(భాగం – 1)
శతాబ్దాలుగా తెలుగు సాహిత్యం సమాజంలోని అనేక వర్గాల, భిన్నకులాల, భిన్న అస్తిత్వాలను తెలుగు ప్రజల ముందుకు తీసుకువచ్చింది. అయితే చరిత్రలో ఎక్కువ కాలం అట్టడుగు అంచుల్లోనే మిగిలిపోయిన సంచార జాతుల జీవితాలు మాత్రం చాలా అరుదుగా సాహిత్యంలో చోటు సంపాదించుకున్నాయి. అలాంటి అట్టడుగు వర్గాల, కులాల, ఆదిమ సంచార తెగల జీవితాలలోని సంక్షోభ పోరాట ఆరాటాలను, అవమానాలను ఎదుర్కొంటున్నఎరుకల జీవితాలను ప్రపంచానికి చెప్పే ప్రయత్నమే ఈ ‘ఎరుక’ కథలు. ఇవి కేవలం కథలు మాత్రమే కావు. ఒక అట్టడుగు వర్గ సమాజపు జీవన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, నిస్సహాయ ఒంటరి పోరాటాలు, ఆత్మగౌరవం, కన్నీళ్లు, ఆశలు, ఆకాంక్షలకు సాహిత్య రూపం ఈ కథలు.
**
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సాహిత్యంలో వస్తున్న కథల వస్తు వైవిధ్య పరిణామాలని పరిశీలిస్తే ముఖ్యంగా మార్క్సిస్ట్ దృక్పథంతో అధ్యయనం చేస్తే సాహిత్య సౌందర్యం, శిల్ప శైలి, భాషలకి మాత్రమే కాకుండా సమాజంలో అట్టడుగు వర్గాలు, తమ అస్తిత్వాన్ని, ప్రాముఖ్యతని సాధించుకునే, నిరూపించుకునే ఒక సామాజిక పోరాటాల చరిత్రగా అర్థమవుతుంది. సాహిత్య రంగంలో ముఖ్యంగా బి.సి. వాద సాహిత్యం, దళితవాద సాహిత్యం, అట్టడుగు వర్గాలైన ఆదిమ అర్ధ సంచార జాతుల సాహిత్యం ఆధిపత్య వర్గ సాహిత్య లోకం నుంచి చిన్నచూపుకి, నిర్లక్ష్యానికి, అణిచివేతకి గురవుతూ వస్తున్నది. ముఖ్యంగా చెంచు, యానాది, ఎరుక, లంబాడా లాంటి ఆదిమ అర్థ సంచార తెగల సాహిత్యం తీవ్రమైన నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఈ ఆధిపత్య వర్గాల పెత్తనాన్ని బద్దలు కొడుతూ, ధిక్కరిస్తూ సబాల్టర్న్ సాహిత్యం వెలుగులోకి వస్తున్నది. సాహిత్య వస్తు విస్తృతిని ఆధిపత్య కులాల రచయితలకి, పాఠకులకి దివిటీ వేసి మరీ చూపిస్తున్నది. సంపన్న వర్గాల, మధ్య, ఎగువ మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి, ఆధిపత్య కులాల నుంచి సాహిత్యం, దళిత, ముస్లిం మైనారిటీ, స్త్రీవాదం లాంటి భిన్న అస్తిత్వ సమూహాలని దాటి, అట్టడుగు వర్గాలలో మరీ అట్టడుగు వర్గమైన ఆదిమ అర్ద సంచార తెగల ప్రజా సాహిత్యం ఆయా సామాజిక వర్గాల రచయితల నుంచే రావడం ఒక గొప్ప ప్రగతిశీల పరిణామం. చెంచు, యాదవ కులాల నుంచి జానపద, మౌఖిక సాహిత్యం మాత్రమే వచ్చినా, లంబాడా తెగల నుంచి విద్యని, రిజర్వేషన్లని అందుకున్న రచయితలు వచన సాహిత్యాన్ని కథలు, కవిత్వ రూపంలో బాగానే సృజించారు. ఎరుకల సామాజిక వర్గం నుంచి అతి తక్కువ సంఖ్యలో రచయితలు ఉన్నారు.
