దేవుడి పేరిట మనుషుల పంతాలు : వందేళ్ళనాటి గురజాడ ప్రశ్న

“దేవుడు చేసిన మనుషుల్లారా… మనుషులు చేసిన దేవుళ్ళారా… మీ పేరేమిటి?” అని కథ మొదట్లోనే గురజాడ వేసిన ఈ ఒక్క ప్రశ్న చాలు.. పాఠకుడి బుర్రలో ఆలోచనల తలుపులు తెరవడానికి. నిజానికి దేవుడు మనిషిని సృష్టించాడో లేదో కానీ, మనిషి మాత్రం తన స్వార్థం కోసం, పంతాల కోసం ఎన్నో దేవుడి రూపాలను సృష్టించుకున్నాడనేది పచ్చి నిజం. ఒక పక్క “మతములన్నియు మాసిపోవును – జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును” అని నమ్ముతూనే, సమాజం దేవుడి పేరిట సాగించే వింత పోకడలను ఈ కథలో అత్యంత హేతుబద్ధంగా విశ్లేషిస్తూనే, అంతే వ్యంగ్యంగా కడిగిపారేశారు గురజాడ. మనిషి తనను తాను నియంత్రించుకోవడానికి పూజ అనే మార్గాన్ని ఎంచుకుంటే, అది కాస్తా మతోన్మాదంగా ఎలా మారిందో చూపించే సజీవ సాక్ష్యమే ఈ ‘మీ పేరేమిటి?’ కథ.
ఈ కథకు వేదిక రామగిరి అనే గ్రామం. కథంతా ఒక రాత్రి సమయంలో గురు శిష్యుల మధ్య సాగే ఒక తాత్విక సంవాద రూపంలో నడుస్తుంది. రామగిరి కొండపై ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని చూసిన శిష్యులకు ఒక సందేహం వస్తుంది. బుద్ధుడు విష్ణువు అవతారమే కాబట్టి అది వైష్ణవ రూపమని కొందరు, కాదు బుద్ధుడి తలపై ఉన్న జడలను బట్టి అది శివుడి రూపమేనని శైవులు… ఇలా ఒకే విగ్రహాన్ని ఎవరికి నచ్చినట్లు వారు వాదించుకోవడం వెనుక ఉన్న మౌఢ్యం ఏమిటన్నదే ఆ సందేహం. ఈ మతపరమైన వ్యాఖ్యానాల వెనుక ఉన్న అసలు గుట్టును విప్పుతూ, శాయన్న భుక్త ఆ ఊరి గత చరిత్రను చెప్పడంతో ఆ కథ మరింత లోతుల్లోకి వెళ్తుంది.

ఈ కథలో గురజాడ సృష్టించిన పాత్రలు కేవలం వ్యక్తులు మాత్రమే కాదు, సమాజంలోని వివిధ మత దృక్పథాలకు ప్రతీకలు. శైవ మత ప్రతినిధి శరభయ్య, వైష్ణవ మత ప్రతినిధి మానవాళ్ళయ్య, విష్ణుక్షేత్ర ధర్మకర్త రంగాచార్యులు, ఆయన కొడుకు కృష్ణమాచార్యులు, కోడలు నాంచారమ్మ, బౌద్ధ మత విశ్వాసి రామ్మూర్తి, ఉపాధ్యాయుడు వెంకయ్య, ఊరి మునసబు రామి నాయుడు, పీరు సాహెబు… ఇలా ప్రతి పాత్ర సమాజంలోని ఒక పార్శ్వాన్ని ఆవిష్కరిస్తుంది.

ఒకానొకసారి ఆ ఊరిలో శైవులకు, వైష్ణవులకు మధ్య ఉన్న పట్టింపులు, అహంకారాలు తారస్థాయికి చేరుకుంటాయి. ఒకరి భక్తికంటే మరొకరి భక్తి గొప్పదని నిరూపించుకోవడానికి వారు పడే తాపత్రయాన్ని గురజాడ తనదైన శైలిలో చిత్రించారు. శైవులు నిప్పుల గుండం తొక్కి తమ భక్తిని చాటుకుంటే, వైష్ణవులు కూడా తామేమీ తక్కువ కాదని మానవాళ్ళయ్యను నిప్పుల గుండం తొక్కించడానికి సిద్ధపడతారు. అయితే ప్రాణభయంతో ఆయన తప్పించుకోవడానికి చూసే ఘట్టం మనుషుల అంతరంగంలోని లౌక్యాన్ని, మత పిచ్చి వెనుక ఉన్న భయాన్ని బయటపెడుతుంది.

ఈ సందర్భంలోనే నాంచారమ్మ పాత్ర ద్వారా గురజాడ ఒక సామాజిక మలుపు తిప్పారు. ముస్లింలు సైతం వైష్ణవులలో భాగమేననే సరికొత్త సమీకరణాన్ని తెచ్చి, పీరు సాహెబు చేత పీరును పట్టించి గుండం తొక్కిస్తారు. మతాల మధ్య ఉండే కఠినమైన గీతలను సామాజిక అవసరాలు ఎలా చెరిపేస్తాయో చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ. ఆ తర్వాత ఆ పీరు త్రిశూలాకారంలో ఉందని శైవులు, విష్ణునామంలా ఉందని వైష్ణవులు పూజించడం మనుషుల స్వార్థపూరిత వ్యాఖ్యానాలకు అద్దం పడుతుంది. “విష్ణువూ శివుడూ పీరుగా మారినప్పుడు, బుద్ధుడు పీరు కాకూడదా?” అన్న శాయన్న భుక్త ప్రశ్న, మతాల సంకుచితత్వాన్ని నిలదీస్తుంది.

