కందుకూరి అంజయ్య కవి, దళిత మేధావి, సాహితీ విమర్శకుడు. ‘అదనపు కణజాలం ‘ అంజయ్య మూడో కవితా సంకలనం. కట్టెపల్క (2013), జమిడిక (2023) కవిత్వ సంపుటాలు , ‘కదలిక’ (2024) సాహితీ వ్యాసాల సంపుటితో పరిచయమైన సాహితీ సృజనకారుడు. చేనేత జౌళి శాఖలో అనేక స్థాయిల్లో అధికారిగా పనిచేసి, ఇటీవల పదవీవిరమణ చేశాడు. ‘అదనపు కణజాలం’ లో తాత్విక రాజకీయ ఆలోచనల చిక్కదనం, కవిత్వంలో గాఢత కనిపిస్తుంది. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా, తెలంగాణ నుండి వచ్చిన సాహిత్యంలో తనదైన ప్రత్యేక ముద్ర కలిగిన కలిగిన కరీంనగర్ కవి కందుకూరి అంజయ్య. తెలంగాణా నుడికారం, దళిత జీవితం, ప్రజా విముక్తి పోరాట అవసరం, భిన్న సామాజిక, రాజకీయ సమూహాల మధ్య ప్రజాస్వామిక సంభాషణలతో కలగలిసిపోయిన కవిత్వమిది. రాజకీయ గీతల్ని, భావజాల పరిమితుల్ని దాటుకు వచ్చిన కవిత్వమిది. ఇందులో దళిత జీవితం, సంస్కృతితో బాటు ఎదిగివచ్చిన దళితుల్లో ఉన్న పరాయీకరణ, చైతన్య రాహిత్యాన్ని ప్రశ్నించడం కూడా ఉంది. దళిత, విప్లవ, తెలంగాణ ఉద్యమాల స్ఫూర్తి ఇందులో నిండుగా ఉండటమే కాక, సమాజం ముందుకెళ్ళే దిశగా వీటి కున్న పరిమితుల్ని గుర్తించి, స్తబ్ధతని చేధిస్తూ ఈ ఉద్యమాల భావజాల భూమికని అంతర్లీనం చేసుకుని నేటి తక్షణ పోరాటాన్ని ప్రమాణం చేసిన కవిత్వమిది. ఈ కవిత్వంలో నేటి సామాజిక రాజకీయ పరిస్థితి పరుచుకునివుంది. ఉద్యమ ఆశయాలు నెరవేరకుండానే సమాజం నిస్తేజమవుతుందన్న బాధ ఉంది. సంఘటిత ప్రజా ఉద్యమాల వెనుకబాటుతనం పట్ల ఆవేదన ఉంది. పీడిత సామాజిక వర్గాలలోంచి ఎదిగివస్తున్న వాళ్ళు తమ బాధ్యత మరుస్తున్నారన్న అక్కసు ఉంది. ముఖ్యంగా, ప్రజలకి ధైర్యంగా దారి చూపించాల్సిన మేధావివర్గం ముడుచుకుపోవటం మీద బాధ్యతాయతమైన విమర్శ ఉంది. నేటి ప్రపంచీకరణ కాలంలో అస్థిత్వాన్ని కోల్పోతున్న సామాజిక సమూహాల ఆవేదన ఉంది. ఆ సమూహాల సంస్కృతిని కాపాడుకోవాలనే ఆతురత ఉంది. అంజయ్య ఒక ఇండిజెనీయస్ తెలంగాణా ప్రజల కవి. ఉద్యమాలు, సాహిత్యం, కవిత్వ రీతులు, మారుతున్న సమాజం పట్ల అంచనా ఉన్న నిత్య సాహితీ విద్యార్థి. నేటి తరం రాజకీయ ఉద్యమాల సాహితీ సంభాషణాకారుడు.