ఎరుకల సాహిత్య సృజన కారులు :
ఎరుకల సామాజికవర్గం నుంచి తెలుగు సాహిత్యంలో ప్రత్యేక ముద్ర వేసి, ఆ జాతి జీవన పోరాటాలను, సంస్కృతిని సమాజానికి పరిచయం చేసిన ముఖ్యమైన సాహిత్యకారులు, రచయితలు కొద్దిమంది మాత్రమే ఉన్నారు.
పలమనేరు బాలాజీ : వీరు రాసిన ‘ఏకలవ్య కాలనీ ఎరుకల జీవన గాధలు’ అనే కథల సంపుటి తెలుగు సాహిత్యంలో ఎరుకల ప్రజల సజీవ చిత్రణకి, రాయలసీమ మాండలిక, భాషకి అద్దం పట్టింది. వీరు చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతవాసి. అక్కడే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నతాధికారిగా పనిచేస్తూ తన ఎరుకల సామాజికవర్గ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు.
ప్రొ. సత్యనారాయణ : వీరు ఎరుకల చరిత్ర, జీవన విధానం, అణిచివేతలపైన విస్తృతంగా పరిశోధనా వ్యాసాలూ, సాహిత్య విమర్శ రాసారు.
కె. రమణయ్య : గ్రామీణ ప్రాంతాల్లోని ఎరుకల ప్రజల సమకాలీన సమస్యలు, వ్యవసాయ అనుబంధ జీవితాలపై కథలు, వ్యాసాలూ రాస్తున్నారు.
వి.ఆర్. రాసాని : వీరు చిత్తూరు ప్రాంతానికి చెందిన సుప్రసిద్ధ రచయిత. ఎరుకల తెగ మీదనే కాదు, ఇతర సంచార తెగల జీవితాలమీద కథా సంకలనం తీసుకు వచ్చారు. ఎరుకల తెగలో పితృస్వామ్యం పీడన, దురాచారాల ప్రభావం గురించి వీరు రాసిన ‘నల్ల పూసలు’ అనే కథలో గొప్పగా రాసారు.
లింగయ్య : తెలంగాణా ప్రాంతవాసి. ఎరుకల సంస్కృతిని, సాంప్రదాయ వృత్తి అయిన సోదిని పాటల రూపంలో, జానపద సాహిత్యంలో ప్రాచుర్యంలోకి తెచ్చారు.
ఇంద్రాణి : జగిత్యాలకు చెందిన పరిశోధక విద్యార్థిని. ఇంద్రాణి తాను ఎరుకల తెగకి చెందకపోయినా, ఎరుకల తెగ కి చెందిన తన స్నేహితురాలితో ఆ భాషకి లిపి లేదని తెలుసుకొని లిపిని సృష్టించి, ఆ భాషా సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తున్నారు. వీరే కాక ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఎంతోమంది రచయితలు ఎరుకల సమస్యలని సాహితీకరిస్తున్నారు. ఆ కథలన్నీ ‘కొలిమి’ వెబ్ సైట్ వాళ్ళు ప్రచురించిన ‘ఎరుక’ కథా సంకలనంలో ఉన్నాయి. ఈ కథా సంకలనంలో పలమనేరు బాలాజీ గారు మాత్రమే ఎరుకల సామాజిక వర్గానికి చెందిన వారు. వీరి రచనల్లో సమాజం, రాజ్యం వారిపైన చూపించే వివక్ష, అణిచివేత ప్రధానంగా కనిపిస్తాయి. బ్రిటిష్ కాలం నాటి నేరస్త తెగల చట్టం Criminal Tribal Act వల్ల, స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఎరుకలు భారత ప్రభుత్వ విధానాల ద్వారా అనుభవించిన రాజ్య హింసని, ఆధిపత్య కులాల ద్వారా గ్రామాల్లో అనుభవించిన కుల పీడనని, దారిద్య్రాన్ని రాసారు. వీటితో పాటు వారి సంస్కృతిలో భాగమైన సోది/గద్దె/భవిష్యవాణిని, సాహిత్య రూపాలైన జానపద కళల ద్వారా, తమ మూల పురుషుడైన ఏకలవ్యుని చరిత్రని సాహిత్యం ద్వారా వీళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు.
