“ఫర్హా” – పాలస్తీనియన్ చిత్రం

“ఫర్హా” అనే పాలస్తీనియన్ చిత్రం అంతర్జాతీయంగా జోర్డాన్, స్వీడన్, సౌదీ అరేబియా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో అరబిక్, ఇంగ్లీష్, హిబ్రూ భాషలలో, 1921 లో నిర్మించారు. ఈ చారిత్రక డ్రామా చిత్రానికి దర్శకురాలు డారిన్ జె. సల్లామ్ (Darin J. Sallam). ఆమె దీనికి స్క్రిప్ట్ రచయితగా కూడా వ్యవహరించారు. ఈ సినిమా నిడివి 92 నిమిషాలు.

ఇతివృత్తం:

ఈ చిత్రం 1948 నక్బా సమయంలో ఇజ్రాయేలీయుల దురాక్రమణతో, పాలస్తీనియన్లు తమ మాతృభూమి నుండి స్థానభ్రంశం చెందినప్పుడు ఒక కుటుంబం మొత్తాన్నీ పిల్లా, పాపలతో సహా మెషీన్ గన్నులను గురి పెట్టి ఇజ్రాయేలీ సైనికులు చేసిన హత్యలను, చివరికి అప్పుడే పుట్టిన శిశువుని సైతం చంపిన వైనాన్ని, ఫర్హా అనే ఒక 14 సంవత్సరాల పాలస్తీనియన్ బాలిక ఒక సన్నని రంధ్రం ద్వారా తాను చూసిన భయంకరమైన అనుభవాన్ని వర్ణిస్తుంది!

చిత్ర కథలోకి వెళ్తే అబు ఫర్హా అనే గ్రామాధికారికి ఫర్హా అనే కుమార్తె ఉంటుంది. అతను ఆ గ్రామానికి మేయర్ గా కూడా పనిచేస్తుంటాడు. ఆమెకు ఫరీదా అనే ఒక ప్రాణ స్నేహితురాలు ఉంటుంది. ఆమె నగరంలో విద్యను అభ్యసిస్తూ ఉంటుంది. ఒకసారి ఫరీదా, కుటుంబ సమేతంగా తన స్నేహితురాలు ఫర్హా ఉంటున్న గ్రామానికి వస్తుంది. అమ్మాయిల బృందమంతా తమ స్నేహితురాలి వివాహ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న సమయంలో ఫర్హా మాత్రం వాటిపట్ల ఏమాత్రం ఆసక్తి లేకుండా నగరానికి వెళ్ళి ఫరీదా లాగా చదువుకోవాలనే తన కోరికను బలంగా వ్యక్తం చేస్తుంది. కానీ ఆమె తండ్రి అబు ఫర్హా మాత్రం ఫర్హాకు వివాహం చేయాలనే అభిప్రాయంతో ఆమెను నగరానికి పంపడానికి నిరాకరిస్తాడు. ఫర్హా మామ అబు వాలిద్ ఆధునిక భావాలతో ఆమె కోరికను అర్ధం చేసుకుని, నగరానికి పంపి చదివించమని సిఫార్స్ చేస్తాడు.

1948లో ఒక రాత్రి, స్థానిక పాలస్తీనా బృందం అబు ఫర్హాను సందర్శించి, నక్బాకు వ్యతిరేకంగా తమ పోరాటంలో భాగం కావాలని అభ్యర్థిస్తుంది. తన గ్రామాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే తన ప్రధాన ఉద్దేశ్యం కాబట్టి అతను మిలటరీలో చేరలేనని చెప్తాడు.

