దళిత కథ – వృత్తి చిత్రణ

నీలి నేల ఎతలు – 5

సమాజంలో జీవనం కోసం, వ్యక్తిగత నైపుణ్యాలు, ప్రత్యేక శిక్షణపై ఆధారపడి, జీవనభృతి కొరకు చేసే ఏదైనా పని లేదా సేవను వృత్తి అంటారు. దళితులకు వృత్తులున్నవి. ప్రధానంగా మాదిగలకు మాదిగతనం, డప్పు కొట్టడం, తాళ్లు పేనడం లాంటి పనులున్నాయి. సుంకరి (మాస్కూరితనం) మాలల ప్రత్యేకమైన పని అంటూ లేకుండా పోవడం వల్ల అవసరాన్ని బట్టి అన్ని పనులు చేశారు. మాదిగ ఉపకులాలైన చిందు భాగోతాలవారు, డక్కలివారు పటం చూపడం, బైండ్లవారు ఎల్లమ్మను పూజించడం, మాష్టీలు జాంబవంతుని కథాగానం, నులక చందయ్యలు జాంబవతత్వాన్ని ప్రవచించడం, మాల ఉపకులాలైన బేగరి, తలారులు బొంది తోడడం, గురవులు మాలల చరిత్ర చెప్పడం మొదలైనవి కలవు. దళితుల వృత్తులు, ఉపకులాల వృత్తులు కథాత్మకంగా, కళాత్మకంగా కథాసాహిత్యంలో ఇతివృత్తాలయ్యాయి.

చెప్పులు కుడుతూ వ్యవస్థను ఏకరువు పెడుతూ పాఠకునిలో లోతుగా నాటిన చర్చ మనల్ని మేల్కొల్పుతుంది. కాలం కాళ్లనూ, రెక్కలనూ తెగ్గోసినట్లు ప్రపంచీకరణ మార్పులతో కులవృత్తి కుదేలైన విధానం ఒకవైపు. మరోవైపు ప్రభుత్వ స్కీముల వల్ల అభివృద్ధి ఎలా అడుగంటిపోయిందో తెలిపే బోయ జంగయ్య కథ ‘ఇది కతా?’. పని లేక తిండి లేదు. మల్లయ్య ఆకలితో అల్లాడుతూ చుట్ట తాగుతూ ‘పీల్చిన పొగ కడుపులో ఉండిపోతే బాగుండు. ఆకలి కాకుండా ఉండిపోవు’ అనుకుంటాడు.

చెప్పుల మల్లయ్య ఊరిలో పనిచేసిన వైనం – చెప్పులు బాగుచేస్తూ మాట్లాడసాగిండు. సర్కారోళ్లు తోళ్ల వ్యాపారం పెట్టిస్తే వాటిని కొనేవాడే లేకపాయె. రబ్బరు చెప్పులతో తోళ్ల చెప్పులు వెనకబడ్డయి. ఆవును సబ్సిడీ కింద ఇప్పిస్తే ఏం లాభం? ఎండ తగులొద్దనే. మేకలు అమ్మితి. పిండి పెట్టాలనిరి. ఆవు చచ్చె. అప్పు మిగిలె. మరొక వ్యక్తి చెప్పులిచ్చినప్పుడు రేపు బంద్ అని ప్రకటించే ఒక జీపు మైక్. బందైతే ఇగ ఉపాసమే. మనది ప్రజాస్వామ్యమనే ఆ పెద్దమనిషి. మనకోసం మనం ఎన్నుకోవడమనే. ‘ఓట్లేసినోళ్లకే కూలి బందవుతదని పార్టీవాళ్లకు తెలవకుండా ఉంటుందా?’ అని చెప్పుల మల్లయ్య ప్రశ్న. “అయ్యా! ఇన్ని కనిపెడుతున్నవు, ఆకలి కాకుండా మందెందుకు కనిపెట్టవు” అని అడగ్గానే మౌనం ఆవరించే. మాటలు కాదయ్యా బాధలని చెప్పె. అప్పుడే ఓ కోతి వచ్చి సలాం పెట్టింది. కోతిని తెచ్చిన మనిషికి పైసలు వేసాడు ఆకలితో అలమటించే చెప్పుల మల్లయ్య. చెప్పులు కుట్టడం ద్వారా తల్లి ఎల్లమ్మను ఆశ్చర్యచకితురాలిని చేసిన గోగు శ్యామల కథ ‘బడేయ్య’. తెలియకుండానే తెల్లారేసరికి చెప్పులు కుట్టిచ్చిన కథ.

