సమాజానికే కాదు, రచయితలకి కూడా ‘ఎరుక’ కలిగించిన కథలు

(రెండో భాగం)

సబాల్టర్న్ సాహిత్యం మీద రచయితలు ఎందుకు దృష్టి పెట్టట్లేదు?
ప్రధాన స్రవంతి రచయితలు సబాల్టర్న్ సాహిత్యానికి దూరంగా ఎందుకున్నారు? లేదా ఎందుకు గుర్తించట్లేదు? నిజానికి ‘ఎరుక’ కథా సంకలనంలో ఎరుకల జీవితాలకు సంబంధించిన సమస్త సంవేదనలు, ఘర్షణలు, దోపిడీ, కుట్రలు, అవమానాలు, బాధలు, పోరాటాలు, జయాపజయాలు, మరణాలు ఇవన్నీ చూస్తాం. అలాగే ఇతర సంచార తెగలైన లంబాడ, యానాది, చెంచుల సాహిత్యంలో కూడా ఎరుకల జీవితాల్లో ఉన్నట్టుగానే సమస్త వేదన కనిపిస్తుంది. సమాజంలోని ఒక అట్టడుగువర్గ ప్రజల బాధలపై రావాల్సినంత సాహిత్యం ఎందుకు రావట్లేదు? వచ్చినా ఎందుకు చర్చ జరగడం లేదు? ఎందుకు ఇంత వివక్ష? ఈ lierary isolationsm ఎందుకు? చాలా ప్రశ్నలు, సందేహాలు.

ఈ ‘ఎరుక’ కథలు చదవడం అయిపోయాక రచయితలకి తమ బాధ్యత ఏంటో స్పష్టంగా ఎరుకలోకి వస్తుంది. సమాజంలోని అట్టడుగు వర్గాల, గుర్తింపు కూడా లేని ఆదిమ, అర్థ సంచార తెగల జీవన విధ్వంసాలపైన దృష్టి సారించవలసిన అవసరాన్ని, ఆ ఖాళీలని పూరించాల్సిన అవసరాన్ని రచయితలు తప్పకుండా గుర్తిస్తారు. ఈ సంకలనం కథకులలో ఆ సోయిని కలిగిస్తుంది.

‘ఎరుక’ కథలు చదివాక కాఫ్కా గుర్తుకువస్తాడు. “ఏదైనా పుస్తకం, చదివాక మనలో గడ్డకట్టుకు పోయిన సముద్రాన్ని పగలగొట్టే గొడ్డలిలా ఉండాలి” అంటాడు కాఫ్కా. అంతే కాదు, సాహిత్యం మన ఆలోచనలను కదిలించి మనుషులలో విప్లవాత్మక మార్పుకు నాంది పలకాలి” అని కూడా అంటాడు. ఈ సంచార తెగ ఎరుకల కథలు చదువుతూ ఉన్నప్పుడు ఒక్కో కథ పూర్తయ్యాక చదవడం ఆపేసి ఎరుకల జీవితాలలో ఆ సంఘర్షణ, బాధ, ఆవేదన, అనుభవాలు, కన్నీళ్లు, నిస్సహాయత, దుఃఖం ఇవన్నీ నన్ను చాలా డిస్టర్బ్ చేసాయి. ఆలోచిస్తూ ఆగిపోయాను. ఆగి, ఆగి చదివాను. ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించి నా దృష్టి, నా కథా సృజన ఒక్క ‘రేణుకెటుపోయిందీ ఇసుక తుఫానులో’ అన్న ఒక్క కథతో మాత్రమే ఎందుకు ముగిసిపోయింది? ఇంత భయానకమైన సంక్షోభాన్ని ఎరుకల జీవితాల్లో అతి దగ్గరగా చూసిన తరువాత కూడా నేను ఎరుకల జీవితాల మీద, ఇతర సంచార జాతుల జీవితాల మీద ఎందుకు కథలు రాయడం కొనసాగించలేదు? రాయాలని ఉన్నా ఆ ఒక్క కథ దగ్గర మాత్రమే ఎందుకు ఆగిపోయాను? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నా నిర్లక్ష్యానికి, అలసత్వానికి కోపగించుకున్నాను. ఒక రకంగా సిగ్గుపడ్డాను. ఆత్మవిమర్శలో కూరుకుపోయాను. చాలామంది రచయితలకు తెలియని కొత్త జీవితం ఈ ఎరుకల జీవితం.

