‘ఎర్రకలువ’ కథాకాలం నుండి బమ్మిడి జగదీశ్వరరావు నాకు తెలుసు. 1996 జనవరి 27 న బరంపురం సాహిత్య సభలలో ‘రెక్కలగూడు’ కథల సంపుటి ఆవిష్కరణ సందర్భంలో ముఖాముఖి పరిచయం ఏర్పడింది. ఇరవై ఇరవై అయిదు ఏళ్లకే స్త్రీల జీవితంలోని పరాధీనతను, హింసను, అందుకు కారణమైన సామాజిక లైంగిక వివక్షను అంత బాగా అర్థం చేసుకొని కథలు వ్రాయటం, అదే సమయంలో స్త్రీల జీవితాలలో అంతఃస్రవంతిగా ఉండే పోరాట చైతన్యం వ్యక్తిగత విముక్తి ఆకాంక్షగానో, శ్రామిక మహిళా విముక్తి ఆకాంక్షగానో వ్యక్తం కావటాన్ని నిరూపించటం నన్ను అతని కథలకు అభిమానిగా మార్చాయి.
ఈ క్రమంలో ‘మాతృక’ పత్రికలో ‘కతలు వెతలు’ శీర్షిక కింద వర్తమాన సామాజిక రాజకీయ సందర్భాలను వ్యాఖ్యానిస్తూ బజరా 2015 నుండి వ్రాస్తున్న కథలు ఈ కాలానికి అత్యవసరమైన కథలుగా నన్నెంతో ఆకర్షించాయి. అంతకు ముందు పూర్తిగా లేదని కాదు కానీ 2014 నుండి ఈ పన్నెండు ఏళ్లుగా అభివృద్ధి, సంస్కృతి, శాంతిభద్రతలు అనే మాటలు, భావనలు మనుషులను, మానవ సంబంధాలను శాసించి హింసించే కొత్త ఆచరణగా అనుభవంలోకి రావటం తారస్థాయికి చేరింది. ప్రజాస్వామ్యపు ఒరలో అధికారమే ఆయుధంగా ఒదిగిపోయాక భిన్నాభిప్రాయాలు పట్ల, భిన్న జీవనమార్గాల పట్ల, భిన్న మతాల పట్ల, భిన్న ఆహారపు అలవాట్ల పట్ల అసహనం అధికారమై ఊరేగుతున్నది. ప్రశ్నకు, నిరసనకు తావు లేకుండా పోయింది. ఈ పరిస్థితులలలో రచయితలు ఏమిచెయ్యాలి? అన్న ప్రశ్న వేసుకొని అధికారానికి అక్షరాన్ని ఎదురు నిలపాలి, ప్రజల గొంతుక కావాలి, నిత్య ప్రతిపక్షంగా వ్యవహరించాలి అన్న జవాబు కూడా చెప్పుకొన్నాడు బజరా (రణస్థలి ముందుమాట) నోరులేనివాళ్లకు నోరిచ్చే జాషువా స్ఫూర్తిని, కవులు ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉండాలన్న కాళోజి స్ఫూర్తిని వారసత్వంగా అంది పుచ్చుకొని ఈ కథలు వ్రాసే దీక్ష తీసుకొన్నాడు. 2015 ఫిబ్రవరి నుండి 2017 జులై వరకు ప్రచురించబడిన ముప్పై కథలతో రణస్థలి, 2017 ఆగస్టు నుండి 2000 నవంబర్ వరకు వచ్చిన ముప్పై నాలుగు కథలతో మనువాచకం – మాతృక ప్రచురణలుగా వచ్చాయి. ఇప్పుడు 2020 డిసెంబర్ నుండి 2023 ఏప్రిల్ వరకు వచ్చిన 25 కథలతో ప్రచురించబడుతున్నది ఈతిహాసము సంపుటి. కులం, మతం, దేవుడు, రాజ్యం, లింగ వివక్ష ఈ సమాజంలో ఎలా సృష్టించబడి ఎలా స్థిరపడి ఎవరి ప్రయోజనాలకోసం ఎలా ఉపయోగపడుతున్నాయో, వ్యాఖ్యానించబడుతున్నాయో చూపించే కథలివి.
1
ఈ సంపుటిలో సింహభాగం (పదకొండు) కథలు సనాతన ధర్మం పేరిట సిద్ధం చేయబడి చలామణిలో ఉన్న కులం, మతం, దేవుడు అనే వ్యవస్థలు ఈనాడు భారతదేశ ప్రజాస్వామ్యంలో అధికారపు చలాయింపుకు, స్థిరీకరణకు రకరకాలుగా ఉపయోగించుకోబడుతున్న తీరులోని మాయను విప్పిచెప్పేవి. మనుధర్మం సనాతన ధర్మం అని, సదా అది ఆచరణీయం అని తరచు చెప్పబడుతుంటుంది. మనువు చెప్పింది మనుధర్మం. అది నాలుగువర్ణాల నిచ్చెనమెట్ల సామాజిక వ్యవస్థను స్థిరీకరించింది. దానికి బయట మాల మాదిగలు పంచములుగా కింది స్థాయిలో ఉన్నారు. వర్ణ వివక్ష, లింగ వివక్ష ధర్మబద్ధం చేయబడ్డాయి. నేరానికి శిక్షల నిర్ణయంలో కూడా అవే ప్రాతిపదికలు. మనుధర్మశాస్త్రం బయటదిగా కాక ప్రతి మనిషిలో భాగమై ఉండటం, ప్రతి మనిషి మనువుగా మారటం తరతరాల బోధనల శిక్షణల ఫలితం. అప్పుడే మనుస్మృతి నిలుస్తుంది. ధర్మం గెలుస్తుంది. ఆదర్శ రామరాజ్యం కొనసాగుతుంది. అన్న వర్తమాన లోక వాస్తవం ‘కులసీమ’ (జూన్ 2022) కథకు ఉపోద్ఘాతం.
