దళిత కథ – స్త్రీ చిత్రణ

కులం, లింగం అనే రెండు అణచివేత వ్యవస్థలు భారతీయ సమాజంలో పరస్పరం ముడిపడి దళిత స్త్రీల జీవితాలను సంక్లిష్టమైన వివక్షకు గురిచేస్తున్నాయని దళిత స్త్రీల సాహిత్యం ప్రతిపాదిస్తుంది. ఉన్నతకుల స్త్రీలకూ, దళిత పురుషులకూ భిన్నంగా దళిత స్త్రీలు కులవివక్ష, పితృస్వామ్యం, శ్రమదోపిడీ, లైంగిక హింస, సామాజిక వెలివేత వంటి బహుళ అణచివేతలను ఎదుర్కొంటారు. ఇంట్లో పితృస్వామ్యం గోడదెబ్బలా, బయట కులస్వామ్యం చెంపదెబ్బలా బాధిస్తుంది. ఈ ద్వంద్వ అణచివేతకు వ్యతిరేకంగా దళిత స్త్రీవాద సాహిత్యం ప్రత్యామ్నాయ స్వరంగా అవతరించింది. ఇది దళిత స్త్రీని బాధితురాలిగానే కాకుండా, తన అస్తిత్వాన్ని ప్రకటించే, ఆధిపత్యాన్ని ప్రశ్నించే, ఆత్మగౌరవం కోసం పోరాడే చైతన్యవంతురాలిగా చిత్రిస్తుంది. బాధను ప్రతిఘటనగా, మౌనాన్ని స్వరంగా మలుస్తూ సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించే సాహిత్యంగా దళిత స్త్రీల రచనలు నిలుస్తాయి.

మనుష్యులని మరయంత్రాలుగా చూసే సమాజంలో మానవత్వం లేదు. ప్రతి పని ఫలితం కడుపు కొరకే. మనిషికి భుక్తి కావాలి. విముక్తి కావాలి. తనకు కావలసిన దాని కోసం మనిషి పరిస్థితిని ఎలా మలుచుకుంటాడో తెలియజెప్పే మామిడి సత్యవతి కథ ‘స్వేఛ్చ’. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు రంగడు పని చేస్తూనే వుంటాడు. రాత్రి ఏ అవసరమొచ్చినా సిస్టర్ నైట్ డ్యూటిలా చేస్తాడు. అయినా జానకమ్మకు ఆమె కోడలుకు వానిమీద జాలి, దయలేదు. వాడికి ఎన్టీఆర్ సినిమాలంటే ప్రాణం. స్వేచ్ఛలేని వాడికి సినిమాలు ఉండనట్లే రంగడికి లేవు. అంతకు ముందు పనిచేసి పారిపోయిన సూరిగాడు పక్కింట్లోకి పనికి వస్తాడు. వాడు సినిమాలో రావుగోపాలరావు సినిమా సన్నివేశం వివరిస్తూ గంగిని సినిమాకు చూడుమని నాలుగు రూపాయలలోంచి ఒక రూపాయి యిస్తాడు. అది చూసిన రంగనికి స్వేచ్ఛ కావాలని కోరుకుని రాత్రికి రాత్రే వెళ్లిపోతాడు. ఈ అలగా జాతిని కాంగ్రెస్‌వాడు, కమ్యూనిస్టు వాడు బాగుచేయలేడని అనుకుంటుంది జానకమ్మ. తనకు కావల్సింది ప్రాధేయపడి, పోరాడి పొందలేని రంగడు పారిపోయాడు. పోరాటానికి సిద్ధమైతే వ్యవస్థలో నలిగిపోతాడు. ఇలాంటి రంగల్లు అడుగుకు ఒకరు చొప్పున కనబడుతారు. వాళ్లంతా ఏకమై పోరాడితే జీవచ్చవాలు కనబడవు. ఈ దేశంలోని మనుష్యులు మనుష్యులుగా గుర్తించబడుతారని జానకమ్మ చిన్న కొడుకు రాఘవ ఆలోచిస్తుంటాడు.

తల్లిలేని పిల్లలుపడే కష్టాలను చిత్రంచిన మామిడి సత్యవతి “తెరతొలగింది” కథ. శశిరేఖ, కృష్ణ కదులుతున్న రైలులో ఉన్నారు. కృష్ణ చెబుతుంటే వింటున్నట్టే వింటుంది. ఎందుకో ఆమెకు గుండె దడదడలాడుతుంది. ఆలోచనలతో అలజడిగా ఉంది మనసు. రైలు ఆగింది. ఒక ముసలమ్మ ఇద్దరు పిల్లలతో కంపార్టుమెంట్‌లోకి ప్రవేశించింది. ముసలమ్మను శశిరేఖ అడుగుతుంది. దుర్మార్గుడైన మా కొడుకు మరో యువతి ఆకర్షణకు లోనవడం వల్ల బి.ఏ చదివిన కోడలు కుమిలిపోయింది. నేను వారించిన. ఇలాంటి సంబంధాలు ఎక్కువ రోజులుండయని చెప్పినా కనీసం పిల్లలకోసమైనా బతకాల్సింది. చనిపోయింది. ఆ యువతి రెండో భార్యగా తిష్టవేసిందని చెబుతుంటే కృష్ణ అసహనంగా చూస్తున్నాడు. నా పిల్లలకు సవతితల్లితో ఇలాంటి బాధలుంటాయని తలంచింది. నా పిల్లలకోసమే నా జీవితమని తలుచుకుంటుంటే మనసు దూదిపింజలా తేలిపోయింది. అప్పుడే రైలు దిగి ఇంటికి వెళ్ళిపోయింది. స్నేహితుల ఇండ్లలో ఉండిపోను ఈ ఒక్కసారి క్షమించండి అత్తయ్య అని వేడుకుంటుంది. యిక మనిద్దరమే ఒకరికి ఒకరం తోడు అన్నట్లుగా ఒకడి మీద ఒకడి కాలుచెయ్యి వేసిపడుకున్నారు. ఆ దృశ్యం చూడగానే శశిరేఖ హృదయం ద్రవించింది. కన్నీటితో ఇద్దరినీ గుండెలకు హత్తుకుంది. పాఠకునిలో, పాత్రలో పరివర్తన తెచ్చేవిధంగా సందేశంగా ముగుస్తుందీ కథ.

