వుదయం నుంచి సాయంత్రం వరకూ శ్రమించే చేతులకు, తమ శ్రమకు తగిన గౌరవం కావాలి.
జీవితమంతా పని చేయడానికే కాదు… తన కలల కోసం కూడా తనకి కొంత సమయం, కొంత స్వేచ్ఛ కావాలి.
తన కష్టంతో ప్రపంచాన్ని నడిపించే స్త్రీకి, తన జీవితాన్ని తానే నిర్ణయించుకునే హక్కు కూడా వుంది.
ఆ నిశ్శబ్దమైన ఆకాంక్షలకి వొక స్వరాన్నిచ్చిన డాలీ పార్టన్.
‘కేవలం నేనో స్త్రీనని
నా పొరపాట్టకి వేరే కొలమానమెందుకు?’ పురుషుడికి వొక నైతిక ప్రమాణం, స్త్రీకి మరొక ప్రమాణమెందుకనే ప్రశ్నని సూటిగా యెంతో బలంగా సమాజం మీద యెక్కుపెట్టిన ‘క్వీన్ ఆఫ్ కంట్రీ’ డాలీ పార్టన్…
యెన్నోసార్తు విన్నానీ పాటలు… యెంతో మందికి వినిపించానీ పాటలు… వింటూవింటూ నోటికి కంఠతా వచ్చిన పాటలు కలిగించిన సంభ్రమం… రేకెత్తించే ప్రశ్నలు… ఆలోచనలు… యింప్రషన్స్ … వొకటా… రెండా… యెన్నో యెన్నెన్నో అంశాలుండగా ప్రతి స్త్రీ కనెక్ట్ అయ్యే అంశం ‘9 to 5’ డాలీ తీసుకోవటం… అందులో శ్రమ చేసే స్త్రీ స్వరాన్ని యెంతో ఆలోచనాత్మకంగా చెప్పటం విన్నప్పుడు ఆమె పదునైన పాట హృదయమంతా వెయ్యి గొంతులతో చుట్టేసింది. మనసుని పులకితం చేసిన ఆమె తన పాటల్నియీ లోకానికి వదిలి ఆగష్టు 25న వెళ్ళిపోయారు.
డాలీ పార్టన్ను అర్థం చేసుకోవాలంటే ఆమె పాటలను మాత్రమే కాదు, ఆమె వచ్చిన నేలను కూడా అర్థం చేసుకోవాలి. 1946లో అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలోని అప్పలాచియన్ పర్వత ప్రాంతంలో డాలీ పార్టన్ జన్మించిన ఆ పర్వతాల ప్రకృతి సౌందర్యం… ఆ జానపద సంస్కృతి… సంగీతం… కథలతో ప్రత్యేకమైన నేల. పర్వతాల మధ్య చిన్న చిన్న గ్రామాలు… కుటుంబం చుట్టూ తిరిగే జీవితం… చర్చి సంగీతం… జానపద గీతాలు అక్కడి ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా వుండేవి. అదే సమయంలో ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడి, పరిమితమైన వనరులతో జీవితాన్ని సాగించేవి. ఆ పేదరికం… శ్రమ… వారికి కుటుంబ అనుబంధాల్లో, ప్రకృతితో సాన్నిహిత్యం జీవనానుభవంలోకి నింపుకోటానికి అవరోధం కాలేదు. పాట తమ జీవితంలో అంతర్భాగమైన వాతావరణంలో వో పెద్ద కుటుంబంలో పన్నెండు మంది పిల్లల్లో వొకరిగా పుట్టి పెరిగిన డాలీ పార్టన్కు అప్పలాచియన్ నేల కేవలం పుట్టిన ప్రదేశం కాదు. ఆమె బాల్యం అమెరికా నగరాల జిగ్ జిగేల విద్యుత్ దీపాల తళతళ మెరుపుల్లో కాదు… అప్పలాచియన్ పర్వతాల మధ్య లేలేత గాలి రాగాల వినీలాకాశపు తారకల మిలమిల్లో గ్రామీణ పేదరికంలో గడిచింది. ఆమె యింట్లో డబ్బులకి కొరతుండేది కానీ పాటలకి మాత్రం లేదు. ఆమె తల్లి యింట్లో పనుల్ని … యింటిని చూసుకుంటూనే పిల్లలకు పాటలు, కథలు, చర్చిలో వినిపించే గాస్పెల్ సంగీతం… గీతాల్ని పిల్లలకి పరిచయం చేసారు. అలా అప్పలాచియన్ జానపద సంగీతం, కుటుంబంలో వినిపించే కథలు… గ్రామీణ జీవితంలోని అనుభవాలు… కొండప్రాంత ప్రజల జానపద సంగీతం డాలీకి పరిచయమైయ్యాయి. యివన్నీ ఆమెకి తొలి సంగీత పాఠలయ్యాయి. ఆ కొండలు సంగీత పాఠశాలయింది.
