మహబూబ్‌నగర్ కథా సాహిత్య వీధులలోకి ఇక్బాల్ తన రెండో కథల పుస్తకం ‘నల్లరేగళ్ళు’ ప్రవేశపెడుతున్నాడు. చాలా అర్ధవంతంగా దీనికి కృష్ణాతీర కథలు అని చిన్న వ్యాఖ్యను జోడించాడు. ఇక్బాల్ కొల్లాపూర్‌లోని వరిదేలలో పుట్టి పెరిగాడు. కొల్లాపూర్ కృష్ణా తీర సంస్థాన రాజ్యమే. సుసంపన్న రాజ్యమే. ఇది తొలుత జటప్రోలులో ప్రారంభమై కొల్లాపూర్‌లో కలిసింది. అట్లా కలిసిన కొల్లాపూర్‌లో కృష్ణా తీరంలోనే ఇక్బాల్ జన్మించాడు. మహబూబ్‌నగర్ జిల్లా నూటికి నూరు శాతం కృష్ణా నదీ పరీవాహకంలో వుఞది. అనంతగిరి కొండలలో కుడివైపు కురిసే వర్షం దుందుభిగా ఎడమవైపు కురిసే వర్షం ఈసా మూసీ నదులుగా తూర్పువైపు, క్రమంగా తూర్పు ఆగ్నేయం వైపు ప్రవహిస్తూ వచ్చి ఇవి కృష్ణానదిలో కలుస్తాయి. ఊకశెట్టివాగు, ఇతర పెద్ద చిన్న వాగులూ వంకలన్నీ కృష్ణానదిలోకే పారుతాయి. ఇక్కడంతా చిన్నవి కాస్త పెద్దవి కుంటలు చెరువుల కింది వర్షాధార సేద్యమే కానీ కాలవల కింది సేద్యం లేదు. ఇక్బాల్ బాల్యం వర్షాధార జీవన సేద్యం చూస్తూ గడిపిన బాల్యం ` ఉపాధ్యాయ వృత్తి జీవితం కొల్లాపూర్ నించి ఏటవతలి గట్టుకు చేరింది. ఇక్బాల్ గద్వాలలో స్థిరపడ్డాడు.
కృష్ణానది కొల్లాపూర్ ప్రాంతానికి చేరేలోపు కాగ్నా నదిని కలుపుకొని భీమా నది తంగిడి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. తుంగ, భద్ర నదులు కలిసి ప్రవహిస్తూ వచ్చి అలంపురం దగ్గర తుంగభద్రా నది కృష్ణలో కలుస్తుంది. దుందుభి మన్నెవారిపల్లి దిగువన కృష్ణానదిలో కలుస్తుంది. ఇదంతా ఎందుకంటే మహబూబునగర్ జన జీవితం కృష్ణాతీర జీవితమని, నీరు తరలించుకుపోయిన తరువాత దినదినం గిడసబారుతున్న లేక ఎడారీకరణ చెందుతున్న నేలమీద బతుకు దుస్తరమై వలసదప్ప నిలిచి బతకలేకపోతున్న జీవితమని చెప్పడానికే. ఇక్బాల్ పుట్టిన కొల్లాపూర్ నుండి వృత్తిలో జీవించిన గట్టు నుండి ఇప్పుడు స్థిరపడిన గద్వాల దాకా కొంతవరకు ఎర్రనేలలు, ఇసుకబారిన నేలలున్నా ఆర్డీఎస్ కాలువ జిల్లాలో ప్రవేశించిన దగ్గరి నుండి కొల్లాపూర్ దాకా నల్ల రేగళ్ళు బాగానే వుంటాయి. మరీ గద్వాల అయితే నడిగడ్డగా దో`ఆబ్గా సుప్రసిద్ధమైన కృష్ణా, తుంగభద్ర నదుల నడుమ ఉంటుంది. ఏటి ఒడ్డు నేల మీద ఎంతో సారవంతమైన నేలమీద ఇక్బాల్ మనకు నోటీస్ చేసే జీవితం ఈ నల్లరేగళ్ళు కథలు. విద్వాన్ విశ్వం పెన్నేటి పాట పెన్నా నదీ తీర దుస్తర జీవన గానం. ఇక్బాల్ కథలు కృష్ణా తీరాన, రెండు నదుల మధ్య నడిగడ్డన పడుతూ లేస్తూ బతుకు లీడుస్తున్న, భూమిని కాపాడుకోవడానికి తిరుగబడుతున్న దుర్భర జీవితాల కథనం.
