ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లినపుడు సంప్రదాయ ఆదివాసీ నృత్యరీతుల్లో ఒకటైన థింసాను పెద్ద ఎత్తున ప్రదర్శించారు. 13 వేలకు పైగా ఆదివాసీ మహిళలు, స్కూలు విద్యార్థినులు ఈ నాట్య ప్రదర్శనలో పాల్గొన్నారు. దీనికి గినిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించిందనే వార్తలు కూడా ఉన్నాయి. ఆదివాసులు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం ఆదివాసులకు సంబంధించింది అయి ఉంటుందేమో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. విశాఖపట్నం సమీపంలో నిర్మించిన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం అది.
ప్రభుత్వ నిర్వహణలో జరిగే ఉత్సవాల్లో ఆదివాసుల కళాసంస్కృతుల ప్రదర్శన కొత్తదేం కాదు. కానీ గత కొన్నేళ్లుగా ఈ ధోరణి బాగా పెరుగుతోంది. ఎన్నికల ర్యాలీల్లో, ప్రభుత్వ వేడుకల్లో, మంత్రులు, ప్రధానమంత్రులు చేసే పర్యటనల్లో లేదా పెద్ద పెద్ద రాజకీయ సభల్లో ఆదివాసుల నాట్యప్రదర్శనలు అనివార్య భాగంగా మారిపోయాయని చెప్పొచ్చు.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గౌర్, మాదర్. రేలా; ఝార్ఖండ్‌కు చెందిన ఝూమర్, పైకా; ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన ధింసా; ఇంకా సంథాల్ నాట్యం, ఈశాన్య ప్రాంతాలకు చెందిన సంప్రదాయ నృత్యాలు, మధ్యభారతంలోని ఇతర ప్రాంతాలకు చెందిన ఆదివాసీ జానపద కళారీతులు… ఇవన్నీ ఏ రాజకీయ కార్యక్రమానికైనా ప్రారంభ సన్నివేశంగా ఉంటున్నాయి. అయితే, ఆదివాసీ సంస్కృతికి, దాని సామాజిక, చారిత్రక సందర్భానికి తగినట్టుగా సముచిత గౌరవం దక్కుతోందా అంటే లేదనే జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. దాన్ని కేవలం ‘ఇతరులకు’ వినోదాన్ని అందించే ఓ ‘చిత్రమైన’ వస్తువుగా మాత్రమే చూస్తున్నారని, వాడుకుంటున్నారని చెప్పకతప్పదు.
ప్రభుత్వ అధికారుల ముందు లేదా మంత్రుల ముందు ఆదివాసుల నాట్యప్రదర్శనకు మూలాలు నేరుగా వలసవాద మనస్తత్వంలో ఉన్నాయి. బ్రిటిష్ కాలంలో ఆదివాసీ సముదాయాలను ‘మెయిన్‌స్ట్రీమ్’కు అతీతమైనవిగా, ఆదిమ లేదా ‘చిత్రమైన’ వస్తువులుగా చూసేవారు. వారి వస్త్రధారణను, కళలను ప్రహసనంగా చూసే ధోరణి ఉండేది. ఈనాడు కూడా దేశాన్నేలే అతి పెద్ద వీఐపీకి స్వాగతం పలికేటప్పుడు వేలాది మంది ఆదివాసులతో ఒకే రకం బట్టలు తొడిగించి డాన్స్ చేయించడం అంటే వలసవాద మనస్తత్వానికి పొడిగింపే తప్ప మరొకటి కాదు.
