జార్జ్ థామ్సన్ (1903 -87) రచించిన “మార్క్సిజము- కవిత్వమూ” పుస్తకాన్ని ప్రముఖ అభ్యుదయ రచయిత శ్రీ ఆవంత్స సోమ సుందర్ 1989 లో తెలుగులో అనువదించారు. థామ్సన్ గారిని 1983లో కలిసి తమ చిరకాల వాంఛ నేర్చుకోవటమే కాక పుస్తకాన్ని అనువదించి తెలుగు సాహిత్యానికి ఎంతో మేలు చేశారు.
ప్రొఫెసర్ జార్జి థామ్సన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో క్లాసికల్ సాహిత్యం అధ్యయనం చేశారు.తరువాత lఅక్కడ మరియు బర్మింగ్హామ్ యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేశారు.1936లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా చేరారు. సాంస్కృతిక రంగంలో విశేష కృషి చేశారు. బర్మింగ్హామ్ లో కార్మికులకు చదువు చెప్పారు.ఆంగ్లం, గ్రీకు, ఐరిష్ భాషలు, సాహిత్యాలను లోతుగా అధ్యయనం చేశారు. ఆయన ముఖ్య రచనలు- “ఈస్క్యులస్ అండ్ ఏథెన్స్”, “మార్క్సిజం అండ్ పోయెట్రీ”, “మార్క్స్ టు మావో”, “ క్యాపిటలిజం అండ్ ఆఫ్టర్”, “ది హ్యూమన్ ఎసెన్స్’’ మొదలగునవి.
ఈ “మార్క్సిజము- కవిత్వమూ” పుస్తకంలో ప్రాచీన గ్రీకు కాలంలో సామూహిక శ్రమ నుంచి పుట్టిన కవిత్వం పరిణామ క్రమంలో ఆధునిక పెట్టుబడిదారి విధానంలో వ్యక్తిగత ప్రతిభగా చూడబడి ఎలా మార్కెట్ సరుకుగా మారిందో చెప్పారు. నాటి ప్రాచీన గ్రీకు కాలంలో , ఆధునిక కాలంలో ఇంగ్లాండు, ఐర్లాండ్ సంస్కృతుల్లో కవిత్వాల మధ్య పోలికలు, తేడాలు సైతం లోతుగా వివరించారు.కవిత్వం మరల ప్రజలకు దగ్గరై, విమర్శ విజ్ఞానదాయకంగా మారాలి అని రచయిత తెలిపారు.
ప్రాచీన గ్రీకు కవిత్వం గాన యోగ్యమై పుట్టింది.తొలి దశలో కేవలం నాద ప్రధాన సంగీతం లేదు. ఆదిమ కాలంలో కవిత్వం సమిష్టి శ్రమ నుంచి పుట్టింది. మానవులు ప్రకృతితో పోరాడుతూ, దాని నియమాలు గ్రహించి తమకు అనుకూలంగా మలచుకున్నారు.
అదే విధంగా సమాజ నియమాలు అర్థం చేసుకుంటే మన వ్యవస్థలో “అదృశ్య హస్తం” చేష్టలను అర్థంచేసుకోవచ్చు.
సమష్టి శ్రమ నుంచే పుట్టిన కవిత్వం బృంద గానంగా ఉండేది. ప్రకృతిని అనుకరిస్తూ చేసే అభినయం, దానిలో వెలువడే భాషలో మాట మంత్రం లా పనిచేసేది. సమిష్టి క్రతువు నుంచి పుట్టిన కవిత్వ భాషలో కాల్పనికత, లయతో కూడిన పదాలు,ఇంద్రజాల శక్తి నిండి ఉంటాయి. మావోరీ తెగ వారు, న్యూ హెబ్రిడీజ్, నీకోసియా దీవుల్లో ఉండే జనం సామూహిక గాన ప్రక్రియలో పాల్గొనేవారు. అలా తమ శ్రమ భారం నుంచి ఉపశమనం పొందేవారు. వారు పాడే పాట తమదే అయినా అతీత శక్తిగా వారికి భ్రాంతి కలిగించి అతిలోక బలోత్సాహాలు కలిగిస్తుంది. ఒక్కో సారి ప్రజలు నాట్యంలో తన్మయమై అంతశ్చేతన లోని కాల్పనిక లోతులు తాకేవారు. వారి మనసులోని కోరిక సాధించే గొప్ప యత్నాలు వాస్తవికతపై ఆపాదిస్తూ భ్రాంతిలో మునిగేవారు.అదే వారికి వాస్తవికతను ఎదుర్కొనే మనోశక్తి నిచ్చేది. కల ప్రపంచ మార్పుకు ఉత్తేజాన్ని ఇస్తుంది. కార్ల్ మార్క్స్ కేవలం వ్యాఖ్యానం కాక ప్రపంచాన్ని మార్చటం ముఖ్యమని చెప్పటం నేటి రాజకీయ నిరాశా వాతావరణంలో గుర్తుంచుకోవాలి. ప్రజలకు కల కనే హక్కు, దానిని సాధించుకునే హక్కు ఉన్నాయి.