ఇక్బాల్ కథలు కొల్లాపూరంతో, గద్వాలతో, నడిగడ్డతో తన ఉపాధ్యాయ వృత్తి జీవితంతో విరసం నుండి పొందిన అవగాహనతో ఎపిటిఎఫ్, కరువు వ్యతిరేక పోరాట కమిటి, పాలమూరు అధ్యయ వేదిక నిర్వహించిన కార్యాచరణతో సంబంధంలోకి వచ్చి తనను ఉక్కిరి బిక్కిరి చేసిన, కదిలించిన దగాపడిన జీవితాల కథలు. అవి మనని తీవ్ర సంవేదనకు గురిచేస్తాయి. తన చుట్టూ జరిగిన కథలు గనుక అవి తనలో దగ్ధమై పోకుండా తన చుట్టూ ఉన్న ప్రపంచానికి చెప్పదలచుకున్న కథలు గనుక ఈ అన్ని కథలలో తానూ ఒక పాత్రగా ఉంటాడు. విద్యార్థుల దగ్గర ఉపాధ్యాయుడుగా, బంధుమిత్రుల దగ్గర వారికోసం ఆర్తిగల ఆత్మీయుడుగా, ఉద్యమాల దగ్గర వారి చొరవను. సమస్యను అర్థం చేసుకునే ఆలోచనా పరుడుగా ఉంటాడు. ఈ కథల ఆధారంగా ఇక్బాల్‌ను ప్రభావితం చేసిన ఆయన స్థూల జీవితాన్ని నిర్మించవచ్చు. స్పర్మ అనే కథలో ఇక్బాల్ మిత్రులంతా కలుస్తారు. ఎవరి జీవితాలు వాళ్ళు తెలియచెబుతారు. ఇక్బాల్ జీవితం ఆలోచనలలో, ఆచరణలో ప్రత్యేకంగా అర్థమవుతుంది ఆ ముచ్చట వింటే. ఎవరికైనా తన గురించి తాను చెప్పటం అవసరమా అనిపించవచ్చు కానీ ఎవరు మాత్రం ఊరుకుంటారు మౌనంగా. ఎవరనుకుంటున్నారు అవసరం లేదని. ఎవ్వరైనా తమను చెప్పుకోవచ్చుగానీ సామ్యంతో చూసుకుని తమకంటే కష్టపడే జీవుల కోసం తమ సమయాలు, ఆలోచనలు ఇవ్వడం చాలా అవసరం. స్పర్శ కథ చదివిన తరువాత ఇక్బాల్ గద్వాలలో కాకుండా కొల్లాపూర్‌లో స్థిరపడి వుంటే చాలా బాగుండేది అని చాలా సార్లు అనిపిస్తున్నది. ఆయన ఇప్పటికైనా ఆ పని చేయాలేమో. ఎందుకంటే అది ఆయనను భవిష్యత్తు స్వప్నాల దారులలో నిలబెట్టింది. అదేగాక ఆయనకు బాల్య జ్ఞాపకాలు, స్నేహాలు కలబోసుకునే తావు కొల్లాపురం.
నిరీక్షణ, జిందేరిష్తే, రిషిసెబాన్ కథలు ఆయన మోసుకు తిరుగుతున్నాడో లేక అవే ఆయనను మోసుకు తిరుగుతున్నాయేమో అనిపించింది. జిందేరిష్తే బాల్యానుభవం. చిట్కావైద్యం, మనుషుల మధ్య అనుబంధాలు, ఆత్మీయతలు, ఒకరి కోసం ఒకరి ఆరాటాలు బాగా కనిపిస్తాయి. మనిషిలోపల, సమాజంలోపల గూడు కట్టుకున్న స్వార్థం కన్నా, హైన్యం కన్నా మంచిని, ప్రేమాస్పద మానవీయ విలువలను వెలికి తీసి ఉన్నతంగా నిలపడం సాహిత్యం చేయవలసిన అత్యవసరమైన కృషి అనుకుంటే, చాలా చిన్న విషయమే కానీ ఈ కథా విలువను నిలబెడుతుంది. రిషిసెలూన్ ఆలూరు ముంపును వర్తమాన సమస్యలతో చర్చకు తెచ్చిన కథ. కృష్ణ ఇక్బాల్ విద్యార్థి. ఆలూరు ముంపు బాధితుడు. సెలూన్‌లోని పోలీస్ ముంపు సమయంలో ఊరు తరలిపోయే దుఃఖం చూసిన, వారిని తరలించిన పోలీసు. కృష్ణకు పూర్తి పరిహారం రాలేదు. రిటైరైన పోలీసుకు పెన్షన్ వస్తున్నది తప్ప ఇతర డబ్బేది రాలేదు. ప్రభుత్వం వీరికి అప్పు పడి వుంది. ఇక్బాల్ వీరి వైపున్నాడు.
