‘అలా ఉనికిని వేరుచేసుకొన్న
యువకుడొకడు తన జీవితాన్ని
తన ఊరు చూడని నింగిలోకి
ఎగరేశాడు…,
(దేశం పంపిన బహుమతి : బల్దేర్ బండి)
బల్దేర్ బండి కవిగా ధావ్లో కథకుడిగా తెలుగు సాహిత్య వేదికపై తనదైన జాగాను సంపాదించుకున్న రమేశ్ కార్తీక్ నాయక్ గురించి నాలాంటివాడి ప్రశంసా పూర్వక పరిచయ వాక్యాలు అక్కర్లేదు. అతని సాహిత్యమే అతన్ని ఆవిష్కరిస్తుంది. కవిత్వ పంక్తుల మధ్య, కథల పుటల లోపల అపురూపంగా దాచుకున్న నెమిలీకల్లాంటి అతని జ్ఞాపకాలే అతన్ని పట్టి ఇస్తాయి. అతను యెంచుకొని పదిలంగా ప్రయోగించిన పదచిత్రాలే అతని అస్తిత్వాన్ని చాటిచెబుతాయి. అయినా అతని మాట కాదనలేక యీ రెండు మాటలు; రమేష్ కవిత్వంలోకి నడవడానికి దారి చేసుకుంటూ …
చాలా మంది యువ రచయితల్లాగానే రమేశ్ కూడా స్వీయ అనుభవాల దగ్గరే మొదలయ్యాడు. తన సామాజిక అస్తిత్వం నుంచి జీవితాన్ని అర్థం చేసుకున్నాడు. దాన్ని వ్యాఖ్యానించడానికి ప్రయత్నించాడు. కానీ అతను అక్కడ ఆగలేదు; యిప్పుడు స్వీయ అస్తిత్వ పరిధుల నధిగమించిన కవిగా మన ముందు నిలబడ్డాడు. చుట్టూ వున్న ప్రకృతి నుంచి కొత్త పరిసరాల నుంచి కవిత్వ సామగ్రి తెచ్చుకున్నాడు. వాటిని నూత్న నిర్మాణరీతుల్లకి పొదువుకొని రచనలో విస్తృతినీ లోతునీ సాధించాడు. అయితే రమేశ్ చేస్తున్న ప్రయాణం హై వే మీద కాదు. అది అనేక కుదుపుల బళ్ల గాడిలో. కుదుపులే అతనికి నడక నేర్పాయి, బతుకు భాష్యం విప్పి చూపాయి.
తనవి కాని నాలుగక్షరాలు నేర్చిననాడే రమేశ్ పరాయీకరణకి గురయ్యాడు. నాగరికత అతన్ని మూలాలకు దూరం చేసింది. అనేక సంక్లిష్టతలతో కూడిన నగరంలో యిమడలేడు. ఇమడక తప్పదు. ఏదో కోల్పోయిన భావన. కోల్పోయినదాన్ని అందుకోలేని తపన. ఇంటా బయటా యెక్కడున్నా సమూహంలోనూ వొంటరితనం. లోపలి ఖాళీలోకి చొచ్చుకొచ్చే అస్పష్ట భయాలు. లోతు తెలీని కన్నీటి నదుల్లో యీదులాట. చేతివేళ్ల సందు నుంచి జారిపోతున్న జీవితం. శూన్యంలో కావాల్సినదాని కోసం వెతుకులాట. కొత్త ప్రవాహంలో దరి తెలీని ప్రయాణం. వాలుకు కొట్టుకుపోతూ తనదికాని జీవితాన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఆమేరకు తండాకు దూరమయ్యాడు. తాండాకు అతను దూరమయ్యాడు కానీ ‘టాండా’ అతనికి దూరం కాలేదు. తాండా జ్ఞాపకాలు, అక్కడి మనుషులు వదల్లేదు. అతని గుండె తండాలోనే తండ్లాడుతోంది. అది మోసే గాయాల్ని ఆర్తితో తడుముతున్నాడు. మాయమయ్యే గతాన్ని కనురెప్పల వెనక అణచిపెట్టుకున్నాడు. అందువల్లే పొయ్యి మీద వుడికే ‘సలోయి’ కోసం తాండా వాసుల ‘పేగుల్లో తుఫాన్లు’ రేపే ఆకలి ఆరాటాన్ని ఆవిష్కరించగలిగాడు. ‘ఆకాశంలో మేఘాలను కిందికి లాగడానికి బాణాలు సంధించే ఆదివాసీని’ కవితా దృశ్యంగా మలచుకున్నాడు. మాట్లాలో పులిసిన బెల్లం నీళ్లు పగిలిన నల్ల జీడి కాయలు, పండుటాకుల్లా రాలిపోయే యాడి(అమ్మ) చూపులు, యాడి కంటిలో గడ్డకట్టిన నదులు, శతాబ్దాలుగా యెడ్ల బండ్ల మీద వేలాది మైళ్ళు నడిచిన వలస(లదణి)లు… యేదీ అతని ఆలోచనల్లోంచి జారిపోలేదు.