చెప్పుల ప్రాశస్త్యాన్ని తెలుపుతూనే ఆత్మగౌరవం ప్రకటించిన దార్ల రామచంద్ర గారి కథ ‘కిరు చెప్పులు’. మనుమరాలు అడిగినందుకు తాత చెప్పిన రహస్యం – మన మాదిగ వృత్తి వూడితే వూడింది, ఆత్మగౌరవం మిగిలింది. అంటరానితనం తగ్గుముఖం పట్టింది. ఈ పాక్షిక మార్పుకు మానసిక సంతోషంగా ఉంది. ఆర్థిక విధానంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని ఈ కథ వివరిస్తుంది.

కె.పి. లక్ష్మీనరసింహ కథ ‘చెప్పుల సాయమ్మ’లో సాయమ్మ తయారు చేసే చెప్పుల బ్రాండ్ పేరెన్నికగన్నది. “ధర తక్కువ, మన్నిక ఎక్కువ” అని ఆమె పని నైపుణ్యం కనిపిస్తుంది. మొగుని తీరుగా చెప్పుల సాయమ్మ పిచ్చిదైంది. అడుక్కుతింటున్నదని ముగించడం బాధను తెలుపుతుంది.

మాదిగల వృత్తి చెప్పులు కుట్టడంతో అనుబంధాల్ని నెమరేసుకుంటూ కె.పి. లక్ష్మీనరసింహ కథ ‘చెప్పుల సాయవ్వ’, నోట్ల రద్దు వల్ల జీవితాలు ఎలా మారుతాయో, చెప్పులు కుట్టే జీవితాల్లోని అలజడిని చిత్రించిన సిద్దెంకి యాదగిరి కథ ‘పిడుగు’. చెప్పులు కుట్టే విధవరాలైన లింగమ్మ, బిడ్డ పెళ్లి కోసం జాగా అమ్మగా వచ్చిన డబ్బుల్ని మార్పిడి చేసుకోలేకపోయింది. వరకట్నం ఇవ్వడానికి వెళ్తే మగపెళ్లివారు “చెల్లని నోట్లు ఎందుకు? చెల్లే నోట్లు తెచ్చి ఇవ్వండి” అని బలవంతపెడతారు. డబ్బులు ఇచ్చాక రిజిస్ట్రేషన్ అయింది. “నాకేం సంబంధం లేదు” అనే సమాధానం మధ్య సంఘర్షణను చిత్రించింది.

చెప్పులు కుట్టే వృత్తిని నమ్ముకున్న నర్సింహా ఆ దైవాన్ని పూజిస్తాడు. నమ్ముకున్న వృత్తి కడుపు నింపనప్పుడు తినడానికి లేని పరిస్థితిని తెలిపిన సిస్టర్ అనసూయ కథ ‘కుంగిన పొద్దు’ తెలుపుతుంది. భార్య చివరి ఘడియల్లో అతడు వృత్తిని వదులుతాడు.

వాయి చెప్పులు, తోలు చెప్పుల గిరాకీ పడిపోయిందని చెప్పే జాతశ్రీ కథ ‘ముళ్లపొద’. ఈ కథలో పాపయ్య మోచి కులస్థుడు. కుటుంబం గడవడానికి సైకిల్ రిపేర్ నేర్చుకుంటాడు. ఇది వృత్తి బదలాయింపును తెలియజేస్తుంది.

డప్పు : డప్పు తొలి వాయిద్యం. పండుగలకు, పబ్బాలకు ముందు మోగించేది. డప్పు దరువులతో విషాదము, వినోదము వినిపిస్తుంది. తమ జీవితంలో డప్పుతో పెనవేసుకున్న అనుబంధాలను దాగుడుమూతలు ఆడటం చాలామందికి బాల్యంలో గుర్తుంటుంది. డప్పు శబ్దం ద్వారా మాదిగలు దాగుడుమూతలు ఆడుతారు. ఆడే విధానాన్ని గోగు శ్యామల ‘జాడ’ కథ ద్వారా, అంతరించిపోతున్న ఈ కళకు అక్షరాత్మకంగా జీవం పోసింది. దెబ్బ కొట్టిన తీరును బట్టి ముందుకు, పక్కకు, వెనుకకు వెళ్లి దాచిన వస్తువును వెతికి పట్టుకుంటారు. పట్టుకుంటే గెలిచినట్టుగా ప్రకటిస్తారు. నైపుణ్యాన్ని నైపుణ్యంగా తీర్చిదిద్దిన కథ.

