మేఘన

కాలేజీకి వెళ్ళే హడావిడిలో ఉన్నాను.

ఇంకో ఐదు నిముషాలలో బయలుదేరలేకపోతే ఇవాళ లేటే అనుకుంటూ తలుపుకు తాళం వేయబోతుండగా బాగ్ లో ఫోన్ మ్రోగింది. ఈ టైం లో ఎవరబ్బా అనుకున్నా చిరాగ్గా. మామూలుగా నాకు ప్రొద్దుట ఫోన్ లు రావు. అందరికీ నా టైం తెలుసు. ఎవరన్నా ఎంతో అర్జెంట్ అయితే తప్ప ఈ టైంలో ఫోన్ చేయరు. ఈ మధ్య ఇలా టైం కాని టైంలో ఫోన్ వస్తే చాలా భయంగా ఉంటుంది. అన్నీ చెడు వార్తలే వరసగా. అందుకే తర్వాత చూద్దాం అనుకుని కూడా ఇంటికి తాళం వేసి కారు స్టార్ట్ చేసి ఫోన్ చూసుకున్నాను. అనుపమ నుండి మిస్డ్ కాల్…
ఈ టైం లో చేసింది ఏంటి అనుకుంటూ డ్రైవ్ చేస్తూ బ్లూటూత్ కనెక్ట్ చేసి కాల్ బాక్ చేసా.

అటు వైపు రింగ్ అవుతుంది. కార్ మెయిన్ రోడ్ ఎక్కించా. హమ్మయ్య ట్రాఫిక్ జాం అయి పది పదిహేను నిముషాలు లేట్ అయినా కాని టైం కి చేరిపోవచ్చు. రిలాక్స్డ్ గా డ్రైవింగ్ సీట్లో వెనక్కు జారి కూర్చున్నా.

అవతల పక్క ఫోన్ రింగవుతూనే ఉంది. రెస్పాన్స్ లేదు. కట్ చేసి పెన్ డ్రైవ్ లో సెలెక్ట్ చేసి పెట్టుకున్న పాటలు పెట్టబోతుండగా ఫోన్ రింగయ్యింది.

హలో అన్నవెంటనే అటు పక్క నుండి అను…

“హాయ్ రాధిక దారిలో ఉన్నావా” అడిగింది.

“ఆ డ్రైవ్ చేస్తున్నా ఏంటి ఇంత ప్రొద్దున్నే? అంతా ఓకే నా ..”

“ఇవాళ మెమోరియల్ మీటింగ్ లో కలుస్తున్నాం కదా. గుర్తుందో లేదో అని ఫోన్ చేసాను.”

చప్పున నాలుక కర్చుకున్నా. మర్చిపోయా ఇవాళ పదిహేను కదా. మధ్యాహ్నం మేఘన స్మృతిలో సభ ఉంది. అనుతో వస్తానని చెప్పాను. కాని డేటు గుర్తు లేదు. నా సంగతి తెలిసే అను ఫోన్ చేసింది. ఫుల్ డే సంతకం పెట్టాక పర్మిషన్ తీసుకోవడం కష్టం.

“థాంక్స్ అను ఇవాళ పదిహేను అన్నది గుర్తు లేదు. కాని పర్లేదు. హాఫ్ డే మాత్రమే సైన్ చేసి మధ్యాహ్నం సీ.ఎల్ తీసుకుంటాను. సరైన టైం కే ఫోన్ చేసావు”.

“నీ సంగతి నాకు తెలుసుగా… అనుకున్నా మర్చిపోతావని. సరే మరి, రెండుకే వచ్చేయి. నేను ఎదురు చూస్తుంటాను”. ఫోన్ కట్ చేసింది అను.

వెంటనే పాట మొదలయింది రఫీ పాడుతున్నాడు “రాత్ భర్ కా హై మెహమాన్ అంధేరా, కిస్కే రోకే రుకా హై సవేరా’ సాహిర్ పాటలతో రోజు మొదలెట్టడం నాకు చాలా ఇష్టం. కాని ఇప్పుడు మేఘన గుర్తుకు వచ్చి మనసు కలుక్కుమంది.

ఇవాళ్టికి సంవత్సరం మేఘన మరణించి. ఫాన్ కు వేలాడుతూ, క్రింద మంచంపై కూలిపోయినట్లు, కమిలిపోయిన గొంతు, రంగు మారిన ముఖంతో నేను ఎఫ్. బి. లో చూసిన మేఘన శరీరం గుర్తుకు వచ్చి ఒళ్లు జలదరించింది. తల విదిల్చి రోడ్డుపై దృష్టి సారించాను. ఆ పాట అసందర్భంగా తోచింది. ఆఫ్ చేసేసి ట్రాఫిక్ పై శ్రద్ద పెట్టడానికి ప్రయత్నించా.

కాలేజీకి రాగానే సంతకం చేసి ఇవాళ మధ్యాహ్నం బైటకు వెళుతున్నాను. హాఫ్ డే సి. ఎల్ అని నోట్ చేయమని శిరీషకి చెప్పి క్లాస్ లోకి వెళ్ళాను.

నిన్న బక్రీద్ అని సెలవు ఇచ్చారు కాలేజీ కి. ఇవాళ శనివారం. పిల్లలు వీక్ ఎండ్ సెలవు తీసేసుకున్నట్లున్నారు. క్లాసులో సగం మంది కూడా లేరు. వచ్చినవారికి నోట్స్ రాసుకొమ్మని చెప్పి మౌనంగా కూర్చుండిపోయాను.

మేఘనతో నాకు పెద్దగా పరిచయం లేదు. ఫేస్ బుక్ స్నేహం అంతే. తనని ఎప్పుడూ కలవలేదు కూడా. నేను పెట్టే సాహిత్య పోస్టులకు అప్పుడప్పుడూ ఓ కామెంట్ పెట్టేది. నేను ఎప్పుడూ ప్రత్యేకంగా వాటిక జవాబివ్వలేదు. మేఘన ఆత్మహత్య సంచలనం సృష్టించింది. నా తోటి రచయితలు, ఆక్టివిస్ట్ స్నేహితులందరినీ ఆమె మరణం కలిచివేసింది. అప్పుడు అయిన ఆ డిస్కషన్స్, కుప్పలు కుప్పలుగా అందరూ రాసిన పోస్ట్ లు, సాహితీ మిత్రుల నుండి సేకరించిన సమాచారం నన్ను చాలా కాలం వెంటాడాయి.