ఆ తరువాత కాలంలో అవన్నీ ఆమె రచనలకు పునాదులయ్యాయి. అక్కడి జానపద సంగీతంలోని కథ చెప్పే సంప్రదాయం, కుటుంబం నుంచి వచ్చిన అనుభవాలు, గ్రామీణ జీవితంలోని సాదాసీదా మనుషులు ఆమె రచనా ప్రపంచాన్ని లోతుగా ప్రభావితం చేశాయి. అందుకే ఆమె పాటల్లో పెద్ద పెద్ద సిద్ధాంతాల కంటే, వొక తల్లి ప్రేమ, వొక పేద బాలిక జ్ఞాపకం, వొక వుద్యోగినీ… స్త్రీ శ్రమ, వొక మనిషి ప్రేమలోని భయం వంటి చిన్నిచిన్ని జీవితానుభవాలే గొప్ప కథలుగా మారుతాయి. డాలీ అత్యంత సువిశాల ప్రపంచంలోకి ప్రయాణించినా, ఆమె స్వరంలో అప్పలాచియన్ పర్వతాల మట్టి పరిమళం మాత్రం శాశ్వతంగా మిగిలిపోయింది.
కొన్ని స్వరాలు చెవులకు మాత్రమే వినిపిస్తాయి. మరికొన్ని స్వరాలు వొక కాలాన్ని, వొక సమాజాన్ని, వొక జీవనానుభవాన్ని మనకు పరిచయం చేస్తాయి. డాలీ పార్టన్ స్వరం అటువంటిది. ఆమె వొక గాయని మాత్రమే కాదు. పాటల రచయిత్రి. నటి. వ్యాపారవేత్త. సామాజిక కార్యకర్త. యిలా తనకంటూ వొక ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకున్న కళాకారిణి. ముఖ్యంగా తన బాల్యం, పేదరికం, కుటుంబం, ప్రేమ, స్త్రీగా తన అనుభవాలు, శ్రమజీవుల జీవితం. యివన్నింటినీ పాటలుగా మలచిన తీరు ఆమెను ప్రపంచ సంగీతంలో ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టింది.
డాలీ పార్టన్ను కేవలం గొప్ప గాయని, పాటల రచయిత్రిగా కాకుండా ఆమె పుట్టిన సామాజిక, ఆర్థిక నేపథ్యం, అమెరికాలోని గ్రామీణ పేదరికం, మహిళల స్థానం, సంగీత పరిశ్రమలోని పురుషాధిక్యం. యివన్నీ కలిపి చూస్తే ఆమె ప్రయాణం యెంత స్పూర్తివంతమో అర్థమవుతుంది.