భర్త చెడువ్యసనాలను మాన్పించి తనదారిలోకి తెచ్చుకోవడానికి ఇల్లాలు చేసిన ప్రయత్నమే మామిడి సత్యవతి ‘సుశీల’ కథ. గురజాడ ‘దిద్దుబాటు’తో సరితూగే లాంటి రచనగా ఈ కథను పోల్చవచ్చు. డెబ్బై దశకం వరకు మగ ఉద్యోగులు సంపాదిస్తున్నామనే యావలో కొన్ని వ్యసనాలలో మునిగి తేలేవారనీ తెలియజేస్తున్న కథ. “నీవు నలుగురు పిల్లల తల్లివి. ఎవరో కొన్నారనీ రెండువందలు పెట్టి చీరలు కొంటావా?” అని శేఖరం సుశీలను అడుగుతాడు. “ఏమీ పనిచేయని ఎదురింటి ఇరువై అయిదేళ్ల వితంతువు రెండు వందలు పెట్టి కొంటుంటే పెద్దాఫీసరు పెళ్లాన్ని కదా! అందుకే కొన్నానని” సుశీల చెప్పగానే శేఖరం కంపించిపోతాడు. “ఎవరో పెద్దాఫీసర్ రాత్రి తొమ్మిది గంటలకు వస్తాడు. నేను చూసాను. ఆఫీసు పనివలన మీరు పదిగంటలకు వస్తారు. నా సంసారాన్ని రచ్చకీడుస్తానా? అన్నట్లు మీ నెల ఖర్చులు మూడువందలకు పైగా దాటుతుందండి. ఖర్చు కొంతయినా తగ్గించుకొండి.” అని పనిలో మునిగిపోయింది. తరువాత నెల నుండి శేఖరం ఖర్చు పాతిక దాటలేదు. ఎదురింటావిడ వెంకటగిరి చీరలు కొనడం మానేసింది.

పెళ్లికాని యువతిని సమాజం ఎలా హేళనగా చూస్తుందో తెలిపే బోయ జంగయ్య కథ ‘సాలిని’. ఒక పెద్దమనిషి ఉంపుడుగత్తెగా ఉండుమంటాడు. మరొకడు రెండో పెళ్లి చేసుకుంటానంటాడు. సంఘ సేవకురాలిగా పని చేసినప్పటికీ సాలినిని శీలం లేనిదిగా భావిస్తారు.

పొలం పనిచేస్తూ విధవరాలైన జీవితాన్ని చిత్రంచిన బోజదే మరోకథ ‘లేకి బతుకులు’. మాల చంద్రమ్మ రాములు పొలం బావిని వారికే జీతముంటారు. ప్రమాదవశాత్తు మోటబావిల్లో పడి ఊపిరి ఆడక చనిపోతాడు. పరిగె ఏరుకోమన్న యజమాని సుశీల అందులోంచి సగం తీసుకుంటుంది.

సమాజంలో భర్తపోయిన స్త్రీలంటే చులకన. లొంగదీసుకోవడం కోసం ఎన్ని ఎత్తులు వేస్తారో, లొంగకపోతే ఆ కుటుంబాన్ని ఎలా హింసిస్తారో, లైంగిక కోరికలు తీర్చనందుకు చేసే దౌర్జన్యాలను తెలిపే జాతశ్రీ కథ ‘మల్లెతీగ’. జానకమ్మ తనకు తండ్రి వయస్సు అంతటి పెద్దరాంరెడ్డి తనపైన కన్ను వేశాడనీ, రాఘవయ్య చెప్పుకుంటుంది. నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతానని మాయమాటలు చెప్పి లోబరుచుకుంటాడు. తదనంతరం జానకమ్మ కొడుకు సారయ్యను పెద్దరాంరెడ్డి తన ఇంటిలో దుద్దులు దొంగతనం చేశానడనీ చెట్టుకు కట్టేసి హింసిస్తాడు. ఇంత జరుగుతున్నా రాఘవయ్య జానకమ్మని, రాఘవయ్యని పట్టించుకోడు. నిందలేయడానికి కూసుండ్రు. న్యాయం చేయడానికి కాదనగానే కర్రందుకోరా దాన్ని కొడుదాం అంటాడు. అనుచరులు వద్దంటారు. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతారు. సారయ్య పోలీసులకు అప్పగిస్తాడు. రాంరెడ్డి నీ మీద మనసు పడ్డాడు. నీ కొడుకు రావాలంటే అతని కోరిక తీర్చాల్సిందే అని రాఘవయ్య జానకమ్మతో తన నీచ బుద్ధిని తెలుపుతాడు. కోపగిస్తుంది. ఖాకీలు ఆమె శరీరంతో మూడురోజులు ఆడుకొని జానకమ్మ కొడుకుని విడిపిస్తారు. ఒక విధవ జీవితం కుక్కలు చింపిన విస్తరి అంటే ఏమిటో అర్తమవుతుంది. కథ చదువుతుంటే మనసు కుతకుత ఉడుకుతది.