మేఘన చాలా అందంగా మాడ్రన్ గా ఉండే అమ్మాయి. నలభై సంవత్సరాల వయసు కాని చాలా లేతగా స్వచ్ఛమైన రోజా పువ్వులా ఉండేది. రాజ్ టీ.వీలో జర్నలిస్ట్ గా పని చేసేది. ఒక కూతురు తొమ్మిదో తరగతి చదువుతుంది. తోటి కొలీగ్, జర్నలిస్ట్ అయిన చంద్రశేఖర్ తో లివ్ ఇన్ లో ఉంది. వాళ్ళ మధ్య వచ్చిన విభేదాల కారణంగా మనస్తాపానికి గురయి ఆత్మహత్య చేసుకుంది. చాలా బోల్డ్ గా ఉండేదని, అసలు ఆమె ఇలా చేస్తుందని ఎవ్వరం అనుకోలేదని, ఎంతో కష్టపడి కెరీర్ ను నిర్మించుకున్న ధీర అని, ఆమెను ఎరిగిన వారు బాధపడ్డారు. రెండు మూడు నెలల దాకా సోషల్ మీడియాలో ఇదే చర్చ. అడపా తడపా కవితలు రాసేదని, ఒక పుస్తకం అచ్చేసిందని గుర్తు చేసుకుని బాధపడ్డారు. తన నిష్క్రమణ చాలా మందిని కదిలించింది. ఆ తర్వాత జరిగిన చర్చలు నాకు మేఘన పట్ల ఆసక్తిని కలిగించాయి.

చిన్నతనంలో చేసుకున్న ప్రేమ వివాహం విఫలం అవడం, తర్వాత మరో పెళ్లి అక్కడ ఎదుర్కున్న హింస, పుట్టిన పాపతో ఒంటరి జీవితం, ఆమెను ఇష్టపడ్డ ఇంకో వ్యక్తి ఆక్సిడెంట్ లో మరణించడం, చంద్రశేఖర్ తో పరిచయం, ప్రేమ, అతనితో సహజీవనం ఇవన్నీ ఆమె గురించి విన్న సంగతులు. మేఘన స్వేచ్చా ప్రియత్వం ఉన్న ఆధునిక యువతి అనే అభిప్రాయాన్ని ఆ వివరాలు కలిగించాయి. చాలా మొండిగా ఉండేదని, ఎవరినీ లక్ష్యపెట్టక, నచ్చినట్లు జీవించేదని కొందరు అన్నారు. అపారమైన ధైర్య సాహసాలు ప్రదర్శించేదనీ మరి కొందరు చెప్పారు.

ఆమెతో సహజీవనం చేస్తున్న చంద్రశేఖర్ వివాహితుడు. ఒకరో ఇద్దరో పిల్లలున్నారట. ఈ మధ్య రాజకీయాలలోనూ తిరుగుతున్నాడట. టాప్ లెవల్ పరిచయాలు ఏర్పరుచుకుని ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడట. అతను తనని వివాహం చేసుకుంటాడని ఆమె ఆశించిందని, అతనిపై ఒత్తిడి తీసుకొచ్చేదని, చివరకు అదే విషయంపై గొడవ జరిగి కూతురు ఇంట్లోలేని సమయంలో ఈ పని చేసిందని అంతా చెప్పుకున్నారు. అతన్ని అరెస్టు చేసి పోలీసులు విచారణ చేసారు. ప్రస్తుతం బెయిల్ పై బైటకి వచ్చాడు.

ఈ వార్తలు వచ్చినన్ని రోజులు మేఘన స్నేహితులు, సాహితీ మిత్రులు ఈ సందర్భంగా రాసినవి, మాట్లాడినవి జాగ్రత్తగా వినేదాన్ని. జాలి, కోపం వీటన్నిటికి అతీతంగా ఓ స్థబ్దత నన్ను ఆవరించింది. ఈ మధ్యలో చంద్రశేఖర్ భార్య మా ఆయన బంగారం అనే అర్ధంతో ఇచ్చిన వీడియో రికార్డింగ్ వైరల్ అయింది. ఒక రోజు ఆ వీడియో చూస్తున్నప్పుడే ఫోన్ చేసిన అనుపమ ఈ సంఘటన పట్ల నా కుతూహాలం చూసి తనకు మేఘన చాలా సంవత్సరాలుగా పరిచయం అని చెప్పినప్పుడు ఫస్ట్ హాండ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని ఆమెను ఎన్నో ప్రశ్నలు వేసి నాకు తెలియని చాలా సంగతులు తెలుసుకున్నాను.

మేఘన మరణం కొందరిలో కోపాన్ని కూడా నింపింది. ఈ ఆధునిక అమ్మాయిల ప్రేమలు, వివాహాలు,విడాకులు క్షణికమైన ఆవేశాలు, లివ్ ఇన్ లు ఇవన్నీ తొందరపాటు నిర్ణయాలని మేఘన జీవితంలో ఇన్ని పరిచయాలు, స్వేచ్చాపూరిత నిర్ణయాలే ఆమె మరణానికి కారణం అని కొందరు నా ఆసక్తి గమనించి నాతోనే అన్నారు.

పెళ్ళయిన వాడితో రిలేషన్ షిప్ పెట్టుకోవడం అలనాటి సావిత్రి నుండి చాలా మంది స్త్రీలు చేసిన తప్పిదాలే. అలాంటీ రిలేషన్ షిప్ల మాటున సాఫీగా జీవితాలు సాగించినవారూ ఉన్నారు. వారిని గొప్ప ప్రేమికులని కొన్ని సందర్భాలలో ఉదహరించే జనమే అదే పంథాలో జీవించాలని ప్రయత్నించి విఫలం అయిన జంటలను చూపించి వారి నైతికతను ప్రశ్నిస్తూ ఉంటారు. నైతికత అన్నది చర్యలో కాదు ఆ చర్య సక్సెస్ రేట్ బట్టి ఉంటుంది అని నాకు చాలా రోజుల క్రితమే అర్ధం అయింది.

మొండిది, ఎవరి మాట వినేది కాదు, పెడసరిగా మాట్లాడేది అని మేఘన గురించి కొందరు చెప్పినప్పుడు నా గురించి నేను వింటున్నట్లు అనిపించేది. నేనూ ఒంటరి స్త్రీనే పైగా నా గురించీ చాలా మందిది అదే అభిప్రాయం. నా గతంలోనూ పెద్దలు కుదిర్చినవే అయినా రెండు వివాహాలున్నాయి. ఆ తరువాత ఎంతో గందరగోళం. నా జీవితాన్ని నిండుగా నేను కోరినట్లు జీవిస్తున్నది అన్ని రిలేషన్ షిప్స్ కు దూరం జరిగాకే, కొందరిని వదిలించుకుని, కొందరికి దూరం జరిగి, కొందరిని వారి పరిధిలోకి నెట్టి నా స్పేస్ నేను ఏర్పరుచుకున్నాకే నా జీవితంలో కాస్త నెమ్మది వచ్చింది. మేఘన నా తరువాతి దశాబ్దపు స్త్రీ. తన జీవితంలో తోడు కోసం ప్రయత్నిస్తూ పోవడం ఆమె చేసిన తప్పా? మేఘన మరణం వెనుక అసలు కారణాలు ఎలాంటివి, తెలుసుకోవాలని ఉంది.

