుత్తూరు తాలూకా రచయితల సంఘం వాళ్ళు పుత్తూరులో ఒక సాహిత్య సభను నిర్వహించబోతున్నట్టు తెలిసింది. దానికి శ్రీశ్రీ, త్రిపురనేని మధుసూదనరావులు వక్తలుగా వస్తున్నారనీ, సభానంతరం కవి సమ్మేళనం నిర్వహిస్తారనీ తెలిసింది. శ్రీశ్రీ గేయం లయలో నేనొక గేయాన్ని రాసుకుని వెళ్ళాను. ఆ కవి సమ్మేళనంలో చిట్టచివరి కవిత నాదే. అప్పట్లో నేను తిరుపతిలో ఉండడం వల్లా, నాస్తిక హేతువాద ప్రభావాల్లో ఉండడం వల్లా ఏడుకొండలవాడిపైన ఒక వ్యంగ్య కవిత రాశాను. వెంకటేశ్వరుణ్ణి సంభోదిస్తూ రాసిన గేయం అది. నేను చదువుతున్నంతసేపూ శ్రోతల్లో ఒకతను ఏదేదో అరుస్తూనే వున్నాడు. చివరి చరణాలు చదువుతుండగా అతను నా దగ్గరకొచ్చి, ఇంకాపవయ్యా చాలుని, అంటూ మైకు లాక్కున్నాడు. వేదికపై ఉన్న శ్రీశ్రీ దగ్గర వెళ్ళి “నిన్ను పుట్టించిందెవడు? దేవుడు గాదా?” అని ప్రశ్నించాడు. వెంటనే శ్రీశ్రీ`“వాడెవడు నన్ను పుట్టించడానికి? నేను పుట్టించాను వాణ్ణి” అన్నాడు. అంతటితో ఆగలేదు. దేవుడి పుట్టుక గురించీ, సమాజంలో దేవుడి పాత్ర గురించీ శ్రీశ్రీ, మధుసూదనరావులు మళ్ళీ మాట్లాడారు. మొదట జరిగిన సభ కంటే ఇది చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ సంఘటన గురించి ఇటీవల “ఒక వెంటాడే జ్ఞాపకం” పేరుతో వివరంగా ఒక వ్యాసం రాశాను. ఇది శ్రీశ్రీ గురించి సింగంపల్లి అశోక్ కుమార్ వేసిన నూరు పుస్తకాల సిరీస్‌లో అచ్చయింది.

          ఆ గేయం పేరు “వెంకటేశా, శ్రీనివాసా”. అది చాలా పెద్ద గేయం. అప్పట్లో విజయవాడ నుండి వెలువడే ‘చార్వాక’ పత్రికలో నా గేయాన్ని అచ్చు వేశారు. ఆ పత్రిక కాపీని చాలా కాలం పాటు దాచుకున్నాను. తర్వాత అది ఎలా పోయిందో తెలియదు. ఇప్పుడు నాకు గుర్తున్న చరణాలు కొన్ని మాత్రమే.
          “వెంకటేశా శ్రీనివాసా
          చాలులే ఇక నీ తమాషా
          పనికిరావని తేలిపోయెను
          ఏల నీపై భరోసా” అని ప్రారంభమయ్యే ఆ గేయంలో “బ్రహ్మ సత్యం జగన్మిథ్యని గీతలో నువు చెబితివి డబ్బుకోసం కొండపైన లార్జిస్కేలిండస్ట్రి పెడితివి” అంటూ సాగుతుంది. నా బాల్య, విద్యాభ్యాసంలో ఇవి కొన్ని సంఘటనలు మాత్రమే. విద్యార్థి జీవితం కవితా వ్యాసంగంతో పాటు కొనసాగడం వల్ల నా జీవితం మొత్తం సాహితీ వ్యాసంగంతో పెనవేసుకుపోయింది. విద్యార్థి దశలోనే కొడవటిగంటి కుటుంబరావు, త్రిపురనేని మధుసూదనరావు, కె.వి.రమణారెడ్డి గార్ల సాహితీ వ్యాసాలు చదవడంతో నా సాహిత్య వ్యాసంగం వ్యాసాల వైపు మళ్ళింది. ఎం.ఏ. అయిపోగానే 1974లోనే ‘జవహర్ భారతి’లో తెలుగు అధ్యాపకుడిగా చేరే అవకాశం రావడం కూడా నా సాహిత్య వ్యాసంగానికి చాలా ఉపకరించింది.

          తిరుపతి వెళ్ళేటప్పుడు మా ప్రాంతంలో స్థానిక కమ్యూనిస్టు నాయకుడు దామా చెంచయ్య గారు ఒకవ్యక్తిని కలవమని నాకొక ఉత్తరం ఇచ్చారు. ఆయన పేరు తన్నీరు కోటయ్య. ఆయనది మా పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాయే. యూనివర్సిటీలో ఎకనమిక్స్ డిపార్ట్‌మెంట్‌లో టైపిస్ట్‌గా చేస్తుండేవాడు. ఆయన్ను కలిసి ఉత్తరం ఇచ్చాను. నన్నుచూసి “ఇంత చిన్నపిల్లవాడు ఎం.ఏ.లో చేరుతున్నాడా?’ అని ఆశ్చర్యపోయాడట. నాకు తర్వాత చెప్పాడు. ఆరోజు మధ్యాన్నం సెలవుపెట్టి నన్ను తన రూముకు తీసుకెళ్ళాడు. మాటలు కలిశాయి. ఆయన విప్లవ రచయితల సంఘంలో సభ్యుడని తెలిసింది. ‘జ్యోతి’ కలం పేరుతో కవితలు రాసేవాడు. అదేరోజు సాయంత్రం నన్ను త్రిపురనేని మధుసూదనరావు గారింటికి తీసుకెళ్ళి పరిచయం చేశాడు. గంటసేపు ఆయనతో మాట్లాడాం. విప్లవ రచయితలతో నాకిది తొలి పరిచయం. మనసులో ఒక రకమైన సంతోషం. ఎం.ఏ. చదివిన రెండు సంవత్సరాల కాలంలో నాలుగైదుసార్లు నేను కోటయ్యను కలిసేవాణ్ణి. కనీసం వారంలో రెండుమూడు సార్లు మేమిద్దరం మధుసూదనరావుగార్ని కలిసేవాళ్ళం. ఆ పరియంతో నాకు విరసం గురించీ, విప్లవ రాజకీయాల గురించీ బాగా అవగాహన వచ్చింది.

          అప్పటికి విరసం పుట్టి మూడు సంవత్సరాలయింది. ఎం.ఏ.లో ఉండగానే కొడవటిగంటి కుటుంబరావు వ్యాస సంకలనం ‘కళలుశాస్త్రీయ విజ్ఞానం’ అనేదాన్ని చదివాను. దాంతో మరింత ఆసక్తి, అవగాహన పెరిగాయి. తిరుపతి పరిసరాల్లో విరసం మీటింగులు జరిగితే కోటయ్యతో పాటు నేనూ వెళ్ళేవాణ్ణి. కోటయ్య దగ్గరున్న విరసం పుస్తకాల్ని అప్పుడప్పుడూ తీసుకెళ్ళి చదివేవాణ్ణి. మా క్లాసు విద్యార్థులలో సాకం నాగరాజు అనే అతను ఎం.ఏ.లో చేరిన నెలరోజుల్లోనే పరిచయమయ్యాడు. అప్పటికే అతను కూడా విరసం సభ్యుడై వున్నాడు. వీళ్ళద్వారా చిత్తూరు జిల్లాకు చెందిన మరో విరసం సభ్యుడు ‘సంవర్త’ కూడా పరిచయమయ్యాడు. అలా విరసం సభ్యులతో పరిచయం గాఢ స్నేహంగా మారింది. నేను విరసం సభ్యుణ్ణి కాకపోయినా, విరసం విషయాలు నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండేవి. 1973లో అనుకుంటాను నాగరాజు నన్ను గుంటూరు విరసం సభలకు రమ్మన్నాడు. కానీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల పోలేకపోయాను.

          యూనివర్సిటీలో తెలుగుశాఖ అధ్యక్షుడిగా ప్రొఫెసర్ జి.ఎన్.రెడ్డి గారు ఉండేవారు. ఆయన మాకు భాషాశాస్త్రం చెప్పేవారు. పి.సి.నరసింహారెడ్డి అనే మరో ప్రొఫెసర్ కూడా భాషాశాస్త్రం బోధించేవారు. ఆయన్ను మేం పి.సి.ఎన్. అని చెప్పుకునేవాళ్ళం. ఆయన భాషాశాస్త్రం చెప్పే విధానం నాకు బాగా నచ్చింది. ఆయన పాఠం ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉండేది. నోట్సు ఇచ్చేవాడు కాదు. పాఠం చెప్పేటప్పుడు వింటూ పాయింట్సు నోట్ చేసుకుంటూ, రిఫరెన్సు పుస్తకాలు చదువుకొని మేము నోట్సు తయారుచేసుకోవాలి. అది నాకిష్టమైన పనే. కానీ, చాలామందికి అది ఇష్టం లేదు. నేను మాత్రం ఎప్పటికప్పుడు అలా నోట్సు తయారుచేసుకునేవాణ్ణి. అప్పట్లో జెరాక్స్ లేదు. నాకు నచ్చిన అధ్యాపకుడు పి.సి.ఎన్. అయితే, ఆయనకు నచ్చిన విద్యార్థివి నువ్వే కదా మా మిత్రులు అనేవాళ్ళు. పి.జి.లెవెల్‌లో కూడా చాలామంది విద్యార్థులు నోట్సు నోట్సును ఆశించేవాళ్ళు. కొందరు ప్రొఫెసర్లు కూడా నోట్సు ఇచ్చేవాళ్ళు.