మాదిగ గౌరనికి సర్కారు కొలువు ఇస్తామని ఎలా మోసం చేస్తారో తెలిపే గూడ అంజయ్య కథ ‘గౌరడు’. క్యాంప్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం ఎర వేసి “సర్కారు కొలువు ఇస్తే చేస్తావా” అని అడిగితే, “ఎవరొద్దంటరు సారు” అని బదులు పలికిండు గౌరడు. మలమూత్రాలు ఎత్తిపోసే పని చేస్తాడు. క్యాంప్ ఎత్తేస్తుండగా కొలువు కోసం అడిగితే, “ఈ ఊరి ఎట్టి మాదిగవు, ఎక్కడివి కూలిడబ్బులు” అని కసురుకుంటాడు అధికారి. మునుపటిలా కాకుండా గౌరడు ఆత్మగౌరవంతో బతకాలనుకుంటాడు.

డా. పసునూరి రవీందర్ కథ ‘జెజ్జెనక జెన’లో “డప్పు కొట్టేటోళ్ల, సబ్బండ కులాల రాత మార్చుటకొరకే నేనే మోగిస్తున్నా.. మోగిస్తున్న” అని చెప్పడం నింపుతున్న ఆత్మవిశ్వాసమే. డప్పును కేంద్రంగా చేసుకుని కథలు ఎక్కువ రాసింది కూడా వీరే. అంబేడ్కర్ విగ్రహం పెట్టడాన్ని అడ్డుకున్న రామేశ్వరావు దొర తల్లి చావుకు, చావు డప్పులు కొట్టమని తిరుగుబాటు చేసిన కథ డా. పసునూరి రవీందర్ రాసిన ‘ధూం తడాఖా’. మాదిగలు తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్నరు. డప్పులు రాకపోతేంది? సాకలి కట్టెయ్య బ్యాండ్‌కి ఫోన్ చేస్తే “నేను పెళ్లిలో ఉన్న. నాకు రావడానికి వీలు కాదన్న”డు. సప్పుడు లేని చావు చిత్రమనిపిస్తుంది ఊరికి. శవం సప్పగా స్మశానానికి చేరింది. దొర ప్రతీకారాన్ని తిప్పికొట్టడానికి చింత చెట్టు కింద డప్పులు మోగుతున్నయి.

ఏర్పడని శిక్ష ఎట్లా ఉంటదో తెలిపే డా. సిద్దెంకి యాదగిరి కథ ‘శిక్ష’. పెళ్లి కార్యానికి బట్టలు కొనడానికి పోతే ఆటోలో మాదిగోడు ఎదురైండనీ మల్లన్న శిగమూగే బుచ్చక్క ముఖం చిట్లిస్తది. మాటలు విన్న చందయ్య తప్పు పట్టుకోడు. పెళ్లి అయింది. పోషమ్మకు బోనాలు తీసిండు. చందురుగాడు డప్పు కొట్టుకుంట ఎగిరిస్తండు. కోపంతో, ఆవేశంతో ఎగురుతుంది. చెమటలు వరదలై పారుతున్నయి. దాహం దాహం అంటది. ఎగురుడు ఆపుతున్నప్పుడు “నిజమైన దేవతవైతే ఎగురాలే” అని ఒంటికాలి మీద ఎగిరిస్తడు. బుచ్చక్కకు కళ్లు మూసుకుపోతున్నయి. బోనం బూదెవ్వ ఎత్తి బండి మీద గుడికాడికి పోతది. “పోండి, పోండి, అక్కా! దేవునికి అందరు సమానమే. నువ్వొకటి కాదు, నేనొకటి కాదు. నేను డప్పు కొడితేనే దేవుడు వస్తది. నేను కొట్టకపోతే దేవుడే రాడు” అని చందయ్య అంటాడు.

