ఆధునిక యుగంలో అందం కన్నా యుద్ధ విధ్వంస వికారం చూస్తున్నాం. సత్యం కు తూట్లు పొడిచి మీడియా “సహకారం” తో ప్రపంచ జనావళినీ సైద్ధాంతిక మంచులో ముంచి సామ్రాజ్యవాదులు, వారి సామంతులు అదే అనివార్య అభివృద్ధిగా మార్కెట్ ఆరాధకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. తమ సామ్రాజ్య వాద కూటమి సమైక్యంగా మనుగడ సాగిస్తూ శ్రామిక వర్గం లేదని, అంతర్జాతీయ శ్రామిక చైతన్యం రానే రాదని, మారిన కాలంలో పోరాట కారులు మారి అభివృద్ధి అప్సరసకు దాసోహం కమ్మని పాలకులు, వారి విధానాల ప్రేమిక మేధావులు ఊదర గొడుతున్నారు. దీనికి ఎవరి సత్యం వారిది అనే పోస్ట్ మోడర్నిస్టులు తమ విముక్తి ఐక్య సంఘటనకు వీడ్కోలు చెప్పి శకలాలుగా మారి చిరు సంస్కరణలు, ప్రజాకర్షక విధానాలతో మార్పులతో సంతృప్తి చెందుతున్నారు. వీరు శాశ్వతంగా సమ సమాజ స్వప్నాన్ని మరిచిపోయినవారు!?
ఆకాశాన్ని అంటే హర్మ్యాలు, పచ్చని చెట్లు కానరాని కాంక్రీటు అరణ్యాలు పెంచి, హరిత అరణ్యాలను కార్పొరేట్ బకాసురులకు ఇచ్చి, గ్రామాల మాయం చరిత్ర అంతిమ గమ్యంగా భావించి, స్త్రీ అణచివేత, ప్రకృతిని దోచుకుంటూ , పేదరికంలో బాల్యాన్ని, యుద్ధాలలో యవ్వనాన్ని, పనికి మాలినదని వృద్ధాప్యాన్ని , సమస్త జీవితాన్ని పెట్టుబడికి తాకట్టు పెట్టిన వ్యవస్థ ఇది.
ఈ సందర్భంగా క్రిస్టోఫర్ కాడ్వెల్ అందం పట్ల తన పుస్తకం “ఫర్థర్ స్టడీస్ ఇన్ ఏ డైయింగ్ కల్చర్”వెలిబుచ్చిన భావాల వెలుగులో నేటి వాస్తవికతను చూడాలి. క్రిస్టోఫర్ కాడ్వెల్ (1907-37) ఒక పాత్రికేయుడు, సాహితీ విమర్శకుడు, కమ్యూనిస్టు పోరాట యోధుడు. అతడి సృజనాత్మకత కవితలు, కథలు, డిటెక్టివ్ నవలలు, ఏరోనాటిక్ పాఠ్య పుస్తకాలు , విమర్శనా గ్రంథాలుగా రూపుదాల్చింది. చరిత్ర నిర్మాణంలో ఆయన అంతర్జాతీయ శ్రామిక వర్గ స్ఫూర్తి, నిబద్ధతలు స్పానిష్ అంతర్యుద్ధంలో ప్రజాస్వామ్య శక్తుల తరఫున పోరులో అమరత్వంతో రుజువైంది. ఆయన రచనల్లో “ది క్రైసిస్ ఆఫ్ ఫిజిక్స్”, “ఇల్యూజన్ అండ్ రియాలిటీ”, “స్టడీస్ ఇన్ ఏ డైయింగ్ కల్చర్”, “ఫర్థర్ స్టడీస్ ఇన్ ఏ డైయింగ్ కల్చర్” ముఖ్యమైనవి.
“ఏయుగం పూర్తిగా సంప్రదాయకరమైన అందమైన వస్తువులతో సంతృప్తి చెందక తన కోరికలకు తగినట్లు భిన్న వస్తువులను సృష్టిస్తుంది. పాతతో తృప్తి చెందని యుగమే అత్యంత భిన్నమైన అత్యంత , విప్లవాత్మకమైన అందమైన వస్తువులను సృష్టిస్తుంది .
