రెండవ రాష్ట్ర మహాసభ – తెలంగాణ
వేదిక ఫంక్షన్ హాల్, ఖమ్మం 16 ఆగస్ట్ 2026
ప్రజాస్వామ్యం – సాంస్కృతిక సంభాషణ
భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలు సామాజిక ఆచరణలో వాస్తవం అయ్యే కొద్దీ ప్రజాస్వామ్యం తాత్వికార్థంలో ఉన్నతీకరణ చెందుతుంది. పౌరుల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. జీవితం అర్థవంతం అవుతుంది. అయితే భిన్న భౌగోళిక జీవన సంస్కృతి, భాషా సమాజాల వైవిధ్యం, ప్రాంతీయ వ్యత్యాసాలు, ఆర్థిక అసమానతలు, కులమత వైరుధ్యాలు ఉన్న విశాల భారతదేశంలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వాలు అందరికీ సమంగా అనువర్తింపచేయగల పరిణతి, ప్రాజ్ఞత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కొరవడ్డాయి. కనుకనే ప్రజాస్వామ్యం మరణశయ్య మీద ఉన్నదనే భావనకు ఆస్కారం కలిగింది.
చరిత్ర చాలా కఠినమైనదే కావచ్చు కానీ ప్రవాహశీలమైంది. నేలమట్టమవుతున్న మానవత ఆక్రందనల్లోంచే ఒక ఆశాస్వరం వినిపిస్తుంది. భయం గుప్పిట్లో నలిగిపోతున్న మనుషులనే సమూహంగా మార్చి దిక్కులు పిక్కటిల్లేలా అరిచే ఒక కూడలిని ఆవిష్కరిస్తుంది. ప్రజలు తమను తాము వ్యక్తం చేసుకునేందుకు వొక స్థలం నిర్మించుకుంటారని, పాలక వ్యవస్థలు దాన్ని ధ్వంసం చేయలేవనీ, అది చెదిరిపోతే పునర్నిర్మించుకుంటారనీ భరోసానిస్తుంది. ఎప్పటికప్పుడు మిణుకు మిణుకు మంటున్న ప్రజాస్వామ్య దీపాన్ని – వత్తిని పైకి ఎగదోసి నూనె పోసి – ప్రజ్వలింపచేసి సామాజిక రాజకీయ ఉద్యమాలకు పురుడు పోస్తుంది.
రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్లు ‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో, ఎక్కడ హేతువు నిర్మలమైన ప్రవాహం అవుతుందో’ ఆ తీరానికి మనం ఎప్పటికైనా చేరవలసిందే. అర్థవంతమైన, మానవీయమైన ప్రజాస్వామ్యాన్ని మించిన భయరహిత ప్రపంచం, తలెత్తుకొని జీవించే స్వేచ్ఛా లోకం వేరే ఏదీ లేదు. వందల ఏళ్ల మహాద్భుత ప్రయాణం చేసిన భారత సమాజాలు ఆ దిశగా చాలా ముందుకు నడిచి వచ్చాయి. సమానత్వం, సోదర భావం, లౌకిక చింతన, వ్యక్తి స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన, హేతుబద్ధ సాంస్కృతిక ఆచరణ, ప్రగతిదాయకమైన అన్వేషణ నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి.
ప్రపంచ చరిత్ర పట్ల సరైన దృక్పథం, దేశాన్ని ఆధునికంగా తీర్చిదిద్దాలనే సంకల్పం, దార్శనికత, వేల ఏళ్లుగా వస్తున్న కుల, వర్గ, పితృస్వామిక సంస్కృతీ సంప్రదాయాలను మార్చి దేశాన్ని నాగరికంగా నిర్మించే విషయంలో స్థిరమైన ఆధునిక దృక్పథం గల రాజనీతిజ్ఞులు ఉండడం వల్ల భారత రాజ్యాంగం ఉనికిలోకి వచ్చింది. వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వం, స్వయంప్రతిపత్తి, భావప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మైనార్టీలకు రక్షణ, సామాజిక న్యాయం, సాంస్కృతిక విద్యా హక్కులు వంటివి అందులో భాగమయ్యాయి. దేశం ఆధునికం కావడంలో రాజ్యం చోదక పాత్ర పోషించాలని అంబేడ్కర్ భావించాడు. రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా మలచుకోవాలని నొక్కిచెప్పాడు.