          ఎం.ఏ. సెకండియర్‌లో నిర్మల మేడం గారు ద్రవిడియన్ ఫిలాలజీ చెప్పారు. పాఠం చెప్పేటప్పుడు మధ్యలో ప్రశ్నలు అడిగేవారు. ఎవరూ సమాధానం చెప్పేవాళ్ళుకాదు. నేనూ, ఇంకో ఒకరిద్దరు మాత్రమే చెప్పేవాళ్ళం. ప్రశ్నలు అడగడమే ఆలస్యం, టక్కున లేచి నిలబడతా రండి అని మిగతావాళ్ళు అనుకొనేవాళ్ళు. “పెద్ద హీరోల్లాగా లేస్తారండి, వాళ్ళకు మాత్రమే సమాధానాలు తెలిసినట్టు’ అని కూడా గుసగుసలాడుకొనేవాళ్ళు. ఈ మాటలు విని మేం కూడా ప్రతిసారి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండేవాళ్ళం. అప్పుడు మేడం` ‘కొందరు తెలియక చెప్పరు. కొందరు తెలిసీ చెప్పరు’ అనేవారు. ఆ మాట అన్నాక కూడా చెప్పకపోతే బాగుండదని నేను లేచి నిలబడి చెప్పేవాణ్ణి. పాఠంలో భాగంగా ఆమె చెప్పే ప్రతి చిన్న విషయం కూడా నేను నోట్ చేసుకునేవాణ్ణి. అదేరోజు సాయంత్రం కూర్చొని వ్యాసం తయారుచేసుకునేవాణ్ణి. అప్పుడే పి.పి.ఎన్.గారి భార్య ప్రయివేటుగా తెలుగు ఎం.ఏ. చదువుతుండేవారు. మేం ఫైనలియర్‌లో ఉండగా ఆమె ప్రీవియస్ మొదటి సంవత్సరం భాషాశాస్త్రం, రెండో సంవత్సరం ఫిలాలజీ నేను తయారుచేసిన నోట్సు పి.సి.ఎన్.గా రు తీసుకుని ఆమెకిచ్చేవారు.

          పరీక్షలకు నెలరోజుల ముందునుంచే యూనివర్సిటీ వ్యాప్తంగా ఉన్న ప్రయివేటు క్యాండిడేట్స్ చాలామంది తిరుపతికి వచ్చి చదువుకుంటుండేవాళ్ళు. భాషాశాస్త్రం, ఫిలాలజీ సబ్జెక్ట్సులో వాళ్ళకు చాలా సందేహాలుండేవి. అవి చెప్పించుకోవడానికి డిపార్ట్‌మెంట్‌లో పి.సి.ఎన్. గారిని కలిసేవారు. ఆయన హాస్టల్‌లో ఉన్న నా దగ్గరకు పంపించేవారు. వాళ్ళకు చెప్పడం ద్వారా నాకూ బాగా గుర్తుండేది.

          మాకు సాహిత్యాన్ని తుమ్మపూడి కోటేశ్వరరావుగారూ, మద్దూరి సుబ్బారెడ్డి గారూ, నాగయ్య గారూ చెప్పేవారు. తుమ్మపూడి కోటేశ్వరరావు గారు ప్రాచీన సాహిత్యాన్ని బాగా అభిమానిస్తారు. సుబ్బారెడ్డి గారికి ఆధునిక సాహిత్యం అంటే ఇష్టం. సిలబస్‌లో వాళ్ళ అభిమాన సబ్జెక్టుల్నే బోధించేవాళ్ళు. నాగయ్య గారు సాహిత్య చరిత్ర చెప్పేవారు. కోటేశ్వరరావు గారికి ఒక అలవాటు ఉండేది` తెలివైన విద్యార్థుల్ని ఒకరిద్దరిని ఎంచుకుని తన అనుయాయులుగా మార్చుకోవడం. అలా మా సీనియర్స్‌లో బ్రహ్మానందం అనే అతను ఆయనకు సన్నిహితంగా ఉండేవాడు. మా క్లాసు విద్యార్థుల్లో నేను అలా సన్నిహితంగా అవుతానని ఆయన ఆశించారు. నేను మార్క్సిస్టు భావజాల ప్రభావంలో ఉండేవాణ్ణి. కోటేశ్వరరావు గారు మంచి అధ్యాపకుడుగా నాకు నచ్చాడుగాని, ఆయన భావజాలం ఆధ్యాత్మికం కాబట్టి నేను ఆయనకు దగ్గర కాలేకపోయాను. ఎం.ఏ.లో చేరాక, 3, 4 నెలలు చూసి, ఒకరోజు నన్ను తన రూముకి పిలిపించుకున్నారు. “ఏమోయ్… విప్లవం ద్వారానే సమాజం మారుతుందంటావు, అంతేనా?” అని అడిగారు. నేను నీళ్ళు నమలకుండా ‘అవును సార’ అన్నాను. అంతే, అప్పట్నుండి మళ్ళీ నా జోలికి రాలేదు.

          ఇక బాల, ఫ్రౌఢ వ్యాకరణాలను జాస్తి సూర్యనారాయణ గారు చెప్పారు. ఆయనకు సబ్జెక్టు బాగానే తెలుసు. సంస్కృతంలో కూడా మంచి అభినివేశం ఉంది. అయితే పాఠం ఎలా చెప్పాలో తెలియదు. నాకు బీ.ఏ.లో భుజంగరాయశర్మ గారి వల్ల వ్యాకరణంలో మంచి పునాది పడింది కాబట్టి ఆయన ఎలా చెప్పినా నాకు ఇబ్బంది ఉండేది కాదు. ఆయనలో కొంత అమాయకత్వం కూడా ఉండేది. మిగతా ప్రొఫెసర్‌లతో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి కాదు. కొందరైతే ఆయన్ను పిచ్చోడి కింద జమకట్టేవారు.

          ఒకసారి యూనివర్సిటీలో విద్యార్థి ఎన్నికలు జరిగాయి. ప్రతి క్లాస్ నుండి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. అక్కడ రాజకీయ చైతన్యంతో కన్న, కులతత్వంతో విద్యార్థి సంఘాలుండేవి. మా క్లాసు విద్యార్థులు నన్ను క్లాసు ప్రతినిధిగా పోటీచెయ్యమన్నారు. నేను పోటీచేస్తే కచ్చితంగా గెలుస్తాను. కానీ నాకు ఆసక్తి లేదు. విప్లవ విద్యార్థి సంఘం ఏదీ లేదుగాని, అక్కడక్కడా వేళ్ళమీద లెక్కబెట్టినట్టుగా కొందరు విప్లవాభిమానులైన విద్యార్థులుండేవారు. వారు మా క్లాసు ప్రతినిధిగా సాకం నాగరాజును నిలబెట్టాలని అనుకుంటున్నారు. రెడ్డి సంఘం తరఫున ఒకతను పోటీచేశాడు. ఇద్దరికీ 16 16 ఓట్లు వచ్చాయి. డ్రా అయింది. చివరకు టాస్ వేశారు. నాగరాజు గెలిచాడు. టాస్ రెప్రజెంటేటివ్ అని కొందరు సరదాగా అంటుండేవారు.

          మా క్లాస్‌లో నాగరాజు, నేను విప్లవాభిమానులం. లా కాలేజీ విద్యార్థి శివారెడ్డి మాకంటే వయసులో రెండేళ్ళు పెద్ద. ఆయనకు విప్లవ రాజకీయాలపైన మా కంటే మంచి అవగాహన ఉండేది. ఇప్పుడు వై.సి.పి. నాయకుడు భూమన కరుణాకరరెడ్డి కూడా అప్పుడు విద్యార్థి` బహుశా ఇంటర్మీడియట్ చదువుతుండేవాడనుకుంటాను. అతను అందరికంటే మిలిటెంట్‌గా ఉండేవాడు. అతని అన్న భూమన్ విరసం సభ్యుడు. ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్. మొత్తం మీద యూనివర్సిటీలో 15, 20 మంది విప్లవాభిమానులైన విద్యార్థుల్ని శివారెడ్డి, నాగరాజు కూడగట్టారు. ఒకరోజు శివారెడ్డి, మరో ఇద్దరు విద్యార్థులు త్రిపురనేని మధుసూదనరావు గారి దగ్గరకు వెళ్ళారు. యూనివర్సిటీలో విప్లవ విద్యార్థి సంఘాన్ని స్థాపించాలి, మంచి పేరు పెట్టండని ఆయన్ను అడిగారు. పేరు ఎలా ఉండాలో సూచన ఇస్తూ, శివారెడ్డి రాడికల్‌గా ఉండాలన్నాడట. అంతే, మధుసూదనరావు గారు ‘అయితే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనే పేరు పెట్టుకోండి’ అన్నారట.

          అలా తిరుపతిలో 1973లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్.ఎస్.యు.) ఏర్పడింది. అప్పటికి ఇది ఏ పార్టీకీ అనుబంధ సంస్థ కాదు. స్థానికంగా ఒక విద్యార్థి సంఘం మాత్రమే. అప్పటికి 1967 నుండి బెంగాల్‌లో మొదలైన నక్సల్బరీ పోరాటం, దాని ప్రభావంతో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళ పోరాటం ఉధృతంగా జరిగి, కొంత చల్లారిపోయి ఉన్నాయి. ఆ ప్రభావంతో 1969లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్`లెనినిస్ట్) ఏర్పడింది. దాన్నే C.P.I.(M.L.) అంటాం. 1972 నాటికి అందులో కొన్ని విభేదాలు ఏర్పడి చీలికల దిశగా పోతున్నది. బహుశా 1974లో పీపుల్స్‌వార్ పార్టీ ఏర్పడింది. దాని నాయకుడు కొండపల్లి సీతారామయ్య ప్రజాసంఘాలకు ప్రాధాన్యం ఇచ్చి, తిరుపతిలో స్థానికంగా ఏర్పడి ఉన్న R.S.U.ను పార్టీ విద్యార్థి యూనియన్‌గా, రాష్ట్రవ్యాప్త సంస్థగా మార్చారు. అప్పుడే రాడికల్ యువజన సంఘం కూడా ఏర్పడింది. రాడికల్ విద్యార్థి, యువజన సంఘాలలోని రాడికల్స్ కొంతకాలం పాటు రాజకీయ చైతన్యంతో ఒక వెలుగు వెలిగిన చరిత్ర అందరికీ తెలిసిందే.

