మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి.
నేను 1950 జులై 10న పుట్టాను. బహుశా రెండేళ్ళ వయసులో అనుకుంటాను`ఒకరోజు ఉదయాన్నే కిరసనాయిలు బుడ్డి (దీపం) ముందు కూర్చొని ఏదో బొమ్మల పుస్తకం చూస్తున్నాను. ఆ దీపం మంట నా తల వెంట్రుకలకు అంటుకుంది. అప్పటికింకా వెంట్రుకలు తియ్యలేదు గనక పొడవుగా ఉన్నాయి. పైగా ముందురోజే తలస్నానం చేయించారు. అందువల్ల మంట సులభంగా అంటుకుంది. మా అమ్మ బయట కళ్ళాపి చల్లుతూ చూసి, పరుగెత్తుకుంటూ వచ్చి ఆ కళ్ళాపి నీళ్ళనే నా తలపై చల్లింది. ఆ రోజుల్లో పల్లెల్లో మంగళివాళ్ళు పెళ్ళిళ్ళకు మంగళ వాయిద్యాలు వాయించడమే గాకుండా, నాటువైద్యం కూడా చేసేవారు. వెంట్రుకలు రాలడం వల్ల తల (ముఖం) పై భాగంలో రెండువైపులా బాగా వాసింది. పెద్ద బొబ్బలు ఏర్పడ్డాయి. ఆ మంగలి వేసిన వత్తులతో (ప్లాస్టర్ లాంటిది) ఆ బొబ్బలు తగ్గిపోయాయి. ‘దేవుడి’కి ఇవ్వాల్సిన నా తల వెంట్రుకలు అలా అగ్నికి ఆహుతై పోయాయి. దైవానికీ, నాకూ పడకపోవడం ఇలా చిన్నప్పుడే మొదలైందేమో. నా బాల్యంలో నాకు గుర్తున్న తొలి సంఘటన ఇదే. నా జీవితం నా ప్రమేయం లేకుండానే అగ్నితో మొదలైందన్నమాట. ఆ కాలిన మచ్చలు నా ముఖంపైన ఇప్పటికీ ఉన్నాయి.
అప్పట్లో మా వూరు సాయిపేటలో (నెల్లూరు జిల్లా) ప్రాథమిక పాఠశాల ఉండేది. దాన్ని మేం ‘బడి’ అనేవాళ్ళం. విద్యార్థులు 70మందికి పైగా ఉండేవాళ్ళు. అయ్యవార్లు ఇద్దరే. పెద్దయ్యవారు, చిన్నయ్యవారు అనేవాళ్ళు. వాళ్ళ పేర్లు మాకు తెలియదు. 1955లో అయిదేళ్ళ వయసులో నన్ను బళ్ళో చేర్పించారు. ఒక గుడ్డసంచిలో పలక, బలపం మాత్రమే వేసి బడికి పంపారు.
నేను మూడవ తరగతిలో ఉన్నప్పుడు – అంటే ఎనిమిదేళ్ళ వయసులో మా అమ్మానాన్న తిరుపతి వెళుతూ నన్ను కూడా రమ్మన్నారు. “తిరుపతి వస్తే నాకు చదువు పోతుంది. నేను రాను” అన్నాను`అదేదో పెద్ద చదువై, ర్యాంకు పోతుందన్నటు. నాకు గుర్తున్న రెండో సంఘటన ఇది. ఇప్పుడాలోచిస్తే నాకనిపిస్తుంది- దేవుడికీ, నాకూ పడదేమోనని. నా స్నేహం అగ్నితో మొదలైంది.
అయిదేళ్ళ వయసు నుండే మా అమ్మతోబాటు నేను కూడా పొలానికి వెళ్ళేవాణ్ణి. బడిలేని రోజుల్లో గడ్డికోసి, కట్టకట్టి మా అమ్మ తలకెత్తుకోవడానికి సిద్ధపడుతుంటే, నేను కూడా ‘ఒక గడ్డిమోపు నెత్తిన పెట్టు మోస్తా’నన్నాను. వద్దులేరా అన్నది. నేను మొండికేశాను. మళ్ళీ కాస్త గడ్డికోసి చిన్న మోపుకట్టి నా నెత్తిన పెట్టింది. అప్పుడుగానీ నేను బయల్దేరలేదు. ఇలా మొండికేసిన అన్ని సందర్భాల్లో నేను చేస్తానన్న పనులు మంచిపనులు కావడంతో నన్ను నివారించలేకపోయేవాళ్ళు. తెలియకుండానే నా వ్యక్తిత్వానికి కలిసొచ్చిన అంశం ఇది.
