పరీక్షకు ముందే ‘నీట్’ మెడికల్ యూజీ ప్రశ్నపత్రం బయటికి రావడం, ఆ క్రమంలో ఆ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటం, దాంతో నిరాశానిస్పృహలకు లోనైన విద్యార్థులు 17 మందిదాకా ఆత్మహత్య చేసుకోవటం, ఎట్టకేలకు నీట్ పరీక్షను తిరిగి నిర్వహించి చేతులు దులుపుకోవటం కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. దీనిపై విద్యార్థి యువతలో తీవ్ర స్థాయిలో నిరసనలు పెల్లుబి కాయి. మొత్తంగా పరీక్షా పత్రాల లీకేజీలు, పరీక్షల రద్దు, మూల్యాంకనంలో లోపాలపై ప్రారంభమైన విద్యార్థి-యువత ఉద్యమం ఇప్పుడు దేశంలో సంచలనంగా మారింది. ఇరవై లక్షల మందికి పైగా విద్యార్థులను అవస్థల పాల్జేసిన వ్యవస్థాగత లోపాలపై అధికారవర్గాల నుంచి జవాబుదారీతనాన్ని కోరుతూ యువత చేపట్టిన ఆందోళన దేశ గతికి కొత్త మార్గం చూపింది.
ప్రతి మార్పు మొదట పిడికెడు మందితోనే మొదలవుతుంది. కాలానుక్రమంలో ఆ పిడికెడు మంది సంఖ్య పెరిగి సైరన్‌లుగా మారుతారు. ఇప్పుడు మనం చూస్తున్నది అలాంటి క్షణమే. ఒక అహంకార న్యాయ మూర్తి అవమానంగా విసిరిన పదాన్ని, ఈ తరం యువత తన రాజకీయ గుర్తింపుగా మార్చుకుంది. నిరుద్యోగ యువతను ఎగతాళి చేస్తూ రూపొందించిన ఒక ఏఐ మీమ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఉద్యమాన్ని ప్రభుత్వం మొదట సీరియస్‌గా తీసుకోలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ఒకే డిమాండ్‌తో ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని చర్చల ద్వారా పరిష్కరించకుండా పోలీసు బలప్రయోగంతో అణచివేయాలని ప్రయత్నించింది. దాంతో విద్యార్థులు మరింత పట్టుదలకు పోయారు. విద్యార్థి యువతను అవమాన పరుస్తూ బొద్దింకలుగా పిలిచిన వ్యవస్థపైనే ఇప్పుడు అవే బొద్దింకలు దేశ ముఖచిత్రం పైకి గర్వంగా ఎగబాకుతున్నాయి. దేశ భవిష్యత్తును మార్చే దిశగా తమ పతాకాన్ని ఎగరేస్తున్నాయి. ప్రజాస్వామ్య ప్రియులుగా ఈ యువ ఆగ్రహాన్ని ఆహ్వానిద్దాం. రేపటి తరానికి అండగా ఉందాం.
కాక్రోచ్ ఉద్యమ నేపథ్యం:
ఎటువంటి రాజకీయ మూలాలు లేకుండా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యకు నిరసనగా వ్యంగ్యంతో ఆవిర్భవించిన ఒక సంస్థ.. నేడు ఏకంగా దేశ రాజధానినే కంపింపజేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ ఉద్యమ పునాది వెనుక యువత నిరాశ, నిస్పృహలు దాగి ఉన్నాయి. ఉన్నత విద్యా వ్యవస్థల్లో జరుగుతున్న బోగస్ డిగ్రీల వ్యవహారంపై స్పందిస్తూ, సుప్రీంకోర్టు ప్రధా న్యాయమూర్తి చేసిన ‘పరాన్న జీవులు, బొద్దింకలు’ అనే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సిజెఐ వివరణ ఇచ్చినప్పటికీ, అప్పటికే దేశంలో నిరుద్యోగం, ప్రశ్నాపత్రాల లీకేజీలు, వ్యవస్థల నిర్లక్ష్యంతో నలిగిపోతున్న యువత ఆ వ్యాఖ్యను తమ ఆత్మగౌరవ విషయంగా తీసుకుంది. ఆ ఆక్రోశానికి ప్రతీకగా అమెరికా నుంచి వచ్చిన 30 ఏళ్ల యువకుడు అభిజిత్ దీప్కే ‘అవును.. మేము బొద్దింకలమే! అన్ని బొద్దింకలు ఏకమైతే ఏమవుతుందో చూపిస్తాం’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి 2026 మే 16న శ్రీకారం చుట్టాడు. వ్యవస్థలు తమను లెక్కచేయనప్పుడు, ఆ వ్యవస్థల కళ్లల్లో నలుసులా మారాలనే ట్యాగ్‌లైన్‌తో ప్రారంభమైన ఈ ప్రయాణం.. డిజిటల్ వేదికలపై అగ్నిజ్వాలలా వ్యాపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.4 కోట్లకు పైగా, ఎక్స్(ట్విట్టర్)లో 2.6 కోట్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకోవడం ఈ ఉద్యమానికి లభించిన ప్రజామోదానికి నిదర్శనం.