చదువుకుంటానని పట్టుబడుతున్న తన కుమార్తె ఫర్హా అభ్యర్థనను అబు ఫర్హా చివరికి అంగీకరిస్తాడు. స్నేహితురాలు ఫరీదాతో కలిసి ఆ సంతోష సమయాన్ని పంచుకుంటున్న సందర్భంలో జియోనిస్ట్ సైనికులు గ్రామంపై దాడి చేస్తారు. వాళ్ళు గ్రామస్తులను ఖాళీ చేయమని ఆదేశిస్తారు. ఫరీదా తండ్రి అబు ఫరీదా ఫర్హా, ఫరీదాలను అక్కడనుంచి తప్పించడానికి తన కారులో కూర్చోబెడతాడు. అబూ ఫర్హా గ్రామంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుని, ఫర్హాను చూసుకునే బాధ్యతను అబూ ఫరీదాకు అప్పచెబుతాడు. కానీ ఫర్హా మాత్రం ఆ ప్రమాదకరమైన సమయంలో తన తండ్రిని వదిలి వెళ్లడానికి ససేమిరా ఒప్పుకోదు. తండ్రితోనే ఉండాలని నిశ్చయించుకుంటుంది. ఫర్హాను, అబూ ఫర్హా తిరిగి ఇంటికి తీసుకువస్తాడు. అతను ఒక రైఫిల్ తీసుకుని ప్రతిఘటనకు సన్నద్ధమై బయటికి వెళ్తూ, ఫర్హాను ఒక గదిలో బంధిస్తాడు. ఆమెను అక్కడే దాక్కుని ఉండమని చెప్పి, పరిస్థితి సురక్షితంగా మారగానే వచ్చి తనతో ఆమెను తీసుకువెళతానని మాటిస్తాడు. రోజుల తరబడి ఫర్హా తన తండ్రి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. భయంకరమైన యుద్ధ శబ్దాలను వింటూ క్షణమొక యుగంగా గడుపుతూ ఉంటుంది. తన జీవితాన్ని పూర్తిగా మార్చి వేసే అనుభవాన్ని పొందుతుంది. ఇరుకైన చీకటి గదిలో బందీ అయినప్పుడు, బాహ్య ప్రపంచంతో ఫర్హాకు ఉన్న ఒకే ఒక వెసులుబాటు ఏమిటంటే ఇంటి పెరటి వైపు గోడలో ఒక చిన్న రంధ్రం, చెక్క తలుపుకి ఉన్న కొన్ని పగుళ్ళగుండా మాత్రమే ఆమె బయటకు చూడగలుగుతుంది. అలా ఆమె గది లోపల ఆకలిని, ఒంటరితనాన్ని తట్టుకుంటూ గది వెలుపల జరిగిన చాలా క్రూరమైన సంఘటనలను చూస్తుంది!

ఒక పాలస్తీనా కుటుంబం అబూ మొహమ్మద్, అతని భార్య ఉమ్ మొహమ్మద్ వారి ఇద్దరు చిన్న పిల్లల్ని తమ ఇంటి ముందుకు రావడాన్ని ఫర్హా చూస్తుంది. అక్కడ ఆ తల్లి నిండు గర్భవతిగా ప్రసవ వేదనని పంటి బిగువున భరిస్తూ ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఫర్హా కేక వేసి తనను బయటకు రానివ్వమని అబూ ముహమ్మద్‌ను కోరుతుంది. కానీ అతను ఆమె కోసం ప్రయత్నించకముందే, హగానా మిలీషియా బృందం (1948 లో ఇజ్రాయేల్ రాజ్యం స్థాపించకముందు బ్రిటిష్ పాలనలో ఉన్న పాలస్తీనా ప్రాంతంలో, యూదులకోసం పనిచేసిన ఒక ప్రధాన జియోనిస్ట్ పారామిలిటరీ సంస్థ) ఆ కుటుంబాన్ని బయటకు వచ్చి లొంగిపోవాలని డిమాండ్ చేస్తాయి. అబు మహమ్మద్ బయటకు వెళ్తాడు. హగానా మిలీషియా కోసం పనిచేస్తున్న, ముసుగు ధరించిన ఒక పాలస్తీనా గూఢచారికి అబు మహమ్మద్ తనకు తెలిసిన వేరే గ్రామస్థుడని తెలుస్తుంది. అందువల్ల అతను ఈ గ్రామానికి చెందినవాడు కాడని కమాండర్‌కు చెబుతాడు. కమాండర్ అక్కడున్న రక్తం చూసి అనుమానంతో ఇంటిని సోదా చేస్తుండగా మహమ్మద్ కుటుంబం దాక్కుని ఉండటాన్ని చూస్తాడు. అప్పుడే పుట్టిన నవజాత శిశువు తప్ప, ఇద్దరు చిన్నారులతో సహా, మహిళను కూడా తుపాకీతో బెదిరించి దారుణంగా హత్యలు చేస్తారు. తన సహకారానికి ప్రతిఫలంగా, స్త్రీలకు, పిల్లలకు ఎటువంటి హానీ జరగదని పాలస్తీనా గూఢచారికి ఏదైతే వాగ్దానం చేయబడిందో, దానికి వ్యతిరేకంగా హగానా మిలీషియా బృందం ఈ ఘోరమైన హత్యలు చేయడంతో తట్టుకోలేక సమాచారం అందించిన పాలస్తీనా వ్యక్తి నైతిక సంక్షోభంతో తల్లాడిల్లిపోతాడు!

