దళితులలో మాలలు, మాదిగలు ప్రధాన కులాలు. వీటి ఉపకులాలున్నాయి. ప్రధాన కులాల ఔన్నత్యాన్ని, ఆచార, వ్యవహార, సాంస్కృతిక, సాంప్రదాయాలను కాపాడుటకు ఈ ఉపకులాలను పోషిస్తారు. వారు తమ కులాల కీర్తి ప్రతిష్టలను వివరిస్తూ మరో తరతరానికి అందిస్తుంటారు. ప్రత్యామ్నాయ సంస్కృతి సారథులు. పటం, బాగోతం, కథాగానం, ప్రవచనం, యక్షగానం మొదలైన రూపాల్లో ప్రదర్శిస్తారు.
తెలుగు దళిత సాహిత్యంలో ఉపకులాల (ఆశ్రిత కులాల) కథలు ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాయి. కేవలం అగ్రవర్ణాల అణచివేతనే కాకుండా, దళితులలో అంతర్గతంగా ఉన్న ‘నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ’ను, ఆశ్రిత కులాల సాంస్కృతిక వారసత్వాన్ని, వారు ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన సామాజిక, ఆర్థిక సంక్షోభాలను ఈ కథలు అత్యంత విపులంగా, సహజంగా చిత్రించాయి. ఒక్కో ఉపకులం నేపథ్యంలోని కథలను, వాటిలోని ఇతివృత్తాలను కొన్ని కథల ఆధారంగా విపులంగా పరిశీలిద్దాం.
చిందోళ్లు పదఘట్టనల కింద నలిగిపోయిన వెలివాడల జీవితాలను ఏకరువు పెట్టిన విషాదమే డా. గుండెడప్పు కనకయ్య కథ ‘యక్షగానం’. మాదిగలు తమకిష్టమైన ఎల్లమ్మ తల్లి పండుగ చేయాలనుకొని సిందు మాణిక్యంతో ఐదు వందలకు ఐదు ఆటలు మాట్లాడుకున్నారు. యాసంగి వరికోతలు ముగిసాక సిందు మాణిక్యం వచ్చి శ్యాందిరి పాతుకున్నాడు. బాగోతం మొదలుపెట్టి ఐదు ఆటలు ఆడాడు. రంగ రంగ వైభవంగా ఆఖరి ఆట రోజున మాణిక్యం భార్య ఎల్లమ్మ ఏషం కట్టింది. గావు పట్టిండు. గొర్రె తల తెగిపడింది. గొర్రె రక్తం స్పృశించిన మాణిక్యం అవతారమే మారింది. మాదిగిండ్లల్లో జనం దండులా కదిలింది. పసుపు, కుంకుమ, రక్తం, బియ్యం కలగలసిన పొలి జల్లుతూ వెళుతున్నాడు మాణిక్యం. ఎల్లమ్మ కలికుండల చేయి పెట్టి తిప్పింది. మరొక రోజు మాలలు సిందోళ్లతో బాలనాగమ్మ ఆట ఆడిపించుకుంటున్నారు. శ్యాందిరి కింద అర్థరాత్రి భూతప్రేత పిశాచుల నడుమ మాయల ఫకీర్ రాకతో భయకంపితమైంది. బాలనాగమ్మ ఊయలలోని కొడుకుని చూస్తున్నప్పుడు నల్లకుక్కను చేశాడు ఫకీరు. లైట్లు వేసుకుంటూ పోలీస్ జీపు వచ్చింది. అనుమానంతో ఆట చెదిరిపోయింది. సింది మచ్చయ్య, నలుగురు మాదిగపోరగాండ్లు మాయమైనారు. కలవగుట్టల మీద పొద్దు పొడవక ముందే పీతిరి గద్దలాడుతున్నాయి. కన్న తల్లిదండ్రుల కండ్లనిండా నీళ్లాడుతున్నాయి. మాల మాదిగలు పండుగలను స్వేచ్ఛగా జరుపుకోలేని స్థితి 1994–99 మధ్యకాలంలో రాజ్యమేలింది. అనుమానంలో బలయ్యేది కూడా వీళ్లేనని చిత్రీకరించిన కథ విషాదం. బాధాకరం.