ఇక్బాల్ కవీ, రచయిత, కార్యకర్త కూడా. కార్యకర్తగా ఆయన నెట్టెంపాడు సాధన ఉద్యమంలో భాగం. నిర్వాసితులకు న్యాయం కోసం, వారిని వారి త్యాగపు స్థాయిలో ఉన్నతంగా జీవించే పరిస్థితులు కల్పించాలనే డిమాండ్ల సాధన కృషిలో భాగం. ఈ సమస్య పూర్వాపరాల చర్చకు ఇది సందర్భం కాకపోవచ్చు కానీ, ఏ అభివృద్ధి పథకపు సాధనకైనా ` అది రోడ్డు, పరిశ్రమ, ప్రాజెక్టు, భవనాల నిర్మాణం ఏదైనా దానికోసం భూమి కోల్పోయే చిన్న, సన్న రైతులు ఘోరమైన పరిస్థితులలోకి నెట్టబడుతున్నారు. పాలకులు ప్రజలు పోరాడి సాధించుకున్న చట్టాలను అమలు చేయకుండా నష్టం చేస్తున్నారు. నష్టపోయే రైతులకు వారి త్యాగం వల్ల ప్రయోజనం పొందే భూమిలో భూమి, ఉపాధి ఇవ్వాలనే డిమాండ్ పాలకులు వినిపించుకోవడం లేదు. ధిక్కరించి పోరాడితే నిర్బంధం ప్రయోగిస్తున్నారు. అభివృద్ధి నిర్వాహకులుగా పాలకుల చేతిలో నిర్వాసితుల జీవితాలు విధ్వంసం కావడం శ్రీశైలం ప్రాజెక్టులో, ర్యాలంపాడు ప్రాజెక్టులో ప్రత్యక్షంగా చూసిన వాడుగా, ఇక్బాల్ తానూ ఒక పాత్రై మాట్లాడతాడు. మాట్లాడుతూ వ్యవస్థ రూపసారాల మర్మం విప్పుతాడు. ఈ కారణం వల్ల తన కథలు కథ చెప్పడం మీద కాకుండా అన్యాయాన్ని వివరించడం మీద కేంద్రీకరిస్తాయి.
నిరీక్షణ అందరి అనుభవంలోని కథ అప్పు పడ్డ రైతుల కథ. ప్రస్తుత గద్వాల జిల్లాలో సేద్యంతో పాటు ఇతర కారణాలతో అప్పులు చేసిన వాళ్ళు ఆదాయ మార్గాలు లేక భూములు, జీవితాలు కోల్పోతున్న కథ. చిన్న మొత్తాలు అప్పులిచ్చి అధిక వడ్డీల ఆశలో దెబ్బ తిన్న వాళ్ళు కూడా ఉండవచ్చు కానీ, ఎక్కువ మంది రైతులు కౌలు బాకీలు తీర్చడానికి, సేద్యపు అప్పులు తీర్చడానికి భూములు కోల్పోతున్న వాళ్ళే. బ్యాంకులు చక్రవడ్డీల దందా చేస్తున్నాయి కనుక పైవేటు వ్యక్తుల ఫైనాన్సుల, చిట్టీల దందా తప్పని ఆలోచించడం మానేశారు. ఇక్కడ అప్పు ఇచ్చిన వాడివైపే సమాజపు ఆలోచనలుంటాయి. కనుక అప్పులు, వడ్డీల దందాలో బాధితుల వైపు నించి ఆలోచించాలంటే ప్రత్యేక దృష్టి అవసరం. గద్వాల జిల్లాలో సీడ్ పత్తి పండించే రైతులు తమ సర్వస్వం కోల్పోతుండగా ఏజంట్లు, విత్తన వ్యాపారులు, పైరవికార్లు, అధికారులు, రాజకీయ నాయకులు తెగబలిసిపోతున్నారు. ఉపాధ్యాయుడుగా ఇక్బాల్‌కు మొదలైన ఈ అనుభవం న్యాయవాద వృత్తి కాలంలో తప్ప ఓ కొలిక్కిరాలేదు. అయితే కోర్టులు ఎవరి వైపు అనేది వ్యక్తులుగా ఒకరిద్దరు జడ్జిల తీర్పుల మీద ఆధారపడి వుంటుందా.
