ప్రశ్నించే తత్వమే నన్ను మార్క్సిజం వైపు నడిపించింది : వి. చెంచయ్య

(రెండో భాగం)

కావలిలో ‘హేతువాద మిత్రులు’ గురించి చెప్తారా?
1974లో ఎస్వీ యూనివర్సిటీలో ఎం.ఏ. అయిపోగానే కావలికి వచ్చేశాను. ఎం.ఏ. ఫలితాలు వచ్చాయి. ఫస్ట్ క్లాస్ వచ్చింది గాని, మార్కుల శాతం 62.25`సెకండ్ ర్యాంక్. నా మిత్రులు చాలామంది ‘నీకు అన్యాయం జరిగింది’ అన్నారు. నేను పట్టించుకోలేదు. ఆ వెంటనే కావలి ‘జవహర్ భారతి’ కళాశాలలో తెలుగు లెక్చరర్ పోస్టుకు ప్రకటన ఇచ్చారు. అప్లై చేశాను. ఇంటర్వ్యూ జరిగింది. అక్కడ ఇంటర్వ్యూ మూడు దశలలో జరుగుతుంది. మొదట ఐదు నిమిషాలసేపు వారిచ్చిన అంశంపై ఉపన్యాసం ఇవ్వాలి. దీనికి డిపార్ట్‌మెంట్ హెడ్స్ అందరూ మార్కులు వేస్తారు. విద్యార్థులు శ్రోతలు. అందులో ముగ్గురిని ఎన్నిక చేస్తారు. ఆ ఇంటర్వ్యూకి 25మంది వచ్చారు. 1974 సెప్టెంబర్. మొదటి ఇంటర్వ్యూలో ఎన్నికైన ముగ్గురిలో నేనున్నాను. తర్వాత రెండో ఇంటర్వ్యూ. తెలుగు శాఖ అధ్యాపకులందరూ సబ్జెక్ట్‌పై ప్రశ్నలు వేస్తారు. ఇది గంటసేపు జరుగుతుంది. ఈ ముగ్గురినీ మరో ఇంటర్వ్యూకు పంపిస్తారు. ఇది యాజమాన్య నిర్వహించే ఇంటర్వ్యూ. మొత్తం మీద నేను ఎన్నికయ్యాను. మర్నాడే ఉద్యోగంలో చేరాను. అప్పుడు అదొక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్. నిన్నటిదాకా విద్యార్థిని. ఈ రోజు లెక్చరర్‌ని.

ఆ ఇంటర్వ్యూలో మొదట ఉపన్యాసానికి ఇచ్చిన అంశం ‘నీకు నచ్చిన కవి‘. నాకు నచ్చిన కవి శ్రీశ్రీ అయినా, నేను పోతన గురించి మాట్లాడాను. ప్రసంగాలన్నీ అయిపోయాక ఒకతను నన్నుమీరు దేనిగురించి మాట్లాడారు?అని అడిగాడు. పోతన గురించి అని చెప్పాను. పోతన గురించి నేను మాట్లాండితర్వాత నువ్వు మాట్లాడ్డం అనవసరం అన్నాడు. నాకు భయం, ఆశ్చర్యం కలిగాయి. రెండో ఇంటర్వ్యూలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు “పోతన గురించి ఎందుకు మాట్లాడావు? నీకు శ్రీశ్రీ అంటే ఇష్టం గదా?” అని అడిగారు. నేను పాఠం చెప్పాల్సిన సిలబస్‌లో అంతా ప్రాచీన సాహిత్యమే గదా, అది నేను ఎలా చెబుతానో తెలియాలి గదా సార్… అన్నాను. ఆయన తృప్తిగా నవ్వారు.