భారత విద్యావ్యవస్థ ప్రస్తుతం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అవకతవ కలు, విద్యారంగంలో అవినీతి భారీగా పెరిగాయి. దీన్ని ప్రశ్నిస్తూ విద్యార్థులు, యువత ముందుకొచ్చారు. వైద్య విద్య ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో పేపర్ రూ.8 లక్షల నుండి రూ.40 లక్షల వరకు అమ్ముడైనట్లు ఆధారాలు బయటకు వచ్చాయి. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. దాంతో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ క్రమంలోనే నీట్ పరీక్ష పేపర్ లీక్ అనేది ఎవరో కొందరు అవినీతి, దురాశ పరుల తప్పుడు పనిగా చెప్పి కేంద్రం తప్పించుకో జూసింది. కానీ ఈ మొత్తం లీకేజీ వ్యవహారం నీట్ కే పరిమితం కాలేదనీ, అనేక కేంద్ర స్థాయి ప్రవేశ పరీక్ష పేపర్లు కూడా లీక్ అయ్యాయని ఒక్కొక్కటిగా వెలుగులోకి రావటంతో దేశవ్యాప్తంగా విద్యార్థి యువత తీవ్ర ఆందోళన చెందింది. సరిగ్గా ఈ సమయంలోనే.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లు, విలేకరులు, ఇంకా ఇతర సోషల్ మీడియ యాక్టివిస్టులను ఏ పని చేతకాని పనికిమాలిన బద్దకిస్టులని, వారు సమాజంలో బొద్దింకల్లాంటివారని న్యాయమూర్తి అసహించుకున్నారు. దీంతో దేశ యువత, ముఖ్యంగా విద్యార్థిలోకం తీవ్ర అవమానంగా భావించింది. ఈ అవమానంలోంచే, అవును మేం బొద్దింకలమే.. మీ బాద్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తున్నాం అని ముందుకు వచ్చారు.
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యుడిగా కేంద్ర విద్యాశాఖా మంత్రి రాజీనామా చేయాలని ఢిల్లీ జంతర్ మంతర్ లో నెలరోజులుగా నిరవధిక నిరాహార దీక్ష ఉద్యమాన్ని విద్యార్థులు ప్రారంభించారు. భారత రాజ్యాంగ ఆర్టికల్ 19(1)(ఎ) ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఇస్తుంది. ఆర్టికల్ 19(1) (బి) శాంతియుతంగా గుమిగూడే హక్కు ఇస్తుంది. విద్యార్థులు ఈ రెండు హక్కులను ఉపయోగించారు. ఈ పేపర్ లీక్ కేవలం ఒక అధికారి తప్పు కాదనీ దీని వెనుక ఒక పెద్ద నెట్‌వర్క్ ఉందని నినదించారు. మొదటి లింక్ కోచింగ్ సెంటర్లు. రూ.62 వేల కోట్ల ఇండస్ట్రీ. ఒక విద్యార్థికి లక్ష నుండి రూ.6 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. రెండవ లింక్ ఎన్‌టిఎలోని అవినీతి అధికారులు. ప్రశ్నాపత్రం ప్రింటింగ్ ప్రెస్ నుండి పరీక్షా కేంద్రానికి వెళ్లే లోపు అనేక చేతులు మారుతుంది. మూడవ లింక్ రాజకీయ అండ. విద్యార్థులకు మద్దతుగా సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవటంతో విద్యార్థి ఉద్యమం మరింత ఉదృతమైంది.