ప్రతి మనిషిలో మనువాదం ఎలా స్థిరపడిందో చెప్పటానికి చేసిన కల్పన మనువు మనుషుల మధ్యకు వస్తే దర్శనానికి మేము ముందంటే మేము ముందని నిచ్చెనమెట్ల కులవ్యవస్థ లోని మనుషులు పోటీ పడి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఏయే అవయవాల నుండి పుట్టారని చెప్పబడ్డారో వాటికి తామే అధికారులమని తలను, భుజాలను, తొడలను, పాదాలను తెగనరుక్కొని తీసికువెళ్లినట్లు చెప్పటం. దానిపై రెండు ఘటనలు. ఒకటి ప్రభుత్వ పాఠశాలలలో మాల మాదిగ పిల్లలను మిగిలిన అగ్ర వర్ణాల నుండి విడిగా కింద కూర్చో బెట్టటం. పిల్లలు కలిసి కూర్చోటానికి ఇష్టపడని తల్లిదండ్రులు, పంతుళ్లు, వాళ్లకు వండిపెట్టటానికి నిరాకరించే ఆయాలు, నీళ్లు తాగటానికి రెండు గ్లాసులు, రెండు బళ్లు అందుకు అనుమతించిన ప్రభుత్వ అధికారులు -అందరూ ఒక్కొక్క మనువు అని తేల్చి చెప్తాడు రచయిత. రెండవ ఘటన ఒక జిల్లాను అంబేద్కర్ జిల్లాగా మార్చటానికి వచ్చిన ప్రతిపాదనను నిరసించిన, నిరాకరించిన అధికార ప్రతిపక్ష పార్టీల విధ్వసం అన్ని రాజకీయ పార్టీలు మనువాద పార్టీలుగానే ఉండటాన్ని సూచిస్తుంది.
ఈ కథలో అంబేద్కర్ ఒక పాత్ర. కథకు వ్యాఖ్యాత కూడా. ఆయా వర్ణాల వారు మనువు అంగాలను తెగనరుక్కుని పోతూ ఉంటే నవ్విన వాడు, అలా నరుక్కుపోవటం వర్ణ ధర్మానికి అనుకూలంగానే ఉంది కదా అని అసలు వాస్తవాన్ని బయటపెట్టినవాడు, కనిపించకుండా యుద్ధం చేసి అధికారం స్థాపించు కొనటంలోనే మనువు ఉనికి ఉందని చెప్పినవాడు అంబేద్కర్. కులసీమల సృష్టి, నిర్వహణ, సంఘర్షణ, అగ్రవర్ణాల అధికార స్థాపన మనువాద లక్షణమని చెప్పటానికి మనుస్మృతిని తన జీవితకాలంలో విస్తృతంగా అధ్యయనం చేసి లోతుగా విశ్లేషించిన అంబేద్కర్ చక్కగా ఉపయోగపడ్డాడు బజరాకు.
భారతదేశమంటే హిందూమత దేశం అని, స్వాతంత్య్ర ఉద్యమకాలంలో దేశం నుండి పాకిస్థాన్‌ను విడగొట్టి ప్రత్యేక దేశాన్ని ఏర్పరచుకొన్న ముస్లిములతో వెళ్లిపోక దేశంలోనే ఉండిపోయిన ముస్లింలు దేశ పౌరులే కాదన్నట్లుగా వ్యవహరించటం దేశభక్తిగా చలామణిలోకి వచ్చింది. దేశవిభజనకు అంగీకరించిన గాంధీని హత్య చేయగలిగిన తీవ్ర జాతీయవాద పార్టీ ముస్లిం తీవ్రవాద సంస్థలతో ముడిపెట్టి దేశీయ ముస్లిములను అనుమానించటం, అవమానించటం, విద్వేషాన్ని పెంచుకొనటం వరకు పోయింది. ముస్లిములను మొత్తంగా ‘ఇతరులు’గా చూసే ధోరణి ప్రబలింది. ఈ నేపథ్యంలో ముస్లిముల మీద భౌతిక సాంస్కృతిక దాడులు సర్వసాధారణం, నిత్యకృత్యం అయ్యాయి.
