నాగడు తెల్లవారకముందే ఎద్దులను కాడికి కట్టి పొలంలోకి దిగాడు. మేడి చేత్తో నొక్కిపట్టుకొని ఎద్దుల వెనకే అడుగులు వేస్తున్నాడు. పొద్దెక్కేసరికి రాత్రి చల్లదనం మాయమై సూర్యుడు నడినెత్తికెక్కాడు. వీపు చెమటతో తడిసిపోయింది; కడుపులో ఆకలి మెలిపెడుతోంది. అయినా అరక ఆపలేదు—పని ఆపితే కూలీ తగ్గిపోవచ్చు.
అంతలో పొలం గట్టు మీదుగా నాగడి భార్య గొంతెమ్మ అన్నం తీసుకొస్తూ కనిపించింది. గట్టు మీద దుత్త దించి, కొంగుతో చెమట తుడుచుకుంది. నాగడు అరక ఆపి, కాలవలో చేతులు కడుక్కుని తాటిపొద నీడకొచ్చాడు. దుత్త మూత తీస్తే… కాస్తంత వేడి జొన్నన్నం, పక్కనే ఆకులో చింతకాయ తొక్కుకారం.
దుత్తలోని అన్నం ఇద్దరికీ సరిపడదని నాగడికి తెలుసు. “నువ్వు?” అని అడిగాడు. “నేను ఇంట్లో తింటా. మారెమ్మతో కలిసి,” అంది గొంతెమ్మ. మారెమ్మ వాళ్ల ఆరేళ్ల కూతురు. నాగడు ఇంకేమీ అనలేదు.
చివరి ముద్ద నోట్లో వేసుకున్నాక, దుత్తలోనే కొద్దిగా నీళ్లు పోసుకుని తాగాడు. మిగిలిన నీళ్లతో చేతులు కడుక్కుని, దాన్ని గొంతెమ్మకు అందించాడు. ఆమె చేయి దుత్తవైపు చాపుతుండగా నాగడు చూపు ఒక్కసారిగా ఆమె ముంజేతి మీద ఆగింది. చర్మం మీద నాలుగు ఎర్రటి గీతలు ఉబ్బి కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల చర్మం పగిలి నీలంగా మారింది.
“అది ఏమిటే?” అని నాగడు అడిగాడు.
గొంతెమ్మ తన చేతిని పమిటకొంగులో దాచుకుంది. “ఏమీ కాదు.”
“ఏమీ కాదంటావేమిటి అంతలా కమిలిపోతే?”
ఆమె కాసేపు మౌనంగా ఉండి, “నిన్న ఇంటికి వెళ్తూ వెళ్తూ మారెమ్మకు గంజి కొరకు పంటకోసిన చేలో రాలిపడ్డ పరిగలు ఏరుకొని కొంగులో కట్టుకుని ఇంటికి బయలుదేరుతుంటే మునసబు చూసాడు…” అంది.
ఏమన్నాడు?”
గొంతెమ్మ పెదవులు వణికాయి. “ఈ భూములన్నీ మాన్యాలనుకున్నావా? దొంగముండా! ఎవరి చేలోంచి కోసుకొచ్చావు? అని అడిగాడు. ‘కోసింది కాదు అయ్యా, నేలమీద పడ్డ పరిగలే’ అన్నాను. వినలేదు.”
“దొంగతనం అంటగట్టి, చేతిలో ఉన్న చెర్నకోలతో ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. నేను “ఇవి రాలిన పరిగలే అయ్యా” అని ఎంత చెప్పినా వినలేదు. “పరిగలైనా, రాలిన గింజైనా—నా అనుమతి లేకుండా ఏరుకోకూడదు” అని, కొంగులో కట్టుకున్న పరిగలన్నీతీసి కొట్టంలో పోయమన్నాడు.”
నాగడు ఆమె చేతిని మెల్లగా పట్టుకున్నాడు. దెబ్బ తగిలిన చోట తాకగానే ఆమె నొప్పితో చెయ్యి వెనక్కి లాగుకుంది.
“నాలుగు గింజల కోసం ఇంత దెబ్బా?”
గొంతెమ్మ మెల్లగా అంది—“మన కడుపుకి గింజ. వాళ్ల కంటికి అది దొంగతనం.
”గొంతెమ్మ కళ్లలోంచి జలజలా రాలుతున్న నీళ్లను నాగడు చేత్తో తుడుస్తున్న సమయంలో యజమాని పెదరెడ్డి అటువైపు వచ్చాడు. ఇద్దరినీ చూసి “ఏరా! పనిమానేసి సరసాలు ఆడుతున్నారా?” అని అరిచాడు. చేతిలోని పేకబెత్తంతో నాగడి వీపుపై గట్టిగా బాదాడు. “పనిలోకి దిగు, కూలీ నాకొడకా!” అని తిట్టాడు. నాగడు పళ్ళు బిగించి ఓర్చుకొన్నాడు. ఆక్షణంలో గొంతెమ్మ ఏమైనా మాట్లాడితే గొడవ మరింత ముదురుతుందని తెలిసి ఏమీ అనలేదు.
నాగడు ఎద్దులను అదిలించి కాడి దగ్గరకు తీసుకొచ్చి అరక కట్టాడు. నొగను సరిచేసి, మేడి నేలలో దింపాడు. కాసేపటి క్రితం ఆగిపోయిన సాళ్లు మళ్లీ మొదలయ్యాయి. గొంతెమ్మ సామాన్లు తీసుకొని ఒక్కసారి నాగడు వైపు చూసింది. అతను తలెత్తలేదు. ఆమె నెమ్మదిగా ఇంటి దారిపట్టింది.