దూర దేశానికి వెళ్లిన పెనిమిటి. ఒంటరి స్త్రీలను లైంగికంగా వేధిస్తే ఎలా గుణపాఠం ఎలా చెప్పాలో చిత్రంచిన గూడ అంజయ్య కథ ‘అమ్మక్క’. పాలు అమ్ముకునే అమ్మక్కను సంగిరెడ్డి, పోలీసు కన్నలాల్ వేధించిండు. నోరున్న మనుషులను చిన్న పామైనా పెద్దకర్రతో కొట్టాలి అని చెప్పిన నల్లపోశాలు మాట అమలు పరచడానికి అమ్మక్క అత్తా కోడండ్లు మాంకలమ్మ జాతర్ల కన్నాలాల్ రాగనే దొంగ దొంగ అని అరవగానే ఊరిజనాలంత ఏకమై కొట్టి పోలీస్ స్టేషన్‌ల అప్పగించారు.

దుబాయివోయిన చెంద్రయ్య ఎయిడ్స్ రోగాన్ని ఎంటబెట్టుకొచ్చిండు. ఆరునెల్లల్ల కాలం జేసిండు. తాళ్ల రేవుకు గంగదాటిన అమ్మక్క జాడలేదు.

బలహీనతలమీద దెబ్బ కొడుతారు. లొంగదీసుకోవడానికి ఎన్ని ఎత్తులు వేస్తారో తెలిపే చైతన్య ప్రకాశ్ కథ ‘దేవ’. పెనిమిటి ఊరికి పోయింది తెలుసుకున్న మల్రెడ్డి పటేల్ తన భార్య పిలిచిందని పిలిపించుకున్నడు. ఇంట్లకు రాంగనే తలుపు పెట్టిండు. పోతా అని తలుపు తెరిసింది. ‘నీకెన్ని జేసిన. అప్పు గట్టుడు ఆలిసెమైన ఒప్పుకున్నా. బొంబాయికి పోతాంటే సాయపడ్తి. పొలం అచ్చు కట్టిత్తి. లేదంటే నా అప్పుకట్టు..అత్తవా? పోతవా?’ దబాయించిండు పటేల్. ఏడుసుకుంట నిలవడ్డది దేవ. ఉరుకొచ్చి రెక్కపట్టిండు పటేల్. “‘పటేండ్ల రూపం మారిందే గాని గుణం మారలేదు!” అని అనుకుంది దేవ.

నాకు నేనే ఆయుధాన్నని ఎరిగిన బాలమ్మను దొర బలాత్కారాన్ని తిప్పికొట్టిన పూలన్‌దేవి జీవితంలాంటి కథ గోగు శ్యామల రాసిన ‘తాటక’. దొర జీతగాళ్లతో పోటి నీళ్లు పారపెడుతుంటే ఓర్వలేని దొర బావికాడ జొన్న సేన్లకు గుంజకపోతూ “ఏమే తాటకి లo… మొగోనిలెక్కన నీళ్లు పారవెడుతున్నవే.” జాకెట్ల చేతిపెట్టి కలెతిప్పుతుండు. ఎంతో ఆడోళ్లను కరాబు చేసిన మాటలు గురుతుకొచ్చినయి బాలమ్మకు. ఈరిగెల పడితే ఇడిసిపెడుతడు అనుకున్నవా? నీవు పిలిస్తే ఎవ్వరు రారే. మొగోల్లకన్న ముందు వోయి నీళ్లు పారపెడుతావే” అని చెంపమీద కొట్టిండు. దూరాన పడిలేచింది. మీద పడడానికి వస్తున్న దొర కాళ్లమధ్య గుత్తిమీద తన్నింది. ‘సస్తినే తాటకి ముండా!… పట్టుకోండిరా” అని దొర పిలుస్తుండు. ఊరుఊరంతా దొర పిచ్చలమీద తన్నిందట అని మాలమాదిగ ఆడోళ్లు గుసగుసలు పెడుతుండ్రు.

మనసుపడ్డ మనిషి మంచితనాన్ని తెలుసుకోలేని మర్మమే బోయిని భాస్కర్ కథ ‘గడ్డిపర్క’. పనిచేస్తూ కన్నును కోల్పోయిన రాముని భార్య సీతమ్మ మీద మనసుపడ్డ రాజయ్య ఒక రోజు రాత్రి నీ మీద కాయిసుపడ్డ అని అడుగుతాడు. “నీవు నా భర్త చిన్నప్పటి దోస్తువి. నన్నింతే అర్థం చేసుకున్నవా? నా మొగుడు గడ్డిపర్క అనుకుంటున్నవు. నిజమే నీలాగ బుర్దల బొర్రే పంది కాదు. నన్ను కదిలియ్య ఏ మొగోని తరం కాదు. నీ అసొంటి లత్కోరోనికి తప్ప. పో. పో.” అన్నది సీతమ్మ. పడుకున్నట్లే పడుకుండి మేల్కతోటి ఈ మాటలు విన్న రాముడు “ఆనాడు నువ్వు నా భార్య వైనందుకు సంబరపడ్డ. ఇప్పుడు నీ మొగున్ని అయినందుకు గర్వపడుతున్న” అని అంటడు. దళిత స్త్రీలు ఎంత ఉత్తమతత్వాన్ని చూపుతున్నారో తెలుపుతుందీ కథ.

స్త్రీ పురుషుల మధ్య ఉన్న అంతరాలను వివరించే జాజుల గౌరి కథ ‘నీళ్లబాయి’. మోటలు పోయాక మోటర్లు వచ్చాయి నీళ్ల ఊటలు కనబడుతున్నాయి. నీళ్లబాయిల ఆడామగా తేడాలేకుండా చిన్నప్పటి నుంచే ఈత కొట్టడం సాధారణమైంది. “గీ ఆడిపోరలకు గింతనన్నా సెరం లేదమ్మ మగ పోరగాండ్లుగల్సి ఎట్ల ఈత కొడ్తుండ్రో సూడు” లింగ వివక్షను చిత్రంచింది.