తొలిరోజు క్లాసుకు వెళ్ళాను. ఆసక్తికరంగా పాఠం చెప్పాలని బాగా ప్రిపేర్ అయ్యాను. అది ఇంటర్మీడియట్ క్లాసు. ఒక్కో సెక్షన్‌లో 120మంది ఉండేవారు. ఎక్కువమంది ఆబ్సెంట్ కూడా అయ్యేవారు కాదు. బహిరంగసభలో మాట్లాడుతున్నట్టే అనిపించింది. అందులో అది మహా గొప్ప క్లాసని నాకు ముందే తెలుసు. ఎలాగో బయటపడ్డాను.

1975 జూన్ 26 అర్ధరాత్రి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ప్రతిపక్ష పార్టీలవాళ్ళనూ, విరసం సభ్యుల్నీ చాలామందిని అరెస్టు చేశారు. కె.వి.రమణారెడ్డి గారు అరెస్టు అయ్యారు. జూన్ 29 నా వివాహం. ఆదర్శ వివాహం చేసుకోవాలని ముందే అనుకున్నాను. త్రిపురనేని మధుసూదనరావు గారిని ఆహ్వానించాను. స్థానికంగా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు దామా చెంచయ్య, శివరామ సుబ్బయ్య, జనతాదళ్ పార్టీ స్థానిక నాయకులు, మా ఇంగ్లిష్ లెక్చరర్ మధురాంతకం మాధవరావు గారు మాట్లాడారు. అధ్యక్షుడు మా హిస్టరీ లెక్చరర్ వకుళాభరణం రామకృష్ణగారు.

1975 జనవరిలో అనంతపురం విరసం సభల్లో నేను విరసం సభ్యత్వం తీసుకొని ఉన్నాను. అయితే ఎమర్జెన్సీలో నన్ను అరెస్టు చెయ్యలేదు. నా పెళ్ళికి కమ్యూనిస్టు పార్టీ నాయకులు, విరసం నాయకులు త్రిపురనేని గారు రావడంతో నేను పోలీసుల దృష్టిలో పడ్డాను. ఆరునెలల పాటు నన్ను మానసికంగా వేధించారు. నేను కాలేజీకి పోయినప్పుడు ఇంటి చుట్టుపక్కలవాళ్ళను నా గురించి అడిగేవాళ్ళు. ఇంటికొచ్చినప్పుడు కాలేజీకి వెళ్ళి ఎంక్వయిరీ చేసేవాళ్ళు. ‘నీకోసం పోలీసులొచ్చారు. జాగ్రత్తంగా ఉండు’ అని అందరూ నన్ను హెచ్చరించేవాళ్ళు. ఆ తర్వాత ఒకరోజు డీఎస్పీ పిలిపించాడు. వెళ్ళాను. రెండు గంటల సేపు ఒకటే ప్రశ్న అడిగాడు. ‘కొండపల్లి సీతారామయ్య గారు మీకు తెలుసా?’ అని. ‘పేరు తెలుసు గాని, మనిషిని చూడలేదు’ అన్నాను. ‘మీకాయన ఇష్టమైన నాయకుడు గదా’ అనీ అడిగాడు. ‘ఆయన గురించి నాకేమీ తెలియకుండా ఇష్టమా? కాదా? అని ఎలా చెప్పగలను?’ అని ఎదురుప్రశ్న వేశాను. ‘నాకు మార్క్సిజం అంటే అభిమానం, విరసం సభ్యుణ్ణి’ అని చెప్పాను. ఇక వదిలేశాడు. అప్పట్నుంచి నా కోసం పోలీసులు రాలేదు.