చిందోళ్లు ఆడడం వలన ఊరికి అర్కత్తు బర్కత్తు అని. జాంబవ తత్వం చిత్రించి గోగు శ్యామల కథ ‘జాంబవ మునుం’. సబ్బండ జాతుల వాళ్లు సింధు వేషమేసిన ఎల్లమ్మ కాళ్లు మొక్కుతారు. అటకాయించేటోళ్లకు నేను వేషకాంతను కాదనీ, సూటి పోటి మాటలనుండి చూపుల నుండి తప్పించుకుంటూ చిందు భాగోతం ఆడుతూనే ఉంటిమి. ఆ ఆట మనకు ఊపిరి. మన ఊపిరి సబ్బండోళ్లు అంటూ సిన్నెల్లమ్మ చెప్పుతుంటే సెందమ్మ సాయిలుల కళ్లు తళుక్కుమన్నాయి. అలాయిబలాయి తీసుకొని పక్కూళ్లకు త్యాగం కోసం చిందుమేళం కదిలింది.
త్యాగం చెప్పకపోవడం వలన జరిగిన అనర్థాలు తైదల అంజయ్య కథ ‘త్యాగం’లో వివరించారు. మాదిగలు త్యాగం చెప్పకపోవడం వలన ఉపాధిలేక ఊరొదిలి పట్నం పోయి మంగళి పని చేస్తున్న చిందు నర్సయ్య, మాదిగ మల్లయ్యలు కలుసుకుంటారు. చిందు నర్సయ్య తన బాధల్ని చెప్పుకుంటాడు. వీరి మధ్య సంభాషణలు జరుగుతున్నంతసేపు మల్లయ్య ఆ.. ఊ అనుకుంటూ అరిసెందుని ఏషమేసి స్మశానంలో నిలబడిన చిందు నర్సయ్యనే మెదులుతున్నాడు. గోసంగి వేషమేసి చావడి కాడ కులపురాణం విప్పి చెప్పుతున్న జాంబవంతుడై చిందేస్తున్నాడు. “నువ్వన్నది నిజమేరా నర్సయ్యా! ఎవనికెవడేం ఇవ్వనప్పుడు ఎక్కువ, తక్కువ లెక్కెక్కడివి? కులాలెక్కడివి? లోకమ్మీదున్నాయి రెండే కులాలు. ఉన్నోనిది ఒక కులం. లేనోనిది ఒక కులం. అంతే పా బిడ్డా! ఇక వోదాం.” అనుకుంటూ ఇద్దరు రోడ్డు మీదికి నడిచారు.
బలహీనులైన ఉపకులాల మీద బలవంతులదే పెత్తనమని చెప్పిన డా. తాళ్లపల్లి యాకమ్మ కథ ‘బతుకు’. సిందోళ్ల దేవయ్య బుచ్చమ్మల కొడుకు టీచర్ జాబ్‌కి ఎంపికయ్యాడు. ఎప్పుడో ఇచ్చిన ఇండ్లాడుగు జాగ అడిగాడు లీడర్ కొమురయ్య మాదిగను. అతడు విపరీతంగా కొట్టాడు. దవాఖానకు తీసుక వెళ్లనీయలేదు. చికిత్స అందకుండా చేశాడు. గాంధీ హాస్పిటల్‌లో ఎల్లయ్య చనిపోయాడు. శవాన్ని తీసుకొచ్చి గూడెం మధ్యలో ఖననం చేస్తారు. తెల్లారి పంచాయితీలో ఇక్కడ ఎందుకు పాతిపెట్టారు? అని ప్రశ్నించిన కొమురయ్య మీదికి గడ్డపార ఎత్తుతాడు దేవయ్య. ఎవరి ఇండ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ప్రతి ఊరిలో సిందోళ్లను (ఉదా. జూపాక సుభద్ర కథ ‘రాయక్క మాన్యం’) కుటుంబ సభ్యులుగా చూస్తారు. ఈ కథ మరొక కోణాన్ని చూపుతుంది. చిందు కుటుంబాలలో మానవ సంబంధాలను ఆవిష్కరించిన డా. గడ్డం మోహన్‌రావు కథ ‘కులం తప్పు’. సమిష్టి నిర్ణయాలు ఎలా ప్రభావితం చేస్తాయో ఈ కథలో కనబడుతుంది.