**
ఈ ‘ఎరుక’ కథలు శతాబ్దాలుగా బ్రిటిష్ కాలం నుంచి వర్తమాన ఆధునిక భారతదేశ సమకాలీన కాలం వరకు చరిత్ర పొడవునా సామాజిక నిర్లక్ష్యానికి, ఆర్ధిక, రాజకీయ దోపిడీకి, కుల వివక్ష, అంటరానితనాలకి, సొంత తెగలోని సాంస్కృతిక అనాచారాలకి, మూఢ నమ్మకాలకు గురైన నిలువ నీడ, తిండీ, గుడ్డా లేని సంచార జాతులకు సంబంధించిన శ్రామిక జనం అనుభవించే బాధలను, మనసుని అల్లకల్లోల పరిచే పచ్చి వాస్తవాలను చూపిస్తాయి. అందుకే ఈ ‘ఎరుక’ కథల పుస్తకం సాహిత్య విలువల పరంగా మాత్రమే కాదు, గతితార్కికంగా చూసినప్పుడు సామాజిక, సాంస్కృతిక, చారిత్రక దృష్టితో కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ పుస్తకంలోని కథల వైవిధ్యం, రచయితల దృక్పథం, ఎరుకల కుటుంబ, సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక జీవన చిత్రణ చాలా సూక్ష్మంగా, వివరణాత్మకంగా చిత్రించారు.
సంచార జాతికి చెందిన ‘ఎరుకల’ లేదా ‘కుర్రు’ తెగ సాహిత్యాన్ని విశ్లేషించేటప్పుడు కేవలం సాహిత్య సౌందర్యం, సాహిత్య నిర్మాణం, శైలీ శిల్పాలు మాత్రమే కాదు, ఎరుకల తెగ ప్రజల జీవన విధానం, సంస్కృతి, చరిత్ర, భాష సామాజిక అనుభవాలు, అవమానాలు వీటన్నిటి గురించి మాట్లాడుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
‘ఎరుక’ కథా సంకలనం రచయితలు ఎరుకల తెగ ప్రజల జీవితాన్ని విశ్లేషించడానికి, కథలుగా మలచడానికి కావలసిన పద్ధతులు ఏమైనా అనుసరించారా? అనుసరిస్తే అవి ఎక్కడనుంచి వారికి అందాయి? ఈ కథల్లో ఎరుకల తెగకి, వారి జీవన విధానానికి, చరిత్ర, సంస్కృతికి, వారి సామాజిక అస్తిత్వానికి సంబంధించి, కనీస హక్కుల కోసం వారు రాజ్యంతో, ఆధిపత్య కులాలతో, ప్రపంచీకరణతో, రాజ్యం కార్పొరేట్ సంస్థలతో కలిసి చేస్తున్న దోపిడీ కి వ్యతిరేకంగా చేస్తున్న సంఘర్షణ, పోరాటాల పట్ల ఎరుక, స్పృహ కథా రచయితలకు ఉన్న స్పష్టత, రాజకీయావగాహన, దృక్పథం అడుగడుగునా కనిపిస్తాయి.
ఈ కథలు చదువుతూ పోతుంటే ఈ విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. కథకులు గొప్ప సామాజిక బాధ్యతతో కథా రచనకు పూనుకున్నారు. కథలు రాసే క్రమంలో రచయితలు కొన్ని కథా వస్తువు, విశ్లేషణకు సంబంధించిన సాహిత్య ముడి సరుకులను ఖచ్చితంగా వాడారనిపిస్తుంది. లేదా వాటి పట్ల ఒక స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉన్నారనిపిస్తుంది. ఎరుకల జీవితాల్లో ఉండే అనేక అంశాలని ఉదాహరణకి భారతదేశాన్నికమ్ముకున్న నయా సామ్రాజ్యవాద దోపిడీ రూపాలు, సాంస్కృతిక విధ్వంసం దగ్గరి నుంచి, ఎరుకల స్త్రీల జీవితాల్లోని పితృస్వామ్య పీడన వరకూ కథకులు కథా వస్తువులుగా ఎన్నుకున్నారు. కథల్లో సాంస్కృతిక, జానపద, సామాజిక, మానవ శాస్త్ర (ఆంథ్రోపాలజీ), స్త్రీవాద/పితృస్వామ్య , భాషా పరిణామం, చరిత్ర, ఇక ఈ కథలలో చేరి, చేరని ఇతర అట్టడుగు సంచార తెగల జీవన సంక్షోభం, కథకులు కథనాన్ని చెప్పే పద్ధతులు ఇవన్నీ పాఠకుల, విమర్శకుల పరిశీలనలోకి వస్తాయి.