***
యానాం నడిబొడ్డున ఫ్రెంచి పాలన వెలుగులు విరజిమ్ముతున్నా… ఊరి చివర ఉన్న మాలపల్లె గుడిసెల దాకా ఆ కాంతి చేరలేదు.
వాళ్లకు పగలు ఊళ్లో నడిచే స్వేచ్ఛ లేదు. కాళ్లకు చెప్పులుండకూడదు. దొరల ఇళ్ల వైపు, చెరువుల వైపు వాళ్ల నీడ కూడా పడకూడదు. బతకడానికి రైతు పొలంలో కూలి చేయాలి. పంట పండితే కొద్దిపాటి జొన్నలు కొలుస్తారు; ఏ వరదలకో పంటపోతే అదీ దక్కదు. కోతలు ముగిశాక పొలంలో ఏరుకునే పరిగలే వాళ్ల కడుపులు నింపాలి. ఎప్పుడైనా రైతు ఇంట మిగిలిన అన్నం, కొబ్బరి చిప్పలో పచ్చడి —అప్పుడప్పుడూ ఆకలికి దొరికే అరుదైన విరామాలు. కాలువలు ఎండితే దొరికే చేపలు, చేను బొరియల్లో పట్టుబడే కుందేళ్ల జంటో- ఏది దొరికితే అదే ఆ రోజు పండగ.
దాహం వేస్తే… ఊరి బావి దగ్గర పది అడుగుల దూరంలో దోసిలి ఒగ్గి నిలబడితే, పైనుంచి ఎవరో దయతలచి నీళ్లు పోయాలి.
అడుగడుగునా ఎదురయ్యే ఈ అవమానాల మధ్యే నాగడు, గొంతెమ్మ తమ బిడ్డ మారెమ్మను పెంచుతున్నారు. తాము ఎన్ని అవమానాలు పడ్డా తమ బిడ్డ మారెమ్మకు మాత్రం ఇలాంటి బతుకు రాకూడదు అని కోరుకొనేవారు… అది ఎలా రాకుండా ఉంటుందో వారికి తెలియదు.
***
ఆ రాత్రి దూరంగా రేవు నుంచి ఓడ హారన్ వినిపించింది. నాగడు నులకమంచం మీద పడుకుని చాలా సేపు ఆ శబ్దాన్నే వింటూ ఉన్నాడు. ఊరిలో కొందరికి ఇళ్లు, భూములు, ధాన్యం, డబ్బు—అన్నీ ఉంటాయి. తమకు మాత్రం రోజూ పని, రోజూ యాతన. ఎందుకు ఇంత తేడా? అని అతనికి అర్థం కాదు. పెద్దలు “గత జన్మ పాపం” అంటారు. పంతులుగారు కూడా “ఈ జన్మలో పైకులాల వారికి సేవ చేస్తే వచ్చే జన్మలో వారి కులంలో పుట్టి సుఖపడొచ్చు” అని చెప్పిన గుర్తు. నాగడు ఆకాశం వైపు చూశాడు. మళ్లీ పుడితే బతుకు నిజంగా మారుతుందా? సమాధానం లేదు. దూరంగా ఓడ మరోసారి హారన్ కొట్టింది—ఎవరినో పిలుస్తున్నట్టు.
అప్పటికి యానాం నుంచి బోర్బన్ కు కూలీలు వెళ్తున్నారనే వార్త మాలపేటకు చేరింది. మూడు సంవత్సరాల ఒప్పందం పని. నెలకు ఏడు రూపాయలు—మూడు అక్కడ చేతికి, నాలుగు ఇంటివాళ్లకు.
నాలుగు రూపాయలు అంటే మారెమ్మ, గొంతెమ్మల కడుపు నింపడమే కాదు, ఇంతవరకూ ఎరుగని కాస్త సుఖంగా బతికేంత మొత్తం.
ఆ మాటలు పేదల గుడిసెల్లో కొత్త ఆశను రేపింది. కొందరు సముద్రం దాటడమంటే భయపడ్డారు. మరికొందరు, “ఇక్కడే ఉండి ఏం సుఖపడుతున్నాం?” అన్నారు.
నాగడు మొదటిసారి నోరు విప్పాడు.
“కష్టం ఎక్కడైనా ఉంటుంది. కానీ ఇక్కడ కష్టంతో పాటు అవమానం కూడా ఉంది. అక్కడ అలాంటి అంతరాలు ఉండవంటున్నారు. ఎవరి ఇంటి ముందు నిలబడ్డా నీడ చూసి తరిమేయరంటున్నారు. అందరూ మనుషుల్లాగే బతకొచ్చట. నిజమో కాదో తెలియదు. కానీ ఇక్కడి కష్టం కంటే అక్కడి కష్టం నాకు పెద్దదిగా అనిపించడం లేదు.”
అంతే. నాగడు మళ్లీ మాట్లాడలేదు.
ఆ రోజు అతని మనసులో మాత్రం మొదటిసారి ఒక ప్రశ్నకు బదులు ఒక దారి కనిపించింది. బోర్బన్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
ఆ రాత్రి గొంతెమ్మతో అన్నాడు—
“వెళ్తాను.”