ఉపకులాలకు త్యాగం లేదని కొన్నిసార్లు అవమానపరచిన సంఘటనలు కూడా ఉంటాయి. జాంబ పురాణం ఎవనికి కావాలే. పని పాట లేక ఒక వేషం కట్టుకుని వచ్చినారు? మొదలైన దూషణలు, తిరస్కారాలు కూడా స్వగతాలుగా ఉంటాయి. మనసు బాధల్ని కథలుగా మలచి అందించిన డా. గడ్డం మోహన్‌రావు ‘త్యాగం’ కథకి దక్కింది. పదిహేనేండ్ల తర్వాత ఊరికి త్యాగానికి వెళితే సిందులకు జరిగిన పరాభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. వీరు రాసిన మరో ‘ఇచ్చురు గాళ్లు’ కథలో ప్రధాన కులాల వారు ఆశ్రిత కులాలను ఎంత హేళనగా మాట్లాడుతారో తెలుపుతుంది. డా. తాళ్లపల్లి యాకమ్మ ఆశ్రిత కులాలైన చిందు వారి బతుకును ‘బతుకు’ కథ తెలుపుతుంది.
మాదిగలు తమకున్న మాన్యంలో కొంత పొలం త్యాగానికి తీస్తారు. డక్కలివారికి త్యాగం చెప్పడంలో మాదిగలు వెనుకా ముందు ఆలోచిస్తుంటారు. కూడి చర్చిస్తున్నప్పుడు డక్కలి పోషవ్వ తన త్యాగానికని తీసిన భూమిలో పండిన పంటను ఇచ్చి త్యాగం చెప్పుమని సమస్యను పరిష్కరించినట్లు చిత్రించిన కథ జూపాక సుభద్ర ‘రాయక్క మాన్యమ’ కథ వివరిస్తుంది.
డా. తాళ్లపల్లి యాకమ్మ డక్కలి వారి స్థితిగతులను వివరిస్తూ ‘ఆశ్రిత బతుకులు’ కథ రాసింది. డక్కలివారు జాంబవంతుని చరిత్రను పటం ద్వారా వివరిస్తారు. డక్కలిని మాదిగలు ముట్టుకోరు. డక్కలి అన్నం అడుక్కునే విధానంలో ఆకిలి అంచుకు ఒక రోలు ఉంటుంది. మాదిగలు ఆ రోలు ఎక్కి అంటకుండా మీది నుండి సిబ్బితో వేస్తారు. అనుకోకుండా ముట్టుకుంటే బంగారు తీగెతోని కాల్చాలి. మాదిగ విద్యార్థి స్వగతంలో అనుభవించిన జీవితం. చదువు బుద్ధిని వికసింపజేస్తది. నేను బడిలో ఎక్కువోళ్లను ముట్టుకుంటున్నాను. మనోళ్లను మనం ముట్టుకుంటే తప్పేంది? అని తల్లిదండ్రుల్ని ఎదిరించిన సంస్కరణాత్మక కథ. పాఠశాల వయసులోనే డక్కలిని ముట్టుకున్నందుకు జరిగిన సంఘర్షణను తెలిపిన సిద్దెంకి యాదగిరి ‘బోధ’ కథలో “బర్లకాడికి బర్లు పోతయి. గొర్లకాడికి గొర్లు పోతయి. మనిషి దగ్గరకి మనిషి పోకుంట ఎవడు జేసేరా? వాని యాలి ముండమొయ్యా!” అనే పాట ద్వారా సమానత్వాన్ని వివరిస్తుంది. ఆ సమానత్వమే నేటి సమాజానికి దివిటీగా నిలుస్తుంది.
