సాహిత్య రంగంలో సుప్రసిద్ధులైన సతీష్ చందర్ కథకుడిగా కథలను మాత్రమే కాక, వివిధ ప్రక్రియల్లో అగ్రగణ్యులుగా రాణిస్తున్నారు. కాలాన్ని కలంతో ఝలిపించే సృజనశీలిగా సుపరిచితమే. వారి కథలో కాలం, కలతలు, కన్నీళ్లు కలిసిపోతాయి. రణం, కారణం రెండూ సంఘర్షణ పడుతుంటాయి. చదువుతూనే ఎవరికి వారే, మనపై మనమే విమర్శల యుద్ధం చేసుకుంటాం. కథలలో కన్నీళ్లే కథలు. బాధలే గాథలు. పోలికలు పేలుతాయి. అక్షరాలు తిర్రమర్ర తిరగబడ్డా భావమే ప్రశ్నయితది? వాక్యం అంకుశమైతది. ఉక్కిరిబిక్కిరి, మనసు ఉక్కపోతలా మారుతది. దిక్కుతోచని జలపాతంలా ఉంటది. అగ్నిస్నానం చేసిన వాక్యాలు బంగారంలా మెరిసిపోతాయి. ఆయుధాలు అక్షరాల్లో దాక్కుంటాయి. నివేదన పదునూ, నిలివెడు పదన ఉంటది. సమాజ సత్యాలను సూటిగా చెప్పే ధైర్యం, సాహిత్య సౌందర్యాన్ని సంరక్షించే బాధ్యత కలదు. ఈ రెండూ వారి రచనల్లో సమానంగా విస్ఫోటమవుతాయి. కథ కర్తవ్యాన్ని బోధిస్తది. శైలి, శిల్పాలు బహురూపాలుగా విరాజిల్లుతాయి. వారి కథలు సామాజిక స్పందనగా నిలుస్తాయి. వారి తొలి కథా సంపుటి ‘సిగ్గు’ నిగ్గదీసి నిలదీసింది. ‘హవ్వ’ కథలు పద్నాలుగు విల్సన్ పద్నాలుగు సూత్రాలలా ఉన్నాయి. రచయిత తన ముందు మాటలో రాసిన అభిప్రాయం ప్రకారం ‘ఇవి 5డి కథలు. దర్శించటానికి ప్రత్యేకమైన కళ్ల జోళ్లు అవసరం లేదు. కన్నీళ్ల జోళ్లే సమకూర్చి పెడుతాయి.’ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మనుషుల మధ్య అనుబంధాలు ఎలా పెనవేసుకుంటాయో? వాటిని అధిగమించలేక మనసులో కలిగే అలిజడిని, మానసికస్థితులను చిత్రించిన కథ ‘బెంగ’. మనిషికి జీవితము ఉంటుంది. అదానిది, అడుక్కుతినే వాడిది, అంటరాని వాడిదీ జీవితమే. ఒక జీవితానికి మరో జీవితానికి ఎంత వ్యత్యాసమో ఏడుపులకు అంతే వ్యత్యాసం. అందుకే ఏడుపు అంటువ్యాధి అంటాడు రచయిత.
న్యూయార్క్ వెళ్లిన నిఖిలపై అమ్మకు బెంగ. తిరుగు ప్రయాణం ఖర్చు రోజుకు ఒక లక్ష. అబుదాబిలో విమానం ఎక్కిన డెబ్బై ఏళ్ల వృద్ధ ‘సమాధానం’ అమెరికా చదువా? అని ప్రశ్నించాడు. ‘ఆ. అవును మీది?’ నిఖిల అడుగుతుంది. అబుదాబి ఉద్యోగమని జవాబిస్తాడు. గమ్యం ఇద్దరిదీ గోదారి. మామిడిపేటలోని ఇంటి చిరునామా కనుక్కుంటున్నారు. ఎయిర్పోర్ట్ అవతల ఫుడ్ లాంచ్‌లో సమాధానం కుంటి నడకని చూసిన నిఖిల అడిగింది. ఫెయిల్ అయింది బ్రేకు కాదు నా కాలు. కుడికాలు అని సమాధానం ఇచ్చాడు సమాధానం. ఎడమకాలు అవిటితనం తండ్రి గురించి చెప్పాడు. రంగూన్ నుంచి తిరిగి వచ్చాక వ్యవసాయం చేస్తూ దున్నల కాళ్ళ కింద పడి తండ్రి చెల్లిపోయాడని చెప్పాడు. అమ్మకు చెప్పకుండా ఆర్మీలోకి వెళ్లాను. వీడియో కాల్ ద్వారా తల్లిది మౌన వ్రతమని తెలుసుకున్న నిఖిల ‘సమాధానం’తో మాట్లాడుతూనే ఉంది. మా అమ్మదీ పాతికేళ్లుగా మౌనవ్రతమే. ప్రతి రైలును చూస్తూ చింత చెట్టు కిందే ఉంటుందని చెప్తాడు.