“అంత దూరం?” గొంతెమ్మ ఒక్కసారిగా అతని వైపు చూసి మళ్లీ మారెమ్మ జుట్టు నిమురుతూ కూర్చుంది.
“ఇక్కడ మాత్రం ఏముంది? మన పని వీళ్లకి కావాలి… మనం మాత్రం వీళ్లకు మనుషులం కాదు.”
గొంతెమ్మ మౌనంగా ఉండి, చివరికి అంది—
“మన పాప అయినా మనలాగా పెరగకూడదు.”
“సముద్రం అవతల నిజంగానే కులం ఉండదంటావా?”
నాగడు తలవంచి కూర్చున్నాడు.
“తెలియదు.”
“మరి ఎందుకు వెళ్తావు?”
“ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసు కదా!… అది చాలదూ?”
“నీ ఇష్టం.
***
మరుసటి రోజు మాలచెట్టు రావిచెట్టుకింద ఇద్దరు ఏజెంట్లు, ఒక గుమస్తా కూర్చున్నారు. చెట్టుకింద రెండు కుర్చీలు వేసుకుని ముందొక మేజా బల్ల పెట్టుకున్నారు.
“బోర్బన్ దీవి. చెరకు తోటలు. మంచి పని. మంచి తిండి. ఉండడానికి చోటు. నెలకు ఏడు రూపాయలు. మూడు మీకు అక్కడ, నాలుగు ఇంటికి.” గుమస్తా చెబుతున్నాడు.
నాగడు విన్నాడు. తన పాతికేళ్ల జీవితంలో ఒక్క రూపాయి బిళ్లను ఇంతవరకూ చూడలేదు. ఏడు రూపాయలు అతనికి పెద్ద కలలా కనిపించాయి.
ఏజెంటు అడిగాడు—
“నీ పేరు?”
“నాగడు.”
“తోట పని చేస్తావా?”
“చేస్తాను. ఇక్కడి డబ్బులు ఎవరికి ఇవ్వాలి?”
“నా భార్య గొంతెమ్మకు.”
గుమాస్తా కొన్ని కాగితాలపై అతని వేలిముద్ర తీసుకుని, లక్కసీలు వేసిన ఒప్పందపత్రం ఒకటి నాగడు చేతిలో పెట్టాడు. అక్షరాలు చదవలేని నాగడు కాగితాన్ని చూస్తూ, ఏడు… మూడు… నాలుగు… అనే అంకెలను మాత్రం గుర్తుపట్టాడు.
“ఇంకో రెండురోజుల్లో ఓడ బయలుదేరుతుంది.”
అతన్ని చూసి మరో పాతికముప్పై మంది ముందుకొచ్చారు.
“మళ్లీ తిరిగి ఎప్పుడొస్తాం?” అని వాళ్లలో ఒకడు అడిగాడు.
“మూడేళ్ల పని. గడువు తీరగానే యజమానే తన ఖర్చుతో ఓడలో మిమ్మల్ని యానాం చేరుస్తాడు. రోగమొచ్చినా, పని చేతకాకపోయినా ఆయనే వెనక్కి పంపిస్తాడు,” అని బదులిచ్చాడు ఏజెంటు.
జనం వేసే ప్రతీ ప్రశ్నకూ అతను ఏవేవో సమాధానాలు చెబుతూనే ఉన్నాడు. ఆ రోజు రావిచెట్టు కింద కూర్చున్నది కేవలం కూలీలు కాదు— మట్టిపాలైన తమ బతుకులకు ఇంకో దారి వెతుక్కుంటున్న మనుషులు.
***
1829 ఆగస్టు 7.
ఓడ ఎక్కే ఉదయం గొంతెమ్మ కన్నీళ్లను ఆపుకుంది. నాగడు మారెమ్మను ఎత్తుకున్నాడు.
“నాన్నా… ఎక్కడికి పోతున్నావు?” ఆ ప్రశ్నకు గుండెలో దాచుకున్న బాధ ఒక్కసారిగా పైకి వచ్చింది. కనపడనివ్వలేదు.
“దూరం వెళ్తున్నా. తిరిగి వచ్చేసరికి నీకు కొత్త అంగీలు తెస్తా.”
“నీలం పావడా?”
“అవును. నీకు నచ్చిన నీలం బట్టలే.”
గొంతెమ్మ చేతిలో ఒప్పంద కాగితం పెట్టాడు. “ఇది కుంపణి వాళ్లు ఇచ్చిన కాగితం. ఇది చూపిస్తే నెలకు నాలుగు రూపాయలు ఇస్తారు. మూడేళ్ల తరువాత తిరిగి వస్తా. డబ్బుతో మన ముగ్గురం కాస్త సుఖంగా బతుకుదాం.”
ఆమె అతని చేతిని బిగిగా పట్టుకుంది.
“డబ్బు రాకపోయినా పర్వాలేదు. నువ్వు మాత్రం తిరిగి రావాలి.”
నాగడు నవ్వాడు. ఆ నవ్వు పెదవుల మీదే ఆగిపోయింది; కళ్లలో మాత్రం వీడ్కోలు నీడ పడింది.
దూరమౌతున్న ఓడను చూస్తూ ఒడ్డునే ఉన్నారు గొంతెమ్మ, మారమ్మలు.
