ఈ రోజు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన వారే దాని మౌలిక స్వరూపాన్ని మార్చి, జీవించే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ తదితర ప్రాథమిక హక్కులను, సామ్యవాద స్ఫూర్తి కలిగి ఉన్నాయని అంబేద్కర్ చెప్పిన ఆదేశిక సూత్రాలను బేఖాతరు చేస్తున్నారు. అటు పార్లమెంటు మార్గంలో , ఇటు బయటా సామ్యవాద పోరాటం ముగిసిందని చంకలు కొట్టుకోవడం ఈ దోపిడీ వర్గాల పార్టీలకు, మేధావులకు ఎంతో కాలంగా రివాజు అయింది.
నేడు విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు, టీచర్లు, కార్మికులు, పర్యావరణవాదులు ఏ వర్గం నిరసనలు తెలుపుతున్నా వాటి అణిచివేతకు రాజ్యాంగ యంతం తక్షణమే సిద్ధం.
మరో వైపు ఆర్థిక అవస్థల పాలైన జనం పథకాల మీద, నిరుద్యోగులు ఉద్యోగ కల్పన, రైతులు గిట్టుబాటు ధరలు , మధ్య తరగతి అందుబాటులో చదువు, వైద్యం కోరుకుంటున్నారు. ఇదే అవకాశంగా ఎన్నికల హామీలు, ధన ప్రభావం, ఎలెక్టోరల్ malpractices పెరిగాయి. ఈ సందర్భంగా శ్రీ శ్రీ ఉండి ఉంటే ఎలా స్పందించేవాడో? ‘మహా ప్రస్థానం’ (1950)లో విప్లవాన్ని ఆహ్వానించిన శ్రీ శ్రీ, ‘మరో ప్రస్థానం’ (1980) లో విప్లవాన్ని రికార్డు చేశాడని చలసాని ప్రసాద్ మరో ప్రస్థానం ‘ముందు మాటలు’ లో రాశారు. శ్రీ శ్రీ తన ‘మరో ప్రస్థానం’ రచనలో శ్రీకాకుళం, నక్సల్బరీ పోరాటాలను కీర్తించాడు.
ఈ వ్యాసం మహాకవి శ్రీ శ్రీ పోరాట స్ఫూర్తికి నివాళి. 1982 లో తన గొంతుతో మరో ప్రస్థానం ’లోని ‘ ఊగరా ఊగరా ఊరికొయ్య అందుకుని ఊగరా’ గీతం చదివి, ’ఎర్ర మల్లెలు’ సినిమా పై నిషేధాన్ని ఖండించి తన ఉపన్యాసంతో మొత్తం కర్నూలు పట్టణ విద్యార్థి లోకాన్ని ఉత్తేజితం చేశాడు. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన నాలుగు మాటలు ధైర్యంగా చెప్పిన కవి శ్రీ శ్రీ.మానవ జాతి గమ్యం పట్ల ఆశాజ్యోతి కి ప్రతీక అయిన ఈ పుస్తకం మీద జో హుకుం విమర్శకుల శీతకన్ను పడటం అర్థం చేసుకోవచ్చు.
ఈ పుస్తకంలో తొలి కవితలోనే “ ఇప్లవం యాడు దిరా / ఆడనే నీ గూడుందిరా/ గోడు గోడున ఏడస్తవుంటే/ యాడు నీ వొంక రాడింకరా” అని జనం భాషలో రాశాడు. శ్రమలోనే సంపద ఉందని, విద్యను కల వారికి అమ్ముకోవడం కాక శ్రామిక వర్గాలతో కలవాలని “ బూర్జువాల రాజ్యాంగపు బూజంతా దులపండి” అన్నాడు. ఇది చాలు కొందరు సాహితీ పరులు మరో ప్రస్థానం నుంచి చూపు తిప్పుకోవడానికి.
.
