నీలాంజన్ ముఖోపాధ్యాయ్
(2026, ఆగస్టు 14)
వందేమాతరం చరణాలన్నింటినీ పాడటాన్ని తప్పనిసరి చేయడంతో హిందుత్వ ప్రాజెక్టుకు సంబంధించిన, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అజెండా అంశాలలో ఒకటి పూర్తవుతుంది. అయితే సాంస్కృతిక, జాతీయవాదపు సరిహద్దులను ఈ విధంగా విస్తరించడం అనేది ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.
పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం నెలకొన్నప్పటికీ, “జాతీయ గౌరవానికి” ప్రతీకలుగా భావించే; అవమానించడం శిక్షార్హమైన నేరంగా పరిగణించే అంశాలు, గేయాల జాబితాలో “పూర్తి” జాతీయ గేయం ‘వందేమాతరం’ను చేర్చడానికి ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం పట్టుదలతో ఆమోదింపజేసుకుంది.
ఆరు చరణాలనూ ఇందులో చేర్చడం అనేది జాతీయ ఉద్యమాన్ని, భారత జాతీయత సమ్మేళన ప్రాతిపదికను బలహీనపరుస్తుంది కాబట్టి వందేమాతరం 150వ వార్షికోత్సవ సంవత్సరంలో జరిగిన ఈ పరిణామం దురదృష్టకరమైనది.
మరింత విచారకరమైన విషయమేమిటంటే, జాతీయ గౌరవ అవమానాల నిరోధక (సవరణ) బిల్లు-2026 ను ఆమోదించడం ద్వారా, స్వాతంత్ర్యానికి పూర్వపు నాటి భారతదేశపు అత్యున్నత మేధావులలో ఇద్దరైన మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ ల ఆమోదిత దృక్పథాన్ని ప్రభుత్వం అప్రతిష్టపాలు చేసింది. కేవలం బీజేపీ మాత్రమే కాకుండా యావత్ సంఘ్ పరివార్ కూడా దశాబ్దాలుగా ఈ ఇద్దరు దిగ్గజాలను తమ సొంత పూజ్యులైన కొద్దిమంది వ్యక్తుల సమూహంలో చేర్చుకోవడానికి చేసిన సంఘటిత ప్రయత్నాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇప్పుడు వారి అభిప్రాయాలను అణచివేయాలనే ప్రభుత్వ పట్టుదల అత్యంత విడ్డూరంగా ఉంది.
పార్లమెంటులో ఈ బిల్లును బరితెగించి ఆమోదం పొందేలా చేయడానికి దారితీసిన పరిణామాల క్రమం 2025 నవంబర్ 7 నుండి ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ఒక కార్యక్రమంలో జాతీయ గేయానికి సంబంధించి ఏడాది పొడవునా జరిగే వేడుకలను ప్రభుత్వం ప్రారంభించింది. ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి, ఒక స్మారక తపాలా స్టాంపును, నాణాన్ని విడుదల చేసింది. దశాబ్దాలుగా సంఘ్ పరివార్ ప్రచారం చేస్తున్న అవే అబద్ధాలను ప్రస్తావిస్తూ, వందేమాతరం గేయపు కుదించిన రూపాన్ని మాత్రమే జాతీయ గీతంగా పరిగణించడం వల్ల భారతీయ ఆత్మగౌరవం “గాయపడిందని” తన ప్రసంగంలో మోదీ ప్రకటించాడు. “వందేమాతరం విభజన దేశ విభజనకు కూడా బీజాలు వేసింది” అని పేర్కొంటూ, వాస్తవాన్ని ఘోరంగా వక్రీకరించాడు.
భావజాలంపై నడిచిన ఈ కాలక్రమంలో తదుపరి ఘట్టం ఈ ఏడాది ఫిబ్రవరిలో చోటుచేసుకుంది. ఏదైనా కార్యక్రమంలో ‘జన గణ మన’ అనే జాతీయ గీతాన్ని పాడినప్పుడల్లా, ఇకపైన దానికి ముందు ‘వందేమాతరం’లోని ఆరు చరణాలనూ పాడాలని రాష్ట్రాలకు, ఇతర ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1950 జనవరి నుండి, కేవలం మొదటి రెండు చరణాలను మాత్రమే పాడటం లేదా వాయిద్యం పైన వాయించడం జరుగుతోంది.