సంస్కృతిలో అంతర్భాగం :
థింసా నాట్యం ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, ఇంకా ఆ చుట్టుపక్కల ఆదివాసీ ప్రాంతాలతో పాటు ఒడిషాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాల్లో నివసించే ఆదివాసీ సముదాయాలు – ముఖ్యంగా భగత, కోందు, వాల్మీకి, పొరజ సహా అనేక తెగల సామూహిక సాంస్కృతిక గుర్తింపులో భాగం. ఇది కేవలం వినోదాన్ని పంచే సాధనం మాత్రమే కాదు, వాళ్ల చరిత్ర, వ్యవసాయ కాలచక్రం, ప్రకృతి పరిణామాలు, సమిష్టి జీవనం, సామాజిక సంబంధాలతో ముడిపడిన సాంస్కృతిక వ్యక్తీకరణ! ధింసా పాటలు, అందులోని లయ.. సమాజం, ప్రకృతి రెండూ పరస్పరం వేర్వేరు కాదని చెప్పే వాళ్ల జీవన తత్వాన్ని వెల్లడి చేస్తాయి.
ప్రధానమంత్రి కార్యక్రమంలో ధింసా నృత్య ప్రదర్శనను ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా మంది తప్పుపట్టారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీ.వీ. రమేశ్ దీనిపై అభ్యంతరం చెబుతూ, ఒక గౌరవప్రదమైన సాంస్కృతిక సంప్రదాయాన్ని ఇలా రాజకీయ తమాషాగా మార్చెయ్యడం అనుచితం అన్నారు. ఇలా ఆదివాసీ నాట్యాన్ని రాజకీయ నాయకుల స్వాగత కార్యక్రమంలో భాగంగా మార్చడం అంటే వారి సంస్కృతిని అవమానించడమే అని ఆయనన్నారు.
వాస్తవానికి ఆదివాసులు ఏ నాట్యాన్నైనా వాళ్ల గ్రామాల్లో, వాళ్ల సొంత వాతావరణంలో, వాళ్ల సొంత మనుషుల మధ్య చాలా సహజంగా ప్రదర్శించాలనుకుంటారు. ప్రకృతి, సమాజంతో పాటు తమ జీవితంలోని అన్ని పార్శ్వాల పట్ల ప్రేమ, గౌరవ భావంతో దాన్ని ప్రదర్శించాలనుకుంటారు. కానీ ఇప్పుడు అదెంత వ్యాపారంగా మారిపోయిందంటే, కొన్ని డబ్బులిస్తే చాలు, అలాంటి కార్యక్రమాన్ని చాలా సులువుగా ఎక్కడంటే అక్కడ ఏర్పాటు చేయొచ్చు.
దాదాపు మూడేళ్ల కింద, 2023లో నాకు ఒడిషా-ఆధ్రప్రదేశ్ సరిహద్దులో ఉండే అరకులోయకు వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడికొచ్చే పర్యటకుల వినోదం కోసం అక్కడి ఆదివాసీ మహిళలు కొన్ని రూపాయలు తీసుకొని ధింసా డాన్స్ చేయడం నేను చూశాను. టూరిస్టులు కూడా వాళ్లతో కలిసి డాన్స్ చేస్తున్నారు. వీడియోలు, ఫొటోలు తీసుకుంటున్నారు. కానీ వాళ్ల ప్రదర్శనలో ఎక్కడా కూడా అది కేవలం ఓ కళారూపం మాత్రమే కాదని, వాళ్ల సాంస్కృతిక, సామాజిక జీవనంలో భాగమనే అవగాహన కనిపించలేదు.
ఇది కేవలం మన దేశానికి పరిమితమైందే కాదు. బహుశా ప్రపంచంలో ఎక్కడైనా ఆదివాసీ సంస్కృతిని ఇదే విధంగా ప్రదర్శిస్తున్నారనిపిస్తోంది. పోయినేడాది నేను ఒక సెమినార్లో పాల్గొనేందుకు ఫిలిప్పీన్స్‌కు వెళ్లాను. అక్కడి ప్యూర్టో ప్రిన్సెసా సిటీలో బటర్‌ఫ్లై ఇకో గార్డెన్ ట్రైబల్ విలేజ్ పేరుతో ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది. అందులో కూడా కొందరు పిల్లలు, ఆడవాళ్లు, మగవాళ్లు పలావన్ ఆదివాసుల వేషభూషలతో కనిపిస్తూ, టూరిస్టులకు వినోదాన్ని అందిస్తూ ఉంటారు.