ఇలా… ఈ కథ పొడుగునా గురజాడ చాలినన్ని హేతుబద్ధమైన, వైచారికమైన సంభాషణలను చొప్పించారు. అవి నేటికీ మన సమాజానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయి. మన దేశంలో ఏ చారిత్రక లేదా సహజ సిద్ధమైన ప్రదేశాన్ని చూసినా దానికి పురాణ గాథలను ముడిపెట్టి నిజమని నమ్మించే పద్ధతిపై గురజాడ విసిరిన వివేకవంతమైన చురకలు కూడా కథలో కనిపిస్తాయి. “ఈ దేశంలో పాండవులు ఉండని గుహలు, సీతమ్మ స్నానమాడని గుంటలూ లేవు” అంటూ ఆయన చేసిన హాస్య వ్యాఖ్యానం సామాజిక భ్రమలపై గురజాడకున్న స్పష్టమైన అవగాహనకు నిదర్శనం.

అలాగే, ఆచారాల పేరిట ప్రాణాలను సైతం పణంగా పెట్టే మూఢత్వాన్ని ఖండిస్తూ, దైవత్వంపై ఉండాల్సింది ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే అంతర్గత నమ్మకమే కానీ బాహ్య ప్రదర్శనలు కావని ఆయన ప్రబోధించారు. “రాముడే కాదు, ఏ దేవుని మీదనైనా నిజమైన నమ్మకమన్నది యేడిస్తే ఒక్క గుండమే కాదు, అన్ని కష్టాలూ తరించవచ్చు” అనే వాక్యం ద్వారా నిజమైన విశ్వాసానికి ప్రతీకను అందించారు.

రూపాలు, పేర్లు వేరైనా అంతిమంగా సత్యం ఒక్కటేననే తాత్విక సమన్వయాన్ని గురజాడ శాయన్న భుక్త పాత్ర ద్వారా ఆవిష్కరించారు. “శివుడన్నా, విష్ణువన్నా, బుద్ధుడన్నా, పీరన్నా పరమాత్మ మాత్రం ఒక్కడే కదా!” అన్న వాక్యం సర్వమత సమానత్వాన్ని వివరిస్తుంది. అయితే, దేవుళ్లంతా ఒక్కటే అని ఒప్పుకుంటూనే, ఆచరణలోకి వచ్చేసరికి పూజల దగ్గర మనుషులు విడిపోవడాన్ని చూసి కలిగిన తీవ్ర ఆవేదనను, ఆక్రోశాన్ని వెంకయ్య నోట పలికించిన పదునైన మాటల్లో గురజాడ ప్రతిఫలించారు. “అందరు దేవుళ్ళు ఒక్కరే అయితే, ఆ పీనుగుల్ని అందరినీ ఒక్కచోటే నిలిపి అందరూ కలిసి పూజ తగలెట్టరాదా?” అని వెంకయ్యతో అనిపించడం మత సమాజంపై ఒక శరాఘాతంగా నిలిచింది.

గురజాడ అప్పారావు గారి దృష్టిలో మతం అనేది మనిషి తన ఆధ్యాత్మిక, నైతిక, బౌద్ధిక వికాసం కోసం నిర్మించుకున్న ఒక సాధనం మాత్రమే. కానీ హేతువు లేని పూజలు, విచక్షణా రహితమైన పద్ధతులు మనిషిని వెనక్కి నెడుతున్నాయని ఆయన ఈ కథ ద్వారా బలంగా ఆక్షేపించారు. ‘మీ పేరేమిటి?’ కథ కేవలం నాటి శైవ-వైష్ణవ వైరాన్ని మాత్రమే కాదు, నేటికీ సమాజంలో వేర్వేరు రూపాల్లో వేళ్లునుకుపోయిన మతోన్మాదాన్ని, సంకుచితత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. మతాల పేరిట విడిపోయే కన్నా, జ్ఞానమనే వెలుగులో మానవత్వాన్ని వెతుక్కోవాలి.. అన్నదే ఈ కథ మనకు అందించే పరమార్థం. పదునైన సంభాషణలు, సజీవమైన పాత్రలతో సాగే ఈ కథ తెలుగు సాహిత్య చరిత్రలో ఎప్పటికీ ఒక దార్శనిక రూపమే.

రచయిత, వికీపీడియన్. కంటెంట్ రైటర్. నారాయణపేట జిల్లా, జాజాపూర్ గ్రామంలో పుట్టాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు పూర్తిచేశాడు.  "ఓయూ సాహితి" అనే విద్యార్థుల సాహిత్య పత్రికకు సంపాదకత్వం వహించి, యువ రచయితలకు వేదికగా నిలిచారు. వికీపీడియా వంటి స్వేచ్ఛా విజ్ఞాన వేదికలలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, తెలుగు వికీపీడియాలో ఏడాది పాటు ప్రతి రోజు ఒక వ్యాసం రాసి, 'తెలుగు వికీపీడియా ఏషియన్ అంబాసిడర్' గా గుర్తింపు పొందాడు. రచనలు : వికీపీడియా – తెలుగు సాహిత్య వినియోగం. బెంగళూరులోని కృత్రిమ్ అనే ఏఐ కంపెనీలో తెలుగు భాషా నిపుణుడిగా, బోలి చేతో సంస్థలో ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ గా పని చేశాడు. ప్రస్తుతం టచ్ ఎ లైఫ్ వారి టాల్ రేడియో లో తెలుగు కంటెంట్ రైటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సాహిత్యం, సమాజం, డిజిటల్ భాషా విషయాలపై విశ్లేషణలతో బ్లాగులు, సమీక్షలు, సామాజిక విశ్లేషణలు రాస్తున్నాడు.

Leave a Reply