అందమైన వస్తువులు తర తరానికి మారుతుంటాయి.మానవుల ముందు కాలం నుంచి కూడా ఉన్నట్లు కనిపిస్తాయి.కాబట్టి అందం మానవ మెదళ్ళకు స్వతంత్రమైనది.మానవ మెదళ్ళకు అతీత మైన నిరపేక్ష అందం అనే భావన రంగు లేనిది.మనకి ఆనందాన్ని ఇచ్చే వ్యక్తిత్వం, selfhood లేనిది. అది భిన్నత్వాన్ని, కొత్తదనాన్ని , అంతర్గతంగా అపూర్వ అందాన్ని సృష్టించే కళాకారునికి , అందాన్ని ప్రేమించేవానికి మృత ప్రాయం. ఎందుకంటే అందాన్ని ప్రేమించేవానికి, డాఫడిల్స్, సెజాన్ చిత్రం వాటి కోసమే ప్రేమిస్తాడు కానీ వాటిలో అందం యొక్క నిరపేక్ష భావం వ్యక్తమైందని ప్రేమించడు.”
ఈ నాడు నేతలకు పదవి అందం. వేల కోట్లు సంపాదన, ఇప్స్టీన్ ఫైల్స్ లో లాగా మైనర్ బాలికలపై లైంగిక దోపిడీ, అబద్దాల ఫ్యాక్టరీ నడిపి దేశాలను కబళించడం, నిరసన కారులను బొద్దింకలుగా చీదరించుకుని వారి అంతానికి సిద్ధం అవటం రివాజుగా మారింది. మహా హంతకులు శాంతి బహుమతి కోసం మారాం చేయడం ఒక నిరపేక్ష్క్ష అందం. మానసిక రోగమే. లేదంటే గాజా ఉద్దేశ పూర్వకంగా విధ్వంసం తర్వాత అందంగా రియల్ ఎస్టేట్, పునర్నిర్మాణాలుగా చూడటం సాధ్యమా?
“మనిషి అనుభవంలో అందం ఒక వస్తుగత లక్షణం, అయితే పూర్తిగా వస్తుగతం కాదు, ఎందుకంటే అది వ్యక్తికి – వస్తువు కి మధ్య గల సంబంధం. అయితే అందం ప్రేమికుని, అందమైన వస్తువుల నుంచి వేరు చేయడం అంటే అందాన్ని ఒక రంగు లేని భావంగా లేదా శారీరక ఆందోళన గా చూడటమే.
ఐతే ప్రతి యుగంలో సాధారణంగా పాత తరాలు చేసిన / కనుగొన్నఅందమైన వస్తువులను అంగీకరించి మన భావనను సంపన్నం చేసి వాటికి అదనంగా చేకూర్చడం లేదా వాటి లక్షణాల గురించి మన ప్రశంసను మార్చడమే తర్వాతి తరం పాత్ర. వ్యక్తికి , వస్తువుకి మధ్య మరో కారకం సమాజం. సారవంత ప్రయరీ లో విత్తనాలు నాటే రైతు, లొంగని అరణ్యాలలో ఒంటరి వేటగాడు, నల్లటి సముద్రంపై సాగే నావికుడు సామాజిక ప్రక్రియలో భాగమే. అలా సామాజిక ప్రక్రియ ప్రతి చోట అందాన్ని పుట్టిస్తుంది.”