చూసిన బెంగ కన్నా తాకిన బెంగ పెద్దది. పొద్దున్నే మీ అమ్మని చూడొచ్చా అంకుల్ అని అడుగుతూ నిద్రలోకి జారుకుంది. అతని సమాధానం వినలేదు. నరసాపురంలో ట్రైన్ ఆగినప్పుడు అదిగో చూడు! అదే చింత. అదే చెట్టు. పడుకున్న సమాధానమును నరసాపురం వచ్చిందని లేపుతుంది. ఆ చెట్టు కింద ముసలి అవ్వ తెల్లచీర కట్టుకొని కూర్చుని ఉంది. సమాధానం తన తల్లిని చూడగానే వచ్చే మార్పులని గమనిద్దామని అనుకుంటుంది. అమ్మ దగ్గరికి వెళ్ళింది నిఖిల. అమ్మ కాదు ఉత్త బొమ్మ. మా అమ్మదీ పాతికేళ్లుగా మౌనవ్రతమే. అమ్మ చావుకి రాలేక పోయాను. ఎక్కడికైన వెళ్లేటప్పుడు అమ్మలు ఎదురోస్తే మంచి జరుగుతుందంటారు కదా! నేను ఎక్కడి నుంచి వచ్చినా అమ్మ ఎదురు చూడాలని అందుకే ఇలా. బొమ్మ కాళ్లకు నమస్కరించాడు. ఎవరి బతుకులు వారివైనప్పుడు ఎవరి బెంగలు కూడా వారివే అని సార్వజనీనతతో ముగించడం పాఠకునికి గొప్ప ఓదార్పు.
నిద్రలో నడవడం నిద్రలో మాట్లాడడం మానసిక రుగ్మత. పారాసోమ్నియా(Parasomnia) అనే రకానికి చెందిన ఒక నిద్ర రుగ్మత. ఇది గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలిగే అసాధారణ ప్రవర్తన. ఇది సాధారణంగా మానసిక వ్యాధి కాదు కానీ ఒత్తిడి, నిద్రలేమి, జ్వరం లేదా జన్యుపరమైన కారణాల వల్ల నిద్ర చక్రంలో అంతరాయం కలగడం వల్ల సంభవిస్తుంది. అలాంటి మానసిక స్థితులను అద్భుతంగా కథలో నిక్షిప్తం చేసాడు రచయిత. కోల్పోయిన ప్రేమను కొనితెచ్చుకోవడంలో జరిగే మానసిక సంఘర్షణను పాఠకులలోకి ప్రయోగిస్తాడు. మనసెరిగి ఆలుమగలు మసలుకుంటే మరొక మనిషి మధ్యలో దూరితే ఎలా ఉంటుందో తెలిపే జీవితం.
చట్టబద్ధం కానీ హెచ్చరిక హెచ్చరికే ‘లవ్ ఈస్ ఇంజూరీస్ టు హెల్త్. ప్రేమ ఆరోగ్యానికి హానికరం అని అరవై ఏళ్ల వయసులోనూ అపరిమిత ప్రేమతో నిలిచి గెలిచే మనుషుల ద్వంద్వ వైఖరులను ఎండగట్టిన వ్యథ విభాతవర్మ. జీవితంలోని నటనను నగ్నంగా నిలబెట్టిన ఉద్విగ్న కథ ‘నిద్ర గన్నేరు’.