ఎమర్జెన్సీ పెట్టి ఆరు నెలలు దాటింది. అదెప్పుడు ఎత్తేస్తారో తెలియని స్థితి ఏర్పడింది. విరసంలో నాకు తెలిసినవాళ్ళెవరూ బయట లేరు. దాదాపు 36మంది దాకా అరెస్టయి జైల్లో ఉన్నారు. విరసం సభ్యుడిగా నేనేం చెయ్యాలో అర్థం కాలేదు. నెల్లూరు జిల్లాలో ‘దీపశిఖ’ అనే కలం పేరుతో ఒక విరసం సభ్యుడున్నాడని కె.వి.ఆర్. గారి ద్వారా విని ఉన్నాను. అయితే అతని ఆచూకీ నాకు తెలియదు. ఏదో ఒక యాక్టివిటీ చెయ్యాలని ఉంది. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియడం లేదు. 1976లో శ్రీలంకకు చెందిన డా.కోవూర్ ఆంధ్రప్రదేశ్‌లో చాలాచోట్ల మీటింగులు పెడుతూ, నాస్తికత్వాన్ని ప్రచారం చేస్తున్నట్టు పత్రికల్లో చూశాను. సత్యసాయిబాబాను సవాల్ చేస్తున్నట్టు కూడా పత్రికల ద్వారా తెలిసింది. నాకో ఆలోచన వచ్చింది. ఏదో ఒక స్థాయిలో హేతువాద, నాస్తికవాద కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనిపించింది. ఒకరోజు మా కళాశాలలో సివిక్స్ లెక్చరర్ ఎన్.వి.రమణయ్య గారిని కలిసి ఈ విషయం మాట్లాడాను. మనం కొంతమందిమి కలిసి ఈ కార్యక్రమాలు చేద్దామన్నారు. ఆయనే గంగారాం అని ఒకతన్ని సూచించారు. నా దృష్టిలో ఇంకిద్దరున్నారు`కల్లయ్య, కోటిరెడ్డి. ఒకరోజు సాయంత్రం మేం ఐయిదుగురం కలిశాం. ‘హేతువాద మిత్రులు’ పేరుతో కొన్ని కార్యక్రమాలు చెయ్యాలని నిర్ణయించుకున్నాం. మొదట అయిదు అనువాద వ్యాసాలతో ‘మూఢ నమ్మకాలు – శాస్త్రీయ దృక్పథం’ అని ఒక చిన్న పుస్తకాన్ని 1976 డిసెంబర్‌లో ప్రచురించాం. అందులో ఈ వ్యాసాలున్నాయి.

  1. మతం ఓ మత్తుమందు – కుష్వంత్ సింగ్
  2. దేవుని అవతారాలు : అంధ విశ్వాసాలు – ఉషారాణి శర్మ
  3. దేవుడున్నాడా? – కృష్ణ మురారి పాండే
  4. జాతకాలు`జన్మ నక్షత్రాలు – టి. రాజగోపాలన్
  5. సాయిబాబా దేవుడా? మోసగాడా? – డా. హెచ్. నరసింహయ్య

రెండో ప్రచురణ ‘హేతువాద వ్యాసాలు’. ఇందులోనూ 5 వ్యాసాలున్నాయి. ఇది 1977 ఏప్రిల్‌లో వచ్చింది.

  1. హేతువాదం నాస్తికత్వానికి జీవగర్ర – రావిపూడి వెంకటాద్రి
  2. కుంభమేళా కుంభకోణం – వి. చెంచయ్య
  3. సృష్టికి మూలమేమిటి? – డా. మిత్రా
  4. హేతువాదిగా వీరేశలింగం – వి. రామకృష్ణ
  5. మానవుడు కల్పించుకున్న ఛాయాచిత్రం దేవుడు – మాక్సిం గోర్కి.

మూడో ప్రచురణ ‘మృత్యువుపై సైన్స్ దండయాత్ర’. ఇది 1978 ఫిబ్రవరిలో అచ్చయింది. ఇందులో కూడా 5 వ్యాసాలున్నాయి.