కోర్టు వ్యవహారాలకు సంబంధించిన మరో కథ హోషియార్. ఈ కథ లోపల కథలున్నాయి. కథ వెనుక అనేక కథలున్నాయి. కథ ముగిసిన తరువాత కూడా కథలున్నాయి. అవి పద్మమ్మ జీవిత కాలం కొనసాగే వ్యధలు. ఎంతో పోరాడిన మనిషి. ఎంతో ధైర్యం గల మనిషి. ఎంత ఒంటరైంది. కోర్టు చాలానే మాట్లాడగలదు. ధైర్యం కూడా చెప్పగలదు ఒక సంస్థగా. కానీ వ్యవస్థ అంత ధైర్యం ఇవ్వగలదా. ఈ కథలో పద్మమ్మకు అర్థమైన స్థాయిలో వ్యవస్థ మరెవ్వరికీ అర్థమయ్యే అవకాశం లేదు. ఆమె భర్తను చంపేశారు. చంపి చనిపోయాడన్నారు. వేగిరపరచి ఖననం చేయించారు. ఆమె అనుమానపడింది. ప్రజాసంఘాల తోడుతో ఖననం చేసిన శవానికి పోస్టుమార్టం చేయించింది. దోషులను గుర్తించింది. ఆమె ముందు నిలిచి ఆ ఊర్లో బహిరంగ సభ జరిపించింది. ఆ సభలో ఆట, పాట, మాట అన్నీ దోషుల మీద గురిపెట్టాయి. దోషులు ప్రజాసంఘాల కార్యకర్తల మీద రాళ్ళ దాడి చేయించారు. దాడి కారకుల మీద కేసు నమోదు కోరితే డిఎస్పి స్థాయి అధికారి ప్రజాసంఘాల కార్యకర్తల మీద, బాధితుల మీద కేసు నమోదు చేశాడు. ఏడేండ్ల పాటు ప్రజా సంఘాల కార్యకర్తలు కేసులలో తిరగాల్సి వచ్చింది. కార్యకర్తలలో ఒకడుగా పురుషోత్తం కేసు నడుస్తుండగానే హైదరాబాదులో హత్యకు గురయ్యాడు. కనకాచారి ఆ తరువాతి రోజుల్లో హత్యకు గురయ్యాడు. ఈ కేసు దోషులకు వీరి హత్యలకు సంబంధం లేకపోవచ్చు. కానీ, పోలీసులు హంతకులు వైపున్నారు. వ్యవస్థ హంతకుల వైపున్నది. కుర్వ పద్మమ్మకు తమ అస్తిత్వ సంఘాల స్వభావం తెలుసు. వ్యవస్థ స్వభావం అనుభవమైంది. రెండు దశాబ్దాల కాలం దోషులకు శిక్ష పడాలని తిరిగిన మనిషి అలిసిపోయింది. తన భర్తది ప్రమాద మరణమే అని సాక్ష్యం చెప్పి ఏడుపు దిగమింగుకుని కోర్టు దాటింది. ఇక్బాల్ ఈ కేసు చరిత్రలో ప్రజా సంఘాలలో భాగంగా నిలిచిన మనిషి. న్యాయవాద వృత్తిలో చేరి గద్వాల కోర్టులో కేసు పోకడలు చూసిన మనిషి. ఇక్కడా జడ్జిగారు బాగానే వున్నారు. ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు. పద్మమ్మ ఈ వ్యవస్థ బాధిత. ఆధునిక న్యాయవ్యవస్థను చాలా కింది స్థాయిలో కూడా భూస్వామ్య శక్తులు ఎంతగా లోబరుచుకున్నాయో ఈ కథ అవగతం చేయిస్తుంది. కేసులో తిరిగిన మా మీద అక్రమ కేసు వీగిపోయింది. సాంకేతిక కారణాలతో దోషుల మీద కూడా కేసు వీగిపోయింది. చివరి దాకా పద్మమ్మ ఒక్కతే కోర్టు చుట్టూ తిరగవలసి వచ్చింది. వ్యవస్థ తన గొంతుకలను కాపాడుకుంది. హోషియార్ కథ మనని హెచ్చరిస్తుంది.
కథ వేరు కానీ, సారం ఇలాంటిదే. ఢిల్లీ అమ్మాయి కథను ఇక్బాల్ సాదత్ హసన్ మంటో నించి అనువాదం చేశాడు. ఆమె జీవితాన్ని వ్యవస్థ బలి తీసుకుంది. ఏ లైంగిక హింసకు స్తీల జీవితాలు బలి అవుతున్నాయో ఆ వ్యవస్థాగత హింస నుంచి బయటికి రావాలని ఆ అమ్మాయి చాలా కష్టపడుతుంది. దేశ విభజన సమయం. ఏ దేశమైనా ఆమెను బయటకి రానీయదు. ఎక్కడ తన బతుకు బలికాకూడదు అని దూరం పోతుందో ఆమె తిరిగి తనకు తానుగా మరో మార్గంలో ఈ వ్యవస్థ అనుమతించదనని పాత మార్గంలోకే పోతుంది. గుండె పిండినట్లవుతుంది. ఈ కథ దేశ విభజన కాలానిది. పద్మమ్మ కథ గడిచిన రెండు దశాబ్దాల కాలపు కథ. మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం. చట్టం ఉంది. అనేక సంస్థలున్నాయి. అయినా వాటిని నడిపిస్తున్న వ్యవస్థ, ఆ భావజాలం ప్రమాదకరంగా ఉంది. భావజాలం, వ్యవస్థ ప్రజాస్వామికం కాకుండా భవిష్యత్తు ఎలా న్యాయంవైపు, నాగరిక విలువల వైపు సాగగలదు.