వందల ఏళ్ల కింద యూరప్‌లో ఆరంభమై ప్రపంచాన్నంతా హేతువు మీద నిలబెట్టిన జ్ఞానోదయాన్నీ, అంతకంటే ఇంకా వెనక బౌద్ధం మనకు అందించిన దేశీయ హేతు చింతననూ, డెబ్పై ఏళ్లకు పైగా రాజ్యాంగం హామీ పడిన ప్రజాస్వామిక లౌకిక విలువలనూ ఇవాళ మతవాద ఫాసిజం ధ్వంసం చేస్తున్నది. ఆలోచించడం, మాట్లాడటం, సంభాషించడం, అన్వేషించడం, రాయడం అనే మానవ సహజ ప్రక్రియలనే రద్దు చేసే ప్రయత్నం జరుగుతోంది.
ప్రజా సంఘాలపై నిర్బంధాలు అమలుచేయడం, ప్రశ్నించే హక్కుల కార్యకర్తలపై రచయితలపై జర్నలిస్టులపై మొత్తం మేధావి వర్గంపై అక్రమ కేసులు బనాయించడం, రాజకీయ పక్షాలను నియంత్రించి గొంతు మూయించడానికి రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేయడం, న్యాయస్థానాల స్వతంత్ర ప్రతిపత్తిని కబ్జా చేయడం, ప్రాంతాల రాజకీయార్థిక ప్రతిపత్తిని, భాషా సంస్కృతుల ప్రత్యేక అస్తిత్వాలను హరించి ఫెడరల్ స్ఫూర్తిని నాశనం చేయటం ప్రజాస్వామిక విలువల విధ్వంసంలో భాగమే. మీడియా వృత్తికారులకు, రచయితలకు దేశం అత్యంత ప్రమాదకరమైనదిగా మారింది. మానవులైనందువల్లనే కనే కలలు ఎన్నో ఇవాళ పీడ కలలుగా మారిపోయాయి. ఆ కారణంగానే 2026 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 180 దేశాలలో మనదేశం 157 వ స్థానానికి దిగజారింది. భారతదేశంలో వ్యక్తీకరణ స్వేచ్ఛపై నియంత్రణ ప్రమాదకర స్థితికి చేరిందని 2025 గ్లోబల్ ఎక్స్ప్రెషన్ నివేదిక పేర్కొన్నది. ఫ్యూచర్ అఫ్ ఫ్రీ స్పీచ్ అనే స్వతంత్ర సంస్థ ప్రపంచంలో మాట్లాడే స్వేచ్ఛకు మద్దతుగా ఉన్నవాళ్లు ఎవరు అన్న ప్రశ్నతో చేసిన విచారణ(2024) లో 33 దేశాలలో భారతదేశం 24 వ స్థానంలో ఉందని తేలింది.
ఇవేవీ చాలవన్నట్లు లౌకిక ప్రజాస్వామిక విలువల్ని హరించే సాంస్కృతిక ఆధిపత్యవాదం ఇవాళ దూకుడుగా ముందుకు వచ్చింది. అది పాలకుల అప్రజాస్వామికమైన ఫాసిస్టు రాజకీయ ఆచరణకు జనామోదం సాధించడానికి అవసరమైన భూమికను ఏర్పరచింది. నిజానికి సంస్కృతి మానవులను కలిపి, ప్రజా సమూహాల మధ్య వైరుధ్యాలను పరిష్కరించే సాధనం. కానీ దాన్ని విద్వేషానికి, విధ్వంసానికీ, నియంతృత్వానికీ, క్రూరమైన దోపిడీ విధానాలకూ విషపు కత్తిగా, మాయదారి వలగా తిరోగమన శక్తులు వాడుకుంటున్నాయి.
సరిగ్గా ఈ సమయంలోనే రచయితలు ప్రజాస్వామ్యం కోసం ఒక అర్థవంతమైన సాంస్కృతిక సంభాషణ జరపాలి. మానవీయ సంస్కృతి కోసం నిజమైన ప్రజాస్వామిక అన్వేషణ సాగించాలి. అత్యంత సృజనాత్మకంగా వ్యక్తం కావాలి. అసలు సృజన అంటేనే మానవతను వెలికి తీయడం, పునర్నిర్మించడం, పరిపూర్ణం చేయడం. మానవత లేని ప్రజాస్వామ్యం నియంతృత్వానికి వాహికగా మారుతుంది. మానవత లేని సంస్కృతి తిరోగమనంలోకి ఈడ్చుకెళుతుంది.