ఈ నాడు లాభార్జన కోసం పాత నాగరికతలు కల గతంలో ఇరాక్, నేడు ఇరాన్ లాంటి దేశాల పాత నాగరికతలు ముక్కలు చేయడానికి, రాత్రికి రాత్రి తుడిచి పెడదామని హెచ్చరికలు చేసిన అమెరికా అధ్యక్షుని బూర్జువా నాగరికత ప్రతినిధి కేవలం ఒక వ్యక్తి ప్రేలాపన కాదు. దీనిని కనీసం ఖండించని సామ్రాజ్య వాద కూటమి, సామంత నేతల మౌనం. ఇది అందాన్ని, సత్యాన్ని (అణ్వస్తాలు తయారీ నిరోధం సాకు) హత్య చేసే వైఖరి. ప్రపంచ అందం వస్తుగతంగా, సామాజికంగా చూడకుండా బలవంతుడు నా వ్యక్తిగత దయా దక్షిణ్యాల ఫలితమని చెప్పడమే.
=“తత్వశాస్త్రం వేడిని వస్తు గతంగా లేదా మానసికంగా చూస్తుంది.గతి తర్క వాదం అలా కాదు. వేడిని అనుభవించని వారికి, అందమైన వస్తువులు చూడని వారికి అవేమిటో తెలియవు. అందం సామాజికం. నాకు బయట సమాజంలో ఉండే వస్తుగతమైనది. అది కేవలం స్థానికమైంది కాక విశ్వజనీనం. ఎందుకంటే సమాజం ఒక చురుకైన అంశంగా ఇతర సర్వ వాస్తవికతకు వస్తువు.
అందం లాగానే లాగానే నీతి, మంచితనం ఉంటాయి. అవి మనిషి కన్నా గొప్పవిగా బాహ్యమైనవిగా ఆలోచిస్తాం. అవి సమాజంతో పాటు మారుతూ ఉంటాయి. వాటిని సామాజికంగానే వ్యక్తీకరించగలం. సత్యం అనేది మరో విలువ వ్యక్తికి సమాజం ద్వారా మిగతా విశ్వంలోని ప్రత్యేక సంబంధం.
సత్యం, మంచితనం, అందం అనేవి ‘కేవలం ‘ సామాజిక వస్తువులు కావు. వాటి నిర్దిష్ట సామాజిక పాత్రల్లో, మనిషి వ్యక్తిగతంగా, సమాజంగా, ప్రకృతి పర్యావరణంగా, వాస్తవంగా వ్యక్తి, సమాజం పరిసరాలు అన్నింటినీ కలుపుకుని తమలో తాము వేరుగా ఉంటూ ప్రత్యేక లక్షణాన్ని పుట్టిస్తాయి. అందం విషయంలో ఈ ప్రత్యేక లక్షణం ఏమిటి?అందం ఒక ప్రకటన చెప్పినట్లు కాక చూపు ద్వారా చెబుతుంది. ఒక సత్యమైన ప్రకటనలా అందమైన వస్తువుకి ఒక ముఖ్య సారం ఉంటుంది.”
ప్రస్తుతం నీతి, మంచితనం అనేవి అమూర్త పదాలుగా మారాయి. అసమర్థుని జీవన యాత్రలో వేదాంతంగా అంతమైంది.ఒక వైపు బాహాటంగా దేశీయంగా నిరంకుశంగా సొంత పౌరుల పైన అప్రజాస్వామిక దమన కాండ, మరో వైపు వెనిజులా లాంటి సర్వ సత్తాక, బడుగు దేశాల అధ్యక్షుడిని అర్ధరాత్రి బంధించినప్పటికీ చేష్టలుడిగి తక్కిన దేశాలు చూస్తున్న వైనం. గాజాలో జాతి హననంలో లో నిర్దయగా చనిపోతున్న పిల్లలు, స్త్రీలు , యువకులు , మూగ జీవాలు, చెట్లు, చేమలు. ఇది సత్యం, మంచితనం, అందం అనే నిజ విలువల్ని బలవంతులు మార్చి పరిమార్చడం కదా?