అస్తిత్వ ఉద్యమాలనంతర కవిత్వం: కొన్ని ప్రశ్నలు
ఇదివరలా ఈ కవిత్వంలో పీడితుల బాధలు వెళ్లబోసుకోవటం ఉండదు. సానుభూతి కోసం దేబిరించడం ఉండదు. ఒక విధంగాచూస్తే, దళిత కవిత్వం మరో దశలోకి మారిన క్రమం కనిపిస్తుంది. విప్లవ, తెలంగాణ, స్త్రీ వాద ఉద్యమాల స్ఫూర్తి నింపుకోవటమే కాక, వాటిని పూర్వపక్షం చేసి ముందుకెళ్ళే దళిత ఉద్యమ సాహిత్యం కనిపిస్తుంది. ప్రపంచీకరణ కాలంలో, హిందుత్వ మత శక్తులు రాజ్యమేలుతున్న తరుణంలో, దళిత బహుజనులు, ఇతర పీడిత సమూహాల్ని కలుపుకుని చెయ్యాల్సిన ప్రజాస్వామిక పోరాటాన్ని ప్రతి చోట గుర్తు చేస్తున్నట్టు ఉంటుంది. చైతన్యంతో పోరాడాల్సిన సామాజిక శక్తులు శక్తిహేనులై జారిపోవటాన్ని ఉపేక్షించనట్టుంటుంది. సంఘటితం కావాల్సిన వాళ్ళు, చీలిపోవటాన్ని, విడిపోయి తన్నుకోవటాన్ని సహించనితనం ఉంటుంది. ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ ప్రజా ఉద్యమాలను ముందుండి నడపాల్సిన మేధావివర్గం అవకాశవాదంతోనో, స్వార్థంతోనో తప్పుకుంటున్న సందర్భాన్ని ప్రశ్నించడం ఉంటుంది. రాజకీయాలకి, ఉద్యమాలకు అంటీ అంటన్నట్టుగా ఉండే కవిత్వాన్ని , కవుల్ని ప్రశ్నిస్తాడు.
ఈ పుస్తకం టైటిల్ అయిన ‘అదనపు కణజాలం’ కవితలో :
‘ఆయుధం కావాల్సిన అక్షరం/ ఆముదం రాసుకొని తిరుగుతుంది/పట్టుకుంటే జారిపోతుంది/ ముట్టుకుంటే కారిపోతుంది…కదన నాదాలు కావలసిన చోట/ కాసుల పేరు కోసమో!/ కీర్తి కిరీటం కోసమో! / కంటికి కునుకును కరువు చేసింది/ అదనపు కణజాలమై పెరుగుతుంది.
చదువుకుని, ఉద్యోగాలు సంపాదించిన మేధావివర్గం ప్రజల్ని చైతన్యవంతం చెయ్యాల్సిందిపోయి, స్వార్ధంతో, దిగజారుడుతనంలో కొట్టుకుపోతున్న వాళ్ళకి చురకలేసిన కవిత ఇది. ఇదొక సామాజిక అనారోగ్య లక్షణంగా, కొందరు కవులు తెచ్చిపెట్టుకున్న అవలక్షణంగా చూడటం జరిగింది. ఇదే క్రమంలో చైతన్యంతో మరింత సంఘటితమవ్వాల్సినవాళ్ళు రకరకాల కారణాలతో చీలిపోయి చివరకి ఆధిపత్య వర్గాలకి బానిసలుగా తయారవుతున్న వాళ్ళను నిరసిస్తూ:
‘శాసన కర్తలై/స్వజనుల శ్వాసకు కావలుంటారనుకుంటే…చెట్టుకొకడు చీలి/నడిచే కాళ్ళ నడుమ కట్టెలేస్తున్నరు /నోరుండి మాట్లాడలేని/ కాళ్ళుండి కదలలేని కట్టు బానిసలైనరు ‘ (పల్లేరు కాయలు).
పీడిత కులాలలో సంఘటితం లేక, విచ్ఛిన్నమవుతుంటే, పాలక శక్తులు వేర్వేరు రాజకీయ పార్టీలలో ఉన్నా , వారి మధ్య చెక్కు చెరగని అనుబంధం ఎలా ఉంటుందో చెబుతూ,
‘ఓట్ల జాతర/ ఒడుపుగా ఒడ్డెక్కాలంటే/ నేను తిట్టినట్టు చేస్త/నువ్వు బాధపడ్డటు చెయ్యి…నేను కొట్టినట్టు చేస్త/నువ్వు ఏడ్చినట్టు చెయ్యి/మన కొట్లాట ఇప్పటిది/మన స్నేహం ఎప్పటిది .