  1. మృత్యువుపై సైన్స్ దండయాత్ర ` కె. వాసుదేవరావు
  2. మానవ పురోగతికి సైన్సు ప్రధాన సాధనం – ఎ.ఎన్.నాగేశ్వరరావు
  3. మతం, మూఢవిశ్వాసం, వైద్యశాస్త్రంతో వాటి సంబంధం – డా.టి.జయవేలు
  4. సైన్సు ఆధారాల కోసం ఎగబడే ఆస్తికత్వం – వి. చెంచయ్య
  5. తుఫాను`యజ్ఞం – డా. ఎ.ఎం. ధర్మలింగం

ఈ పుస్తక సందర్భంలో ఒక సంఘటన గురించి చెప్పాలి. మద్రాసులో సోవియట్ ల్యాండ్ ఆఫీసులో మా అన్న సుబ్బయ్య పనిచేస్తుండేవాడు. ఆయనకు సన్నిహిత మిత్రుడు ఒకదానికి అక్కడ తెలుగు ప్రెస్ ఉండేది. ఆయన నాకు పరిచయమయ్యాడు. ఈ ‘మృత్యువుపై సైన్స్ దండయాత్ర’ పుస్తకాన్ని అక్కడ అచ్చువేయించి, పుస్తకాలు తీసుకొని కావలి రావడానికి హౌరా ఎక్స్‌ప్రెస్ ఎక్కాను. ఇది మధ్యాన్నం ఒకటిన్నరకు కావలి రావాలి. నెల్లూరు వేదాయపాలెం వచ్చేసరికి ‘ఢాం’ అని పెద్ద శబ్దం వచ్చింది. అందరూ ముందుకూ, వెనక్కూ ఊగి రైళ్ళోనే పడిపోయారు. మా పెట్టె ఒక పక్కకు, నేను కూర్చున్న పక్కకు పడిపోయింది. పదిమంది దాకా నాపైన పడ్డారు. రైలు యాక్సిడెండ్ అనే విషయం మాకు తెలియలేదు. నాపైన పడ్డవాళ్ళు 2,3 నిమిషాలు అలాగే ఉండిపోయారు. వీళ్ళెందుకు నాపైన పడ్డారు? లేస్తారా? లెయ్యరా? అని అనే ఆలోచనలో నేనుండిపోయాను. ఇంతలో ఎవరో ‘యాక్సిడెంట్ అయింది, ఏం ప్రమాదం లేదు, మెల్లగా అందరూ ట్రైన్ దిగండి’ అన్నారు. అప్పుడే అది యాక్సిడెంట్ అని మాకు అర్థమయింది. అప్పుడు భయం వేసింది. ఎక్కడున్నామో తెలియదు. నాపైన ఆధారపడి నా భార్య, మా అమ్మ, మా తమ్ముడు ఉన్నారు. నేను చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి? రెండురోజుల్లో ఈ పుస్తకావిష్కరణ ఎలా జరుగుతుంది? ఈ ఆలోచనలతో నేను సతమతమవుతూ ఉన్నాను. నాపైన పడ్డవాళ్ళు ఒక్కొక్కరూ పైకి లేస్తున్నారు. వాలిపోయిన రైలు పెట్టె నుండి ఒక్కొక్కరు దిగుతున్నారు. గేటు పూర్తిగా తెరుచుకొని లేదు. సగం మాత్రమే తెరుచుకుని ఉంది. నేను నా పుస్తకాల కట్టను వదలకుండా పట్టుకొనే దిగాను. బ్యాగ్ మాత్రం లోపలే ఉండిపోయింది. మళ్ళీ లోపలికెళ్ళి బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను. ఇంజన్ నుండి మాది రెండో పెట్టె. మొదటి పెట్టె సగానికి సగం అణిగిపోయింది. ముందున్న ఇంజన్ బరువుకూ, వెనకున్న పెట్టె బరువుకూ అది నలిగిపోయింది. అందులో కొందరు చనిపోయారు. చాలామందికి దెబ్బలు తగిలాయి. ఇది నా జీవితంలో తొలి రైలు యాక్సిడెంట్.