“మనిషి ఆలోచించి , కోరి ఆత్మ పరిశీలన చేస్తాడు. చైతన్యం అంటే కొత్తది వచ్చి చేరటం .ప్రవర్తనలో మార్పు .మనిషి అనుభవం ద్వారా నేర్చుకుంటాడు. చేతన ఇంటరాక్షన్ ఫలితం. కార్యాచరణకు మార్గదర్శి. చైతన్యం ప్రతిస్పందన, పరిస్థితుల మధ్య పుడుతుంది. మనిషి ప్రయత్నంలో సత్యం పుడుతుంది. పరిస్థితులన్ని మార్చడంలో మానవులు తాను కూడా మారతారు. కార్యాచరణలోనే సత్యానికి అర్థం. కేవలం చైతన్య పరిధి వల్ల ‘స్వచ్ఛ’ ఆలోచన ద్వారా వచ్చేది సత్యం కాక స్థిరత్వం. బాహ్య అలజడి లేకుండా మదిలోని వస్తువులు పరస్పరం కొలుచుకుంటాయి . అసంఖ్యాక స్థిర ప్రపంచాలు సాధ్యమైన, భిన్న చేతన అనుభవాలున్న జనం ఎందరు ఉంటారో అన్ని వాస్తవికత ప్రమాణాలు ఉంటాయి.
పరస్పర సహకారంలో సాధ్య మయ్యేది వ్యక్తిగతంగా సాధ్యం కాదు. శ్రమ విభజన గుణాత్మక మార్పు తెస్తుంది.సత్యము శ్రమ ప్రక్రియ ఫలితంగా వస్తుంది .ఎందుకంటే శ్రమ అనేది జీవుల సహకారాన్ని కోరి నిర్దేశిస్తుంది. శ్రమ ప్రక్రియ దాని ఉత్పత్తి చేసిన సమాజం వల్ల సత్యం తయారీలో mediating term గా ఉంటుంది. శ్రమ ప్రక్రియ మొదటి నుంచి భౌతిక పెట్టుబడిని సృష్టిస్తుంది. మొదట్లో ఇది పరికరాలు, ఆచారాలు, మాంత్రిక- శాస్త్రీయ వస్తువులు ,విత్తనాలు , గుడిసెల రూపంలో సాదాగా ఉంటుంది .అలాంటి వస్తువులన్నీ సామాజిక సత్యానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ సామాజిక వస్తువులన్నీ వాస్తవికత స్వభావం వల్ల ఉత్పత్తి అయిన వాటి రూపం జీవి -వాస్తవికత ల పరస్పర సంబంధం వల్ల వస్తుంది. మామూలు జీవి నేడు పుట్టుక నుంచి నుంచే భవనాలు ,చట్టాలు , పుస్తకాలు, యంత్రాలు, రాజకీయ రూపాలు ,పరికరాలు ఇంజనీరింగ్ పనులు, సమగ్ర సైన్సు రూపంలో ఎంతో కూడబెట్టిన రూపంలో సామాజిక సత్యాన్ని ఎదుర్కొంటుంది. ఇవన్నీ సామాజిక సహకారం నుంచి వస్తాయి. ఈ పెట్టుబడి ద్వారా వచ్చిన సత్యం సమాజానికి పరిసరాలకు కల యుగాల అనుభవాల నుంచి కూడబెట్టింది. అది సామాజిక జీవులు శ్రమ ప్రక్రియలో కొత్త పరిస్థితితో చేసే ఘర్షణ వల్ల పుడుతుంది.”
“రొమాంటిక్ యుగ కవి కీట్స్ చెప్పిన ”అందమే సత్యం ,సత్యమే అందం -అదే/ భూమ్మీద నీకు తెలిసింది , అంతే నీకు తెలియాల్సింది ” అనే వాక్యాలు తనకు అర్థం కాలేదు అని ఆధునిక బూర్జువా కవి టిఎస్ ఇలియట్ ప్రకటించారు. ఆధునిక బూర్జువా తత్వవేత్తలు హెగెల్ తమకు అర్థం కాలేదు అని చూపించినట్లుగా ఉంది. “
ఈ రోజు ఆధునిక రాజ్యాలకు హెగెల్ అంటే సాకారం దాల్చిన పరిపూర్ణత. దాని అమానుష, ఆహేతుక చర్యలను ఖండించేవారు దేశ ద్రోహులు. అందం, సత్యం, మంచితనం అన్నీ రాజ్యం లోనే చూడాలి.కాదన్న వారు నిర్మూలించబడేందుకు అర్హత ఉన్న బొద్దింకలు!?
