ఇంగ్లిష్ : మౌమితా ఆలం
అనువాదం : గీతాంజలి
- రేపు నిన్ను ఎవరో ఒకరు రేప్ చేస్తారు చూడు
అవును
రేపు నిన్ను ఎవరో ఒకళ్ళు రేప్ చేస్తారు
అప్పుడెవరూ పట్టించుకోరు
కానీ వాళ్ళు నిందలు వేస్తూ మాట్లాడతారు
‘‘నువ్వు ఒక దళితురాలివి
అపవిత్రురాలివి
అంటరానిదానివి
నిన్ను ఎవరైనా ఎందుకు రేప్ చేస్తారు చెప్పు?’’ అంటూ ఈసడిస్తారు.
**
అవును
రేపు నిన్ను ఎవరో ఒకరు రేప్ చేస్తారు
అది కనీసం రేప్ గా కూడా పిలవబడదు
వాళ్లు వాళ్లకు చెందిన వ్యాఖ్యానాలు చేస్తారు
నువ్వు ఎద్దుమాంసం తినే ఆడదానివి
ఈ దేశంలో నిన్నెవరు రేప్ చేస్తారు చెప్పు అంటారు
ఈ నా కొడుకులందరూ కూడా శాఖాహారులాయే మరి
‘‘నేను రేప్ చేసినట్టు నిరూపించుకోగలవా?’’ అంటూ సవాలు విసురుతారు.
నువ్వు నిరూపించే లోపల చచ్చే పోతావ్
**
అవును
రేపు ఎవరో ఒకరు నిన్ను రేప్ చేస్తారు
అప్పుడు వాళ్లు
‘‘నువ్వు అడవుల్లో ఉండే దానివిఆదివాసివి! నువ్వు టెర్రరిస్ట్ వి’’ అంటూ
నీ యోనిని రెండుగా చీల్చడానికి
ప్రత్యేకమైన అధికార చట్టాన్ని నీకు చూపిస్తారు
నీ యోని దేశానికే పెద్ద ప్రమాదకారి అంటారు వాళ్ళు
**
రేపు ఎవరో ఒకళ్ళు నిన్ను రేప్ చేస్తారు
నీకు అది రేప్ అని కూడా తెలియదు!
ఎందుకంటే మొగుడికి రేప్ చేసే అధికారం ఉందని
వాళ్ళు నీకు నూరిపోస్తారు
అచ్చం బస్సు డ్రైవర్ కి బస్సు మీద అధికారం ఉన్నట్టన్నమాట
లేకపోతే మత గురువు జల్సాలలో అరుస్తాడు
‘‘స్త్రీగా నువ్వు ఒక పొలం లాంటి దానివి’’ అని,
‘‘నీ మొగుడేమో ఒక నాగలి లాంటి వాడని’’ అంటాడు
తనకి ఇష్టం వచ్చినట్టు నిన్ను దున్నుకునే హక్కు
నీ మొగుడికి ఉంటుందని మత గురువు బోధిస్తాడు
ఎన్ని సార్లైనా ఎన్ని పద్ధతుల్లోనైనా
దీన్ని నిర్ణయించే హక్కుఅతనికే ఉంది మరి
**
రేపు
ఎవరైనా నిన్ను రేప్ చేస్తారు
కానీ దానికి కూడా నిన్నే నిందిస్తారు
నువ్వు వేసుకున్న బట్టలు కావచ్చు, నీ తొడలు కావచ్చు
నీ రొమ్ములు కావచ్చు, నీ మెడ కావచ్చు
నీ నవ్వు, నడుము కావచ్చు, నీ చేతులు, కాళ్లు కావచ్చు
నీ చెప్పులు లాగా అది ఏదైనా కావచ్చు
వాడు రేప్ చేయడానికి మాత్రం నువ్వే కారణం
**
ఒక మగవాడు
తనను తాను ఇదంతా చూస్తూ
ఎలా నియంత్రించుకోగలడు చెప్పు?