***
బోర్బన్ చేరేసరికి అతను ఊహించిన ప్రపంచం లేదు. కూలీలను వరుసలో నిలబెట్టి పరిశీలించి ఒక్కొక్కరిని ఒక్కో తోటకు పంపించారు. బోర్బన్ దీవిలో ఎటుచూసినా ఆకాశాన్ని తాకేలా చెరకు తోటలే. లోపలకు అడుగుపెట్టాకగాని అర్థం కాదు… అవి మనుషుల నెత్తురు తాగే రాక్షస వనాలని.
నాగడిని ఫెర్నాండెజ్ అనే ఫ్రెంచి యజమాని తోటకు పంపారు.
తెల్లవారకముందే పని. మండుటెండలోనూ పని. చెరకు ఆకులు చేతులు, కాళ్లు కోసేవి. చెమట, మట్టి, రక్తంతో శరీరం గాయాల పుట్టలా మారింది. ఊపిరి పీల్చుకోవడం కూడా యజమాని దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉందేమో అన్నంత ఊపిరాడని వాతావరణం.
ఒప్పందపు కాగితాల్లో ఉన్న మంచి ఆహారం, వసతి, వైద్యం, తిరుగు ప్రయాణం లాంటివేవీ వాస్తవంలో లేవు.
ఒకరోజు దాహంతో క్షణం ఆగాడు.
“ఎందుకు ఆగావు?”
“నీళ్లు…” అనేలోపే
కొరడా అతని వీపుపై పడింది.
ఆ నొప్పికంటే అవమానమే అతన్ని ఎక్కువగా కాల్చింది.
ఒక అవమానం నుంచి తప్పించుకోవడానికి సముద్రం దాటితే, అంతకంటే దారుణమైన దురవస్థలో చిక్కుకున్నానని అతనికి అర్థమైంది.
రెండు నెలలు గడిచాయి.
“అయ్యా జీతం” అని అడిగితే
“లెక్కల్లో ఉంది.” అన్నారు
ఇంటికి పంపాల్సిన నాలుగు రూపాయలు వెళ్తున్నాయా అని అడిగితే
“వెళ్తాయి… వెళ్తాయి… ముందు పని చూడు.”
గొంతెమ్మ, మారెమ్మల ముఖాలే అతని కళ్లముందు కనిపించేవి.
చివరకు ఒక కూలీ దాహంతో నీళ్ల కోసం వెళ్లగా ఫెర్నాండెజ్ అమానుషంగా కొట్టి చంపేశాడు. కూలీల ఆగ్రహం బద్దలైంది. కొడవళ్లు, పారలు, కర్రలు ఏది దొరికితే వాటితో దాడి చేసారు. ఫెర్నాండెజ్, అతని అనుచరులు నెత్తుటి మడుగులో కుప్పకూలారు.
నాగడు మాత్రం ఆ రక్తాన్ని చూసి వణికిపోయాడు.
ఫ్రెంచి సైనికులు వస్తే అందరినీ నిలబెట్టి ఉరితీస్తారని వాడికి తెలుసు. వెనక్కి చూడకుండా ఆ రాత్రే దట్టమైన అడవిలోకి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోయాడు నాగడు
***
మూడు రోజులు ఆకలితో, గాయాలతో అడవిలో తిరిగాడు. గాలికి ఆకు కదిలినా యజమాని వేటకుక్కలు తరుముకొస్తున్నాయేమోనన్న వణుకు. మూడో రాత్రి. దట్టమైన గడ్డిలో ముడుచుకుని పడుకున్నాడు. హఠాత్తుగా అలికిడి. కానీ ఆ అడుగులు బరువుగా లేవు. ఆ వస్తున్న మనిషి నుంచి తెల్లవాడికి వచ్చే పచ్చి మాంసపు కంపు రావడం లేదు.
“ఎవరు?” చీకట్లోంచి సన్నని మాట.
నాగడు ఉలిక్కిపడి లేచాడు. “నువ్వు… నువ్వెవరు?”
“ఇక్కడ తోటలో పనిచేసేవాడిని. కోరంగి నుంచి వచ్చానని కొరంగీ అని పిలుస్తారు” అన్నాడా అపరిచితుడు.
“నేను… నా పేరు నాగడు యానాం నుంచి వచ్చాను.”
“నీ మొహం చూస్తుంటేనే తెలుస్తోంది. ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయావు.” అన్నాడు కొరంగీ
నాగడు తన కథ చెప్పాడు.
“నాకు ఇంకో తోట తెలుసు. అక్కడి దొర కఠినుడే కానీ జీతం విషయంలో నిక్కచ్చిగా ఉంటాడు. వస్తావా?”
“నన్ను పట్టేస్తే? ఉరి తీస్తారు…” నాగడి గొంతు వణికింది.
“నీ పేరు అక్కడ నాగడు కాదు. నాగన్న. మార్చుకో.”
కాసేపు ఆగి అతను అన్నాడు—
“మన దేశంలో కులం దాచుకోలేక సముద్రం దాటి వచ్చావు. ఇప్పుడు ప్రాణాలు నిలుపుకోవడానికి పేరు మార్చుకుని బతుకు.”
ఆ మాట నాగడి గుండెల్లో ఈటెలా దిగింది.
***
ఇంతలో గొంతెమ్మ ఏజెంటు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉంది. మొదట ఒంటరిగా తర్వాత తనలాంటి మరో భార్యతో… తరవాత మరికొంతమంది అలాంటివారే…. ఒక్కొక్కరి చేతిలో ఒప్పంద కాగితం. రోజులు గడుస్తున్నాయి కానీ ఎవరూ సమాధానం చెప్పడం లేదు.