ఇటీవలి, గణతంత్ర దినోత్సవం నాడు, రాజధానిలోని సెంట్రల్ విస్టా అంతటా పుట్టగొడుగుల్లా వెలిసిన అనేక కర్తవ్య భవనాలకు అనుగుణంగా, ఒకప్పుడు రాజ్‌పథ్‌గా ఉండి, ఇప్పుడు ఆర్భాటంగా కర్తవ్య పథ్‌గా పేరు మార్చిన వీధిలో కదిలిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ శకటం ఇతివృత్తం కూడా ఇదే.
బహిరంగంగా లౌకిక దేశంగా చెప్పుకునే ఒక దేశం, గణతంత్ర రాజ్యంగా అవతరించిన వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న కార్యక్రమంలో ప్రదర్శించిన ఆ శకటం తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. శకటం మధ్యభాగంలో దుర్గాదేవి భారీ విగ్రహం ఉండటమే కాకుండా, ముందు భాగంలో ఉన్న ఒక పెద్ద పత్రంపై వందేమాతరం ఐదవ చరణాన్ని ఉటంకించారు. అదీ కూడా పైన చెప్పిన ఉత్తర్వులు జారీ కాకముందే. ఈ చరణం, “త్వమ్ హి దుర్గా, దశప్రహార్-ధారిణి [నిజంగా నీవే పది చేతుల దుర్గాదేవివి]” అనే దుర్గాదేవి ప్రార్థనతో ప్రారంభమవుతుంది. బహుళ మతాలున్న దేశంలో ఇది ప్రత్యేకంగా ఒక హిందూ దేవతను ప్రస్తావిస్తున్నది కాబట్టి , జాతీయ గీతంలో భాగం కావడానికి అర్హత లేదని గాంధీ, టాగోర్‌లు చెప్పిన చరణాలలో ఇది కూడా ఒకటి. కానీ ఆ శకటం గణతంత్ర దినోత్సవం రోజున ఐదవ, ఆరవ చరణాలు రెండింటినీ ఆర్భాటంగా ప్రదర్శించింది.
ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థల పూర్తి మద్దతు ఉన్న ఈ ప్రభుత్వ చర్యలు స్వతహాగా సమస్యాత్మకమైనవి; జాతీయ ఉద్యమ సర్వసమ్మతమైన లౌకిక నిర్మాణాన్ని ఛిన్నాభిన్నం చేసేవిగా ఉన్నాయి. గాంధీ, ఠాగూర్ లతో పాటు, స్వాతంత్ర్య పోరాటంలోని మరో ఇద్దరు దిగ్గజాలైన జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ కూడా ఈ కీలకమైన చర్చలో పాలుపంచుకున్నారు. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఈ చరణాలను తొలగించడాన్ని అంగీకరించారు. భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించటానికి కేవలం 48 గంటల ముందు, 1950 జనవరి 24నాడు సంక్షిప్త వందేమాతరంని జాతీయ గేయంగానూ, జనగణమనను జాతీయ గీతంగానూ ప్రకటించటానికి, మొత్తం రాజ్యాంగ పరిషత్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
1937 అక్టోబర్ 30నాడు రాసిన ఒక లేఖను “వందేమాతరం ఒక జాతీయ గీతంగా తగినదేనా అనే ప్రశ్న చుట్టూ ఒక దురదృష్టకరమైన వివాదం చెలరేగుతోంది” అని టాగోర్ ప్రారంభించారు. అందులో, “దాని మొదటి చరణానికి మొదటగా స్వరకల్పన చేసే భాగ్యం” తనకు దక్కిందని; “దాని మొదటి భాగంలో వ్యక్తమైన ఆప్యాయత, భక్తిభావం, మన మాతృభూమికి చెందిన అందమైన, ప్రయోజనకరమైన అంశాలకు అది ఇచ్చిన ప్రాధాన్యత” కారణంగా, “”మిగిలిన కవిత నుండి; అది భాగమైన పుస్తకం నుండి; దానిని వేరు చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు” అని ఆయన అన్నారు.