దళిత స్త్రీకి ఇంటా బయట రెండు చోట్ల వివక్ష ఎలా ఉంటుందో? ఎలా వేధిస్తారో తెలిపిన పచ్చనూరు అనురాధ కథ ‘పాట నేర్చిన నెమలి’. స్వప్న పెద్దమనిషి కాగానే పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. పెళ్లి వద్దంటది. తల్లిదండ్రులు వినరు. కళ్యాణితో కలసి ఆడుతుంది. పాడుతుంది. ఇంట్ల తెలియగానే బడికి బందువెడ్తరు. జండా వందనం రోజున బలవంతం మీద ఆడుతుంది. పాడుతుంది. అందరు మెచ్చుకుంటారు. డాన్స్ నేర్చుకుంటున్నపుడు కళ్యాణి పెద్దమ్మ “మీది మాలకులం అని ఎద్దేవా” చేస్తది. కాంతా టీచర్ పంపిన నోట్స్ తెచ్చిన తోటి విద్యార్థులు ఇంటికి రావడం వలన అనుమానిస్తుంటది తల్లి రాజవ్వ. అనారోగ్యం ముదురుతుంటది. ఏవో పసరు మందులు రాస్తుంటారు. ఒకరోజు రాత్రి హాస్పిటల్ తీసుకెళతారు. శవమైతది. పెళ్లే వద్దన్న స్వప్నకు జిల్లేడు కొమ్మకు పెళ్లి చేస్తారు. కళ్యాణి, మిత్రులందరు ఏడుస్తారు. అంత్యక్రియలు ముగిసాక “నాకు స్వప్ననే ప్రేరణ. నా ఇష్టాన్ని గుర్తించే సమాజం కావాలి” అని ఓదార్పు కోసం వచ్చిన కళ్యాణి చెప్పింది. ఆడేచోట, పాడేచోట ప్రతిసారి తలుచుకుంటుంది.

మాదిగ స్నేహితునితో అన్న పెళ్లికి అన్ని పనులు చేసింతర్వాత నువ్వు మాదిగవని కులవివక్షల్ని చూపిన కథ కేపి లక్క్ష్మి నరసింహ ‘అన్న పెళ్లయ్యేంత వరకు’లో కొట్టొచ్చినట్లు చిత్రించాడు.

దళిత సర్పంచ్‌ల దీనస్థితిని ఆవిష్కరించిన డా. పసునూరి కథ ‘ఊగి ఊగి ఉయాల’.“ఏడ మారుతది బిడ్డా మన రాత! నేను సర్పంచినేగని నా ఇష్టంతోటి రాజ్యమేలనీకి సర్పంచ్ అయినానురా, ఆ పెద్దిరెడ్డి పటేల్ నిలబడితే నిలబడ్డ. ఏలి (వేలి ) ముద్దరెయ్యమంటే ఏసిన. సూత్తాంటే ఐదేండ్లు వొడిసే… సర్పంచ్‌గా వున్నా గూడా గిట్లనే కూలీనీ చేసుకుంటి. ఇప్పుడు సర్పంచిగిరి పోయినంక గూడ మల్ల గదే దిక్కైంది బిడ్డా!” అని అగ్రకుల స్త్రీవాదాన్ని తిప్పి కొట్టింది పెద్దమ్మ.

స్త్రీలపట్ల వివక్ష, హింస అస్థిత్వస్పృహ కలిగినప్పటినుంచే కథల్లోకి ప్రవేశించాయి. పురుషాధిపత్యానికి దళిత స్త్రీ ఎలా బలయితుందో డప్పోల్ల రమేష్ ‘దునియల’ కథ వివరిస్తుంది. ఒక దశలో జీవితం మీద విరక్తి పుట్టినా చావడానికి సిద్దమై చావు పరిష్కారం కాదని అనుకున్నది బతికి సాధించడమే నిజమైన పరిష్కారం చూపుతది.

పాఠశాలలో ఉన్న స్నేహం ఊళ్లోకి వచ్చేసరికి ఏమవుతుందో తెలిపేది జూపాక సుభద్ర కథ ‘బల్లె దోస్తులు ఊల్లెగాదు’లో బట్టలు, గాజులు ఇచ్చి పుచ్చుకోవడం కులం వల్ల ఏర్పడే అవస్థను తీర్చి దిద్దింది. మాదిగలకు బతుకమ్మ లేకుండా చేసిన మనువాదుల కుటల్ని పసిగట్టి చిత్రిక పట్టిన జూపాక సుభద్ర ‘గద్దెత్కపోయిన బత్కమ్మ’ కథ వివరిస్తుంది.

ఎక్కువ కులాలతో మిళితమవడాన్ని దళితులకు చేయూతను ఇచ్చిన బహుజన తత్వాన్ని చిత్రించిన తప్పెట ఓదయ్యగారి ‘మల్లక్క’ కథ. మల్లక్క కుర్మ. రచయిత మాదిగ. తన కుమార్తె అడిగినందుకు ఉపాధ్యాయుడు తనగతం చెప్ప్పుతడు. మా అయ్య సచ్చిపోయినపుడు ఆ అక్కనే సందం చేసిందీ. నా సదువుకు సాయం చేసింది. మీ అమ్మతో పెళ్లి చేసింది. నువ్వు, నీ చెల్లెలు, నీతమ్ముడు పుట్టినప్పుడు అతీగతీ లేని యాల్ల అన్నీ తానై నాకు సాయం చేసింది. ఆప్పటి బాధలు చెపుతూ మనసును పిండేస్తడు. అది కథకాదు జీవితం గనుక మనసుతెరల బతుకు వెన్నెలను పిండోలే ఆరవోస్తడు..

పుట్టి పెరిగాక ప్రయోజకుడై బతుకు మీద తన్నడమే బాధకరం. మనసు విరిగిపడే దృష్టాంతాన్ని విలపించిన అమృతవర్షిణి జయరాజ్ కథ ‘ఋణానుబంధం’. ఈ కథలో అగ్రజాతి స్త్రీ ప్రేమలోపడి కన్నతల్లిని ఆమె త్యాగాన్ని మరిచిపోవడం బాధాకరం. సర్వం కోల్పోయిన తల్లిగా కనబడుతుంది. అగ్రజాతి స్త్రీలను ప్రేమించి పెళ్లి చేసుకున్న కులానికి, తలానికి, రక్తసంబంధానికి దూరమైతారనీ వివరిస్తుంది.