“సత్యం ఇప్పుడు స్వచ్ఛంగా తనంతట తానే నిలబడదు. అది కార్యాచరణలోనే పుడుతుంది .నిరపేక్షమైన స్థిర, శాశ్వత సత్యం అనేది అసాధ్యం .అయితే అటు ప్రతి కార్యాచరణలో కోరిక, సొంత ఇచ్ఛ, ఉద్దేశం, భయం , జుగుప్స లేదా ఆశ ఉంటాయి .సత్యం వ్యక్తిగతంలో , ఉద్వేగంలో కలిసి ఉంటుంది. దాన్ని తీసివేయడం అంటే ప్రపంచాన్ని తీసివేయడం.
సత్యం ఎలా సైన్స్ లక్ష్యమో , అందము కళ లక్షణం . సత్యం, సౌందర్యం విడదీయరానివి. సైన్సు అనేది precepts, సాధ్యాలు , శరీర కోరికలు దేనిని అయితే పట్టించుకుంటాయో ఆ ప్రపంచాన్ని మరింత సంపన్నంగా చేస్తుంది. కళ అనేది వాస్తవికతలో శరీరం మరింత చొచ్చుకుని పోవడానికి, సాహసికంగా, ఆసక్తికరంగా, అలుపు లేనిదానిగా చేస్తుంది.
బూర్జువా సంకుచిత, ఆదర్శ ప్రపంచంలో సత్యం -అందం , కళ – సైన్స్ భిన్న సృజనాత్మకతను గాక శాశ్వతమైన శత్రువులలా కనిపిస్తాయి ఈ విభజన కృత్రిమమైంది . ఈ రెండూ పరస్పర సృష్టి కారకాలు. రెండింటి మధ్య ‘రహస్య’ బంధమే నిర్దిష్ట సమాజ ప్రపంచం.”
ఈ సైన్స్ , కళల కృత్రిమ విభజన వల్ల మొదట దాని ఫలితాలు దోపిడే వర్గాలకు వినియోగ పడితే, ఉన్నత స్థాయి కళలు పేదలకు, సామాన్యులకు దూరమయ్యాయి. ప్రజా కళలకు వేదికలు కరువయ్యాయి. చౌకబారు , మూఢ భక్తిని ప్రోత్సహించే సినిమాలు , పలాయన వాదం పెంచే గ్రహాంతర వాసుల పై సినిమాలు.
“శ్రమ ప్రక్రియలో సత్యం -అందాల సన్నిహితమైన పుట్టుక, వాటి పరస్పర ప్రభావం సుస్పష్టం.పంట కోత పనే కాక నృత్యం కూడా . అది వాస్తవికతతో వ్యవహారమే కాక ఆనందదాయకం కూడా. నియమం అనేది వివాదంలోని సత్య విశదీకరణ మాత్రమే కాక మనుషుల కోరికలను, మనోభావం గురించి దేవుళ్లను తృప్తి పరచడం కూడా. మిత్ లు మానవుని ఆదిమ సహజాతాలను , వాస్తవికత పట్ల అతడి దృక్పథాన్ని తెలియజేస్తాయి. సత్యం – అందం, సైన్స్ – కళ లు ఆదిమ కాలానివి అయినా ఎంతో శక్తితో పరస్పరము జీవాన్ని ఇచ్చుకుంటాయి.
బూర్జువా నాగరికత ప్రత్యేక ఘనత ఏమిటంటే సైన్స్ నుంచి వాంఛనీయతను, కళ నుంచి వాస్తవికతను తొలగిస్తుంది. సత్యమైనది ఇంకేమాత్రం అందంగా ఉండదు. ఎందుకంటే బూర్జువా నాగరికతలో సత్యం అంటే మానవేతరంగా ఉండటం. అందం ఏమాత్రం సత్యంగా ఉండదు .ఎందుకంటే ఈ నాగరికతలో అందంగా ఉండటం అంటే ఊహల్లో ఉండటమే.”