అతను ఫర్హా దగ్గరికి వెళ్ళి ఆమెను ఫర్హా అంటూ గుసగుసగా పిలుస్తాడు. తలుపుసందులో నుంచి అతని ముఖం ఫర్హాకు క్షణకాలం కనిపిస్తుంది, దానితో ఆ సహకరించిన వ్యక్తి తన మామయ్యే అని ఆమె గ్రహిస్తుంది ఫర్హా. ఈసారి అతను ఫర్హా ఆచూకీని సైనికులకు చెప్పడు. ఒక్క తూటా కూడా వృధా చేయకుండా ఆ నవజాత శిశువును చంపమని కమాండర్ ఒక యువ సైనికుడిని ఆజ్ఞాపిస్తాడు. ఆ సైనికుడు పసికందుని తన బూటుకాలితో తొక్కలేక, నిస్సహాయంగా చూస్తూ, శిశువుని తన చేతి రుమాలుతో కప్పి, ఆ ఆవరణ నేలపై ఆకలితో చనిపోతాడనుకుని వదిలేస్తాడు!

పసివాడి ఏడుపు విని ఫర్హా బిడ్డ దగ్గరకు వెళ్ళాలని ఆత్రంగా తలుపు తెరవడానికి అష్ట కష్టాలు పడుతుంది. మొత్తం వంటగదిని ప్రతి అంగుళం వెతికిన తర్వాత, ఆమెకు దాచిపెట్టిన ఒక పిస్టల్ దొరుకుతుంది. దానితో ఆమె ఊపిరి బిగబట్టి, తలుపు తాళాన్ని పేల్చివేసి, పసిబిడ్డను చేరుకునేసరికి ఆ బిడ్డ ఏడుపు ఆగిపోతుంది. చనిపోయిన పసికందు మీద ఈగలు, కీటకాలు ముసురుతుంటాయి. భరింపరాని దుఃఖంతో ఆ గ్రామంనుండి సిరియా వైపుకి దారితీసి తప్పించుకుంటుంది. ఫర్హా తన తండ్రిని ఎప్పటికీ కలుసుకోలేకపోతుంది. అతని గతి ఏమైందో సినిమాలో మనకి తెలియదు. కానీ బహుశా నక్బా సమయంలో అతను హతమై ఉండవచ్చునని భావించవచ్చు. సినిమా భారంగా ముగుస్తుంది. ప్రేక్షకులు కూడా విషాదంలో కూరుకుపోతారు!

ఫర్హా చివరికి సిరియాకు చేరుకుని తన కథను చెప్తుంది, ఆ కథ తరతరాలుగా ఇప్పటికీ చెప్పబడుతూ వస్తోంది.

కథ యింతే, కానీ ప్రేక్షకులకు నక్బా గురించి, పాలస్తీనా జాతి హననాల గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది.