రక్తం మాంసాలున్న మగవాళ్ళు మరి
అన్నిటికి మించి శక్తివంతమైన పురుషాంగం ఉన్నవాళ్లు
**
(*డ్రైవర్ బస్ : మాకు కమ్యూనిటీలో ఇది చాలా మామూలు డైలాగు. ఆడది బస్సు లాంటిది మగవాడు బస్సు నడిపే డ్రైవర్ లాంటి వాడు. అతడు ఎలా అంటే అలాగా బస్సు ని ఆడదాన్ని నడపగల అధికారం ఉన్నవాడు అని.
*ఇస్లామిక్ మత జల్సాలలో భార్య పొలం లాంటిదని, మగవాడు దాన్ని ఎలాగైనా దున్నుకోవచ్చని చెప్పబడుతుంది.)
2. ఒక రేప్ బాధితురాలి జ్ఞాపకాలు
**
ఆర్పేసిన ట్యూబ్ లైట్ కాంతి చుట్టూరా
చచ్చిపోయిన చిన్న ఈగలను
మింగుతున్న బల్లి నీడలో
ఆమె బాల్యం బంధించబడింది
ఆమె పాపం ట్యూబ్ లైట్ నే
సూర్యుడిగా పొరబడింది
**
ఆమె యవ్వన కాలపు జ్ఞాపకాలలో
ఒక నిస్సహాయమైన ఈగ లైట్ చుట్టూ
ఎప్పుడూ ఎగరడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది
కానీ ప్రతిసారి ఓడిపోతూనే ఉండేది
ఆఖరికి ఆ ఈగ
లైట్ గ్లాస్ జార్ కింద చనిపోయి కనిపించేది
దాన్ని ఆమె తన బొమ్మరిల్లులో పెట్టుకునేది
**
అకస్మాత్తుగా ఆమె రజస్వల అయి
చీకటి గదిలో పెరగడం మొదలు అయింది
అది కూడా మందులో ముంచిన
దూది ఉండలను
తన తొడల మధ్య పెట్టుకొని…
3. “ఒరేయ్… రేప్ నవ్వులాట కాదురా”
అవునురా…
నేల మీద నిస్సహాయంగా పడిపోయి,
నీ క్రూరమైన మదపు పంజాలు
రెండు తొడల మధ్య చేరుకోక ముందే,
మొఖాన్ని, భుజాలని, రొమ్ములని, కడుపుని చీల్చేయడం ఉంది చూడూ
అది ఎంత ఆనందాన్నిస్తుందనుకున్నావూ?
**
అవునురా ఎం.ఎల్. ఏ మృగమా…
దృఢమైన మగ జంతువు కోరల పట్టు
తొడల మధ్యని గాయం చేస్తూ
మాంసపు ముక్కని తవ్వి తీయడం
ఎంత సంతుష్టిని ఇస్తుందనుకున్నావు మరి?
**
అవును
నువ్వు వికృతంగా నవ్వుతూ చెప్పింది నిజమేరా
యోని పొరలను నిలువునా చీలుస్తున్నప్పుడు
కాళ్ళ మధ్య స్రవించే వెచ్చని రక్తం
భయంతో మూర్ఛనలు పోతున్న స్త్రీలకి
నొప్పి కాకుండా
మెల్లని సుఖమైన మైకాన్ని కలిగిస్తుందిరా
**
అవునురా శాసన సభ్యుడా…
గుర్తు తెలియని పొదల్లో, మురికి నాలాల వెంబడి
నువ్వన్నట్లు పడుకోవడం, పురుగులతో కుళ్ళ బొడిపించుకోవడం
ఒరేయ్…
చాలా ఆనందాన్నిస్తుందిరా…
నిజంగా ఈ కుళ్ళు మాటలు అన్న
అసెంబ్లీ గోడలలో, హిహి, హాహా, హోహో అనే
వికృతమైన నవ్వులు ప్రతిధ్వనించే ఉంటాయి.
- (కర్ణాటక అసెంబ్లీ లో ఒక ఎమ్మెల్యే ‘‘లైంగిక అత్యాచారం, లేదా రేప్ ఎదుర్కోలేని స్త్రీలు గమ్మున లొంగిపోయి రేప్ ని ఆనందించాలి’’ అని చేసిన వికృత వ్యాఖ్యానానికి నిరసనగా….)