“పెట్టుబడిదారులు బెంగ పెట్టుకోనక్కర లేదు / సాధారణ పరిస్థితులు సామ్యవాదాన్ని తీసుకు రాలేవు “ ( ’సాధారణ ఉగాది పచ్చడి’)
అయితే ఇది నిజానికి అసాధారణ కాలం. ఆనాడు పార్టీలు, పత్రికలు ఈ రోజు లాగే అధికార పార్టీల పక్షపాతంతో మృత్యువు కొమ్ము కాస్తున్నపుడు ”సచేతనంగా యువతరం
స్పందిస్తోంది/ ఆరోగ్య కరమైన ఆహారం అందిస్తోంది/ తిరుగుబాటు గాలులు పీలుస్తూ పెరుగుతోంది” అని రాశాడు. దానికి మన పొరుగు దేశాలు అయిన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లలో ఇటీవల ఘటనలు తార్కాణం. నాటి రోజుల్లో వియత్నాం విజయ గీతి పిదప
“ అదిగదిగో బంగ్లాలో అగ్గివాన కురుస్తోంది!/ అదిగదిగో సిలోన్ లోను ఎర్ర సేన కదులుతోంది/
ఇదే ప్రపంచ కుగ్రామం! ఇది గ్లోబల్ సంగ్రామం/ఎడతెగనిది సంక్షోభం! ముందున్నది సంక్షేమం!” అని శ్రీ శ్రీ రాయటమే కాకుండా త్యాగాలు, ఆదర్శాల విలువ గుర్తిస్తూ “స్వాతంత్యపు మారు పేరు సామ్యవాదమే సత్యం/ చావు లేని ఆ సత్యం జ్వలిస్తుంది అనునిత్యం/” అంటూ సామ్యవాద రథ సారథి మార్క్స్ చూపెనదె తీరం/ తూర్పు దిక్కు మందారం! ఆర్పరాని అంగారం!”ఇంక్విలాబ్ జిందాబాద్ “ అని ముగించాడు.(తుది పయనం: తొలి విజయం)
నేడు సనాతన వాదుల చర్యలు అందరికీ విదితమే. ఎదుటి వారిని నోరెత్తకుండా చేయాలని, విమర్శిస్తే మనో భావాలు గాయపడ్డాయని మాటాడుతున్నారు. నాడే అన్నాడు శ్రీ శ్రీ ”భూత కాలం చూరు పట్టుకుని/ విలువలకు వింత వ్యాఖ్యానాలు చేస్తున్నారు/ పాతనీ బతికించడానికి / కొత్త చిట్కాలు వెదుకుతున్నారు/ కొత్తవి హతమార్చడానికి/ పాత కత్తులు నూరుతున్నారు” (‘ఝుoఝు’)
’నిన్నటి జట్కావాలా’ కవితలో తన ముసలి గుర్రం, కొడుకు చనిపోతే, భార్య వెళ్ళిపోతే ఆత్మహత్యకు సిద్ధమై ” సీ సవ్వ కూడదు / సచ్చి సాదించేదేమిటి?/ ఏది సేసినా బతుకున్నపుడే సెయ్యాల” అని ఆశావాదం బోధించిన కవి శ్రీ శ్రీ.
హీన దీన జనులకు పెద్ద పండుగ శుద్ధ దండుగ అని, హింసా మార్గం కార్పోరేటులది , ధనస్వామ్యానిది అని రాసిన కవిత ’ఎవరిది అహింస?’ అనాడు బిర్లా ప్రాపకం కోసం సమూల నిర్మూలన కోసం నాటి పాలకులు సిద్ధ పడటం ఖండించాడు. ఈ నాడు అడవుల్లో గనులపై అదానీకి పెత్తనం కోసం కూడా అదే జరుగుతోంది.
నేటి ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో డబ్బు పంచి , ఆ వ్యయాన్ని పెట్టుబడి లా భావించి మరింత ఆర్జించాలని అర్రులు చాస్తున్నారు ఈ నేతలు. దీనికి విరుగుడుగా ” వెంపటాం/ కాదు సంచులు నింపటం/ సొంతాస్తులు పెంచడం / వెంపటాం/ అన్యాయాన్ని గుండు పేల్చి చంపడం/ అధర్మాన్ని గద్దెమీంచి దించడం” అని రాశాడు. ధన ప్రభావం పూర్తిగా లేని నాడు జనాభిప్రాయం నిజంగా బయటకు రాగలదు.అది చేయకుండా నేతలు అవినీతి పరులయి ప్రజలను అవినీతి పరులను చేసి పబ్బం గడుపుకోవడం శోచనీయం.
ప్రజాస్వామ్య బద్ధ మార్పు కోసం ఏ సామాజిక, సాంస్కృతిక మార్పులు అవసరమో ఆలోచించాలి. కేవలం అధికారం వచ్చినంత మాత్రాన కోట్ల ప్రజల భావజాలంలో మార్పు రాదు.
సోషలిజం యొక్క అవశ్యకతను మరింతగా ప్రచారించి, నిజ జీవితంలో ఆచరించి దానిని కోరే అందరినీ సమీకరించి సాగాలి.విదేశీ విప్లవాల ఉదాహరణలు గుడ్డిగా అనుకరించడం, గత వైభవ జ్ఞాపకాలు మానాలి. శ్రీ శ్రీ మాటల్లో, “అంటే నిన్నటి మాట /మరిచి పొమ్మని కాదు నేననేది/నిన్నటిలో జీవించడం మానేసి/ రేపటి కార్యాల గురించి/ ఆలోచించమనే నేను అనేది.” (‘పంచ రత్నాలు’)
కలగా పులగం కవితలో రోజువారి సమస్యలను తేలిక చేస్తూ చివర “కన్నీళ్ళు కడుపుతో నిండి / కత్తులను ప్రసవిస్తున్నాయి/ ఇవాళ కత్తులన్నీ కడుపులో దించుకుని / కన్నీళ్ళు ప్రసరిస్తున్నాయి.”