ఇవాళ మేఘన చనిపోయిన రోజు. కొందరు సాహితీ మిత్రులు ఆమె స్మృతిలో ఓ చిన్న సమావేశం ఏర్పాటు చేసారు. నా ఆసక్తితో నేను అప్పుడప్పుడూ వేస్తున్న ప్రశ్నలతో విసిగి ఉన్న అనుపమ నేను ఆ సమావేశానికి హాజరవడానికి అనుమతి తీసుకుని నన్నూ రమ్మనమని అడిగినప్పుడు కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకవచ్చని వెంటనే ఒప్పుకున్నాను. కాని ఇప్పుడు అక్కడకు వెళ్ళాలంటే ఏదో అలజడి.

మధ్యాహ్నం క్లాసుల తర్వాత తెచ్చుకున్న లంచ్ హడావిడిగా తినేసి, ప్రెస్ క్లబ్ కు బయలుదేరాను. నేను ఆ సమావేశానికి వెళ్ళడం కొందరిని ఆశ్చర్యపరుస్తుందని నాకు తెలుసు. మేఘనతో ప్రత్యక్ష్యంగా ఏ సంబంధమూ, స్నేహమూ లేని నా ఉనికి వారికి ఇబ్బంది కలిగించడం సహజమే. తూచి తూచి సమావేశాలకు హాజరయ్యే నేను ఈ సభ పట్ల ఆసక్తి చూపించడం వారిని ఆశ్చర్యపరిచిందేమో కాని అనుపమ ముందే చెప్పి ఉండడం వల్ల ఎవరూ నన్ను ఏమీ ప్రశ్నించలేదు. చిరునవ్వుతోనే స్వాగతం పలికారు.

మేఘనతో కలిసి పనిచేసిన వారు, ఆమెను చిన్నతనం నుండి చూసినవారు సభలో మాట్లాడారు. అందరూ ఆమె ధైర్య సాహసాలు, ఆమె మరణం వారిని ఎలాంటి షాక్ కు గురి చేసిందో చెప్పారు. నేను మౌనంగా కూర్చుని వింటున్నాను. సమావేశంలో మాట్లాడిన సుమ అనే జర్నలిస్ట్ మేఘన కొలీగ్ అట. సభలో మాట్లాడుతున్నప్పుడు ఆమెలో ముఖంలో బాధ, గిల్ట్ కనిపించాయి. ఫార్మల్ కండోలెన్స్, మరి కొన్ని సమాజిక విషయాలపై చర్చలు అయిపోయాక టీ తెప్పించుకుని అందరూ కుర్చీలు జరుపుకుని కూర్చున్నారు. సుమతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం దొరకగానే మేఘన ఆఖరి రోజుల గురించి తనకెంత వరకు తెలుసో చెప్పమని అడిగాను.

“మేఘన నేను చాలా క్లోజ్ గా ఉండేవాళ్లం అండి. కాని చంద్రతోటి ఆమె కలిసి ఉండడం మొదలయినప్పటి నుండి అతని కంట్రోల్ ఆమెపై ఎక్కువగా ఉండేది. మేము క్లోజ్ గా మూవ్ అవడం అతను ఇష్టపడలేదు. మేం అంతా కొలిగ్స్ కదా, మా మీద చిలువలు పలువలు చేసి మా యింట్లోనూ, మా భార్యా భర్తల మధ్య కూడా గొడవలు వచ్చేలా చేసేవాడు. ఈ విషయాలు మేఘన తో చెప్పబోతే ఆమె నమ్మేది కాదు. పూర్తిగా చంద్ర మత్తులో ఉండేది. మా యింట్లో కొన్ని గొడవలు అయ్యాయి. మేఘన దృష్టిలోనూ నేను చెడు అయిపోతున్నాని, ఈ ప్రెషర్ తట్టుకోలేక తనతో మాట్లాడటం తగ్గించేసాను. నేను తనకు దూరం జరగకుండా ఉండాల్సిందని ఇప్పుడు నాకు అనిపిస్తుంది.” అంది. ఆమె గొంతులో ఒణుకు గమనించాను.

“మేఘన ఆఖరి రోజుల్లో ఎవరితో ఎక్కువగా దగ్గరగా ఉండేది” అడిగాను.

“తాను నిజానికి చాలా సోషల్. కాని మెల్లిమెల్లిగా అందరూ ఆమెను దూరంగానే పెట్టాల్సి వచ్చింది. చంద్రకు మేం తనతో క్లోజ్ గా ఉండడం నచ్చేది కాదు. తను కూడా మా నుండి దూరం అవుతూ వచ్చింది. కొన్ని సందర్భాలలో చాలా రఫ్ గా మాట్లాడేది. బాధపెట్టేది. అందుకే మేమూ మెల్లిగా దూరం అయ్యాం. ఇప్పుడు ఆలోచిస్తే అందరం తనను ఒంటరిని చేసాం అనిపిస్తుంది”. చెప్పింది బాధగా.

‘గిల్ట్ మోడ్’ గుర్తించాను వెంటనే. ఆమె చేతిపై చనువుగా చేయి వేసి. ప్రెషర్ తో కూడిన ఉద్యోగాలు, పరుగుల జీవితాలు, అపార్ధాలు, ఆలోచనలలో వైరుధ్యాలు, స్నేహాలలో దూరం పెరుగడానికి ఎన్నో కారణాలుంటాయి. ఇలా చేసి ఉంటే బావుండేది, అలా చేసి ఉంటే బావుండేది అని అనిపిస్తూ ఉండడం సహజం కాని కొన్నిసార్లు ఏం చేసినా దూరాలు తరగవు” అన్నా సానుభూతి ద్వనించేలా.

కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా ఆమె అటువైపు మొహం తిప్పేసుకుంది.

“అసలు ఆ ఫాం హౌస్ గొడవ వచ్చేదాకా అంతా బాగానే ఉండేది. అదే దాని మనసును గాయపరిచింది” అంది కోపంగా.

ఏ ఫాం హౌస్… మానవ సహజ కుతూహాలం నాలో.

“చంద్ర ఓ ఫాం హౌస్ ప్లాన్ చేశాడు. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. అతను రాజకీయంగా ఎదుగుతున్నాడు కదా. ఆ ఫాం హౌస్ భాధ్యత మొత్తం కూడా మేఘన తన పైనే వేసుకుంది. వీళ్ళ సంబంధం గురించి చంద్ర భార్యకు, తల్లి తండ్రులకు కూడా తెలుసు. మా కులంలో రెండు వివాహాలు మామూలే అంటూ అతను చెప్పిన మాటలను మేఘన పూర్తిగా నమ్మేసింది. అతను తనను పెళ్ళి చేసుకుంటాడని మాతో చెప్పేది కూడా.” సుమ మాట్లాడుతుంటే కొందరు మా ఇద్దరి దగ్గరకు కుర్చీలు జరుపుకున్నారు.