అరకులోని ఆదివాసీ మ్యూజియంలో కూడా మరో రూపంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇక్కడ ఆదివాసీ జీవనం, సంప్రదాయాలు, సంస్కృతిని వివిధ కళాకృతుల ద్వారా ప్రదర్శిస్తారు. వీటిని చూడటాన్ని విదేశాల్లోంచి కూడా పర్యటకులు వస్తుంటారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దాదాపు 250 ఎకరాల్లో విస్తరించిన ఆదివాసీ మ్యూజియంలో కూడా ఆదివాసీ గాథలు, జానపదాలు, కళ, జీవనం, తాత్వికతకు సంబంధించిన వాటిని ప్రదర్శిస్తారు. ఇలా దేశంలో ఉన్న అనేక ఆదివాసీ మ్యూజియాల్లో ఆదివాసీ సమాజాన్ని ప్రతిబింబించే విల్లుబాణాలు, మట్టిపాత్రలు, కర్రతో చేసిన శిల్పాలు, సంప్రదాయ వస్త్రధారణ, అలంకరణలు, నృత్యరీతులు, వారి విశ్వాసాలకు సంబంధించిన వివిధ రకాల తంతులను ప్రదర్శిస్తున్నారు.
చాలా మ్యూజియాల్లో ఆదివాసుల కథల్ని ఆదివాసీయేతర క్యూరేటర్లు, చరిత్రకారులు లేదా ప్రభుత్వ సంస్థలే రాస్తున్నాయి. ప్రముఖ ఆఫ్రికన్ రచయిత, తత్వవేత్త గూగీ వా ధియాంగో తన పుస్తకం ‘డీకాలనైజింగ్ ద మైండ్’లో సాంస్కృతిక ప్రాతినిధ్యం, అధికారం (power) మధ్య ఉండే సంబంధం గురించి చాలా నిశితంగా రాశారు. ఒక సముదాయం కథను వేరేవాళ్లు రాస్తే, ఆ సముదాయపు గొంతు బలహీనపడిపోతుందని ఆయనంటారు. ఆదివాసీ సంస్కృతిని ప్రభుత్వం ఇలా ప్రదర్శనల్లో భాగం చేయడాన్ని కూడా ఇదే కోణంలో చూడాలి. అక్కడ ఆదివాసులు తమ సొంత సంస్కృతిక ప్రతినిధిగా ఉన్నారా, లేదా అధికారానికి వినోదాన్ని అందించే డాన్సర్లుగా ఉన్నారా? అన్నది అసలు ప్రశ్న.
ఆఫ్రికన్-అమెరికన్ కవి కరీమ్ వఫా-అల్ హుసైనీ ఇలా రాస్తారు – “సామ్రాజ్యానికి మ్యూజియాలంటే ఇష్టం. ఎందుకంటే ఒక సంస్కృతిని అద్దానికి అటు వైపు నుంచి నియంత్రించడంకన్నా సులువైంది మరొకటి ఉండదు.”
పరంపరను ప్రహసనంగా మార్చెయ్యడం :
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2025లో ‘బస్తర్ పండుమ్’ (గోండీ భాషలో ‘పండుమ్’ అంటే పండుగ లేదా ఉత్సవం అని అర్థం) మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఆదివాసుల జానపద నృత్యాలు, పాటలు, వాయిద్యాలు, సంప్రదాయ చేతివృత్తులు, వేషధారణ, అలంకరణలు, ఆహార పద్ధతులు వంటివి ప్రదర్శిస్తోంది. బస్తర్‌కు సంబంధించి, చారిత్రకంగా సమృద్ధమైన ఆదివాసీ సంస్కృతిని ఒక సర్కారీ కార్యక్రమం ద్వారా కేవలం రంగురంగుల డాన్సులకు, సంప్రదాయ వస్త్రధారణ ప్రదర్శనకు కుదించడాన్ని చాలా మంది తప్పుపట్టారు.