గెలిసి తీరుతాం, చలనం మొదలైంది. ఈ రెండూ పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాట కథలు. పెద్ద ధన్వాడ ఆర్డీఎస్ కాలువ కింది గ్రామం. ఆర్డీఎస్ కాలువది ప్రత్యేకమైన చరిత్ర. ఆ కాలువే ఈ గ్రామాలను నిలబెట్టింది. హైదరాబాదు రాజ్యంలో ప్రతిపాదనలు జరిగి పనులు మొదలై హైదరాబాదు రాష్టం ముగిసిన 1955`56 సంవత్సరాలలో ఈ కాలువ నీరు రావడం మొదలైంది. దాదాపు లక్ష ఎకరాలకు నీరందేది. షరా మామూలుగా ఈ భూములను పంట భూములుగా మార్చిన రైతులను రేగడి విత్తులు నవల అనాగరికులుగా చిత్రించింది. కాలువ కింది భూముల ఆక్రమణ వల్ల ఈ చిత్రణ సులభమైంది. ఎనభైలలో తెలుగు దేశం అధికారం చేపట్టిన తరువాత ఆర్డీఎస్ కాలవకు నీరు రావడం తగ్గిపోయింది. నీటి చౌర్యం పెరిగిపోయింది. ఆర్డీఎస్ ఎగువన, కాలువ వెంట పన్నెండు డిస్టిబ్యూటరీల దాకా ఇష్టా రాజ్యంగా నీరు వాడుకోవడం, నదిలోకి వదిలేయడం అడ్డూ అదుపూ లేకుండా సాగింది. ఇది అన్యాయం అని ఎత్తి చూపితే, ఆందోళనలు చేస్తే జూరాల కుడి కాలువ నుండి ఆర్డీఎస్ లింక్ కాలువ అన్నారు. కుడి కాలువకే నీరందలేదు. ఇక ఆర్డీఎస్ దాకా నీరెక్కడ. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం 2005లో చేపట్టినా అది పూర్తి కాలేదు. కాలువలో పారే నీరు ఆర్థికం కలిగిన రైతులు పైపులతో మలుపుకోవలసిందే. ఆర్డీఎస్ కాలువ నీటి సంక్షోభం వలసలను పెంచింది. తెలంగాణ ఉద్యమంలో కుర్చీవేసుకుని ఆర్డీఎస్ బాగు చేయిస్తానని చెప్పిన తెరాస నాయకుడు గ్రావిటీ నీటిని కూడా తుమ్మిళ్ళ ఎత్తిపోతలతో ఇస్తానన్నాడు. ఎత్తితే పోసే వ్యవస్థలే నిర్మించలేదు. ఇలా కాంగ్రెస్, తెదేపా, తెరాస లేక భారాస, భాజపా అన్ని పార్టీలు ఆర్డీఎస్ నీటి వాగ్దానాలు చేసి మోసం చేశారు. ఇది చాలక కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ పాలసీ తెచ్చి అనేక కంపెనీల ఏర్పాటుకు అనుమతులిచ్చింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని నారాయణపేట జిల్లా చిత్తనూరులో జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ పేరుతో రిజిస్టరైన ఒక కంపెనీ భారీ ఇథనాల్ కంపెనీ చేపట్టింది. ప్రజా సంఘాలు ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాయి. ఆ ప్రభావాన్ని పొంది, ఆ పోరాటాన్ని పరిశీలించిన వివిధ ప్రాంతాల తెలంగాణ, రైతులు, పెద్ద ధన్వాడ రైతులు, తమ గ్రామాల దగ్గర ఇథనాల్ కంపెనీల ఏర్పాటు వద్దని నిలవరించారు. పెద్ద ధన్వాడలో పురుషోత్తం వర్ధంతి సభను పోలీసు నిర్బంధాన్ని ఎదిరించి కోర్టు తీర్పుతో ఇథనాల్ వ్యతిరేక పోరాట సభగా జరిపారు. ఆ కంపెనీ ఏర్పాటు సన్నాహాలను ప్రత్యక్షంగా ఎదిరించి నిలిచారు. నాబోటి వాళ్లు వస్తే అరెస్టు చేస్తామన్నారు. కోర్టు తీర్పు వల్ల అది కుదరలేదు రైతులను అనేక కేసుల్లో ఇరికించినా తిరుగుతున్నారు కానీ కంపెనీని రానీయలేదు. ఈ పోరాటాన్ని స్థూలంగా ఇక్బాల్ పై రెండు కథలలో చిత్రించాడు. బయటి నించి ఎవ్వరినీ రైతులను కలవనీయలేదు. సంఘీభావం రానీయలేదు. అయినా ఆ రైతులు గత అనుభవాల పునాది మీద నిలిచిపోరాడారు. అనేక సంక్షోభాలలోకి నెట్టినా, ఎంతగా ఒంటరి చేసినా రైతులు నిలుస్తారని గెలుస్తారని ఇక్బాల్ విశ్వాసం. ఆ విశ్వాసమే ఈ కథలలో వ్యక్తమైంది.