నీట్ పేపర్ లీకేజీ, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. జూలై 20న కాక్రోచ్ పార్టీ పార్లమెంట్ మార్చ్ (చలో సంసద్) కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ చలో పార్లమెంట్ కార్యక్రమం తీవ్ర హింసాత్మకంగా మారింది. నిరసనలో పాల్కొన్న వారిపై ఢిల్లీ పోలీసులు విచక్షరణారహితంగా క్రూరత్వంగా బలప్రయోగానికి దిగిన దృశ్యాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు విద్యార్థులను పోలీసులు చితకబాదారన్న దారుణ ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సందర్భంగా పోలీసులు 70 మందిని అదుపులోకి తీసుకోవటం, కేసుల నమోదు విద్యార్థులను మరింత రెచ్చగొట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాతో సిజెపి ప్రతిని ధుల చర్చలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టింది. మోడీ ప్రభుత్వం ఒకవైపు సిజెపి ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే, మరోవైపున వారి ఆందోళనపై బురద జల్లేందుకు అనేక కుట్రలు కుహకాలకు పాల్పడింది. సిజెపి ఉద్యమకారులను సంఘ వ్యతిరేకులు, దేశద్రోహులు, విదేశీ శక్తులు ఉద్యమంలో చేరారనే ప్రచారం చేసింది. జూలై 20న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇంకా రచ్చ నష్టదాయకమని భావించిన ప్రభుత్వ ముఖ్యులు ధరేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించారు.
అణచివేత అధిగమించి… సాధించిన విజయం :
కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘చలో సంసద్ ర్యాలీ’ రణరంగాన్ని తలపించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే ఉభయసభల సాక్షిగా ఎంపీలను నిలదీసి విద్యార్థుల సమస్యలకు పరిష్కారం తేల్చుకుంటామంటూ వేలాది మంది కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు, పరీక్షార్థుల తల్లిదండ్రులు జూలై 20న పార్లమెంట్ దిశగా మొదలుపెట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా ముగిసింది. జూలై 19 అర్థరాత్రికే జంతర్‌మంతర్‌లోని దీక్షా స్థలికి వేలాదిగా మద్దతుదారులు, విద్యార్థులు చేరుకున్నారు. ఈ నిరసనల్లో ఘర్షణలు, పోలీసుల ఆంక్షలు, తదనంతర పరిణామాలు పార్లమెంట్, సెంట్రల్ విస్టా, కన్నాట్ ప్లేస్ సమీప ప్రాంతాల్లో 163వ సెక్షన్‌ను విధించారు. ర్యాలీకి అనుమతిలేనందున ఐదుగురికి మించి గుమికూడవద్దని హెచ్చరించారు. వదంతలు వ్యాపించకుండా ఉండేందుకు సెంట్రల్ ఢిల్లీ పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను పోలీసులు నిలిపేశారు. ఉద్యమకారులున్న చోట్ల జామర్‌లను ఏర్పాటు చేశారు. స్కూల్ యూనిఫామ్‌లో పాఠశాల విద్యార్థులు మొదలు కాలేజీ స్టూడెంట్స్, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, వృద్ధులు, యోగేంద్ర యాదవ్ వంటి సామాజికవేత్తలు పెద్దసంఖ్యలో పార్లమెంట్ రోడ్లమీదకొచ్చారు. జాతీయ జెండాలు చేతపట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
విద్యార్థులు ముందుకెళ్లకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుగా ఉంచారు. వాటినీ ఆందోళనకారులు తొలగించారు. దీంతో పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. పలువురు తీవ్రస్థాయిలో గాయప డ్డారు. పార్లమెంట్ స్ట్రీట్, పటేల్ చౌక్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, శాస్త్రీ భవన్, రైల్ భవన్ సమీప ప్రాంతాల్లో ఆందోళన కారులను చెదరగొట్టేందుకు బాష్పవాయుగోళాలు సైతం ప్రయోగించారు. పోలీసులు ఇష్టమొ చ్చినట్లు చికబాదుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. “పోలీసులు కొందరి తలలు పగులగొట్టారు. కిందపడ్డ విద్యార్థులనూ కూడ వదల్లేదు” అని అక్కడున్న ప్రజలు మీడియాకు తెలిపారు. గాయపడిన వారిని తోటి విద్యార్థులు హుటాహుటిన సమీప ఆస్పత్రుల్లో చేర్పించారు. అయితే సమీప రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రిలో 65 మెడికో లీగల్ కేసులు నమోదయ్యాయి. ర్యాలీలో లద్దాఖ్ సామాజికవేత్త, నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలిని పోలీసులు జుట్టు పట్టుకుని లాగి కొట్టారని వచ్చిన వార్త నిరసనకారుల్లో ఆందోళన రేపింది.
