రంగభూమిలో ఎరుపైన రూపం

‘తగలబడుతున్న ఓడ పైన ఆ బాలుడు నిలబడ్డాడు
తప్పించుకోగలిగిన వారంతా పారిపోయిన వేళ
యుద్ధ శిథిలాలని దహించే అగ్నికీలలు
మృతదేహాల మధ్య అతని చుట్టూ వెలుగులు విరజిమ్మాయి’
కాసాబియాంకా, ఫెలిసియా డొరోతీ హెమన్స్

కాసాబియాంకా, 200 సంవత్సరాల నాటి కవిత (1826). ఫ్రెంచి, బ్రిటిష్ సేనల మధ్య నైలు నదీ యుద్ధంలో, తండ్రి మాటలకి కట్టుబడి తగలబడే ఫ్రెంచి ఓడపై దగ్ధమైపోయిన పది, పన్నెండేళ్ల బాలుడి ధైర్యం గురించిన కవిత. తండ్రి అప్పటికే చనిపోయిన విషయం తెలియక, కాసాబియాంకా ఆ తగలబడే ఓడ అంచున అలాగే నిలబడి దగ్ధమై చనిపోయాడు. ముక్కుపచ్చలారని పసి వయసు అమాయకత్వానికీ, మాట దాటని స్థిరత్వానికీ, స్థైర్యానికీ, ధీరోదాత్తతకీ కాసాబియాంక ఒక ప్రతీకగా నిలబడ్డాడు.

రంగభూమి ఒక వేదిక. కట్టలు తెగిన ఆవేశానికి, కూలిన నిర్వేదానికి, విస్ఫోటనాలకి, అనంతర భయంకర శ్మశాన నిశ్శబ్దానికి, విజయోత్సవాల కోలాహలానికీ, శూలానికి గుచ్చుకుని బొట్టు బొట్టుగా స్రవించే దుఃఖ్ఖాశ్రువుల అపజయానికి అది ఒక నెలవు. రంగభూమి ఒక రక్తసిక్త వాస్తవం. రంగభూమి ఒక చెదరిన కల. ‘తెలియని ఏ తీవ్ర శక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు’ – భీరువులు, ధీరులు, ముందు వెనుకలు చూడబోని మొండి మనుషులు, తప్పించుకోలేని ఓటమి ముందు తలవంచని ధిక్కారంతో మృత్యువుతో తలపడే మనుషులు – రంగభూమిలో మనకు ఎదురౌతారు.

చరిత్ర ఒక రంగభూమి. ‘పంతొమ్మిదవ శతాబ్దంలో అత్యంత విషాదకరమైన, కీలకమైన ఘటనలలో ఒకటి పారిస్ కమ్యూన్ పుట్టుక, పతనం. దాని ప్రతిధ్వనులు నేటికీ వినిపిస్తాయి. థీర్స్ సైన్యం పారిస్ వీధులలో వేలాదిమంది మామూలు ప్రజలని – స్త్రీలనీ, పురుషులనీ, చిన్న పిల్లలనీ కాల్చి చంపింది. కమ్యూన్ కి మద్దతుగా దానిని కాపాడుకోవడం కోసం నిలబడిన అనేక మందిని సైన్యం కాల్చి చంపింది. కార్మికుల దుస్తులు ధరించి ఉన్నందుకు కొంత మందినీ, మిగిలిపోయిన పారిస్ నేషనల్ గార్డ్ యూనిఫారం వేసుకున్నందుకు కొంత మందినీ, తమ వృత్తి పనులు చేస్తున్నందుకు మరికొంత మందినీ కాల్చి చంపారు, ఇంకా కొంత మందిని కేవలం మాట తీరుని బట్టి కాల్చి చంపారు. తమ స్వంత దేశస్థులమీద ఫ్రెంచి బలగాలు కొనసాగించిన ఈ హత్యాకాండ ఆ తర్వాత రానున్న (ఇరవైయవ) శతాబ్దంలో తలెత్తనున్న రాక్షసత్వానికి సూచికగా నిలిచింది. నువ్వు ఒక మనిషిగా నిలిచినందుకు, స్వేచ్ఛని కోరుకున్నందుకు నిన్ను కాల్చి చంపేయవచ్చు’ అని చరిత్రకారుడు జాన్ మెర్రీమన్ రాశాడు. కవయిత్రి, ఉపాధ్యాయురాలు, రచయిత అయిన లూయిజ్ మిచెల్ పారిస్ కమ్యూన్ మహిళా ప్రతినిధులలో ముఖ్యురాలు. ఆనాటి పారిస్ కమ్యూన్ తిరుగుబాటులో పాల్గొని దాని చరిత్రని అక్షరబద్ధం చేసిన ప్రాస్పర్ ఒలివియర్ లీసగరే, కోర్టు విచారణలో ఆమె మాటలని పేర్కొన్నాడు. ‘మీ న్యాయవిచారణలో నేను వాదించను, నా గురించి వాదించబోను… నన్ను నేను సామాజిక విప్లవానికి అంకితం చేసుకున్నాను. ఎలాంటి మినహాయింపులూ లేకుండా, నా చర్యలన్నింటికీ నేను పూర్తి బాధ్యతని, స్వీకరిస్తున్నాను. సైనికాధికారుల హత్యలలో నేను పాల్గొన్నానని మీరు ఆరోపిస్తున్నారు. నేను మీ ఆరోపణలని నిజమని అంగీకరిస్తున్నాను… మీరు పిరికిపందలు కాకపోతే నన్ను చంపేయండి’ అని సవాలు విసిరింది… ఇలాంటి ధైర్య సాహసాలని ప్రదర్శించడంలో ఆమె ఒక్కత్తే కాదు. లేమేల్, ఆగస్టీన్ షిఫాన్ వంటి వారిని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఓడిపోయినా, సంకెళ్ళలో కట్టివేసినా ఈ పారిస్ మహిళలు ఎంతటి ధైర్యవంతులో వెర్సయిల్స్ ముందు చాటి చెప్పారు.’ రంగభూమి ఒక చరిత్ర, రణరంగం.