డాలీ పార్టన్ పేదరికం నుంచి స్వతంత్ర స్వరంగా ప్రవహించిన తీరు అమోఘం. డాలీ పాటల్లో పేదరికం తెచ్చిపెట్టుకున్న అంశం కాదు. ఆమె ఆంతరంగిక అనుభవం. యెందుకంటే 1940ల్లో ఆమె పుట్టి పెరిగిన అమెరికాలో ప్రజల జీవితాల్లో వైరుధ్యాలు ప్రస్పుటంగా కొట్టొచ్చేట్టు కనిపించేవి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా ఆర్థికంగా బలపడుతోంది. నగరాల్లో పరిశ్రమలు పెరుగుతున్నాయి, మధ్యతరగతి విస్తరిస్తోంది. కానీ ఆ అభివృద్ధి అందరికీ సమానంగా అందలేదు. ముఖ్యంగా డాలీ పుట్టి పెరుగుతున్న అప్పలాచియన్ ప్రాంతాల్లోని గ్రామీణ కుటుంబాలు అంతులేని పేదరికాన్ని చవిచూసాయి. అక్కడి ప్రజల జీవితాల్లో తక్కువ ఆదాయం, విద్యా అవకాశాలు తక్కువగా వుండటంతో వ్యవసాయం, కూలిపనుల మీద జీవనం ఆధారపడింది. నగరాలతో పోలిస్తే తక్కువ అవకాశాలుండటంతో అనేక సమస్యలు చుట్టుకొని వుండేవి. డాలీ తన బాల్యంలో చూసిన యీ ప్రపంచం అమెరికాలోని మరో పార్శాన్ని చూసింది. అమెరికన్ డ్రీమ్ అందరికీ అందుబాటులో వుందని చెప్పే దేశంలో, ఆ డ్రీమ్కి చేరుకోవడానికి కొందరు చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేదనే యెరుక డాలీకి తన అనుభవాల నుంచే పోగుపడింది. వొక అమ్మాయిగా ఆ కాలంలో యెదురైన ప్రపంచాన్ని… జీవితాన్ని స్త్రీవాద దృష్టితో చూడటం ఆసక్తికరంగా అనిపిస్తుంది. 1940లు,60ల అమెరికాలో మహిళల జీవితంపై కుటుంబం, వివాహం, సంప్రదాయం, జండర్ ప్రభావం బలంగా వుండేది. 1950లలో ఆదర్శ మహిళ అంటే మంచి భార్య, తల్లి, గృహిణి అనే భావన ప్రధాన స్రవంతి సంస్కృతిలో యెక్కువగా వుండేవి. అయితే 1960లలో మాత్రం పరిస్థితులు మారడం మొదలైంది. అమెరికాలో సివిల్ రైట్స్, వుమెన్స్ లిబరేషన్ , సమాన హక్కుల వుద్యమాలు బలపడుతున్న కాలమది. మహిళలు విద్య, వుద్యోగం, శరీరం, వివాహ వ్యవస్థ, లింగ వివక్ష గురించి ప్రశ్నించడం మొదలుపెట్టిన ఆ సమయంలో డాలీ సంగీత రంగంలోకి వచ్చింది.
సంగీత పరిశ్రమ కూడా పూర్తిగా సమానమైన అవకాశాలున్న రంగమేమీ కాదు. అక్కడా పురుషుల ఆధిపత్యం బలంగా వుండేది. వొక మహిళ తను గాయని కావడానికి చేసే జర్ని వొక యెతైతే తన పాటలను తానే రాయడం, తన వ్యాపార నిర్ణయాలను తానే తీసుకోవడం, తనకు తానే వొక సంస్థగా యెదగడం మరెంతో యెత్తు. ఆ యెతైన శిఖరాన్ని యెక్కాలని నిర్ణయించుకునే డాలీ రెండో దారిని యెంచుకుంది.