యువత గర్జనతో వ్యవస్థల మేల్కొలుపు :
సిజెపి నిర్వహించిన ‘చలో పార్లమెంట్’ కార్యక్రమం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. మూడంచెల భద్రత, నిషేధాజ్ఞలను దాటుకుని వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు నిరసనోద్యమంలో పాల్గొనటం సాధారణ విషయం కాదు. పటిష్టమైన పోలీసు బలగాల లాఠీచార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగాల మధ్య ఢిల్లీ రణరంగాన్ని తలపించినా, యువత చూపిన పట్టుదల కేంద్ర ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేసింది.
కేంద్రమంత్రి జెపి నడ్డా స్వయంగా సిజెపి ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించడం, వారి డిమాండ్లను పరిశీలిస్తామని చెప్పడం ఈ ప్రజాపోరాటం సాధించిన విజయం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, బాధితులకు రూ.1కోటి పరిహారం, కేసుల ఉపసంహరణ వంటి స్పష్టమైన ఎజెండాతో ముందుకు సాగిన సిజెపి, కేవలం ఒక తాత్కాలిక నిరసన కాదని స్పష్టమవుతోంది. ‘ప్రజలను, ముఖ్యంగా యువతను తక్కువగా అంచనా వేస్తే ఏమవుతుంది?’ అనే ప్రశ్నకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సజీవ సమాధా నం. ఈ పరిణామాలు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, యువత భవిష్యత్తు వంటి ప్రధాన సమస్యలను పక్కనబెట్టి, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తే, రేపటి తరం సొంతంగా తమ వేదికలను నిర్మించుకుంటుందని ఈ ఘటన రుజువు చేసింది. వ్యవస్థ మేల్కొలుపులా సాగుతున్న ఈ బొద్దింకల గర్జన రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులకు నాంది పలుకుతుందో వేచి చూడాలి!
దేశంలో విద్యావ్యవస్థ అనేది కేవలం ఒక చదువుల మార్గం మాత్రమే కాదు.. అది కోట్ల మంది మధ్య తరగతి, పేద కుటుంబాల భవిష్యత్తుకు వేసే పునాది. దేశంలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్’ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ, ఫలితాల్లో తీవ్ర అక్రమాలు వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపింది. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడటంతో, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చారు. ఈ పరిణామం కేవలం ఒక పరీక్షా లోపంగా మిగిలిపోకుండా, రాజకీయ చర్చగా, జాతీయ స్థాయి సమస్యగా మారి చివరికి పరీక్షల్లో పారదర్శకత కరు వైందని, మెరిట్ ఉన్న విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని గ్రహించిన విద్యార్థి లోకం స్వచ్చం ధంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి రాష్ట్ర రాజధానులు, ద్వితీయ శ్రేణి నగరాల వరకు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు హోరెత్తాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) పనితీరుపై నమ్మకం కోల్పోయామని, ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని లేదా రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యా వ్యవస్థ కోచింగ్ మాఫియా, అవినీతిపరుల చేతుల్లో బందీ అయిందని విమర్శించాయి.
‘ఎంతైనా కొట్టండి’ ‘బొద్దింకల’ గాండ్రింపు :
కాక్రోచ్ ఉద్యమం సందర్బంగా పార్లమెంట్ సమీప ప్రాంతం ‘బొద్దింకల’తో నిండిపోయింది. ‘పార్లమెంట్ మార్చ్’లో పాల్గొన్న నిరసనకారులపై పలు చోట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. ఒక్కొక్కరినీ టార్గెట్ చేసుకొని, రౌండప్ చేసి లాఠీలతో చితకబాదారు. ఒక ఆందోళనకారుడిని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(చుట్టు ముట్టి) ఐదుగురు కలిసి చావ బాదారు. ఈ దెబ్బలను తట్టుకొని అలాగే నిలిచి పోయిన నిరసనకారుడు ఎంతైనా కొట్టండి అంటూ అరుస్తోన్న వీడియో వైరల్ అయింది. మరో యువకు డికి లాఠీచార్జీలో కాలికి తీవ్రగాయమైంది. అయినప్పటికీ, నినాదాలు చేస్తూనే ఉండటం అక్కడివారిని కదిలించింది. అంతకు ముందు.. మద్ధతుదారులు ‘శాంతంగా ఉండాలి’ అని సిజెపి కోరింది. “కొన్ని చోట్ల మిమ్మల్ని అడ్డగించినప్పటికీ, ప్రశాంతంగా ఉండి శాంతిని కాపాడండి. మనం శాంతి, ప్రేమతో మాత్రమే దీన్ని గెలుస్తాం” అని పేర్కొంది. దీంతో విద్యార్థులు, యువత ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులే విద్యార్థులు, యువతపై అమానవీయంగా దాడికి దిగారు. పోలీసుల దెబ్బలతో సిజిపి పార్లమెంట్ మార్చిలో పాల్గొన్న పలువురి ఎముకలు విరగడంతో పాటు, తల, కంటి గాయాలతో వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు.