శ్రీహర్ష గానకచేరికి మనసుపడి రెండో మనువాడిన హంసలేఖిని నిస్వార్థ జీవితం గంధం విజయలక్క్ష్మి కథ ‘రెండో మనసు. మూడో మనిషి’. విశేషకృషి చేసిన శ్రీహర్షకు గానగంధర్వ బిరుదు ప్రధానమయ్యాక మిత్రులకు పార్టీ ఇస్తాడు. మీకు పిల్లలుంటే ఎంతో బాగుండు అని అన్నారు. నేను తండ్రినే. లేఖిని తల్లిని కాకుండా ఒప్పించిన. అని చెప్పే మాటలు లేఖిని వినపడ్డాయి. గుండెపోటుతో మరణించినప్పుడు ఎందుకు ఏడుపు వస్తలేదని వసుధ అడిగినప్పుడు అతనిది స్వార్థం. రెండో మనసు. నేను మూడో మనిషిని అని బాధ పడుతుంది.

బూతం ముత్యాలు ‘మాయమ్మ మల్లమ్మ’, జాజుల గౌరి ‘అమ్మ’, స్త్రీవాద కథలు. పురిటిలోనే పసిపిల్లలను అమ్ముకునే దుస్తితిని కొమ్ము రజిత ‘ఫెర్టిలిటి’కథలో వివరించింది. తాళపల్లి యాకమ్మ ‘మమతల మల్లెలు’ కథ నాన్న ఘనత పతాకస్థాయి కల్పించింది. మహిళలందరి సమస్యలకే తీరుగా ఉండవని కులాన్ని, ఆర్థికస్థితిని బట్టి వేరువేరని ‘ఉత్సవం’ కథలో యాకమ్మ చిత్రించింది. పల్లెటూర్లలో బాల్యవివాహాన్ని అడ్డుకోవడం గురించి తాళ్ళపల్లి యాకమ్మ ‘గురుదక్షిణ’ సామాజిక స్పృహకలిగిస్తుంది. గర్భిణీ స్త్రీ చనిపోతే బొందల గడ్డలో పూడ్చిపెట్టేటపుడు అవమానించి, అడ్డుకొని, చివరకు బొందల గడ్డలో కూడా స్త్రీ వివక్ష ఎదుర్కొంటున్నదని తెలియజేసే కథ డి.జి హైమావతి ‘బొందల గడ్డకు దూరంగా’ మహిళల దుర్భర వివక్షకు దుర్బిని. ఆర్థిక స్థాయి పెరిగినా, వివక్ష పోదనీ, పూజచేసే వద్ద బైండ్ల పూజారి ఉంటేనే సమానత్వం ఉంటుందని కలగన్న కథ గోగు శ్యామల కథ ‘కలల రాణి’ భవిష్యత్తు దర్శనం చేసింది. అవమానాల మధ్య సమాజంలో స్తీల బతుకు ఎంగిలి విస్తరిలా ఉందని కిరణ్‌చర్ల ‘ఇత్తారాకుల తట్ట’ కథలో దృశ్యీకరిస్తాడు. భర్త రోజు కొడుతుంటే తిరగబడ్డ భార్య కథే మన్నె ఏలియా ‘ఇదెక్కడి న్యాయం’ వివరిస్తది. విప్లవం బాట పట్టిన సెల్లెల్ని చూద్దామని వెళ్లిన అక్కకు చెల్లెలు మరియ మనువాద బ్రాహ్మణీయ భావజాలం నింపుకున్న మంజుల అని తెలియగానే వెనుదిరిగిన అక్క బాధే జూపాక సుభద్ర ‘మా సెల్లే మల్లక్క’ కథ వివరిస్తుంది. పిల్లలు లేని గొడ్రాలు శుష్క జీవితాన్ని పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో బహుమఖీన పాత్రల్లో ఒదుగుతున్న స్త్రీ జీవితాన్ని జాజుల గౌరి ‘నిట్టూర్పు’ కథలో వివరిస్తుంది. వీరి ‘కంచె’ కథ ఎదుగుతున్న బాలిక జీవితంలో కంచెలు ఎలా మొలుస్తాయో దృశ్యీకరిస్తుంది.

పెరుమాండ్ల రామ్‘కన్నీటి కథ’ దు:ఖపు తెరతో ముగిస్తాడు. ‘ఆమె పేరు హంపి’ (కిరణ్ చర్ల) కథ అర్బన్ ఆధునికతతో పాటు ఛిద్రమవుతున్న రూరల్ లైఫ్ గురించి రాసాడు. డి. జి హైమవతి కథ ‘సీతవ్వ’లో దళిత ఆత్మగౌరవం కనబడుతుంది. చనిపోయిన భర్తను తలుచుకుంటూ విషాదంగా చిత్రంచాడు. గంధం విజయలక్క్ష్మి కథ ‘ముచ్చలిక’ గోసంగి స్త్రీ సాధించుకున్న విజయాలు విశదపరిచింది. వీరి ‘ఫీజు’ కథలో మోసంచేసిన భర్తను కటకటాల పాలు చేసిన మహాలక్క్ష్మి ఒక మేల్కొల్పు. ప్రేమించి పెద్ద చేసిన వ్యక్తి నాయనమ్మ కళ్ళ ముందు చనిపోతూన్న దీనస్థితిని చిత్రించిన సిద్దెంకి యాదగిరి కథ ‘నాయనమ్మ’ ఆత్మీయతకు చిరునామా.