“అతను తనను పెళ్లి చేసుకోడని మాకు తెలుసు. కాని మేం ఏం చెప్పినా మేఘన వినేది కాదు. ఆమెతో చంద్ర గురించి మేం ఏం చెప్పబోయినా మా మధ్య దూరం పెరిగేది. అందుకని చాలా సార్లు ఆమె దగ్గర ఈ విషయం ఎత్తేవాళ్లం కాదు” మాట కలిపింది మరో స్నేహితురాలు పద్మ.

మేఘన తల్లి తండ్రులు ఆమెను వారించి ఉంటారు కదా… అడిగాను.

“వాళ్ల అమ్మా నాన్నలిద్దరికీ ఈ రిలేషన్ షిప్ ఇష్టం లేదు. మేఘన చంద్ర విషయంలో ఎవరినీ లక్ష్య పెట్టేది కాదు. అంతెందుకు పాపను ప్రతి రోజు మేఘన ఫాదర్ వచ్చి తీసుకెళ్ళేవారు. అయినా అతను చంద్రను మేఘన మరణించే రెండు రోజుల క్రితం దాకా చూడలేదు. వారిద్దరూ ఎదురు పడకుండా జాగ్రత్తపడేది మేఘన. చంద్ర పట్ల ఎవరు నెగెటివ్ గా మాట్లాడినా సహించేది కాదు.”

ఫాం హౌస్ గొడవ ఏంటీ” అడిగా సుమను.

పద్మ చెప్పడం మొదలెట్టింది.”చంద్ర కట్టిస్తున్న ఫాం హౌస్ మొత్తాన్నిప్లాన్ చేసింది మేఘనే. తన టేస్ట్ చాలా బావుంటుంది. ప్రతిదీ చాలా శ్రద్దగా ఎంపిక చేసి పని చేయించేది. ఆ ఫాంహౌస్ లో చెట్లను మహారాష్ట్ర వెళ్లి తీసుకొచ్చింది. అంతగా ప్రతిదీ పట్టించుకుని పనిచేసింది. కాని ఆ ఫాం హౌస్ గృహప్రవేశం జరిగింది తనకు తెలియదు. అతని కుటుంబం మొత్తం ఆ రోజు వేడుక చేసుకున్నారు. కాని మేఘనకు అది తెలియకుండా జాగ్రత్తపడ్డాడు చంద్ర. అది తనకు తెలిసిన రోజున వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది అని తర్వాత తెలిసింది”.

“అతని జీవితంలో తన స్థానం ఏంటనే ప్రశ్న మీద ఇద్దరూ గొడవపడ్డారు. ఈ విషయంలో అతను పరుషంగా మాట్లాడాడని తెలిసింది” అంది సుమ.

గుండె భారం అయింది నాకు. మేఘన కొద్ది కొద్దిగా అర్ధం అవుతుంది.

దీనికి మేఘన ఎలా రియాక్ట్ అయింది అడిగాను.

“మేఘన చాలా మొండిది అండి. వారిద్దరి మధ్య ఏం జరిగిందో స్పష్టంగా తెలియకపోయినా, ఆమెకు తన కుటుంబంతో పాటు సమాన స్థానం ఉండదని చంద్ర స్పష్టంగా చూపించాడు కదా. అది మేఘనకూ చాలా కోపం తెప్పించింది. వారిద్దరి గురించి మా అందరికీ తెలుసు కాని ఆ రిలేషన్ పబ్లిక్ కాలేదు. ఈ గొడవ తర్వాత కోపంతో బాధతో రెచ్చిపోయి సోషల్ మీడియాలో తన అకౌంట్లన్నిటికీ తన పేరు చివర అతని పేరు జోడించి వారిద్దరి సంబంధాన్ని బహిర్గతం చేసింది మేఘన. దాంతో గొడవ ఇంకా ముదిరి ఉంటుంది. మేం మాత్రం వారిద్దరూ ఓపెన్ అయ్యారేమో అనుకున్నాం ఆ రోజు.”

“ఆ తర్వాత వాళ్ళ నాన్నను పిలిచి తమ మధ్య జరుగుతున్న గొడవ సంగతి చెప్పిందట. చంద్రతో మాట్లాడమని అన్నదట. అంకుల్ పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేకపోతే ఆమెకు ఆశలెందుకు కల్పించావు అని అతన్ని నేరుగా అడిగారట. దానికి చంద్ర నిర్లక్ష్యంగా నేను ఆశలు కల్పించలేదు ఆమె కల్పించుకుంది అని బదులిచ్చాడట. ఆ మరుసటి రోజు ఆఫీసుకు వస్తానని చెప్పి పాపను స్కూల్ కు పంపి ఇలా చేసింది. ఆమె ఈ రిలేషన్ లో దిగే దాకా ఆమె వెంట ఉండి అడుగులకు మడుగులు వత్తేవాడు ఈ చంద్ర.” పద్మ ముఖంలో బాధా, కోపం
అంతే కదా. స్త్రీ దొరికే దాకా పురుషుడి రూటు వేరు. తనకు శారీరికంగా, మానసికంగా పూర్తిగా లొంగిపోయాక అదే స్త్రీ పట్ల అతనికి చాలా చులకన భావం ఏర్పడుతుంది. లాకర్ లో పెట్టిన బంగారం లాగ. ఆమె ఒక ఎసెట్ తప్ప మరేమీ కాదు. లాకర్ లోకి రావల్సిన ఇతర అసెట్లపై అతని దృష్టి మరలుతుంది.

“అతను ఆర్ధికంగా ఆమెకు సహాయపడేవాడా” అడగకూడదనుకున్నా కాని అడిగేశాను.

“మేఘన బాగానే సంపాదిస్తుంది రాధికా. తను, తన కూతురు బ్రతకడానికి హాయిగా సరిపోతుంది. కలిసి ఉన్నక్రమంలో కొంత అటు ఇటు ఖర్చులు జరిగేవేమో కాని అతనిపైనే ఆధారపడాల్సిన స్థితిలో ఆమె ఉందని నేను అనుకోను” అనుపమ కల్పించుకుంది.

ఆలోచిస్తూ ఉండిపోయాను. తలంతా దిమ్ముగా ఉంది.

“నేను కాబ్ లో వచ్చాను. నన్నుఇంటి దగ్గర దిగబెట్టి వెళ్ళు” అంటూ వెళ్ళడానికి లేచింది అనుపమ.

ఇద్దరం బైటికివచ్చాం. మౌనంగా ఉన్న నాతో “ఏంటీ ఏదో ఆలోచిస్తున్నట్లున్నావ్?” అడిగింది అనుపమ.