నక్బా గురించి:

నక్బా అంటే భయంకరమైన విపత్తు అని అర్ధం. ఈ పదాన్ని పాలస్తీనా మాండేటరీలో 1948 నాటి పాలస్తీనా యుద్ధ సంఘటనలను, అలాగే ఇజ్రాయేల్ పాలస్తీనియన్లపై చేసిన హింస, స్థానభ్రంశాన్ని వివరించడానికి ఉపయోగిస్తారు. పాలస్తీనా శరణార్థులు, వారి వారసులు స్వదేశానికి తిరిగి వచ్చే హక్కును దీర్ఘకాలంగా తిరస్కరించడాన్ని కూడా ఇది సూచిస్తుంది.

పాలస్తీనాలోని అరబ్బుల జాతి నిర్మూలనను, ఇజ్రాయేలీలు 1948 నుంచి మొదలుపెట్టి నేటి వరకు కొనసాగిస్తున్నారు. ఇది వాళ్ళను హింసాత్మకంగా స్థానభ్రంశం చేయడం, వారి భూమి, ఆస్తి, వస్తువులను బలవంతంగా లాక్కోవడం, వారి సమాజాన్ని నాశనం చేయడం, వారి సంస్కృతి, గుర్తింపు, రాజకీయ హక్కులతో పాటు జాతీయ ఆకాంక్షలను అణచివేయడం ద్వారా జరిగింది.

ఇజ్రాయెల్ రాజ్యంగా మారిన ప్రాంతంలోని జనాభాలోని 80% కంటే ఎక్కువ మంది 750,000 మంది పాలస్తీనియన్లని తమ ఇళ్ల నుండి తరిమేశారు. వారు పారిపోయి శరణార్థులుగా మారిపోయారు. పదకొండు అరబ్ పట్టణ ప్రాంతాలు, 500 కంటే ఎక్కువ గ్రామాలు జనావాసాలు లేకుండా ధ్వంసం చేశారు. సామూహిక హత్యలలో వేలాది మంది పాలస్తీనియన్లను హత్యలు చేశారు. వాళ్ళు భయపడి పారిపోయేలా చేయడానికి ఇజ్రాయెలీలు హింసను లక్ష్యంగా చేసుకున్నారు. నీటి బావులను విషపూరితం చేశారు. వాటితో పాటు గుసగుసల ప్రచారాలు, భీతిల్లే రేడియో ప్రసారాలు, వ్యాన్‌లలో లౌడ్ స్పీకర్ ప్రచారాలతో సహా మానసిక యుద్ధ వ్యూహాలను ఉపయోగించారు. ఇజ్రాయెల్ సైనికులు, పౌరులతో కలిసి పాలస్తీనియన్ల ఇళ్లు, వ్యాపారాలు, పొలాలు, కళాఖండాలు, పుస్తకాలు, ఆర్కైవ్‌లను సర్వస్వం దోచుకున్నారు.

మధ్యలో కొన్ని ఘర్షణలు చెలరేగినప్పటికీ ఇజ్రాయెల్ – అరబ్ దేశాల మధ్య పోరాటం 1948 శీతాకాలం నాటికి ముగిసింది. 1948 డిసెంబర్ 11న, పాలస్తీనియన్లను వారి ఇళ్లకు తిరిగి రావడానికి అనుమతించాలని, కోల్పోయిన ఆస్తికి పరిహారం చెల్లించాలని తీర్మానిస్తూ, ఐక్యరాజ్యసమితి ఒక సయోధ్య కమిషన్‌ను ఏర్పాటు చేసి 194 తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 1949 లో దాని మీద ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. అయినా 1949 నుండి ఈనాటి వరకు కూడా పాలస్తీనియన్ల జాతి హననం కొనసాగుతూనే ఉంది.

అక్టోబర్ 7, 2023న హమాస్ నేతృత్వంలో ఇజ్రాయేల్ పై జరిగిన ఆకస్మిక దాడికి ప్రతీకారంగా, గాజాపై విధ్వంసం జరిగిందని కొంతమంది భావిస్తారు. కానీ ఇజ్రాయేల్, పాలస్తీనా ప్రజలపై నిర్విరామంగా జరుపుతున్న విచక్షణారహిత ఉపద్రవాలకు వ్యతిరేకంగా స్పందించిన ఒక ధోరణికి పరాకాష్టగా దాన్ని మనం భావించాలి!