ఈ నేపథ్యంలో వచ్చిన కథలు ‘లవ్ జిహాద్’, ‘చేటు భారతం’, ‘బొట్టు పెట్టేసాక’. హిందూ ముస్లిం యువతీయువకుల మధ్య ప్రేమలో తరచు ముస్లిం యువకులు ముస్లిం మతవ్యాప్తికి ప్రేమను ఒక నెపం చేసుకొంటున్నారు అన్న నేరారోపణకు గురై శిక్షించబడుతుంటారు. అందుకు ఒకసారి కారకుడు మెజారిటీ మత ప్రజల దేవుడు కావచ్చు. ఒక సారి పెద్దలు కావచ్చు. పరువు కోసం పిల్లల ప్రాణాలు తీయవచ్చు . మరొకసారి దేవుడి భక్తులో, దేశభక్తులో ఆ పాత్ర తీసుకొవచ్చు. ప్రేమ జంటలు ఎన్నైనా కావచ్చు. అనుభవ విషయంలో సామాన్యాంశం మతాలు వేరుకావటం. అది కీలకమైనప్పుడు జంటల పేర్ల మార్పు వలన అదనపు ప్రయోజనం ఏమీ లేదు. అందువలన ఒకే జంట అనేకమార్లు చస్తూ పునర్జన్మ ఎత్తుతూ ఉండటంగా కథను నిర్వహించటం ద్వారా ఘటనల పునరావృత్తిని చెప్పినట్లయింది.
ఈ క్రమంలో కూతుళ్లను కాపాడుకొనటం హిందువుల కర్తవ్యం అవుతుంది. కాపాడుకొనటం అంటే వాళ్లను ముస్లిం జనాభా పునరుత్పత్తి సాధనాలు కాకుండా జాగ్రత్తపడటమే ఆ పని చేయటానికి సిద్ధపడే రాజ్యానికి అధికారం కట్టబెట్టటానికి తల్లిదండ్రులు ఉత్సాహపడటాన్ని “చేతుల అన్ని వేళ్లకూ నల్లని సిరా చుక్కలు పులుముకున్నారు” అన్న మాటలలో సూచిస్తాడు బజరా.
‘చేటు భారతము’ (సెప్టెంబర్ 2022) కథ బిల్కిస్ బానో వాస్తవ జీవిత కథనం. 2002 గుజరాత్ మారణ కాండలో హిందూ గుండాల అత్యాచారాలకు హత్యలకు కుటుంబమంతా ధ్వంసం అయిపోగా తాను అత్యాచారానికి గురై బతికి బయటపడ్డ బిల్కిస్ బానో చేసిన న్యాయపోరాటం ఫలితంగా నేరస్థులుగా నిరూపించబడి జైలుశిక్ష పడిన పదకొండుమందిలో ఒకడు చనిపోగా మిగిలినవారు ఆజాదీ కా అమృతోత్సవ్ సందర్భంగా విడుదలై విశ్వహిందూపరిషత్ వారి ఘన స్వాగతాలను అందుకొన్న వర్తమానాన్ని 20 ఏళ్ల క్రితపు బిల్కిస్ బానో జీవిత బీభత్సాన్ని ఒకే ఫ్రేమ్ లో ముందు వెనుకలుగా చూపిస్తూ నడిపిన కథ. దేశ విభజన కాలం నుండి బాబ్రీ మసీదు కూల్చివేత మీదుగా దేశం విడిచి పొమ్మనేంతగా హిందువులలో పెరిగిన ముస్లిం ద్వేషం, అదే స్థాయిలో ముస్లిములలో పెరిగిన బతుకు భయం, బ్రాహ్మణ కుల సంస్కారం అన్న మనువాద విలువతో అత్యాచార నేరం మోప దగ్గవాళ్లు కాదు అని నేరస్థులకు మినహాయింపును ఇచ్చే విధానం, ఈ కథలో క్లోజ్ అప్ లోకి వచ్చి భారతదేశానికి చేటు కాలం వచ్చిందని సూచిస్తాయి. ముస్లిముల పట్ల, స్త్రీల పట్ల ఘోరాలు చేసినవాళ్లు దేశభక్తులై మూడురంగుల జెండాకు హక్కుదారులైన విషాదం బానో వంటి బాధితస్త్రీలకే కాదు ఎందరికో భయావహం అన్న సూచనతో ముగుస్తుంది ఈ కథ.
నుదిటిమీద బొట్టు హిందూత్వ ప్రతీక అయి బతుకుతెరువుకు దేవాలయాల ముందు పూలమ్ముకొనే దళిత క్రైస్తవ ముస్లిం స్త్రీలమీద బలవంతంగా రుద్దబడుతున్న వర్తమాన సందర్భాలను విమర్శకు పెట్టింది ‘బొట్టు పెట్టేసాక…’ కథ. సనాతన ధర్మం ప్రకారం భర్తకు, కుటుంబానికి ఒదిగి ఉండవలసిన హిందూ స్త్రీకి లభించిన ఈ కొత్త హిందుత్వ స్థాపనాధికారం సాటి స్త్రీలమీద దౌర్జన్యంచేసే హక్కును ఇయ్యటం పెద్ద వైరుధ్యం. దేవాలయం ముందు పూలమ్ముకొనాలంటే హిందువుగా ఉండాల్సిందే అనే అప్రకటిత శాసనం బతుకు తెరువుకు ఎక్కడైనా ఏ వృత్తినైనా చేసుకొనటానికి రాజ్యాంగం ఇచ్చిన ప్రాధమిక హక్కులకు క్రైస్తవులను, ముస్లిములను పరాయీకరిస్తుంది. అక్కడితో ఆగక తమ కట్టుబొట్టుకు, దైవ విశ్వాసాలకు పరాయీకరించి తమది కాని బ్రతుకు బ్రతకటానికి ఒత్తిడి చేస్తుంది. ఆలా అన్య మతస్థులు తమను తాము కోల్పోవటం లోని హింసను, బీభత్సాన్ని గురించి ఆలోచించమంటుంది ఈ కథ.