నా జీవితంలోని సంఘటనలు ఒకొక్కటిగా గుర్తుకు వస్తున్నాయి. చచ్చిపోవాలని నేను ప్రయత్నించిన ఆ రాత్రి, ఆ నాటి నా మనఃస్థితి గుర్తుకు వస్తోంది.

నేను మౌనంగా ఉండడం చూసి అనుపమ మాటలు పొడిగించలేదు. కెఫే కాఫీ డే దగ్గర కారు ఆపించింది.” కాఫీ తాగి వెళ్దాం రా రాధికా” అంది.

మౌనంగా కార్ పార్క్ చేసి ఆమెను అనుసరించాను. ఇద్దరం ఓ కార్నర్ చూసి కూర్చున్నాం. తనే ఏవో ఆర్డర్ చేసింది. నాకు ఇలాంటి కాఫీ షాప్ లలో అన్నీ ద్రవపదార్దాలు ఒకేలా ఉంటాయి. నేను రోజు తాగే సాదా టీ తప్ప మిగతా వేవీ నాకు పడవు. కాని ప్రస్తుతం కొంత వెంటిలేట్ అవ్వాలి. అను కూడా అది అర్ధం చేసుకుందేమో కాసేపు కాఫీ తాగుతూ మౌనంగా నన్ను చూస్తూ కూర్చుంది.

“రాధికా ఒకటి అడుగుతాను. మేఘన నీకు అంతకు ముందు తెలియదు. ఎందుకు ఈ సంఘటన పట్ల ఇంత ఆసక్తి. ఎప్పుడు ఫోన్ చేసినా ఇదే విషయం కొన్ని నెలల నుండి పోనీ నీ అభిప్రాయంగా ఏదన్నా రాస్తావనో, డిస్కస్ చేస్తావనో ఎదురు చూసా, ఈ రోజూ కూడా నువ్వు మౌనంగా వింటూ ఉన్నావు తప్ప ఏం కాంట్రిబ్యూట్ చేయలేదు. మరి ఈ ఆసక్తి ఎంటీ? ఇది నాకు అంత కంహర్టబుల్ గా లేదు”. అంది.

“మేఘన ఆత్మహత్యను నువ్వెలా చూస్తావు అను. నిజాయితీగా చెప్పు” అడిగా.

కాసేపు ఆలోచించింది అను.

“మేఘన మా కళ్ళ ముందు పెరిగింది రాధికా. మాకు ఆమె తొందరపాటు, మొండితనం బాగా తెలుసు. కాలేజీ రోజుల్లోనే చేసుకున్న ప్రేమ వివాహం గురించి నాకు పెద్దగా తెలియదు. కాని రెండో వివాహంలో హింసను అనుభవించింది. జీవితంలో సెటిల్ కావాలని చాలా ప్రయత్నించింది. చంద్రతో రిలేషన్ షిప్ లోకి వెళ్లిన తర్వాత చాలా మందికి దూరం అయింది. అతను తన జీవితానికి తోడుగా నిలుస్తాడనుకుని భంగపడింది. చాలా విషయాలని ఎమోషనల్ గా డీల్ చేసేది. కాని తనకు సహాయం కావాలంటే కాదనలేని స్నేహితులు శ్రేయోభిలాషులు ఆమె చుట్టూ ఎప్పుడూ ఉన్నారు. తనే తొందరపడింది.”

“మేఘన లో నన్ను నేను చూసుకుంటున్నాను అను…” చెప్పాను మౌనంగా.

“మీ యిద్దరిలో ఏం పోలిక ఉంది రాధికా. ఎక్కడో ఎమోషనల్ అవుతున్నావేమో” అంది అను.

“ కాదు అను. మేఘనలో ఒకప్పటి నేను ఉన్నాను. ఆమెతో నన్నునేను పోల్చుకుని చూసుకుంటూ ఆమె ముగింపుకు నా ప్రస్తుత జీవితానికి మధ్య తేడా వెతుక్కుంటున్నాను” అన్నా.

అను అర్ధం కానట్లు చూసింది.

“రెండు పరాజయాల తర్వాత కూడా జీవితంలో ప్రేమను వెతుక్కుంటూనే ఉంది మేఘన. ఆమెకు మనుషుల పట్ల, ప్రేమ పట్ల నమ్మకం చావలేదు. నేను నా జీవిత పరాజయాల తర్వాత మనుషులను నమ్మడం మానుకున్నాను. నా జీవితంపై మరో వ్యక్తికి కంట్రోల్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. ప్రేమ, తోడు, నువ్వు అన్నావు చూడు సెటిల్మెంట్ ఇవి మరో వ్యక్తి ద్వారా రావని నిశ్చయించుకుని నన్ను నేను మార్చుకున్నాను. నా ఎమోషన్స్ ని ఎవరి మీదా ఇన్వెస్ట్ చేయకుండా జాగ్రత్తపడ్డాను. కాని మేఘన ప్రేమిస్తూనే వెళ్లింది, ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశిస్తూనే ఉంది. నిజానికి నాతో పోల్చుకుంటే ఆమె సహజమైన మానవనైజంతో జీవించాలని ప్రయత్నించింది. అందుకే మానసికంగా శారీరికంగా దోపిడికి గురయ్యింది”.

“ఐ వాజ్ యూజ్డ్” అన్న భావం ఎంత నరకంగా ఉంటుందో ఆ దారిలో కొంత దూరం ప్రయాణించిన నాకు తెలుసు. ఆ తర్వాత జీవితంలో మరెప్పుడూ ఎవరి చేతికీ చిక్కకూడదని నాలో సహజంగా ఉండాల్సిన మానవ అనుభూతులను, కోరికలను సహజీవనంపై నమ్మకాన్ని చంపుకుని కేవలం బాధ్యత మాత్రమే సూత్రంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను. నేనిప్పుడు చాలా సొఫిస్టికేటెడ్ గా జీవిస్తున్న మాట నిజం. నా దగ్గరకు రావాలంటే చాలా మంది స్త్రీలు పురుషులు కూడా భయపడతారు. అదే మేఘన లా నా జీవితం ముగిసిపోకుండా కాపాడింది. కాని ఇది సహజమైన మానవ నైజం కాదు అను. ఈ సమాజంతో నిత్యం నేను చేస్తున్న యుద్ధాన్ని నేను గెలిచింది భయం అనే ఆయిధంతో. మేఘన ప్రేమ అనే ఆయుధంతో బలం సంపాదించుకుని జీవితాన్ని గడపాలని ప్రయత్నించింది. అతనికి పెళ్లయిందా, పిల్లలున్నారా, తనను సమాజం ఏ రకంగా పరిగణిస్తుంది అన్న విషయాలన్నిటిని పక్కకు నెట్టి ప్రేమ కోసం అన్నిసెక్యూరిటీలను వదిలి, పెద్ద రిస్క్ తీసుకుంది. అతనికి ఉపయోగపడింది. తనను తాను కరిగించుకుంది. మనిషిగా చాలా సహజంగా జీవించింది. అందుకే ఓడిపోయింది”.