‘మనం మనం ఒక్కటి’ కవితలో పాలకుల రాజకీయ స్వభావాన్ని విప్పి చెబుతాడు.
పీడితులకు పోరాటం అవసరం అని నమ్ముతూ, వాళ్ల పోరాటాలను వాళ్ళ నాయకత్వంలోనే జరగాలని కోరుకుంటాడు. అందుకే వాళ్ళ గొంతుకలతో వాళ్ళని మాట్లాడనీయమంటాడు. ఉద్యమ పండితుల జ్ఞానాధిపత్యాన్ని ధిక్కరిస్తూ, ఆచరణలో వాళ్లకుండే కుల పక్షపాతాన్ని ఉద్దేశిస్తూ,
‘సిద్ధాంత వేత్తలారా! / తరతరాలుగా జ్ఞాన సంచయాన్ని/ గంపలకెత్తుకుని కూడగట్టుకున్న/ కూటనీతుల కోటలారా!/ వాళ్ళని మాట్లాడనీయండి’ అంటాడు.(మాట్లాడే గాయాలు). అవకాశవాదంతో అటుఇటుగా ఊగిసలాడే ఉద్యమకారులను, పెడ ధోరణుల్ని తిప్పిగొడుతూ, నిజమైన ఉద్యమ గొంతుకల్ని ఎవరూ నొక్కిపెట్టలేరని చెబుతూ, ‘సూదిని ఎన్ని రోజులు ముల్లె గడుతవు/సూర్యచంద్రుల వెలుతురుకు/ ఎన్ని రోజులు తెప్పవై తెరపడుతవు’ (తూర్పుకు కొద్దిసేపూ…పడమరకు కొద్దిసేపూ).
ప్రపంచీకరణ ప్రతిఘటనా కవిత్వం
నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో జరుగుతున్న ఆర్థిక, సాంస్కృతిక విధ్వంసానికి ప్రతిస్పందనగా ఇందులో అనేక కవితలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారితంగా విస్తరిస్తున్న ప్రపంచీకరణ నమూనా, ఒక వైపు ఆర్థికంగా బహుళ జాతి సంస్థల మార్కెట్ ఆధిపత్యాన్ని బలోపేతం చేస్తూ, మరోవైపు సమాచార వ్యవస్థలు, డిజిటల్ మాధ్యమాల ద్వారా రాజకీయ నియంత్రణను కొనసాగిస్తుంది.బహుళ జాతి మార్కెట్ ప్రభుత్వాలని కబలిస్తుంది. సామ్రాజ్యవాద సంస్కృతి అన్నింటా ఆవహిస్తుంది. ప్రజల్ని వస్తూ సంస్కృతికి బానిసలుగా తయారు చేస్తుంది. ఈ పరిణామాలు ప్రజల్ని చైతన్యహీనులుగా తయారుచేస్తుంది. మనిషి తన సొంత అస్తిత్వాన్ని, సామాజిక సంబంధాలను, స్థానిక జీవన విలువలను సైతం మరిచిపోయే ప్రమాదాన్ని పెంచుతోంది. సంప్రదాయ వృత్తులు, చేతివృత్తుల నైపుణ్యాలు క్షీణిస్తుండగా, స్థానిక సంస్కృతులు, సామాజిక సమూహాల జీవనాధారాలు సంక్షోభంలో పడుతున్నాయి. అంజయ్య ఈ మార్కెట్ అభివృద్ధి నమూనాల మాటున తీవ్రమవుతున్న అసమానతలు పసిగడుతూ:
‘ఇది ప్రపంచ పెద్దలు/ పేదరికం మీద విసిరిన/ పరిహాటపుటస్త్రం అని/ పరిపరి విధాల పరితపించినా/ కాలే కడుపు సాలు దున్నదనీ/ మాడే ఎండ నీడ కోరుతదనీ/ మర్మం తెలిసిన వారికి/ మనసున పట్టింది’ (నల్లని కత్తి). మార్కెట్ ఆర్థిక వ్యవస్థ విస్తరణలో ఆసియా, ఆఫ్రికా దేశాలను ఎంచుకోవడం, మార్కెట్ తో మెలాఖతైన స్థానిక ప్రభుత్వాలు, ఆ విధానాల అడ్డంకులు లేకుండా అమలుకోసం, ఆమోదం కోసం దళిత, ఆదివాసీ కులాలకు సంబంధిన వాళ్ళకు అలంకారిక పదవుల్లో కూర్చోబెట్టడం జరుగుతుందని ఈ కవితలో చెబుతాడు.
