రూపి ఏం చెప్పాలనుకుంది?

దు:ఖించాలా? గర్వపడాలా? ఆమెను తలచుకొని. భావోద్వేగాలదేముంది? వాటి అర్థాలదేముంది? ఆమె తీసుకున్న నిర్ణయం ముందు ఈ కాలమే చిన్నబోయి ఉంటుంది. ఇంతకూ ఆమె ఎవ్వరో తెలియదు. ఎట్లా ఉంటుందో అసలే తెలియదు. తన ప్రకటనతోనే ఆమె తొలిసారి వ్యక్తమై ఉంటుంది. అదీ మృత్యువులో. కాలం ఎంత మాయావి? ఏదీ తెలుసుకోనివ్వదు. నోరెత్తి ఏదీ మాటాడనీయదు. ఎన్నడూ చూడని మానవి కోసం బోరున విలపించడం తప్ప.

కూలిపోతున్న శిఖరాల మధ్యనే నిలబడ్డానికి ఆమె చోటు వెతుక్కున్నది. విప్లవాన్ని ఈ దేశ ప్రజల స్థల కాలాల్లోంచి తలా ఒక చేయివేసి పెకలించి వేస్తోంటే, రూపి తన ఉనికితో దాన్ని కాపాడాలనుకుంది. అక్కడి నుంచే ఒక మిణుగురు పువ్వులా మారి కాగడాలను వెలిగించింది. దాన్ని వెర్రితనం అంటారని ఆమెకు తెలిసే ఉంటుంది. కానీ, విప్లవం కోసం ప్రయోగంగా మార్చుకున్న జీవితాన్ని తుడిచేసుకోవాలనుకోలేదు. విప్లవానికి ఉన్న అవకాశాలను మూసేయాలనుకోలేదు. విప్లవానికి భరోసా ఇవ్వాలనుకుంది.

ఎక్కడికక్కడ చెల్లాచెదరవుతోంటే, కాళ్లకింది నేలను సహితం జరాజరా లాక్కెళుతోంటే, ఎవరు ఎన్నడుగులు వేసి మృతజీవులవుతారో, జీనన్మృతులవుతారో తెలియని స్థితి వెంటాడుతోంటే కూడా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఇక దాని మీద అలుపెరుగని చర్చోపచర్చలు ఎన్నయినా చేయవచ్చు. విప్లవమంటే ఏమిటో ఆమెకు అర్థం కాలేదనవచ్చు. పరిస్థితులు తెలియని మొండితనం అనవచ్చు. విప్లవమంటే ఏమిటో తెలుసుకోవలసిన సరైన సమయంలోనే తెలుసుకున్నదనీ చెప్పవచ్చు.

రూపీ.. ఇంతకూ నీవు మాకు ఏం చెప్పాలనుకున్నావు తల్లీ? ఈ లోకం నీ మాటలు వినడానికి నీవు పండితురాలివో కాదో. విప్లవం లోతుపాతులు చెప్పగల పరిభాష నీ దగ్గర ఉన్నదో లేదో. కానీ, నీవేదో బోధించాలనుకున్నావు. చరిత్రకు నీవేదో ఆనవాలు ఇచ్చిపోదామనుకున్నావు. కోటానుకోట్ల మంది జనాలతో ‘తిరిగి వస్తానని’ చెప్పడానికే వెళ్లిపోయి ఉంటావు. ఏటికి ఎదురీదడమే విప్లవం అనే తత్వ సూత్రాన్ని ప్రకటించడానికే ఇంత చేశావు కదూ.

ఈ మండే ఎండల్లో, గొంతు తడారిపోతున్న వేళ, తుది శ్వాస నిన్ను వదిలి పోతున్న వేళ, సరిగ్గా ఆ చివరి క్షణాల్లో నీవు ఏమనుకొని ఉంటావో. మరణాన్ని ఎలా స్వాగతించావో, నీ మరణపు సందేశాన్ని ఎలా తలపోసుకున్నావో. అప్పుడు కూడా నీ ఎరుక చెదిరిపోయి ఉండదు. నీవు చెప్పాలనుకున్నది, మృత్యువుతో తప్ప ఇంకోలా చెప్పలేనిది నీ గొంతుక ఊసుల్లో నీవు వినే ఉంటావు. అది మాకు వినిపిస్తుందనే భరోసాతో కన్నుమూసి ఉంటావు.