‘పండుమ్’ అనేది ఆదివాసీ సమాజంలో సంతోషంతో ముడిపడిన వేడుక. ‘పండుమ్’ వాస్తవానికి గ్రామదేవతల పూజకు సంబంధించిన విశిష్టమైన పూజాపద్ధతి. ఈ సందర్భంగా వారు తమ పూర్వీకులను, అడవులను, కొండలను పూజిస్తారు. సంతోషంగా గడుపుతారు. పంటలు ఇంటికి వచ్చినప్పుడు ‘పూన పండుమ్’, మామిడి కాత కాసినప్పుడు ‘మర్క పండుమ్’, విత్తనాలు చల్లేటప్పుడు ‘విజ్జ పండుమ్’… ఇలా సందర్భానికి తగినట్టు సంతోషంగా జరుపుకునే వేడుకలే ‘పండుమ్లు’.
ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో, మేలాల్లో, లేదా ఇతర ప్రచార కార్యక్రమాల్లో ‘పండుమ్’ అనే గోండీ/కోయ పదాన్ని ఉపయోగించడంపై ‘సర్వ ఆదివాసీ సమాజ్’, ఆదివాసీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన ఉత్తరంలో, ఆదివాసీ విశ్వాసాల్లోని మౌలిక సారాన్ని ఇలా వికృతంగా మారుస్తూ వాడకూడదని వారన్నారు. దీన్ని ప్రభుత్వ ఆర్భాటాలకు శీర్షికగా మార్చడం ఆదివాసీ విశ్వాసాలకు, సంప్రదాయాలకు విరుద్ధం అని అన్నారు.
సంరక్షణపై పట్టింపు లేదు :
బస్తర్ సంస్కృతి అంటే కేవలం నృత్యం, వేషభూషలకు సంబంధించింది కాదు. అది తరతరాలుగా జల్, జంగల్, జమీన్, సామూహిక జీవితం నుంచి అభివృద్ధి చెందిన విశిష్టమైన వ్యవస్థ. గోటుల్ లాంటి సామాజిక సంస్థలు, సమిష్టి వ్యవసాయ పద్ధతులు, విత్తన సంరక్షణ, జానపద గాథలు, దేవతల సంప్రదాయాలు, ప్రకృతితో సహ-అస్తిత్వం… ఇవన్నీ వారి సాంస్కృతిక గుర్తింపుకు పునాదిగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రభుత్వ ప్రాయోజిత సాంస్కృతిక వేడుకలతో ఈ వారసత్వాన్ని సంరక్షించడం అసలు ఎలా సాధ్యమవుతుంది అన్నది విమర్శకులు లేవనెత్తే ప్రశ్న.
ఏ ప్రజా సముదాయాల నృత్యాలు పెద్ద పెద్ద వేదికలకు అలంకరణలుగా మారుతున్నాయో, సరిగ్గా అవే సముదాయాలు అనేక చోట్లలో భూఆక్రమణలు, అక్రమ మైనింగ్, అటవీ హక్కుల ఉల్లంఘన, నిర్వాసితత్వం, పౌష్టికాహార లోపం, విద్యాలేమి, వైద్య సదుపాయాల కొరత వంటి సీరియస్ మౌలిక సమస్యలు ఎదుర్కొంటున్నాయనేది ఓ చేదు నిజం. ఈ సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉండేవాళ్లు లేదా ఈ సమస్యలను లేవనెత్తే వాళ్లపై రకరకాల ఆరోపణలు చేస్తూ వారి గొంతు నొక్కేస్తున్న వాళ్లే వారితో డాన్సులు చేయిస్తూ ఆస్వాదిస్తున్నారు. వాళ్ల మేలు కోరే వాళ్లం తామే అన్నట్టుగా నటిస్తున్నారు.