ఆహారోత్పత్తి లో శ్రామికుల గొంతుల లోంచి అప్రయత్నంగా ఓ ఊత పదం లేదా శబ్దం వెలువడేది. పశ్చిమ ఐరోపాలో ఏకులు వడుకుతూ పాడే పాటలు, పంట కోతలు అపుడు పాటలు, పడవ కళాసీల పాటలు శ్రమకు లయను ఇచ్చి , ఇంద్రజాల శక్తితో ఉపశమనం ఇచ్చేవి. శ్రమనుంచే పాట పుట్టి దానిలో దోపిడీపై తిట్లు ఉండేవి. దీనికి మద్దతుగా రచయిత ఐర్లాండ్ పడవ కళాసీల, స్విట్జర్లాండ్ లో తొంగా తండా బాలుడి పాట, ప్రాచీన గ్రీకు పాటల ఉదాహరణలు ఇచ్చారు.ఐరిష్ కవిత్వం లో కూడా సంగీత, కవిత్వాలకు సన్నిహిత సంబంధం ఉంది.
కవిత్వానికి మూల ధాతువులు అయిన సంగీతం ,నాట్యం, లయ శ్రమ నుంచే పుట్టాయి. నాట్యం భౌతిక చలనం కాగా , శ్రమ భారం నుంచి ఉపశమనానికి నిశ్వాసం నుంచి శబ్దం వస్తుంది. అర్థ రహిత కేక నుంచి లయబద్ధ కేక, రోజువారీ భాష నుండి కవిత్వ భాషలు పరిణమించాయి. పనిముట్ల లయ బద్ధ విన్యాసం , కంఠ స్వరాల లయ బద్ధ ఉచ్చారణకు దారి తీసింది. పదాలు లేని కేకలు సంగీత నాదంగా, ఆలాపనకు సహకరించి క్రమేణా యంత్ర వాద్య సంగీతానికి మూల ధాతువు ఏర్పరుచుకుంది.
కవిత్వం లో కథ లయ బద్ధ రూపంలో సాగితే, తరువాతి కాలంలో కథన రీతి వచనంలో స్థిర పడింది. లయ బద్ధ కథనం గీతాలలోను, నాద భరిత రసావిష్కరణ కావ్యాలలో మిగిలింది. నవల అనేది లయ లేని సంభాషణలో ఉంటే, యంత్ర వాద్య సమ్మేళనం సంభాషణ లేని లయకు ఆధారమైనది.
కవిత్వం, సంగీతాల అవినాభావ సంబంధం గురించి రచయిత థామ్సన్ ఆఫ్రొడైట్ గురించి శాఫో పాడిన గీతం ఉదాహరణ ఇచ్చారు. కళ ఒక కాల్పనిక స్థితిని ప్రదర్శించడం, దాని వల్ల వాస్తవిక ప్రపంచంలో తమ కోరిక తీరుతుందని ఆదివాసులు నమ్మారు అని తెలుస్తుంది.
జానపద కవిత్వం సామూహిక కర్తృత్వంలో సాగుతుంది. నిత్య జీవితంలో పుట్టిన పాట మౌఖికంగా తరాల వెంబడి ప్రవహిస్తుంది. కవిత్వ భాష లయతో కూడి శ్రోతలను ఆకట్టుకుంటుంది. ప్రజల గుండె కవి గొంతుకలో మాటాడుతుంది. వినే జన హృదయాల్లో ప్రాణ తంత్రులు మీటుతుంది. మూకాభినయంలో ఆదివాసులు ఒక భీకర జంతువును వేటాడుతున్నట్లు నటిస్తారు. వారి కళ వల్ల వారిలో కలిగే ఊహా విజయం వారికి ఆత్మ విశ్వాసం ఇస్తుంది. ఇది భ్రాంతి వల్ల కలిగే విజయం.