బంకిం చంద్ర చటర్జీ రాసిన ‘వందేమాతరం’ కవిత మొత్తాన్ని, దాని సందర్భంతో కలిపి చదివితే, ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించే అవకాశం ఉందని ఆయన నొక్కి చెప్పారు. కానీ, “దాని నుండి తీసుకొన్నప్పటికి, సహజంగా అసలు కవితలోని మొదటి రెండు చరణాలను మాత్రమే కలిగి ఉన్న ఒక జాతీయ గీతం, ప్రతిసారీ దాని పూర్తి రూపాన్ని మనకు గుర్తు చేయనవసరం లేదు” అని అన్నారు. ‘వందేమాతరం’లోని మొదటి రెండు చరణాలు “ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని, దానికి దాని స్వీయ స్ఫూర్తిదాయకమైన ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి, అందులో ఒక విశ్వాసానికి చెందినవారిని లేదా సముదాయాన్ని కించపరిచేది ఏమీ నాకు కనిపించడం లేదు” అని టాగోర్ వివరించారు.
టాగోర్ అభిప్రాయం అత్యంత స్పష్టంగా ఉంది —చివరి నాలుగు చరణాలు “రెచ్చగొట్టేవిగా” ఉన్నప్పటికీ, మొదటి రెండింటికి వాటికంటూ ఒక జీవం, అర్థం ఉన్నాయి; అవి ఎటువంటి ద్వేషం లేకుండా సార్వత్రికంగా స్వీకరించదగినవి. అందువల్ల, మొదటి రెండు చరణాలకు మాత్రమే లౌకిక, సార్వత్రిక స్వరం ఉందని, అవి కేవలం మాతృభూమికి భౌగోళిక, సౌందర్యాత్మక స్తుతిగా మాత్రమే పనిచేస్తాయని ఆయన స్పష్టంగా విశ్వసించారు. 1939లో హరిజన్ పత్రిక సంచికలో గాంధీజీ ఆయన అభిప్రాయాలను దాదాపు అక్షరాలా సమర్థించారు.
స్వాతంత్ర్య పోరాటం కాలంలో వివాదాలు
1920ల చివరి నుండి వందేమాతరం చుట్టూ దాదాపు దశాబ్దం పాటు కొనసాగిన వివాదాల తరవాత టాగోర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో జాతీయ చిహ్నాల చుట్టూ జరిగిన అత్యంత ముఖ్యమైన చర్చలలో ఇది ఒకటి. దేశభక్తి భావన, మత బహుళత్వం, లౌకిక జాతీయవాదంల మధ్య సమతుల్యం సాధించడంలో ఉన్న సున్నితమైన సవాలును ఇది ఎత్తి చూపింది. బెంగాల్ రాష్ట్రాన్ని రెండుగా విభజించాలన్న బ్రిటిష్ వారి నిర్ణయం చేసిననాటి నుండి, ఆ విభజనను రద్దు చేసేలా వలస పాలనపై ఒత్తిడి తెచ్చిన ఉద్యమంలో వందేమాతరం ఒక యుద్ధ నినాదంగా మారింది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలతో సహజీవన సంబంధం కలిగి, స్వదేశీ ఉద్యమంలో కూడా ఈ గీతం ప్రతిధ్వనించింది. ఈ కవిత దేశభక్తిని, వలసపాలనకు వ్యతిరేకంగా అచంచలమైన ప్రతిఘటనను; భారత మాతృభూమి పట్ల ఒక పవిత్రమైన, మాతృకేంద్రిత దృక్పథం వంటి భావోద్వేగాలను రేకెత్తించింది.
1930ల ప్రారంభం నాటికి, వందేమాతరం గేయం వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అర్థాలను సంతరించుకోవడం ప్రారంభించింది. దురదృష్టవశాత్తు, తీవ్రమవుతున్న మతఘర్షణల నేపథ్యంలో కొందరికి ఇది ముస్లింలకు వ్యతిరేకంగా ఒక యుద్ధ నినాదంగా మారితే, మరికొందరు దీనిని కేవలం స్ఫూర్తిదాయకమైనదిగా, సార్వత్రికమైనదిగా భావించారు. ముస్లిం లీగ్, ఎం.ఏ. జిన్నా ఆవిర్భావంతో, ఈ గీతాన్ని మునుపటిలాగే ఉపయోగించడంలో దానిలోని ఇతర చరణాలపైన అభ్యంతరాలకు దారితీసింది. బంకిం చంద్ర చటర్జీ ‘ఆనందమఠ్’ నవలలోని వివాదాస్పద ఇతివృత్తం కోణం నుండి కూడా దీనిని చూడటం మొదలైంది; బంకిం చంద్ర ఈ నవలను మొదట రాసిన దాదాపు ఒక దశాబ్దం తర్వాత, అందులో ఈ మూల కవితను అంతర్భాగం చేశారు.