భాషల పట్ల నిర్లక్ష్యం :
ఇకపోతే.. ఆదివాసుల నాట్య ప్రదర్శనలపై ఇంతగా ఆసక్తి కనబర్చేవాళ్లకు వాళ్ల భాషల పట్ల మాత్రం ఏ మాత్రం పట్టింపు లేదనేది మరో చేదు నిజం. మధ్య భారతంలోని విశాలమైన ఆదివాసీ ప్రాంతాల్లో – ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిషా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలోని అనేక ప్రాంతాల్లో మాట్లాడే గోండీ, కోయ, హల్బీ, కుడుఖ్, కుడ్మాలీ, కోర్కూ, భీలీ, భత్రీ, పర్జీ, మాడియా, దొర్ల, కుయీ, సవర వంటి అనేక భాషలు తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ముంగిట్లో ఉన్నాయి. అంటే ప్రభుత్వ వేదికలపైన ఏ సముదాయాల సంస్కృతిని వేడుకల రూపంలో ప్రదర్శిస్తున్నారో, సరిగ్గా వాటి భాషలు ప్రజాజీవితంలోంచి వేగంగా నిష్క్రమిస్తున్నాయి.
భాష కేవలం సంభాషణకు సాధనం మాత్రమే కాదు. అదొక సముదాయపు చరిత్ర, జ్ఞానం, ప్రకృతిపై అవగాహన, ప్రపంచాన్ని చూసే దృష్టికోణానికి వ్యక్తీకరణ సాధనం కూడా. ఒక భాష అంతరించిపోతే, దాంతో పాటు ఆ సముదాయం ఆర్జించుకున్న తరతరాల సంప్రదాయ జ్ఞానం, జానపద గాథలు, పాటలు, ప్రాచీన చికిత్స పద్ధతులు, వ్యవసాయ సంబంధమైన అనుభవాలు, ప్రకృతితో వారి సంబంధాలు, లోకోక్తులు, సామెతలు, పొడుపుకథలు అన్నీ సమాప్తి దిశగా ప్రయాణిస్తాయి.
మధ్య భారతంలోని అతి పెద్ద ఆదివాసీ భాషల్లో గోండీ/కోయ ముఖ్యమైంది. గోండ్ సముదాయానికి చెందిన ప్రజలు కోట్ల సంఖ్యలో ఉన్నప్పటికీ, వారి భాష అడ్మినిస్ట్రేషన్, న్యాయస్థానాలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎక్కడా కూడా ఉపయోగంలో లేకుండా పోయింది. రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూలులో దానికి చోటు దక్కలేదు. వేర్వేరు ప్రాంతాల్లో ఈ భాష స్వరూపం అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ వాటిని సంరక్షించే ప్రయత్నాలు గానీ, రాతకు ఉపయోగపడేలా స్టాండర్డైజ్ చేసే ప్రయత్నాలు గానీ లేనే లేవని చెప్పొచ్చు.
మహారాష్ట్రలోని గఢ్చిరోలి జిల్లాలో మొహ్గాంలో గ్రామసభ నడిపించే ‘పారంపరిక్ కోయ జ్ఞాన్బోధ్ సంస్కార్ గోటుల్ స్కూల్’ను చట్టవిరుద్ధమైందిగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మూసేసే ప్రయత్నం చేస్తోంది. ఇది ఆ రాష్ట్రం మొత్తంలో గోండీ మీడియంలో నడిచే మొట్టమొదటి, ఏకైక పాఠశాల. ఆదివాసీ సముదాయాలకు దక్కాల్సిన గౌరవాన్ని, వారి భాషలను, సంప్రదాయాలను, వారి హక్కులను సంరక్షించినప్పుడే ఆదివాసుల సంస్కృతికి సముచిత గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. ఏ ప్రభుత్వమైన వారి సంస్కృతి విషయంలో తాము చేశామని చెప్పుకునే గొప్పలకు అదే అసలైన గీటురాయి.
(మొదట ‘ద వైర్’లో వచ్చిన ఈ వ్యాసానికి తెలుగు అనువాదం)
హిందీ మూలం: https://thewirehindi.com/334984/tribal-dance-at-govt-events-respect-for-culture-or-mere-entertainment/