బజరా అని పిలువబడే బమ్మిడి జగదీశ్వరరావుగారు ఇంచుమించు మాతృక పునః ప్రారంభం అయినప్పటి నుండి కతలు వెతలు శీర్షికతో మాతృక కోసం రాస్తున్నారు. ప్రగతిశీల మహిళాసంఘానికి మాతృక పత్రిక ఒక కార్యకర్త అయితే, బజరాగారు మాతృకకు ఒక సాంస్కృతిక కార్యకర్త. అలా ఆయన గత 12 సంవత్సరాలుగా మాతృక, ప్రగతిశీల మహిళాసంఘం -ఈ రెండిటి ప్రస్థానంలో మాతో బాటు నడిచారు. గతంలో ఆయన రాసిన కతలతో రణస్థలి, మనువాచకం పేరు మీద రెండు సంపుటీలను మాతృక ప్రచురణలుగా తీసుకొని వచ్చాము. పీవోడబ్ల్యూ 7, 8 మహాసభల సందర్భంగా ఆ పుస్తకాలు వచ్చాయి. గుంటూరులో 2026 మే 23, 24 తేదీల్లో జరగనున్న 9వ ప్రగతిశీల మహిళాసంఘం మహాసభల సందర్భంలో ఈతిహాసం, లోకాయణం పేర్లతో మరి రెండు కథా సంపుటీలను ప్రచురిసున్నాము. మరిన్ని కథలు ఆయన రాయాలి. మేం ప్రచురించాలి. బజరా కథలు చరిత్రలో జరుగుతున్న పరిణామాలను రికార్డు చేస్తాయి. అలా బజరాగారు ఒక చారిత్రిక కర్తవ్యాన్ని నిర్వహించారు. ఆ రికార్డును, ఆ చరిత్రను ప్రచురించి దాన్ని శాశ్వతం చేయటం కంటే ప్రచురణకర్తలకు వేరే కర్తవ్యం ఏముంటుంది?
బజరాగారు ఎన్నుకొనే అంశాలు ఎక్కడ నుండో ఊడిపడవు. రోజు పేపర్లో వచ్చే సంగతులే. అది ఒక జడ్జి దుష్ట తీర్పు కావచ్చు, ఇంట్లోనే బాలికపై జరిగే అత్యాచారం కావచ్చు, లవ్ జిహాద్ పేరిట జరిగే హత్యలు కావచ్చు, కరోనా మరణాలు కావచ్చు. దినపత్రికలో వచ్చే వార్తలకు అసలు భాష్యం చెప్పి కళ్లు తెరిపించటంలో బజరాగారు సిద్ధహస్తులు. ఈ పరిణామాలను మాతృక పాఠకులకు సులభంగా అర్థం చేయించటానికి ఒక మంచి సాహితీరూపం కావాలని మాతృక సంపాదక వర్గం ఆనాడు భావించింది. వెత కతగా మారింది. కతలు వెతలు శీర్షిక అయింది.
అనుకొన్నట్లుగానే మాతృకలో బజరాగారి కతలు వెతలు శీర్షిక విశేష పాఠకాదరణ పొందింది. ఆ వెతల కోసమే మాతృక గురించి ఎదురు చూసే పాఠకులు ఉన్నారు. ఈ గడ్డ మీద, ఈ దుర్మార్గ కాలంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్నీ, దౌష్ట్యాన్నీ నిస్సహాయంగా నిశ్చేష్టులై చూస్తున్న ప్రతి మనిషీ కతలు వెతలులో పాత్రధారిగా ఒక కత చెబుతాడు. ఆ పాత్రలతో పాఠకులు ఐడెంటిఫై అవుతున్నారు. ఆర్కే లక్ష్మణ్ కార్టూన్లతో కనిపించే ఆమ్ ఆద్మీ బజరాగారి కథానాయకుడు. అయితే ఈ కథానాయకుడు ఇంకా తెలివైనవాడు. చమత్కారి. చిత్తో ప్రసాద్ కుంచె నుండి అలవోకగా జాలువారిన వంకరటింకర గీత పలికించే విషాధభరిత వ్యంగ్యాన్ని బజరాగారి చిన్న కతలో ధ్వనిస్తూ ఉంటాడా కథానాయకుడు.
బజరాగారికి దైనందిక జీవితంలో జరిగే ప్రతి విషయంతో పేచీ ఉంటుంది. విమర్శ వుంటుంది. ఆ విమర్శ చాలాసార్లు వ్యంగ్యం అవుతుంది. వ్యంగ్యం వాక్య రూపం దాలుస్తుంది. ఆ వాక్యం ప్రవాహం అవుతుంది. ఆ ప్రవాహంలో విరుపులు, మెరుపులు, చెళుకులు, చతురోక్తులు, సామెతలు -తెలుగు నుడికారాన్ని అద్దుకొని పరుగులు పెడతాయి. పాఠకులు ఈ సాహితీ అద్భుతానికి మంత్రముగ్దులవుతారు. తమని ఆనందపెట్టిందీ, దుఃఖపరిచిందీ, ఆగ్రహాన్ని తెప్పించిందీ ఆయన సొగసైన తెలుగు వాక్యమా? ఆ వాక్యంలో ఘనీభవించిన వాస్తవమా? ఆ వాస్తవంలోని కాఠిన్యమా? ఏమీ అర్థం కాక, కేవలం పాఠకులుగా ఉండిపోదామనుకొని, అలా ఉండి పోలేక ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఆయన అక్షరం చదువరిని నిరంతరం ఘర్షణలో పడేస్తుంది. ప్రపంచంతో యుద్ధం చేయమని రెచ్చగొడుతుంది. అంతిమంగా అదే అక్షరం సేద తీరుస్తుంది. అయితే చదవక ముందు వ్యక్తీ, చదివిన తరువాత అదే వ్యక్తీ ఒక్కలాగా అయితే ఉండలేరు.
మానవ జీవితంలోని సంక్షోభాన్నీ, సమకాలీన రాజకీయాలనూ సులువైన పద్దతిలో, కొత్త తరహా సాహితీ రూపంలో మనముందుంచిన బమ్మిడి జగదీశ్వరరావు గారి ఈతిహాసం, లోకాయాణం పుస్తకాలను విస్తృతంగా చదవుతారని ఆశిస్తున్నాము.