1948 నాటి నక్బా కన్నా ఇప్పుడు ఎంతో తీవ్రమైన మారణ కాండలను, అమెరికా, పశ్చిమ దేశాల మద్దతుతో ఒక ఆదునిక సైనిక-పారిశ్రామిక రాజ్యమైన ఇజ్రాయేల్ యుద్దాన్ని సాగిస్తుంది. అప్పటికీ, ఇప్పటికీ హింస భయంకరమైన సునామీ లాగా ఎన్నోరెట్లు పెరిగిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్‌లో ప్రతిచోటా “వాళ్ళను అంతమొందించండి” (Finish them off) అని చెప్పే బంపర్ స్టిక్కర్లు దర్శనమిస్తాయి. రెండున్నర మిలియన్ల మంది ప్రజల్ని హతమార్చారు. 13,000 మంది చిన్నారుల్ని నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా చంపేశారు. ఈ హత్యలు గణితశాస్త్రపరంగా చూస్తే అవి మారణహోమ శాతానికి మించిపోయినవి.

ఒకవైపు నిరాయుధులైన పాలస్తీనా ప్రజలు – ఇంకో వైపు అపారమైన శక్తిసామర్ధ్యాలున్న ఆధునిక సైనిక, పారిశ్రామిక రాజ్యమైన ఇజ్రాయేల్. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆయుధాల అమ్మకాలు- కొనుగోళ్ళ కోసం అమెరికా, కొన్ని పశ్చిమ దేశాలకు ఈ దాడులను నిరోధించకుండా ఉండడంలో వాళ్ళ స్వార్ధపూరితమైన ప్రయోజనాలున్నాయి. వాళ్ళకి పాలస్తీనా, గాజాలలో ప్రజలు చనిపోవాల్సిన అవసరం ఉంది! ప్రఖ్యాత రాజకీయ శాస్త్రవేత్త గిల్బర్ట్ అచ్కార్ (Gilbert Achcar) దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అమానుష దాడులు మొత్తం పాలస్తీనా ప్రాంతాన్నే గాక విస్తృత ప్రపంచాన్నిఅస్థిరపరుస్తున్నాయని అన్నారు!

“ఫర్హా” చిత్ర ప్రాముఖ్యతలు:

“ఫర్హా” చిత్రం కేవలం దాని సాంకేతిక నైపుణ్యానికే కాకుండా, స్ఫూర్తి దాయకమైన ఇతివృత్తంతో పాటు, సామాజిక వ్యాఖ్యానానికి కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ స్క్రీన్‌ప్లే క్లిష్టమైన సమస్యలను సున్నితంగా పరిశీలిస్తూ, సహానుభూతి ఆలోచనలను ప్రేరేపిస్తుంది.

1948లో ఇజ్రాయెల్ ఆవిర్భావం వెనుక ఉన్న హింసను చిత్రీకరిస్తున్న ఈ నెట్‌ఫ్లిక్స్ చిత్రాన్ని రద్దు చేయడానికి ఇజ్రాయెల్, వారి మద్దతుదారులు చాలా ప్రయత్నించారు. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి అవిగ్‌డోర్ లైబెర్‌మాన్ నెట్‌ఫ్లిక్స్ నిర్మాణాన్ని ప్రసారం చేసినందుకు విరుచుకు పడ్డారు. “భవిష్యత్తులో ఈ షాకింగ్ చిత్రం, ఇలాంటి ఇతర ప్రదర్శనలను నిరోధించే లక్ష్యంతో” అల్ సరయా థియేటర్‌కు రాష్ట్ర నిధులను రద్దు చేయాలని ట్రెజరీని ఆదేశించాడు. సాంస్కృతిక మంత్రి హిలి ట్రోపర్ “అవమానకరం” అన్నాడు.