2
మతం లాగానే దేవుడూ ఒక ఆధిపత్య సాధనమే. ఆ క్రమంలో దుష్ట శిక్షణ , శిష్ట రక్షణ కోసం అవతారాలు ఎత్తే స్వతంత్రతను కోల్పోయిన దేవుడు పూర్తిగా ఇప్పుడు అధికారవర్గాల ప్రయోజనాలకు అధీనుడు. ఆమేరకు ఎన్ని రూపాలలో ఎన్ని అవస్థలు పడాల్సి వస్తున్నదో ‘ఈతిహాసము’, ‘బంగారు కొండలు’, ‘ముసుగు’, ‘బుల్డోజర్ రాముడు’, ‘దైవ ఆదీనము’ వంటి కథలు చూపుతాయి. ఇతిహాసము ఒక సాహిత్య ప్రక్రియ. యుగయుగాల మానవానుభవాలనుండి ఇది ఇలా జరిగింది అని పరంపరగా చెప్పుకొస్తున్న కథల జ్ఞాన భాండాగారం అది. ఇతిహాసములోని మొదటి హ్రస్వాక్షరాన్ని దీర్ఘం చేసి (ఈతి అంటే ఉపద్రవం అని అర్థం) దేవుడికి వచ్చిన ఉపద్రవం కథను చెప్తాడు బజరా ‘ఈతిహాసము’ కథలో. ఏమిటా ఉపద్రవం? దేవుడికి ప్రతిరూపంగా చెక్కబడిన రాతి విగ్రహాలు పూజలందుకొన్న విగ్రహాలు గుప్తనిధుల వేటలో ధ్వంసం చేయబడుతుంటాయి. దేవుడి విగ్రహాలు చేయటానికి ముడిసరుకు ఇచ్చిన కొండలు నగర నిర్మాణ అవసరాల కోసం డైనమెట్లతో పేల్చబడుతూ విధ్వంసం అవుతాయి. గుడులకు ధ్వజ స్తంభాల కట్టెను ఇచ్చిన అడవులు కొట్టెయ్యబడుతుంటాయి. మానవుల అధికార మోహమే మానవుల మధ్య, దేవుళ్ల మధ్య కూడా అసమానతలను పెంచి పోషిస్తూ పరస్పర హననానికి కారణమవుతుంటాయి అన్నది తాత్పర్యం. మసీదును కూల్చి రామమందిరం కట్టటం, ఆ నిర్మాణం పేర నిధులను, మనుషులనూ కూడా సమీకరించటం -ఈ మొత్తం క్రమంలో మనిషికి ఆపద వస్తే భగవంతుడు ఆదుకొన్న దాఖలాలు ఎక్కడా లేవు. ‘దేశ సింహాసనం మీద ఎక్కి కూర్చొనటానికి రాముడు ఒక మెట్టుకావటం’ రాతివిగ్రహాలకు వచ్చిపడిన ఉపద్రవాన్ని సూచించటమే.
‘ముసుగు’ కథ దానికి కొనసాగింపే. అందులోనూ రామమందిర నిర్మాణం ప్రస్తావన ఉంది. రాముడి పట్ల భక్తి, సర్వ సమర్పణ ప్రసక్తి లేనేలేవు. ఉన్నదంతా ఓటు ఆయుధాన్ని అదుపులో పెట్టుకోగల అంతకుమించిన ఆయుధం గురించిన అధికారవర్గాల ఆరాటమే ఉన్నదంతా. దేవుడు, మతం సర్వతంత్ర స్వతంత్ర అంశాలు అన్నది రచయిత అవగాహన. దేవుడు మతానికి చిహ్నం కావటమే విషాదం. పాలకవర్గం చేతుల్లో అలా హిందూమత చిహ్నంగా తాను మిగిలిపోవటం పట్ల రాముడి దిగులు ఈ కథలో సూచితం. “మతం నా అభిమతం కాదు. మతభక్తి మంచిది కాదు. అది అన్యమతాల పట్ల అకారణ ద్వేషాన్నీ, శత్రుత్వాన్నీ యుద్ధాన్నీ తెస్తుంది” అని రాముడు ఏ ఉపద్రవాన్ని అయితే పరిహరించాలని ఆశించాడో అదే పాలకవర్గపు తద్ధర్మం కావటమే ‘ముసుగు’ కథ. ముస్లిం మహిళలు తలకు ధరించే హిజాబ్ నెపంగా ముస్లిములపట్ల ద్వేషాన్ని హిందువులలో ఐక్యతను పెంచే ఒక ఉద్రిక్త యుద్ధవాతావరణం సృష్టించటానికి కల్పించిన ఘటనల సంఘర్షణల పరిణామాల చిత్రణ ఈ కథ.