ఘుంగ్టోలో పొదిగిన గుండ్రటి చదరపు అద్దాలు పూసలు గవ్వలు నింగీ నేలలతో చెప్పే రహస్య భాషని తన గుండెలో పదిలంగా దాచుకున్నాడు. ఝూల్లో నిక్షిప్తమైన తన జాతి చరిత్రను తవ్వి తీసి సగర్వంగా నమోదు చేస్తున్నాడు. గొంతులో ఆగిన మాటల్ని జీడివాత పెట్టి పిండుకుంటున్నాడు. సమూహంగా నడిచినంత మేరా భూమికి పచ్చబొట్లు పొడుస్తున్నాడు. అయితే గమనించాల్సిన అంశం యేమంటే తండా అతనికి గతకాలపు వునికే గానీ వర్తమానం కాదు. అక్కడ అతను తనని తాను వెతుక్కోడానికి, relocate చేసుకోడానికి సతమతమౌతాడు గానీ అక్కడే వుండిపోడు. పోలేడు. అదొక చిత్రమైన మానసిక స్థితి. నగరం నుంచి తండాకి వెళ్లినా తాండా నుంచి నగరం తొవ్వ బట్టినా ప్రతిచలనంలోనూ విడమర్చి చెప్పలేని ఖాళీతనమే.
ఈ క్రమంలోనే తనలోని ఖాళీని పూరించుకోడానికి రమేష్ కవిత్వాన్ని ఆశ్రయించాడు. కాగితం అంచుల్లో తచ్చాడాడు. కాగితం కింది పొరల్లో నలుగుతోన్న మనుషులతో సంభాషించాడు. కాగితమ్మీద కలల అలలు, కన్నీటి సముద్రాలు సృజించాడు. ‘చీకటింట్లో రేయి గుండెకు ఊపిరిలూదే’ విద్యని సాధన చేసాడు. హృదయాన్ని యుద్ధభూమిని చేసుకున్నాడు. రేయింబవళ్లు సంఘర్షించాడు. లిపిలేని తన భాషలో సైతం తనకో చిరునామా వుందని బలంగా ప్రకటించాడు. తన రచనల్లో దాని చుట్టూ అల్లుకొని వున్న చరిత్రని నిర్మించుకుంటానికి పూనుకున్నాడు. అనుభవిస్తే గానీ అందుకోలేని అర్థం విప్పి చెప్పలేని నైరూప్య చిత్రాలెన్నో తనదికాని భాషలో గీశాడు, రక్తంతో రంగులు అద్దాడు. మారుబాయి దాదీ గోమ్యా లాఖ్య దాదాలు చెప్పిన పురా మౌఖిక గాథల్ని కొత్తగా కయిగట్టాడు. తన యాడితో కలిసి అతనొక సామూహిక గీతం ఆలపిస్తున్నాడు. ఇదంతా కుబుసం విడిచినంత సహజంగా జరిగిన ప్రాకృతిక చర్య అయితే కాదు. ఎంతో వేదనా భరితం. పై చర్మం నుంచీ లోపలి యెముకల మూలగ వరకూ జరిగే మెటమార్ఫాసిస్. అనివార్యమైన యీ రూపాంతరంలో భాగమైన ప్యూపా దశని తనలోకి తాను చూసుకునేందుకు వుపయోగించుకున్నాడు. దేన్ని వదులుకోవాలో దేన్ని మిగుల్చుకోవాలో పూర్తిగా తెలీనితనంలోంచే కవిత్వమై వ్యక్తమయ్యాడు. ‘బల్దేర్ బండి’ నుంచి ‘టాండో’ వరకు జరిగిన యీ పరిణామం నుంచే రమేశ్ అస్తిత్వ వేదననీ అందుండీ అతను నిర్మించుకున్న కవిత్వ పరిభాషనీ అర్థంచేసుకోగలం.
కార్తిక్ నాయక్ అనుభవించే ఆర్తి అతని వొక్కడిదే కాకపోవచ్చు. అతనిలా మూలాలకు దూరమైనవాళ్లందరిదీ. సాంస్కృతికంగా సామాజికంగా పరాయీకరణకి గురై వొంటరితనంలో కొట్టుమిట్టాడే వాళ్లంతా రమేశ్ కవిత్వంలో తమని తాము గుర్తించుకోగలరు. యాంత్రికతని తిరస్కరించిన అతని రచనానుభవంతో మమేకమైనప్పుడే అతని గుండె చప్పుడుని తర్జుమా చేసుకోగలరు. అతని సప్తవర్ణ సమ్మిశ్రిత స్వప్నాలతో ప్రయాణం చేసినప్పుడే అతను వాడిన ప్రతీకల వెనక వున్న నిర్దిష్టతల్ని అర్థంచేసుకోగలరు. ఒక వేవ్ లెంగ్త్ ని యేర్పరచుకోగలరు.
రచయితల వ్యక్తిత్వపు నేల విడిచి రచనా నైపుణ్యాల సాముని మెచ్చుకొనే పాడు కాలంలో రచనని ఆధారం చేసుకుని వ్యక్తిత్వాన్ని అంచనా కట్టే యీ పధ్ధతి సరైందో కాదో కాలమే చెప్పాలి. కాలానికి మాటిమ్మని కవిని అడగడం తప్పుకాదు. భవిష్యత్తుకు భరోసానివ్వని కవిత్వం అబద్ధం అని నా నమ్మకం.
ఇంతకీ నేను నేనేనా?
లేదా నాగరికుడినా ?? (టాండో)
ఈ సంపుటిలో కార్తీక్ వేసిన ప్రశ్న చివరికి ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రశ్న అతనిదే కాదు; నాది కూడా. దానికి సమాధానం వెదికే ప్రయత్నమే యిదంతా.