సంచార తెగల జీవితాలు అనాదికాలం నాటివే. కానీ, రచయితలు చాలా తక్కువగా దృష్టి సారించిన జీవితాలు ఇవి. రచయితలు సమాజాన్ని అంతటా కూడా సమాన దృష్టితో పరిశీలించాలి. కానీ రచయితలు తమ తమ వస్తువులకు పరిమితులు విధించుకున్నారనిపిస్తుంది. సాహిత్యం కుల, మత, ప్రాంతాలవారీగా చీలికలు చీలికలుగా, శకలాలుగా విడిపోయింది. ఒకరి ప్రాంతపు, కులపు, మతపు, జెండర్ సాహిత్యం మరొకరికి అంటరానిదైపోయింది. రచనలను, రచయితను వొంటరిగా చూసే సాహిత్య విచ్ఛిన్నత లేదాLiterary isolationism ఎక్కువైపోయింది. ‘‘మా గురించి మీరు రాయొద్దు, మీ గురించి మేము రాయం, చదవం, గుర్తించం’’ అన్నCompartmentalization లోకి, సాహిత్య సంకుచితత్వంలోకి (Parochialism,tokenism) పడిపోయింది తెలుగు సాహిత్య రంగం. ఈ ధోరణులు దళిత, స్త్రీవాద, ప్రాంతీయ అస్తిత్వాలని ముందుకుతెచ్చేవి అయినప్పటికీ వీటిలోని అతివాదం వలన సాహిత్యం విశ్వజనీనత కోల్పోయి శకలాలుగా విడిపోతుందని కొందరి వాదన. Subaltern సాహిత్యాన్ని పక్కనపెట్టేయడం, పట్టించుకోకపోవడంలో పైన చెప్పిన ధోరణి కనిపిస్తుంది. ‘‘మనకు సంబంధించని జీవితాన్ని మనం ఎందుకు రాయాలి, చదవాలి, పరిశీలించాలి, ప్రచారం చేయాలి?’’ అన్న సంకుచిత ధోరణి కూడా ఉంది. అయితే సంతోషించదగ్గ విషయం ఏంటంటే, ఈ ‘ఎరుక’ కథా సంకలనంలోని రచయితలందరిలో పలమనేరు బాలాజీ ఒక్కరే ఎరుకల సామాజికవర్గానికి చెందినవారు. ఎరుకల మీద వచ్చిన సాహిత్యంలో చాలామంది వేరే కులాలకు చెందిన రచయితలు. సానుభూతితో, సహానుభూతితో, బాధ్యతతో రాసిన రచయితలు ఉన్నారు. ఇది చాలా మంచి విషయం. నిజానికి రచయితలంతా పూనుకుని కుల, మత, ప్రాంత పరిమితుల్ని దాటుకుని సబాల్టర్న్ సాహిత్యాన్ని వీలైనంత ఎక్కువగా సృజించాల్సిన అవసరం ఉంది.

ఎరుక’ కథా సంకలనం : సబాల్టర్న్ సాహిత్యం :
సమాజంలో అణిచివేయబడిన అట్టడుగు స్థితిలో ఉన్న అధికారం, ప్రాతినిధ్యం ఏమాత్రం లేని వర్గాలకు చెందిన కథలు ఇవి. అడివంచు, నాగరిక సమాజం నుంచి వెలివేతకు గురైన మనుషుల గురించిన కథలు ఇవి. సమాజంలో అత్యంత వెనకబడిన, అణచివేతకు గురైన, సమాజం గుర్తించని వర్గాల జీవితాలను, వారి బాధలను, సంఘర్షణలను ప్రతిబింబించే సాహిత్యమే సబాల్టర్న్ సాహిత్యం లేదా అట్టడుగు వర్గాలకి చెందిన సాహిత్యం. నిజానికి సబాల్టర్న్ అనే పదానికి మిలిటరీ మూలాలు ఉన్నాయి. సబాల్టర్న్ అనేది మొదట బ్రిటిష్ సైన్యంలో తక్కువ హోదా కలిగిన ఉద్యోగులను సూచించడానికి వాడిన పదం. ఇటాలియన్ మార్క్సిస్టు మేధావి ఆంటోనియో గ్రాంసీ ఈ సబాల్టర్న్ పదాన్ని రాజకీయ, సామాజిక చర్చల్లోకి తెచ్చారు. ఏ అధికారం లేని అణగారిన వర్గాలను సూచించడానికి ఆంటోనియో గ్రాంసీ ఈ పదాన్ని వాడారు. సబాల్టర్న్ ప్రజలు అంటే సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఏమాత్రం స్వరంలేని కిందిస్థాయి ప్రజలు అని అర్థం.

