నెత్తి మీద నాగరికత

నెత్తి మీద నాగరికత
మలం మోస్తున్న తట్టలా !
చంద్రయాన్ చీదర నవ్వు
సెప్టిక్ ట్యాంక్లో చిక్కుకున్న నేను!

డ్రై లెట్రిన్లో గ్లవుజుల్లేని చేతులు
రైల్వే ట్రాక్కులో మాస్కుల్లేని ముఖాలు
సీవర్లులో మునిగే బూటుల్లేని కాళ్ళు
కడిగిన ముత్యంలా శుద్ధ మానవుడులా !

పెంటతట్టలో చిలకరించే వాన
తలంతా అట్టలు కట్టుకుపోయినే
పాచిపోయిన రెండు రొట్టెలు కోసం
తరాలుగా మోస్తున్న అశుద్ధభారం !

మలమూత్రాలకీ రాజకీయ గిరాకీ
చీపురు గుర్తెట్టుకుని చైరుమన్నైపోయే
దొడ్లు కడిగిన దొడ్డమనిషి మహమనిషైపోయే
నేనేమో మలంలో ముంచిన చీపిరిగానే !

అణు బాంబులు చేసిన చేతులు
ఆకలి చంపే గుళికలు చెయ్యవా?
తిన్నదంతా కడుపులోనే కుళ్ళి
కరిగిపోయే మందులొస్తే బాగుండు !
పాయఖానాల్లో చేతులెట్టని
రోజుల్లుంటాయంటావా శుద్ధభారతీ ?

నేనెన్ని సబ్బులుతో కడుక్కున్నా
అసహ్యంగానే అంటరానిదానిగానే
వదలని కులగబ్బు సువాసనలతో
నువ్వో కడగని టాయిలెట్టులా
మెరిసి పోయే స్వచ్ఛ భారతంలా!

(సఫాయి కర్మచారీ హక్కుల పోరాట నాయకుడు బెజవాడ విల్సన్ కి అభిమానంతో..)

ప్రత్యామ్నాయ సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలపట్ల ఆసక్తి. తత్వశాస్త్ర అధ్యాపకుడు. "దళిత ఉద్యమం, వెలుగునీడలు" (వ్యాససంపుటి), "పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ అంబేద్కర్," థీయరిటికల్ అండర్ స్టాండింగ్ ఆఫ్ దళిత్ మూవుమెంట్" రచయిత. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తుంటాడు.

One thought on “నెత్తి మీద నాగరికత

Leave a Reply