కార్పొరేటీకరణ కేంద్రకంగా వున్న నయా ఉదారవాద విధానాలు, సామ్రాజ్యవాద ప్రయోజనాలను నెరవేరుస్తూ దేశదేశాల్లోని వనరులను కొల్లగడటం చూస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా, ఆయుధ సంపత్తితో బలిసిన దేశాలు ఎక్కడ వనరులుంటే, అక్కడ వాలిపోయి, లొంగదీసుకోవడమో, లేక యుద్ధాలు చేసి ఆక్రమించుకోవడమో తరచూ చూస్తున్నాం. అక్కడ ప్రజల జీవితం మరింత దుర్భరంగా తయారవటం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాసిన ‘ఉరి తాళ్ళైన వనరులు’ కవితలో :
‘వనరులు ఉన్నందుకే/ వంగి వంగి సలాం కొట్టాలె/లొంగి లొంగి బతకాలె/ తలుతుకుంటే/ తలారి తల్వారు తీస్తడు/. ఉగ్రవాది వంటడు/ విధ్వంసక ఆయుధ విధాత ‘అంటాడు.
బహుళ జాతి మార్కెట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రభుత్వం ప్రజాస్వామిక ఉద్యమాల పట్ల కన్నెర్ర చేసే నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. మార్కెట్ , మతం, జాతీయ వాదం కలిసిపోయిన కొత్త రాజకీయ వాతావరణంలో ఎటువంటి ప్రజాఉద్యమన్నైనా రాజద్రోహంగా ముద్రవేసి నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తుంది. సొంత దేశంలో సొంత ప్రజలను శత్రువులుగా చూసి దాడి చేయటాన్ని, ముఖ్యంగా ఖనిజ సంపద విస్తారంగా ఉన్న ఆదివాసీ ప్రాంతంలో మీద కన్నేసి,వాళ్లకు బతుకుదెరువు లేకుండా దోపిడీ చేస్తున్న సందర్భంలో,
‘ఖనిజ సంప కషాయం కార్పొరేట్లు /కలిసి నడుస్తున్నయి/ మాడ్ ను మ్యాచివేసే/మంత్రాంగం మొదలయింది/కడుపులో దాగిన ఖనిజాల మీద/కన్ను పడ్డది…..విమానాలు హెలికాప్టర్లు/ బూగలై భూమిమీద ఎగురుతున్నై/ సిలింగేర్ సింహనాదాలు/ సైన్యం సంపుడు పందానికి/సవాలు విసిరినయి/ బస్తరు ఇప్పుడు బయటి దేశం/ఆదివాసీలు ఇప్పుడు అవతలి దేశపు మిలీషియా’ (సిలింగేర్).
ప్రజాస్వామికంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం, రాజ్యాంగబద్ధ సంస్థలకు స్వతంత్ర లేకుండా చేసి అధికార పార్టీలకి అనుకూలంగా లోబరుచుకున్న వైనాన్ని విమర్శిస్తూ :
‘సంస్థలన్నీ సలేగూట్లో / చిక్కిన ఈగలై/ గిలగిల కొట్టుకుంటున్నయి/ బల్లిపాతర బాహువుల్లో చేరినంక / బతుకు చిత్రం చిద్రమైంది../సూత్రధారుని చేతివేళ్ల సైగలకు ఆడే/ తోలుబొమ్మ అయింది’ (సాలెగూడు).