ఖాకీ దుస్తులు ధరించిన వ్యక్తి నోటి వెంట వచ్చే మాట, చేతిలోని కర్ర ఎలా కదులుతుందనేదే ఈ సమాజపు నాగరికతను నిర్దారిస్తుంది. దురదృష్టవశాత్తు, ఇటీవలి “చలో పార్లమెంట్” ఉదంతం ఈ దేశపు పోలీసు వ్యవస్థ ఇంకా ఎంత వెనుకబడి ఉందో మరోసారి బట్టబయలు చేసింది. మహళా విద్యార్థినులపై పోలీసులు చూపిన దుశ్చర్యలు యావత్ దేశాన్ని కలిచివేశాయి. పోలీస్ వ్యాన్ లోకి బలవంతంగా ఎక్కిస్తూ, వెనుక నుంచి ఓ పోలీసు కర్రను ఓ యువతి శరీరంపై అసభ్యకరంగా ఉపయోగించడం, మరో అధికారి ఆమె ఛాతిపై చేయి వేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. డిసిపి సందీప్ లంబా సిజెపి నిరసనలో పాల్గొన్న ఒక మహిళను చెంపపై కొట్టడం. ఇలాంటి దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. ఇది కేవలం ఒక ఘటన కాదు… రక్షించాల్సిన వ్యవస్థే దాడి చేసే స్థితికి దిగజారిన దుస్థితికి నిదర్శనం. యూనిఫారంలో ఉన్న చాలామంది పోలీసులు నేమ్ ప్లేట్లు లేకుండా విధులు నిర్వహించడం అనేక ప్రశ్నలకు తావిచ్చింది. గుర్తింపు దాచిపెట్టుకుని, జవాబుదారీతనం లేకుండా వ్యవహరించే బలగాలు ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతం.
నిరసనకారులపై పెల్లెట్ల వర్షం :
చలో సంసద్ ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు చట్టవిరుద్ధంగా పెల్లెట్ గన్‌లను ఉపయోగించినట్లు నిర్ధారణ అయింది. తాము వాటిని ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నప్పటికీ పెల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న పలువురి మెడికల్ రిపోర్ట్ లు బహిర్గతం కావడంతో ఆ ఖాకీ దుస్తుల కర్కోటక వైఖరి తేటతెల్లమైంది. నిరాయుధులైన ఉద్యమకారులు శాంతియుతంగా చేసే ర్యాలీల్లో పెల్లెట్లు ఉపయోగించకూడదని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం గతంలోనే ఎన్నోసా ర్లు చెప్పింది. అయినా ఢిల్లీ పోలీసులు సిజెపి కార్యకర్తలపై పెల్లెట్ల వర్షం కురిపించారని సామాజిక మాధ్య మాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నయి. ర్యాలీలో పాల్కొన్న 19 ఏళ్ల సాహిల్ లోకాబ్ కుడి కంట్లోకి పెల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ముఖమంతా రక్తసిక్తమైన అతడిని వెంటనే సమీప లేడీ హార్డింగ్ వైద్య కళాశాలకు తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి, అక్కడా సరైన పరిష్కారం లభించక పోవడంతో చివరకు ఎయిమ్స్ ట్రామా విభాగానికి 21వ తేదీన తరలించారు. పెల్లెట్ దాటికి అతని కుడి కంటి కార్నియాకు రంధ్రం పడింది. ఇప్పుడు అతనికి మిగిలింది చీకటే. అంత మాత్రమేనా.. ఇక ముందు అంతా చీకటి పాలనేనా..?