          శాఖాచంక్రమణం అనుకోకపోతే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. అది రాడికల్స్‌కు సంబంధించిందే. పీపుల్స్‌వార్ పార్టీ, రాడికల్స్ సంఘాలు ఏర్పడిన కొత్తల్లో ఒకరోజు రాత్రిపూట రాడికల్స్ పీపుల్స్‌వార్ పార్టీ వాల్ పోస్టర్‌లు గోడలకు అంటిస్తున్నారట. పోలీసులు వచ్చి ‘ఎవరు మీరు?’ అని అడిగారట. ‘మేం పీపుల్స్‌వార్ పార్టీ వాళ్ళం సార’ అన్నారట. ‘అవునా, అయితే వేసుకోండి. మేమింకా రాడికల్స్ అనుకున్నాం లే’ అని వెళ్ళిపోయాట. అంటే రాడికల్స్ అప్పటికే ప్రజల్లోకెళ్ళి బాగా పనిచేస్తున్నార. పార్టీ పేరు ఇంకా ప్రచారంలోకి రాలేదు.

          మళ్ళీ మనం యూనివర్సిటీలోకి వద్దాం. 1973. తిరుపతిలో స్థానికంగా రాడికల్ విద్యార్థి సంఘం ఏర్పడిన సందర్భం. అందులో సభ్యులు 20, 30మందికన్నా ఎక్కువ లేరు. నేనూ, సాకం నాగరాజు కూడా అందులో సభ్యులమే.

          మాకు ఒక ఆలోచన వచ్చిందివరవరరావు, చెరబండరాజు, త్రిపురనేని మధుసూదనరావులతో తెలుగుశాక ఆధ్వర్యంలో ఒక సాహితీ సభ నిర్వహిద్దామని. జి.ఎన్.రెడ్డి గారిని అడిగాం. ఆయన ఒప్పుకోలేదు. సరే, ప్రత్యామ్నాయంగా కె.వి.ఆర్.ని ప్రతిపాదించాం. దీనికి అర్ధమనస్కకంగానే అంగీకరించారు. సభ జరిగింది. ఆ తర్వాత నెలరోజులకు జి.ఎన్.రెడ్డి గారు నెలరోజుల పాటు విదేశాలకు వెళ్ళారు. అప్పుడు తెలుగు శాఖకు తాత్కాలిక అధిపతిగా జాస్తి సూర్యనారాయణగారు. మేమిద్దరం ఆయన దగ్గరికి వెళ్ళి , ఆయన్ని కాస్త పొగిడి, వరవరరావు, చెరబండరాజు, జ్వాలాముఖి, త్రిపురనేని మధుసూదనరావు గార్లను పిలుస్తున్నాం, మీరు ఆ సభకు అధ్యక్షత వహించాలి, మీరు తప్ప ఆ పని ఇంకెవ్వరూ చెయ్యలేరని చెప్పాం. ఆయన ఉబ్బిపోయాడు. అంగీకరించాడు. సభ జరిగింది.

          అంతటితో ఆగలేదు. రెండురోజుల పాటుపద్మావతీ మహిళా కళాశాలలోనూ, ఓరియంటల్ కళాశాలలోనూ, గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలోనూ, కోనేటి కట్ట వద్ద ఒక బహిరంగ సభ నిర్వహించాం. తిరుపతి మొత్తం విప్లవ భావాలతో దుమ్ము లేపేశారు. అదే అదునుగా భావించి అధిక ధరలకు వ్యతిరేకంగా పెద్ద ఊరేగింపు జరిపాం. కరపత్రాలను ఊరంతా పంచాం. పెద్దయెత్తున జనం కదిలొచ్చారు. మంచి స్ఫూర్తితో, ఉద్వేగంతో ఆ ప్రదర్శన జరిగింది. ఆ రోజుల్లో ‘అధిక ధరలు’ పెద్ద సమస్యగా ఉన్నా, ఏ రాజకీయ పార్టీవాళ్ళు అలాంటి నిరసన ప్రదర్శన జరపలేదు. అందుకే ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. మేం యూనివర్సిటీలో ఉన్న రెండేళ్ళలో ఇలాంటి కార్యక్రమాలతో స్థానిక రాడికల్ విద్యార్థి సంఘానికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పరిణామాలు పైన వివరించాను.

          కావలిలో ‘హేతువాద మిత్రులు’ గురించి చెప్తారా?
          1974లో ఎస్వీ యూనివర్సిటీలో ఎం.ఏ. అయిపోగానే కావలికి వచ్చేశాను. ఎం.ఏ. ఫలితాలు వచ్చాయి. ఫస్ట్ క్లాస్ వచ్చింది గాని, మార్కుల శాతం 62.25`సెకండ్ ర్యాంక్. నా మిత్రులు చాలామంది ‘నీకు అన్యాయం జరిగింది’ అన్నారు. నేను పట్టించుకోలేదు. ఆ వెంటనే కావలి ‘జవహర్ భారతి’ కళాశాలలో తెలుగు లెక్చరర్ పోస్టుకు ప్రకటన ఇచ్చారు. అప్లై చేశాను. ఇంటర్వ్యూ జరిగింది. అక్కడ ఇంటర్వ్యూ మూడు దశలలో జరుగుతుంది. మొదట ఐదు నిమిషాలసేపు వారిచ్చిన అంశంపై ఉపన్యాసం ఇవ్వాలి. దీనికి డిపార్ట్‌మెంట్ హెడ్స్ అందరూ మార్కులు వేస్తారు. విద్యార్థులు శ్రోతలు. అందులో ముగ్గురిని ఎన్నిక చేస్తారు. ఆ ఇంటర్వ్యూకి 25మంది వచ్చారు. 1974 సెప్టెంబర్. మొదటి ఇంటర్వ్యూలో ఎన్నికైన ముగ్గురిలో నేనున్నాను. తర్వాత రెండో ఇంటర్వ్యూ. తెలుగు శాఖ అధ్యాపకులందరూ సబ్జెక్ట్‌పై ప్రశ్నలు వేస్తారు. ఇది గంటసేపు జరుగుతుంది. ఈ ముగ్గురినీ మరో ఇంటర్వ్యూకు పంపిస్తారు. ఇది యాజమాన్య నిర్వహించే ఇంటర్వ్యూ. మొత్తం మీద నేను ఎన్నికయ్యాను. మర్నాడే ఉద్యోగంలో చేరాను. అప్పుడు అదొక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్. నిన్నటిదాకా విద్యార్థిని. ఈ రోజు లెక్చరర్‌ని.

          ఆ ఇంటర్వ్యూలో మొదట ఉపన్యాసానికి ఇచ్చిన అంశం‘నీకు నచ్చిన కవి’. నాకు నచ్చిన కవి శ్రీశ్రీ అయినా, నేను పోతన గురించి మాట్లాడాను. ప్రసంగాలన్నీ అయిపోయాక ఒకతను నన్ను“మీరు దేనిగురించి మాట్లాడారు?” అని అడిగాడు. పోతన గురించి అని చెప్పాను. పోతన గురించి నేను మాట్లాండితర్వాత నువ్వు మాట్లాడ్డం అనవసరం అన్నాడు. నాకు భయం, ఆశ్చర్యం కలిగాయి. రెండో ఇంటర్వ్యూలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు`“పోతన గురించి ఎందుకు మాట్లాడావు? నీకు శ్రీశ్రీ అంటే ఇష్టం గదా?” అని అడిగారు. నేను పాఠం చెప్పాల్సిన సిలబస్‌లో అంతా ప్రాచీన సాహిత్యమే గదా, అది నేను ఎలా చెబుతానో తెలియాలి గదా సార్… అన్నాను. ఆయన తృప్తిగా నవ్వారు.

          తొలిరోజు క్లాసుకు వెళ్ళాను. ఆసక్తికరంగా పాఠం చెప్పాలని బాగా ప్రిపేర్ అయ్యాను. అది ఇంటర్మీడియట్ క్లాసు. ఒక్కో సెక్షన్‌లో 120మంది ఉండేవారు. ఎక్కువమంది ఆబ్సెంట్ కూడా అయ్యేవారు కాదు. బహిరంగసభలో మాట్లాడుతున్నట్టే అనిపించింది. అందులో అది మహా గొప్ప క్లాసని నాకు ముందే తెలుసు. ఎలాగో బయటపడ్డాను.

          1975 జూన్ 26 అర్ధరాత్రి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ప్రతిపక్ష పార్టీలవాళ్ళనూ, విరసం సభ్యుల్నీ చాలామందిని అరెస్టు చేశారు. కె.వి.రమణారెడ్డి గారు అరెస్టు అయ్యారు. జూన్ 29 నా వివాహం. ఆదర్శ వివాహం చేసుకోవాలని ముందే అనుకున్నాను. త్రిపురనేని మధుసూదనరావు గారిని ఆహ్వానించాను. స్థానికంగా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు దామా చెంచయ్య, శివరామ సుబ్బయ్య, జనతాదళ్ పార్టీ స్థానిక నాయకులు, మా ఇంగ్లిష్ లెక్చరర్ మధురాంతకం మాధవరావు గారు మాట్లాడారు. అధ్యక్షుడు మా హిస్టరీ లెక్చరర్ వకుళాభరణం రామకృష్ణగారు.

          1975 జనవరిలో అనంతపురం విరసం సభల్లో నేను విరసం సభ్యత్వం తీసుకొని ఉన్నాను. అయితే ఎమర్జెన్సీలో నన్ను అరెస్టు చెయ్యలేదు. నా పెళ్ళికి కమ్యూనిస్టు పార్టీ నాయకులు, విరసం నాయకులు త్రిపురనేని గారు రావడంతో నేను పోలీసుల దృష్టిలో పడ్డాను. ఆరునెలల పాటు నన్ను మానసికంగా వేధించారు. నేను కాలేజీకి పోయినప్పుడు ఇంటి చుట్టుపక్కలవాళ్ళను నా గురించి అడిగేవాళ్ళు. ఇంటికొచ్చినప్పుడు కాలేజీకి వెళ్ళి ఎంక్వయిరీ చేసేవాళ్ళు. ‘నీకోసం పోలీసులొచ్చారు. జాగ్రత్తంగా ఉండు’ అని అందరూ నన్ను హెచ్చరించేవాళ్ళు. ఆ తర్వాత ఒకరోజు డీఎస్పీ పిలిపించాడు. వెళ్ళాను. రెండు గంటల సేపు ఒకటే ప్రశ్న అడిగాడు. ‘కొండపల్లి సీతారామయ్య గారు మీకు తెలుసా?’ అని. ‘పేరు తెలుసు గాని, మనిషిని చూడలేదు’ అన్నాను. ‘మీకాయన ఇష్టమైన నాయకుడు గదా’ అనీ అడిగాడు. ‘ఆయన గురించి నాకేమీ తెలియకుండా ఇష్టమా? కాదా? అని ఎలా చెప్పగలను?’ అని ఎదురుప్రశ్న వేశాను. ‘నాకు మార్క్సిజం అంటే అభిమానం, విరసం సభ్యుణ్ణి’ అని చెప్పాను. ఇక వదిలేశాడు. అప్పట్నుంచి నా కోసం పోలీసులు రాలేదు.

