ఓ యుద్ధాన్ని వెదుక్కుంటూ

వెళ్ళిపోవాలి
ఓ యుధ్ధాన్ని వెతుక్కుంటూ

అది ఎక్కడ ఉందో అక్కడికి
వెళ్ళిపోవాలి

ఏ మూలాలను కదిలించడానికి అది మూలమౌతుందో అక్కడికెళ్ళిపోవాలి

అరణ్యాల్లోకో
పాల వంటి తెల్లటి సెలయెళ్ళ అద్దంలో తమ ప్రతిబింబాలు చూసుకునే మబ్బుల కిందికో
వన విలాసం లో వికసించే మొరటు మొగ్గల
వగరు పరిమళంలోకో

వర్షానికి తడిసి ముద్దైన నేల విడిచే
మట్టి సువాసనల్లోకో

పోడు వ్యవసాయం చేసే గోండు సవర లంబాడీ
సమూహాల ఉత్సవాల నాట్యాల్లోకో

విప్లవ వీరులు జాబిల్లి తప్పెట పై వేసే దరువు శబ్దాల్లోకో అడవి బిడ్డలు పాడే వెన్నెల గీతాల తెలుపులోకో

ఏది సురక్షితం కాదు ఇపుడు
ఆ జలపాతమూ ఆ సెలయేటి హొయల గానమూ
ఆ కొండాకోన మీద ముద్దులు కురిపించే పెళపెళరావమూ
ఆ నదీపాయల నడుమ్ముడతలను మీద పూలతీగెల అభిమానమూ
ఏదీ సురక్షితం కాదు

నాకు తెలిసిన అరణ్యం ఒకటుంది
అది దేశమ్మొత్తాన్ని విముక్తీకరించడంలో
విల్లంబెత్తుకుంది
ప్రకృతిని ప్రకృతిలా ప్రేమించే యుధ్ధం అది
సహజాతాలను సహజంగా గౌరవించే మార్పుల దశ అది
మానవులకు నిజమైన తోవలోకి దించే సహజదిశ అది

ఆయుధం కళాకృతిగా సాయుధ విముక్తికి వంత పాడే
ప్రతి పోరాటంలోకి వెళ్ళిపోవాలి
పోరాటమే నేనై పోవాలి నేనే పోరాటమైపోవాలి
నాలోంచి పోరాటం జనఘోషై బయల్పడాలి

యుద్ధాన్ని అసహ్యించుకోవడం కాదురా
పిల్లగాడా
యుధ్ధం రాజేసి తన ఆధిపత్యం నిలుపుకునే
రాజ్యాన్ని
ఎదుర్కునే యుద్ధం ఎవరు మొదలుపెడితే ఏమి?
యుధ్ధ సాయంకాలంలో సేదదీరి
పొద్దుటి సూరీడు ధగధగలాడించే ఉదయం లాగా
నేల మీద నువ్వు పరుచుకుంటావు చూడు
అక్కడ కదా నువ్వూ నేనూ నిలడాలి
వెళదాం పద.
సాయుధంగానో నిరాయుధంగానో…

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

Leave a Reply