‘బుల్డోజర్ రాముడు’ కథలో హిందువులంతా ఒక్కటే అన్న పిలుపుతో శ్రీరామనవమి ఉత్సవాల్లో హనుమజ్జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న దళిత శ్రామిక వర్గ యువతలో అవతలివాళ్లు అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో ఎందుకు పాల్గొనరు అన్న ప్రశ్న రావటం కీలకం. ఆ ప్రశ్నకు వాళ్లవి రాములోరి కుటుంబాలు. మనవి బానిస ఆంజనేయుడి కుటుంబాలు అన్న ఎరుక కలగటమే జవాబు. హనుమజ్జయంతి రోజు ఊరందరికీ అన్నాలు ఒడ్డించే సమయంలో దళిత యువకుల చెయ్యి పడకుండా చెయ్యాలన్న అవతలివాళ్ల ప్రయత్నాన్ని ధిక్కరించటం దళిత యువకుల ఆత్మగౌరవ చైతన్యం. హిందూమతం ముస్లిముల మీద బుల్డోజర్ న్యాయాన్ని అమలు పరుస్తున్నట్లే స్వీయ మతంలో సామాజిక ఆర్థిక వ్యత్యాసాల కారణంగా దళితులపైనా అదే బుల్డోజర్ న్యాయాన్ని అమలు పరుస్తున్నదన్న సూచనతో ఈ కథ ముగుస్తుంది. రాముడైనా, ఆంజనేయుడైనా ఈ బుల్డోజర్ సంస్కృతికి సాధనాలుగా, మౌనసాక్షులుగా మిగిలిపోవటం నేటి సమాజ వాస్తవం.
శ్రీరాముడిని ఎవరేమన్నా ఊరుకోమని సాహిత్య సామాజిక విమర్శలనుండి వ్యాఖ్యానాలనుండి రాముడి రక్షణభారం తమదే అని బుజాలకెత్తుకొన్న భక్తుల హడావిడి వీరంగాలు, విజృంభణలు చూస్తూ పాపం రాముడెంత నలిగిపోతున్నాడో అని, బహిరంగంగా మాట్లాడే వీలుంటే బాబోయ్ నా మానాన నన్ను వదిలేయండి అని మొరపెట్టుకొనే తీరుతాడని అనుకొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ వాస్తవం ప్రతిపాదిక గానే బజరా ఏకంగా దేవుళ్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి “భక్తులకి శతకోటి దండాలు! మిమ్మల్ని చూస్తుంటే మాకు భయంగా ఉంది. మానవాళి వినాశం మా దేవుళ్ల పేరు మీద జరగటానికి మేం ఒప్పుకోము. మీరు మమల్ని కాపాడొద్దు, రక్షించొద్దు. మా మానాన మమ్మల్ని ఒదిలి పుణ్యం కట్టుకోండి” అని విజ్ఞప్తి చేసినట్లు కల్పన చేసాడు – ‘దైవ ఆదీనము’ కథలో.
భక్తి పేరుతో హేతువు మీద, జ్ఞానం మీద జరుగుతున్న దాడులకు దేవుళ్లే సిగ్గుపడుతున్న స్థితిని, దుఃఖ పడుతున్న స్థితిని అంబేద్కరిస్టు, నాస్తికవాది అయిన బైరి నరేష్ మీద జరిగిన అయ్యప్పస్వాముల దాడి ఘటనను, కోటగిరి జిల్లా పరిషత్ అధ్యాపకుడు మల్లికార్జున్ పై తెలుగు పాఠం చెప్తూ దేవుడు లేడని చెప్తున్నాడన్న ఆరోపణతో జరిగిన దాడిని ప్రస్తావిస్తూ నిరూపించాడు. ఏమి మాట్లాడాలో కాదు, ఏమి తినాలో, ఏది తినకూడదో భక్తులే నిర్ణయిస్తారని బెంగుళూరులో శ్రీరామనవమినాడు మాంసం తిన్నవారి మీద కఠిన చర్యలు ఉంటాయని నగరపాలక సంస్థ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేయటంలో రాముడి నిస్సహాయత్వం ధ్వనిస్తుంది. రామరాజ్యం కోరుకొనే ఆంజనేయుడికే విస్తరిస్తున్న ఈ రామరాజ్యం పట్ల విరక్తి కలుగుతుంది. ఆంజనేయుడు తనకు బంటు అయినట్లు తాను ఈ దేశ నేతలకు బంటునని రాముడు చెప్పుకొనటమే కాదు దేశం మీదయినా దేవుడి మీదయినా వాళ్లకే పేటెంటు అని చెప్పటంలోనూ దేవుడు అధికారం చేతిలో కీలుబొమ్మ కావటమే తెలుస్తుంది.
