అడవంతా రంపపు కోతమోత
రాళ్ళ మధ్య వెలుగుని పుట్టించినోడు
చీకటైన చివరి మనిషిగా నిష్క్రమణ
కొండల మధ్య నీటి ఊటల్ని బిగబట్టినోడు
నగర ఎడారుల్లో గుక్కెడు నీళ్లు దొరక్కపోయే
విప్పపూల రంగస్థలం రద్దయి పోయి
డీజేల రణధ్వనిలో రేల పాటలు నిద్రపోయే !
వేట తుపాకీ చప్పుడుకి
సేద తీరిన పిట్టలన్నీ ఎగిరిపోయే
మట్టి పొరల్లోని మనిషి చెల్లాచెదురై
ట్రక్కుల్లో తోలుకెళ్తున్న ఖనిజమట్టిలా
వేలనాళ్ల నేల్లూనిన సహజ సమాజం !
నిటారుగా నుంచున్న సాల్ చెట్లు
కంపెనీ ఇస్తిరాకులై ఎగిరిపోయే
కట్టె మోపుల తల్లి కనిపించకపోయే
ఆఖరి మనిషి ఆర్తనాదం
వన్యజీవి విగత పాటగా అడవంతా!
అడవిని హత్య చేయడమంటే
నడిచొచ్చిన దారిని నరికేయడమే
వసంత వాన జల్లుకి అగ్గిపెట్టడమే
ఆదిమ సత్యానికి అంత్యక్రియలుగా
అనాగరిక జెండాలు రెప రెప లాడించడమే!
నది ఎండిపోవటమంటే
ఒక నాగరికత రాళ్ళలో ఇంకిపోవటం
అడవి అంతమయిందంటే
ప్రాకృతిక జ్ఞానసమూహం నేల రాలడం
మానవాళి మీద జరిపే యుద్ధతంత్రమే!