బ్యాగు, పుస్తకాలకట్ట తీసుకొని బస్సులో రోడ్డు దాకా నడిచి, బస్సెక్కి నెల్లూరు వెళ్ళాను. మా ఫ్రెండ్ తన్నీరు కోటయ్య రూముకు వెళ్ళి కూర్చున్నాను. ఏమీ మాట్లాడాలనిపించలేదు. 5 నిమిషాలసేపు మౌనంగానే ఉన్నాను. ‘ఏం అలా ఉన్నావు?’ అని అడిగాడు కోటయ్య. ‘రైలు యాక్సిడెంట్ అయింది’ అని చెప్పాను. వెంటనే అతడు వద్దన్నా వినకుండా నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. నాకు బాగానే ఉందని చెబుతున్నా వినలేదు. డాక్టరు చూసి అంతా బాగుందన్నాడు. సాయంత్రం కావలి చేరాను. రెండో రోజు పుస్తకావిష్కరణ సభ బాగా జరిగింది. రైలు యాక్సిడెంట్ జరగడం, ఆ రైళ్ళో నేను తీసుకొస్తున్న పుస్తకం పేరు ‘మృత్యువుపై సైన్స్ దండయాత్ర’ కావడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ముందుపెట్టెలో ఉండిఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. రెండో పెట్టెలో ఎక్కడం వల్ల బతికిపోయాను. ఒకవిధంగా మృత్యువును జయించినట్టే.

1977 ప్రారంభంలోనే నెల్లూరు జిల్లా హేతువాదం సంఘం ఏర్పడింది. నెల్లూరులో పసల భీమన్న, జొన్నలగడ్డ మార్కండేయులు తదితరుల ప్రయత్నం దీని వెనక ఉంది. కావలి హేతువాద మిత్రుల్ని అందులో కలవమన్నారు. మేం అంగీకరించాం. అప్పటికే మా ఐదుగురిలో గంగారాం అనే అతను చనిపోయాడు. మిగిలిన ముగ్గురూ అంత ఆసక్తిగా లేరు. నేనొక్కడినే జిల్లా హేతువాద సంఘంలో చేరాను. అప్పటికే నేను కావలి హేతువాద మిత్రుల పేరుతో 4వ వ్యాస సంకలనం వెయ్యాలని వ్యాసాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నాను. అయితే అవి వెయ్యడానికి 2, 3 నెలలు ఆలస్యం అవుతుందని, అప్పటివరకూ ఆగలేక జిల్లా హేతువాద సంఘం బాధ్యులు తొందరపెట్టారు. వెంటనే ఒక సంకలనం రావాలన్నారు. అప్పుడు నేనో ఆలోచన చేశాను. కావలి హేతువాద మిత్రుల పేరుతో మేం వేసిన 3పుస్తకాలలోంచి 5వ్యాసాలు ఎన్నికచేసి ఇవి వేద్దాం అన్నాను. అందరూ అంగీకరించారు. అలా మాక్సిం గోర్కి, డా. మిత్రా, కుష్వంత్‌సింగ్, కృష్ణమురారి పాండే, వాసుదేవ వ్యాసాలతో ‘సృష్టికి మూలం ఏమిటి?’ పేరుతో ఒక పుస్తకాన్ని 1979 ఫిబ్రవరిలో తీసుకొచ్చాం. వరసగా ఇలాంటి పుస్తకాలు వేస్తాం కాబట్టి, దీనికి ‘హేతువాద వ్యాసావళి – 1’ అని పెట్టమన్నారు. సంపాదకుడిగా నన్ను ఉండమన్నారు. ‘ఆలోచించండి’ అనే పేరుతో చిన్న సంపాదకీయాన్ని రాశాను. అందులో ‘‘ఫిజిక్సు, కెమిస్ట్రీలు చదవడం కాదు, వాటిని ఆచరణసాధ్యాలుగా మార్చుకోవాలి. మనం ప్రభావితం కావడమే కాదు, ఇతరుల్ని ప్రభావితం చెయ్యాలి. ఇదే ఆధునిక యుగానికి ఆరోగ్యకర లక్షణం’ అని అన్నాను. ఈ శాస్త్రీయ దృక్పథానిన సామాన్య జనంలోనే కాదు, మేధావుల్లోనూ కలిగించాల్సిన అవసరం ఉందన్నాను.