నిద్రలో కల. కలలో నిద్ర. కలవరింపులు, ఉలికిపాటులు కలగలిసి కలత నిద్ర. మొద్దు నిద్రలో ముద్దులు, ముచ్చట్లు. మేల్కొనాలని గింజుకుంటాడు. నిద్రలోనే తన్ను ప్రార్థన తన్ను అని వేడుకుంటూ లేవబోయాడు, నొప్పి. చెట్టును ఊపినట్లు ఊపేసి మేల్కొలిపింది ప్రార్థన. మిమ్మల్ని తన్నడం ఏమిటండి అని ప్రశ్నించినప్పుడు అలా అన్నానా! అని ప్రతి జవాబు ఇస్తాడు. అప్పుడే ‘నిద్ర గన్నేరు’ చెట్టు అని సంతోషం నుంచి ఇంగ్లీషులో మెసేజ్ వచ్చింది. ఈ కలవరింత కారణం కూడా నిద్ర గన్నేరు చెట్టే. ఆ చెట్టు గోదావరి లాంచీలు రేవు నానుకొని ఉంటుంది. విభాత వర్మ చేరుకోగానే గార పట్టిన పళ్ళతో నవ్వాడు సన్యాసంలో ఉన్న సంతోష్. పుష్కరాల రేవు నుంచి ఒక తెల్లని ఆకారం సిగ్గు ఎరగని నవ్వుతో శరీరమంతా కుదిపేస్తుండగా గ్లాడీస్ నడిచి వచ్చింది. ఆమె అందానికి అడ్రసే కాదు ఆధార్ కార్డు కూడా. ‘రేయ్ విభూ’ అని పలకరించింది. డ్యూ అని సమాధానమిచ్చాడు. నలభైఏళ్ళనాటి పిలుపులు అవి. వయసు అంచనా వేసుకున్నారు. నేను నీకు ఏంజిల్ కదరా ముందు. అని ఏడో అడుగు వేస్తూ నావలో కూర్చుంది. నావతోలే సరంగు ఆశ్చర్యంగా చూశాడు. మానేసిన అలవాటు అణిచివేసే యవ్వనం లాంటిదని సిగరెట్లకు అగ్గి ముద్దు పెట్టుకున్నారు. ఇప్పుడు పొగ వర్మగా పోల్చుకుంది గ్లాడిస్. సినిమాలో ప్రేమించే సన్నివేశంలో కూడా ప్రేమించడం ఆరోగ్యానికి హానికరం అనే క్యాప్షను ఎవడు వేయడని నవ్వవోయి దగ్గింది. గోదావరి అలల మీద తేలిపోతున్నారు. నలభై ఏళ్ల జ్ఞాపకాలను నెమరేస్తూంటే ఒక రోజులోనే నలభై ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పటి వరకు జరిగింది కల. భయం పోవడానికి ప్రార్ధన హనుమాన్ చాలీసా చదువుకోమని సలహా ఇచ్చింది. నన్ను ప్రేమిస్తున్నావా ప్రార్థన అని సందేహంతో అడుగుతాడు. నాకు నీవు దేవుడితో సమానం అన్నది. ప్రేమ ఇంత వ్యసనమా? ఊరవతల వాడవుతల ప్రేమల గురించి ఆలోచిస్తూ నిద్రపోయాడు. ఉదయమే మేల్కొల్పి ప్రార్థన ఇచ్చిన జేబులోని చీటీ చదువుకొని డ్యూ కి ఫోన్ చేసాడు. అటువై పు ఫోన్ ఎత్తి గ్లాడిస్ కు గ్లోటిక్ క్యాన్సర్ అని చెప్పింది ఆమె చెల్లెలు మెర్సీ. కోకిలకు స్వరపేటిక తొలగిస్తున్నారా? అని అంటుండగానే ఫోన్ కట్ అయింది. బాత్రూంలోకి వెళ్లి స్నానం చేస్తూ ఏడుస్తూనే ఉన్నాడు విభూ.
భోజన బల్ల దగ్గర చేరాక “ఎరా.. ఎరా.. అని నోరారా ఒక్కసారి పిలవలేవా? రేయ్ విభూ అని అనలేవా? గ్లాడిస్ వద్ద కోల్పోయిన ప్రేమను ప్రార్థన దగ్గర అర్థిస్తున్నాడు. అవే చేతులు తీసుకుని చెంపలు వాయించుకుంటూ ఏడవలేక నవ్వుతూ అంతర్ బహిర్వర్తనలు కనపడకుండా నటసార్వభౌమునిలా జీవిస్తున్నాడు. మానసిక ప్రవర్తనను అంచనా వేసిన దృశ్యీకరణే ఈ కథ.