“నా మొగుడు అక్కడ కష్టపడుతున్నాడు. మా డబ్బులు ఎందుకు రావడం లేదు? ఇందులో నెలకు నాలుగు రూపాయలు అని రాసుంది. మా డబ్బులు ఎందుకు ఇవ్వరూ?” అని అడిగింది ఒకరోజు.
లోపలి నుంచి వచ్చిన Courson దొర కాగితం చూసి అన్నాడు
“ఇక మీకు చిల్లిగవ్వ కూడా రాదు. పోండి ఇక్కడనుంచి!”
“ఎందుకు దొరా? కాగితంలో రాసి ఇచ్చారుగా?”
“బోర్బన్లో తోటకూలీలు తిరుగుబాటు చేశారు. డబ్బు పంపాల్సిన యజమాని చచ్చిపోయాడు. కంపెనీ లెక్కలు ఆగిపోయాయి. ఇక మీకు ఏమీ రాదు.” అని ఖరాఖండిగా చెప్పేశాడు.
ఆ మాట వినగానే “మరి మా వాళ్లు ఎలా ఉన్నారు దొరా? ప్రాణాలతో ఉన్నారా?” చాలామంది అడిగారు
“వాళ్ళు చచ్చారో, బతికున్నారో నాకు తెలియదు!” అంటూ విసుక్కున్నాడు దొర.
ఆ మాట వినగానే గొంతెమ్మకు, అక్కడ నిలబడ్డ అందరి గుండెలు ఆగిపోయినంత పనైంది. . . “అదేం న్యాయం దొరా? మీరే కదా ఓడల్లో ఎక్కించి తీసుకెళ్ళారు, మా వాళ్లను మాకు ప్రాణాలతో తెచ్చి అప్పచెప్పండి.” వారు నిలదీశారు. దొర నౌకర్లకు సైగ చేశాడు. కర్రలు విరుచుకుపడ్డాయి. ఆడవాళ్లు, పిల్లలు అని చూడలేదు. విచక్షణా రహితంగా కొట్టారు. కర్ర దెబ్బలకు తాళలేక గొంతెమ్మ తన బిడ్డతో పాటు నేలపై పడిపోయింది. వాళ్లందరినీ కుంపణీ కచేరీ నుండి బయటకు గెంటేశారు
తర్వాత వాళ్ళందరూ పెద్దొర De Lesparda వద్దకు వెళ్ళి తమ గోడు చెప్పుకొన్నారు. ఆయన Courson, Linarèsలను పిలిపించి వీరికి చెల్లించాల్సిన డబ్బుల గురించి ప్రశ్నించాడు. వాళ్లు చెల్లింపులు చేయలేమని చేతులెత్తేశారు. చివరకు ఆ కుటుంబాల ఆకలి తీర్చడానికి తాత్కాలికంగా గంజికేంద్రాలు ఏర్పాటు చేయించాడు పెద్దొర.
***
గొంతెమ్మ ఒకరోజు పెద్ద దొర బంగళా బయట జావ తాగి, మారెమ్మకు పట్టించి, తెచ్చుకొన్న సన్నమూతి గాబులో మరికొంత జాగ్రత్తగా వేయించుకుంది.
వెనుతిరుగుతూ పక్కనే ఉన్న చర్చి వైపు చూసింది. దిక్కుతోచని వాళ్లంతా అక్కడికే వెళ్తుంటారు. బరువైన అడుగులతో తొలిసారిగా ఆమె లోపలికి అడుగుపెట్టింది. మాలపేటలో ఎవరికి బాగోలేకపోయినా ఇంటికొచ్చి ప్రార్థన చేసే ఫాదర్ డ్యూమాస్ ఆమెకు చిన్నప్పటి నుంచే తెలుసు.
“ఫాదర్… నా మొగుడు బతికున్నాడో లేదో తెలియదు. పైసలు రావడం లేదు. ఈ పిల్లను ఎలా బతికించుకోవాలో అర్థం కావడం లేదు,” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఫాదర్ డ్యూమాస్‌కు పరిస్థితి తీవ్రత అర్థమైంది. ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదని గ్రహించాడు.
“నువు పెదకర్రోడి కూతురువు కదూ! మీ నాన్న ఎక్కడుంటున్నాడు?” అని అడిగాడు.
“ఇంజరంలో…”
“నిజాలు తెలిసేదాకా నువ్వు మీ నాయన దగ్గరికి వెళ్లిపో. అక్కడ ఏమైందో నేను కనుక్కుంటాను, ధైర్యంగా ఉండు,” అని చెప్పాడు.
దిగులుగా నిలబడ్డ ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. మారెమ్మను ఒడిలో పెట్టుకుని మోకాళ్లపై కూర్చుంది గొంతెమ్మ. ఫాదర్ ప్రార్థన మొదలుపెట్టాడు. ఆ దేవుని భాష తెలియకపోయినా, అక్కడ మనసారా ఏడ్చుకోవచ్చని మాత్రం ఆమెకు అర్థమైంది. చేతులు జోడించింది.