ఈ పుస్తకానికి ముందే నేను సేకరించే ప్రయత్నంలో ఉన్న వ్యాసాలు ఒక కొలిక్కి వచ్చాయి. అవి 7వ్యాసాలు. ఇది హేతువాద వ్యాసావళి – 2.

  1. మతం అంటే? : కొడవటిగంటి కుటుంబరావు
  2. హిందూమతం – ఒక పరిశీలన : బి.దీక్షిత్
  3. బౌద్ధమతం నిర్వర్తించిన చారిత్రక పాత్ర : డా. వి.రామకృష్ణ
  4. క్రైస్తవ మతం – నిశిత పరిశీలన : పీటర్ శ్యాం
  5. ఇస్లాం మతం – ఒక పరిశీలన : ప్రొ.ఎ.ఎం. ధర్మలింగం
  6. చార్వాక వాదం : ఆర్. సుందరరావు
  7. హేతువాదం అంటే ఏమిటి? : వి.చెంచయ్య

‘మతం అంటే?’ అనే పేరుతో ఈ వ్యాస సంకలనాన్ని 1979 జులైలో తీసుకొచ్చాం. దీని ఆవిష్కరణ సభ నెల్లూరు టౌన్ హాలులో జరిగింది. ‘జమీన్ రైతు’ పత్రిక ఎడిటర్ గోపాలకృష్ణ అధ్యక్షుడు. రావిపూడి వెంకటాద్రి ప్రధాన వక్త. అధ్యక్షోపన్యాసంలో మాట్లాడుతూ గోపాలకృష్ణ ‘‘ఇంతవరకూ హేతువాదం పైన నాకు కొన్ని సందేహాలుండేవి. కుటుంబరావు గారి వ్యాసం, చెంచయ్య గారి వ్యాసం చదివాక నా సందేహాలు తొలిగిపోయాయి. హేతువాదం పరిమితులు తెలిశాయి’’ అన్నారు. హేతువాదాన్నివివరిస్తూనే సామాజిక సమస్యల్ని కూడా హేతువాదం పట్టించుకోవాలని నా వ్యాసంలో అన్నాను. ‘‘ఆలోచించకుండా గుడ్డిగా కొన్ని విషయాల్ని నమ్మడం వల్ల ఎన్నో రకాల దోపిడీకి జనం గురవుతున్నారు గనుక ఆ దోపిడీని ఎదిరించడం కోసం హేతువాదం కావాలి’’ అన్నాను. నాస్తికులు గానీ, హేతువాదులు గానీ దోపిడీ సమస్య గురించి మాట్లాడరు. ఇది వారికి అంటరాని పదం. ఎంతసేపూ దేవుడు, దయ్యం, మూఢనమ్మకాలు.. ఇదే వారి పరిధి.

కుటుంబరావు గారు తన వ్యాసంలో ఇంతే బలంగా ఇలా చెప్పారు`“వర్గ సమాజం ఏర్పడక పూర్వం మానవుడు ఎంత అర్థంలేని విశ్వాసాలు కలిగివుండినా వాటిని మనం మతంగా నిర్వచించనవసరం లేదని నా అభిప్రాయం. ఆ విశ్వాసాలు అజ్ఞానం నుంచి పుట్టినవే గాని, బుద్ధిపూర్వకంగా సాటి మానవులను అజ్ఞానంలో ఉంచటానికి ‘దోపిడీగాళ్ళు’ సృష్టించినవి కావు”

“………..‘అసలైన’ మూఢవిశ్వాసాల గురించి ఏమిటి చెయ్యటం? హేతువాదం ద్వారా వాటిని ప్రతిఘటించటం ఇంచుమించు గోడకేసి తల కొట్టుకోవటమే.”