ప్రజాకవి గానంలో జనం తాదాత్మ్య స్థితికి చేరుకోవడం థామ్సన్ స్వయంగా ఐర్లాండ్ , రష్యా, లేక్ దినేగా దీవిలో చూసారు. ఈ స్థితి హోమర్ నాటి గ్రీసులో , కోరిబాంటిస్ జాతిలో, గ్రీకు దేవత డియోనిసస్ ను పూనకం పట్టినట్లు ఆరాధించే వారిలో కూడా ఇలాగే ఉండేది. కవి ప్రవక్త మాటలు , జన హృదయ స్పందన కలగలిసి పోతాయి.
నాగరికతా పరిణామంలో సామాజిక సంబంధాలు క్లిష్టతరం అయ్యి వర్గ వైరుధ్యాలు ఏర్పడ్డాయి. ఈ దశలో ఇంద్రజాలం వల్ల మానవ సమాజానికి, ప్రకృతికి గల వైరుధ్యం పరిష్కారం కాదు. ఉత్పత్తి సాధనాలు మెరుగు పడుతూ వచ్చాయి.దానితో పాటు సమాజంలో విభజన వచ్చి పాలక వర్గం పరుల శ్రమపై ఆధారపడి బ్రతికేది. దీని వల్ల నిత్య అవసరాలకి ఇంద్ర జాలం లేదా భ్రాంతి అవసరం లేకపోయింది. ప్రకృతితో పోరులో విజ్ఞానం, కళలు జనించి పెరుగుతూ వచ్చాయి.
గ్రీకు సాహిత్యం ప్రభావం వల్ల ఆధునిక యూరోపియన్ కవిత్వంలో లిరికల్ , ఇతిహాసం, నాటకం మూడు ప్రధాన నమూనాలుగా చేరాయి. మత సంబంధ సంబరాల్లో సమిష్టిగా పాడే గీతాలు కాల క్రమంలో ఏక వ్యక్తి ప్రదర్శనగా మారాయి.అతనికి యంత్ర వాద్య సహకారం తప్పుకోవడంతో గానం కవితాలాపన, ఇతిహాసంగా మారింది. భూస్వాములు, రాజుల కాలంలో గాయక కవులు పాలక వర్గాల ఆలోచనా రీతులు, వారి శ్రేయస్సు ను కావ్య రూపంలో చెప్పారు. రాజుల కాలం పోయి వాణిజ్య వర్గాల పెత్తనం పెరిగింది. వారి ఆదరణలో కవులు ఇతిహాసాలను పాడటం, రాయటం చేశారు. నైపుణ్య గాయక కవులు తమ ప్రతిభతో మూలానికి నవ కల్పనలు జోడించేవారు. గ్రీకు,జర్మన్ ఇతిహాసికాలకు పోలికలు ఉన్నా మొదటి దానికి చారిత్రక విశిష్టత ఎక్కువ.ఆరవ శతాబ్ది ఉత్తరార్థంలో గ్రీకు ఇతిహాసాలు లిఖిత రూపం దాల్చాయి. విమర్శ దృష్టి పెరిగి కవులు మరింత జాగ్రత్తతో కవిత్వాన్ని రాయాల్సిన అవసరం ఏర్పడింది.
మధ్య యుగాల్లో మతానికి లాటిన్ భాషకు ప్రాధాన్యత ఎక్కువ. పశ్చిమ ఐరోపాలో ప్రజలలో ప్రవహించిన సజీవ కవిత్వానికి శిష్ట వర్గాల ప్రోత్సాహం లేదు. అయితే కవులకు, ప్రజకు మధ్య సంబంధంలో కవి యొక్క ఆవేశ ప్రదర్శన, ప్రజలు పరవశించడం జరిగేది.ప్రొఫెసర్ జార్జి థామ్సన్ ఐరిష్ పేద రైతులతో సంభాషణలో వారి భాషలోని సహజ జీవ శక్తిని గమనించారు. ఆయన ప్రాచీన గ్రీకు కవి హోమర్ భాష సైతం ప్రజా భాషగా మెచ్చుకున్నారు.
గ్రీకు నాటకంలో బృంద గానానికి ప్రాధాన్యత ఉండేది. నాటకం ఇతిహాసం కన్నా పాతది. ఆహారోత్పత్తిలో మొదట భాగంగా ఉన్న మూకాభినయం క్రమేణా సామాజిక ఆరాధనా క్రతువు అయింది.ఇంద్ర జాలికుని లేదా పురోహితుని లేదా కవి ఆధ్వర్యవంలో జరిగేది.