పేదరికాన్ని ఆమె దాచిపెట్టాల్సిన విషయంగా భావించకుండా సాహిత్యంగా మార్చుకోవటమే డాలీ పాటల్లో అత్యంత ముఖ్యమైన అంశం. ఆమె బాల్యంలోని పేదరికం ఆమె సృజనలో వొక అనుభవంగా మారింది. అందుకు అద్భుతమైన వుదాహరణ ‘Coat of Many’ పాట. డాలీ చిన్నప్పుడు ఆమె తల్లి అందుబాటులో వున్న రంగురంగుల క్లాత్ ల్లోని ముక్కలతో డాలీ కోసం వొక కోటుని కుట్టింది. అదేమంత ఖరీదైన కోటు కాదు. యితర పిల్లలు దాన్ని చూసి నవ్వినా, ఆ కోటులో తల్లి ప్రేమ వుందని… తన తల్లి ప్రేమకు, తమ కుటుంబ గౌరవానికి ప్రతీకగా డాలీ ఆ కోటుని చూస్తుంది. ఆ చిన్ననాటి పేదరికం, తల్లి ప్రేమ, పిల్లల అవమానం, ఆత్మగౌరవం యివన్నీ ఆ పాటలో సాహిత్యంగా మారాయి. యిక్కడ పేదరికం కేవలం ఆర్థిక పరిస్థితి కాదు. వొక వస్తువుకున్న వెల కంటే దాని చుట్టూ పెనవేసుకొన్న ప్రేమే నిజమైన సంపదనే భావాన్ని యీ పాటలో యెంతో హృద్యంగా వ్యక్తమవుతుంది. ‘మన దగ్గర డబ్బు లేకపోవచ్చు… కానీ మన విలువ డబ్బుతో నిర్ణయించకూడదు’ అనేది డాలీ రచనలో చాలా ముఖ్యమైన మానవతా కోణం.
డాలీ సంగీత ప్రపంచంలో యెదుగుతున్న కొద్దీ తన స్వంత పాటలను తానే రాసుకునే రచయిత్రిగా కూడా గుర్తింపు పొందింది. ఆమె పాటల్లో వ్యక్తిగత అనుభవం, కథని చెప్పే గుణం, గ్రామీణ సంస్కృతి, సాధారణ మనుషుల జీవితాల పట్ల సానుభూతి నిండివుండటంతో ఆమె పాటలు కేవలం వినోదంగా కాకుండా చిన్న చిన్న జీవిత కథలుగా మన మనసుల్లో బొమ్మరిల్లుని కట్టుకుంటాయి.
డాలీ పార్టన్ పాటల్లో వొక స్త్రీ అనుభవానికున్న వొక ప్రత్యేక స్థానాన్ని ‘9 to 5’ పాటలో వుద్యోగం చేసే మహిళ ప్రతిరోజూ చేసే శ్రమ, కార్యాలయంలో యెదురయ్యే అసమానతలు, తన శ్రమకు తగిన గుర్తింపు కోసం చేసే పోరాటం వ్యక్తమవుతాయి. వుద్యోగమంటే కేవలం జీతం సంపాదించటమే కాదని, తన శ్రమకు తగిన గౌరవం, తన జీవితంపై స్వతంత్ర నిర్ణయం తీసుకోవటం కూడా అవసరమనే విషయాన్ని యీ పాటలో అంతర్లీనంగా ప్రవహిస్తుంది. అందుకే యిదొక కాలానికి సంబంధించిన పాటగా మొదలై, శ్రమజీవి స్త్రీ అనుభవానికి ప్రతీకగా నిలిచింది.
అలానే ‘Just Because I’m a Woman’ పాటలో ఆమె మరో ముఖ్యమైన ప్రశ్నను ముందుకు తెస్తుంది. పురుషుడికి వొక రకమైన స్వేచ్ఛనిచ్చే సమాజం, అదే విషయంలో స్త్రీనెందుకు వేరే ప్రమాణాలతో కొలుస్తుంది? స్త్రీ చేసిన తప్పుకు సమాజం యిచ్చే తీర్పులెందుకంత కఠినంగా వుంటుందనే ప్రశ్న యిందులో వినిపిస్తుంది. యిది స్త్రీలపై అమలయ్యే ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించే పాట. డాలీ స్త్రీవాదాన్ని సిద్ధాంతాల వుపన్యాసంగా కాకుండా, వొక స్త్రీ తన అనుభవం నుంచి మాట్లాడుతున్న స్వరంగా వ్యక్తం చేసారు.