          ఎమర్జెన్సీ పెట్టి ఆరు నెలలు దాటింది. అదెప్పుడు ఎత్తేస్తారో తెలియని స్థితి ఏర్పడింది. విరసంలో నాకు తెలిసినవాళ్ళెవరూ బయట లేరు. దాదాపు 36మంది దాకా అరెస్టయి జైల్లో ఉన్నారు. విరసం సభ్యుడిగా నేనేం చెయ్యాలో అర్థం కాలేదు. నెల్లూరు జిల్లాలో ‘దీపశిఖ’ అనే కలం పేరుతో ఒక విరసం సభ్యుడున్నాడని కె.వి.ఆర్. గారి ద్వారా విని ఉన్నాను. అయితే అతని ఆచూకీ నాకు తెలియదు. ఏదో ఒక యాక్టివిటీ చెయ్యాలని ఉంది. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియడం లేదు. 1976లో శ్రీలంకకు చెందిన డా.కోవూర్ ఆంధ్రప్రదేశ్‌లో చాలాచోట్ల మీటింగులు పెడుతూ, నాస్తికత్వాన్ని ప్రచారం చేస్తున్నట్టు పత్రికల్లో చూశాను. సత్యసాయిబాబాను సవాల్ చేస్తున్నట్టు కూడా పత్రికల ద్వారా తెలిసింది. నాకో ఆలోచన వచ్చింది. ఏదో ఒక స్థాయిలో హేతువాద, నాస్తికవాద కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనిపించింది. ఒకరోజు మా కళాశాలలో సివిక్స్ లెక్చరర్ ఎన్.వి.రమణయ్య గారిని కలిసి ఈ విషయం మాట్లాడాను. మనం కొంతమందిమి కలిసి ఈ కార్యక్రమాలు చేద్దామన్నారు. ఆయనే గంగారాం అని ఒకతన్ని సూచించారు. నా దృష్టిలో ఇంకిద్దరున్నారు`కల్లయ్య, కోటిరెడ్డి. ఒకరోజు సాయంత్రం మేం ఐయిదుగురం కలిశాం. ‘హేతువాద మిత్రులు’ పేరుతో కొన్ని కార్యక్రమాలు చెయ్యాలని నిర్ణయించుకున్నాం. మొదట అయిదు అనువాద వ్యాసాలతో ‘మూఢ నమ్మకాలు – శాస్త్రీయ దృక్పథం’ అని ఒక చిన్న పుస్తకాన్ని 1976 డిసెంబర్‌లో ప్రచురించాం. అందులో ఈ వ్యాసాలున్నాయి.

          1. మతం ఓ మత్తుమందు – కుష్వంత్ సింగ్
          2. దేవుని అవతారాలు : అంధ విశ్వాసాలు – ఉషారాణి శర్మ
          3. దేవుడున్నాడా? – కృష్ణ మురారి పాండే
          4. జాతకాలు`జన్మ నక్షత్రాలు – టి. రాజగోపాలన్
          5. సాయిబాబా దేవుడా? మోసగాడా? – డా. హెచ్. నరసింహయ్య

          రెండో ప్రచురణ ‘హేతువాద వ్యాసాలు’. ఇందులోనూ 5 వ్యాసాలున్నాయి. ఇది 1977 ఏప్రిల్‌లో వచ్చింది.

          1. హేతువాదం నాస్తికత్వానికి జీవగర్ర – రావిపూడి వెంకటాద్రి
          2. కుంభమేళా కుంభకోణం – వి. చెంచయ్య
          3. సృష్టికి మూలమేమిటి? – డా. మిత్రా
          4. హేతువాదిగా వీరేశలింగం – వి. రామకృష్ణ
          5. మానవుడు కల్పించుకున్న ఛాయాచిత్రం దేవుడు – మాక్సిం గోర్కి.

          మూడో ప్రచురణ ‘మృత్యువుపై సైన్స్ దండయాత్ర’. ఇది 1978 ఫిబ్రవరిలో అచ్చయింది. ఇందులో కూడా 5 వ్యాసాలున్నాయి.

          1. మృత్యువుపై సైన్స్ దండయాత్ర ` కె. వాసుదేవరావు
          2. మానవ పురోగతికి సైన్సు ప్రధాన సాధనం – ఎ.ఎన్.నాగేశ్వరరావు
          3. మతం, మూఢవిశ్వాసం, వైద్యశాస్త్రంతో వాటి సంబంధం – డా.టి.జయవేలు
          4. సైన్సు ఆధారాల కోసం ఎగబడే ఆస్తికత్వం – వి. చెంచయ్య
          5. తుఫాను`యజ్ఞం – డా. ఎ.ఎం. ధర్మలింగం

          ఈ పుస్తక సందర్భంలో ఒక సంఘటన గురించి చెప్పాలి. మద్రాసులో సోవియట్ ల్యాండ్ ఆఫీసులో మా అన్న సుబ్బయ్య పనిచేస్తుండేవాడు. ఆయనకు సన్నిహిత మిత్రుడు ఒకదానికి అక్కడ తెలుగు ప్రెస్ ఉండేది. ఆయన నాకు పరిచయమయ్యాడు. ఈ ‘మృత్యువుపై సైన్స్ దండయాత్ర’ పుస్తకాన్ని అక్కడ అచ్చువేయించి, పుస్తకాలు తీసుకొని కావలి రావడానికి హౌరా ఎక్స్‌ప్రెస్ ఎక్కాను. ఇది మధ్యాన్నం ఒకటిన్నరకు కావలి రావాలి. నెల్లూరు వేదాయపాలెం వచ్చేసరికి ‘ఢాం’ అని పెద్ద శబ్దం వచ్చింది. అందరూ ముందుకూ, వెనక్కూ ఊగి రైళ్ళోనే పడిపోయారు. మా పెట్టె ఒక పక్కకు, నేను కూర్చున్న పక్కకు పడిపోయింది. పదిమంది దాకా నాపైన పడ్డారు. రైలు యాక్సిడెండ్ అనే విషయం మాకు తెలియలేదు. నాపైన పడ్డవాళ్ళు 2,3 నిమిషాలు అలాగే ఉండిపోయారు. వీళ్ళెందుకు నాపైన పడ్డారు? లేస్తారా? లెయ్యరా? అని అనే ఆలోచనలో నేనుండిపోయాను. ఇంతలో ఎవరో ‘యాక్సిడెంట్ అయింది, ఏం ప్రమాదం లేదు, మెల్లగా అందరూ ట్రైన్ దిగండి’ అన్నారు. అప్పుడే అది యాక్సిడెంట్ అని మాకు అర్థమయింది. అప్పుడు భయం వేసింది. ఎక్కడున్నామో తెలియదు. నాపైన ఆధారపడి నా భార్య, మా అమ్మ, మా తమ్ముడు ఉన్నారు. నేను చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి? రెండురోజుల్లో ఈ పుస్తకావిష్కరణ ఎలా జరుగుతుంది? ఈ ఆలోచనలతో నేను సతమతమవుతూ ఉన్నాను. నాపైన పడ్డవాళ్ళు ఒక్కొక్కరూ పైకి లేస్తున్నారు. వాలిపోయిన రైలు పెట్టె నుండి ఒక్కొక్కరు దిగుతున్నారు. గేటు పూర్తిగా తెరుచుకొని లేదు. సగం మాత్రమే తెరుచుకుని ఉంది. నేను నా పుస్తకాల కట్టను వదలకుండా పట్టుకొనే దిగాను. బ్యాగ్ మాత్రం లోపలే ఉండిపోయింది. మళ్ళీ లోపలికెళ్ళి బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను. ఇంజన్ నుండి మాది రెండో పెట్టె. మొదటి పెట్టె సగానికి సగం అణిగిపోయింది. ముందున్న ఇంజన్ బరువుకూ, వెనకున్న పెట్టె బరువుకూ అది నలిగిపోయింది. అందులో కొందరు చనిపోయారు. చాలామందికి దెబ్బలు తగిలాయి. ఇది నా జీవితంలో తొలి రైలు యాక్సిడెంట్.

          బ్యాగు, పుస్తకాలకట్ట తీసుకొని బస్సులో రోడ్డు దాకా నడిచి, బస్సెక్కి నెల్లూరు వెళ్ళాను. మా ఫ్రెండ్ తన్నీరు కోటయ్య రూముకు వెళ్ళి కూర్చున్నాను. ఏమీ మాట్లాడాలనిపించలేదు. 5 నిమిషాలసేపు మౌనంగానే ఉన్నాను. ‘ఏం అలా ఉన్నావు?’ అని అడిగాడు కోటయ్య. ‘రైలు యాక్సిడెంట్ అయింది’ అని చెప్పాను. వెంటనే అతడు వద్దన్నా వినకుండా నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. నాకు బాగానే ఉందని చెబుతున్నా వినలేదు. డాక్టరు చూసి అంతా బాగుందన్నాడు. సాయంత్రం కావలి చేరాను. రెండో రోజు పుస్తకావిష్కరణ సభ బాగా జరిగింది. రైలు యాక్సిడెంట్ జరగడం, ఆ రైళ్ళో నేను తీసుకొస్తున్న పుస్తకం పేరు ‘మృత్యువుపై సైన్స్ దండయాత్ర’ కావడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ముందుపెట్టెలో ఉండిఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. రెండో పెట్టెలో ఎక్కడం వల్ల బతికిపోయాను. ఒకవిధంగా మృత్యువును జయించినట్టే.