యుద్ధాలు ఇతిహాసాలకు ఉత్తేజమిస్తే , వ్యవసాయ అభివృద్ధి నాటకాలను ప్రేరేపించింది. నాటకం మధ్య యుగాల మత క్రతువు నుంచి మారి వాణిజ్య వర్గాల పసుపున ప్రాచీన గ్రీసులో , 16 వ శతాబ్దిలో ఇంగ్లాండులో అభివృద్ధి చెందిన వైనం, పోలికలు, తేడాలు థామ్సన్ వివరించారు. ప్రాచీన ప్రజాస్వామ్యం కొంత స్థల, కాలాలకు పరిమితమైతే , ఆధునిక పెట్టుబడిదారీ విధానం తన అభివృద్ధిలో ప్రపంచమంతా వ్యాపించింది. గ్రీకు నాటకం ఎన్నడూ మతాతీత స్థానం చేరలేదు.దానిలో ముఖ్యంగా విషాదాంత నాటకంలో సామూహిక మత సంబంధ క్రతువును లాంఛన ప్రాయంగా ఇముడ్చుకుంది. గ్రీకు నాటకాల్లోని ఆదిమత్వం, సంక్షోభం, మోటు దనం 16వ శతాబ్దిలో గతంలో కన్నా మరింత సంపద ఉన్న, వేగవంతమైన సమాజం నుంచి వచ్చిన షేక్స్పియర్ నాటకాలలో కనిపించవు.
ట్రాజెడీ ముందు ప్రాచీన ఏథెన్స్ నగరంలో ఉండగా తరువాత యూరోప్ లో స్పష్టమైన ప్రక్రియగా మారింది. ఆధునిక పెట్టుబడి దారి విధాన అభివృద్ధి పిదప దాని ప్రాధాన్యత ఇంకా పెరిగింది. బంగారం,ధనం యొక్క వ్యతిరేక పాత్రను గ్రీకు నాటక వేత్తలు , ఇంగ్లాండులో షేక్స్పియర్ ( కొరియాలానస్ నాటకంలో ) ఎండగట్టారు. ధన ప్రభావం వల్ల రైతాంగ దుస్థితిని థామస్ మోర్ కూడా వర్ణించాడు.డబ్బు ఎలా పాత విలువలను పాతర వేస్తుందో మార్క్స్ సైతం మేనిఫెస్టోలో వివరించారు.
ఆధునిక కాలంలో కవిత్వం సరుకుగా మారింది. కవి వ్యాపారిగా మారవలసిన దుస్థితి ఏర్పడింది.రాజులు, ధన రాజులకు కవిత్వం ఇచ్చే ఊహ , ఆనందం కన్నా రొక్కము, యుద్ధం ప్రధానమైనవి. మధ్య తరగతి కవులతో సహా మేధావులు అందరూ ప్రజా శ్రేణికి, వాణి కి దూరమై కొన్ని బృందాలకు మాత్రమే పరిమిత మయ్యారు. కవితా ప్రతిభ కేవలం వ్యక్తిగతమైనదిగా చూడబడి కవిత్వం అనే చెట్టుకు మూలంలోనే తెగులు సోకింది.
ప్రజల భాష, భావం ఎక్కడ సజీవంగా ప్రవహిస్తూ ఉంటాయో అక్కడి కవులకు ఆ సంపద, వారి వాక్కులకు శక్తి సంక్రమిస్తాయి. ప్రజల జీవన ప్రమాణాలు మారనిదే వారి సాంస్కృతిక ప్రమాణాలు పెంచాలనుకోవడం హాస్యాస్పదం అని థామ్సన్ గారి అభిప్రాయం.
నాటి సోవియట్ యూనియన్ కిర్గిజ్, కజాక్ రిపబ్లిక్ లలో జరుగుతున్న సాంస్కృతిక పునరుజ్జీవం గురించి ప్రస్తావించారు. స్వాతంత్ర్యం తర్వాత భారత్, చైనాల్లో కూడా అలాగే జరుగుతుంది అని ఆయన భావించారు.