బహుజన తాత్వికతతో ఉమ్మడి శత్రువుని ఎప్పటికైనా ఎదుర్కోవాలని బహుజనులను ఏకం చేసి పోరుబాటకు ప్రాణం పోసే జిలుకర శ్రీనివాస్ కథ ‘నర్సయ్య ధ్యానం’ బహుజనవాదానికి సిద్ధాంతమే. ‘బైండ్ల చందయ్య’ కథల ద్వారా తిరుగుబాటును, దళితబహుజనులను కాపాడుకోవాలనే ఆరాటాన్ని చూస్తాము. దళితులను వలచి వచ్చిన ప్రేమలు, ధిక్కారాలు ఎన్నో ఆ కథలలో చిత్రించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఇటుకకు రాయితో సమాధానం’ చెప్పినట్లు కథ నడపడం వీరి ప్రత్యేకత.

తినడానికి లేకపోతే తిండికి కరువైంది. బతుకు బరువైంది. బతకలేని పరిస్థితిని తెలిపిన సిస్టర్ అనసూయ కథ ‘కుంగిన పొద్దు’. యాంత్రీకరణ కులవృత్తుల కాళ్లు, రెక్కలు విరగ్గొట్టింది. నోటికాడి బుక్క ఎత్తుకుపోయింది. నమ్ముకున్న వృత్తి కడుపు నింపనప్పుడు ఎంత అభిమానమున్నా ఏం లాభం? చెప్పులు కుట్టే వృత్తిని నమ్ముకున్న నర్సింహా ఆ దైవాన్ని పూజిస్తాడు. పూటకు లేకున్నా వృత్తిలోనే కొనసాగాడు. కంపెనీ చెప్పుల ముందు కంపు కొట్టిందని బాధపడలేదు. భార్య చివరి ఘడియల్లో వృత్తిని వదిలి, తప్పనిసరి పరిస్థితుల్లో ఊరు వదిలి పట్నం పయనమైండు. ప్రపంచీకరణ ఉత్పత్తిదారుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇది తెలియజేస్తుంది.

ప్రపంచీకరణ – గ్లోబలైజేషన్ (ప్రపంచీకరణ) అనేది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు, సంస్కృతులు, మరియు సమాజాల పరస్పర అనుసంధానం. ఇది దళితుల సామాజిక-ఆర్థిక జీవనంపై మిశ్రమ ప్రభావాన్ని చూపింది.

  1. సానుకూల అంశాలు : ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించాయి. కుల వ్యవస్థ మరియు గ్రామాల్లోని ఆధిపత్య ధోరణుల నుంచి యువత బయటపడటానికి ప్రపంచీకరణ, పట్టణీకరణ దోహదపడ్డాయి. దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వంటి సంస్థల ద్వారా దళితులు వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. ప్రపంచ ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి రావడం ద్వారా ఉన్నత విద్యను అభ్యసించి, ప్రపంచవ్యాప్తంగా స్థిరపడే అవకాశాలు మెరుగయ్యాయి.
  2. ప్రతికూల అంశాలు (సవాళ్లు) : ప్రైవేటీకరణ, యాంత్రీకరణ కారణంగా వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారి పని దెబ్బతింది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు కాకపోవడం వల్ల దళితులకు సరైన సామాజిక లేదా ఉద్యోగ భద్రత లేదు. సంపద అంతా కేంద్రీకృతం కావడం వల్ల అణగారిన వర్గాలకు, సంపన్నులకు మధ్య అంతరం పెరిగింది. విద్య, వైద్యం వంటివి ఖరీదవ్వడం వల్ల సామాన్య దళితులకు నాణ్యమైన సౌకర్యాలు అందడం కష్టంగా మారింది. తెలంగాణ దళిత కథలో ఈ ప్రతికూలతాంశాలే ఎక్కువగా చిత్రించబడ్డాయి.

మనిషికంటే డబ్బే ప్రధానమని తెలిపే జాతశ్రీ కథ ‘అంతర్ముఖం’లో గౌడ వృత్తి చితికిపోతున్న బతుకులను తెలియజేస్తుంది. నాగళ్ల స్థానంలో ట్రాక్టర్ నాగళ్లు రావడం వల్ల వడ్రంగుల జీవితం ఎలా నాశనమవుతుందో తెలిపే జాతశ్రీ కథ ‘కుట’. జాతశ్రీ కథ ‘విధ్వంసం’లో దొమ్మరుల ఆటకు ఆదరణ తగ్గడానికి టీవీలే కారణమని తెలియజేస్తుంది. ‘చిరునామా’ కథలో పద్మశాలీలు బొంబాయి, భివండి బతకడానికి పోయినవారి అంతస్సంఘర్షణలు కనపడతాయి.