వీరిదే ‘ఎంతకంతే’ కథ ప్రపంచీకరణ నేపథ్యంలో దంపతుల సంబంధాల్లోని మార్పులను సమర్థంగా చిత్రించింది. ఎయిడ్స్‌ నేపథ్యమైనా, ఊహించని ముగింపుతో కథ ప్రత్యేకతను సాధించింది. గురజాడ ‘దిద్దుబాటు’ ముగింపును గుర్తుచేసే ఆశ్చర్యం కలిగించింది.

మన్నె ఏలియా సంస్కారవంతమైన కథ నేటి పల్లెల్లో కూడా ఉందని తెలియజేసే కథ “లచ్చవ్వ”. లచ్చవ్వ, బక్కయ్య భార్యా భర్తలు. బక్కయ్య తాగుబోతు. తాగిన తర్వాత బాధలు పెట్టడం, పంచాయతి చేయడం మామూలే. ఓపికతో భరించిన లచ్చవ్వ మంచితనంతో భర్తను మార్చుకుంటుంది. మన్నె ఏలియా ‘ఇదెక్కడి న్యాయం’లో భార్యను ఇల్లిల్లు తిప్పికొట్టే రాజారావును, తిరగబడి ఒక్క గుద్దు గుద్దుమని తమ్ముడు చెబితే, తిరగబడ్డ కాంతక్క భయపడుతుంటాడు.

ఊరి పీడనను చిత్రించిన భూతం ముత్యాలు కథ ‘ఉసురు’. భర్తపోయి సుంకరితనం చేస్తున్న మాల సూరమ్మ లొంగకపోయేసరికి అందరు చూస్తుండగానే కొట్టిండు పటేలు. ఫిర్యాదు చేస్తే సాక్ష్యం లేనిది ఏమి చేయలేమని చేతులు ఎత్తేసిండ్రు పోలీసోల్లు. ఉసురు ఉట్టిగపోదని శాపనార్థాలు పెటింది సూరమ్మ. మరికొన్నాళ్లకు గొల్లపెద్దులు భార్యను కూలికి అఘాయిత్యం చేయబోతే మందకాస్తూ చూసిన పెద్దులు గొడ్డలికి బలి అయ్యాడు.

మాల మాదిగ ఆడోల్ల గోసలు మాటలకందయి. కాపాడే పురాణ పురుషులు లేరు. రారు. భూస్వాముల ఆగడాల” సావు ఎతలల్లో బయటపడ్డ వాస్తవాలను విలపించిన విషాదాలే జూపాక సుభద్ర రాసిన ‘పగిలిన పచ్చిపుండ్లు’. మాదిగోనికి మంచి పెండ్లాం ఉండొద్దు అనే సామెతవోలే. మొగని పక్కలనుంచి బలాత్కారం చేసుడే. ఆడోళ్ల బతుకులు కుక్కలు చింపిన ఇత్తార్లేనని ఏతం బొక్కెన తీరు ఎత్తిపోసింది. మామకు ఇద్దరు పెళ్లాలుండేవారనీ, మామ సావునాడే తెలుసుకొన్నది. అత్తబతుకును, ఆమెలాంటి కింది కులాల ఆడోల్లను పటేల్ భూస్వాములు ఎట్లా నాశనం చేసారో తెలిపింది. కథ చదువుతుంటే మనసంతా పచ్చిపుండ్లలా సలుపరం పెడుతది.

గజిటెడ్ సంతకం కోసం వెళితే లంచం ఇవ్వాలని పేర్కొనే జాజుల గౌరి కథ ‘దస్కత్’. కొడుకు స్కాలర్‌షిప్ ఫాం మీద సంతకం కోసం డాక్టర్ దగ్గరకు వెళితే రెండు రోజులు ఆపి చివరకు ముప్పై రూపాయలు లంచం అడుగుతారు. నా కూలి రోజుకు నలుబై. ఎక్కడి నుంచి తేవాలని బోరున విలపిస్తది. సంతకం కావాలంటే పైసలు ఇయ్యాలంటాడు కంపోండర్. అవ్వా! ఇయ్యరాదే కొడుకు అనడం నిస్సహాయ స్థితిని తెలుపుతుంది.

జాతర అనేది ఊరంతా కలసి చేసుకునే పండుగ అయినప్పటికీ, అగ్రవర్ణ వ్యక్తిని అనుకోకుండా తాకినా జరిగే ఘోర పరిణామాలను అనేక సంఘటనలు తెలియజేస్తాయి.

మహిళపై జరిగే హింసను, పురాణ ప్రతీకలతో ఆధునిక జీవితాన్ని మేళవిస్తూ చింతకింది శివశంకర్ రాసిన “బొందల గడ్డ” కథ విప్లవ చైతన్యాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తుంది.

కులం ఒక్కటే. వివక్షలలో తేడా. స్త్రీలకు కులం లోపలి వివక్ష. ఆఖరి ఘడియలోను వివక్ష. అంతిమ యాత్రలోనూ వివక్ష. దహనంలో వివక్ష. కేవలం స్త్రీలకు మాత్రమేనని రూఢీపరచిన డి. జి. హైమావతి కథ ‘బొందలగడ్డ’. గర్భిణీ స్త్రీ పురిటినొప్పులు పడుతూ చనిపోయింది. బొందల గడ్డలో పూడ్చిపెట్టనీయ్యకుండా అవమానాలు శవానికి మసిరాయడం, నల్లకోడిని కట్టడం, అడుగడుగున అవమానాలు జరుపడం ఒక హేయమైన చర్యగా పశ్నించింది. ఆమె స్నేహితురాలు చావులో ఇలాంటి అనవసరమైన కట్టుబాట్లు ఇంకా కొనసాగుతున్నాయని ఈ కథ ద్వారా మనకు తెలుస్తున్నాయి.