‘ముల్లు’లా జీవించాలని చెప్పే మర్మం తెలియాలంటే ధర్మం తప్పని సామాజిక కర్మ తెలియాలి. అనుభవంతో ఆచరణలో మార్పు వస్తుంది. ‘పువ్వు గట్టిబడ్డా ఫరవాలేదు కానీ ముల్లు మెత్తబడకూడదనీ, ముల్లులా బతుకాలని తల్లి దీవెన వెనక ఒక తరం అనుభవం విప్పిన కథ ‘ముల్లు’. అందమైన రోజీలిన్ని ప్రేమించనివాడు లేడు. రాకపోకల యందు ఎస్కార్ట్‌లు. విసిగి విసిగి రోజీ విసుగుకు పర్యాయపదమైంది. సమ్మతి కోసం సంతోషంగా తిట్లను భరించేవాళ్లు. పోస్టర్లకు ఎక్కువ. పుకార్లకు తక్కువ. లేని వార్తలు నిరంతరం వాడవాడంతా చెక్కర్లు కొట్టేవి. రోజీ ఒక్కొక్కన్ని వస్త్రగాలంతో వడబోసింది. ఊరుకు వాడకు దూరమున్నట్లే రోజీపై ప్రేమలు దూరమయ్యాయి. పోయింది పొట్టు. ఉన్నది గట్టి అన్నట్టుగా భావించుకుంది. పదిహేనేళ్లు పెద్దవయసు, ముదురు పట్టభద్రుడు విక్టర్ నర్సింగ్ చదువాలనీ ఆశలు, ఆశయాలు రేకిత్తించాడు. నర్సింగ్ కాలేజీలో, హాస్టల్లో జాయిన్ చేశాడు. మాటు వేసినట్లే రోజీ జ్వరం ఇద్దరినీ కలిపింది. నిన్ను పువ్వులా చూసుకుంటాననీ హామీలిచ్చినా ఆమె విసిగించి ఒప్పుకుంది. రిజిస్టార్ ఆఫీసులో పెళ్లి. హాస్టల్ నుంచి విక్టర్ గదికి వెళ్లిపోయింది. ‘అందానికి దాసోహమైనవాడు అందాన్ని బంధిస్తాడు’. ఇంతెత్తు కూతురా? అని విక్టర్ మిత్రుడు అనటంతో రోజీకి కరాగార శిక్ష మొదలైంది. రెలు పెట్టెలాంటి ఇంట్లో బంధించాడు. ఒంటికి తాళం వేయలేకే ఇంటికి తాళం వేసాడు. ఆ గది అనుమానం అయింది. కడుపులో ఒక ప్రాణి మొలిచింది. గర్భవతిగా ఆకలితో అలమటించింది. అవమానాలు భరించింది. మరొక మహిళతో గడపడం చూసి శవమయ్యింది. నిండు గర్భిణిని కదా తాళం వెయ్యకు. నన్నెవడు చూస్తాడు అని వేడుకుంది. నువ్వు చూడొచ్చు కదా! అని ఆమెను శంకించినప్పుడు తనమీద తనకే విసుగొచ్చింది. రెండు రోజులు విక్టర్ ఇంటికి రాలేదు. ఇంట్లో తినడానికి లేక పస్తులున్నది. మూడోరోజు ఇంటి ముందు అమ్మా ధర్మమని అరుస్తున్న ముసలావిడకు రెండు రూపాయలిచ్చిన విక్టర్ని చూడటంతో స్పృహ తప్పింది. హాస్పిటల్లో కళ్లు తెరిచింది. చేర్పించింది. ఇంతెత్తు కూతురుందా? అని పశ్నించిన అతనే. తర్వాత తెలిసింది. అతన్ని “నా పెళ్లాం కడుపుతో ఉంటే నీకు నొప్పులొస్తున్నాయ్రోయ్. పుట్టేది నీ బిడ్డా! నా బిడ్డా!’ అని నిందించంగా తోసేసుకుంటూ విక్టర్ స్నేహితుడు సమారిటన్ హాస్పిటల్లో చేర్పించాడు. బిడ్డ డెలీల పుట్టటంతో రోజీకి విముక్తి కలిగింది. తల్లి రూపం. తండ్రి రంగువల్ల బిడ్డను విసుగుతో కర్రిదానా! నల్లదానా అని పిలిచేది. రోజీ విసుగకపోతే డెలీలాకు నచ్చదు.
విక్టర్ స్నేహితుడు సమారిటన్ మామయ్య పరిచయం చేసింది. విక్టర్ గవురుమెంట్ హాస్పిటల్లో పోయాడని సమారిటన్ సమాచారమిచ్చాడు. అన్నయ్యా వాడి గురించి చెప్పకుమన్నది. తల్లీకూతుళ్లు ఆదివారం కారులో చర్చికి బయలుదేరారు. రోజమ్మకు విక్టర్ అంటే అసహ్యం. ‘మొగోడిలా నన్నెవరు పెంచమన్నారే? నీకో మొగుడుండాలి. ఆడు ఇప్పుడెక్కడున్నాడు? ఆడెక్కడ చచ్చాడు? నీ బూతులు వినలేక ఉరేసుకుంటాడు’ అని పేరు ఎత్తింది. ‘ఒసేయ్ కర్రిదయ్యమా నీకు నీ బాబుని చూపించనా? గవుర్మెంట్ హాస్పిటల్ పోని’ అంది. కారు హాస్పిటల్ పక్కనే ఆగింది. వాడు చచ్చాడు అని చెప్పింది డెలీల. నీకెలా తెలుసు? బీ నెగిటివ్ రక్తం కోసం ఫోన్‌చేస్తే వెళ్లాను. చూసేవరకు నీ మొగుడు. వాంతి వస్తుందని పదిసార్లన్నా లేచాను. రెండు గంటలు ఆలస్యం చేశాను. వాడు పోయాడు. అమ్మ మచ్చల చేతుల్ని చూసి, మునివేళ్లతో స్పృశించి కన్నీటిబొట్లు కార్చింది. ఎట్లా భరించావే? అడిగింది బిడ్డ. ఓదార్చింది. ఇలాగే ముల్లులాగే బతకవే అని దీవించింది తల్లి. ఈ కథ ఎలా బతుకకూడదో తెలియజేసిన జీవితానుభవమే సందేశంగా ముగుస్తుంది.