1937లో భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం, రాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు ఈ నిరసనలు ఒక పెద్ద రాజకీయ సంక్షోభంగా మారాయి. దీని ఫలితంగా 11 రాష్ట్రాలలో 7 రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. నేటి రాష్ట్రాలకు పూర్వరూపమైన ఈ రాష్ట్రాలలో, కాంగ్రెస్ మంత్రివర్గాలు అధికారం చేపట్టిన తర్వాత, దాదాపు ప్రతి శాసనసభ, పురపాలక సమావేశాలు; ప్రభుత్వ పాఠశాలలు వందేమాతరంతో తమ కార్యకలాపాలను ప్రారంభించేవి. కాంగ్రెస్ హిందూ ఆధిపత్య శక్తిగా మారుతోందని ముస్లిం లీగ్ ఆరోపించడంతో, కాంగ్రెస్ సీనియర్ నాయకుల మధ్య చర్చలు జరిగాయి.
ఈ నేపథ్యంలో, 1937 మార్చిలో జైలు నుంచి విడుదలైన సుభాష్ చంద్రబోస్, వందేమాతరం; ముస్లిం ప్రజా సంబంధాల కార్యక్రమంతో సహా కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణం, విధానాలపైన నెహ్రూతో చురుకైన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. ఈ విషయంపైన అవగాహన ఉన్న నెహ్రూ కూడా, అక్టోబర్ చివరి వారంలో కలకత్తాలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి కొద్ది రోజుల ముందు బోస్‌కు రాసిన లేఖలో తాను ఆనందమఠం ఆంగ్ల అనువాదాన్ని చదివానని, “ఈ పాటకు ఉన్న నేపథ్యం వల్ల ముస్లింలకు చికాకు కలిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోందని” రాసారు. సమావేశానికి ముందు తాను టాగోర్‌ను కలుస్తానని కూడా ఆయన తెలిపారు. బెంగాల్‌లో కాంగ్రెస్ ఒక సవాలును ఎదుర్కొంటోంది. “ఎక్కువ మంది ముస్లింలు రాజకీయంగా చైతన్యవంతులవుతున్నారు. కాబట్టి, కాంగ్రెస్ ఈ ముస్లింలను ఎంతవరకు ప్రభావితం చేసి, వారిని తన పరిధిలోకి తీసుకురాగలదనేదే సమస్య. మనం అలా చేయలేకపోతే, వారు మతతత్వ శక్తులను బలోపేతం చేస్తారు” అని కూడా నెహ్రూ అంగీకరించారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ తీర్మానం; సర్వసమ్మతి
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వందేమాతరంపైన తీర్మానాన్ని ఆమోదించింది. మూడు దశాబ్దాలుగా ఈ గేయం “లెక్కలేనన్ని త్యాగాలతో” ముడిపడి ఉందని, “స్త్రీపురుషులు ఆ నినాదాన్ని ఎలుగెత్తి పలుకుతూ మృత్యువును ఎదుర్కోవడానికి వెనుకాడలేదని” ఆ తీర్మానంలో పేర్కొంది. ఆ రెండు పదాలు ఏకకాలంలో స్ఫూర్తిదాయకమైన “శక్తి నినాదంగా… ఒక వందనంగా” ఆవిర్భవించాయని తీర్మానం జోడించింది. మొదటి రెండు చరణాలు “మాతృభూమి సౌందర్యాన్ని, ఆ భూమి ప్రసాదించిన సమృద్ధిని సున్నితమైన భాషలో వర్ణించాయని”, వాటిలో “మతపరమైన లేదా మరే ఇతర కోణం నుంచైనా అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదని” టాగోర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఇది పునరుద్ఘాటించింది. ఆ రెండు చరణాలు “మన జాతీయ ఉద్యమంలో విడదీయరాని భాగమని, అందువల్ల అవి మన ఆప్యాయతను, గౌరవాన్ని పొందాలని” తీర్మానం ప్రకటించింది.