          1977 ప్రారంభంలోనే నెల్లూరు జిల్లా హేతువాదం సంఘం ఏర్పడింది. నెల్లూరులో పసల భీమన్న, జొన్నలగడ్డ మార్కండేయులు తదితరుల ప్రయత్నం దీని వెనక ఉంది. కావలి హేతువాద మిత్రుల్ని అందులో కలవమన్నారు. మేం అంగీకరించాం. అప్పటికే మా ఐదుగురిలో గంగారాం అనే అతను చనిపోయాడు. మిగిలిన ముగ్గురూ అంత ఆసక్తిగా లేరు. నేనొక్కడినే జిల్లా హేతువాద సంఘంలో చేరాను. అప్పటికే నేను కావలి హేతువాద మిత్రుల పేరుతో 4వ వ్యాస సంకలనం వెయ్యాలని వ్యాసాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నాను. అయితే అవి వెయ్యడానికి 2, 3 నెలలు ఆలస్యం అవుతుందని, అప్పటివరకూ ఆగలేక జిల్లా హేతువాద సంఘం బాధ్యులు తొందరపెట్టారు. వెంటనే ఒక సంకలనం రావాలన్నారు. అప్పుడు నేనో ఆలోచన చేశాను. కావలి హేతువాద మిత్రుల పేరుతో మేం వేసిన 3పుస్తకాలలోంచి 5వ్యాసాలు ఎన్నికచేసి ఇవి వేద్దాం అన్నాను. అందరూ అంగీకరించారు. అలా మాక్సిం గోర్కి, డా. మిత్రా, కుష్వంత్‌సింగ్, కృష్ణమురారి పాండే, వాసుదేవ…….వ్యాసాలతో ‘సృష్టికి మూలం ఏమిటి?’ పేరుతో ఒక పుస్తకాన్ని 1979 ఫిబ్రవరిలో తీసుకొచ్చాం. వరసగా ఇలాంటి పుస్తకాలు వేస్తాం కాబట్టి, దీనికి ‘హేతువాద వ్యాసావళి1’ అని పెట్టమన్నారు. సంపాదకుడిగా నన్ను ఉండమన్నారు. ‘ఆలోచించండి’ అనే పేరుతో చిన్న సంపాదకీయాన్ని రాశాను. అందులో “ఫిజిక్సు, కెమిస్ట్రీలు చదవడం కాదు, జీవితంలో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. సిద్ధాంతాన్ని వల్లిస్తూ కూర్చోవడం కాదు, వాటిని ఆచరణ సాధ్యాలుగా మార్చుకోవాలి. మనం ప్రభావితం కావడమే కాదు, ఇతరుల్ని ప్రభావితం చెయ్యాలి. ఇదే ఆధునిక యుగానికి ఆరోగ్యకర లక్షణం” అని అన్నాను. ఈ శాస్త్రీయ దృక్పథానిన సామాన్య జనంలోనే కాదు, మేధావుల్లోనూ కలిగించాల్సిన అవసరం ఉందన్నాను.

          ఈ పుస్తకానికి ముందే నేను సేకరించే ప్రయత్నంలో ఉన్న వ్యాసాలు ఒక కొలిక్కి వచ్చాయి. అవి 7వ్యాసాలు. ఇది హేతువాద వ్యాసావళి – 2.

          1. మతం అంటే? : కొడవటిగంటి కుటుంబరావు
          2. హిందూమతం`ఒక పరిశీలన : బి.దీక్షిత్
          3. బౌద్ధమతం నిర్వర్తించిన చారిత్రక పాత్ర
            : డా. వి.రామకృష్ణ
          4. క్రైస్తవ మతం`నిశిత పరిశీలన : పీటర్ శ్యాం
          5. ఇస్లాం మతం`ఒక పరిశీలన : ప్రొ.ఎ.ఎం. ధర్మలింగం
          6. చార్వాక వాదం : ఆర్. సుందరరావు
          7. హేతువాదం అంటే ఏమిటి? : వి.చెంచయ్య

          ‘మతం అంటే?’ అనే పేరుతో ఈ వ్యాస సంకలనాన్ని 1979 జులైలో తీసుకొచ్చాం. దీని ఆవిష్కరణ సభ నెల్లూరు టౌన్ హాలులో జరిగింది. ‘జమీన్ రైతు’ పత్రిక ఎడిటర్ గోపాలకృష్ణ అధ్యక్షుడు. రావిపూడి వెంకటాద్రి ప్రధాన వక్త. అధ్యక్షోపన్యాసంలో మాట్లాడుతూ గోపాలకృష్ణ“ఇంతవరకూ హేతువాదంపైన నాకు కొన్ని సందేహాలుండేవి. కుటుంబరావు గారి వ్యాసం, చెంచయ్యగారి వ్యాసం చదివాక నా సందేహాలు తొలిగిపోయాయి. హేతువాదం పరిమితులు తెలిశాయి” అన్నారు. హేతువాదాన్ని వివరిస్తూనే సామాజిక సమస్యల్ని కూడా హేతువాదం పట్టించుకోవాలని నా వ్యాసంలో అన్నాను. “ఆలోచించకుండా గుడ్డిగా కొన్ని విషయాల్ని నమ్మడం వల్ల ఎన్నో రకాల దోపిడీకి జనం గురవుతున్నారు గనుక ఆ దోపిడీని ఎదిరించడం కోసం హేతువాదం కావాలి” అన్నాను. నాస్తికులు గానీ, హేతువాదులు గానీ దోపిడీ సమస్య గురించి మాట్లాడరు. ఇది వారికి అంటరాని పదం. ఎంతసేపూ దేవుడు, దయ్యం, మూఢనమ్మకాలు ఇదే వారి పరిధి.

          కుటుంబరావు గారు తన వ్యాసంలో ఇంతే బలంగా ఇలా చెప్పారు`“వర్గ సమాజం ఏర్పడక పూర్వం మానవుడు ఎంత అర్థంలేని విశ్వాసాలు కలిగివుండినా వాటిని మనం మతంగా నిర్వచించనవసరం లేదని నా అభిప్రాయం. ఆ విశ్వాసాలు అజ్ఞానం నుంచి పుట్టినవే గాని, బుద్ధిపూర్వకంగా సాటి మానవులను అజ్ఞానంలో ఉంచటానికి ‘దోపిడీగాళ్ళు’ సృష్టించినవి కావు”

          “………..‘అసలైన’ మూఢవిశ్వాసాల గురించి ఏమిటి చెయ్యటం? హేతువాదం ద్వారా వాటిని ప్రతిఘటించటం ఇంచుమించు గోడకేసి తల కొట్టుకోవటమే.”

          రావిపూడి వెంకటాద్రి కూడా ఈ వ్యాసాల్ని చదివే వచ్చారు కాబట్టి ప్రధానంగా కుటుంబరావునుద్దేశించి తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఇది హేతువాదం కాదని గట్టిగా చెప్పారు. నా విషయం వెంకటాద్రికి పెద్దగా తెలియకపోయినా, కుటుంబరావు విరసం సభ్యుడని తెలుసు. నేను హేతువాదం ముసుగులో మార్క్సిజం చెప్పే ప్రయత్నంచేసేవాణ్ణి. కుటుంబరావు గారికి ఆ ముసుగు అవసరం లేదు. ఇక్కణ్ణుంచి రావిపూడికి నాపైనా కొంత అనుమానం కలిగి ఉంటుంది.

          ఆ తర్వాత 1980లో అనుకుంటానురావిపూడి వెంకటాద్రి మూడు రోజుల పాటు నెల్లూరులో హేతువాద అధ్యయన తరగతులకు అధ్యాపకుడుగా వచ్చాడు. ఆ తరగతులకు నేనూ, నా మిత్రుడు, విరసం సభ్యుడు, నెల్లూరు జిల్లాకు చెందినవాడురామచంద్రరావు హాజరయ్యాం. మొదటి సెషన్‌లో విద్యార్థులుగా వచ్చినవారిని హేతువాదం గురించి తాము ఏమనుకుంటున్నారో మాట్లాడమన్నాడు. నలుగురైదుగురు మాట్లాడారు. నేను ముందే రాసుకుని వెళ్ళిన విషయాన్ని చదివాను. హేతువాదం అంటే దేన్నయినా ప్రశ్నించడం అంటారుగాని, హేతువాదులు దోపిడీని ఎందుకు ప్రశ్నించరు? అని ఆ వ్యాసంలో సూటిగా ప్రశ్నించాను. రావిపూడి సమాధానం చెబుతూ చెంచయ్య గారు రాజకీయాల్ని చెప్పారు గాని, హేతువాదం రాజకీయాల జోలికి వెళ్ళదని అన్నాడు. దీంతో మేం విభేదిస్తున్నామని చెప్పి నేనూ, రామచంద్రరావూ మా నిరసను తెలియజేసి, ఈ అధ్యయన తరగతులిన బహిష్కరిస్తున్నామని ప్రకటించి, వాకౌట్ చేసివచ్చాం.

          నేను హేతువాద సంఘంలో ఉండటం వల్ల కత్తి పద్మారావు లాంటివాళ్ళతో కూడా పరిచయం ఏర్పడింది. 1982లో భీమవరంలో రాష్ట్ర హేతువాద సంఘం ఆధ్వర్యంలో అధ్యయన తరగతులు జరిగాయి. నన్ను ‘స్వేచ్ఛ’ అనే అంశంపైన మాట్లాడమన్నారు. త్రిపురనేని మధుసూదనరావు గారి సూచనలు తీసుకుని, బాగా ప్రిపేర్ అయి వెళ్ళాను. మార్క్సిజం పేరెత్తకుండా, మార్క్సిస్టు దృక్పథంలోనే ‘స్వేచ్ఛ’ గురించి మాట్లాడాను. హేతువాదం మాట ఎత్తకుండా దాని పరిమితులు గురించీ మాట్లాడాను. శ్రోతలకు నా అభిప్రాయాలు స్పష్టంగానే అర్థమయ్యాయి. శ్రోతలుగా వచ్చినవారిలో విద్యార్థులు, యువకులు ఎక్కువగానే ఉన్నారు. విరామ సమయంలో మార్క్సిస్టు అభిమానులైన వారందరూ నాచుట్టూ చేరారు. కత్తి పద్మారావు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. పైకిమాత్రం ‘మీరు బాగా మాట్లాడారు, మిమ్మల్ని ఈ విషయంపై ప్రతి జిల్లాలో మాట్లాడించాలి’ అన్నాడు. కానీ, ఆ తర్వాత ఎప్పుడూ నన్ను పిలవలేదు. హేతువాద కార్యకలాపాలతో సంబంధం తెగిపోయింది. ఆ ప్రాంతాల్లోనే విరసంలో కూడా ఒక నిర్ణయం జరిగింది`విరసం సభ్యులకు ద్వంద్వ సభ్యత్వం ఉండకూడదని. అంటే విరసంలో సభ్యులుగా ఉంటూ మరో సంస్థలో సభ్యులుగా ఉండకూడదు. దాంతో నేను హేతువాద సంఘ సభ్వత్వానికి రాజీనామా చేశాను.