యుద్ధం జరుగుతది. ఆయుధాలు కనపడవి. ఆయుధాల్లాంటి వివక్ష ‘వైఫై’లా మనిషి చుట్టూ వ్యాపించి బాధిస్తుంది. మామూలు వాళ్లకు అలవాటు. మారిన మనుషులకు అదొక ఛాలేంజ్. ప్రతీది సవాలుగా నిలిపితే ఆమె. ఆచరణవాది అంతుచూస్తదికదా! కరువైన పరువు కులం వద్ద పరువు ఎత్తుకొని నిలబడుతది. కులం కోసం హత్యచేయొచ్చు. వారే ఆత్మహత్య చేసుకోవచ్చు. ఏమైన జరుగొచ్చు. కులపిచ్చిని బోను ఎక్కించి పాఠక న్యాయమూర్తులను న్యాయం కోసం వేసిన ప్రశ్నే ‘యువరానర్’ కథ.
ప్రహ్లాదున్ని, హిరణ్యకశుపునికి శత్రు భీజం నాటినట్లు తల్లి ఇవాంజిలిన్కీ, బిడ్డ ప్రీతిగౌడ్కు ద్వేషం నింపినా ఓపికగా భరిస్తున్నది ఇవాంజలిన్. భర్తగా మారిన ప్రియుడు ఆదిత్యగౌడ్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పరీక్షల ఆధారంగా అతనికి కాళేయం లేదని డాక్టర్ చెప్పాడు. తనను పరీక్షిస్తే హృదయం లేదనే అందువు అని ఇవాంజిలిన్ అనుకున్నది. చచ్చాడు. కడుపుల ఆత్మలేనిది కళ్లకు నీళ్లొస్తయా? రావు. ఏడవాలి. కాబట్టి జ్ఞాపకాలు నెమరేసుకుంటుంది. ఇవాంజిలిన్కి బీడియస్ చదువుతున్నప్పుడు ప్రేమపూత పూసిన నక్కజిత్తుల బోగేశ్వర్రెడ్డి వల్ల ఆద్యంతం చేదుగా ఉండే ఆదిత్య చెంప చెల్లుమనిపించాక ప్రేమకుదిరింది. పెళ్ళైంది. అందరూ అచీవర్ అన్నారు. ఆదిత్య నానమ్మ కులం కానిదని ఉరేసుకొని చచ్చింది. రెండేళ్లలో వ్యాపారం కలిసొచ్చినవేళ ప్రీతి కడుపుల పడ్డది. ప్రాక్టీస్ చేస్తున్న తల్లికి క్రమక్రమంగా దూరమైంది. తల్లంటే ద్వేషంతో నిండిపోయింది. ఏడుపు రాలేదు. చావు చేసి సమాధి కట్టించింది ఇవాంజలిన్. ఏదో తెలియని విముక్తి గురించి ఆలోచించసాగింది. మమ్మీ అంటూ పిలిచి చేతులతో బంధించింది ప్రీతి. కళ్లు నీళ్లలో తేలాయి. నీవు జోగినికి పుట్టావా? నిన్న నీ టెన్త్ సర్టిఫికేట్స్ చూస్తుంటే డాటర్ ఆఫ్ దేవుడు అని రాసి ఉంది. మా హిస్టరీ మేడం చెప్పింది. డ్యాడికీ విషయం ముందు తెలియదా? అని అడిగింది. నన్ను పొందటానికి పెళ్లి తప్ప వేరే దారిలేదు. పెళ్లి చేసుకునే వరకు నేను కనిపించాను. తర్వాత నన్ను పుట్టించిన దేవుడు కనపడ్డాడు. తల్లిని హత్తుకుని ఏడుస్తూ సమాధివైపు చూస్తే ‘పరువే ఇతనికి ప్రాణం’ అని రాసిన శిలాఫలకం కనపడుతుంది. ఇప్పుడు చెప్పండి కూతురును దూరం చేసిన తండ్రికాదు వ్యవస్థ పెంచి పోషించిన కులపిచ్చి ఉచ్చులను తెంపేస్తది.