ఒకరోజు మా అమ్మ పొలానికి పోతూ నన్ను కూడా రమ్మని పిలిచింది. వెంటనే నేను-‘అమ్మా… మనం పోయేసరికి ఆ పొలం లేకపోతే ఎలా?’ అని అడిగాను. మా అమ్మ నవ్వి- ‘పొలం ఎక్కడికి పోతుందిరా?’ అన్నది. ‘అదిగాదు, ఒకవేళ పొలం లేదనుకో, అప్పుడెలా?’ అని మళ్ళీ అడిగాను. ఇలా మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నాను. చివరకు ‘పొలం లేకపోతే ఏం చేద్దామమ్మా’ అని అడిగాను. ‘తిరిగి ఇంటికి వద్దాం లేరా’ అన్నది. అప్పుడు బయల్దేరాను. నా ప్రశ్నకు ఏదోఒక సమాధానం రావాలి. అప్పట్లో నా ప్రశ్న తెలివితక్కువ ప్రశ్నలాగ వాళ్ళకనిపించిందిగానీ, పెద్దయ్యాక ఫిలాసఫీ చదువుకున్న తర్వాత అది తెలివితక్కువ ప్రశ్నలా నాకనిపించలేదు. ఎందుకంటే ఈనాడున్నది కొంతకాలానికి లేకపోవడం అన్నది ప్రకృతి ధర్మం. ఉనికిలోకి వచ్చిందేదైనా ఒకనాటికి అది దాని ఉనికిని కోల్పోతుంది` నాశనం కావచ్చు లేదా రూపం మార్చుకోవచ్చు.మా ఇంట్లోవాళ్ళతోనే గాక ఎవరితోనైనా సరే మాటల సందర్భంలో నేను ప్రశ్నలు వేస్తుండేవాణ్ణి. నా ప్రశ్నలకు చాలామంది సమాధానం చెప్పలేక ‘నువ్వు లాయర్ కోర్సు చదవరా’ అనేవాళ్ళు. దాదాపు 50ఏళ్ళ క్రితం – 1970లోనే ఆరుద్ర రాసిన ‘రాముడికి సీత ఏమవుతుంది?’ అనే పుస్తకం చదివాను. రాముడికి సీత ఏమవుతుందనే ప్రశ్న తెలివితక్కువ ప్రశ్న అనుకుంటారు. కానీ అది తెలివితక్కువ ప్రశ్న కాదు. ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల్లో దొరికే రామాయణాన్ని చూస్తే ఎవరైనా ఈ ప్రశ్న వేసుకోవాల్సిందే. ప్రశ్న అనేది లేకపోతే విజ్ఞానం లేదు. అభివృద్ధి లేదు. మానవ సమాజ పురోగమనం లేదు.
1961 మార్చికి ప్రాథమిక పాఠశాలలో నా చదువు పూర్తయింది. మా వూళ్ళో హైస్కూల్ లేదు. 5 మైళ్ళ దూరంలోని పెదపవనిలో ఉంది. రోజూ 5G5=10 మైళ్ళు నడవాలి. అలా రోజూ 10 మైళ్ళు నడిచి చదువుకోవడానికి సిద్ధపడ్డాను. 10 రోజులు వెళ్ళాను. ఆ తర్వాత మా అమ్మా, నాన్న బలవంతంగా ఆపేశారు.