బేగరి కథల పేర భూతం ముత్యాలు కథా సంపుటం తెచ్చాడు. ఊరిలో ఎవరో ఒకరు చనిపోతే తప్ప బతకలేని వృత్తి బేగరి కులానిది. ఆ కుల వేదనను దయనీయంగా ఆవిష్కరిస్తూ బాధపడే తల్లి మనసును చిత్రించి కులవృత్తి వదలడమే పరిష్కారంగా చూపిన భూతం ముత్యాలు కథ ‘సావుకూడు’ తెలియజేస్తుంది. కులాంతర వివాహం జరుపుకోవడంపై కులం వెలివేసిన కనపడని మనువు లక్షణాలు తెలిపే భూతం ముత్యాలు కథ ‘వెలి’, నిలువు నీడకోసం వేసుకున్న ప్రభుత్వ జాగా స్వాధీనం చేసుకోవాలని రాజకీయులు ఆడిన నాటకంలో ‘గుడిసెలంటుకున్నాయి’ కథలో పేదల బతుకులు బుగ్గిపాలైన తీరును చూపించింది. పనిముట్లంటే ప్రాణమనే విషయాన్ని మన్నె ఏలియా కథ ‘జమిడికె’లో — జమిడికెను కాజేయాలని చూసిన పట్నం సార్ ఇస్తున్న ఐదువందల రూపాయలను వద్దని మొకమ్మీద కొట్టాడు బీములు. “ఇందామని రాలే. నా జమిడికె కొందామని వచ్చాడు” అని భార్యకు చెప్పుతాడు. నా ప్రాణముండంగా నా జమిడికె ఎవరికివ్వనని అనడం అందరికీ ఆచరణీయం. చెరువు మీది బెంగతో ఊరు నాశనమయ్యిందని, అతను కలగన్న జీవితం కాలరాయబడిందని ‘నీరటిగాడి కల’లో కుమిలి కుమిలి కల్లోలం గురించి ఆలోచిస్తాడు. తర్కిస్తూ ఉంటే బీపీ పెరిగింది, నరాలు తెగినాయి, ప్రాణం పోయిందని గుడిపల్లి నిరంజన్ కథ ఆలోచింపజేస్తుంది. సిక్కెంటికెల మనిషిని మనిషిగా చూసి నీళ్లివ్వని స్థితిని కేపీ లక్ష్మినరసింహ కథ ‘దోసిలిపట్టు’ వివక్షను తెలుపుతుంది.
గోసంగిల జీవన విధానాన్ని, భాషను రికార్డు చేసిన గంధం విజయలక్ష్మి కథ ‘కొక్కిడి మిడుసుల్లు’ సాహిత్యంలోకి తెచ్చింది.
గోగు శ్యామల కథ ‘బైండ్లామె భూమడుగదా మరి!’. ఊరడమ్మ పండుగ చేయాలే. నా అత్త భూమి నాకివ్వాలే. ‘మీరు కూలివెట్టి పండుగనెట్లా జేస్తారో సూస్త. కొడుకుల్లారా… నా భూముల నుండి జరగకపోతే ఊరి సుట్టు మిమ్ముల పొలివడ్త.. అప్పుడే ఈ ఊరికి పీడ విరుగడతదని’ గట్టిగా అరిచిన బైండ్ల సాయమ్మ గర్జనను వినిపించింది. బోనాలు అంటే మహాపండుగ. ఆ పండుగలో బైండ్లవారు నిర్వహించే పూజా విధానం, సామాజిక చైతన్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని కళ్లకు కట్టినట్లు దృశ్యీకరించిన జిలుకర శ్రీనివాస్ కథ ‘బైండ్ల సెంద్రెయ్య బోనాల పండుగ’. బైండ్ల సెంద్రెయ్య కథలు తెలుగు సాహిత్యంలో ఆత్మాభిమాన కేతనం. నాయకుడై అణగారిన కులాల ఐక్యతకు పాటుపడిన విధానాన్ని సెంద్రెయ్య సమిష్టి నిర్ణయ హక్కును కాపాడేందుకు ఊరి పెత్తందారితో భౌతికంగా తలపడే కథ ఇది.
సింగరేణి సమీపంలో మాష్టోల్లు బాగోతం కట్టడాన్ని చిత్రించిన లింగాల రాజసమ్మయ్య కథ ‘సమ్మక్క పున్నం’. మే మాసంలో వచ్చే పున్నాన్ని సమ్మక్క పున్నం అని పిలుస్తారు. గీసన్న ఆరోగ్యం బాగాలేదని బాగోతం ఆడడానికి మాష్టి ముత్తక్క వెళ్లింది. మన ఆట చెప్పాలని మాదిగి సలవిచ్చి గంగన్న కులానికి చెప్పి ఆడించాడు.