తెలుగు జాతి ఐక్యత కోసం ‘ఉగాది గీతి’ , మనిషిగా, శాస్త్రవేత్తగా , ఆర్టిస్టుగా మనేందుకు ’ఇపుడే ఇక్కడే ’ కమ్యూనిస్టు”వి కావాలని, విప్లవ నేతలు చారు మజుందార్ , నాగిరెడ్డిలను ప్రశంసిస్తూ , ఎమర్జెన్సీ లో ఎన్కౌంటర్లు యధేచ్చగా జరిపిన జలగం వెంగళరావు పాలనను విమర్శిస్తూ కవితలున్నాయి. “దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా?/ లంచగొండి వెధవలిచ్చు / సాక్ష్యం ఒక సాక్ష్యమా?…కుట్రదారు ప్రభుత్వమే/ ప్రజలు దాన్ని చీల్చరా?/ కృద్ధ విప్లవోగ్ర కలం నిన్ను కాల్చదా?” ఇంత నిర్భయంగా రాసిన శ్రీ శ్రీ నిజంగా అభినందనీయుడు.
చారు మజుందార్ గురించి ”ఆలోచనల్ని ఘాటెక్కించి/ ఆచరణ గా మార్పించిన వాడా/అన్యాయాలను బోనెక్కించి/ ఆయుధానికి ఆ ఆ లు నేర్పినవాడా” అని, నాగిరెడ్డిని ‘వజ్రకరూర్ వైడూర్యం’ అని శ్రీ శ్రీ పొగిడాడు.
వ్యవస్థ విఫలమవుతున్నా ప్రగతిశీల శక్తులకు సంసిద్ధత లేక పోతే తిరుగుబాట్లు నీరుకారి పాత శక్తులే మరో రూపంలో గద్దె నెక్కుతాయి. సనాతన భావజాలానికి ఆధునిక రాజ్యాంగ ధర్మమే విరుగుడు. బిలియనీర్లను పెంచే వ్యవస్థ స్థానంలో శ్రమ శక్తి విలువని గుర్తించే సోషలిజం మాట అనేందుకు కూడా జంకే పరిస్థితి పోవాలి.
శ్రీ శ్రీ కి నిజమంటే ఇష్టం. కవిగా బతకడంలోని కష్టం తెలుసు. అయినా ప్రభుత్వ హింసను ఖండిస్తూ రాయడంలో జంకలేదు.
“ హింసా మంత్రం పరిభావిస్తావు/ హింసతోనే పరిపాలిస్తావు/ నీ ఒంట్లో దూది, ఒంటి నిండా బూది!/ ధన స్వామ్యానికి ప్రజాస్వామ్యమంటూ / మట్టి కలిపి, మసి కలిపి కనిపించే నువ్వు/ నిజానికో మట్టిపులివి!” అంతే కాకుండా “అన్నం కావాలని కోరడమే అపరాధమవుతుంటే/ హక్కులు రావాలని అడగడం అపచారమవుతూంటే/ మనిషి గా జీవించే అవకాశాలు
మాయమవుతుంటే, వొళ్ళంతా గాయమవుతోంటే/ చదువును తరిమేసి విద్యాలయాల్లో మరణం ప్రవేశిస్తూంటే / అక్రమాల, అన్యాయాల అజమాయిషీలో అబద్ధం పరిపాలిస్తుంటే”
ఆశయాలు ఆయుధంగా, సంఘటిత శక్తి కవచంగా, సాహసంతో ప్రతిఘటిస్తే విజయం వస్తుందని శ్రీ శ్రీ చెప్పాడు.
బ్రిటీషు వారసత్వ చట్టాలు మారలేదని దేశమే పెద్ద జైలు అయిందని విమర్శిస్తూ “ సమ సమాజ నిర్మాణం /స్వప్నం కాదీనాడు” అని , తెలుగు వారి ఐక్యత కోరాడు. కానీ చరిత్ర మరో మలుపు తిరిగి రెండు రాష్ట్రాలు అవతరించాయి.
చట్ట బద్ధ పాలన మాటల్లోనే మిగిలి, న్యాయం ఖరీదైన నాడు శ్రీ శ్రీ ‘పంచ రత్నాలు’ కవితలో రాసిన మాటలు “ నడి బజారులో నలుగురి ముందు/ హత్య జరిగినా సాక్ష్యం బందు/ న్యాయం గుడ్డిది మాత్రమే కాదు/ కుంటి, మూగని ఘోషిస్తాన్!” అన్నాడు. ఇప్పటికీ ఈ పరిస్థితి పెద్దగా మారలేదు.
