ఎద్దులబండి రాజప్రసాదంలోకి రాకుండా
రోడ్ల మీద మేకుల ముళ్లు మొలుస్తూ!
దర్బారులోకి ‘ ద్రోహులు’ తొంగి చూడకుండా
బారికేడ్ల ఎత్తు భయం భయంగా పెరుగుతూ!
రక్తాన్ని తుడుచుకుంటూ లాఠీలు
రోడ్డంతా కాళ్లు విరిగిన చెప్పులు!
లేత కళ్ల రెటీనాపై
లోహపెళ్లల రక్తమెరుపులు!
రంగు టీవీ తెరలపై
రాజద్వార కాపలా విన్యాసాలు !
గాలి దుమారం చెవులు చిల్లులు పడేలా
మూసిన తలుపుల మాటున
వణుకుతున్న గొంతులో అధికార ప్రేలాపనలు
‘దారితప్పిన చీమలు దేశవినాశ దూతలు!’
రాజగాంభీర్యం
ప్రజలను క్షమిస్తూ
ప్రేమను నటిస్తూ
వందిమాగధులు
ఎప్పటిలాగే
ఓహో… ఓహోలు…
ప్రశ్నలు వానలా కురుస్తూ
రోడ్లు సముద్రాలై సునామీలై
రాజగృహమంతా నీళ్లు పొర్లుతూ !
ఉడుకుతున్న రక్తంలా
చీమల చప్పరింతలా
చిన్న పిల్ల వెక్కిరింతలా
నీళ్లు..వీళ్ళు.. వరదలా !
తెగిపడిన రాజ కిరీటం
తెరవకుండానే రాజకోటలో !