          మీపై తొలినాళ్ళలో భావకవుల ప్రభావం ఉన్నది గదా? దాని గురించి వివరించండి. మిమ్మల్ని విప్లవ సాహిత్యం వైపు ఆకర్షించిన అంశాలు ఏమిటి?
          నాపై తొలినాళ్ళలో కూడా భావకవుల ప్రభావం లేదు. తెలుగు సాహిత్యం నాకు పరిచయం కావడమే భుజంగరాయశర్మ గారి ద్వారా శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’తోనే. అప్పుడు తెలుగు సాహిత్యం ముఖ్యంగా కవిత్వం చదవాలని మా కాలేజీ లైబ్రరీకి వెళ్ళినప్పుడు మొదట నాకు దొరికిన కవిత్వం భావకవి బసవరాజు అప్పారావు గారి కోయిల పాటలు. ఆ తర్వాత అనేకమంది కవుల కవిత్వాలూ దొరికాయి. చదివాను. వాటిలో విశ్వనాథ కిన్నెరసాని పాటలు, బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి, దేవులపల్లి కృష్ణపక్షం వగైరాలు ఉన్నాయి. భావ కవిత్వం చదివినా, భావ కవిత్వ ప్రభావం నాపై పడలేదు. అయితే వారి రచనా విధానం నాకు నచ్చింది. శిల్పం నచ్చింది గాని, వస్తువు నచ్చలేదన్నమాట.

            నన్ను విప్లవ సాహిత్యం వైపు ఆకర్షించిన తొలి పుస్తకం శ్రీశ్రీ మహాప్రస్థానమే. ఎందుకంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో నాకు మొదట దొరికింది అదే కాబట్టి. పైగా మాది కమ్యూనిస్టు కుటుంబం. హైస్కూల్‌లో ఉన్నప్పుడే మా ఇంటికి ‘సోవియట్ భూమి’, ‘విశాలాంధ్ర’ పత్రికలు వచ్చేవి. దానికి కారణం మా అన్న సుబ్బయ్య మద్రాసులో ‘సోవియట్ ల్యాండ’ ఆఫీసులో ఉద్యోగం చెయ్యడం. తెలుగు ఎం.ఏ. కోసం తిరుపతి వెళ్ళాక త్రిపురనేని మధుసూదనరావుతో పరిచయం కావడం.

            విప్లవ రచయితల సంఘంలో ఎప్పుడు చేరారు?
            1975 జనవరిలో అనంతపురం విరసం మహాసభల్లో చేరాను.

            అప్పటి సాహిత్య, రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉండేవి?
            అనంతపురం సభల్లో మొదటి సమావేశంలోనే పెద్ద రచ్చ జరిగింది. విరసంలో అప్పుడు రాజకీయంగా రెండుమూడు గ్రూపులుండేవి. అవి చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి, పీపుల్స్‌వార్ రాజకీయాల్ని అనుసరించేవిగా ఉండేవి. విరసంలో వరసగా మొదటి రెండిటికి ప్రతినిధులుగా కాశీపతి, జ్వాలాముఖి ఉండేవారు. మూడోదానికి ఒకరని చెప్పలేం. కె.వి.ఆర్., చలసాని ప్రసాద్, త్రిపురనేని మధుసూదనరావు మొదలైన వారు. ఇది మెజారిటీ గ్రూపు. రాజకీయ విభేదాల గురించి చర్చించడానికి విరసం ఎప్పుడూ జంకలేదు. ఏకాభిప్రాయానికి వచ్చినా, రాకపోయినా చర్చలు మాత్రం విస్తృతంగా జరిగేవి. ఒకవిధంగా విరసం బలం అదేనని నా అభిప్రాయం.

              ఇక అనంతపురం సభల ప్రారంభ సమావేశానికి శ్రీశ్రీ అధ్యక్షుడు. ఆయన తన అధ్యక్షోపన్యాసం ప్రారంభించిన కాసేపటికే జ్వాలాముఖి తదితరులు వేదికపైకి నినాదాలతో వచ్చారు. శ్రీశ్రీ చేతిలోంచి జ్వాలాముఖి మైకు లాక్కుని మాట్లాడ్డానికి ప్రయత్నించాడు. మళ్ళీ ఆ మైకును శ్రీశ్రీ లాక్కుని` “మీరు మాట్లాడ్డానికి తప్పకుండా అవకాశం ఇస్తాను. ఇప్పుడు కూర్చోండి” అన్నాడు. జ్వాలాముఖి వినలేదు. వారందరూ వేదికపైనుంచే రచ్చ చేయడం మొదలుపెట్టారు. వేదిక ముందున్న మిగతావారూ నినాదాలివ్వడం ప్రారంభించారు. మొత్తం మీద అరగంటసేపు రచ్చరచ్చ అయింది. చివరకు జ్వాలాముఖి, ఆయన అనుయాయులు సభల్ని బహిష్కరించి బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత సభ ప్రశాంతంగా జరిగింది.

              సభల చివరి రోజు మధ్యాన్నం 3 గంటలకు ఊరేగింపు ప్రారంభం కావాల్సి ఉంది. సభలు జరిగిన ఒక ఉన్నత పాఠశాల ఆవరణంలో ఊరేగింపు కోసం అందరూ చేరారు. ఉన్నట్టుండి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మిగతా రెండు గ్రూపులవాళ్ళూ, ముఖ్యంగా యువకులు ఒకరిపై ఒకరు రాళ్ళు వేసుకోవడానికి సిద్ధమయ్యారు. కె.వి.ఆర్., కాశీపతి గార్లు ఏవో సర్ధిచెప్పారు. ఊరేగింపు మొదలైంది. నాకు మాత్రం టెన్షన్‌గా ఉంది. ఎప్పుడు ఏమవుతుందోనని. ఊరేగింపు బయల్దేరిన కాసేపటికి ఒక పెద్ద బ్యానర్‌తో ఉన్న ఒక జీబు ఊరేగింపు పక్కగుండా మహా వేగంగా ముందుకు దూసుకెళ్ళింది. అది కూడా ముందుండి ఊరేగింపులో పాల్గొంది. ఆ బ్యానర్‌పైన చారుమజుందార్ ఫొటో ఉంది. దాంతో ఊరేగింపులోనే మళ్ళీ ఉద్రిక్తత మొదలైంది. అయితే విరసం పెద్దలు ఆ జీబును ఊరేగింపులో పాల్గొనకుండా పంపించేశారు. మర్నాడు విరసం సర్వసభ్య సమావేశం. అందులో కూడా ఉన్న రెండు గ్రూపుల మధ్య కాసేపు వాదోపవాదాలు జరిగాయి. “మమ్మల్ని కూడా తరిమెయ్యండి” అని కాశీపతి అన్నారు. మొత్తం మీద ఆ ఉద్రిక్తత పోయి సర్వసభ్య సమావేశం జరిగింది. రాజకీయ విభేదాల గురించి గానీ, లేదా మరేదైనా సమస్యల గురించి గానీ, పద్ధతిగా చర్చకు పెట్టలేదు, తమ అసహనాన్ని అప్పుడప్పుడూ వెళ్ళగక్కడం తప్ప. నాకైతే విరసంలో ఎందుకు చేరానా అనిపించింది. రచయితల సభలలో ఈ గొడవలేమిటి? రచయితలు కూడా అర్ధరహితంగా గొడవలు పెట్టుకుంటారా? అందులోనూ విప్లవ రచయితలు ఎంత పద్ధతిగా ఉండాలి? నా ఆలోచనలు ఇలా ఉన్నాయి. అయితే నా మిత్రుడు కోటయ్య ఎప్పటికప్పుడు నా సందేహాలకు సమాధానాలు చెప్తుండేవాడు. విరసం కూడా ఈ చెడిపోయిన వర్గ వ్యవస్థలోనేగదా ఉన్నది? ఆ వ్యవస్థ ప్రభావం ఎంతోకొంత పడకుండా ఉంటుందా? ఇలా నాకు నేను సర్దిచెప్పుకున్నాను. సహజంగా నా స్వభావంలో సర్దుకుపోయే గుణం కొంత ఉంది.

              తరువాత ఆరు నెలలు గడవకుండానే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జూన్ 25 అర్ధరాత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ముఖ్యులైన ప్రతిపక్ష నాయకుల్నీ, విరసం సభ్యుల్లో కొందరినీ ఆ అర్ధరాత్రి అరెస్టు చేశారు. మొత్తం మీద అయిదారు రోజుల్లోనే 36 మంది విరసం సభ్యులు అరెస్టయ్యారు. నన్ను అరెస్టు చెయ్యలేదుగానీ, నాకు జరిగిన పోలీసు వేధింపుల గురించి ముందే చెప్పాను. ఈ వేధింపుల కాలంలో జూన్ నుండి డిసెంబర్ వరకు నా శ్రేయోభిలాషులు చాలామంది నన్ను విరసానికి రాజీనామా చెయ్యమన్నారు. నా ప్రియమైన గురువు భుజంగరాయశర్మ గారు కూడా ఒకరోజు గంటసేపు నచ్చజెప్పారువిరసం సభ్యత్వాన్ని వదులుకోమని. “నీపైన నాకు పేరెంటల్ అఫెక్షన్ ఉంది” అన్నారు. ఆయన మాటలతో నేను ఆలోచనలో పడ్డాను. అందరూ నన్ను భయపెట్టేవాళ్ళేగాని, ధైర్యం చెప్పేవాళ్ళు లేకపోయారు. ఈ మానసిక సంక్షోభాన్ని భరించలేక ఆ మర్నాడే ఒక రాజీనామా లెటర్ రాసుకుని జేబులో పెట్టుకుని కాలేజీకి వెళ్ళాను. పాఠం చెబుతున్నా ప్రశాంతత లేదు. ఒకరోజు కాలేజీకి సెలవు పెట్టాను. ఇంట్లోనే ఉండడం వల్ల మానసిక అశాంతి మరీ ఎక్కువైంది. మళ్ళీ కాలేజీకి వెళ్ళాను. అలా నాలుగైదు రోజులు ఆ రాజీనామా పత్రం నా జేబులోనే ఉంది. ఏమిటి, ఇలా ఆలోచిస్తున్నాను అనిపించింది. నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. అంతకుముందు కె.వి.ఆర్., త్రిపురనేని గార్లు నన్ను విరసంలో చేరమన్నప్పుడు“నేను ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకొని విరసంలో చేరతాను గాని, తొందరపడి ఆవేశంలో చేరను” అని చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అంతే, కాలేజీకి వెళ్తూ ఆ రాజీనామా లేఖను ముక్కలు ముక్కలుగా చించి, దారిలో ఉన్న ఒక డ్రైయినేజీలో కాలువలోనే విసిరేశాను. ఆ క్షణం నుండీ నాలో ప్రశాంతత ఏర్పడింది. ఎన్ని సమస్యలొచ్చినా విరసానికి దూరం కాకూడదని నిర్ణయించుకున్నాను.