తెలంగాణ దళిత కథా సాహిత్యం వృత్తి చిత్రణ ద్వారా దళిత జీవితాల వాస్తవికతను ఆవిష్కరించింది. చెప్పులు కుట్టడం, డప్పు కొట్టడం వంటి సంప్రదాయ వృత్తులు దళితుల జీవనాధారాలుగానే కాక, వారి సామాజిక, సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకలుగా ఈ కథలలో నిలిచాయి. ఒకవైపు వృత్తి నైపుణ్యాన్ని, కళాత్మకతను చిత్రిస్తే, మరోవైపు ప్రపంచీకరణ, యాంత్రీకరణ వల్ల ఆ వృత్తులు కుదేలైన తీరును కథలు నిర్భయంగా చూపాయి.

రబ్బరు చెప్పులు తోలు చెప్పులను వెనక్కి నెట్టడం, ట్రాక్టర్లు నాగళ్లను భర్తీ చేయడం వంటివి అట్టడుగు వర్గాల జీవనోపాధిని ఎలా దెబ్బతీశాయో స్పష్టం చేస్తున్నాయి. నోట్ల రద్దు వంటి విధాన నిర్ణయాలు సైతం దళిత కుటుంబాల జీవితాలను అస్తవ్యస్తం చేశాయని కథలు రికార్డు చేశాయి.

ఇందులో విషాదం, ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటం కూడా ప్రధాన ఇతివృత్తంగా కనిపిస్తుంది. వృత్తి కోల్పోయినా ఆత్మగౌరవం మిగిలిందని భావించే పాత్రలు, దొర పెత్తనాన్ని ఎదిరించే డప్పు దరువులు దళితుల ప్రతిఘటననూ, తిరుగుబాటు స్ఫూర్తినీ ప్రతిబింబిస్తాయి.

మొత్తంగా, ఈ కథలు ఆర్థిక మార్పుల వల్ల దళిత జీవనోపాధి ఛిన్నాభిన్నమవుతున్నా, వారు ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు పోరాడుతున్న తీరును అక్షరబద్ధం చేసి, సామాజిక న్యాయ ఉద్యమానికి సాహిత్య రూపంగా నిలుస్తాయి.

(ఇంకా ఉంది..)

జ‌న‌నం: గోనెపల్లి గ్రామం, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ. కవి, రచ‌యిత, ఉపాధ్యాయుడు. జంబూ సాహితీ వ్యవస్థాపకులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (2009–2016) నుంచి “తెలంగాణ పాటల్లో సామాజిక చిత్రణ” అంశంపై పీఎచ్.డి. పరిశోధన చేశారు  (2017). రచనలు : కవిత్వం : 'మా తొవ్వ‌'(క‌విత్వం), 'బ‌తుకు పాఠం'(క‌విత్వం), కథలు :  'త‌ప్ష‌'(క‌థ‌); సాహిత్య విమర్శ : ముక్వారు (సాహిత్య వ్యాసాలు) - 2025, పాట ముచ్చట (పాటలపై విశ్లేషణ - 2026) ప్రచురించారు. జంబూ సాహితీ ఆధ్వర్యంలో గుడిపల్లి నిరంజన్, తప్పెట ఓదయ్య గారలతో కలిసి దళిత కథా సిరీస్ కు సంపాదకత్వం వహిస్తున్నారు. సంపాదకత్వం : 1. తొండం బొక్కెన - తొలి తెలుగు దళిత కథా వార్షిక (2020), 2. చిందూ నేల - దళిత కథ (2021), 3. సాక - దళిత కథ (2022), 4. కొమ్ము - దళిత కథ (2023), 5. గండదీపం - దళిత కథ (2024). డిజిటల్ రిసోర్స్ : siddenky.blogspot.com, యూట్యూబ్ ఛానల్ : “తెలుగు సిరి – డా. సిద్దెంకి”, ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇబ్రహీంనగర్, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) గా పనిచేస్తున్నారు.

 

 

Leave a Reply