ఈ విషయం తెలిసి స్థానిక కమ్యూనిస్టు పార్టీ నాయకుడు దామా చెంచయ్య నన్ను నెల్లూరు జిల్లాలోనే గూడూరు దగ్గర ఉన్న వాకాడు హైస్కూల్‌లో చేర్చాడు. హాస్టల్‌లో ఉచిత భోజన వసతులున్నాయి. అప్పట్లోనే దాదాపు 2000 మందికి పైగా విద్యార్థులుండేవారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల పేద విద్యార్థులకు చదువుకోవడానికి అదొక సదవకాశంగా ఉండేది. ఆ విద్యాసంస్థను స్థాపించింది నేదురుమల్లి బాలకృష్ణారెడ్డిగారు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి అప్పుడు లెక్కల టీచర్‌గా పనిచేసేవాడు. బాలకృష్ణారెడ్డిగారి అన్న కుమారుడే ఆయన. బాలకృష్ణారెడ్డి మరణానంతరం ఆ విద్యాసంస్థ ఆయన ఆధీనం కింద నడిచింది. బాలకృష్ణారెడ్డిగారు పెద్ద భూస్వామి అయినా పేదలపట్ల ఉదారస్వభావం కలిగినవారు. అప్పట్లో ఈ విద్యాసంస్థ లేకపోయినట్లయితే నా చదువు 5వ తరగతిలోనే ఆగిపోయి ఉండేది.
వాకాడు హైస్కూల్‌లో నేను 8వ తరగతి చదివేటప్పుడు 1964లో మా వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా కావాలి కాలేజీ ప్రిన్సిపల్ శ్రీరాం వేంకట భుజంగరాయశర్మగారు వచ్చారు. ఆయన ఉపన్యాసం విన్న తర్వాత, కాలేజీ చదువంటూ చదివితే కావలి కాలేజీలోనే చదవాలని నిర్ణయించుకున్నాను. 1967 మార్చికి S.S.L.C. అయిపోయింది. ఎసఎసఎల్‌సి అంటే 11వ తరగతి. అప్పట్లో స్కూల్ ఫైనల్ అంటే ఇదే. కాలేజీలో డిగ్రీకి ముందు ఒక సంవత్సరం P.U.C. (ప్రి యూనివర్సిటి కోర్స్) ఉండేది. ఆ తర్వాత S.S.L.C., P.U.C.ని కలిపి 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ చేశారు.
మళ్ళీ నా చదువు అగమ్యగోచరంగా తయారైంది. డబ్బులు పెట్టి చదివించే శక్తి మా యింట్లో లేదు. అప్పటికి సంవత్సరం క్రితమే వాకాడు విద్యాసంస్థ యాజమాన్యమే పక్కనే ఉన్న కూడలి అప్ప దగ్గర కాలేజీ పెట్టారు. ఎసఎసఎల్‌సిలో మంచి మార్కులు వచ్చినవాళ్ళకు ఉచిత హాస్టల్ వసతి ఇస్తామన్నారు. ఆ కాలేజీ పెట్టిన ప్రాంతానికి వారు ‘విద్యానగర’ అని పేరుపెట్టారు. అక్కడ ఉచితం అనే విషయం మా వాళ్ళకు చెబితే అక్కడే చదవమంటారు. అందుకే నేను చెప్పలేదు. అయితే అనుకోకుండా నాకో అవకాశం వచ్చింది. మా చిన్నాన్న బసవయ్యకు పల్లెలో ఉండి వ్యవసాయం చెయ్యడం ఇష్టం లేదు. కూలిపని చేసుకునైనా టౌన్‌లో ఉండాలని ఆయన కోరిక. అప్పటికే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా తిరుగుతుండేవాడు. ఆయన ఒక ప్రతిపాదన పెట్టాడు` ‘నేను పనిచేసుకుంటూ చెంచయ్యను చదివించుకుంటాను. మీరేమీ డబ్బులు పంపక్కర లేదు’ అని మా యింట్లో చెప్పాడు. వాళ్ళు ఒప్పుకున్నారు. అలా కావలికి చేరాం.
కాలేజీకి వెళ్ళి అప్లికేషన్ తీసుకున్నాను. వెంకట్రావు అనే క్లర్క్‌ను అడిగాను. P.U.C.లో చేరాలి, అన్ని గ్రూపుల్లో తక్కువ ఫీజులున్న గ్రూపు ఏది’ అని. ఆయన వెంటనే ‘వరల్డ్ హిస్టరీ, అడ్వాన్స్‌డ్ తెలుగు తీసుకో’ అన్నారు. కళ్ళుమూసుకొని అదే రాశాను. రెండు రోజులు కాలేజీకి వెళ్ళానో లేదో ఆ సబ్జెక్టులపై నాకు అమితమైన ఆసక్తి కలిగింది. నిజానికి అదే ఫీజులున్న గ్రూపులు ఆర్ట్స్‌లో మరో రెండుమూడు గ్రూపులున్నాయి. కానీ ఆ క్లర్క్ హిస్టరీ, తెలుగు ఎందుకు చెప్పారో తెలియదుగాని, నాకు అవే ఇష్టమైన సబ్జెక్టులైపోయాయి. గ్రూపులో తెలుగు ఉంది కాబట్టి సెకండ్ లాంగ్వేజ్‌గా హిందీ తీసుకున్నాను.