“ఆ ఓటమే ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించింది. నాలాంటి స్త్రీలకు భయపడే సమాజం, మేఘన లాంటి స్త్రీలను ఎలాంటి స్థితికి తీసుకొచ్చిందో చూడు. సహజంగా జీవించాలని, ఆత్మీయతను అందుకోవాలని అనుకునే వ్యక్తిని ఎంత క్షోభ పెడుతుందీ ప్రపంచం. నా జీవితంలో చంద్రశేఖర్ లాంటి వ్యక్తులు రాక కాదు, ప్రయత్నించారు. ఒంటరి స్త్రీ చుట్టూ ఇలాంటి వాతావరణమే ఉంటుంది. కాని నేను ఓ కోట కట్టుకున్నాను. అందులోకి ఎవరికీ అనుమతి లేదు. నాది నిజానికి అసహజమైన జీవన విధానం. కాని అను ఈ అసహజమైన జీవితం ఇచ్చే ప్రశాంతతను సహజంగా జీవించాలనుకునే వాళ్లు పొందలేకపోవడం చూస్తుంటే నాకు ప్రపంచం తిరగబడి నడుస్తున్నట్లు అనిపిస్తుంది.”

“అతిగా ఆలోచిస్తున్నావేమో రాధికా. నిజానికి చంద్ర ట్రాప్ లో మేఘన పడిపోయింది. ఒక సెక్యూర్డ్ జీవితం కోరుకుంది. అది ఇచ్చే సీన్ ఆ చంద్రకు లేదన్నది ఆమె గ్రహించలేకపోయింది.” అంది అను.

“ఎస్ నువ్వు చెప్పింది నిజం. చంద్రకు ఆ సీన్ లేదు. నిజానికి ఏ వ్యక్తికీ ఆ సీన్ లేదు. ఉండదు కూడా. కాని ప్రపంచం మనల్ని మాయ చేస్తుంది. దాని కోసం పెళ్లి, కుటుంబం అనే వ్యవస్థలను నిర్మించింది. ఆ మూసలో ఉంటే తోడు ఉంటుందని మభ్య పెట్టింది. బదులుగా ఆర్ధిక భద్రతను అందించింది. కాని మేఘన ఈ తరం పిల్ల. ఆమెకు ఆర్ధిక భద్రత కోసం మగాడిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. అయినా ఆధారపడింది. తన జీవితంలో సెక్యూరిటి ఓ పార్టనర్ అండతోనే వస్తుందని నమ్మింది. సెక్యూర్డ్ జీవితం కోసం మరొకరి మీద ఆధారపడాల్సిన స్థితి నుండి మనుషులు మానసికంగా బైటపడితే, ఎన్ని జీవితాలు గాటిన పడతాయో, ఎన్ని మరణాలు ఆగుతాయో ఆలోచించు అను.

“ప్రతి ఒక్కరు ఎమోషనల్ కనెక్ట్ కోరుకోవడం సహజమే కదా రాధికా”.

“ఎమోషనల్ కనెక్ట్ కోరుకోవడం తప్పు కాదు, కాని ఆ కనెక్ట్ జీవితాన్నిచిదిమేయకూడదు కదా. అది తప్ప మరో మార్గం లేదనే స్థితికి జీవితాలు వెళ్లకూడదు కదా”

“ఆడది దొరికేదాక మగాడు స్త్రీకి లొంగి ఉంటాడు, తరవాత ఆమెను లోంగదీసుకునే ప్రయత్నం చేస్తాడు. అడుగడుగునా ఆమెను బలహీనపర్చాలని ప్రయత్నిస్తాడు. ఆమె బలం పుంజుకుంటే తను చెప్పినట్లు ఆడదని భయం. చంద్ర చాలా సిస్టమేటిక్ గా మేఘనను ఒంటరిని చేసాడు. ఆమెను స్నేహితులకు, పాత ప్రపంచానికి దూరం చేసాడు. తన మీద ఆమె పూర్తిగా ఆధారపడేలా చూసుకున్నాడు. తన రాజకీయ పరపతి, తన కెరీర్ గ్రోత్ ఆమె స్థాయిని పెంచుతాయనే భ్రమను కూడా పరోక్షంగా కలిగించే ప్రయత్నం చేసి ఉండవచ్చు. అతనితో మేఘన ఓ అందమైన ప్రపంచాన్ని ఊహించుకుంది. అల్లుకుపోవడానికి ఓ చెట్టు నీడ దొరికిందని ఆశపడింది. కాని ఆ ఫాం హౌస్ విషయంలో ఆమె స్థానం ఏంటో ఆమెకు అర్ధం అయింది. చంద్ర ఆమె తండ్రితో అన్నది నిజమే అతను మేఘనకు ఆశలు కల్పించలేదు, మేఘనే ఆశ పడింది. ఆమె సహజమైన కోరికలను బలహీనతలుగా మార్చుకుని తన లాభం చూసుకున్నాడు అతను. స్త్రీల నైతికతను మాత్రమే ప్రశ్నించే సమాజం అతని మానిప్యులేషన్ ని మగవాడి తత్వంగా క్షమించేస్తుందని అతనికి తెలుసు” అను గొంతులో కోపం.

“అవును. డబ్బు, టైం ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకుంటే పడే బాధ వేరు. ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేసి ఓడిపోతే అది మనసును దహించివేస్తుంది. విధ్వంసం వైపుకే ఆ అనుభవం నెడుతుంది. మేఘన స్వీయ విధ్వంసాన్ని ఎంచుకుంది. తాను ఎంతో గర్వంగా మొండిగా ఏదో సాధిస్తానని మీ అందరితో చెప్పి, ఎందరినో ఇతని కోసం దూరం చేసుకుని చివరకు తాను మోసపోయానని ఒప్పుకోవడానికి, ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి మేఘన మనసు నిరాకరించి ఉంటుంది. ఈ సమాజం మోసపోయిన వారిని గేలి చేస్తుంది తప్ప అర్ధం చేసుకోదు, చేయూత అందించదు. ఆ వెక్కిరింతలను ఎదుర్కుంటూ మళ్ళీ జీవితాన్ని జీరో నుండి మొదలెట్టడానికి ఆమెలో ఓపిక నశించి ఉంటుంది”.

“తనను పొందడానికి కాళ్ళు పట్టుకుని దేబరించిన వ్యక్తి తన జీవితాన్ని ఆక్రమించి శాసిస్తూ తనను అడుసులోకి నెట్టేస్తుంటే అది కలిగించే బాధను అనుభవించడం కన్నా మరణాన్ని ఆహ్వానించడం సులువు అనిపించి ఉంటుంది.” మనసంతా బాధతో నిండిపోయి అనుకి మాటలు రాలేదు. “ఈ ఆధారపడే తత్వం ఈ ఆధునిక విద్యావంతులైన స్త్రీలలో ఎందుకు ఎక్కువ అవుతుంది రాధికా”.. బాధ ద్వనించింది అను గొంతులో.

