ప్రేమ భావుకత – నిండైన కవిత్వం

మనం మరిచిపోయిన ప్రేమ భావుకత, గత కొన్ని సంవత్సరాలుగా, ఉప్పెనగా, ఫేస్బుక్ పుణ్యమా అని మళ్ళీ తెలుగు నేలకు పరిచయం అయింది.

జీవితం లో ప్రేమ ఒక భాగం. కొందరికి ప్రేమే జీవితం కావొచ్చు. కాదనలేం కదా.

కొందరికి ప్రేమ దొరకకపోయినా ప్రేమ కవిత్వం రాసి ఆ వెలితిని తీర్చుకంటారు. దానినీ కాదనలేం. ప్రేమ భావన గాఢంగా నిండుకున్న నిండుకుండ లాంటి ఈ కవిత్వంలో విఫల ప్రేమ అగ్రస్థానం సంపాదించుకున్నది.
“నాకు నువ్వంటే వెన్నెల పువ్వంత ఇష్టం
ఎంతైనా అనుభూతి తప్ప
అందనితనమే కదా” అన్నట్టు
ఆశ్చర్య పరిచే శిల్పం, అబ్బుర పరిచే కూర్పు చాలా పకడ్బందీగా పదాల వల ఒకటి అల్లి అందులో పాఠకులను పడదోసి ఇంకా బయటపడండి అని ఛాలెంజ్ విసురుతున్న కవులలో ఇషాఖ్ హుసేన్ ఎవరికీ తీసిపోరు. ఆయన ఇటీవల తన తొలి కవితా సంపుటి “శిశిర పరిష్వంగం” విడుదల చేశారు.

అయిదు పదుల వయసు దాటిన తర్వాత ఆయన కవిత్వం రాయడం మొదలెట్టినట్టు ఉన్నాడు. వయసు కవిత్వం రాయడానికి కొలమానం కాకపోయినా, ఇలా రాయడం అరుదే! రాయడం గొప్ప కాదు కానీ ఎంత బాగా రాశాం అన్నది ఎవరూ కాదనలేని కొలమానం.

ఆ దృష్టితో చూసినా, చాలా మంచి “ప్రేమ” కవిత్వం రాస్తున్నారు ఇషాఖ్ హుసేన్. ఈయన కవిత్వం లో విరహ వేదన, ఎదురుచూపు, ప్రేమించిన వ్యక్తి పట్ల ఆరాధన భావన కొట్టొచ్చినట్టు కనబడే లక్షణాలు. నిరీక్షణ నరకం అని నేరుగా చెప్పాడు కానీ ఆ విషయాన్ని పాఠకులు పసిగట్టగలరు. “కన్నీటి నిల్వలు” అనే ఈ కవితలో
“కాలపు గాయాలతో అద్దమే
గుర్తించలేనంత మార్పు మరి
ఈ గుర్తింపును నా ప్రేమకు నేను నేనేనని
నీ ఎదురుచూపులతో దోసిళ్ళకెత్తుకొన్న నాటినుండి
సమయం ఎంతగా జారిపోయింది వేళ్ళ సందుల గుండా…
నీళ్లలా ఇప్పుడు ఏమున్నాయని ఆనవాళ్లు
మిగిలిన కొన్ని కన్నీటి నిల్వలు తప్ప..

ఎదురు చూపును కాలంతో ముడిపెట్టినప్పుడు వేళ్ళ సందుల గుండా జారిపోయిన వయసును లెక్కించడం కవి ఉద్దేశ్యమా!? కాకపోతే ఏళ్ళు జారిపోయినా ప్రేమ భావన ఇగిరిపోలేదు అని చెప్పడం కావొచ్చు కూడా…అన్నింటి మించి ప్రేమించిన మనిషి కోసం నీరీక్షణ నిజంగా బలీయమైనదే! కాలం కర్కశత్వం ప్రేమికుల మధ్య ఎడాన్ని పెంచి అటూ ఇటూ మిగిల్చిన బాధని కవిత్వం చేయడం బాగుంది కదా!
పైన చెప్పిన విషయాన్ని రూఢి చేస్తూ,

“ఈ నిరీక్షణ కాలంలో మారిన యుగాలెన్నో గుర్తు లేదు కానీ,
గుండెను తాకిన గాయాల గురించి అడగమాకు
నీ ఎడబాటు సాక్షి గా చెబుతున్నా,
ఇప్పుడు కవిత్వం ఆత్మీయం అయ్యాక
మళ్ళీ ప్రేమించడం నేర్చుకున్న
దాహపు దోసిలిలో చైత్రపు చినుకుకులా
నన్ను నేను …నిన్నుగా…”ఎడబాటు సాక్షి గా ” అనే కవితలో కవి ఎడబాటు కాలం యుగాలంత నిరీకక్షగా గాయం పరుస్తుంటే తన్ను తాను ప్రేమించడం నేర్చుకున్నాడు..