యాదగిరి గుట్టను యాదాద్రిగా ఉన్నతీకరిస్తూ పునర్నిర్మించటాన్ని వస్తువుగా చేసిన ‘బంగారుకొండలు’ కథలో పాత్రలు లక్ష్మీ నరసింహస్వాములే. వేలవేల కోట్లతో దేవాలయ నిర్మాణాలు పునర్నిర్మాణాలు జరగటాన్ని విమర్శించినవాడు నరసింహస్వామే. భక్తులను ఎక్కువగా నమ్మొద్దు అన్నవాడు ఆ దేవుడే. భక్తి భగవంతుడి మీదకన్నా రాజుగారి మీదే ఎక్కువ అన్న నిష్టుర సత్యాన్ని నిష్కర్షగా చెప్పినవాడూ అతనే. రాజుగారి మీద భక్తి తక్షణ భౌతిక ప్రయోజనాల లబ్ధికే అని తెలిసినవాడూ అతనే. దేవాలయ నిర్మాణాలకు కొండలు తవ్వటం పర్యావరణ విధ్వంసమే అని భావించినవాడూ అతడే. గర్భగుడిలోని పసిడికాంతులకి అలసిన కన్నుల వల్ల తలనొప్పి వచ్చినవాడూ ఆ దేవుడే. భర్త తలనొప్పికి ఎక్కడినుండో వస్తున్న వాసనను కారణంగా ఊహిస్తూ లక్ష్మీదేవి ఈ కథ పొడుగునా అది హోమపు వాసన కాదని, నెయ్యి కాలుతున్న వాసన కాదని, ధూపదీప కర్పూరాల వాసనా కాదని, అత్తర్ల పొత్తర్ల అగరొత్తులు వాసనా కాదని, సుగంధ పరిమళాల వాసనా కాదని మళ్లీ మళ్లీ శంకిస్తూ నిరాకరిస్తూ చివరకు గర్భగుడిలోని బంగారు తాపడం నుండి వచ్చే వాసన అని అసలు సత్యం దగ్గరకు చేరుతుంది. అది “మనిషి నెత్తుటివాసన, చెమట వాసన, కన్నీటి వాసన… అన్నిటి కలగాపులగపు వాసన” అని గుర్తించి చెప్పిందీ ఆ నరసింహ స్వామే. మనుషుల చెమట, నెత్తురు కన్నీళ్ల విలువ తెలిసినవాడుగా నరసింహస్వామి, తాను ఇంతవరకు మురిసిపోతున్న వైభోగపు మూలం తెలిసి దుఃఖపడ్డ లక్ష్మీదేవి మనకు దగ్గరవాళ్లవుతారు. దేవుడిని మానవీకరించటం అంటే ఇదే.
3
మతాన్ని దేవుడిని సమకాలీన రాజకీయాలలో భాగంగానే కథాంశం చేసుకొన్న బజరా ప్రత్యక్షంగా ప్రభుత్వ విధానాలను కూడా వ్యాఖ్యానిస్తూ వ్రాసిన కథలు ఇందులో ఉన్నాయి. అమ్మా నాన్న, నాయనమ్మ, మేనమామ ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబంలో ప్రశ్నలు, సమాధానాలు, వ్యాఖ్యానాలు రూపంలో సాగిన సంభాషణలు ప్రధానంగా ఉన్న ‘కీ … క్యాబాత్’, ‘స్వ’తంత్రం’’ కథలు రెండూ తప్పక చదవ వలసినవి. పాఠ్యంశాలు కాదగినవి. బజరా ఊహా శాలితకు, రాజుకు – రాజ్యానికి సంబంధించిన దృక్పథానికి నిదర్శనాలు. ‘కీ… క్యాబాత్’ కథ ‘అమ్మా రాజేం చేస్తాడు’ అన్న పాప ప్రశ్న దగ్గర మొదలై ‘దొంగని పట్టుకోవడం సులువు, కానీ రాజుని పట్టుకోవడం కష్టం’ అని పాపకు అర్థం కావటం దగ్గర ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో కుటుంబంలో మిగిలినవాళ్లు కూడా రాజు అంటే ఏమిటో, రాజు ఏమిచేస్తాడో యథాశక్తి ఊహించారు. “రాజేంచేస్తాడు? ఏమీ చెయ్యడు. రాజుకదా? చెయ్యాల్సిన అవసరం లేదు. చెమట పట్టాల్సిన అవసరం లేదు. కాలు మీద కాలేసుకుని ముడ్డి నొప్పెట్టిందాకా కూర్చుంటాడు. చేసినవాళ్లు చేస్తుంటే సేవలు చేయించుకోవడమే” అన్నది నాయనమ్మ వివరణ. ‘ఇప్పటి రాజులయితే ప్రజల్ని సంతృప్తి పరచటానికి పక్క రాజ్యం మనమీద పడిపోతోందని బోర్డర్ విషయాలు పెద్దవి చేస్తారు’ అని మామయ్య సమాధానం. రాజు ప్రజల సమస్యలని తెలుసుకొనటానికి మారువేషంలో ప్రజల మధ్య తిరుగుతుంటాడని నాన్న సమాధానం. దాని మీద అన్నయ్య ప్రశ్న రాజు మారువేషంలో వెళ్లటం దేనికి అని. అసలు వేషం అందరికీ తెలిసినప్పుడు మారువేషంలో వెళ్లటమే మంచిది రాజుకి అని నాయనమ్మ అభిప్రాయం. కథ చివరికి వచ్చేసరికి ‘రాజే ఒక వేషం.. మారువేషం మరక్కరలేదు’ అన్న నిర్ధారణకు వస్తుంది నాయనమ్మ. ఇవన్నీ కలిపి చూసినప్పుడు, ప్రజలనుండి పాలనపై ప్రశ్నలు రాకుండా ఉండటం రాజుకు అవసరం, ప్రశ్నించినవాళ్లను జైల్లో పెట్టటం, రాజుని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్లు, దేశద్రోహానికి పాల్పడ్డట్లు ప్రచారం చేయటం దాని పరిణామమే అని అర్థం అవుతుంది. మన్ కీ బాత్ నేపథ్యంలో మొత్తంగా మోడీ పాలనపట్ల ఏదో ఒక కోణం నుండి ఇంట్లో వాళ్ల అసంతృప్తి. విధానాలపట్ల నిరసనలతో కథ ముగుస్తుంది.