భూమి పై వనరులు సమస్తం హరించడంతో ఆగక ట్రిలియన్ల డాలర్లు ఖర్చుతో విశ్వంలో ఇతర గ్రహ వనరులు సైతం దోచుకుని ఇదంతా మానవాళి కోసమే అని ప్రచారంలోని వైరుధ్యం అర్థం కావాలి. ఆఫ్రికా జనులు ఆహారం , మహమ్మారి కి మందులు లేక అలమటిస్తూ ఉన్నా పట్టించుకోని బూర్జువా నాగరికత విలువలను ఎందుకు ఉపేక్షించాలి?
“మార్క్సిజం దృష్టిలో సామాజిక వస్తువుల్లోని ఉద్వేగాత్మక కారకాలు సామాజిక క్రమతను చూపిస్తే అప్పుడే అందం ఉంటుంది.అట్టి క్రమతే కళ. ఇది సామాజిక వస్తువులకు- ఇల్లు, కవళికలు ,కథనాలు ,వర్ణనలు , పాటలు శ్రమ అన్నింటికీ వర్తిస్తుంది .అయితే సప్లై డిమాండ్లపై ఆధారపడిన మార్కెట్ను మాత్రమే గుర్తించే సామాజిక ప్రక్రియలో అరాచకతపై పెరిగిన బూర్జువాకు ఇది ఘోరం అనిపిస్తుంది. అయితే కళ అనేది మార్కెట్ విలువకు కాక వినియోగ విలువకే ప్రాధాన్యం ఇస్తుంది. మార్కెట్ గుడ్డి పని వల్ల అందమైన వస్తువులన్నీ అందరహితంగా, వ్యాపారమయం అవుతాయి. కళాకారుల పని పతనానికి వ్యతిరేకంగా కళ మార్కెట్ నుంచి తప్పుకొని సామాజికేతరంగా , వ్యక్తిగతంగా అవుతుంది. అది ఉన్నత వర్గకళగా మారి వ్యక్తిగత ఊహాలోకంలో అంతమవుతుంది .”
శాస్త్రవేత్త ప్రతిపాదనను , కళాకారుడు సంప్రదాయాలను వారసత్వంగా తీసుకుంటారు. శాస్త్రవేత్తకు ప్రయోగం , కళాకారునికి శక్తివంతమైన అనుభవం ఒక తన్యతను సూచిస్తాయి సంశ్లేషణ ఒక ప్రతిపాదనగా, కళా వస్తువుగా మారుతుంది. అయితే శాస్త్రవేత్త తన్యత ను తప్పుగా, పరిసరాలలో ఉండేదిగా భావిస్తే , కళాకారుడు దాన్ని తన గుండెలో తపనగా అనుభూతి చెందుతాడు. ఒక శాస్త్రవేత్త ఏ విధంగా బాహ్య వాస్తవికత యొక్క కొత్త క్షేత్రాలను అన్వేషిస్తాడో, కళాకారుడు కూడా అలాగే సదా హృదయ నూతన క్షేత్రాలను కనుగొంటాడు. ఇద్దరికీ ఒకే రకమైన ఒంటరితనం. శాస్త్రవేత్త తన కొత్త క్షేత్రాల అన్వేషణలో ఆవేశాత్మక సహచర్యం లేకపోవడంతో తన హృదయంలో ప్రత్యేక జడత్వం, నిశ్శబ్దం ఆవరిస్తాయి. కళాకారుడు ఉద్వేగ నూతన సాగరాల అన్వేషణలో అతని కాలి కింద స్థిరమైన జ్ఞాన గ్రహణ భూమి లేక అస్పష్టత తో అలమటిస్తాడు. శ్రీ శ్రీ మాటల్లో “వేళ కాని వేళల్లో , దారి కానీ దారుల్లో దేనికోసం అలమటిస్తావు ?”