ఆమె పాటల్లో మరో ముఖ్యమైన అంశం స్త్రీ యెప్పుడూ ధైర్యానికి మాత్రమే ప్రతీక కాదు. ఆమెకు భయాలు, బలహీనతలు, అసూయలు, ప్రేమలోని అనిశ్చితులు కూడా వుంటాయనే కోణం ‘Jolene’ పాటలో కనిపిస్తుంది. తన ప్రేమను కోల్పోతానేమోనన్న భయంతో వొక స్త్రీ మరో స్త్రీని వేడుకుంటుంది. ప్రేమలోని యిన్ సెక్యూరిటీని డాలీ యెంతో మానవీయంగా చిత్రించారు. యీ పాటలో స్త్రీల భావోద్వేగ ప్రపంచాన్ని వొకే రకమైన బలమైన మహిళ రూపంలో కాకుండా, అనేక పొరలతో చూపిస్తుంది.
యీ నాలుగు పాటలను కలిపి చూస్తే డాలీ పార్టన్ రచనా ప్రపంచంలోని వైవిధ్యం అర్థమవుతుంది.
‘Coat of Many’ లో తల్లి ప్రేమను, పేదరికపు ఆత్మగౌరవాన్ని… ‘9 to 5’లో శ్రమజీవి స్త్రీ పోరాటాన్ని…
‘Just Because I’m a Woman’ లో స్త్రీలపై తీర్పునిచ్చే సామాజిక ప్రమాణాలను ప్రశ్నించే స్వరాన్ని … ‘ Jolene’లో ప్రేమలోని భయాన్ని… యిన్ సెక్యూరిటీని చూస్తాం. అందికే డాలీ తన పాటల్లో స్త్రీని వొకేలా నిర్వచించదు . ఆమె స్త్రీని సంపూర్ణమైన మనిషిగా చూస్తారు. కలలుంటాయి. కోప్పడుతుంది. భయపడుతుంది. ప్రేమిస్తుంది. స్వాతంత్ర్యం కోసం తపన పడుతుంది.
డాలీ పార్టన్ విశిష్టత ఆమె సాధించిన విజయాల సంఖ్యలో మాత్రమే లేదు. తన మూలాలను మరచిపోకుండా ప్రపంచ స్థాయికి యెదగడం ఆమె గొప్పతనం. అప్పలాచియన్ గ్రామీణ సంస్కృతిలోని సంగీతాన్ని, కథనాన్ని, భాషను ప్రపంచ ప్రేక్షకులకు… శ్రోతలకు పరిచయం చేస్తూ అదే సమయంలో సంగీతానికి మాత్రమే పరిమితం కాకుండా సినిమా, వ్యాపారం, సామాజిక సేవ వంటి రంగాల్లో కూడా తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా పిల్లల్లో చదవటం ఆసక్తిని ప్రోత్సహించేందుకు ఆమె స్థాపించిన యిమేజినేషన్ లైబ్రరీ లాంటివి కళాకారిణిగా ఆమెకున్న సామాజిక బాధ్యతను స్పష్టంగా చూపించాయి.
డాలీ పార్టన్ను వొక గాయని అని మాత్రమే పిలవడం ఆమెను చిన్న పరిధిలో బంధించడమే అవుతుంది. ఆమె వొక కథకురాలు. ఆమె పాటల్లో వ్యక్తిగత జీవితం సామాజిక అనుభవంగా మారుతుంది. వొక పేద బాలిక జ్ఞాపకం ప్రపంచంలోని అనేక కుటుంబాల జ్ఞాపకంగా మారింది. వొక వుద్యోగిగా స్త్రీ యెదుర్కొనే సమస్య లక్షలాది మహిళల అనుభవానికి ప్రతిబింబమైంది. వొక స్త్రీ తను తన ప్రేమను కోల్పోతాననే భయం సాధారణమైన సహజమైన భయంగా అనేకమందికి తోచింది.