ఇజ్రాయెల్ సైనికులు పాలస్తీనా కుటుంబాన్ని చంపడాన్ని చిత్రీకరించే సన్నివేశంపై ఇజ్రాయెల్ తన ప్రతిస్పందనను కేంద్రీకరించింది. డారిన్ సల్లామ్ ఈ విమర్శలకు ప్రతిస్పందిస్తూ, తర్వాత జరుగిన ఊచకోతలతో పోలిస్తే అది చాలా చిన్న సంఘటన అని అన్నందుకు, నాపూర్వీకులకు జరిగిన నష్టాన్ని చిత్రీకరించాను అని అన్నందుకు ఆమె “ద్వేషపూరిత, జాత్యహంకార సందేశాలకు” గురయ్యానని పేర్కొంది. దీన్ని ఎందుకు దృశ్యీకరిచారో డారిన్ సల్లామ్‌ను విచారించి, చిత్ర నటి కరం తాహెర్ తో మాట్లాడిన తర్వాత 2022 డిసెంబర్ ఒకటిన నెట్‌ఫ్లిక్స్ విడుదల చేయడంతో ఇజ్రాయెల్ ప్రయత్నాలు విఫలమయ్యాయి.

డారిన్ సల్లామ్ ఒక ఇంటర్వ్యూలో “జోర్డాన్ లో ఈ చిత్రాన్ని దృశ్యీకరిస్తున్నప్పుడు కొంతమంది షూటింగ్ మానిటర్ వెనుక ఏడుస్తున్నారు. వారు వారి కుటుంబాల వారి కథలను, వారి తాతా మామల నుండి విన్న కథలను గుర్తుచేసుకున్నారు” అని చెప్పింది.

ఒక ఇరుకు గది లోపల రోజుల తరబడి ఆకలికీ, దాహానికీ ఫర్హా నరక యాతనల్ని అనుభవించడం చూపిస్తూ, ఆ సమాజంలో జరిగే ఎన్నో విషయాలను పొరలు పొరలుగా విప్పుతుంది ఈ సినిమా!

డారిన్ సల్లామ్ దర్శకత్వ ప్రతిభ:

డారిన్ సల్లామ్ తన బాల్యంలో వాళ్ళమ్మ చెప్పిన రద్దియా (Raddiyah) అనే ఒక అమ్మాయి గురించిన నిజ జీవిత కథ ఆధారంగా స్క్రీన్‌ప్లేను రూపొందించుకుంది. ఫర్హా తన బాల్యాన్ని వదిలి, చేసిన పరివర్తన ప్రయాణాన్నితీర్చిదిద్దడంలోదర్శకురాలు నూటికి నూరుపాళ్ళూ సఫలీకృతురాలైంది.

ఫర్హా పాప మన ఇళ్ళల్లో ఉండే యుక్తవయసు కొస్తున్న అమ్మాయిలాగా పాలస్తీనా గ్రామ సీమల సాంప్రదాయక అలంకరణతో, ఆ దుస్తుల్లో ప్రారంభ సన్నివేశాల్లో మురిపించే అందంతో మెరిసిపోతుంది. చదువుకోసం కలలు కంటుంది. అతి త్వరలోనే ఆ కలలు కల్లలవడాన్ని అద్భుతంగా చిత్రీకరించి చూపించింది డారిన్ సల్లామ్. ఇజ్రాయేల్ గురించిన ఘాతుకాలు ఇప్పుడు మనం తెలుసు కుంటున్నాం గనుక ఈ సినిమాలో ఫర్హాను చూసి కలవరపడతాం.

పెద్దయ్యాక ఒక స్కూలు పెట్టి పిల్లలకు చదువు చెప్పాలని కలలు కనే చిన్నపిల్లగా మొదట్లో మనం చూసిన ఫర్హాకి చివరి సీన్ లో విషాదాన్ని మోసే ఫర్హాకి అసలు పోలికే ఉండదు. మంచి సినిమా లక్షణం పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనే తిరిగి చేరుకోలేని స్థితిని, ప్రేక్షకులలో గొప్ప భావోద్వేగాల్ని సృష్టించే చివరి సన్నివేశాన్ని డారిన్ సల్లామ్ అద్భుతంగా చిత్రీకరించింది.