“దేవుడా… నాకు డబ్బు వద్దు, నా నాగడిని బతికించు. నా పిల్ల తన తండ్రి ముఖం మర్చిపోకముందే వాడిని తిరిగి పంపు,” అంటూ ఇన్నాళ్ల దుఃఖం కట్టలు తెంచుకోగా వెక్కివెక్కి ఏడ్చింది.
“ఆశ వదలొద్దు,” అని ఫాదర్ ఆమె తలపై చేయి వేసి ఓదార్చగా… కన్నీళ్ల మధ్యే కష్టంగా నవ్వింది.
ఏమీ తేలని ఆ ప్రశ్నలను, మారెమ్మను తీసుకొని… ఆ సాయంత్రమే ఇంజరానికి నడక మొదలుపెట్టింది గొంతెమ్మ.
***
ఇదిలా ఉండగా బోర్బన్లో నాగడు మరో తోటలో పనికి కుదిరాడు. యజమాని పేరు బ్లాంషే. పనిలో కఠినుడు. కేకలు వేస్తాడు. సమయానికి పని చేయకపోతే శిక్షిస్తాడు. అయినా, కూలీల కష్టానికి ఒక్క పైసా కోత కోయడు.
నెల తిరగ్గానే బ్లాంషే నాగడికి జీతం ఇవ్వబోతే.. “ఈ పైసలు మీ దగ్గరే ఉంచండి దొరా. ఇప్పుడు నాకు అవసరాలేమున్నాయి, అన్నీ మీరే చూస్తున్నారు కదా! మూడేళ్ల ఒప్పందం తీరాక ఒకేసారి తీసుకుంటాను,” అని చేతులు జోడించాడు. బ్లాంషే నవ్వి సరేనన్నాడు.
నాగడు పనిలో ప్రాణం పెట్టేవాడు. తోటి కూలీలకు సాయంగా నిలిచేవాడు. ఒకసారి కూలీలలో ఒకడు గాయపడ్డాడు. యజమాని పట్టించుకోలేదు. నాగడు అతన్ని మోసుకుని నీడలో పెట్టాడు.
యజమాని ఆ దృశ్యం చూశాడు.
“నాగన్నా అలా ఎందుకు చేశావు?”
“వాడు కోలుకోవాలి. వాడు బతికి ఉంటేనే మీ తోటకు పనివాడు.”
ఆ మాటకు యజమాని కాసేపు అతనిని చూసి, “నీ మాట నచ్చింది,” అన్నాడు.
ఆ గాయపడిన వ్యక్తి పేరు ఎల్లడు. ఊరు కళింగం. ఆ తరువాత అతను నాగడికి బాగా దగ్గరయ్యాడు. ఒక సాయంత్రం చెరకు మోపు మీద కూర్చుని ఒక రాగి ఉంగరం చూపించాడు.
“ఇది నా భార్యది. ఇక్కడకు వచ్చే ముందు నా వేలికి తొడిగింది. పెద్దజబ్బు చేసింది. వైద్యం చేయించడానికి డబ్బుల్లేక ఇక్కడికొచ్చా. ఆర్నెల్లకు కబురొచ్చింది—చనిపోయిందని. ఇప్పుడు మూటలో పైసలున్నాయి, ఎవరి కోసమని? అందుకే అక్కడకి వెళ్ళాలనిపించటం లేదు” అన్నాడు.
నాగడికి మాట రాలేదు. తను యజమాని వద్ద దాచుకున్న డబ్బులు గుర్తొచ్చాయి.
ఆ రాత్రి నాగడికి నిద్ర పట్టలేదు. గొంతెమ్మ ముఖం, మారెమ్మ నవ్వు కళ్ళముందు మెదిలాయి— ‘బతికే ఉన్నారా? ఏదైనా జరిగిందా?’ అని నాగడి మనసు తల్లడిల్లింది. వెంటనే తనను తానే సముదాయించుకున్నాడు—‘ఏమీ జరిగి ఉండదు. బతికే ఉంటారు. ఎక్కడో క్షేమంగా ఉండి ఉంటారు’ అని మనసు సరిపెట్టుకున్నాడు.
***
ఒక వర్షాకాలంలో చెరకు తోటలో ఆకుముడత పురుగు విజృంభించింది. బ్లాంషే తెప్పించిన మందులేవీ పనిచేయలేదు; పంట మొత్తం ఎండిపోతోంది. బ్లాంషే కు ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టం రానున్నదని ఆందోళనగా ఉండేవాడు. నాగడికి యానాంలో తండ్రి వరిచేలో చేసేది గుర్తొచ్చింది—వేపాకు, పొగాకు కషాయం. ఎల్లడి సాయంతో కషాయం కలిపి రెండు రోజులు పిచికారీ చేశాడు. మూడో రోజుకు ఆకులు విచ్చుకోవడం మొదలైంది. “ఎక్కడ నేర్చుకున్నావు?” అని అడిగితే, “మా నాన్న దగ్గర,” అన్నాడు నాగడు. ఆ రోజు నుంచి యజమాని అతన్ని ప్రత్యేకంగా చూడటం మొదలుపెట్టాడు.
ఆ కృతజ్ఞతతోనే క్రిస్మస్ పండుగనాడు, దొర తాను తినే టేబుల్ దగ్గరే నాగడికి కుర్చీ వేసి సమానంగా కూర్చోబెట్టి భోజనం స్వయంగా వడ్డించాడు. ఆ దొరల తిండి చూస్తుంటే నాగడికి కళ్లు చెమ్మగిల్లాయి. తన ఊళ్లో దూరంగా నిలబడితే మట్టి చిప్పలో గంజి పోసిన యజమానులు గుర్తొచ్చారు. ఈ పరాయి దేశంలో ఈ పరదేశి తనను ఒక మనిషిలా గౌరవించేసరికి అతని గుండె బరువెక్కింది.