స్మృతి జారే వేళ…అనే కవితలో
“చూపుతో… పిలుపుతో…మాటో..దూరం నుంచైనా ఓ సైగ మినహా” కోరుకోవడం లేదు ఈ అనామక ప్రేమికుడు..అప్పటికే ” అపరిచిత దారుల్లో తనను తాను కోల్పోయి ఉన్నాడు అతడు. అందుకే, ఇంకేమీ కోల్పోడానికి లేని అతడు ప్రియురాలు నడిచిన నడిచిన వెళ్ళిన దారిలో కోల్పోవడానికి పాదముద్రలు మాత్రం ఉన్నాయని” వాటితో దూరం చేయవద్దని ఆమె స్మృతి మది లోతుల్లోకి జారే వేళ కోరుకుంటున్నాడు..

ఈ ప్రియుడిది ఎలాంటి మొహమాటాలూ లేని ప్రేమ అని ప్రకటిస్తూ ఇలా అంటాడు
“నివేదించలేని నిర్మోహపు ప్రేమలో బహుశా
కలలు తడిమి తడిసిన కనులతో…
ప్రియురాలు నడిచిన దారుల వెంటా ప్రియుడు
ఆమె నడిచిన దారుల వెంట చూపుల్ని ముడివేసి
ఆమె పిలుపు కోసం అనేక సార్లు వెనుతిరిగి చూశాడంట! “నిర్మోహపు ప్రేమ” అనే కవితలోని వాక్యాలు ఇవి.

విరహవేదనను కూడా చాలా బలంగా వ్యక్తపరచాడు ఆ వెలుగుల్లోనే అనే ఈ కవితని చూడండి

ఇప్పటికీ మిణుగురులై మెరుస్తూనే ఉంటాయి
‌రాత్రుల్లో నీ ముంగురులను సవరించిన నా మునివేళ్ళు
కాలిపోయి కవిత్వమై నేనొచ్చేది ఆ వెలుగుల్లోనే! ఈ కవితలో
“ఇప్పటికీ” అనే పదం విడిపోయిన ప్రేమికుల ఎడబాటు ను సూచిస్తుంటే కాలిపోయి అనే పదం విరహవేదనను సూచించేది. కవిత్వమై నేనొచ్చేది ఆ వెలుగుల్లోనే అనే ముగింపు గొప్పగా అమరింది ఈ చిన్న కవితలో!

ఇషాఖ్ హుస్సేన్ శిశిర పరిష్వంగం లో బలహీనమైన కవిత ఒక్కటీ లేదు. అన్నీ కవిత్వాన్ని నింపుకున్న వాక్యాలే! పైగా ఈయన 2023 నుంచి 2024 మధ్యలో అంటే ఒక్క సంవత్సర కాలంలో ఒక పుస్తకానికి సరిపడా కవిత్వం రాయడం కేవలం కవిత్వమే రాయడం ఒకటి అరా మినహా మిగతా అంతా ప్రేమ కవిత్వమే రాయడం ఆశ్చర్యానికి గురి చేసింది. తప్పకుండా చదవదగ్గ కవిత్వం ఇది.

ఈ పుస్తకం ఇంకో మంచి కవిత తో నేనీ సమీక్ష ని ముగిస్తున్నాను.

*

దుఃఖపు సడి

గుండె పగిలిన దుఃఖపు సడి
నీ అడుగుల తలం నలిగిపోతుంటే
విడిపోవడానికి ముందు విరిగిన మనసులో
నువ్వొంపిన శూన్యం కన్నా
మన మధ్య
పురినేసిన ఉరితాడులా
ఊపిరి బిగిస్తున్న నిశ్శబ్దమే భయానకం
అయినా
పోగేసుకున్న కొన్ని
రాలు పూల శబ్దాలు
ముడివేసుకున్న మరికొన్ని
ఎండుటాకుల గాయాలు
ఈ ఎడబాటు కు ఆఖరి అంకాన
నువ్వు మిగిల్చిన నా దిగులు బరువులు
ఎవరి మునివేళ్ళ స్పర్శ కోసం
ఇంకా ఎదురుచూస్తున్నాయో
నీకు తెలియనిదా చెప్పు
కనుల భావాలను చూపులతో చదవలేక
నువ్వొస్తే కలిసి చదువుకుందామని
రెప్పల పుటల్ని ఎన్నిసార్లు తిరగేసానో
ఇప్పటికీ అర్థం కాదు
ఎవరు రాసిన రహస్య ప్రేమ కావ్యం మన ప్రేమ
చివరికి సమాధి మీద
ఓ గడ్డి పువ్వై మిగలడానికి

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

Leave a Reply