నిర్బంధాలతో గొంతు నొక్కలేరు :
ఢిల్లీలో జరిగిన సిజెపి ‘చలో పార్లమెంట్’ కార్యక్రమంపై కేంద్రం చేపట్టిన నిర్బంధం మరోసారి దేశంలోని స్థితిగతులపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. పార్లమెంట్ మార్చ్ లో లక్షలాది మంది ప్రజలు కదంతొక్క డంతో, పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. యూనిఫాంలు, నేమ్ బోర్డులు లేకుండా ఫేస్ మాస్క్‌లు ధరించి మీడియా దృష్టలో పడకుండా పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. వందలాది మంది గాయపడ్డారు. ప్రజా ఉద్యమాలను అణచివేయడంలో బిజెపి, కాంగ్రెస్ ఒక్కటే. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో రెండు పార్టీలు, విఫలమయ్యాయి. ఢిల్లీలో, గల్లీలో దొందూ దొందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ శక్తి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అందుకే సిజెపి ఇచ్చిన పిలుపులకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. ఆధిపత్య రాజకీయ పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పే రోజులు వస్తున్నాయి. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు వచ్చినవారు కానీ, ఊరేగింపులో పాల్గొన్నవారు కానీ ఎవరో డబ్బులిచ్చి పిలిస్తే వచ్చినవారు కాదు. వారి రాక కోసం ఎవరూ బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయలేదు. కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చే వారిని ఢిల్లీకి బయలుదేరేలా చేసింది. కేవలం నీట్ ప్రశ్న పత్రాల లీక్‌కు మాత్రమే రగిలిపోతూ వారు రాలేదు. నిరుద్యోగం, చాలీచాలని జీతాలు, వ్యవస్థలో లోపాలు, రాజకీయ పార్టీల కుతంత్రాలు చూసి విసిగిపోయిన వారే ఆ వచ్చిన యువతీయువకులు.
ఈ సందర్భంలో రెండు ముఖ్యమైన పరిణామాలను విద్యార్థులు, యువత విస్మరించలేరు. మొదటి ది- ఒత్తిడి లొంగకూడదని మోడీ ప్రభుత్వం ప్రతిన పూనినప్పటికీ చివరకు లొంగక తప్పలేదు. ఎంత మంది మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా మోడీ ప్రభుత్వం “నిరాకరణ వైఖరినే ప్రదర్శించింది. కానీ “నీట్” ప్రశ్నాపత్రం లీక్ అయినందువల్ల ఉద్యమం ఢిల్లీకి పరిమితం కాకుండా దాదాపు అన్ని రాష్ట్రాలలో ఉద్య మ కెరటాలు ఉవ్వెత్తున లేచాయి. ప్రశ్న పత్రాల లీక్‌ను అడ్డుకోవడానికి కఠినమైన ప్రత్యేక చట్టం తీసుకొ చ్చినా మోడీ ప్రభుత్వం తలొంచక తప్పలేదు. నిరంకుశ పాలకులకన్నా జనచేతన, జనశక్తి అమేయమైన దని ధరేంద్ర ప్రధాన్ రాజీనామా నిరూపించింది.
పట్టువిడవని నవతరం విద్యార్థుల ప్రజాస్వామ్యయుత ఆందోళన కేంద్ర సర్కార్ మెడలు వంచింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజికి జవాబుదారీగా విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌ను తిరస్కరిస్తూ వచ్చినమోడీ విధిలేని పరిస్థితిలో ఆయన చేత రాజీనామా చేయించారు. ఇది యువశక్తికి విజయంగా, ప్రజాస్వామ్య విజయంగా, జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ‘కాక్రోచ్‌లు గెలిచాయి, ప్రజాస్వామ్యం గెలిచింది’ అని ప్రకటించారు. సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, అంబేద్కర్ చిత్రపటాన్ని, రాజ్యాంగాన్ని చేబూని, ఆందోళన విరమిస్తు న్నట్లు ప్రకటించారు.