1980లో స్పర్శ్ (ఆంగ్లంలో టచ్ = Touch) సాయి పరాంజపే దర్శకత్వం వహించిన భారతీయ హిందీ చలన చిత్రం అంధుల జీవితాలకు సంబంధించిందే అయినా ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఒక్కొక్కరు ఒక్కో బలహీనతతో అంధులుగా మారుతున్నారు. కళ్ళ ముందు కదులుతున్న అంధ పాత్రలకు జీవం పోసిన అనుభవాల సమ్మేళనమే ‘స్పర్శ’ కథ. ప్రేమించిన ఆరాధించిన వాళ్లను తాకితే అదొక మహానుభూతి. ఆ స్పర్శతోనే ప్రేమ కలిగితే అది మరొక రకమైన అనుభూతి. అలాంటి అనుభూతిని బుగ్గ సొట్టల చందమామతో పొందాడు హాస్పిటల్లో జ్వరంతో చేరిన స్వాప్నిక్. తల్లిదండ్రుల స్పర్శను వయసులో మర్చిపోయాడు. అక్కబావలే తల్లిదండ్రులయ్యారు. వాళ్ళ కలలు నిల్పడానికి ఇంటర్వ్యూ వెళ్తూ రైల్లో సర్టిఫికెట్లు కోల్పోయాడు.
అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు పట్టు తప్పి పడిపోతున్న లిటిల్ ఏంజెల్‌ని చూసి లేపాడు. అప్పుడు ఒక స్పర్శ తగిలింది. వివరాలడిగాడు. మల్లె పువ్వే మల్లెపువ్వు అన్నట్లు పరిచయం చేసుకుంది. అంగన్వాడికి వెళ్ళాడు. అంబులెన్స్ లో ఏంజెల్ ను తీసుకెళ్లడానికి చిన్నాన్న వచ్చాడు. అంబులెన్స్ డ్రైవర్ రోడ్డు మీద పైలెట్ గా మారాడు. స్మశానం శవాలను కాల్చే తన అన్న ఉద్యోగమే తనకిచ్చారనీ, చావు బతుకులలో కొట్లాడే దేహాలని ఎత్తే క్రిస్టోఫర్ గా పరిచయం చేసుకొన్నాడు. ఫోన్‌కు స్పందించిన పైలెట్ చనిపోయిన ఎముకల గుల్ల యాదయ్య తాతను ఎక్కించుకున్నాడు. ఈ పేషెంట్‌ని డాక్టర్ పరీక్షించి ‘బ్రాట్ డెడ్’గా నిర్ధారిస్తాడు అని క్రిస్టోఫర్ చెప్పాడు. అక్కకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయని బావ ఫోన్ చేశాడు. అంబులెన్స్ ఆగింది. స్వాప్నిక్ దిగి, హాస్పిటల్లోకి వెళ్లేసరికి లిటిల్ ఏంజెల్‌ని ఎత్తుకున్న నాటి బుగ్గ సొట్టల చందమామ దోసిళ్ళను స్పృశించాడు. ఆమె పేరు ‘ప్రిస్కిల్ల’ అని తెలుసుకున్నాడు. అక్కకు సేవ చేస్తున్న నర్సు ‘ప్రిస్కిల్లా’ను అనేక సందేహాలు అడుగుతూ మాట్లాడుతున్నాడు. గతంలో ఆమె స్వాప్నిక్కు చేసిన సేవలు గుర్తుచేశాడు. బావ హాస్పిటల్‌కు రాగానే ఇంటికి వెళ్తూ ప్రిస్కిల్లను కార్లో ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు. స్వాప్నిక్ కోరికపై డ్రైవింగ్ చేస్తూ ప్రిస్కిల్లకు నేర్పిన తన భర్త గురించి చెప్పింది. అదే క్రిస్టోఫర్ ఇంటికి చేరుకున్నారు. మీరు ప్రసవాల దగ్గర నర్సు. మీ భర్త అంబులెన్స్ డ్రైవర్. ఒకే కప్పు కింద జననమరణాలు అని స్వాప్నిక్ చర్చించాడు. ఏంజిల్, స్వాప్నిక్ హెడ్ అండ్ సీక్ ఆట ఆడతున్నప్పుడు ప్రిస్కిల్ల ఏంజిల్‌ను కొట్టిన దెబ్బ స్వాప్నిక్కు తగిలింది. ఏంజిల్‌ను అంగన్వాడిలో తోలి వచ్చి స్వాప్నిక్ బుగ్గమీద ముద్దుపెట్టింది. ప్రిస్కిల్ల నా జీవితంలోకి రా’ అని స్వాప్నిక్ ఆహ్వానిస్తాడు. ‘నువ్వే రా’ అని తన హీలింగ్ సెంటర్లో జీవచ్చవంలా కోమాలో వున్న తన భర్త మోజెస్ తాకుతూ చూపుతుంది. చనిపోయే వరకు ఇలానే ఉంటాడు. అధికారికంగా చనిపోవడం వల్లనే క్రిస్టోఫర్‌కి ఉద్యోగం ఇచ్చారు. మోజెస్ ఒక అనాథ. అప్పుడు యాదయ్య తాత గుర్తొచ్చాడు. ‘చచ్చిన వాణ్ణి బతికి ఉన్నట్లు చెప్పి బొంద పెట్టించారు అక్కడ. బతికి ఉన్న వాణ్ణి చచ్చినట్టు చూపి బతుకుతెరువు చూస్తున్నారిక్కడ. ఆ సెంటర్ సమూహమంతా ‘హాఫ్ డెడ్ అండ్ హాఫ్ లైఫ్’ అనుకొని ప్రిస్కిల్ల నుంచి సెలవు తీసుకున్నాడు.