కష్టంలో ఎంత అలిసిపోయినా.. గొంతెమ్మ, మారెమ్మలే అతనికి పదే పదే గుర్తుకొచ్చేవాళ్లు. వాళ్ల జ్ఞాపకాలతోనే ఆ మూడేళ్లు ఇట్టే గడిచిపోయాయి.
గడువు ముగిసిన రోజు బ్లాంషే స్వయంగా నాగడిని పిలిచి, ఆ మూడేళ్ల జీతానికి తన బహుమతి కూడా కలిపి ఒక మూట కట్టాడు. యానాం తిరిగి వెళ్లే ‘ఓడ కాగితం’ కూడా ఆ చేతిలో పెట్టి ప్రేమగా భుజం తట్టాడు.
డబ్బును, ఓడకాగితాన్ని చూసుకుని.. “గొంతెమ్మా… నేను వస్తున్నా,” అని మనసులోనే మురిసిపోయాడు నాగడు.
***
మూడేళ్ల శ్రమ… గుడ్డలో మూటకట్టిన పైసలతో యానాం రేవులో అడుగుపెట్టాడు నాగడు. ఆశగా నేరుగా మాలపేట వైపు పరుగు తీశాడు.
కానీ, అక్కడ తన పాత గుడిసె లేదు. పొయ్యి లేదు, తలుపు లేదు, తాను వదిలి వెళ్లిన బతుకు తాలూకు అక్కడ ఏ గుర్తూ లేదు. కరిగిపోయిన మట్టి గోడలు మాత్రమే ఉన్నాయి. “గొంతెమ్మా…” అని గట్టిగా పిలిచాడు. ఎవరూ పలకలేదు. “గొంతెమ్మా ఏదీ?” అని చుట్టుపక్కల వాళ్లని కంగారుగా అడిగాడు. ఓ ముసలోడు ముందుకొచ్చి, “ఇక్కడ బతుకుతెరువు లేక ఎప్పుడో వెళ్లిపోయింది బాబూ. ఇంజరంలో వాళ్ల నాయన పెదకర్రోడి దగ్గర ఉంటోంది. తండ్రితో పాటు మట్టిపనులకు పోతోంది. ఒంటరిగా పిల్లను పెంచుకొంటోంది” అని చెప్పాడు.
ఆ మాటతో నాగడికి ప్రాణం తిరిగొచ్చినట్టయింది. క్షణం ఆగకుండా ఇంజరం వైపు పరుగుపెట్టాడు.
దూరంగా… ఓ చోట మట్టి తట్ట మోస్తున్న ఒక స్త్రీ. ఆమె పక్కనే, ఆమె భుజాల ఎత్తున్న ఒక చిన్న అమ్మాయి. ఆ పిల్లను చూడగానే నాగడి అడుగులు ఆగిపోయాయి. అది మారెమ్మ! ఇప్పుడు తనలా నల్లగా లేదు, అచ్చం వాళ్లమ్మలా చామనఛాయ రంగు. అప్పుడే ఎదిగి, కాస్త పొడవయింది.
నాగడి గొంతు వణికింది. “గొంతెమ్మా!” ఆ పిలుపుకు గొంతెమ్మ ఒక్కసారిగా కదలకుండా నిలిచిపోయింది. వెనక్కి తిరిగి చూసింది.
తన నాగడు! ఆమె చేతిలోని తట్ట కింద పెట్టింది.
మూడేళ్ల ఆకలి, భయం, ఎదురుచూపు… అన్నీ ఒక్క క్షణంలో కరిగిపోయాయి. పరుగెత్తుకుంటూ వచ్చి అతని గుండెలకు హత్తుకుని భోరున ఏడ్చేసింది.
“నువ్వు చచ్చిపోయావని చెప్పారు నాగడూ…” గొంతు పెగలడం లేదు. “నువ్వు నాకై ఎదురుచూస్తుంటే… నన్ను చావనిస్తావా గొంతెమ్మా!” అన్నాడు కన్నీళ్లతో.
“మాకు పైసలు రాలేదు…”
“అనుకున్నాను.”
“నీ కోసం పిచ్చోళ్లలా తిరిగాం… మమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టారు…” ఆమె వణుకుతోంది.
నాగడు తన రెండు చేతులతో ఆమె ముఖాన్ని పైకెత్తి కన్నీళ్లు తుడిచాడు. “ఇక చాలువే.. నేను వచ్చేశానుగా.”
అంతలో మారెమ్మ దగ్గరకు వచ్చింది. నాగడు వంగి, ఆ బిడ్డను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు.
కళ్లలోకి చూస్తూ… “నన్ను గుర్తుపట్టావా తల్లీ?” అని అడిగాడు వణుకుతున్న గొంతుతో.
మారెమ్మ అతని గడ్డం పట్టుకుని, “నాన్నా…?” అని పిలిచింది.
ఆ ఒక్క పిలుపుతో మూడేళ్ళుగా నాగడు గుండెల్లో మోస్తున్న బరువంతా ఎటో ఎగిరిపోయింది. తండ్రి కళ్లలోంచి జలజలా నీటిబొట్లు రాలిపోయాయి.