కాలం చెల్లిన చట్టాల పేరు మార్చి నిరసన కారులపై నల్ల చట్టాలు ప్రయోగించి బెయిల్ ఇవ్వకుండా మేధావులు, హక్కుల కార్యకర్తలకు స్వేచ్ఛను నిరాకరించే ఈ నాటి నిరంకుశ పాలనకు , నాలుగు దశాబ్దాల నాటి పరిస్థితులకు తేడా లేదు. ఇప్పుడు ఆశ నశించి మరీ ఘోరంగా పరిస్థితి మారింది. ప్రజలు భయభ్రాంతులకు గురయి మౌనంగా ఉన్నారు తప్ప ఈ వ్యవస్థపై మక్కువతో కాదు.
గాంధీ మీద రాసిన “ ఎక్కడయ్యా నీ అహింస/ ఏడ నీ కరుణారిరంస/ చూడు దేశం ద్వేష భుగ్నం/ క్షురత్ జిహ్వానల విభుగ్నం” అనే కాక మతాల వల్ల గత దినాలు రావని, దేవుడు ఈతి బాధలు తీర్చడని, గతి తర్కం ఉందని, ఆయన బాట యధా స్థితి కి కంచుకోట అని చెప్పాడు.“దేశ మంతా రుజాగ్రస్తం/ లేదు లేదొక వైద్య హస్తం /మత నినాదం మిత వివాదం/ రెండు కూడా కడు ప్రమాదం ” అనే మాటలు నేటికి నిజాలే.
శ్రీ శ్రీ గొప్ప మానవతావాది. బ్యూరోక్రసీ, హిపోక్రసీలను ఖండించి నవ కవులకు స్వాగతం పలికాడు. “నిజంగా/ ప్రపంచానికి కవిత్వం కావలిస్తే/ ఇంత కంటే అదును లేదు!/ నీ సందేశం కోసం విశ్వం / తన చాతక వదనం తెరుచుకున్నది!…/ నువ్వు రావాలి! రావాలి!” అని మాత్రమే కాక “నువ్వు cyclone లాగో sulphuric acid లాగో/ గంధ సింధూరంలాగో/ గండభేరుండం లాగో/ రావోయ్! యువకవీ నవకవీ!” అని ముగించాడు.
శ్రీ శ్రీ కి మానవత్వం అన్నింటి కన్నా మిన్న. మతం , అతీత శక్తులుపై నమ్మకం లేదు. అందుకే “ఆణవ శక్తి మీద అధికారం/ మానవ శక్తిదే / అందుకే మానవత్వాన్ని మించిన/ మతం నాకు లేదు/ మానవ శక్తినే విశ్వసిస్తాను”(‘ఉగాది గీతం”) అని ఖచ్చితంగా చెప్పాడు.
స్త్రీలను ప్రగతి బాటలో పిలుస్తూ “ ఆడది మగవాని చేతి/ ఆట వస్తువని ఎంచే /పాత పడిన భావాలను/ లోతుగ పాతర వేయగ/ కదలిరండి నవ భారత నారీ మణులారా !…”
ఇంతకు మించిన దేశ భక్తి, ప్రజాభిమానం ఏముంది?
ఈపుస్తకం లోని వల్లేజో, చే గువేరా , పాబ్లో నెరూడా , నజీమ్ హిక్మత్ , అగస్టినో నెటో, కాస్టీల్లో మొదలగు వారి అనువాద కవితలు ఎంతో స్ఫూర్తి నిస్తాయి. కాస్టీల్లో కవిత అనువాదంలో
ప్రశ్నించ కుంటే మేధావుల విద్య, పాండిత్యం, శుష్క చర్చలు ప్రజలు పట్టించుకోరని , వారి ప్రశ్నకు జవాబు లేక “ ఒక నిశ్శబ్దపు రాబందు / మీ పేవులారగిస్తూ ఉంటున్నపుడు/ మీ వేదన మీ ఆత్మలనే పొడుచుకు తింటున్నప్పుడు/ మీ సిగ్గులో / మీరే నోరు మూసుకుంటారు.”(విరాజకీయ మేధావులు.”
కుల, మత ప్రభావం అతిగా ఉన్న మన దేశంలో హేతువాద ఆలోచన పెంచి సామాజిక,
సాంస్కృతిక విప్లవం తేవాలి.
శ్రీ శ్రీ మాటల్లో “ ఎందరడ్డుకున్నా ఇంకెందరు వద్దన్నా/ మార్పు వచ్చి తీరుతుంది..చచ్చు పుచ్చు సంస్కృతి మరణం/ ఇదే నేటి సత్యం.”