అదేవిధంగా, “పాటలోని కొన్ని భాగాలపైన ముస్లిం మిత్రులు లేవనెత్తిన అభ్యంతరంలోని ప్రామాణికతను” కాంగ్రెస్ గుర్తించింది. తత్ఫలితంగా, “జాతీయ సభలలో” మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా నెహ్రూ నేతృత్వంలో, గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బోస్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి ప్రముఖ నాయకులు హాజరైన ఈ సమావేశం, టాగోర్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, తగినంతగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. రాజేంద్ర ప్రసాద్ ప్రవేశపెట్టి, పటేల్ బలపరిచిన ఈ కాంగ్రెస్ తీర్మానం, ప్రజలు అప్పటికే సమిష్టిగా ఆమోదించిన దానిని కేవలం అధికారికం చేసింది—వారు నిరసనలు, ప్రదర్శనల సమయంలో ‘వందేమాతరం’ అనే రెండు పదాలను నినదిస్తూ, ముఖ్యమైన సభలలో మొదటి రెండు చరణాలను మాత్రమే పాడేవారు.
కాంగ్రెస్ ఆ పాట ఆత్మను “ఛిన్నాభిన్నం చేసిందని”, “వందేమాతరంని… ముక్కలు ముక్కలుగా చించివేసిందని” సంఘ్ పరివార్, మోడీలు చేస్తున్న ఆరోపణలకు విరుద్ధంగా, జన గణ మణ చేసినట్లే, ఆ పాట కూడా ప్రతి భారతీయుడిని ఏకం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండేలా చూసేందుకు, విస్తృతమైన చర్చల తర్వాత, మనస్సాక్షికి అనుగుణంగా, జాగ్రత్తగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది అనడంలో వాస్తవానికి ఎలాంటి సందేహం లేదు.
2022 సెప్టెంబరులో, ప్రభుత్వం తన “ప్రాజెక్ట్ అప్రాప్రియేషన్” (స్వాధీన ప్రాజెక్టు)ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇండియా గేట్ వద్ద ఉన్న ఖాళీ గొడుగు కింద బోస్ భారీ ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరించింది. అయితే, వందేమాతరాన్ని మొదటి రెండు చరణాలకే పరిమితం చేసే తీర్మానాన్ని బలపరిచింది సర్దార్ పటేల్ అనే విషయాన్ని ప్రభుత్వమూ, సంఘ్ పరివార్ రెండూ విస్మరించడం ఒక వైచిత్రం. సంఘ్ పరివార్ రాజకీయ కపటత్వానికి, ద్వంద్వ వైఖరికి ఇది మరొక నిదర్శనం.
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిషత్తుపైన గానీ, మధ్యంతర ప్రభుత్వ అధినేతలతో ఏకాంత సమావేశాలు జరిపిన జాతీయవాద ప్రముఖులపైన గానీ ఈ నిర్ణయాన్ని బలవంతంగా రుద్దలేదు. స్వాతంత్ర్యానికి పక్షం రోజుల ముందు, ఆ తర్వాత ప్రజా సోషలిస్ట్ పార్టీలోకి మారిన స్వతంత్ర భావాలు గల జాతీయవాది హెచ్.వి. కామత్, 1947 ఆగస్టు 15న జరగబోయే కార్యక్రమంలో వందేమాతరం గీతాన్ని చేర్చాలని సూచించారు. కొద్ది రోజులకే, నెహ్రూ ” 14వ రాత్రి – 15వ ఉదయం రాజ్యాంగ పరిషత్తు సమావేశాల కార్యక్రమం” గురించి రాజేంద్ర ప్రసాద్‌కు అధికారికంగా లేఖ రాశారు. ఇతర సూచనలతో పాటు, కార్యక్రమాన్ని ప్రారంభంలో వందేమాతరం మొదటి చరణాన్ని ఆలపించాలని ఆయన ప్రతిపాదించారు. చివరికి, అప్పటి రాజ్యాంగ పరిషత్తు సభ్యురాలు సుచేతా కృపలానీ ఆ గౌరవాన్ని అందుకుని, ఆ చారిత్రాత్మక రోజున కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించారు.