విద్యార్థి లోకం స్వచ్చంధంగా చేస్తున్న ఆందోళన ‘జెన్ జీ’ ఉద్యమంగా మారనుందా? ఇది ‘జెన్ జీ’ తరానికి చెందిన సమగ్ర ఉద్యమంగా మారుతుందా అన్నది అందరి ముందున్న ప్రశ్న. తీవ్రమైన పోటీ ఉన్న విద్యా రంగంలో, పేపర్ లీకేజీలు, అవినీతి వల్ల తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకపోవడం యువతలో తీవ్రమైన నిరాశను, ఆగ్రహాన్ని పెంచుతోంది. ‘జెన్ జీ’ తరం తమ హక్కులు, పారదర్శకత, నాణ్యమైన విద్యావ్యవస్థల కోసం నేరుగా అధికారులను, నేతలను ప్రశ్నిస్తోంది. దీనిని కేవలం ‘ప్రతిపక్షాల ప్రోద్భలం’గా భావిస్తే మాత్రం ప్రభుత్వం పప్పులో కాలు వేసినట్లే. సమకాలీన భారతదేశంలో నీట్ వివాదం కేవలం విద్యార్థుల మార్కుల సమస్య మాత్రమే కాదు. అది దేశ సార్వత్రిక పరీక్షల వ్యవస్థపై, పారదర్శకత పై వచ్చిన అతిపెద్ద అనుమానం. విద్యార్థుల నిరసనను ప్రభుత్వం ఎంత త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరిస్తుందనే దానిపైనే ఈ ఆందోళనలు ఇక్కడితో శాంతిస్తాయా లేదా దేశ సరిహద్దులు దాటే స్థాయి విశాలమైన ‘జెన్ జీ’ ఉద్యమంగా రూపం దాలుస్తాయా అనేది ఆధారపడి ఉంది.
ముగింపు :
దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేశాయి. ఇది కేవలం ఒక పరీక్షా పత్రం వివాదంపై వచ్చిన ప్రతిస్పందన మాత్రమే కాదు. చాలాకాలంగా యువతలో, మధ్యతరగతి లో, సామాన్య ప్రజల్లో పేరుకుపోయిన అసంతృతప్తి ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడిన సందర్భం. ప్రజల గొంతును వినకుండా, ప్రతి నిరసనను కుట్రగా లేదా రాజకీయ ప్రేరేపిత చర్యగా కొట్టిపారేస్తే సమస్య మరింత తీవ్రమవుతుందనటానికి ఇది నిదర్శనం. అసంతృప్తిని అణచివేయడం ద్వారా కొంతకాలం నిశ్శబ్దత తీసుకురావచ్చు. కానీ విశ్వాసాన్ని మాత్రం తిరిగి పొందలేరు. ప్రతి ఉద్యమం ప్రభుత్వాలను కూల్చదు. కానీ ప్రతి ఉద్యమం ఒక హెచ్చరికను మాత్రం ఇస్తుంది. ప్రజల ఆకాంక్షలు, యువత, ఆశలు, విద్యార్థుల భవిష్యత్తు వంటి అంశాలను నిర్లక్ష్యం చేసే పాలనపై సమాజం ప్రశ్నలు లేవనెత్తుతుందని గుర్తుచేసింది. ప్రజల అసంతృప్తి అగ్నిపర్వత్వం ఒక్కరోజులో బద్దలు కాదు. అది ఎన్నో రోజులుగా పేరుకుపోయిన వేడి, ఆవేదన, నిరాశ, అనుమానాల ఫలితం. ఆ వేడిని చల్లార్చేది ప్రచారం కాదు, పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయం. ప్రజలతో నిజాయితీతో కూడిన సంభాషణ మాత్రమే.
ప్రజాస్వామ్యంలో చివరి మాట ఎప్పుడూ ప్రజలదే. వారి విశ్వాసాన్ని గెలుచుకున్న పాలన నిలుస్తుంది. వారి మనసును కోల్పోయిన పాలన మాత్రం ప్రతి ఉద్యమంలో, ప్రతి నిరసనలో, ప్రతి ప్రశ్నలో తన ప్రతిబింబాన్ని చూసుకోవాల్సిందే. ఏది ఏమైనా ఈ ఉద్యమం దీంతో అంతం కాదు. ఆరంభం మాత్రమే. దేశ భవిష్యత్‌లో యువత నిజంగా పాత్ర వహించాలంటే సామాజిక ఉద్యమాలు సంఘటితంగా చేపట్టాల్సి ఉంది. ఇటువంటి ఐక్యత విజయాలు సాధిస్తుందని కాక్రోచ్ ఆందోళన నిరూపించింది.