అభం శుభం తెలియని ఒక 14 ఏళ్ల బాలిక తన చదువు గురించి తండ్రితో, గురువుతో ఆవేశంగా చదువుకుంటానని చెప్తుంది. రాబోయే ప్రమాదాన్ని గ్రహించలేదు. ఎక్కడ తను చదువుకి దూరమవుతానో అనుకుంటూ ఉండుండి నిశ్శబ్దంలోకి కూరుకుపోతుంది. అలాగే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న తండ్రిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదు. అందుకే ఫరీదా కుటుంబం తీసుకు వెళుతున్న వాహనం నుంచి కిందకు దూకేస్తుంది. కానీ గోడ సందులోంచి చూస్తున్న క్రూరమైన దృశ్యాలు చూసి ఏడుపుని అపుకోలేకపోతుంది. బయట పసి బిడ్డ ఏడుపు, లోపల దుఃఖంతో బిడ్డను కాపాడాలనే తాపత్రయంతో తన్నుకులాడే ఫర్హా ప్రేక్షకులను కదిలిస్తుంది. ప్రజలు ఒకరిపట్ల ఒకరు పూర్తిగా అపరిచితుల పట్ల ప్రదర్శించే ప్రేమ చర్యలే వెలుగు రూపాలు. అలాంటి వెలుగును ప్రదర్శిస్తూ తీవ్రంగా తీవ్రమైన మానసిక వ్యధను అనుభవిస్తుంది!

అప్పడే ప్రసవించిన మహిళ పట్ల అతి కిరాతకంగా ప్రవర్తించే సీన్ లో, ఆ మహిళ అసహ్యంగా చూస్తూ కమాండర్ మీద ఉమ్మేస్తుంది!

మిలిటరీ వాన్లు చూసిన చిన్నారులు వాటివైపు రాళ్ళు విసురుతూ కనిపిస్తారు. ఫర్హా కూడా తన చేతివేళ్ళతో పేలుస్తానంటూ వాన్ వైపుకి గురి పెడుతుంది. 1948 నుంచే గాజా సమాజంలో ఇజ్రాయేల్ పట్ల పేరుకుపోతున్నఆగ్రహాన్నిఈ దృశ్యం పట్టి చూపిస్తుంది.

మొత్తం సినిమాలో ఇజ్రాయేలీల రవ్వంత మానవీయమైన స్పృహ ఒక ఇజ్రాయేల్ సైనికుడిలో కనిపిస్తుంది. నవజాత శిశువుని బూటుకాలితో తొక్కే సాహసం చేయలేక తన చేతి రుమాలుని బిడ్డ మొఖంపై ఉంచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ప్రతి సన్నివేశం కీలకమైనదే అన్నట్లు రూపొందించింది డారిన్ సల్లామ్.

“పాలస్తీనా ఉద్యమం కేవలం పాలస్తీనీయులకు మాత్రమే సంబంధించినది కాదు. అది మన కాలంలోని పీడిత, అణచివేతకు గురైన ప్రజల ఉద్యమంగా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, ప్రతి విప్లవకారుడికీ సంబంధించిన ఉద్యమం.” అని 1972లో ఇజ్రాయెల్ చేతిలో హత్యకు గురైన పాలస్తీనా నవలా రచయిత, విప్లవకారుడు, ‘పాలస్తీనా విముక్తి ప్రజా కూటమి’ (PFLP) అధికార ప్రతినిధి ఘస్సాన్ ఫాయిజ్ కనాఫాని అన్నారు. ఆయన అన్నట్లే పాలస్తీనా పోరాటం పోరాడే ప్రజలకు ఒక విముక్తి చిహ్నంగా నిలుస్తుంది. పాలస్తీనా గురించి తెలిసిన కొద్దీ గుండెలవిసిపోతాయి. సంతానోత్పత్తి దశలో ఉన్న మహిళలను, చిన్నారులను జాతి మొత్తాన్నీ మట్టు బెట్టాలనే దుర్మార్గపు ఆలోచనలతో నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. దాన్ని 1948 నుంచి అమలు చేస్తున్నారనడానికి ఈ సినిమాలో పసి కందును, పచ్చిబాలింతరాలైన ఒక మహిళను, ఇద్దరు చిన్నారులను తమకు సహకరించిన అబు వాలిద్ కి చంపబోమని మాటిచ్చి మరీ చంపేస్తారు!
నటి కరం తాహెర్ అద్భుతంగా పాత్రలో ఒదిగిపోయింది. ఆమె బాగా సిగ్గు పడేదనీ, ఆమెకు చక్కగా అభినయించే కళ్ళున్నాయని, ఆమె ముఖం చిన్నపిల్లలా, అమాయకంగా ఉందని, మళ్ళీ బాగా ఆలోచించగల ఒక యువతిగా ఉందని అంది డారిన్ సల్లామ్.