అప్పటి నెహ్రూ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి, ఆ తర్వాత భారతీయ జనసంఘ్‌ను స్థాపించిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ, అప్పటికే ‘జన గణ మన’ను జాతీయ గీతంగా ఆలపిస్తున్నప్పటికీ, 1948 జూన్‌లో ఆ రెండు పాటల విషయాన్ని లేవనెత్తారు. దీనికి నెహ్రూ వెంటనే స్పందిస్తూ, “‘వందేమాతరం’ జాతీయ గీతంగా ఏమాత్రం ఆచరణ సాధ్యం కాదని నేను భావిస్తున్నాను. దానికి ప్రధాన కారణం, దాని బాణీ ఆర్కెస్ట్రా లేదా బ్యాండ్ ప్రదర్శనకు సరిపడకపోవడమే. మన జాతీయ గీతాన్ని ప్రపంచవ్యాప్తంగా విదేశీ ఆర్కెస్ట్రాలే వాయించాల్సి ఉంటుంది. మరోవైపు, ‘జన గణ మన’ ఇప్పటికే విదేశాలలోనూ, భారతదేశంలోనూ ఎంతో ప్రశంసలు పొందింది. దాని సంగీతం భారతదేశంలో గానీ, విదేశాలలో గానీ వినే ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది” అని అన్నారు. ఈ వాదనతో ఏకీభవించడానికి సంగీత విద్వాంసులవాల్సిన అవసరం లేదు.
1949 సంవత్సరం మధ్యకాలం వరకు రాజ్యాంగ సభలో ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నారు, కానీ చివరకు 1950 జనవరి 24న, ఆ రెండు పాటలలోని ఎంపిక చేసిన చరణాలకు “సమాన హోదా” ఉంటుందని రాజేంద్ర ప్రసాద్ చేసిన ప్రకటనను సభలోని సభ్యులందరూ కరతాళ ధ్వనులతో స్వాగతించారు. స్వాతంత్ర్యం తర్వాత సభలోని వివిధ సిద్ధాంతాల మధ్య ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నప్పటికీ, సంఘ్ పరివార్ భారతదేశాన్ని మతపరమైన ప్రాతిపదికన విభజించడానికి; హిందూ మెజారిటీవాద ప్రాజెక్టుకు మద్దతును పెంచడానికి ఈ అంశాన్ని లేవనెత్తడం ఆపలేదు.
ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థల చారిత్రక వైఖరి
ముఖ్యంగా, 2025 నవంబర్ నుండి ప్రభుత్వం చేబడుతున్న చర్యలకు మూలాలు 1930ల ప్రారంభం నుండి వందేమాతరంపై ఆర్‌ఎస్‌ఎస్ తీసుకున్న వైఖరులలోనే ఉన్నాయి. ఆ తరువాత వీటిని భారతీయ జనసంఘ్, చివరికి బీజేపీ కూడా పునరుద్ఘాటించాయి. ఆరు చరణాలూ పాడాలన్న డిమాండ్; దానిని కుదించడాన్ని తీవ్రంగా విమర్శించడం అనేవి ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడైన కె.బి. హెడ్గేవార్ హిందుత్వను ప్రారంభంలో రూపొందించిన సిద్ధాంతంలో పాతుకుపోయి ఉన్నాయి. 1925లో ఆర్‌ఎస్‌ఎస్ స్థాపితమయ్యేనాటికే, ఆ గీతం—ప్రధానంగా ‘వందేమాతరం’ అనే రెండు పదాలు; మొదటి చరణం లేదా, మహా అయితే, మొదటి రెండు చరణాలు—స్వాతంత్ర్య ఉద్యమానికి విస్తృతంగా గుర్తింపు పొందిన ఒక నినాదంగా ఉండేది. కానీ హిందూ ప్రత్యేకతావాద సమాజంలో, ఈ కవిత మొత్తాన్ని సాంస్కృతిక జాతీయవాదానికి ఆధ్యాత్మిక ఆత్మగా భావించారు; అందులో దేశాన్ని ఒక దివ్యమైన మాతృమూర్తిగా లేదా భారత్‌మాతగా చూసారు.
నిజానికి, హెడ్గేవార్ “ఏకాత్మతా స్తోత్రం” (దాని సంక్షిప్త రూపం, “ప్రాత:స్మరణ”)ను స్థాపించారు; దీనిని ఇప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణా శిబిరాలలో ఉదయాన్నే పఠిస్తారు. ఈ స్తోత్రం వందేమాతరం మాదిరిగానే భారతమాత పట్ల భక్తిభావాన్ని పంచుకుంటూ, భౌగోళిక, సాంస్కృతిక సమైక్యతను నొక్కి చెప్పడానికి భారతదేశం అంతటా ఉన్న పవిత్ర నదులు, పర్వతాలు, చారిత్రక వ్యక్తులు, దేవతలను జాబితా చేస్తుంది. గణతంత్ర దినోత్సవ శకటంలో ఉపయోగించిన వందేమాతరం శ్లోకాన్ని సంఘ్‌లో ఒక ఆదర్శంగా పరిగణిస్తారు. ఆర్‌ఎస్‌ఎస్ తన శాఖలలో రోజూ పాడే ఇతర పాటలలో కూడా వందే-మాతరం అనే రెండు పదాల కలయికలను మంత్రంగా చేర్చింది.