ఈ కథలో ప్రిస్కిల్ల స్పర్శ కోసం ఆరాటపడిన స్వాప్నిక్. ప్రిస్కిల్ల స్పర్శతో చచ్చి బతుకుతున్న మోజెస్ జీవితం. స్పర్శతో వృత్తి నిపుణత పదర్శించడం, ఆశనిరాశల నడుమ బాధ్యత, ‘స్పర్శ’ కథలో బాధ్యతా రాహిత్యమని నాణేనికి రెండు పార్శ్వాలను చూపడం అసాధారణ విషయం.
బొందులు వేరైనా ప్రాణమొక్కటే అంటాడు ‘యాయాతి చరిత్ర’లో దేవయాని, శర్మిష్టల స్నేహం గురించి దేవయాని చే చెప్పిస్తాడు పొన్నికంటి తెలగన. కల్లలు, ఎల్లలు లేనిది స్నేహమే. అప్పల్రాజు (అప్పి) సహదేవుడు (సాది)ల మితత్వాన్ని తేలిపే కథ ‘తోడు చుక్కలు’. తన మోతకోలు తినుబండారాలతో వచ్చిన సాదిని ఆహ్వానించి, పగపట్టినట్టు తినపెడుతాడు అప్పి. తిరిగి వెళుతుండగా నాకొక పనిచేసి పెట్టురా అని చెప్పి ఊరడిస్తాడు. చివరకు రైలు ఎక్కి వెళ్లేటప్పుడు ఆ విషయం చెబుతూ తన నిద్ర గురించి చెబుతూ పన్నెండున్నరకి నీ పరపతి ఉపయోగించి నన్ను మేల్కొల్పరా’ అంటాడు. అప్పట్దాక ఏదో పెద్దపని అని చెప్పినప్పటికీ అప్పితో పాటు పాఠకుడు అంత పెద్ద పని ఏమిటోనని ఉత్సుకతతో ఉంటాడు కానీ అది స్నేహమేనని తెలుస్తుంది. ఆద్యంతం సున్నితమై హాస్యం మేళవిస్తూ స్నేహం యొక్క గొప్పతనాన్ని, తన సొంత స్నేహమని పాఠకుడు అనుభూతి కలిగించేలా కథ రాయడం సతీష్ చందర్ గారి ప్రత్యేకత.
కడుపులో కాలుతున్న పర్వతాలు. కన్నీళ్లు మింగుతూ భరిస్తున్న బాధలు. గుక్క పట్టి సచ్చిపోయిన చెల్లెలు. గుక్కపట్టి నవ్వినా చావని దేవుడన్న కథ ‘గుక్క’. కోర్లమ్మపేటలోని సుభద్రకు ఇద్దరన్నలు దొంగలే. ఒకడు సొంత అన్న శివుడు. రెండో అన్న పిరికివాడు దేవుడు. ‘మర్డర్ కేసని పోలీసులొచ్చారు. కోడి మెడ కోత్తుంటే కళ్లుదిరిగి పడిపోయే పిరికెదవ దేవుడన్న. వాడు పొడువడమేంటని ‘బేవార్సు బాబాయి’ (లాయరు బాబాయి)తో అంటుంది. ఇంటర్ పరీక్ష తప్పాల్సింది నెలతప్పినప్పుడు. అయినా వాళ్లకు కోపం రాలేదు. గర్భవతిని చేసినవాడి తండ్రిని ముసుగు వేసుకొని చంపినా బయటపడని దేవుడన్న. ఇప్పుడెలా మర్డర్ చేశాడు? అని ప్రశ్నించుకుంది. అంట్లు తోముతూ అన్నం పెడుతున్నప్పుడు బుజ్జే, బుజ్జే పిలిచాడు. బంగారం కోట్టేసినపుడు బంగారమనీ, సెల్లులు కొట్టేసినపుడు సెల్లే అని పిలిసేవాళ్లు. ‘నా అన్నలు దొంగెదవలు. మెడలోని నగనే కాదు. పుర్రెలోని మాటను ఇట్టే కనిపెట్టాత్తారు’ అని తనకు తానే చెప్పుకునేవాడు. ‘నా సెల్లెలుంటే నీ యంత అయ్యేదే. నా తల్లిని జాడీల్రాయుడు ఉంచుకున్నడు. మేమంటే పేనం. వాడంటే మహాపేనం ఆమెకి. ఆడికే పుట్టాన్నేను. వాడున్నప్పుడు మాకు ఉచ్చపడు. వాడు రాగానే నేను, నా చెల్లి చీకట్లో కలుసుకోవాలి. గుక్కపట్టి ఏడుస్తున్నా అమ్మను వదల్లేదు. అది చచ్చిపోయింది. ఒకనాడు కడియపు లంకలో తాగేసి వస్తుండంగా కాల్వలో తోసేసిన. చచ్చాడు. యాక్సిడెంట్లో పోయాక వాని సమాధిపైన ఉచ్చపోస్తుండంగా అమ్మ చూసి ఏడుసుకుంటూ పరిగెత్తుకుంటూ రైలు కింద పడి చచ్చిపోయింది. నా తల్లిని నేను సంపుకుంటానా? సెప్పవే సెల్లి. అంటూ బాధను వెల్లగక్కాడు.