ఈ కథల పుస్తకంలోని మొదటి మూడు కథలు నర్సిం, జాన్, జాఫర్‌సాబ్ మనని తీవ్ర వ్యాకులతకు గురి చేస్తాయి. హోషియార్, ఢిల్లీ అమ్మాయి ఒక రకంగా విచలితం చేయగా నర్సిం, జానీ, జాఫర్‌సాబ్ మరో రకంగా నన్ను దుఃఖితం చేశాయి. ఈ కథలు చదివితే దుఃఖం దుఃఖం దగ్గర ఆగదు. ఆగ్రహానికీ గురి చేస్తుంది. వ్యవస్థ మీద జరిగే పోరాటాలకు మనసు దగ్గరవుతుంది. ఇంత కాలం ఈ కథలను గుండెలలో మోసుకు తిరుగుతూ ఇక్బాల్ వీటిని మనకు అందించి బరువు దించుకుంటున్నాడు అని చెప్పలేం. ఇవి ఆయనను జీవిత కాలం వెంటాడే కథలు. ఈ కథలలోని పాత్రలు ఆయన లోపలి మనుషులు. నర్సిం, జానీ, జాఫర్ సాబ్ ఎవరి ప్రత్యేకతలు వారివి. ముగ్గురూ విశిష్టులే.
ఇక్బాల్ తన తొలి కథల సంపుటిలో బీజా అనే ఒక విద్యార్థి కథ రాశాడు. బీజా ప్రధాన పాత్ర గనుక ఆ చిన్నారి హృదయాన్ని గాయపరిచే చిన్నపాటి పదాన్ని, వాక్యాన్ని, భావాన్ని, శరీర భాషను వ్యతిరేకిస్తూ తాను బీజా అయినట్టు అలాంటి వ్యక్తీకరణ ఉండే ఎవరైనా, తోటి ఉపాధ్యాయులే అయినా తనకు ప్రత్యర్థులే అన్నట్టు ఆ కథ రాశాడు. ఆ కథలోని కఠినమైన సన్నివేశాలు మనం తట్టుకోవడం కష్టమవుతుంది. నర్సిం కూడా అలాంటి కథే. ఆ కథ మీరెలాగూ చదువుతారు కానీ నర్సిం, అతని తల్లి ఎంత మంచి వాళ్ళు. నర్సిం ఎంత తల్లి చాటు పిల్లవాడు ఇక్బాల్‌తో ఎంత స్నేహంగా ఉన్నాడు. నర్సిం తండ్రి హెచఐవితో పోయాడట. నర్సింకు కూడా హెచఐవి కావచ్చునని పిల్లలు మాట్లాడిన మాటలు ఆ తల్లీబిడ్డలను తీవ్రంగా క్షోభపెట్టాయి. ఆ రాత్రే వాళ్లు ఊరొదిలిపోయారు. చురుకుదనం
ఉరకలెత్తే నర్సిం కూడా బీజాలాంటి పిల్లవాడే. ఈ కథలోని సన్నివేశాలు మనని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వాళ్ళు ఊరొదిలి పోవడం తట్టుకోలేక మనసు పదే పదే వాళ్ళని పలవరిస్తుంది.
జానీ ఇక్బాల్‌కి స్వయాన పెద్దమ్మ బిడ్డ కొడుకు మేన అల్లుడి వంటివాడు. చిన్నప్పటి నుండి కన్నమ్మ కష్టాలు పడుతూ కూడా బంధుత్వమే కాక ఇక్బాల్‌తో స్నేహమÖ పెంచుకున్నాడు. మహబూబునగర్ వలస కూలీలలో ఒకడుగా ముంబాయి నగరానికి నిర్మాణ కూలీ అయ్యాడు. ఆ మహానగరంలో దుర్మరణం పాలయ్యాడు. ఆకాశాన్ని తాకుతూ ఉండే, ముంబాయి మహా భవనాలలో ఏ భవనానికి తాకుతుంది. కొల్లాపురం జానీని కౌగలించుకునేది. ముంబాయికి ఏం ప్రేమ. ముంబాయి శ్మశాన వాటికలలో ఒక శవం మీద మరో శవం, దాని మీద మరో శవం పూడ్చుతారట. అక్కడ దుర్మరణం పాలైన వారి శరీరాలు ఏ శవం మీద పాతి పెట్టారో ఎవరికి తెలుస్తుంది. శ్రమ దోపిడీ విశృంఖలమైన కాలంలో వలస కూలీల చెమటకు, నెత్తురుకు బాధపడేదెవరు? కరిగిపోయేదీ ఎవరు? మనుగడ స్థానికం అయితే తప్ప మానవ సంబంధాల మానవీయ నిర్మాణం కుదరదు. పెట్టుబడి ఒప్పుకుంటుందా రాజ్యం ఆలోచిస్తుందా.
జాఫర్‌సాబ్ పేద ముస్లిం పిల్లలున్నవాడు. ఉత్తముడు. అందరితో కలివిడిగా ఉండేవాడు. ఇక్బాల్‌తో స్నేహం చేసేవాడు. స్థానిక ప్రజల, పెత్తందార్ల శక్తియుక్తులు సంపద మర్మం తెలిసినవాడు. భూసంస్కరణల సమయాన ఊరి భూస్వామికి అంది వచ్చి దొర మొనగాడు అనుకున్నవాడు. అందరితో అన్నవాడు. ఎండాకాలం ఒక రాత్రి నిద్ర సమయాన గుడిసెలో, గుడిసెతో పాటు కాలిపోయాడు. అది ప్రమాదం కాదు. కావాలని చేసింది. ఎవరు చేశారో అందరికీ తెలిసినా ఎవరూ మాట్లాడరు. జాఫర్‌సాబ్ కుటుంబం ఎంత పేదకుటుంబం అంటే ఊర్లో జాతర జరిగితే ఆ మూడు రోజులు తిండి దొరుకుతుందని కుదుట పడే కుటుంబం. అలాంటి కుటుంబపు పెద్ద దిక్కు కాలిపోయాడు. జాఫర్ సాబ్ మరణంతో కుల మత భేదాలు లేకుండా ఆ వీధులలో నిర్మాణమయ్యే మానవ సంబంధాలు కూడా గాయపడ్డాయి.
