మేము జీవిత ఖైదీలం 

వేల ఏండ్లుగా 
చర్మాన్ని ఒలిసినం
చెప్పులు కుట్టినం 
డప్పులు చేసి డమరుక నాదమైనం 
ఇప్పుడు మేము జీవిత ఖైదీలం

వాడి ధర్మంలో 
మేము శూద్రులం
బానిసలం
ఎట్టిచాకిరి చేసి
అంటరానితనానికే ఊడిగం చేసినం
ఇవాళ మేము జీవిత ఖైదీలం

మా వృత్తిమీద 
మా శ్రమ మీద 
మేము తినే మెతుకుల మీద 
చివరికి మా రక్త మాంసపు ముద్దల మీద 
కాషాయపు రంగు పులుముకుంది 
అలా మేము జీవిత ఖైదీలమైనం 

గోవును మాతగా ప్రకటించి 
చివరికి న్యాయస్థానమే వేదాలు వల్లిస్తుంటే 
దేశపు రాజ్యాంగం
కోర్టు మెట్లమీదే మౌనంగా ఉండిపోయింది
అందుకే మేము జీవిత ఖైదీలమైనం

మీరు చూస్తూనే ఉండండి…
మా చెప్పులతో
మీ గడపల్ని దాటుతాం
మా డప్పులతో
నిశ్శబ్దపు గోడల్ని బద్దలు కొడతాం
మా కలాలతో అసలైన చరిత్రను నిర్మిస్తాం

**

(గోవును వధించి, తిన్నారని గుజరాత్ హైకోర్టు ముగ్గురికి యావజీవ కారాగార శిక్ష వేసినందుకు నిరసనగా…)

కవి, రచయిత. విరసం సభ్యుడు. స్వస్థలం రంగారెడ్డి జిల్లా. విప్లవ సాహిత్యం స్ఫూర్తితో రచనలోకి వచ్చాడు. సమాజంలోని అసమానతలు, అణచివేతలు, దోపిడీ , పీడనకు వ్యతిరేకంగా కవిత్వం రాస్తున్నాడు. రచనలు : 1. నేల నుడికారం (కవిత్వం), 2. రెక్కల చప్పుడు (కవిత్వం) కవితా సంపుటాలు వెలువరించాడు. అక్షరాల ద్వారా సమాజాన్ని ప్రశ్నిస్తూ, మనిషి విముక్తి ఆకాంక్షను తన కవిత్వంలో ప్రతిఫలింపజేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాడు.

Leave a Reply