సబాల్టర్న్ సాహిత్యం ఎవరి గురించి చెప్తుంది?
శతాబ్దాలుగా సామాజిక వివక్షను ఎదుర్కొంటున్న, అణచివేతకు గురవుతున్న దళితులు, గిరిజనులు, పితృస్వామ్య పీడనకు, అణచివేతకు గురవుతున్న స్త్రీలు, పెట్టుబడి దారి భూస్వామ్య వ్యవస్థల్లో శ్రమ దోపిడీకి గురవుతున్నకార్మికులు, రైతులు, సమాజంలో ప్రధాన స్రవంతికి దూరంగా ఉంచబడిన ముస్లిం మైనారిటీలు, భిన్న లైంగిక ధోరణులతో ఉండే ఎల్జీబీటీ క్యు ప్లస్ లు… వీరంతా అణగారినవర్గాల, అట్టడుగు పీడిత ప్రజలు. ఆధిపత్య పీడనలో నలిగిపోతున్న వర్గాల గురించీ, సమాజపు అంచులకు నెట్టివేయబడ్డ ప్రజల గురించీ చెబుతుంది. ‘సబాల్టర్న్ సాహిత్యం’ పదాన్ని గాయత్రి చక్రవర్తి సేవాక్ వంటి మేధావులు సాహిత్య విమర్శ, సాంస్కృతిక అధ్యయనాల్లో మరింత అభివృద్ధి చేశారు. రణజిత్ గుహ భారతీయ సందర్భంలో సబాల్టర్న్ స్టడీస్ ద్వారా ఈ భావనను మరింత విస్తరించారు. సమాజంలో ప్రధాన చరిత్ర, సాహిత్యం, రాజకీయాల్లో స్వరం లేకుండా మిగిలిపోయిన ప్రజల జీవితాలు, అనుభవాలు, పోరాటాలను ప్రతిబింబించే సాహిత్యాన్నిసబాల్టర్న్ లిటరేచర్ అంటారు.

సబాల్టర్న్ సాహిత్యం ముఖ్య లక్షణాలు :

  1. చరిత్రను తిరగరాయడం : ఇప్పటిదాకా చరిత్రను రాజులు పాలకుల ఉన్నత వర్గాల కోణంలోనే రాశారు. కానీ అట్టడుగు వర్గ సాహిత్యం సామాన్య ప్రజల, అట్టడుగు వర్గాల అణిచివేతలకు గురైన కులాల ప్రజల కోణంలో చరిత్రని చూపిస్తుంది. రాజులూ పాలనాధికారాల అధికార వర్గాల దృక్కోణంలోంచి చూపించదు, రాయదు.
  2. అధికార వ్యవస్థ పై తిరుగుబాటు చేస్తుంది : కులం, వర్గం, లింగం ఆధారంగా జరిగే అణచివేతను సబాల్టర్న్ సాహిత్యం తీవ్రంగా ప్రశ్నిస్తుంది.
  3. సొంత స్వరం కలిగి ఉంటుంది : అణగారిన ప్రజలు ఇతరుల జాలికోసం చూడకుండా తమ బాధలను, పోరాటాలను, హక్కుల, అధికారాల డిమాండ్లను స్వయంగా వ్యక్తపరచడం సబాల్టర్న్ సాహిత్యం ప్రత్యేకత.
  4. వాస్తవికత : సబాల్ట ర్న్ సాహిత్యంలో కల్పనల కంటే చేదు నిజాలు, కఠినమైన జీవన వాస్తవాలు ఉంటాయి.
  5. సబాల్టర్న్ సాహిత్యం సామాజిక న్యాయం, సమానత్వాన్ని ఆకాంక్షిస్తుంది.
    మొత్తానికి తెలుగు సాహిత్యంలో, సమాజంలోని అణగారిన అట్టడుగువర్గాల జీవితాలను, వారి అనుభవాలను పోరాటాలను దళిత, ఆదివాసీ, బహుజన శ్రామిక వర్గాల అనుభవాలను, భారతదేశంలో ముస్లిం మైనారిటీల అస్తిత్వ పోరాటాలను, స్త్రీలపై జరిగే దౌష్ట్యాలను, సామాజిక అన్యాయాన్నికేంద్రంగా చేసుకొని రచించిన సాహిత్యాన్ని సబాల్టర్న్ సాహిత్యం అంటారు.
    **
    సబాల్టర్న్ లేదా ఆదిమ సంచార తెగలు అంటే ఏమిటి? వీళ్ళు ఎవరు?
    మానవ జాతి చరిత్రలో ఆదిమ సంచార తెగలు (primitive nomadic tribes )అంత్యంత కీలకమైన భాగం. ఒకే చోట స్థిరనివాసం లేకుండా ఆహారం, పశుగ్రాసం, జీవనోపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నిరంతరం వలసవెళ్లే మానవ సమూహాలను ఆదిమ అర్ధ సంచార తెగలు అంటారు. నాగరికతకు దూరంగా ప్రకృతితో ముడిపడి జీవించే జీవన విధానం వీరిది.

(ఇంకా వుంది…)

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 1. ఆమె అడవిని జయించింది, 2. పాదముద్రలు, 3. లక్ష్మి (నవలిక), 4. బచ్ఛేదాని (కథలు), 5. ప‌హెచాన్‌ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 6. పాలమూరు వలస బతుకు చిత్రాలు (కథా సంకలనం), 7. హస్బెండ్ స్టిచ్ (స్త్రీల విషాద లైంగిక గాథలు), 8. అరణ్య స్వప్నం (కవిత్వం), 9. ఇల్లొక రాజకీయం (రాజకీయ కవిత్వం).

Leave a Reply