ఎటుబడితే అటు
నలుదిక్కులా
బాంబులు పెట్టి
గుట్టల్ని పేల్చి
భూ గర్భాన్ని
తవ్విపోసుకుని
లక్షల లోడులు
వాహనాలు నింపి
బారులు కట్టి తర్లిచ్చే
దృశ్యాలు చూస్తూ
దినచర్య వెళ్లదీస్తూ
దినమల్లా సూర్యుడూ
పగలు విచ్చుకున్న
వెచ్చని వెలుతురూ
రాతిరంతా వెన్నెలై
కమ్ముకున్న మబ్బులూ
ఆకులలాలు ఏరుకునే
ఆదివాసీ కన్న తల్లులూ
ఆ సంకల ఊయలల్లో
పాల్దాగే పసి బిడ్డలూ
కొమ్మ కొమ్మకు దుంకి
రెక్కలిప్పుకు ఎగిరే
పక్షుల కేరింతలూ
చిగుర్ల పులకింతలు
అంతులేని భవంతుల
అందాల గూళ్ల చుట్టూ
ఝాంకార నాదాలతో
తేలియాడే తేనెటీగలూ
గాలిని అంతం చేస్తానని
చెట్లను కూలుస్తూ
నీడలు పోయాయని
తెగ మురిసిపోతూ
పాదాలు నడుం దాకంగా
ఎగిరి దుంకులాడుతున్న
ఏలెడంత లేని ఏలెటోన్నీ
వాని ఎగసోపులనీ జూసి
సుకుమార చిగురుటాకుల
లేలేత పెదాల మీదుగా
చిందులు వేస్తూ ఎగిరోస్తున్న
చిరు గాలి సితారా నోరిప్పి
మేమంతా కుశలమంటూ
కలిసొచ్చే కాలం కోసం
కళ్ళల్లో వొత్తులేసుకుని
ఉషారుగున్నా మన్నాయ్
వొందల వేలల్లో మందయ్యీ
కునుకులేని కంగాల్ కళ్ళల్లో
భయాన్ని దాచేసుకుంటూ
నిత్య కవాతుల మార్చింగ్లూ
వొళ్ళంతా వొణుకు భీతితో
ట్రిగ్గర్ మీంచి తొలగని వేలై
రాజ్యహింసకు రక్షణ కాస్తూ
బుగులు బుగులుగా వాడూ
అన్నీ అలాగే ఉన్నాయడవిన
మారిందేమిటి గడువయ్యాక
చెట్లకుచింది పారిన నెత్తురు
చెదరిపోని మరకలే నేలంతా
పొడ్సిన పొద్దు హతసాక్షై వాలి
వాలిన పొద్దు మళ్ళీ పొడుస్తూ
లయబద్ధంగా సాగుతున్నకాలం
నిబద్ధంగా చాటుతున్న సత్యం
మోదుగువనాలు విస్తరిస్తున్నై
అరుణారుణ పరిమళాలతో
అడివికెప్పుడూ ఓటమి లేదని
ఎద పొదల్జూపి చాటుతున్నది
**