              మీ వ్యక్తిగత జీవితంలో విరసం భావజాలం తీసుకువచ్చిన మార్పులేమిటి? విరసం మిమ్మల్ని ఎట్లా తీర్చిదిద్దింది?
              వ్యక్తిగత జీవితానికీ, ఆ వ్యక్తి నమ్మే భావజాలానికీ తప్పక సంబంధం ఉంటుంది, ఉండాలి. భావజాలానికి భిన్నంగా వ్యక్తిగత జీవితం ఉంటే అతన్ని చెప్పేదొకటి, చేసేదొకటిగా చూస్తారు. అందులోనూ మార్క్సిస్టు భావజాలాన్ని అనుసరించేవాళ్ళు కమ్యూనిస్టు పార్టీ సభ్యులయినా, విప్లవ రచయితలైనా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనిస్టుల వ్యక్తిగత జీవితంలోని తప్పొప్పుల్ని కాగడా పెట్టి వెతుకుతారు. కమ్యూనిస్టులకు శత్రువులు చాలామంది ఉంటారు. ఇది మరీ శృతిమించి ఒక్కోసారి తీవ్రరూపం దాలుస్తుంది. అయితే ఈ ధోరణి వల్ల ఒక సత్యం రుజువవుతుంది. కమ్యూనిస్టులకు మాత్రమే ఆదర్శప్రాయంగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది గాని, తక్కినవాళ్ళు బాధ్యతారహితంగా ఉన్నా తప్పులేదనే భావం అందులో ఇమిడి వుంటుంది. ఇది కమ్యూనిస్టుల గొప్పదనాన్నే చాటుతుంది.

                1974 సెప్టెంబర్‌లో లెక్చరర్ ఉద్యోగంలో చేరాను. 1975 జనవరిలో విరసం సభ్యుణ్ణయ్యాను. 1975 జూన్ 25 రాత్రి దేశంలో ఎమర్జెన్సీ. ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే జూన్ 29న నా వివాహం. సంవత్సరంలోపే ఈ సంఘటనలన్నీ వెంటవెంటనే జరిగాయి. ఎమర్జెన్సీ అనేది నా ఉద్యోగానికీ, విరసం సభ్యత్వానికీ పోటీపెట్టింది. ఏదోఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఒక దశలో ఏర్పడింది. రెండిటినీ కాపాడుకోవడానికి తీవ్ర మానసిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అప్పటికి నాకు మార్క్సిజంపై అధ్యయనం పెద్దగా లేదు. మార్క్సిజాన్ని నమ్మేవాడు పద్ధతిగా ఉండాలి గదా అనే విషయం ఒక్కటే ఆ సంక్షోభ సమయంలో నాలో పనిచేసింది.

                ఈ సందర్భంలో వివాహం అనే అంశానికి సంబంధించి ఒక విషయం చెప్పాలి. విరసం సభ్యుణ్ణి కాబట్టి మంత్రతంత్రాలతో, మేళ తాళాలతో పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు. అందుకని అందర్నీ ఒప్పించి, నొప్పించి ఆదర్శ వివాహం`సోషల్ మ్యారేజ్ చేసుకున్నాను.

                నా చదువు బాధ్యతలను మా చిన్నాన్న ఒక్కడే తీసుకున్నాడు. ఆయనపై నాకు కృతజ్ఞతాభావం ఉంది. పెళ్ళి సమయంలో నాకు తెలియకుండా మా ఆవిడవాళ్ళ అన్న, మా అన్న కలిసి కట్నం ఇరవై వేలుగా ఒక ఒప్పందం చేసుకొని ఉన్నారు. ఆ విషయం పెళ్ళి అయింతర్వాత నాకు తెలిసింది. అప్పటికే పెళ్ళి ఖర్చులకైతేనేమి, అంతకుముందు చేసిన అప్పులు తీర్చడానికైతేనేమి 14వేలు ఖర్చయిపోయాయి. మిగతా ఆరువేలు నా చేతికిచ్చాడు. వెంటనే మా ఆవిడవాళ్ళ అన్న ఆ ఆరువేలూ వ్యసాయ ఖర్చుల కోసం తీసుకున్నాడు. నాకు కావలసినప్పుడు ఇస్తానన్నాడు. ఈ సంఘటనలు చకచకా జరిగిపోతుంటే నేను నిమిత్తమాత్రుణ్ణయి చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఆ మొత్తం నాకు తెలియకుండానే వచ్చి, తెలియకుండా ఎక్కువభాగం, తెలిసి కొంతభాగం ఖర్చయిపోయింది. ఆ వాతావరణం అంతా అంతా హఠాత్తుగా ఉరుములు మెరుపులుగా వచ్చి, వర్షం కురవకుండానే ముగిసిపోయింది. ఈ సంబంధానికి ముందు ఒక సంబంధం వచ్చింది. వాళ్ళు అరవై వేలు కట్నం ఇస్తామన్నా కట్నం వద్దు, పెళ్ళీ వద్దు అని తిరస్కరించాను. ఈ నేపథ్యంలో నా పెళ్ళి ఆదర్శమో, అనాదర్శమో తెలియకుండా అయిపోయింది. ఇది నా జీవితంలో మానసిక వ్యథకు గురిచేసిన తొలి సంఘటన.

                ఇంకో విషయం. మా ఆవిడకు చదువురాదు. ఇది నాకు పెళ్ళికి ముందే తెలుసు. చదువులేకపోవడం అనేది నాకు అభ్యంతరకరంగా అనిపించలేదు. విద్యార్థి దశలో నాకో ఆదర్శం ఉండేది. సమాజంలో చాలామందికి విద్య లేదుగదా. చదువుకున్న అబ్బాయిలు చదువులేని అమ్మాయిల్నీ, చదువుకున్న అమ్మాయిలు చదువులేని అబ్బాయిల్నీ పెళ్ళి చేసుకుంటే అన్ని కుటుంబాలూ చదువుకున్న కుటుంబాలవుతాయనీ, ఇది సమాజంలోని చాలా సమస్యలకు పరిష్కారం అవుతుందనీ నాకో అభిప్రాయం ఉండేది. అందువల్ల నేను ఈ విషయంలో అభ్యంతర పెట్టలేదు. తర్వాత నిదానంగా చదువు నేర్పించుకోవచ్చని అనుకున్నాను. కానీ, ఇది నాకు అత్యాశే అయింది. మా ఆవిడకు ఎనిమిదేళ్ళ వయసులో గాలిచేష్ట తగిలిందని కణతలను కాల్చారట. అంతకుముందు చాలా తెలివిగా ఉన్నా, తర్వాత కాలంలో ఆమెకు మానసిక ఎదుగుదల లేకుండా పోయింది. ఈ మానసిక అపరిపక్వత వల్ల ఆమెకు చదువు నేర్పలేకపోయాను. చాలా అమాయకంగా ఉంటుంది. ఒక్కోసారి ఎంతో తెలివిగా ప్రవర్తిస్తుంది. ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో తెలియదు. ఏ విషయాన్నీ మనసులో దాచుకోదు. ఎవ్వరిముందయినా మనసులో మాటను చెప్పేస్తుంది. ఒకవిధంగా చూస్తే ఈ ప్రవర్తన తప్పు. మరోవిధంగా చూస్తే ఇందులో నిజాయితీ కనిపిస్తుంది. సమాజం అంగీకరించని ఈ కల్మషం లేని స్వభావం అనేక సందర్భాల్లో ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. వీటిని సహించే ఓపిక నాకు విరసం వల్లనే వచ్చింది. ఒక్కోసారి అనిపిస్తుంది`నాకు భార్య అయింది కాబట్టి సరిపోయిందిగాని, లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడేదో అని. ఇప్పుడు నాకు 76 సంవత్సరాలు (2026 జూన్ నాటికి). ఆమెకు 70 సంవత్సరాలు. ఈ వయసులో కూడా పనిదొంగ కాదు. తాను చెయ్యాల్సిన పనులు ఓపిగ్గా చేస్తూనే ఉంది. ఒకదశలో అటు ఉద్యోగం, ఇటు ఇంటి బాధ్యతలు, మరోవంక విరసం కార్యక్రమాలు, అధ్యయనం, రచనా వ్యాసంగం ఒక్క క్షణం తీరిక లేకుండా ఉండేవాణ్ణి. వీటన్నిటినీ ఆమె భరించింది. చదువు లేకపోయినా, ఇంటినిండా పుస్తకాలుండడాన్ని ఆమె సహించింది. ఆమె చదువులేని తనాన్ని జీవితాంతం నేను భరించాను. ఇలా ఒకర్నొకరం భరించుకుంటూ జీవన శకటాన్ని లాగుతున్నాం.

