క్లిష్ట పరీక్ష!

నా దేశ ప్రజలారా!
దేశమసలే క్లిష్ట పరిస్థితిలో ఉంది
ఎక్కడి వాళ్ళు అక్కడే గప్పుచుప్
మీరు మీ గుడిసెల్లోనే దాక్కోండి

వర్క్ ఫ్రం హోం
ఇళ్లలో నుండే దుక్కులు దున్నండి
ధ్యానంలో ధాన్యాన్ని కుప్పలుగా
మనో ఫ్యాక్టరీల్లో కుప్పతెప్పలుగా
వినిమయ వస్తువుల్ని పండిద్దాం
విశ్వగురువులుగా విహారం చేద్దాం!

తప్పదు రామా!
పెళ్ళిళ్లు పోస్ట్ఫోన్ చేసుకోక
ప్రేమించు కోవటాలూ
పార్కుల్లో తిరగటాలూ
కోర్కెలపై మొహాలూ
దేశానికి మించిన భారం తల్లీ
ఆత్మనిబ్బరం అవసరం కన్నా
దేశ మాత కన్నీళ్ళు కడగటం
కోసం వికసితమవుదాం రారా!

డోంట్ వర్రీ ముస్తఫా!
బంగారపు రోజులివి భయం లేదిక
ఆకలి లేని టాబ్లెట్లు రేషన్ లో పంచుతాం
Netflix లో ఉచిత సినిమాలు చూపిస్తాం
గంటకోసారి మోగే మాతరం రింగ్ టోన్లు
వింటూ రామకోటి రాసుకుందాం
దేశం కోసం …ధర్మం కోసం!

ఒరే బుజ్జీ, నువ్విక చదవాల్సిందిలేదు
ఇనిస్టా రీల్స్ చూసీ చూసీ అలిసినట్టున్నావ్
ఇక నీకు ప్రతిరోజూ దేశంకోసం సెలవు
ఆన్లైన్లో కళ్ళు మూసుకుని నిద్రపోరా
హనుమాన్ చాలీసా చదువుకుంటూ
ఆత్మ జ్ఞానం ముందు అన్నీ దిగదుడుపేరా
గురువా! గురువా! ఆన్లైన్ చదువా!

పనీ పాట లేని బొద్దంకుల్లారా!
అయిందానికీ కానిదానికీ అరవకండహే
ఆకలితో చావడమే దేశభక్తని తెలుసుకోండి!

ప్రత్యామ్నాయ సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలపట్ల ఆసక్తి. తత్వశాస్త్ర అధ్యాపకుడు. "దళిత ఉద్యమం, వెలుగునీడలు" (వ్యాససంపుటి), "పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ అంబేద్కర్," థీయరిటికల్ అండర్ స్టాండింగ్ ఆఫ్ దళిత్ మూవుమెంట్" రచయిత. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తుంటాడు.

One thought on “క్లిష్ట పరీక్ష!

Leave a Reply