మీ సాహిత్య ప్రస్థానం ఎలా మొదలైంది?
హిందీ లెక్చరర్ పి.వి.రత్నంగారు చాలా మంచివ్యక్తి. నేను ఆయనకు దగ్గరయ్యాను. నా ఆసక్తిని చూసి ఆయన P.U.C.లోనే నా చేత మహాదేవీ వర్మా, సుమిత్రానంద్ పంత్, సూర్యకాంత త్రిపాఠీ, నిరాలా వంటి కవుల కవిత్వాన్ని, ప్రేమ్‌చంద్ వంటి రచయితల నవలల్నీ చదివించారు. ప్రేమ్‌చంద్ రాసిన గోదాన్, గబిన్, నిర్మల, కర్మభూమి మొదలైన నవలల్ని చదివాను. హిందీలో కవితల్ని రాసి హిందీ సాహితీ సమావేశాల్లో చదివాను. వ్యాస రచనలోనూ, కవిత్వంలోనూ రెండవ, మూడవ బహుమతులు వచ్చాయి. హిందీలో గొప్ప సాహిత్యం చదివే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషించాను.
మీ గురువులు ఎస్వీ భుజంగరాయ శర్మ, కేవీఆర్, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, మాదిరెడ్డి పఠాభిరామిరెడ్డి, గొట్టిముక్కల రామకృష్ణమూర్తి, (వేదిక్ నక్సలైట్), యనమండ్రు సుబ్రహ్మణ్య శాస్త్రిలతో అనుబంధం గురించి చెప్పండి.
P.U.C.లో మాకు వచ్చిన తెలుగు అధ్యాపకులలో ఇద్దరు బాగా పాఠం చెప్పేవాళ్ళు. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు బాసుడు రాసిన ప్రతిమా నాటకాన్ని చెప్పారు. దాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదం చేసింది ఆయనే. సంస్కృత నాటక కర్తలలో బాసుడు అంటే ఆయనకు చాలా ఇష్టం. మాకూ ఆ ఇష్టాన్ని కలిగించారు. కాళిదాసు నాటకాలలో కవిత్వం బాగుంటుంది గాని, బాసుడి నాటకాలలో నాటక శిల్పం విలక్షణంగా ఉంటుంది. ప్రతిమ అంటే విగ్రహం. రాముడు అరణ్యవాసం వెళ్ళాక తండ్రి దశరథుడు చనిపోతాడు. ఆ విషయం రాముడికి తెలియదు. వనవాసం పూర్తయి తిరిగివచ్చాక అంటే పన్నెండేళ్ళ తర్వాత రాజమందిరమంతా కలియతిరుగుతాడు. ఒక గదిలో తాత ముత్తాతల విగ్రహాలతో బాటు తండ్రి విగ్రహం కూడా చూసి నిర్ఘాంతపోతాడు. చనిపోయినవాళ్ళ విగ్రహాలు గదా ఇక్కడుండేది, తన తండ్రి విగ్రహం ఇక్కడ ఎందుకుంది? అని ఆశ్చర్యపోతాడు. అలా తన తండ్రి మరణవార్త తెలుస్తుంది. ఇది బాసుడి కల్పన. అలాగే బాసుడిదే ‘ఊరు భంగం’ అని మరో నాటకం ఉంది. ఊరువులు అంటే తొడలు. కురుక్షేత్ర యుద్ధంలో భీముడు దుర్యోధనుని తొడలు విరగ్గొట్టడం సన్నివేశం. తొడలు విరిగి నేలకూలిన దుర్యోధనుడి దగ్గరకు అతని కుమారుడు చిన్నపిల్లవాడు వచ్చి, ‘నాన్నా, నీ తొడలపై కూర్చుంటా’నంటాడు. తొడలు విరిగి భరించలేని నొప్పితో ఉన్న దుర్యోధనుడు కుమారుడి కోరికను కాదనలేకపోతాడు. ‘ఆ మాట భీముణ్ణి అడుగు నాయనా’ అంటాడు. ప్రేక్షకుల గుండెలు పిండే సన్నివేశం అది. ఇలాంటి నాటకీయ సన్నివేశాన్ని కల్పించడంలో బాసుడు మహా దిట్ట.