**
మొదటగా ‘ఎరుక’ కథల్లోని సాంస్కృతిక విశ్లేషణని తీసుకుంటే… కథకులు ఎరుకల జీవన విధానాన్ని, ఆచారాల్ని, వృత్తులు, పండగలు, విశ్వాసాలు, జానపద సంప్రదాయాలని ఈ కథలలో ఎలా ప్రతిబింబింపచేశారో తెలుస్తుంది. రెండోది : ఎరుకల జీవితాల్లో భాష వ్యక్తీకరణల్లో అంతర్భాగంగా ఉంటూ వచ్చిన జానపద గేయాలు, కథలు, పొడుపు కథలు, పురాణ కథలు, సామెతలు, వీటి నిర్మాణం, ప్రయోజనం, కథల్లోని సామాజిక పాత్రలని జానపదాలని ఉపయోగించి విశ్లేషించడం కూడా కనిపిస్తుంది. మూడోది : కథల్లో కనిపించే సామాజిక విశ్లేషణ, సోషియోలాజికల్ ఎనాలిసిస్. దీంట్లో ఎరుకల జీవిక కోసం అస్థిరమైన సంచార జీవితం, కులవివక్ష, పేదరికం, కోల్పోతున్న విద్యావకాశాలు, శ్రామిక ప్రజా వ్యతిరేక, ప్రభుత్వ విధానాల ప్రభావం లాంటి సామాజిక అంశాలని సాహిత్యంలో ఎలా తీసుకురావాలో అంతగా ఈ రచయితలు తీసుకొచ్చారు. నాలుగో అంశం : మానవ శాస్త్ర విశ్లేషణ కూడా ఈ కథలలో కనిపిస్తుంది. అంటే ఆంత్రపొలాజికల్ ఎనాలిసిస్ అన్నమాట. ఎరుకల కుటుంబ వ్యవస్థ, బంధుత్వాలు, జెండర్ లేదా లింగ పాత్రలు, ఆచారాలు, వలస జీవనం సృష్టించే విధ్వంసం. పితృస్వామ్య పీడనలో నలిగిన ఎరుకల స్త్రీల జీవితాల సంక్షోభం ఈ కథలలో స్పష్టంగా, ఎంతో ఆర్తితో రాయడం కనిపిస్తుంది. వీరిపైన బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ ట్రైబల్ చట్టాలు ఇప్పటికీ రూపాలు మార్చుకొని ఎలా అమలవుతూ వారి జీవితాల్ని అగ్నిగుండాల్లో దహించి పడేస్తున్నాయో, పాలక వర్గాలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నిషేధించిన తరువాత కూడా ఈ క్రిమినల్ ట్రైబల్ ఆక్ట్ చట్టాలని ఇప్పటికీ ఎలా ఉపయోగించుకుంటున్నారో కనిపిస్తుంది. ఇక కథల్లో రచయితలెన్నుకున్న నాలుగో అంశం భాషా విశ్లేషణ. లింగ్విస్టిక్ అనాలసిస్. ఎరుకలకి ప్రత్యేకంగా ఒక భాష లేదు. వీరు మాట్లాడే భాషను కుర్రు భాష లేదా ద్రావిడ భాష అంటారు. కుర్రు భాష తమిళ, కన్నడ, తెలుగు కలయికలా ఉంటుంది. ఎరుకల భాషల్లో సంచార జీవితంలో ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తిరిగే క్రమంలో ఆయా ప్రాంతాల, రాష్ట్రాల మండలిక భాషలో, ఉదాహరణకి తెలంగాణా, ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఎరుకల వారి భాషలో స్థానిక భాష మాండలిక పదాలు, జానపదాలు, సామెతలు నుడికారాలు కనిపిస్తాయి. వీరిది ద్రావిడ భాష అని కూడా అంటారు. కుర్రు భాషని వాళ్ళు అలా అభివృద్ధి చేసుకున్నారు అని కూడా అనిపిస్తుంది. ఇందులోని కథల్లో కథకులు ఎరుకల భాషలో సామెతలు, మాండలిక పదాలు, మౌఖిక శైలి, స్థానిక పద ప్రయోగాలు ఇవన్నీ కూడా ఉపయోగించారు. ఇక ఎరుక కథల్లో రచయితలు ఎన్నుకున్న ఆరవ అంశానికి వస్తే, చారిత్రిక విశ్లేషణ (హిస్టారికల్ ఎనాలిసిస్) కూడా ఈ కథలలో కనిపిస్తుంది. ఎరుకల తెగ చరిత్ర, వలసలు, క్రూరమైన బ్రిటిష్ వలస