స్వతంత్రం కథ ఆగస్టు 15 కూడా ఆన్ లైన్ లో జరుపుకోవాల్సిన కరోనా నేపథ్యంలోనే సాగుతుంది. తన వంతుగా స్వతంత్రం గురించి మాట్లాడటానికి సిద్ధమయిన బుజ్జిగాడి నెపంగా స్వతంత్రం పండగే కానీ కోరుకునే విలువ కాదని, స్వతంత్రం అంటే మార్కెట్ లో వస్తువుల కొనుగోలుకు సంబంధించిందిగా విస్తృత వినియోగంలో కొత్త అర్థాన్ని పొందిందని ఇలాంటి అనేక విషయాల నిరూపణగా సంభాషణను నడుపుతాడు రచయిత. ఇవన్నీ కలిసి స్వతంత్రం కొత్త అర్థాన్ని పొందటం కాదు, అసలు అర్థమే లేని బోలు మాటగా తయారైందని పాఠకులు గ్రహిస్తారు. స్కూల్ సమావేశంలో స్వతంత్రానికి డెబ్బై ఐదేళ్ల వయసు కనుక ముసలిదైపోతుందా? మళ్లీ స్వతంత్ర పోరాటం వస్తుందా అని యేవో ప్రశ్నలతో బుజ్జిగాడు మాట్లాడేది నిమిషంలోనే కట్ చేయబడటం దేశ స్వాతంత్ర్యానికి మనుగడ ఆలోచించే మెదడును, మాట్లాడే నోటిని నొక్కెయ్యటంలోనే ఉందని సూచిస్తుంది. బుట్టబొమ్మా, నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త వంటి పాటలు డాన్సులు ఎంచుకొని ప్రదర్శించే మజాలో మత్తులోనే స్వాతంత్య్రపు అసలు అనుభవం ఉందని వ్యంగ్యమానం చేస్తూ ముగుస్తుంది ఈ కథ.
4
స్త్రీల గొంతుక అయిన మాతృక పత్రికకు వ్రాసే ఈ కథలు స్త్రీ సమస్యకు, స్త్రీల దృష్టికోణానికి చెందినవై ఉండాలన్న పట్టింపు కూడా వుంది బజరాకు. ఈ సంపుటిలో అలాంటి కథలు ఆరు ఉన్నాయి. నాలుగు అత్యాచార ఘటనలమీద వ్రాసినవి. ‘స్కిన్ లెస్ ఫ్లెష్’, ‘జడ్జిమెంట్’ కథలు రెండూ అత్యాచార బాధితుల పట్ల న్యాయస్థానాల తీరు తరచూ పురుషుల ప్రయోజనాలను కాపాడేదిగా ఉండటాన్ని చూపిస్తాయి. రావిశాస్త్రి కోర్టు కథలు గుర్తొస్తాయి ఇవి చదువుతుంటే ‘స్కిన్ లెస్ ఫ్లెష్’ కథలో. కోర్టులలలో పురుష న్యాయమే గెలుస్తుందని ఎన్నో కేసులు చూసీ చూసీ తెలిసి తలపండి మతి భ్రమించిన లాయర్ కనబడతాడు. అతనికి కోర్టులో న్యాయదేవత కఠినమైన పురుష శరీరంగా మారిపోతున్న భ్రమ కలుగటం పురుష పక్షపాత న్యాయం ఉనికిని సూచించేదే. అత్యాచారం కేసులో మగవాడెప్పుడూ బోనులో బోరవిరుచుకొనే నిల్చుంటాడు. ఆడది వాడివత్తలై అవమానభారంతో తల తెగినట్లు వేలాడుతూనే ఉంటుంది. ఆ ఆడది ఒకసారి పన్నెండు ఏళ్ల పిల్ల కావచ్చు. ఒకసారి పదిహేనేళ్ల పిల్ల కావచ్చు. మరొకసారి వయసు మళ్లిన స్త్రీ కావచ్చు. దుస్తుల మీది నుండి తాకితే లైంగికవేధిపు కాదు, అత్యాచారం జరిగినా అమ్మాయి వయసు నిరూపించలేమని పోక్సో కేసునుండి పురుషుడికి మినహాయింపు, కండోమ్ వాడటం వలన స్కిన్ టు స్కిన్ సంబంధంలేదు కనుక అత్యాచారం తీవ్రనేరంకాదు… ఇలాంటి తీర్పులు వినీవినీ లాయర్లు సున్నితత్వం కోల్పోకుండానో, భ్రమలకు లోనుకాకుండానే ఉండటం సాధ్యకాదని చెప్తుంది ఈ కథ. అత్యాచార నేరస్థుడినే బాధితురాలికి భర్తగా నిర్ణయిస్తూ ఇచ్చిన తీర్పులు కూడా ఎన్నో ఉన్నాయి. ‘జడ్జిమెంట్’ కథలో కన్న కూతురిపైనే అత్యాచారం చేసి గర్భవతిని చేసిన తండ్రి దోషిగా బోనులో నిలబడి పరిహారంగా ఆ పిల్లను పెళ్లాడుతానని అన్నట్లు చేసిన కల్పన అలాంటి తీర్పులలోని అసంబద్ధతను, అన్యాయాన్ని, క్రూరత్వాన్ని పాఠకుల దృష్టికి తీసుకురావటానికే. ఇవన్నీ స్త్రీల జీవితంలోని బీభత్సాన్ని ప్రదర్శించే కల్పనా శిల్పంతో ఉంటాయి.