మనల్ని చూసి ఉచ్చపోసుకునేవాడు. మనకు ఉచ్చపడేట్లు గుడ్లు తెరుస్తున్నాడు. దాడి చేద్దామనుకున్న అగ్రవర్ణాల వారిని మంత్రాలు భయపెట్టిన గుండెడప్పు కనకయ్య కథ ‘మహావీరులు’. మాష్టి పోచయ్య కథాగానం చేస్తుండగా మేర రవీందర్‌ని తరుముకుంటూ వచ్చారు గౌండ్లోళ్లు. తాను కుట్టిన బట్టలను అమ్ముకుంటూ గౌండ్లు లంగలు, చీప్‌గా గౌండ్లు లంగలు అనే సరికి ఏకమై కొట్టేందుకు వచ్చి కొట్టాడు. మాదిగలు ఆపాడు. తెల్లారి ఎల్లమ్మ పట్నాలు ఎక్కినంక బైండ్లోల్ల ఆధ్వర్యంలో బోనం సాగుతుంది. మాదిగలు మేం వీరులమనుకొని నడుస్తున్నారు. అప్పుడే ఒక పోరడు దారికి అడ్డం వచ్చాడు. వాన్ని తిట్టినందుకు పటేండ్లు అందరు ఏకమై తన్నుదామని వచ్చారు కానీ పండ్లు ఈలకరిసి, గుడ్లు తెరిసి చూస్తున్న బైండ్లోళ్లను చూడగానే పటేండ్లకు ఉచ్చపడింది. మంత్రగాళ్లతో మనం గెలువమని తోకముడిచారు. మాయలు మంత్రాలు లేవు. కొన్నిసార్లు అవే రక్షణ తంత్రాలై కాపాడుతాయి. ఎదుటి వ్యక్తిని భయపెట్టడానికి వాడే ఒక బలంగా ఉపయోగపడింది.
మాదిగలకు మాష్టీలకు ఉన్న సంబంధాన్ని తెలిపే మేరి మాదిగ కథ ‘మాష్టి పోచవ్వ’. పోషిపెద్దవ్వా మీకు ఎట్లా పూట గడుస్తదని అడిగింది రచయిత్రి. ‘బిడ్డా! మాదిగోళ్లు ఇనాం ఇస్తారు. బట్టలు, పైసలు, కట్నాలు, కానుకలు పెడుతారు. మాకు కష్టం గాకుండా చూసుకుంటారు. మా మాదిగోళ్ల పిల్లాజెల్లా చల్లగుండు.’ అని దీవించింది. మాష్టీలు మాదిగలకు ఉపకులం. అయినా వరుసలు పెట్టుకొని పిలుసుకోవడం, మాదిగల్ని ఆరాధనా భావంతో పిలవడం రెండు కులాల మధ్య ఉన్న సఖ్యతను తెలుపుతాయి.
మాదిగదాసులమని ఎంత వేడుకున్నా వినని ఊరి కరణం, పటేల్ లైంగిక అవసరాల కోసం ‘మాతంగి’ని వాడుకుంటారు. కరణం, పటేల్ మధ్య ఉన్న కక్షల వల్ల జీవితం ఎలా నాశనమయ్యిందో తెలిపే డా. గుండెడప్పు కనకయ్య కథ ‘మాతంగిదాసు’. అగ్నిప్రమాదం అంచనా వేయడానికి వచ్చిన మాతంగిని చూసిన కరణం మాతంగిని ఇంటికి పిలిపించుకొని, సర్కార్ నుండి వచ్చే ఇల్లు నీకు వచ్చేట్లు చూస్తానని లొంగదీసుకుంటాడు. అది తెలిసిన పటేల్ ‘ఆ లత్కరోడే దొరికాడా? మేము పటేండ్లం ఉన్నాం. ఊరి గుల్లో వచ్చే డబ్బంతా నీకే’ అని మాతంగితో అనగానే సరే అని ఒప్పుకొంది. విషయం తెలుసుకున్న కరణం భగ్గుమన్నాడు. ఉగాదికి పసాద్ పిలుపు మేరకు వస్తానని అన్నది. కరణం పోనివ్వలేదు. పంచాయితీ పెట్టాడు. ‘ఒక పెద్దమనిషికి మాటిచ్చి పోకపోవటం నీదే తప్పు’ అని తీర్పిచ్చాడు పంచాయితీ పెద్ద. కరణం జిల్లా కోర్టులో కేసు వేయించాడు. పసాద్‌రెడ్డి కోపోద్రిక్తుడై వచ్చాడు. మాతంగి తల్లిదండ్రులను చెట్టుకు కట్టి, మాతంగి చెల్లెల్ని అత్యాచారం చేసి ఎటో తీసుకెళ్లాడు. తెలుసుకున్న కరణం మాతంగిని తన ఎడ్ల బండిలో కోర్టుకు తీసుకెళ్లాడు. న్యాయం కోసం గత అరవై ఏళ్లుగా మాతంగి ఎదురుచూస్తూనే ఉంది. అయినా ఇల్లు రాలేదు. వ్యవస్థలో మాతంగి దాసులు ఏవిధంగా అణచివేయబడుతారో తెలిపిందీ కథ.
బుడగజంగాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ రాసిన నిదానకవి నీరజ కథ ‘గోవు’. తన ఆర్థిక అవసరాల కోసం సొంత బిడ్డ పచ్చని సంసారంలో తగవులు పుట్టిస్తాడు. పాలు తాగే బిడ్డలను అప్పగిస్తాడు. విడాకులు ఇప్పించే తండ్రిపై తిరుగుబాటు చేసిన లచ్చి ఆలోచన స్ఫూర్తిదాయకంగా ఉంది.
చెప్పులు చేసే మోచి కులానికి చెందిన పాపయ్యకు హవాయి చెప్పులు రావడంతో ధ్వంసమైన జీవన విధానాన్ని వివరించే జాతశ్రీ కథ ‘ముళ్లపొద’. జాతశ్రీ ‘అనివార్యం’ కథలో పాకి వృత్తి చేసుకునే లాల్‌పాసి కొడుకుకు రిజర్వేషన్ సౌకర్యం అందక బతుకు దుర్భరమైందో తెలియజేస్తుంది.
మొగులు శ్యాందిరి కింద భూదేవర వేదికమీద కొంగవాలు కత్తి తిప్పిన మహా బలశాలి మాదిగల పురాణ పురుషుడు మహా ఆది. తాత జాంబవంతుడి అడుగుజాడల్లో అగ్గి జాడలున్నయ్. ఆ అరుపుల్లో ధరిత్రి మోసిన అణచివేతల చరిత్రున్నది.
నిర్జన నేల మీద గర్జనలను నినాదాల్లో నిప్పులు కురిపించే గర్జనలు. పాటల్లోని పరాక్రమం, పదాలై పలికిన ప్రతిఘటన, డప్పులై దద్దరిల్లిన గాథలు, దండోరాలై దిక్కులన్నీ నింపినయ్. భూమ్మీదో జంగ, మొగులుమీదో జంగ, గుండెల్లో గుబులు పుట్టించే జంబూద్వీప జైత్రయాత్ర ఇంకా సాగుతుంది. బతుకుల్ని బలిపెట్టి బాటలు వేసిన వేస్తున్న మహోన్నతులు సంగీత సాహిత్యాల సమ్మేళనమై సొబగులు అద్దిన విద్దెకు దండం. హృదయంతో రాసిన అక్షరాలే ఈనాటి ఆత్మగౌరవ జెండాలు.
ఉపకులాల ఊపిరిని ఒక్కటిగా కుట్టిన తోలుపై చెదిరిన చరిత్రను చేతుల్లో మళ్లీ నింపినవాళ్లై నిలిచిరి.
మట్టి వాసనలో మా మూలముంది. చెమట చుక్కల్లో మా చరిత్రుంది. గాయాల గీతల్లో మా గానం ఉంది.
జంబూద్వీపాన్ని ఏలిన జాతి మేమని మాట గర్జిస్తుంటే మూగబోయిన యుగాలన్నీ మళ్లీ గొంతెత్తేలా చేస్తున్న ప్రత్యామ్నాయ వ్యవస్థను గురుతు చేస్తున్న ఉపకులాలకు (ఉపకులాల బతుకులను చిత్రించిన) కథకులకు శెనార్తులు. జై భీమ్ లు ….
(ఇంకా ఉంది.)