                ఇంకో విషయం చెప్పి దీన్ని ముగిస్తాను.1979లో తిరుపతిలో జరిగిన సాహిత్య పాఠశాలలో వేదిక ఎక్కి ఒక అంశంపై ఉపన్యాసం ఇచ్చే అవకాశం తొలిసారిగా లభించింది. ఆ పాఠశాల థీమ్ సాహిత్య విమర్శ. నేను ఆధునిక సాహిత్య విమర్శపై మాట్లాడాను. నాకు వక్తగా అర్హత వచ్చింది. వేదిక పైనుండి దిగగానే వరవరరావు గారు దాన్ని వ్యాసంగా రాస్తే సృజనలో వేస్తానన్నారు. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. అప్పటికి నేను అరుణతారలో కొన్ని పుస్తక సమీక్షలు చేశాను గాని, ఒక వ్యాసంగా విరసం సభ్యుడిగా తొలి రచన ఇదే. ఆ వెంటనే హైదరాబాద్‌లో 1980లో జరిగిన విరసం సభలలో మాట్లాడే అవకాశం వచ్చింది. కొడవటిగంటి కుటుంబరావు గారి సాహిత్యం గురించి మాట్లాడాను. ఆ ప్రసంగాన్ని చేకూరి రామారావు లాంటివాళ్ళు మెచ్చుకున్నారు గాని, సాధారణ శ్రోతలు మెచ్చుకోలేదు. దానివల్ల నాకర్థమయింది ఏమిటంటేనా ప్రసంగంలో విషయం ఉందిగాని, వ్యక్తీకరణ శిల్పం లోపించిందని. ఆ తర్వాత ఒకటి రెండు విరసం సభల్లో మాట్లాడాను. 1983 జనవరిలో విజయవాడలో జరిగిన విరసం సాహిత్య పాఠశాల నా విరసం కెరీర్‌లో ఒక పెద్ద మలుపు. ‘సాహిత్యంలో తిరుగుబాటు ధోరణులు (1964-1970) అనే టాపిక్ నాది. బాగా ప్రిపేర్ అయ్యాను. అందర్నీ మెప్పించేవిధంగా మాట్లాడాలని పట్టుదల పెరిగింది. ఆ రోజు రానే వచ్చింది. అప్పుడు త్రిపురనేని మధుసూదనరావు విరసం కార్యదర్శి. నన్ను పిలవగానే వేదిక ఎక్కుతుంటే ఆయన నాతో ‘ఏమోయ్… విజృంభిస్తావా?’ అన్నారు. నాకేమో గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. ఆయనకు సమాధానం చెప్పకుండానే వేదికపైకి వెళ్ళాను. అప్పుడు సమయం 12గంటలు. ఆ రోజు ఉదయం సెషన్‌లో చివరి ప్రసంగం నాదే. ప్రసంగం ప్రారంభించాను. పది నిమిషాల్లోనే ఊపందుకుంది. గంటన్నర సేపు మాట్లాడాను. మధుసూదనరావుగారన్నట్టు నిజంగానే విజృంభించాను. అప్పుడప్పుడూ హాస్యపు జల్లులు కురిపించినా, పాఠం సీరియస్‌గానే సాగింది. వేదిక దిగగానే నాలుగు మీటింగులకు బుక్కయిపోయాను. నాకు పరిచయం లేనివాళ్ళు కూడా నన్నభినందించారు. కొందరయితే మాకు ఆకలే తెలియలేదన్నారు. మధుసూదనరావు గారు కూడా ‘అదరగొట్టావయ్యా’ అన్నారు. నా జన్మకిది చాలనిపించింది.

                1985లో మరో మంచి అవకాశం వచ్చింది. ఆ సంవత్సరం విరసం వేసవి పాఠశాలల్ని ప్రారంభించింది. విరసం సభ్యుల్లో అధ్యయన తత్వాన్ని పెంచడం వీటి ఉద్దేశం. ఆ పాఠశాల 10 రోజుల పాటు జరగాలి. ఒక్కో పాఠం మూడు రోజులు. మూడు పాఠాలు. 9 రోజులు. పదోరోజు పాఠశాలపై సమీక్ష. అప్పట్లో అధ్యయనంపై ఆసక్తి ఉన్న యువ విరసం సభ్యులకు ఇదో పెద్ద అవకాశం. ఎవరంటే వాళ్ళు హాజరవడానికి లేదు. విరసం నాయకత్వమే విద్యార్థుల్ని ఎన్నిక చేసింది. ఎంపికయిన 17మందిలో నేనున్నాను. కె.వి.ఆర్., సుబ్బారావు (సురా), చలసాని ప్రసాద్‌లు పాఠాలు చెప్పారు. వివరంగా మేం నోట్సు రాసుకున్నాం. పాఠశాలకు నెలకు ముందే కొన్ని పుస్తకాల పేర్లు చెప్పి అవి చదువుకొని రమ్మన్నారు. వాటిలో నేను చాలావరకు చదివాను. విరసం సభ్యుణ్ణయిన ఆ పదేళ్ళలో ఇది నా ఎదుగుదలకెంతో సహాయపడింది. కృష్ణాజిల్లా పల్లేర్లమూడి గ్రామంలో ఇది జరిగింది. ఆ గ్రామంలోని హైస్కూలు హెడ్‌మాస్టర్ పల్లేర్లమూడి దశరథరామమూర్తిగారు ‘పదరా’ పేరుతో అప్పటికే విరసం సభ్యుడు. ఆయనే ఈ పాఠశాలను నిర్వహించాడు.

                1986 వేసవి పాఠశాల కూడా అక్కడే జరిగింది. దాన్నీ ‘పదరా’ గారే నిర్వహించారు. అప్పుడు కూడా 10 రోజులు. మూడు పాఠాలు. ఒక్కో పాఠం మూడు రోజులు. మార్క్సిజం – లెనినిజంమావో ఆలోచనా విధానం అనేవి ఆ మూడు పాఠాలు. మార్క్సిజం పాఠాన్ని త్రిపురనేని, మిగతా రెండు పాఠాలు చలసాని ప్రసాద్ చెప్పాలి. అయితే 25 రోజుల ముందే త్రిపురనేని గారు తనను రావడానికి కుదరదని చెప్పారు. వెంటనే చలసాని ప్రసాద్ కావలికి వచ్చారు. కె.వి.ఆర్. ఇంట్లో మేం ముగ్గురం సమావేశమయ్యాం. త్రిపురనేని మధుసూదనరావు గారు చెప్పాల్సిన ‘మార్క్సిజం’ పాఠాన్ని నన్ను చెప్పమని చలసాని అన్నారు. ఆ మాట వినగానే నాపైన బాంబు పడినట్టనిపించింది. కాసేపటికి తేరుకున్నాను. మార్క్స్, ఎంగెల్స్‌లను బాగా అధ్యయనం చెయ్యాలి.

                1985లో విద్యార్థిగా వెళ్ళిన నేను సంవత్సరానికే ఉపాధ్యాయుణ్ణవ్వాల్సి వచ్చింది. ఒకపక్క ఆనందం, మరోపక్క భయం. చివరికి ఒప్పుకున్నాను. అప్పుడు నాకు అదొక ఛాలెంజ్. అప్పుడు నాకు ఐదేళ్ళ కూతురు ఉంది. నా భార్యను, కూతురిని వాళ్ళ ఊరిలో వదిలిపెట్టి వచ్చాను. వాళ్ళుంటే డిస్టర్బెన్స్ అవుతుందని. గట్టిగా నాకు 22 రోజుల టైం ఉంది. మార్క్స్, ఎంగెల్స్‌ల పుస్తకాల్ని ముందేసుకొని కూర్చున్నాను. ఒక ప్రణాళిక ప్రకారం చదవడం మొదలుపెట్టాను. నోట్సు రాసుకున్నాను. పాఠం చెప్పడానికి వీలుగా ఒక క్రమపద్ధతిలో ఆ నోట్సులోని విషయాన్ని పాయింట్లుగా రాసుకున్నాను. మధ్యలో ఒకరోజు తిరుపతి వెళ్ళి త్రిపురనేని మధుసూదనరావు గారిని కలిశాను. ఆయన నాకు ధైర్యం చెప్పాడు. మూడు రోజులూ నువ్వు పాఠం చెబితే, ఏం చెప్పినా, ఎలా చెప్పినా విజయం సాధించినట్టే అన్నాడు. ముందురోజే పల్లేర్లమూడికి చేరుకున్నాను. చలసాని గారు కూడా వచ్చారు. నేను తయారుచేసుకున్న నోట్సును ఆయనకు చూపించాను. నేనూహించినదానికంటే బాగా ప్రిపేరయ్యావన్నారు. మొత్తం మీద మూడు రోజులూ పాఠం చెప్పాను. పదీ పన్నెండు మంది విద్యార్థులు. ఈ రెండు వేసవి పాఠశాలలూ నా అధ్యయన ఉన్నతికి బాగా తోడ్పడ్డాయి. ఈ స్ఫూర్తితో 1987లో వేసవి పాఠశాలను నెల్లూరు జిల్లా అల్లూరులో 10 రోజుల పాటు నేనూ, మరో విరసం సభ్యుడు బి.వి.ప్రసాద్ నిర్వహించాం. 5పాఠాలు. ఒక్కో పాఠం 2 రోజులు. అదీ విజయవంతంగా నడిచింది. ఆ తర్వాత కొన్నాళ్ళు వేసవి పాఠశాలలు 7 రోజులు, 5 రోజులు, 3 రోజులుఅలా నడిచాయి. ఆ తర్వాత అదృశ్యం అయ్యాయి.

                1980లో త్రిపురనేని, 1984లో వరవరరావు విరసం కార్యదర్శులయ్యారు. 1985లో వి.వి. అరెస్టు కావడంతో చలసాని ప్రసాద్ తాత్కాలిక కార్యదర్శి అయ్యారు. 1986 జనవరిలో కార్యదర్శి అయ్యారు. 1998 జనవరి ఒంగోలు విరసం సభల్లో నేను కార్యదర్శినయ్యాను. ఇది నాకు తలకు మించిన భారమే. అయినా తప్పలేదు. ఇలా విరసం నన్ను తీర్చిదిద్దిందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.

                **

                ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. అధ్యాపకుడు. 'కొలిమి' వెబ్ మేగజీన్ సంపాదకవర్గ సభ్యుడు. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార (సమాజ సాహిత్య సంబంధాల విశ్లేషణ), 2. ఏరువాక (సాహిత్య విమర్శ); 3. ములాఖాత్ (విప్లవ రచయితలతో ఇంటర్వ్యూలు), సంపాదకత్వం : ఎరుక (ఆదిమ అర్ధసంచార తెగ ఎరుకల కథలు), తొలకరి (అల్లం రాజయ్య కథల వెనుక కథ), మట్టి మనుషులు (వడ్డెరల జీవన గాథలు), ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.

                Leave a Reply