రావిపూడి వెంకటాద్రి కూడా ఈ వ్యాసాల్ని చదివే వచ్చారు కాబట్టి ప్రధానంగా కుటుంబరావునుద్దేశించి తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఇది హేతువాదం కాదని గట్టిగా చెప్పారు. నా విషయం వెంకటాద్రికి పెద్దగా తెలియకపోయినా, కుటుంబరావు విరసం సభ్యుడని తెలుసు. నేను హేతువాదం ముసుగులో మార్క్సిజం చెప్పే ప్రయత్నంచేసేవాణ్ణి. కుటుంబరావు గారికి ఆ ముసుగు అవసరం లేదు. ఇక్కణ్ణుంచి రావిపూడికి నాపైనా కొంత అనుమానం కలిగి ఉంటుంది.

ఆ తర్వాత 1980లో అనుకుంటాను. రావిపూడి వెంకటాద్రి మూడు రోజుల పాటు నెల్లూరులో హేతువాద అధ్యయన తరగతులకు అధ్యాపకుడుగా వచ్చాడు. ఆ తరగతులకు నేనూ, నా మిత్రుడు, విరసం సభ్యుడు, నెల్లూరు జిల్లాకు చెందినవాడు రామచంద్రరావు హాజరయ్యాం. మొదటి సెషన్‌లో విద్యార్థులుగా వచ్చినవారిని హేతువాదం గురించి తాము ఏమనుకుంటున్నారో మాట్లాడమన్నాడు. నలుగురైదుగురు మాట్లాడారు. నేను ముందే రాసుకుని వెళ్ళిన విషయాన్ని చదివాను. హేతువాదం అంటే దేన్నయినా ప్రశ్నించడం అంటారుగాని, హేతువాదులు దోపిడీని ఎందుకు ప్రశ్నించరు? అని ఆ వ్యాసంలో సూటిగా ప్రశ్నించాను. రావిపూడి సమాధానం చెబుతూ చెంచయ్య గారు రాజకీయాల్ని చెప్పారు గాని, హేతువాదం రాజకీయాల జోలికి వెళ్ళదని అన్నాడు. దీంతో మేం విభేదిస్తున్నామని చెప్పి నేనూ, రామచంద్రరావూ మా నిరసను తెలియజేసి, ఈ అధ్యయన తరగతులిన బహిష్కరిస్తున్నామని ప్రకటించి, వాకౌట్ చేసివచ్చాం.

నేను హేతువాద సంఘంలో ఉండటం వల్ల కత్తి పద్మారావు లాంటివాళ్ళతో కూడా పరిచయం ఏర్పడింది. 1982లో భీమవరంలో రాష్ట్ర హేతువాద సంఘం ఆధ్వర్యంలో అధ్యయన తరగతులు జరిగాయి. నన్ను ‘స్వేచ్ఛ’ అనే అంశంపైన మాట్లాడమన్నారు. త్రిపురనేని మధుసూదనరావు గారి సూచనలు తీసుకుని, బాగా ప్రిపేర్ అయి వెళ్ళాను. మార్క్సిజం పేరెత్తకుండా, మార్క్సిస్టు దృక్పథంలోనే ‘స్వేచ్ఛ’ గురించి మాట్లాడాను. హేతువాదం మాట ఎత్తకుండా దాని పరిమితులు గురించీ మాట్లాడాను. శ్రోతలకు నా అభిప్రాయాలు స్పష్టంగానే అర్థమయ్యాయి. శ్రోతలుగా వచ్చినవారిలో విద్యార్థులు, యువకులు ఎక్కువగానే ఉన్నారు. విరామ సమయంలో మార్క్సిస్టు అభిమానులైన వారందరూ నాచుట్టూ చేరారు. కత్తి పద్మారావు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. పైకిమాత్రం ‘మీరు బాగా మాట్లాడారు, మిమ్మల్ని ఈ విషయంపై ప్రతి జిల్లాలో మాట్లాడించాలి’ అన్నాడు. కానీ, ఆ తర్వాత ఎప్పుడూ నన్ను పిలవలేదు. హేతువాద కార్యకలాపాలతో సంబంధం తెగిపోయింది. ఆ ప్రాంతాల్లోనే విరసంలో కూడా ఒక నిర్ణయం జరిగింది`విరసం సభ్యులకు ద్వంద్వ సభ్యత్వం ఉండకూడదని. అంటే విరసంలో సభ్యులుగా ఉంటూ మరో సంస్థలో సభ్యులుగా ఉండకూడదు. దాంతో నేను హేతువాద సంఘ సభ్వత్వానికి రాజీనామా చేశాను.