బీజా, నర్సిం, జానీ చిన్న పిల్లలు కదా. వాళ్ళు సమాజపు సంపద కదా. వాళ్ళను సాదవలసిన, వాళ్ళ ఆసక్తుల వెలుగులో వాళ్ళలో వికాసం సాధించవలసిన బాధ్యత సమాజానిది కదా. మరి బీజా, నర్సిం, జానీల బతుకులు ఎంతగా చెదిరి విధ్వంసమయ్యాయి. ఈ వ్యవస్థకు ఆలోచించవలసిన బాధ్యత లేదా.
ఈ కథలు మన సమాజపు నడుస్తున్న చరిత్ర. ఈ కథల కాలం ఇక్బాల్ జీవితపు ఆరు పదుల కాలం. ఆయన బాల్య జ్ఞాపకాలతో మొదలై ఈ రెండు వేల ఇరవై అయిదు దాకా తన జీవిత కాలంలో నడుస్తున్న చరిత్ర. ఈ కథలు పట్టు సడలని అనాగరిక భూస్వామ్య సంబంధాల క్రౌర్యాన్ని చూపుతున్నాయి. అభివృద్ధి పేరుతో అమలు జరుగుతున్న విధానాలు ఆ అభివృద్ధి కోసం తమ సర్వం త్యాగం చేసిన పేద, మధ్య తరగతి ప్రజల నిర్వాసిత్వాన్ని చూపుతున్నాయి. ఇంతా చేసి నీరివ్వని పాలకుల దుర్మార్గాన్ని చూపుతున్నాయి. పెట్టుబడికి, పార్టీలకు దిగువ స్థాయి దాకా వాటి నాయకత్వాలకు నడుమ అక్రమ సంబంధాలను, పెరుగుతున్న లంకెను చూపుతున్నాయి. పోలీసులు, కోర్టులు, చట్టసభలు విధాన రచనలో అమలులో ఐక్యతతో ప్రజలను ఒంటరి చేస్తున్న వైనాన్ని చూపుతున్నాయి. నడిగడ్డలో, కృష్ణా తీరంలో ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పు రాలేదని, స్వాభిమానంతో గౌరవంతో ఆధునిక సౌకర్యాలతో జీవించే పరిస్థితులు అసలే రాలేదని చూపుతున్నాయి. దీనికి ప్రతిగా ప్రత్యర్థులు సంస్థ ఆధారంతో వ్యవస్థ దన్నుతో బలంగా నిలబడుతున్న దృశ్యం కనిపిస్తున్నది. ఎంతో కొంత సంఘర్షణాత్మక చలనమÖ కనిపిస్తున్నది. తీవ్ర వెనుకబాటుతనంతో, పేదరికంతో బిడ్డలు విద్యారంగం నుంచి నిష్క్రమిస్తున్న బాధాకరమైన వాస్తవం కలచివేస్తున్నది.
ఇక్బాల్ ప్రధానంగా సంచరించిన కొల్లాపూర్, గద్వాల ఆలంపూర్ ప్రాంతాలు సంస్థాన రాజ్యప్రాంతాలు. ఇక్కడి వెనుకబాటుతనానికి, పేదరికానికి అవిద్యకు మÖలాలు ఈ రాజ్యాల దోపిడీ పీడనలలో ఉన్నాయి కొనసాగుతున్న గతం గతకాలపు పరిస్థితులు ఇక్బాల్ కథలలో వ్యక్తమైనాయి. ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగి తెలంగాణ వైతాళికుడుగా సుప్రసిద్ధుడైన సురవరం ప్రతాపరెడ్డి గారి సాహిత్యం, రాయలసీమ ప్రాంతంలో పుట్టి నడిగడ్డ జన జీవితంలోకి అలంపురంలో స్థిరపడి విశేష కృషి చేసిన గడియారం రామకృష్ణ శర్మగారి సాహిత్యం తరువాత కృష్ణా తీర మహబూబునగర్ పేద ప్రజల జీవన పరిస్థితులు కథా సాహిత్యంలో తెలుసుకోవాలంటే ఎనభైల తరువాత వచ్చిన కథా సాహిత్యమే ఎక్కువ ఆధారమవుతుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో మహబూబునగర్ పరిస్థితుల పట్ల ఆసక్తి పెంచుకుని పోలేపల్లి సెజ్ ఉద్యమంలో క్రియాశీలంగా కృషి చేస్తు, వలసలకు స్పందించి ప్రత్యేక శ్రద్ధతో గీతాంజలి రాసిన ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ ప్రత్యేకంగానే ప్రస్తావించవలసిన పుస్తకం. అలాగే విరసం ప్రచురించిన హైమావతి కథలు ‘జోలె విలువ’ వలస జీవన, అట్టడుగు బతుకు చిత్రమే.