“సమాజమే ప్రకృతిలో భాగం. ప్రకృతిలో మార్పు నెమ్మదిగా జరుగుతుంటే ,సమాజంలో అతి వేగంగా జరుగుతుంది. సైన్సు , కళలు రెండు శ్రమ ప్రక్రియలో ఉత్పత్తులే , అవి కార్యాచరణలో సాకారం అవుతాయి. బూర్జువా సంస్కృతి సౌందర్య శాస్త్రాన్ని ఉత్పత్తి చేయలేదు ఎందుకంటే దాని సామాజిక ఉత్పత్తులు అందరహితమైనవి. బూర్జువా ఆర్థిక వైరుధ్యాలు వారి ఐడియాలజీలోని ప్రభుత్వం వైరుధ్యాలే. గతం – నేడు, సంప్రదాయం _అనుభవాల మధ్య తన్యత శాస్త్రవేత్త కళాకారులకు ఒత్తిడి కలిగిస్తుంది.అట్టి విచ్ఛిన్నత పోవాలంటే మౌలిక సంబంధాలు మారాలి .పాలకవర్గం శ్రామికులను లాభం కోసం దోపిడీ చేస్తూ బూర్జువా నాగరికత నిర్మాణానికి, ఐడియాలజీకి మద్దతునిచ్చే భ్రాంతిని సృష్టిస్తుంది.”
ఈ భ్రాంతి వల్లనే నేడు దేశ దేశాల ప్రజానీకం మౌన ప్రేక్షక పాత్ర వహిస్తుంది. ఈ అంగీకారం దోపిడే వర్గాల, కులాల సాంస్కృతిక ఆధిపత్యం వల్ల “స్వచ్ఛందం” అయినా , వారి రాజ్య హింసాకాండ జనకం అయినా అంతిమ ఫలితం ప్రజల నిరంతర దాస్యం.దీనిని పెంచేందుకు ఆహేతుక మత భావాల ప్రచారం. హేతువాదులపై కేసులు, హత్యలు, రాజ్యం నుంచే కాక చివరకు తోటి పౌరుల నుంచి కూడా పెరుగుతున్న సెన్సార్షిప్.
“కార్మిక వర్గ చైతన్య పోరాటంలో సొంతాస్తి ,మార్కెట్ పెత్తనం పోయినప్పుడు , మనిషి పై మనిషి ఆధిపత్యం స్వేచ్ఛ కాదని తెలిసినప్పుడు పరిస్థితి మారుతుంది. దానికి బూర్జువా వర్గాన్ని శ్రామిక వర్గం కూలదోసి, నాగరికతను మార్చే విప్లవం, పునర్నిర్మాణం అవసరం.నిర్బంధం కాక సహకారం, చైతన్య పూరిత అవసరం తెలిసిన సమాజంలో కోరికలు, జ్ఞాన గ్రహణలను సామాజిక ప్రక్రియలో భాగంగా మలచవచ్చు. అపుడు అందం సామాజిక ప్రక్రియలో ప్రతి భాగంలో ఉండేందుకు తిరిగి వస్తుంది. శ్రమ మరే మాత్రం వికారంగా ఉండబోదని, శ్రమ ఉత్పత్తులు మరలా అందంగా ఉంటాయి అనేది ఒక స్వప్నం కాదు.”
ఈ స్వప్నం భగ్నం చేయడమే దోపిడీ వర్గాల పరమ లక్ష్యం. సమూల మార్పు శాంతియుతం గానా లేదా అనేది పాలక వర్గాల పై ఆధారపడి ఉంటుంది అని బ్రిటీష్ పాలక వర్గం గురించి మాటాడుతూ మార్క్స్ చెప్పాడు. మత, జాతి హత్యా కాండలకి, చివరకి ప్రజలకు ఓటు హక్కును కూడా తీసివేసే అప్రజాస్వామిక పాలకులదే అసలు నేరం అని అందరూ తెలుసుకోవాలి.