ముఖర్జీ కాలం నుంచే జనసంఘ్‌కు కూడా పూర్తి వందేమాతరంను పునరుద్ధరించాలనేది ఒక ప్రధాన అజెండాగా ఉండేది. నిజానికి, దాని చారిత్రక ఘట్టాలైన అన్ని సందర్భాలలోనూ ‘సంపూర్ణ’ గీతం కావాలన్న డిమాండ్ ఒక పునరావృతమయ్యే సైద్ధాంతిక ప్రచారంగా కొనసాగింది. ఈ మేరకు 1952లో జరిగిన కాన్పూర్ సమావేశంలో జనసంఘ్ ఒక అధికారిక తీర్మానాన్ని ఆమోదించింది. 1973లో రాజ్‌కోట్ సమావేశంలో, పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక జ్వాలల మధ్య, అన్ని ప్రభుత్వ పాఠశాలలు, రాష్ట్ర కార్యక్రమాలు, శాసనసభలలో వందేమాతరం గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని వాదిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు.
అ తరువాత, ఈ డిమాండ్‌ను బిజెపి తీసుకొంది. ముఖ్యంగా, 1992లో అప్పటి బిజెపి అధ్యక్షుడు ఎం.ఎం. జోషి దేశవ్యాప్త “ఏకతా యాత్ర” చేపట్టినప్పుడు, ఈ పూర్తి గీతాన్ని ప్రధాన సాంస్కృతిక గీతంగా స్వీకరించారు. ఈ యాత్రకు మోదీ సమన్వయకర్తగా వ్యవహరించాడని; జాతీయ రాజకీయాల్లోకి ఆయన అడుగుపెట్టడానికి ఈ యాత్రే తొలి అడుగు అని మనం మర్చిపోలేం.
ఆ తర్వాత, 2006లో, 1906లో బెంగాల్‌లో జరిగిన విభజన వ్యతిరేక ఉద్యమంలో నిరసన గీతాన్ని స్వీకరించిన 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, 2006 సెప్టెంబర్ 7నాడు పాఠశాలల్లో మొదటి రెండు చరణాలను పాడాలని సూచిస్తూ (కానీ తప్పనిసరి చేయకుండా) యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసినప్పుడు, బీజేపీ దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించింది. అన్ని విద్యాసంస్థలు; ప్రభుత్వ కార్యక్రమాలలో మొత్తం ఆరు చరణాలను తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తూ 2006 ఆగస్టులో జరిగిన పార్టీ డెహ్రాడూన్ సమావేశం ఒక అధికారిక తీర్మానాన్ని ఆమోదించింది.
ఆ సంవత్సరం మధ్యప్రదేశ్‌లో, బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు ప్రతి నెలా మొదటి పనిదినం నాడు వందేమాతరం పాడాలని ఆదేశించింది. బీజేపీ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది; కానీ బీజేపీ నేతృత్వంలోని నిరసనల ఫలితంగా ఆ చర్యను ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకుని, బీజేపీ, దాని అనుబంధ సంస్థలు నిరసనలు చేపట్టిన సందర్భాలు ఇంకా అనేకం ఉన్నాయి.
స్పష్టంగా, దాదాపు ఒక శతాబ్ద కాలంగా సంఘ్ పరివార్‌కు పూర్తి గీతం కావాలనే డిమాండ్ చాలా ముఖ్యమైనదిగా ఉంది. ఇటీవల ఈ బిల్లు ఆమోదం పొందడంతో ఒక ముఖ్యమైన హిందుత్వ “ప్రాజెక్టు” పూర్తి అయింది. రోజురోజుకు మరింత జోక్యం చేసుకునే, నిఘా పెట్టే ఈ పాలనలో బీజేపీ, మోదీ, విస్తృత సంఘ్ పరివార్ లు వందేమాతరం కథనాన్ని ఎటువైపు తీసుకువెళ్తాయో వేచి చూడాలి.
(నీలంజన్ ముఖోపాధ్యాయ్ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో నివసిస్తున్న ఒక రచయిత; జర్నలిస్ట్.
https://frontline.thehindu.com/the-nation/vande-mataram-bill-nationalism-hindutva/article71344528.ece)