నేటి కవులు తమ పని తనం మెరుగు పరుచుకుని, వ్యక్తిగత చెడు భ్రమలు , ఇంప్రెషనిష్టు ధోరణులు వదలాలి. విమర్శ వైజ్ఞానిక పద్ధతిలో సాగాలి. ఫాసిస్టు వ్యతిరేక పోరులో లూయీ ఆరగో, స్పానిష్ అంతర్యుద్ధంలో అమరులైన క్రిస్టోఫర్ కాడ్వెల్, జాన్ కార్న్ఫోర్డ్ లను తలుచుకోవాలి. కళాకారుడు ప్రజల్ని కాల్పనిక లోకంలోకి కొనిపోయి ఉపశమనం ఇస్తాడు. వారికి ఆంతరిక బలాన్నిచ్చి తిరిగి బయటి ప్రపంచంలో ప్రగతి బాటలు వేస్తాడు. సమ సమాజంలోనే, దాని కోసం సాగే పోరులోనే నవ కవిత వికసిస్తుంది. మార్కెట్ చేతుల్లోంచి ప్రజలే కవిత్వాన్ని తిరిగి తమ హృదయగతం చేసుకోవాలి అని ప్రొఫెసర్ థామ్సన్ భావించారు
ఈ సమీక్షకుని దృష్టిలో నాడు కళకు మూలం సామాజిక ఆనందాలు విషాదాలు అయితే నేడు కూడా వాటిని కవి వ్యక్తం చేయగలగాలి. దీనికి అతడికి లేదా ఆమెకి సమాజ వస్తుగత సత్యం తెలియాలి. లేని పక్షంలో తన బాధనే ప్రపంచ బాధగా భ్రమించే అవకాశం ఉంది. ఆధునిక పెట్టుబడిదారీ విధానంలో రచయిత తనకు తానే ఈ ప్రపంచ కేంద్ర బిందువుగా ఊహించుకుని విచారించటం అంటే జనానికి దూరం కావటమే.షేక్స్పియర్, షెల్లీ, నెరుడా, పాణిగ్రాహి, గద్దర్ , నాజర్, హనుమంతు, వంగపండు లాంటి కవులు, కవి గాయకులు జన హృదయ స్పందన కలిగించగలిగారు.
ఈ ధన స్వామ్య వికృత ప్రభావం నాడు , నేడు కూడా తెలిసిందే. ఈ నాడు జరిగే యుద్ధాలు, జన హననం, నగర, ప్రకృతి విధ్వంసం, పుడమి తల్లికే చావు వేదన, రోదన దాపురించడం అన్నీ లోతుగా చూస్తే ధన స్వామ్య ఫలితమే అని తెలుస్తుంది.
నేడు మన దేశంలో కూడా సామ్యవాద కాల్పనిక సాహిత్యం వాస్తవాన్ని మారుస్తుంది.కల కళ గా మారితే సమాజ మార్పు తప్పదు. ఇది గ్రహించే పాలక వర్గాలు ప్రజలను వ్యవస్థ స్వభావం గురించి, దాని నుంచి స్వేచ్ఛకై చైతన్య పరిచే ప్రజా కళలను నిరుత్సాహ పరుస్తున్నారు. వాటికి ఏ విధమైన కళా వేదికలు చాల సార్లు అందకుండా ఎన్నో రకాలుగా అణచివేస్తున్నారు. ఈ పాలక వర్గాలు వ్యాపార కళకు, వారి మత భావజాలాన్ని ప్రచారం చేసే చలన చిత్రాలకు మాత్రం ఎనలేని ప్రోత్సాహం ఇస్తారు. వినోద పన్ను సైతం రద్దు చేస్తారు .
అయితే సామాజిక విప్లవం ముందా లేక సాంస్కృతిక విప్లవం ముందా అనే వాదవివాదాలు అనవసరం. ఏది ముందు వచ్చినా మనం దాన్ని ఆహ్వానించాలి. ఇదే ప్రశ్న తలెత్తినపుడు పశ్చిమ యూరోప్ లో లాగా రష్యాలో కూడా సంస్కృతి స్థాయి ఎక్కువ ఉంటే కానీ మార్పు రాదని ఏ పుస్తకంలో ఉంది అని లెనిన్ సృజనాత్మకంగా ప్రశ్నించటం గమనించదగ్గది. ప్రజలకు, శ్రమకు, సాహిత్యానికి గల సన్నిహిత సంబంధం గురించిన చారిత్రక దృష్టి నేడు అందరికీ, ముఖ్యంగా వర్ధమాన రచయితలకు ఎంతో అవసరం.