సాసహం అనే చిన్న మాట నీలాంటి వాళ్లకు బొత్తిగా సరిపోదు. నిన్ను సాహసంతో కొలవాలనుకోవడం వెర్రితనం. నీవు తీసుకున్న నిర్ణయాన్ని కేవల సాహసం అనగలమా? అదే నిజమైతే భగత్సింగ్‌ది కూడా ఒట్టి సాహసమే అయ్యేది. ఆయనకు అన్నీ తెలుసు. అప్పటికల్లా హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ బాగా దెబ్బతినిపోయింది. కామ్రేడ్స్ ఎక్కడికక్కడ చెదిరిపోయారు. తమ ఎదుట ఉన్నది..ప్రపంచాన్నంతా గుప్పిట్లో పెట్టుకున్న బ్రిటిష్ రాజ్యం కదా. దాన్ని ఎదిరించాలనుకున్న వాళ్ల వయసు ఎంత? అనుభవం ఎంత? అజరామరమైన విప్లవ నిబద్ధత తప్ప. ‘ఇక ఏమీ చేయలేం’ అనుకొని లొంగిపోయి ఉంటే ఉరితాడు పూమాల అయ్యేది. రాజలాంఛనాలు దక్కి ఉండేవి. అది కేవలం త్యాగం చేయాలనే మోజు కాదు. వెర్రి సాహసం కాదు. విప్లవ మార్గం మీది ప్రేమ. హేతుదృష్టి లేని ప్రేమ కూడా కాదు. విప్లవం గురించిన లోతైన ఎరుక. సంధ్యా సమయాలను దాటుకొని, గాఢాంధకారాలను ఛేదించుకొని భళ్లున వెలుగు విరజిమ్ముతుందనే తాత్విక విశ్వాసం. అననుకూల కాలాన్ని తోసుకుంటూ అనుకూల కాలం ముందుకు వస్తుందనే చారిత్రక సత్యంపట్ల తెలివిడి.

సరిగ్గా నీవూ అంతే కదా. యోధానుయోధులంతా ఎవరి ‘దారి’ వాళ్లు చూసుకున్నాక కూడా నీ దారిని నీవు వదిలిపెట్టలేదు. ఇక ‘ముగిద్దామ’ని రాజ్యానికంటే ఎక్కువ నీ పక్కన ఉన్న వాళ్లే పరుగులు పెడుతోంటే కూడా నీవు దృఢంగా నిలబడ్డావు. మార్చి 31 తర్వాతి ‘మావోయిస్టు రహిత భారత’లో సరిగ్గా పన్నెండు రోజులే నీ జీవితకాలం. ఆ ముగింపులో భాగం కాదలుచుకోని నీ సార్థక నిర్ణయం వయసు మాత్రం అనంతం. అది కుంగిపోతున్న సూర్యుడు సహితం లేచి నిలబడే సరికొత్త విశ్వాంతరాళాన్ని పున:సృజిస్తుంది. ప్రకృతిలోని శాశ్వత సత్యమైన చలనం మహాద్భుతమైన మానవ ప్రయాణాన్ని మును ముందుకే నడిపిస్తుంది. ‘పరిస్థితుల’ మీద నెపం పెడితే ఏమైనా చేయవచ్చనే, ఏ వాదనయినా చేయవచ్చనే మాటకారులు చుట్టుముట్టిన ఈ లోకంలో నీవు తీసుకున్న నిర్ణయమే ఒక ఇతిహాసం.

రాజీ ఎరుగని రూపి అనే అమ్మాయి చరిత్రలో నిలిచిపోడానికేనా ఇదంతా? సాహసాన్ని, త్యాగాన్ని స్థలకాలశుద్ధి లేని తెలివితక్కువతనమనే రోజులు ఇవి. లొంగిపోయి ఉంటే జీవించేదనే కాదు… ‘లొంగిపోయే’ దారి తెలియక మరణించిందని కూడా అనగల గడుసరి కాలం ఇది. మరణించిన వాళ్లే ధన్యులనుకోవాల్సిన పాడు రోజులివి.