‘వుదయం మొదలైన నా శ్రమ సాయంకాలం వరకూ కొనసాగుతూనే వుంటుంది. నా కష్టంతో ప్రపంచం నడుస్తూవున్నా, నా స్వరానికి యింకా విలువ రావాలి’… వుద్యోగం చేసే స్త్రీ శ్రమకి విలువ, ఆర్దిక స్వాతంత్ర్యం, తన జీవితంపై తనకున్న హక్కుని డాలి పాటల్లో చూస్తాం. ఆమె పాటల్లో స్ర్తీవాదం నినాదంలా కాకుండా రోజు వారి జీవితంలో తన శ్రమకు విలువ కోరుకునే సాధారణ మహిళ గొంతులా సింపుల్ గా వినబడటం విశేషం.
‘9 to 5’ యెందుకంత ముఖ్యమైన పాటంటే, 9 to 5ను 1980లో వచ్చిన అదే పేరున్న సినిమాలో భాగంగా రాసారు. యీ పాటను కేవలం వొక క్యాచీ సాంగ్ గా చూడటం దాని రాజకీయ అర్థాన్ని తగ్గించినట్టే అవుతుంది. 9 to 5లో పని చేసే మహిళ యెదుర్కొనే తక్కువ గుర్తింపు పనిచేసే చోట రాజకీయాలు, పురుషాధిక్య తన శ్రమకు తగిన గౌరవం లేకపోవడం, ఆర్థిక స్వాతంత్ర్యానికై చేసే పోరాటం వంటి అంశాలు వినిపిస్తాయి. అయితే డాలీ యిక్కడ మహిళలకు కూడా వుద్యోగాలు కావాలనే స్థాయిలో ఆగిపోలేదు. ‘నే పనిచేస్తున్నాను. నా శ్రమకు విలువుంది. నా జీవితంపై నాకు కూడా హక్కుంది’ అనే స్వరాన్ని ప్రజాదరణ పొందిన సంగీతంలోకి తీసుకొచ్చారు. కానీ డాలీ స్త్రీవాదంలో వో ప్రత్యేకతుంది. డాలీని ఫెమినిస్ట్ అని వొకే పదంతో నిర్వచించడం కంటే, ఆమె జీవితాన్ని, కళను చూసినప్పుడు ఆమె వొక స్వతంత్ర మహిళా స్వరాన్ని వొడిసిపట్టుకోవటం కనిపిస్తుంది. పేదరికం, ప్రేమ, వివాహం, మాతృత్వం, పని, ఆర్థిక స్వాతంత్ర్యం, అవమానం, ఆకాంక్ష యిలా స్త్రీలు యెదుర్కొనే సామాజిక వొత్తిళ్లను ఆమె తన పాటల్లో రాశారు. అదే సమయంలో ఆమె తన స్త్రీత్వాన్ని దాచుకోలేదు.
సమాజం వొక మహిళ యెలా కనిపించాలి, యెలా మాట్లాడాలి, యెలా ప్రవర్తించాలని నిర్ణయించాలనుకుంటుంది. కానీ తన రూపాన్ని, తన గొంతును, తన వృత్తిని తానే నిర్వచించుకోవచ్చని డాలీ భావించటం ఆమె వ్యక్తిత్వంలోని గొప్ప స్వాతంత్ర్యానికి స్వేచ్ఛకి ప్రతీక.