‘ద్రౌపది లేని భారతం’ కథ దీనికి పరాకాష్ఠ రూపం. మహాశ్వేతాదేవి వ్రాసిన కథ ద్రౌపది. ఒక ఆదివాసీ మహిళ నక్సలైట్ ఉద్యమంలో భాగమై గెరిల్లాగా జీవించి పోలీసులకు పట్టుబడి సామూహిక అత్యాచారానికి గురై వస్త్రాలు ధరించకుండా రక్త సిక్త దేహమే ఆయుధంగా సైనిక కమాండర్ మీదిమీదికి వెళ్లి భీతావహుడ్ని చేసిన కథ. ద్రౌపది. ఆ కథను ఢిల్లీ యూనివర్సిటీలో బి.ఏ. ఇంగ్లీష్ ఆనర్స్ సిలబస్ నుండి తొలగించటం దగ్గర ప్రారంభమైన ఈ కథ పురాణేతిహాసాల కథలతో సిలబస్‌ను కాషాయీకరించే విద్యావేత్తల ప్రయత్నాలను ద్రౌపది లేని భారతమా అని ద్రౌపది ముఖంగా ఎద్దేవా చేయటమే కాదు, అత్యాచార భారతం కొనసాగుతున్న కథే అని ఆ ద్రౌపదినే అత్యాచారాలకు గురైన కశ్మీర్ కునన్ పుష్పోరా మహిళగా, వాకపల్లి కొండ జాతిమహిళగా, సైనిక అత్యాచారాలకు నిరసనగా నగ్నప్రదర్శన చేసిన మణిపూర్ మహిళగా, ఛత్తీస్ ఘడ్ మహిళ సోనీసోరీగా, రాజస్థాన్ లో ఉద్యోగ ధర్మంగా బాల్యవివాహాన్ని ఆపబోయి అత్యాచారానికి గురైన భన్వరీదేవిగా, ఖైర్లాంజీ దళితమహిళ సురేఖగా, రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ఉద్యమంలో పాల్గొని అరెస్టయి పోలీసు వాన్ లో అత్యాచారానికి గురైన పంజాబీ మహిళగా ఒక వేగంలో మార్చి మార్చి చూపుతూ విద్యావేత్తలను బోనులో నిలబెట్టి నిలదీసినట్లుగా కథను నిర్మిస్తూ బజరా లైంగిక అత్యాచారాలకు సంబంధించిన భారతదేశపు బీభత్స ముఖచిత్రాన్ని ప్రదర్శించాడు.
విస్తరిస్తున్న ద్వేషానికి విరుగుడుగా ప్రేమ పతాకను ఎగరేసే సున్నిత భావోద్వేగాలు గల మనుషులుగా మిగలాలంటే అందరూ తప్పక ఈ కథలు చదవాలి. బీభత్స సమవాకారంగా ఉన్న సామాజిక రాజకీయాలను సమానత్వం, ప్రజాస్వామిక నైతికత వైపు మలుపు తిప్పటానికి, మార్చటానికి బమ్మిడి జగదీశ్వరరావు బుద్ధిజీవిగాను, సృజనకారుడుగానూ పడుతున్న ఆరాటాన్ని మనదిగా మార్చుకుందాం… బజరా కథా ప్రపంచంలోకి ప్రవేశిద్దాం రండి.
- (ఈతిహాసం కథాసంపుటిని మే 23న గుంటూరులో జరగనున్న ప్రగతిశీల మహిళాసంఘం 9వ మహాసభలో ప్రొ. చల్లపల్లి స్వరూపరాణి ఆవిష్కరిస్తారు)
Excellent introduction to the book