విప్లవోద్యమం నుంచి కేవలం రివిజనిస్టో, కోవర్టో తలెత్తుతారనే భ్రమలను పటాపంచలు చేస్తూ ఫాసిస్టు కూడా బైటికి రాగడని రుజువైన రోజులివి. సూరజ్‌కుండ్‌లో ముగిని, మానవ వ్యతిరేకమైన ఫాసిస్టు వికసిత భారత్‌లో కళ్లు తెరిచిన వ్యక్తుల నాయకత్వంలో పని చేసి కూడా నీవు అచ్చమైన మావోయిస్టుగా మరణించి జీవించావు. నిజం చెప్పాలంటే మావోయిస్టు రహిత భారత్‌లోని నీ పునర్జీవనంలో ఇది రెండో రోజే. ‘ఇక్కడి నుంచే నా అసలైన జీవితం ఆరంభమవుతోంద’ని చెప్పడానికే కదూ ఇంత త్యాగం చేసింది..

నీవు త్యాగం చేశావని అంటే నీ చావును కోరుకున్నాననే వాళ్లు నా చుట్టూ మోహరించి ఉన్నారని తెలుసు. అయినా నీవు త్యాగం చేశావనే అంటాను. విప్లవ పంథాను నిలబెట్టడానికి ప్రాణాలు ధారపోశావనే అంటాను. ఈ నేల మీద విప్లవోద్యమం తుడిచిపెట్టుకపోకుండా నీ నెత్తుటి ధారతో సజీవం చేశావనే అంటాను. నీకు లౌక్యం తెలియదనీ, నీ నిర్ణయాన్నీ తప్పుపట్టే వాళ్లు ఉన్నారనీ తెలుసు. అయినా సరే, నీ కోసమే మాట్లాడతా. ఇది విపరీత కాలమే కావచ్చు. ఇదే నీ గురించి రాసే అక్షరాలను సార్థకం చేస్తుంది. నీ గురించిన మాటలను సచేతనం చేస్తుంది. నీవు ఈ పక్కన నిలబడి ఉన్నావు కదా. నీ పక్కనే చరిత్ర నిలబడి ఉన్నది కదా. నీవే చరిత్రకు చెరదని వాగ్దానం చేశావు కదా. నీవు చారిత్రక చైతన్యానికి మానవాకృతివి కదా. అంత‌కంటే ఇంకేమి కావాలి?

(మావోయిస్టు నాయ‌కురాలు రంగ‌బోయిన భాగ్య‌(46)@రూపి ఈ నెల 13న చ‌త్తీస్‌ఘ‌డ్ లోని కాంకేర్ జిల్లా చోటే బెటియా అనే ప్రాంతంలో అమ‌రురాలైంది. పోలీసులు ఆమెను ప‌ట్టుకొని కాల్చేశారు. రూపి లొంగిపోలేదు కాబ‌ట్టి చంపేశామ‌ని బ‌స్త‌ర్ ఐజి సుంద‌ర్‌రాజ్ అన్నాడు. భాగ్య స్వ‌గ్రామం తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండ‌లం ధ‌ర్మారం. మార్చి 31 త‌ర్వాత జ‌రిగిన తొలి హ‌త్య ఇది.)

కవి, రచయిత

One thought on “రూపి ఏం చెప్పాలనుకుంది?

  1. 😥
    మా సత్యం
    రాజీ లేని పోరాటమే ఏకైక మార్గం
    “రూపి లొంగి పోలేదుకాబ‌ట్టి చంపేశామ‌ని బ‌స్త‌ర్ ఐజి సుంద‌ర్‌రాజ్ ” అనడం
    ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం ఇది బూటకపు ఎన్కౌంటర్.
    భారత సర్వోన్నత న్యాయస్థానం న్యాయం పట్ల, సత్యం పట్ల, గౌరవం ఉంటే యుద్ధ ప్రతిపాదికన ఈ సంఘటనను సుమోటో గా స్వీకరించి భాస్కర్ ఐడి సుందర్ రాజ్ పై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాను.
    దేశంలో ప్రజలు అన్ని హక్కులు కోల్పోతున్నారు.
    నియంతృత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే హక్కు కూడా రాజ్యాంగం కల్పించింది.
    ఈనాడు దేశ ప్రజలకుమిగిలింది ఒకే ఒక దారి, హక్కు తిరుగుబాటు.
    -మా సత్యం

Leave a Reply