కుటుంబం కోసం జీవితం ధారపోసింది గీత. చెల్లెలు పిల్లల్ని అనాధలు చేసి వెళ్లిపోయినప్పుడు ముప్పైఐదేళ్లు నిండిన గీత తన తల్లి మాట విని, తాను పెళ్లి చేసుకోవద్దని గీసుకున్న గీతదాటి ఆలోచించింది. వాసుతో పిల్లల కోసం కొత్త జీవితాన్ని ప్రారంబించాలనుకోవడమే డా. మండల స్వామి కథ ‘బతుకు గీత’ భవిష్యత్తుకు పునాది.

ఆత్మవిశ్వాసమే విజయానికి మూలం అని బలంగా నమ్మించే కథ ఇది. కష్టాన్ని నమ్ముకొని కాలంతో పాటు ముందుకు సాగితే ఏ లక్ష్యాన్నైనా సాధించగలమనే సందేశాన్ని స్పష్టంగా అందిస్తుంది. సిస్టర్ అనసూయ రచించిన ‘విక్టరీ ఇస్ యువర్స’ కథ, గెలుపు శక్తి మనలోనే ఉందని గుర్తుచేస్తూ, ప్రతి మనిషిలో దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలికితీయడానికి ప్రేరణగా నిలుస్తుంది.

మనసు క్షణక్షణం మారుతుంది. స్త్రీల మనసు గురించి చైతన్య స్రవంతిలో రాసిన మొగురం రాజనర్సు కథ ‘మనసు’. అదే చూపు. తదేకమైన చూపు. వెంటాడే చూపు. వేటాడే చూపు. గుచ్చుకునే చూపు అని తన అందం గురించి పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటదొక యువతి. రైలులో ఆమెకి నచ్చిన ఒక యువకున్ని ఉద్దేశించి పలకరిస్తాడు. పేరడుగుతాడు. అప్పుడు నా తడాఖా చూపెడుత అని అనుకుంటది. రైలు ఆగగానే టీ తాగడానికి వెళ్తుంటే నన్ను రమ్మని అడుగొచ్చుకదా! అని అనుకుంటుంది. అతను ఆమెను అసలే చూడడు. పట్టించుకోడు. ఇతడు మగాడేనా అని అనుకుంటుంది.

నెలనెల స్త్రీలకు కలిగే ఋతుక్రమంతో వివిధ కులాలలో ఉండే ఛాందసవాద ఆచారాలు వ్యవహారాలు, కట్టుబాట్లు ఎలా నియంత్రిస్తాయో, తెలుపుతూ ప్రత్యామ్నాయ పరిష్కారం దిశగా ఆలోచింపజేసే జూపాక సుభద్ర కథ ‘అంటు- ముట్టు’ దుర్మార్గ మహిళాలోకానికి ప్రత్యామ్యాయం చూసే మార్గదర్శనము చూపుతుంది.

తాగుబోతు భర్త బతుకును మార్చిన భార్య మంచితనాన్ని తెలిపే నూకపొంగు వెంకయ్య కథ ‘గంది దుళ్ళ’. నువ్ తాగుడు మానకపోతే నేను చచ్చిపోత అని బెదిరించగానే పిల్లల కోసం మారిన భర్త “ఇకముందు తాగనని” ప్రమాణం చేస్తాడు.

ఆశలు అడియాసలు చేసిన తమ్ముడు మిగిలిన మానసిక క్షోభ తెలిపే ఐనాల సైదులు కథ ‘చిన్నమ్మ’. చిన్నమ్మ పెద్దమనిషి కాగానే చదువద్దని తల్లి సూరమ్మ పొరు పెడుతుంది. సూరమ్మ తమ్ముడు ప్రకాశ్ పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తాడు. వేరే వాళ్లని పెళ్లి చేసుకొని దూరదేశం పోతాడు. కొన్నాళ్లకు సర్వం కోల్పోయి అనారోగ్య పీడితుడై వస్తాడు. పెళ్లి చేసుక”ంటాను అంటే చిన్నమ్మ కళ్లు చింతనిప్పుల్లా మండుతాయి.

ఉన్నతకులాల వారిని పెళ్లిచేసుకుంటే ఎలాంటి వివక్ష ఉంటుందో ఉపకులం వారు ప్రధాన కులం అబ్బాయిని, అమ్మాయిని చేసుకన్నా అదే పరిస్థితి ఉంటుందని తెలిపే సంపతి సోమయ్య కథ ‘ముచ్చటగా మూడో ముడి. ప్రేమ పెళ్లిలతో కులసమానం’ రాదు. కుల నిర్మూలన జరుగదని వివరిస్తుంది.

సతికి పతి, పతికి సతి సంబంధం చెప్పే సిస్టర్ అనసూయ కథ ‘ఆదర్శం’. రోగగ్రస్తమై చనిపోయిన భార్య కలలు నిజం చేయాలని భర్తని మళ్లీ పెళ్లి చేసుకొమ్మని అందరు ఒత్తిడి చేస్తుంటారు. భర్త తన భార్య కలలు నిజం చేస్తాడు. భర్త నిఖార్సుతనాన్ని వివరిస్తుంది. భర్త కోరికలను సాధించిపెట్టే మహిళల్లాగే భార్య ఆశయాలు సాధించాలనే భర్తలున్నారనీ తెలుపుతుంది.

పిల్లలు లేకపోతే ఏవిధంగా హింసిస్తారో తెలిపే రామ్ పెరుమాండ్ల ‘కన్నీటి కథ’ నిజంగా కన్నీరు తెప్పిస్తుంది.

గొడ్రాలని, ప్రతికార్యం కాడ ఎన్ని చీత్కారాలతో పిల్లలు లేక అవమానాల పాలైన ముత్యాలు పొందిన దుఃఖం అంతా ఇంతా కాదు. అని తెలిపే సిద్ధంకి యాదగిరి కథ ‘విరిగిన కల’. పిల్లల కోసం ఊరు మీద గర్భిణిగా మారిన వీరవ్వను మారుమనం తెచ్చింది ముత్యాలు. కొడుకు పుట్టిండు. ఎంతో ప్రేమను కురిపించే ఊశయ్య. నీకే పుట్టిండా అనే భరించని మాటకి ఉరిబెట్టుకుని చనిపోయిన విషాదం ముగింపులో కనబడుతుంది.