రంగభూమి ఒక సాక్షి. యుద్ధంలో తలపడిన శక్తుల బలాబలాల సంబంధాలలో వచ్చిన మార్పులకి, జయాపజయాలని ప్రభావితం చేసిన పరిణామాలకి ప్రత్యక్ష సాక్షి. ‘ఎందుకు తవ్వుతావు ఆ విషయాలని, (ఎందుకు జరిగింది, ఇందులో ఎవరిది పొరపాటు, ఇలా ఎలా జరిగింది, అలా ఎందుకు జరగలేదు) – నువు ఆ విషయాన్ని ఎప్పటికీ తేల్చలేవు. అది ఎప్పటికీ అలానే ఉంటుంది’ అని కవి యానిస్ రిట్సాస్ చెబుతాడు. కొన్ని మారనట్లుగా కనిపిస్తాయి. ఉదాహరణకు, పారిస్ కమ్యూన్ అణచివేతలోని క్రూరత్వం. స్వేచ్ఛ కోసం మనుషుల పట్టుదల, పోరాటం. కానీ, ‘ప్రతీదీ మారిపోతుంది. నీ ఆఖరు శ్వాసతో ఒక నూతన ప్రారంభానికి నాంది పలకవచ్చు’ అని కవి బెర్టోల్ట్ బ్రెహ్ట్ అంటాడు. మారిన, మారని పరిస్థితులకి రంగభూమి విలక్షణమైన సాక్షి.

రంగభూమిలో మనుషులు నిలబడతారు. ఒక్కొక్కసారి ఓడిపోతామని తెలిసినా, ఒంటరై ఓడిపోయామని తెలిసినా, నిస్సత్తువలో నిలిచే బలం కోల్పోయినా, నిష్ఫలమని తెలిసి, తెలిసీ నిలబడతారు తలపడతారు. రంగభూమి అప్పుడు వీరోచిత విషాదాంత దృశ్యానికి సాక్షీభూతంగా నిలబడిపోతుంది. మారిన పరిస్థితుల గురించీ, మారకుండా కొనసాగే వాటి గురించీ మన సంవాదం కొనసాగుతూనే ఉంటుంది.

నువు తిరిగి వచ్చేసరికి..
కాసాబియాంకా
నిజం చెప్పు!
తగలబడే ఓడ అంచున
నిన్ను ధైర్యంగా నిలబెట్టినదేమిటి?

***

పుట్టిన వూరికి విగత జీవిగా
నువు తిరిగి వచ్చేసరికి
ఏమీ మారలేదు-
అన్నీ అలాగే.
మాకు అర్ధం కాలేదు-
ఊబిలోకి కూరుకుపోతూ
నువు పెట్టిన కేక
మాకు వినపడలేదా?
ఊబిలోకి మేమే దిగబడిపోతూ
నీ కేకలు వినిపించుకోలేదా?
నిజంగా మాకేమీ అర్ధం కాలేదు-
నువు తిరిగి వచ్చేసరికి
అదిగో, ఆ మోదుగు చెట్టు అలాగే
ఎర్రటి కన్నీళ్ళు కారుస్తూ-
ఇవిగో, ఇక్కడ తంగేడు పూలు
చెరువుగట్టున గాలిని ఊరడిస్తూ-
కదలని కాలం
తెలియని ఋతువుల వస్త్రాన్ని ఎప్పటిలాగే మార్చుకుంటూ
ఏమీ మారలేదు-

***

కాసాబియాంకా
నిజం చెప్పు!
నెత్తుటి నదిలో తగలబడే
అడవిపడవ అంచున
మొండిగా నిన్ను నిలబెట్టినదేమిటి?

***

పుట్టి, పెరిగిన వూరికి జ్ఞాపకమై
నువు తిరిగి వచ్చేసరికి
అన్నీ మారిపోయాయి
ఏదీ మునుపటిలా లేదు
మాకు అర్ధం కాలేదు-
కూలిపోతున్న కొండచరియ అంచున
నువు అలాగే కదలకుండా నిలబడిపోయావా?
నిశ్శబ్దం ప్రతిధ్వనించే అగాథాల లోతులలోకి
మేమే వడివడిగా జారిపోతున్నామా?
నిజంగా, మాకేమీ అర్ధం కాలేదు-
నువు తిరిగి వచ్చేసరికి
ఇదిగో, ఇక్కడ ఊరి చివర
ఊడలతో కూలబడిన మర్రిచెట్టు
గాలి భుజం మీద తలవాల్చి విలపిస్తున్నది-
అదిగో, ఊరిలోకి గర్వంగా
అడుగుపెట్టిన రహదారి
ఒంటరిగా గమ్యం కోసం వెదుకుతోంది-
పరుగులు తీసే కాలం
గాయపడిన ఋతువు జ్ఞాపకాలతో స్థాణువై , స్థూపమై నిలబడిపోయింది-
అన్నీ మారిపోయాయి.

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

Leave a Reply