మహబూబునగర్ కరువు, వలసల నివారణ, జల సాధన ఉద్యమాలలో భాగమవుతూ ఉదయమిత్ర ‘అమ్మను జూడాలి’, ‘ఆఖరి కుందేలు’, ‘దోసెడు పల్లీలు’ మార్క వెంకట్రాములు జంగిడి, మడుమనుకల నారాయణ ‘ఎర్రదుక్కి’, నాగేశ్వరాచారి అనంతపూర్‌లో వృత్తి జీవితం గడిపినా స్థానికుడుగా తన బాల్యపు తొలియవ్వన కాలపు జ్ఞాపకాలతో రాసిన గద్వాల్జాతర, కర్లకోట రవీంద్రనాథ్ నే తిరిగిన నేల, ఇక్బాల్ కఫన్ ఇప్పుడు ప్రచురిస్తున్న నల్లరేగళ్ళు చదివి చర్చించవలసిన పుస్తకాలు. ఇవేకాక ఏడో తరగతిలోనే చదువు వదిలేసి వలసలోనే తన జీవితమంతా గడిపి ఎనభై ఏండ్ల వయసు తరువాత నర్సన్న గారు తన ‘వలస బతుకు’ పుస్తకం రాశారు. బహుశా తెలంగాణ రాష్టంలో వలస కూలీల మీద రచనలు వచ్చాయి. గానీ వలస కూలీయే రాసిన పుస్తకం ఇదే మొదటిది కావచ్చును. జిల్లా నుండి వెలువడిన ఈ పుస్తకాలన్నీ పాలమూరు ప్రచురణలుగా పాలమూరు అధ్యయన వేదిక ప్రచురించింది. ఈ సాహిత్యాన్నంతా ఎందుకు కృష్ణాతీర జీవితం నిర్జల జీవితంగా ఉంది. ఏ కారణాలు ఈ జీవితాలని ఇలా బలివితర్థి మీద నిలబెట్టాయి అనే ప్రశ్నలలోంచి చదవాలి. ఆయా రచయితల పరిశీలనలలోంచి చదవాలి.
తిరిగి ఇక్బాల్ కథలలోకి కథనంలోకి వస్తే ఇక్బాల్ ప్రాథమికంగా కవి. అలతి అలతి పదాలు పేర్చుకుంటూ మహా మహా వాక్యాలు నిర్మిస్తూపోతాడు. ఆయనకు దుఃఖం కలిగించేవి, కోపం తెప్పించేవి, బాధపెట్టేవి చిన్నవీ పెద్దవీ అన్ని విషయాలు వ్యవస్థ మీదికి విసరదలచుకున్న సవాళ్ళు అన్ని కవిత్వంగా వ్యక్తమవుతాయి. ఇక్బాల్ కథనంలో, కథా వాక్యంలో కవిత్వం ప్రవహిస్తుంది. ఒక్కోసారి కథకుడిని కవి డామినేట్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. కథ చిక్కగా కూడా అనిపిస్తుంది. అయితే సంభాషణలకు దెబ్బ తగులుతుందా ఆలోచించాలి. చదువుకోవడంలో సరళతకు విఘాతం కలుగుతుందా కూడా ఆలోచించాలి. ఇక్బాల్ కథల ప్రధాన లక్ష్యం ఛిద్రమవుతున్న ప్రజా జీవితాన్ని వ్యవస్థ ముందు, భద్రజీవుల ముందు సవాలుగా నిలెబట్టడం. ఇక్బాల్ కథలను కథా సాహిత్య సౌందర్యంలోంచి కాకుండా ప్రస్ఫుటంగా ఎత్తిపట్టిన ఆయన లక్ష్యంలోంచి అర్థం చేసుకోవాలి. ఇవి బాధలకు పుట్టిన కథలు ఇక్బాల్ వాక్యం పీడితుల వైపు నించి పీడితులను వ్యవస్థను నిరంతరం అనుమానిస్తూ, ప్రశ్నిస్తూ నిర్మాణమైన వాక్యం. తన లక్ష్య సాధనలో ఇక్బాల్ ఫలప్రదమయ్యాడు.
మారని జీవని పరిస్థితులలో అట్లా కట్టిపడేసినట్టుగా ఉంచడం ఎంతటి మొనగాడి పాలకుల వల్ల కూడా సాధ్యం కాదు. సమాజం చలనంలో ఉంటుంది క్రమంగా మారుతుంది అని ఇక్బాల్ నల్లరేగళ్ళు కూడా నిరూపిస్తున్నది.
తేది : 17.04.2026