పాలన ప్రభావం, స్వాతంత్య్రం వచ్చాక వాళ్ళ జీవితాల్లో వచ్చి చేరిన మార్పులు, ఈ ‘ఎరుక’ కథా సంకలనంలో వచ్చాయన్నది స్పష్టంగా కనిపిస్తుంది. బ్రిటిష్ కాలం తర్వాతా, ముందూ అంటే బ్రిటిష్ కాలంలో ఎరుకల చరిత్ర, వాళ్ళనుభవించిన సామాజిక సంక్షోభం, భయంకరమైన క్రిమినల్ చట్టాలకు సంబంధించిన శిక్షలు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశంలో వాళ్లనుభవించిన కష్టాలు, బాధలు, నిస్సహాయ జీవితాలు ఇవన్నీ కూడా ఈ కథలలో మనకు కనిపిస్తాయి. కథల్లో అమెరికన్ సామ్రాజ్యవాద ప్రభావం వల్ల నూతన ఆర్ధిక విధానాల అమలు, ఉత్పత్తి కులాల వృత్తుల విధ్వంసం, ప్రపంచీకరణ అనంతర ప్రభావం, సంక్షోభం కనిపిస్తుంది. ప్రపంచీకరణ ప్రభావంలో వృత్తులు కోల్పోయి దేశదేశాలు వలసలు వెళ్లిపోవడం కనిపిస్తుంది. చరిత్ర పొడుగూతా ఎరుకలు దారుణమైన, దుర్మార్గమైన జీవితాలు అనుభవించడం ఈ కథల లో మనం చూస్తాం. అటు అడవికీ, ఇటు నాగరిక ప్రపంచానికీ, ఆధిపత్య కులాల పీడన, వివక్ష దోపిడీలకి మధ్య ఎరుకలు భయంకరంగా నలిగిపోవడం కథల్లోకనిపిస్తుంది. ఇక ఎరుకల కథల్లో పితృస్వామ్య విశ్లేషణకు వస్తే మహిళల జీవితం ఇతర మతాల, కులాల, ప్రాంతాలలో, దేశాలలో బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాల ప్రభావం అణిచివేత, మనువాద పితృస్వామ్యం ఎలా ఉందో ఎరుకల మహిళల మీద కూడా పితృస్వామ్యం అంతే ప్రభావాన్నికలిగించడం కనిపిస్తుంది. పితృస్వామ్యం అణిచివేత, అదే దోపిడి పీడనలను ఎరుకల స్త్రీలు తమ సొంత ఎరుకల కమ్యూనిటీలో, ఆ తర్వాత గ్రామాల్లోని ఆధిపత్య, పీడక కుల సమాజం నుంచి కూడా ఎదుర్కోవడం ఈ కథలలో మనం చూస్తాం. ఎరుకల స్త్రీల జీవితం ఆద్యంతమూ కుటుంబ బాధ్యతలు, వివక్ష, పితృస్వామ్య పీడన, మూఢాచారాల వల్ల బలైపోవడం ఇవన్నీ కూడా ఈ కథల్లో కథకులు హృదయం కదిలించేలా రాసారు. ‘ఓలి’ అనే మూఢాచారానికి స్త్రీలు బలైపోవడం, అట్లాగే ఎవరైనా దొంగతనం చేస్తే, అనుమానం నిర్ధారణ కోసం వేడి నీళ్లలో చేతులు పెట్టించడం లాంటివి ఈ కథల్లో చూస్తాం. అట్లనే ఇక ఈ ‘ఎరుక’ కథల్లో నిర్లక్ష్యానికి గురయిన అట్టడుగు సంచార వర్గాల సమస్యలు, ప్రధాన స్రవంతి సాహిత్యంలో కనిపించని ఎరుకల సమస్యలు, వాళ్ళ అనుభవాలు, అణిచివేత, ప్రతిఘటన ఈ కథల్లో అద్భుతంగా వ్యక్తం అయినట్టు తెలుస్తుంది. ఇక కథనం దగ్గరికి వచ్చేటప్పటికి విశ్లేషణ చేస్తున్నప్పుడు అంటే కథా వస్తువు నెరేట్ చేస్తున్నప్పుడు కథకులు చాలా సహజమైన పద్ధతిని ఎన్నుకున్నారు. కథ చెప్పే విధానం కానీ, పాత్రను రూపొందించడం కానీ, ప్రతీకలు, సంఘర్షణ, ముగింపు కథకులు ఎంతో బాధ్యతగా ముగించారు అనిపిస్తుంది. ఈ కథలు చదువుతూ ఉన్నపుడు, చదివాక, ఇతర సంచార తెగల కథలకి , ఎరుకల సాహిత్యానికి సంబంధించి ఒక తులనాత్మక విశ్లేషణ, సమీక్షించేటప్పుడు, విమర్శించేటప్పుడు, మాట్లాడేటప్పుడు చేయొచ్చని అనిపించింది.