కరం తాహెర్ కి, ఆమె నుండి చక్కని నటనను రాబట్టిన డారిన్ సల్లామ్ కి, మనం హృదయపూర్వక ప్రశంసలందజేద్దాం!

సన్నివేశాలన్నిటిలో కాస్ట్యూమ్ డిజైనర్ రాచెల్ ఔన్ (Rachelle Aoun) పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకొని తీరాలి!

“ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి లభిస్తున్న మద్దతు చూసి మేము ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని డారిన్ సల్లామ్ అంటుంది. ఈ దాడికి వ్యతిరేకంగా నిలబడటానికి, చిత్రం గురించి మాట్లాడటానికి, చూడటానికి తమ వంతు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మీ ప్రోత్సాహం మాకు ఎంతో ధైర్యాన్నిస్తుంది” అని దర్శకురాలు చెప్పింది.

భీభత్స మారణహోమ యుద్ధం మధ్యలో కూడా, ప్రజలు తమ మాతృభూమి గాజాలోనే ఉన్నారు. పాలస్తీనియన్లు అనుభవించిన దానిలో నాలుగింట ఒక వంతు చిత్రహింసలు అనుభవించిన మరే ఇతర దేశాలవారైనా వెళ్ళడానికి సిద్ధమవుతారేమో గానీ “మేము భూమిపై ఉన్న ఎంత శక్తిమంతమైన దేశాన్నయినా ధిక్కరించి నిలుస్తాం గానీ మా మాతృభూమిని వదిలిపెట్టం” అన్నట్లు పట్టు సడలకుండా ఉన్న మనకాలపు పాలస్తీనా పౌరులకు జేజేలు!
కాల్పుల విరమణల సమయంలో, తమ ఇళ్లకు తిరిగి వచ్చిన పాలస్తీనియన్లను ఇజ్రాయెలీలు “చొరబాటుదారులు” గా ముద్రవేసి చంపేశారు. ఈ చొరబాటుదారుల పదం సొంత మాతృభూమి నుండి దూరమైన పాలస్తీనియన్లను వాడినట్లే ఇప్పుడు మన దేశంలో సొంత పౌరులకు వాడడం విచిత్రంగా, ఆశ్చర్యంగా లేదూ? నియంతలు ఒకరినుండి మరొకరు ఇవి నేర్చుకుంటారు కాబోలు!

మన కళ్ళముందే జరుగుతున్న భీతిల్లిపోయే మారణ కాండలను తెలుసుకోవడానికి ఈ చిత్రాన్ని ఇంతవరకూ చూడని వారినందరినీ నెట్‌ఫ్లిక్స్ లో ఉంది చూడమని మనవి చేస్తున్నా.

ప్రదర్శనలు:

ఈ చిత్రాన్ని 14 సెప్టెంబర్ 2021న టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.

ఈ చిత్రం పాలస్తీనాలోని రామల్లాలో జరిగిన పాలస్తీనా సినిమా డేస్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.

సాధించిన అవార్డు:

2022 లో బెస్ట్ యూత్ ఫిల్మ్ అవార్డ్ (ఆసియా ఫసిఫిక్ స్క్రీన్ అవార్డ్) ను సాధించింది.

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

Leave a Reply