***
మరుసటి రోజు నాగడు తన మూడేళ్ల కష్టాన్ని దొర లెస్పార్డా ముందు పెట్టాడు.
“అయ్యా, ఈ డబ్బులకు మాకు భూమి కావాలి. బోర్బన్లో మూడేళ్లు రక్తం చిందించి కూడబెట్టిన పైసలివి. మాకు మీరే దిక్కు… మాకూ ఈ సమాజంలో గౌరవంగా బతికే దారి మీరే చూపాలి. పిడికెడు గౌరవం.” అన్నాడు.
స్థానిక శాస్త్రాల ప్రకారం ఒక మాలవాడికి ఆస్తి కలిగి ఉండే హక్కు లేదని లెస్పార్డాకు తెలుసు. ఈ తరహా దుర్మార్గం ఎలాగైనా మారాలని ఆయన కోరుకునేవాడు. ఫ్రెంచ్ విప్లవ భావాలైన స్వేచ్ఛ, సమానత్వం, సహోదరత్వం నరనరానా జీర్ణించుకున్న వ్యక్తి అతను. అణగారిన మాలమాదిగలకు సాయం చేయాలనే తపన ఆయనలో బలంగా ఉంది.
“వాళ్లకు భూమి ఇస్తే ఊళ్లో గొడవలవుతాయి దొరగారు!” అని గుమాస్తా చక్రవర్తుల రామశర్మ వారించాడు. పెద్ద కులాల పొలాల మధ్యన ఇస్తే గొడవలవుతాయని భావించిన లెస్పార్డా… ఆ డబ్బుకు అడవికి ఆనుకుని, ఉన్న ఇరవై ఎకరాల బీడు భూమిని నాగడికి ఇప్పించాడు. దొర మాటకు ఎదురు చెప్పలేక మరోవైపు అది ఎందుకూ పనికిరాని ఊరికి దూరంగా ఉన్న నేల కావడంతో ఊళ్లో ఎవరూ పెద్దగా గొడవ చేయలేదు.
ఆరునెలలు నాగడు, గొంతెమ్మ రక్తాన్ని చెమటగా మార్చి, ఆ బీడు నేలతో యుద్ధం చేసి పచ్చని వరి చేనుగా నిలబెట్టారు.
పంట కోతకొచ్చింది. రాత్రివేళ… మంచె మీద నాగడు, గొంతెమ్మ, మారెమ్మ కిందకు కాళ్లు చాపి కూర్చుని చుక్కల్ని చూస్తున్నారు. తాము మలచుకున్న నేల, ఎదిగిన పైరు మీద నుంచి వస్తున్న చల్లటి గాలి వాళ్ల కష్టాన్నంతా మరిపిస్తోంది.
మారెమ్మ ఇప్పుడు ఫాదర్ డ్యూమాస్ దగ్గర అక్షరాలు నేర్చుకుంటోంది. మాలమాదిగ పిల్లల కోసం ఆయన చర్చిలోనే ఒక చిన్న బడి నడుపుతున్నాడు.
గొంతెమ్మ ఆ పైరగాలిని ఆస్వాదిస్తూ, “నాగడూ… మన సొంత చేనులో ఇలా కూర్చుంటే ఎంత ‘సేచ్చ’గా ఉందో కదా,” అంది.
పక్కనే ఉన్న మారెమ్మ నవ్వింది. “సేచ్చ కాదమ్మా… స్వేచ్ఛ!” అంది స్పష్టంగా.
గొంతెమ్మ ఆశ్చర్యంగా నాగడి వైపు చూసింది. నాగడు గర్వంగా కూతురిని దగ్గరకు తీసుకున్నాడు. తన తరం నెత్తురు చిందించి సంపాదించిన నేలలో… తన బిడ్డ నోట పలికిన ఆ ఒక్కమాట -“స్వేచ్ఛ”- అతనికి నిజమైన పంటలా అనిపించింది.
చరిత్ర: 1829 ఆగస్టు 7న యానాం నుంచి 268 మంది కూలీలు నాలుగు నౌకల్లో బోర్బన్‌కు బయలుదేరారు. వారిలో 197 మంది మాలలు, 27 మంది ముస్లింలు, 13 మంది నేతకారులు, 13 మంది రైతులు, 5 మంది మత్స్యకారులు, 2 కాపులు ఉన్నారు. ఒప్పందం మూడేళ్లు, నెలకు 7 రూపాయలు; అందులో 3 రూపాయలు కూలీకి, 4 రూపాయలు కుటుంబానికి ఇవ్వాలని ఉంది. ప్రయాణం, తిరుగు ప్రయాణం యజమాని భరించాలి; ఆహారం, వసతి, మందులు కల్పిస్తామని ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ పేమెంట్లు François De Courson and Co. and J. Linares యానాంలో చెల్లిస్తారని ఉంది. కానీ మొదటి బృందాల కుటుంబాలకు డబ్బు సకాలంలో అందలేదు.
యానాం పెద్దొర De Lesparda 1830 జనవరి 20న బాధితులకు గంజి కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ సమస్యను ఫ్రెంచి రికార్డుల్లలో నమోదు చేశాడు.
పాత్రలు, సంఘటనలు, సంభాషణలు, అనుభవాలు కథనం కొరకు రచయిత స్వేచ్ఛా కల్పన