నిందలు మోపి ఆగం చేసిన ‘పిన్నం’ లాంటి బతుకులను ఉదాహరణగా నిలిపిన మేడి చైతన్య కథ ‘ఇత్తారాకుల తట్ట’. చిన్నాన్న పిన్నంను అనుమానంతో కొడ్తుండేవాడు. చంకచాటు బిడ్డగా ఉన్న రాజిగాన్ని గుంజుకొని ఆమెను ఊరెల్ల కొట్టారు.రాజిగాని మీద ప్రాణం. ఆమె విలువ తెలిసొచ్చేవరకు పదేళ్లు దాటింది. బాబాయి పిలిచినా రాలేదు. రాజిగాని పెళ్లిచూపులప్పుడు రాలేదు. పెళ్లికాడికి వచ్చింది. పెళ్లి తరుపువారు “నీలాంటి లంజలు దీవిస్తే మా బిడ్డకూడా బిచ్చమెత్తుకుంటదే.”అని ఆ మనిషి కొట్టింది. పెళ్లి చేసుకుంటున్న కొడుకు రాజిగాడు స్పందించలేదు. రచయిత తల్లే స్పందించింది. ఓదార్చింది. ‘నా అమ్మని కొట్టెది ఎవడ్రా?’ ఒక్క మాటనలేదని రచయితకి బాధ కలిగింది. బలవంతంగా యారాలు తినపెట్టింది. వాళ్ల గురించి ఎందుకు తపన పడుతావు అని అడిగిండు. నువ్వు పెద్ద కొడుకువు. వాడు చిన్న కొడుకువు. వాడికి తెలియదంది. వానపడుతున్నప్పుడు తిన్నందుకు ఇత్తారాకుల తట్ట ఎత్తుకొని ముందుకుపోతుంటే ఎంగిలి మెతుకులు వాననీల్లు చారు మొఖం మీదికి కారుతూనే ఉన్నాయి. ఆ చీకట్లో కొడుకు పెళ్లి చూసిన పిన్నం చీకట్లో కలిసిపోయింది. బాధలో బాధ్యత. బాధ్యతలో అవమానం ఓర్చుకున్న మాతృతత్వం మరిచిపోలేనిది.

దళిత కథా సాహిత్యంలో స్త్రీ చిత్రణ ఒక జీవన వాస్తవానికి అద్దం పడుతుంది. కులం, పితృస్వామ్యం, పేదరికం, లింగ వివక్ష, లైంగిక దోపిడీ వంటి సంకెళ్ల మధ్య నలిగిన దళిత స్త్రీ కన్నీటి కథ మాత్రమే కాదు; ఆత్మగౌరవం, ప్రతిఘటన, చైతన్యం, విముక్తి కోసం సాగిన పోరాటానికి ప్రతీక. వివిధ కథల్లోని స్త్రీ పాత్రలు బాధను భరించే నిస్సహాయులుగా కాక, పరిస్థితులను ప్రశ్నించే ధీరులుగా, కుటుంబాన్ని నిలబెట్టే మాతృమూర్తులుగా, అన్యాయాన్ని ఎదిరించే చైతన్య స్వరాలుగా దర్శనమిస్తాయి. అందుకే దళిత స్త్రీ కథనం సమాజపు చీకటి మూలలను వెలుగులోకి తెచ్చే సాహిత్య దివిటీ. ఈ కథల పరిమళం సమానత్వం, మానవత్వం, స్వేచ్ఛ, ఆత్మగౌరవం వైపు సమాజాన్ని నడిపించే చిరస్మరణీయ సాహిత్య సుగంధంగా నిలుస్తుంది. దళిత స్త్రీల జీవితాలు శకశకాలాలు విరిగిపడుతున్న దృశ్యాలు చాలా రికార్డు అయ్యాయి.

(ఇంకా ఉంది…)

జ‌న‌నం: గోనెపల్లి గ్రామం, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ. కవి, రచ‌యిత, ఉపాధ్యాయుడు. జంబూ సాహితీ వ్యవస్థాపకులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (2009–2016) నుంచి “తెలంగాణ పాటల్లో సామాజిక చిత్రణ” అంశంపై పీఎచ్.డి. పరిశోధన చేశారు  (2017). రచనలు : కవిత్వం : 'మా తొవ్వ‌'(క‌విత్వం), 'బ‌తుకు పాఠం'(క‌విత్వం), కథలు :  'త‌ప్ష‌'(క‌థ‌); సాహిత్య విమర్శ : ముక్వారు (సాహిత్య వ్యాసాలు) - 2025, పాట ముచ్చట (పాటలపై విశ్లేషణ - 2026) ప్రచురించారు. జంబూ సాహితీ ఆధ్వర్యంలో గుడిపల్లి నిరంజన్, తప్పెట ఓదయ్య గారలతో కలిసి దళిత కథా సిరీస్ కు సంపాదకత్వం వహిస్తున్నారు. సంపాదకత్వం : 1. తొండం బొక్కెన - తొలి తెలుగు దళిత కథా వార్షిక (2020), 2. చిందూ నేల - దళిత కథ (2021), 3. సాక - దళిత కథ (2022), 4. కొమ్ము - దళిత కథ (2023), 5. గండదీపం - దళిత కథ (2024). డిజిటల్ రిసోర్స్ : siddenky.blogspot.com, యూట్యూబ్ ఛానల్ : “తెలుగు సిరి – డా. సిద్దెంకి”, ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇబ్రహీంనగర్, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) గా పనిచేస్తున్నారు.

 

 

Leave a Reply