వినిమయ సంస్కృతి విస్తృతి
ప్రపంచీకరణలో భాగంగా వినిమయ సంస్కృతి విస్తృతి పెరిగింది.ప్రచార మాధ్యమాల ద్వారా ఈ సంస్కృతి నగరాలుతో బాటు, పల్లెలకీ కూడా చేరుతుంది. కృత్రిమ అవసరాలను కూడా, అసలైన అవసరాలుగా నమ్మటమే కాక, ఆ మోజులో నుండి బయట పడటం కష్టంగా తయారవుతుంది. అయితే సామాన్య ప్రజలు అందుకు తగ్గ ఆర్థిక వెసులుబాటు లేకపోయే. ఊరూరావినిమయ సరుకుల రవాణా పెద్ద పెద్ద ప్లెక్సీలతో, ఇన్స్టాల్మెంట్ లోనో, క్రెడిట్ కార్డ్ ద్వారానో కట్టుకునే పద్ధతిలో, ఆర్థికంగా, సాంస్కృతికంగా ప్రజలు దోపిడీకి గురవుతున్నారంటూ:
‘ఊట పుట్టిన కాడికి/ ఊడ్చి పెట్టిన కాడికి / పైసల ప్రవాహం/ ఒక్క తీరుగనే పారుతది/ఎవరికి తోచింది వారు/ఏరు కోవడమే తర్వాయి…. మనిషిని మరను చేసి/ సరుకుల చెరసాలలో బంధించే/ వాణిజ్యపు వలపు తోట’ ( సరుకుల చెరసాల).
దేశీయ సంస్కృతుల జాతరగా దళిత ఆదివాసీ బహుజన జ్ఞాన పరంపర
ఆర్థిక, రాజకీయ సంక్షోభాలకు ప్రతిస్పందనగా అంజయ్య కవిత్వంలో సాంస్కృతిక అస్తిత్వం ఒక ముఖ్యమైన ప్రతిఘటనా రూపంగా ఉంది. దళిత బహుజన సమూహాల జ్ఞాన పరంపరలు, వృత్తి నైపుణ్యాలు, జీవన పద్ధతులు, స్థానిక విశ్వాసాలు గౌరవప్రదమైన స్థానంలో కవిత్వీకరించాడు. ఇందులో దళిత బహుజన కులాల జ్ఞాన పరంపర, సంస్కృతిని గొప్పగా గానం చేయడం చూస్తాం. ఆధిపత్య సంస్కృతులు జ్ఞానానికి నిర్దేశించిన పరిమితులను ప్రశ్నిస్తూ, శ్రమలో, చేతివృత్తుల్లో, సమూహ జీవనంలోని క్షిప్తమైన విజ్ఞానాన్ని అంజయ్య వెలుగులోకి తెస్తాడు. ఇండిజెనీయస్ సమూహాల్లో ఉండే జ్ఞానాన్ని, నైపుణ్యతను ఎత్తిపడతూ,
‘మగ్గం మీద కూర్చుంటే/ కళ్ళు చేతులు ఆడిస్తూ/ కంటి సూపు నిగరానీలో/మునివేళ్ళ కదలికలు /…మరలెన్ని వచ్చినా/మంత్ర ముగ్ధులను చేసే/ఇంటర్ లాకింగ్/ఇగురుల ఇంధనం/తరగని తరళం ‘ ( మగ్గం సృష్టి) .