**
ఈ కథల్లో ఎరుకల సంచార జీవితం ఎలా ప్రతిబింబించింది? వారి గుర్తింపు ఎలా నిర్మితమవుతూ వచ్చింది? అంటే బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వర్తమాన భారతదేశ ఆధునిక కాలం వరకు ఎరుకల జీవితంలో ఎలాంటి గుణాత్మక పరిణామాలు చేరాయి లేదా మరింత దిగజారిపోయేలాగా లేదా దుర్మార్గంగా వాళ్ళ జీవితం మారిపోయిందా ఏ రకంగా నిర్మితమవుతుంది లేదా విధ్వంసం అవుతోంది? ఆధునికత వల్ల, ప్రపంచీకరణ వల్ల, అమెరికన్ సామ్రాజ్యవాదం వల్ల, మల్టీ నేషనల్ కంపెనీల దోపిడి వల్ల వీళ్ళు ఎలా తమ అడవికి తమ ప్రాంతాలకి తమ వృత్తు లకు తమ సంస్కృతికి దూరమయ్యారు అన్నది రచయితలు చెప్పగలిగారా లేదా అన్నది మనకి బాగా అర్థమవుతుంది. బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ ట్రైబల్ చట్టానికి వీరు బలవుతూ వస్తున్నారు. అలాగే ఎరుకలకి ప్రకృతితో, జంతువులతో దగ్గర సంబంధం ఉంది. ఈ కథల్లో ఎరుకల జీవితంలో, సంస్కృతి, జంతువులు, వృత్తులు ఏ పాత్ర పోషించాయి? ఎలా జంతువులు ప్రకృతి, అడవి, చెరువులు, వాగులు కుంటలు లాంటి నీటి వనరులు ఎరుకల జీవితాల్నిపెనవేసుకొని వాళ్ళ జీవితానికి సంబంధించిన ఆటుపోట్లతో కలిసి, విడిపోయి ఉన్నాయి. తోడుగా నిలబడ్డాయి అన్నది ఈ కథలలో అర్థమవుతుంది. ఇక ఎరుకల మహిళల అనుభవాలు, పోరాటాలు, అణిచివేత, లైంగిక దోపిడీ ఎలా చిత్రించబడ్డాయనేది కూడా ఈ కథలలో కనిపిస్తుంది. ఆధునికీకరణ వల్ల ఎరుకల జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చిందో కూడా ఈ కథలలో తెలుసుకుంటాం. ఇక మౌఖిక సంప్రదాయం నుంచి లిఖిత సంప్రదాయానికి వచ్చిన పరిణామాలు ఏంటి? నిజానికి ఎరుకలకి లిపి లేదు కదా! మౌఖిక సంప్రదాయంలోనే వాళ్ళు కథలు చెప్పుకునేవారు. మౌఖిక సాహిత్యం అంటే జానపద కథలు, గేయాలు, పురాణ కథలు, జ్ఞాపకాల కథనాలు. ఈ పద్ధతిలో విశ్లేషిస్తే ఎరుకల జీవనతత్వం, సంస్కృతి, సామాజిక అనుభవాలు స్పష్టంగా తెలుస్తాయి. కానీ ఎరుకల, ఇతర సంచార తెగల మౌఖిక సాహిత్యం రికార్డు కావడంలో, లిఖిత సాహిత్యంలోకి మార్చడంలో వైఫల్యం కనిపిస్తుంది. అలా సబాల్టర్న్ సాహిత్యం అడుగడుగునా ఆధిపత్య సాహిత్యకారుల, పత్రికాధిపతుల, సాహిత్య పరిశోధకుల, నిఘంటుకారుల వామనపాదాల కింద అణిచివేయబడింది.
(ఇంకా వుంది…)