“ఎందుకంటే మన జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. అవసరాలు, విలాసాల నడుమ గీత చెదిరిపోయింది. సమాజంలో ఒక మోస్తరు గౌరవంతో బ్రతకడానికి కూడా ఆర్ధిక స్థాయి పెంచుకోవలసి వస్తుంది. చుట్టూ ఉన్నసమాజం నీతితో పేదరికంలో బతికే వాళ్లని హేళన చేస్తూ ఆర్ధికంగా ఉన్నత స్థాయికి చేరిన వారిని సహపంక్తిన కూచోపెడుతూ గౌరవించడంతో, అందరూ తమ స్థాయిలను పెంచుకునే పనిలో పడ్డారు. అంతెందుకు ఓ సింగిల్ విమెన్ గా అద్దె ఇంట్లో ఉంటూ ఓ లూనాపై నేను వస్తుంటే నన్నుచూసే దృష్టి, ఓ పాష్ కాలనీలో ఓ త్రీ బెడ్ రూం ఇంటిలో ఉంటూ బ్రాండెడ్ బట్టలతో, కారులో ప్రయాణిస్తున్నప్పుడు నన్ను చూస్తున్న దృష్టిలో ఎంత మార్పు ఉంటుందో నాకు అనుభవమే. ఆ సమాజ దృష్టిని ఎదుర్కోవడానికి ఆధునిక స్త్రీ తనను తాను సిద్ధం చేసుకునే ప్రయత్నంలో డిపెండెంట్ గా మారిపోతుంది.

“అవును రాధికా ఇప్పటి తరానికి ప్రొఫెషనల్ గా ఎదగాలంటే గ్రూమింగ్ చాలా అవసరం అయిపోయింది. ప్రెజంటబుల్ గా కనిపించాలనే తాపత్రయంతో సహ ఉద్యోగస్తులతో పోటికి సిద్దపడుతూ పెట్టే ఖర్చు తిండి ఖర్చుకి ఎన్నో రెట్లు ఎక్కువే. వీటన్నిటితో పాటు జాబ్ సెక్యూరిటీ లేకుండా, నిత్యం పోటీ ప్రపంచంలో తమను తాము ప్రూవ్ చేసుకుంటూ ఆ ఉద్యోగాన్నినిలుపుకోవడం అనే మరో టెన్షన్. ఉద్యోగాలలో పురుషాధిక్యతను దాటుకుంటూ తన టాలెంట్ తో పైకి ఎదగడం స్త్రీకి ఎంత కష్టం. ఇన్ని యుద్దాలు చేస్తున్నప్పుడు ఎలాంటి వ్యక్తి కయినా తోడు కావాలనిపిస్తుంది. ముఖ్యంగా కెరీర్ లో ఎదగాలనుకునే స్త్రీలకు, కుటుంబపరంగా ఆర్ధికపరమైన అండలేని వారు ఇలాంటి తోడు కోసం వెంపర్లాడతారు. మేఘన ఎంత కెరీర్ విమెన్ గా ఎస్టాబ్లిష్ అయినా ఆమెలో ఇంసెక్యూరిటి దూరం కాలేదంటే ఆధునిక స్త్రీ చుట్టూ ప్రస్తుతం ఏర్పడిన వాతావరణమూ కారణమే” దూరంగా కూర్చున్న ఓ యువ జంటను చూస్తూ అంది అను.

“ఇన్ని వైరుధ్యాల నడుమ ఓ బలమైన ఐడియాలజీ అన్నా మనిషికి తోడుండాలి అను. ఐడియాలజీ ఇచ్చే సెక్యూరిటి, జీవితానికి ఇచ్చే అర్ధం బలం, కూడా తక్కువేమీ కాదు. ఇప్పటి తరానికి ఎలాంటి ఐడియాలజీ వారసత్వంగా లభిస్తుంది చెప్పు. ప్యూర్ మెటేరియలిజం అంతే కదా. వ్యక్తిగత ప్రేమ, కుటుంబ సెక్యూరిటీని మించిన జీవన ప్రమాణాలు ఉంటాయని మనం ఈ తరానికి చెప్పగలుగుతున్నామా అందుకే వీళ్లని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. వీళ్ళ ఆధునిక జీవితాలన్నీ టైం బాంబ్ మీద నిలిచి ఉన్నాయి. చదువుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, ఫ్రీ లివింగ్ కి అలవాటు పడుతున్నారు. కాని ఇంకా ఇంకా పంజరాలలో ఇరుక్కుపోతున్నారు. నేను పితృస్వామ్యం, సాంప్రదాయాలతో మాత్రమే యుద్దం చేసాను. నా కన్నా పది సంవత్సారాలే చిన్నదైన మేఘన ఎన్నిటితో యుద్దం చేయాల్సి వచ్చిందో చూడు. పాత రోజుల్లో ఆర్ధిక స్వావలంబన లేక స్త్రీల పరిస్థితి అంత ఘోరంగా ఉండేది. ఇప్పుడు అన్నీ ఉన్నా వీరి జీవితాలలో వచ్చిన మార్పు ఏంటి? ఇప్పటికీ అదే ఆధారపడే తత్వం, అది ఇంకా ఇంకా వీళ్లను లోబర్చుకుంటుంది”.

“వీళ్ళకు సాంప్రదాయాలను పక్కకు నెట్టే ధైర్యాన్ని ఇచ్చాం. దానికి బదులుగా పుట్టినప్పటి నుండీ సక్సెస్ కోసం పరుగు పెట్టడం నేర్పించాం. సక్సెస్ అంటే డబ్బు సంపాదించడం, ఫామిలీ సెక్యూరిటీ, పదవి, పరపతి అని చెప్పాం. పిచ్చివాళ్లుగా వాటి కోసం వెంపర్లాడుతున్నారు వీళ్లు. ఆ పందెంలో అందరి మధ్యన ఒంటరి జీవితం గడుపుతున్నారు. పెనం నుండి పొయ్యిలోకి తోసాం వాళ్ళని. గెలవడమే ధ్యేయంగా బతుకుతూ బలహీనులవుతున్న ఆధునిక స్త్రీలు ఇలాంటి ఉచ్చుల్లో పడడం కేవలం వారి తప్పేనా? జీవితం మొదలుపెడుతున్నప్పుడే అప్పులకి అలవాటు చేసి, ఆ అప్పుల జీవితాల్లో గొప్పను చూపించి, కంజ్యూమరిజాన్ని హైప్ చేసి అవే, ఈ తరానికి సక్సెస్ సూత్రాలుగా చూపించి వారిని జీవితాలను ఎదుర్కోమంటే ఏం జరుగుతుంది?”