మీపై తొలినాళ్ళలో భావకవుల ప్రభావం ఉన్నదా? దాని గురించి వివరించండి. మిమ్మల్ని విప్లవ సాహిత్యం వైపు ఆకర్షించిన అంశాలు ఏమిటి?
నాపై తొలినాళ్ళలో కూడా భావకవుల ప్రభావం లేదు. తెలుగు సాహిత్యం నాకు పరిచయం కావడమే భుజంగరాయశర్మ గారి ద్వారా శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’తోనే. అప్పుడు తెలుగు సాహిత్యం ముఖ్యంగా కవిత్వం చదవాలని మా కాలేజీ లైబ్రరీకి వెళ్ళినప్పుడు మొదట నాకు దొరికిన కవిత్వం భావకవి బసవరాజు అప్పారావు గారి కోయిల పాటలు. ఆ తర్వాత అనేకమంది కవుల కవిత్వాలూ దొరికాయి. చదివాను. వాటిలో విశ్వనాథ కిన్నెరసాని పాటలు, బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి, దేవులపల్లి కృష్ణపక్షం వగైరాలు ఉన్నాయి. భావ కవిత్వం చదివినా, భావ కవిత్వ ప్రభావం నాపై పడలేదు. అయితే వారి రచనా విధానం నాకు నచ్చింది. శిల్పం నచ్చింది గాని, వస్తువు నచ్చలేదన్నమాట.

నన్ను విప్లవ సాహిత్యం వైపు ఆకర్షించిన తొలి పుస్తకం శ్రీశ్రీ మహాప్రస్థానమే. ఎందుకంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో నాకు మొదట దొరికింది అదే కాబట్టి. పైగా మాది కమ్యూనిస్టు కుటుంబం. హైస్కూల్‌లో ఉన్నప్పుడే మా ఇంటికి ‘సోవియట్ భూమి’, ‘విశాలాంధ్ర’ పత్రికలు వచ్చేవి. దానికి కారణం మా అన్న సుబ్బయ్య మద్రాసులో ‘సోవియట్ ల్యాండ’ ఆఫీసులో ఉద్యోగం చెయ్యడం. తెలుగు ఎం.ఏ. కోసం తిరుపతి వెళ్ళాక త్రిపురనేని మధుసూదనరావుతో పరిచయం కావడం.

(ఇంకా ఉంది)

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. అధ్యాపకుడు. 'కొలిమి' వెబ్ మేగజీన్ సంపాదకవర్గ సభ్యుడు. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార (సమాజ సాహిత్య సంబంధాల విశ్లేషణ), 2. ఏరువాక (సాహిత్య విమర్శ); 3. ములాఖాత్ (విప్లవ రచయితలతో ఇంటర్వ్యూలు), సంపాదకత్వం : ఎరుక (ఆదిమ అర్ధసంచార తెగ ఎరుకల కథలు), తొలకరి (అల్లం రాజయ్య కథల వెనుక కథ), మట్టి మనుషులు (వడ్డెరల జీవన గాథలు), ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Reply