భావోద్వేగాన్ని, మానవ విలువల పరంగా లోతైన ఆత్మపరిశీలనను కలిగించే శక్తివంతమైన అభివ్యక్తిగా నిలిచే కథ ‘బెంగ’. సంతానమ్మ తల్లితనంలోని విరోధాలను అత్యంత సహజంగా ఆవిష్కరించాడు. పిల్లలు ఉన్నా, లేకున్నా తల్లితనం ఒక అంతులేని అనుబంధం అని, అది శరీర సంబంధాన్ని మించి మనసులో నిలిచే అనుభూతి అని ఈ కథ స్పష్టం చేస్తుంది.
పిల్లలు లేరనే చెప్పుకునే సంతానమ్మ. లేని తన బిడ్డను ఉన్నాడని భ్రమించే ఏంజెల్ల మానసిక వేదనలు విషాదాన్ని విలపించిన కథ ‘హవ్వ’. ఒకరు నిజాన్ని నిరాకరిస్తే, మరొకరు కల్పనతో తదాత్మ్యం పొందుతున్నారు. ఈ విరుద్ధ ధోరణులు సమాజంలో తల్లుల పరిస్థితికి ప్రతిబింబం. తల్లితనం అనేది కేవలం జన్మనివ్వడమే కాక, ప్రేమ, ఆప్యాయత, ఆదరణల సమాహారమని రచయిత తెలియజేస్తాడు.
కథలో శ్మశాన వాతావరణం, జీవించిన మనుషుల హృదయాల్లోనే నిజమైన మరణమని సూచిస్తుంది. పిల్లల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, స్వార్థపూరిత జీవన విధానం తల్లిదండ్రుల్ని ఎలా ఒంటరితనంలోకి నెట్టేస్తుందో కోయిన్, ఏబేలు పాత్రల ద్వారా స్పష్టమవుతుంది. ఒకరు భౌతిక ప్రయోజనాల కోసం తల్లిని వాడుకుంటే, మరొకరు ఆధ్యాత్మికత పేరుతో బాధ్యతను తప్పించుకుంటాడు.
మానవ విలువల దృష్ట్యా, సహానుభూతి, కరుణ, మరియు బాధ్యత భావాలను మేల్కొలుపుతుంది. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం, సేవాభావం వంటి విలువలు క్షీణిస్తున్న సమాజంలో ఇవి ఎంత అవసరమో గుర్తుచేస్తుంది. చివరికి, జీవితం ఎంత కఠినమైనదైనా, మనుషుల మధ్య ప్రేమ, పరస్పర ఆదరణ మాత్రమే నిజమైన ఆత్మశాంతిని అందిస్తాయని ఈ కథ మనసుకు గుచ్చి చెబుతుంది.
ఇట్లా పద్నాలుగు కథలు చతర్దశ భువనాలు. ఇలాంటి కథలు రాయడం సతీష్ చందర్ సార్కే చెల్లుతుంది. మనిషితనాన్ని తట్టిలేపే నిజ జీవితాలు. ఇవి ఊహా సంబంధమైన కథలు కావు. చుట్టూ ఉన్న మనుషులు. ప్రశ్నించే పాత్రలుగా మనసుతో మాట్లాడిస్తాడు. వాక్యానికి సొబగులు అద్ది, సౌందర్యాత్మకంగా దిద్ది, సువర్ణక్షరాలతో నిలుపుతాడు. ఈ కథలు చదివాక మనసు ఫిల్టర్ అవుతుంది. వివిధ జాడ్యాలున్నా, కుళ్లును కడిగి అగ్నిస్నానం అనుభవింపజేసే అత్యున్నతమైన, విలువలు గల విశిష్టమైన కథలు. తెలుగు కథకు గొప్ప చేర్పు ‘హవ్వ’ కథలు.
- (తేది: 18-04-2026న సా. 5:30గం. లకు “హవ్వ” పుస్తకావిష్కరణ సందర్భంగా)