‘అందంగా కనిపించడం’ కూడా ఆమెకి వొక వ్యూహమే. డాలీ పార్టన్ గురించి మాట్లాడేటప్పుడు ఆమె ప్రత్యేకమైన రూపాన్ని యిగ్నోర్ చెయ్యలేరు చాలామంది. కానీ దాన్ని కేవలం గ్లామర్ గా చూడటం కూడా సరిపోదు. ఆమె తన యెపీరన్ప్ గురించి వచ్చే విమర్శలను యెదుర్కొన్నారు. తన రూపం గురించి జోకులు వచ్చినా, వాటిని తనకు వ్యతిరేకంగా వుపయోగించనివ్వకుండా తన యిమేజ్ ను తానే వొక కల్చరల్ ఐడెంటిటీగా మార్చుకున్నారు.
నన్ను మీరు నిర్వచించలేరు. నన్ను నేనే నిర్వచించుకుంటానని తన రూపంపై తన స్వీయాధికారాన్ని ఆమె ప్రకటించటంలో ఆమెదైన వ్యక్తిత్వం కనిపిస్తుంది. ఆమెపేద అప్పలాచియన్ అమ్మాయి నుంచి రచయిత… సూపర్ సింగర్… వ్యాపారవేత్త… యిలా సాగిన డాలీ ప్రయాణంలో మరో గొప్ప అంశం ఆర్థిక స్వాతంత్ర్యం. ఆమె కేవలం పాటలు పాడి ఆగిపోలేదు. తన పాటల రచనపై, సంగీతంపై, వ్యాపారంపై నియంత్రణ సాధించడానికి డాలీవుడ్ వంటి వ్యాపార సంస్థలతో తన సృజనాత్మకతను ఆర్థికశక్తిగా కూడా మార్చుకోవటం ఆమె జీవితంలోని అత్యంత ముఖ్యమైన జర్నీ. ప్రతిభ వొక మహిళకు పేరు తెచ్చిపెట్టొచ్చు. కానీ ఆర్థిక స్వాతంత్ర్యం ఆమెకు నిర్ణయాధికారాన్నిస్తుంది.
పేదరికం నుంచి వచ్చిన వొక బాలిక, తన చుట్టూ వున్న జండర్, క్లాస్ పరిమితులను దాటి, తన గొంతును సుసంపన్నమైన సంపదగా విజయకేతనం యెగరవేసిన ఆమె పాటల్లో పేదవాళ్ల బాధ… మహిళల పని… ప్రేమలోని అసమానత… కుటుంబం … ఆత్మగౌరవం ముఖ్యంగా తన జీవితాన్ని తానే యెంచుకోవాలనే ఆకాంక్ష వుంది. అందుకే డాలీ పార్టన్ను అర్థం చేసుకోవడమంటే కేవలం వొక కంట్రీ సింగర్ గానే అర్థం చేసుకోవడం కాదు. 20వ శతాబ్దపు అమెరికాలో వొక పేద గ్రామీణ అమ్మాయి తన స్వరాన్ని యెలా సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక శక్తిగా మార్చుకుందో అర్థం చేసుకోవడం.
డాలీ పార్టన్ పేదరికం నుంచి ఐశ్వర్యవంతురాలైన వొక విజయగాథ మాత్రమే కాదు. తన మూలాలను మరచిపోకుండా ప్రపంచాన్ని చేరుకోవచ్చని నిరూపించిన వొక స్త్రీ కథ. ఆమె పాటల్లో పల్లెటూరి మట్టి పరిమళముంది. శ్రమజీవుల చెమటచుక్క బరువుంది. తల్లి ప్రేముంది. ప్రేమలోని భయముంది. స్త్రీగా మహిళల వునికిని ప్రశ్నించే ధైర్యముంది. తన జీవితాన్ని, తన ఆత్మగౌరవాన్ని, తన స్వేచ్ఛను తానే వెతుక్కునే విశ్వమానవీయ సుసంపన్నమైన స్వరంగా విరబూసి కోట్లమంది అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూనేవుంది ఆమె పాట.
డాలీ పార్టన్ యిచ్చిన పాటలకి… ఆ స్వర యింద్రజాలానికి సదా కృతజ్ఞతలు.
**