“ఇలా ఆలోచించి ఎమోషనల్ డిపెండెంసీ వద్దంటూ ఫ్రీ సెక్స్, ఫ్రీ లైఫ్ అంటూ బ్రతికేవారు సేఫ్ అనా నీ ఉద్దేశం” అను ఆశ్చర్యంగా అడిగింది.

“అస్సలు కాదు. సెక్స్ చాలా భయంకరమైన అవసరం. ధ్రిల్ కోసం, ఫ్రీడం కోసం ఆ మార్గంలో ప్రయోగాలు చేస్తుంది ఈ తరం. కాని ఈ థ్రిల్ ఎప్పుడు ఎమోషనల్ గా వారిని దెబ్బతీస్తుందో ఎవరూ చెప్పలేరు. విచ్చలవిడి శృంగారం మనిషిని మానసికంగా చంపేస్తుంది. తమ శరీరాలకు తామే విలువ ఇచ్చుకోలేని హీనమైన ఒంటరితనంలో హత్యలు, ఆత్మహత్యల దారిలో నడిచే సంఖ్య ఇప్పుడు తక్కువేమీ కాదు. చాలా మంది ఫ్రీ స్టైల్ లో జీవించే వారు మనుష్యులుగా చచ్చిపోయి రోజులు గడుపుతున్నారు. ఇదీ మరో రకమైన ఆత్మహత్యే. బ్రతికి ఉండగానే చస్తూ జీవించడం”.

“మేఘనది పర్సనల్ ఫెయిల్యూర్ రాధికా” అను గొంతులో అసహనం.

“కావచ్చు. కాని అది సిస్టం ఫెయిల్యూర్ కూడా. చంద్ర లాంటి మగవారిని తయారు చేసే సిస్టమే, మేఘన లాంటి స్త్రీల నిష్క్రమణకు కారణం అవుతుంది.”

“మేఘన ఒక బంధం నుండి విడిపడి, ఇతర బంధాలను వెతుక్కుంటూ వివాహితుడి జీవితంలోకి ప్రవేశించి, దాని ద్వారా స్టేబిలిటీ ఆశించి మాత్రమే తప్పు చేస్తే ఆ జీవితం నుండి తేలికగా బైటపడేది. తనదంటూ ఏమీ మిగిల్చుకోనంతగా ఈ రిలేషన్ షిప్ లో ఇన్వాల్వ్ అయింది. ఆ రిలేషన్ షిప్ తన జీవితంలో అన్నిటికన్నా ముఖ్యం అని, దాని ద్వారానే తన ఉనికికి గౌరవం, గుర్తింపు అన్న భావంలో ఉండిపోయింది. అందుకే ఆ ఫాం హౌస్ విషయంలో తన స్థానం ఏంటో తెలిసాక కుప్పకూలిపోయింది.”

“ఇంకో మాట కూడా వినిపించింది రాధికా” అను గొంతు తగ్గించింది.

“రాజకీయంగా ఎదగాలనుకుంటున్న చంద్ర, మేఘనను ఇంకోలా ఉపయోగించుకోవాలని కూడా ప్రయత్నించడానికి అవకాశాలు ఉన్నాయి. అవి తెలిసి తట్టుకోలేకపోయిందేమో లేదా ఆ విషయంలోనూ మోసపోయిందేమో అన్న ఊహాగానాలు కూడా ఆమె మరణం తర్వాత నడిచాయి”. అను మాటల్లో భయం కూడా ఉంది.

“నాకు తెలుసు ఆమె పరిచయస్తుల లిస్ట్ లో నేను లేకపోవడం వల్ల ఆ విషయాలు ఇంకా ఎన్నో ఊహాగానాలతో నా దాకా వచ్చాయి. మోసపోయిన స్త్రీ, తనను తాను కోల్పోయిన స్త్రీ ఎంత వరకు మోసపోయిందని విచారంచడం వల్ల ఒరిగేది ఏమీటి అను? అందుకే సాటి స్త్రీగా ఆమె మీద ఇంకొన్ని రాళ్ళు వేయలేక నిజాయితీగా నా జీవితంతో ఆమె జీవితాన్ని పోల్చుకుంటూ ఆలోచిస్తున్నాను”.

“మేఘన తొలినాటి జీవితం ఇంచుమించు నా జీవితంతో సమానమే. నేనూ ఓ బిడ్డతో బైటపడ్డాను. ఆ తర్వాత ఆ బిడ్డపై నా ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేసాను. నీతి, మాతృత్వం అంటూ దీర్ఘాలు తీసే వాళ్ళు అదో గొప్ప నిర్ణయంగా నా గురించి చెప్పుకుంటారేమో కాని. అక్కడా నాకు ఒరిగింది ఏమీ లేదు. కాకపోతే కూలిపోకుండా నన్ను నేను నిలుపుకున్నాను. అంతే. మేఘన ఓ తల్లిగా మాత్రమే జీవిస్తే బావుండేది అని నీతి సూత్రాలు చెప్తున్న వాళ్లూ నాకు తెలుసు. అక్కడ మాత్రం ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ కు ఫలితం ఏదో దక్కుతుందన్నదీ భ్రమే. ఎక్కడన్నా పూర్తిగా మనల్ని మనం ఇచ్చేసుకుంటే ఆటబొమ్మలుగానే మిగిలిపోతాం. సరిహద్దులు నిర్మించుకోవాలి అను. అన్ని బంధాల మధ్యా సరిహద్దులు ఉండాలి. లేకపోతే మేఘన పరిస్థితే నాది, నాలాంటి స్త్రీలందరిదీ కూడా. మా ఇద్దరి జీవితాలలోనూ ఎమోషనల్ అచీవ్మెంట్ ఏమీ లేదు. తను అలసిపోయింది. నేను పోరాడుతున్నాను. గెలుపన్నది లేకపోయినా, నేను జీవితంలో ఓడిపోలేదు. ఇదే తనకీ నాకూ మధ్య ఉన్న తేడా. కాని ఇదే ముఖ్యమైన తేడా కూడా. ఇది అర్ధం అయింది కాబట్టే మేఘన నాకు చాలా దగ్గరగా వచ్చినట్లు అనిపిస్తుంది. సిస్టర్ హుడ్ అంటే ఇదే కావచ్చు…

లోపలికి అప్పుడే ఓ జంట వచ్చారు. అతను ఆమె చేయి పట్టుకుని నడిపిస్తూ తీసుకొస్తున్నాడు. ఆమె అతనిపై వాలిపోయి నడుస్తుంది. ఆమె మొహంలో ఎంతో తృప్తి ఆనందం…

ఇద్దరం ఒకరి మొహం ఒకరం చూసుకున్నాం…

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

Leave a Reply