ఈ కవి సాంస్కృతిక అస్తిత్వ స్పృహలో మరో ముఖ్యమైన అంశం, స్థానిక ప్రజల ప్రకృతితో ముడిపడిన జీవన విధానాలు, విశ్వాసాలు, నైతిక విలువలకు ఇచ్చే ప్రాధాన్యం. ఇది సామ్రాజ్యవాద వినిమయ సంస్కృతికీ, బ్రాహ్మణీయ ఆధిపత్యంతో ముడిపడిన మత సంస్కృతికీ భిన్నంగా, స్థానిక సమూహాల సామాజిక అనుభవాల నుంచి ఆవిర్భవించిన విశ్వాసాలను అంజయ్య తన కవిత్వంలో పునరావిష్కరిస్తాడు. ప్రజల సామూహిక సహజీవనంలో భాగంగా కొనసాగుతున్న ముత్యాలమ్మ, గంగానమ్మ, సమ్మక్క, సారలమ్మ, మల్లన్న వంటి గ్రామదేవతలను, జానపద దైవాలను ఆధిపత్య మత సంప్రదాయాలకు సమాంతరంగానూ , ప్రత్యామ్నయంగా నిలబెడతాడు.వైదిక బ్రాహ్మణీయ సంస్కృతికి సమాంతరంగా ఈ దేశంలో వేళ్ళూనుకున్న ప్రత్యామ్నాయ సంస్కృతిగా, ప్రకృతిక జ్ఞానపరంపరగా చూస్తాడు. వీటిని హిందుత్వంలో భాగంచేసి వాటి లక్షణాల్ని చేరకుండా ఉండే సూచన చేస్తూ:
‘ముత్యాలమ్మా…../ బ్రాహ్మనాలు బారెడెత్తు గోడలు కట్టినయి/ అరణ్యకాలు నిన్ను అడుగు పెట్టనీయలేదు/ ఉపనిషత్తుల్లో నీ ఊసేలేదు/ నువ్వు మా ఊరి దేవతవమ్మా/ మా పంటలను కంటికి రెప్పలా కాపాడే/ చల్లని తల్లివమ్మా’ అని అంటాడు(ద్వేషం వంచన చేరకు తల్లీ!).
ఈ సాంప్రదాయ పరంపరలోనే, ఆదివాసీల దేవతలుగా పూజలందుకుంటున్న సమ్మక్క, సారలమ్మలను రాచరికానికి వ్యతిరేకంగా పోరాడిన వీర వనితలుగా :
‘బాధలను ఎదుర్కొనేందుకే/ బరిగీసిన బతుకులు. రాజ్యంతోని కొట్లాడి/ రణరంగంలో ఒరిగిన వనజీవులు/ సమ్మక్కా, సారలమ్మా!/ పడిగిద్దరాజు,గోవిందరాజు/ పోరిలో ఓడిన జంపన్నా! దారికి దీపం,ఊరికి కాపల/ ఇది రాచరికానకి/ తెగల తెగువకు మధ్యన పోరాటం’ గా చూస్తాడు (గురి తప్పని అడుగులు).
అంధ మత విశ్వాసాలు, కుల వివక్షత, లైంగిక దోపిడీ
స్థానిక సంస్కృతిని, గ్రామ దేవతల మత భావనని బలపరచిన ఈ కవి, ఈ మత సంప్రదాయాల చాటున జరిగే దోపిడీని, దుర్మార్గాన్ని ఏ మాత్రం సహించడు. మత నమ్మకం పేర జరిగే హింసని, వివక్షతను, స్త్రీల పై జరిగే లైంగిక దోపిడీని నిరస్తాడు.దళిత స్త్రీలను జోగినీలుగా మార్చి భోగ వస్తువులుగా వాడుకుంటున్న కుల సమాజాన్ని ఈసడించుకుంటూ, గ్రామదేవతగా కొలువబడే గంగానమ్మ జాతర ను దృష్టిలో ఉంచుకుని,
‘దేవాలయానికి దూరం చేసిన దేవి/ ఈ మలిన దేహాన్ని ఎందుకు ఇల్లు చేసుకున్నదో?/ ఈ వెలివాడలో కన్నె పిల్లను/ కోరికోరి ఎందుకు ఎన్నుకొన్నదో? … దేశదేశాల లేపనాలు /పూసుకున్న/ లేత చిగుర్లు/ రకరకాల అత్తర్లు అడ్డుకొన్న/ అందగత్తెలు/ ఒక్కరూ పనికి రాలేదా తల్లీ?/ నీ పూనకానికి/ మా సెమట కంపే/నీకు ఇంపయిందా?/ మా గుడిసె గుండెనే / నీ మెడలో దండ అయిందా?’ (గంగానమ్మ)
అంజయ్య కవిత్వం స్థానిక దేవతల ఆరాధనను బ్రాహ్మణీయ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా నిలబెట్టడమే కాకుండా, స్థానిక మత సంప్రదాయాల్లోనూ కొనసాగగల కుల, లింగ అసమానతలను ప్రశ్నిస్తుంది. సాంస్కృతిక అస్తిత్వానికి ఆయన ఇచ్చే ప్రాధాన్యం విమర్శనాత్మకమైనదిగా వుంటుంది. అది మానవ గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ అనే విలువలతో ముడిపడి ఉంటుంది.