ఆధునిక హేతు దృష్టి లేని రాజకీయ నాయకత్వం కేవలం శుష్క భావావేశాలను రెచ్చగొట్టి సామాజిక జీవితాన్ని అర్థరహితం చేస్తుంది. ఆ క్రమంలోనే అచారిత్రిక కథనాలను ప్రచారం చేస్తుంది.
ఇవాళ అధికారంలో ఉన్న మతతత్వ, కార్పొరేట్ శక్తులు ప్రజల ఆర్థిక, రాజకీయ, సామాజిక జీవితాన్ని ధ్వంసం చేయడమేకాదు; ప్రజల మనసులను, జ్ఞాన క్రమాలను, నైతిక పునాదులను విషపూరితం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. మానవ హృదయ నిర్మాతలైన సాహిత్యకారులకు ఇది తీవ్రమైన సవాల్. రచన చేయడమంటే ప్రజలతో మాట్లాడటం. సంస్కృతీ నైతికతలు మాధ్యమంగా హేతుపూర్వక సంభాషణ చేయడం. కానీ పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యం, దాని మార్కెట్ ప్రజల అస్తిత్వాన్ని రద్దుచేసి వారిని ఓటర్లుగా, వినియోగదారులుగా మాత్రమే భూమ్మీద ఉండేలా మార్చేస్తాయి. చివరికి ఫాసిజం కొన్ని సముదాయాలకు పౌరసత్వ సమస్యను సృష్టించి ఓటర్లను కూడా రద్దు చేయగలదని ఇవాళ రుజువైంది.
ఇలాంటి సామాజిక రాజకీయ సందర్భంలో రచయితలు ఏం చేయాలి? ఎలాంటి పదునైన సాంస్కృతిక సంభాషణ నిర్వహించాలి? చీకటి రోజులలో చీకటి గురించిన గానాలే కాదు, వెలుగు గీతాలు కూడా వీధుల్లో పోటెత్తుతాయని నేటి దేశ యువతరం నిరూపించింది. మాటల్ని కబళించిన దేశంలో ఒక అర్థవంతమైన, సరికొత్త చర్చా సంప్రదాయాన్ని ముందుకు తీసుకొచ్చింది. యావద్దేశంలోని రోడ్లన్నిటినీ సౌందర్యభరితం చేసింది. ఫాసిజాన్ని విమర్శించగలమనీ, ఎదుర్కోగలమనీ, ఓడించగలమనీ ఒక గొప్ప భరోసానిచ్చింది.
ఈ సానుకూలత రాజకీయ రంగానికే పరిమితం కాదు. ఫాసిజం బందిఖానలో ఉన్న మానవ జీవన పార్శ్వాలన్నిటికీ వర్తించేది. ఈ చిరుదీప కాంతిలో ‘సమూహ’ తన రెండో మహాసభలను ఆగస్టు 16 న ఖమ్మం పట్టణంలో జరుపుకొంటోంది. ఈ కాంతిని దేదీప్యమానం చేయవలసి ఉన్నది. ఫాసిజం బారినపడి నలిగిపోతున్న సకల పీడిత సమూహాలు, వర్గాలు తమ విముక్తి కోసం చేస్తున్న పెనుగులాటలో ఎగజిమ్మే వెలుగు రవ్వలను ఒడిసిపట్టుకోవలసి ఉన్నది. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో సామూహికతే సృజనాత్మకత అనీ, సృజనాత్మక వ్యక్తీకరణే ప్రజాస్వామిక సంభాషణ అనీ ఎలుగెత్తి చాటవలసి ఉన్నది. ప్రజాస్వామ్య చింతనను సజీవం చేయటానికి నిత్యం నిరంతరం సాంస్కృతిక సంభాషణ అవసరమవుతుంది. రచన, ఇతర సృజన కళారూపాలు కార్యక్షేత్రంగా ఉన్న వాళ్ళు చేయవలసిన సంభాషణ ఇది. ప్రజాస్వామ్య పరిరక్షణకై సాగే ఈ సాంస్కృతిక సంభాషణలో భాగం కావడానికి రచయితలను, కళాకారులను సమూహ ఆహ్వానిస్తున్నది. రండి. అందరం చేతులు కలుపుదాం. గొంతులు ఏకం చేద్దాం. ఎప్పటికైనా ప్రజలు ఎగరేసే స్వేచ్ఛాగీతాల కోసం విశాలమైన ఆకాశాన్ని సిద్ధం చేద్దాం.
సమూహ
సెక్యులర్ రైటర్స్ ఫోరమ్