మత సామరస్య ప్రజా సంస్కృతి
హిందువులు, ముస్లింల మధ్య విపరీతమైన ద్వేష భావం రగిలించి రాజకీయ పబ్బం గడుపుతున్న నేటి సందర్భంలో కూడా, తెలంగాణా పల్లెలలో నేటికీ పీర్ల పండగలో అలాయి బలాయి గురించి మనుషులంతా మతాలకతీతంగా ఒక్కటైన సందర్భాన్ని గుర్తు చేస్తూ, ‘కులాలు మరిసి/కూడి ఆడే ఆట/ మతాలు మరిసి / మనుషులుగా ఒక్కటయ్యే బాట’( పీరీల పీరితి).
అతివాస్తవిక లోకంలో ఓడవని ముచ్చట
అంజయ్య కవిత్వం లో తెలంగాణా నుడికారం, నిండుతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చాలా మంది తెలంగాణా కవులకు మల్లే అంజయ్య కవిత్వానికి తెలంగాణా ఉద్యమం ప్రాంప్ట్ గా వుంటుంది. ఎన్నో బలిదానాలతో, ఆశలతో, ఆశయాలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణా లో అనుకున్నంత అభివృద్ధి జరగలేదనే బాధ ఉంది. మళ్ళీ కత మొదటి కొచ్చిందన్న ఆవేదన ఉంది. ఈ సందర్భంలో జయశంకర్ ను స్మరిస్తూ,
‘శంకరా! ఇప్పుడు మనుషులను/ కూడగట్టే మానిసి లేడు/ మంచి చెడులను విప్పి చెప్పే/సాత్వికుడు లేడు/ అంతా/ వడ్లు పెరుగు కలిపినట్టుంది/ పడని కాడ వస్త్రగాలం/పట్టినట్టుంది/ ఈన గాస్తే నక్కల పాలయింది/ అంతా మొదటి కచ్చింది/ ఓడవని మచ్చటై కూసుంది’ (ఓడవని ముచ్చట).
అంజయ్య కవిత్వంలో సామాజిక గమనంతో బాటు, మారుతున్న ఉద్యమ గమనాలు, చెదిరిపోతున్న ఆశలు, పోరాట అవసరాలు మనకు కనిపిస్తాయి. కవిత్వాన్ని ఒక తాత్విక సూత్ర సూదితో కుట్టినట్టు ఉంటుంది. అందుకే కవిత్వంలో సామాజిక అనుభవంలో ఇమిడిపోయే తాత్విక వ్యక్తీకరణ కనిపిస్తుంది.నిజం, అబద్ధం కలిసిపోయిన నేటి అతివాస్తవిక సమాజంలో, అసత్యాలు సత్యాలుగా దభాయిస్తూ రాజ్యమేలుతున్న పోస్ట్ హ్యుమన్ సందర్భంలో ఒకానొక గుడ్డి ప్రేమ గురించి ఇలా:
‘ఇది గుడ్డి పాయిరం తండ్రీ/ గునుగు పువ్వులను/ సన్నజాజు లంటది/ మోదుగు మొగ్గలను/ మొగలి పువ్వు లంటది/ తుంగ గడ్డిని / తూనీర మంటది/ గడ్డిపరకలను/గంధం పొరక లంటది…కిలకిల పాడే కీరాలను/ డేగ లంటిది/ వేటాడి నెత్తుటి కూడు తినే రాబందులను/ పావురాలంటది’(గుడ్డి పాయిరం).
అంజయ్య అదనపు కణజాలం కణ కణ మండే నుప్పుల కొలిమిలోంచి ఎగిసిపడుతున్న అక్షరాలున్నాయి. దుఃఖిత ధూళికణాలకు రెక్కలు మొలిపించే నినాదముంది.చక్కని చల్లగాలి చుక్కాని ఉంది.
(కందుకూరి అంజయ్య , అదనపు కణజాలం,అంబేద్కర్ ఫూలే పెరియార్ అధ్యయన వేదిక,కరీంనగర్. ప్రతులకు కందుకూరి అంజయ్య, 9490222201)