P.U.C.లో మాకు పాఠం చెప్పిన మరొక అధ్యాపకుడు గొట్టిముక్కల రామకృష్ణమూర్తి గారు. ‘మధురా విజయం’ అనే చారిత్రక నవలను పాఠం చెప్పారు. ఆయన శంకరాద్వైతి. వేదాంతోపన్యాసాలు ఇస్తుంటారు. అద్వైత వేదాంతాన్ని కూడా తార్కికంగా చెబుతారు. అద్వైతం ఏమోగాని, ఆయన తర్కం నాకు బోధపడింది.
మరొక తెలుగు అధ్యాపకుడు వై.ఎస్.శాస్త్రిగారు. పూర్తిపేరు యనమండ్ర సుబ్రహ్మణ్యశాస్త్రి. క్లాసులో పాఠం చెప్పడం ఆయనకు మాత్రం రాదు. ఏదో కాలక్షేపం చేసేవారు. ఆయన ‘హిదూ ధర్మ ప్రచారములు’ అని ఒక సంస్థను స్థాపించి, హిందూ ధర్మ ప్రచారం చేసేవారు. భగవద్గీతలోని ఒక అధ్యాయంలోని శ్లోకాలను టీకా తాత్పర్యాలు రాసి చిన్నచిన్న పుస్తకాలుగా వేసి, వాటిని పాఠం చెప్పి, పరీక్షలు పెట్టి, మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు ఆధ్యాత్మిక పుస్తకాలను బహుమతులుగా ఇస్తుండేవారు. విషయం ఏదైనా నేర్చుకోవాలనే తపన నాకుండేది. రోజూ సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళేవాణ్ణి. నాకొక్కడికే పాఠం చెప్పేవారు. పరీక్ష తేదీని 10 రోజుల ముందే ప్రకటించారు. నూటికి నూరు మార్కులు వచ్చిన వారికి ఐదారు మంచి పుస్తకాలను బహుమతిగా ఇస్తామన్నారు. నాకు ఉత్కంఠ మొదలైంది. నూరు మార్కులు తెచ్చుకోవాలనే తపన ఎక్కువైంది.
పరీక్ష రానేవచ్చింది. ఆ రోజుల్లోనే (1968) ఆయన ఆబ్జెక్టివ్ మెథడ్‌లో పరీక్షలు పెట్టేవారు. నూరు ప్రశ్నలు. ఒక్కోదానికి నాలుగు సమాధానాలు. సరైనదానిని టిక్ పెట్టాలి. అన్నీ సులభంగానే అనిపించాయి. 99 ప్రశ్నలకు సులభంగానే గుర్తుపెట్టాను. ఒక్క ప్రశ్న దగ్గర మాత్రం ఆగిపోయాను. ‘గీతా పారాయణం వల్ల ప్రయోజనం?’ అన్నది ఆ ప్రశ్న. 1. మోక్షం వస్తుంది, 2. శుభం కలుగుతుంది, 3. పుణ్యం వస్తుంది, 4. ఏ ప్రయోజనం లేదు, ఇవీ నాలుగు సమాధానాలు. నాకేమో ఏ ప్రయోజనం లేదని గుర్తుపెట్టాలని, కానీ ఇది గుర్తుపెడితే మార్కు పోతుందని భయం. ఆ ఒక్క ప్రశ్న కోసమే దాదాపు 15 నిమిషాలు కేటాయించాను. నూరు మార్కులు రావాలంటే ఇది గుర్తుపెట్టకూడదు. నచ్చిన సమాధానం గుర్తు పెడితే ఒక మార్కు పోతుంది. చివరకు మార్కు పోతే పోయిందని మనసు చంపుకోలేక ఏ ప్రయోజనం లేదనే దాన్నే గుర్తుపెట్టాను. మిగతావాళ్ళందరూ ఇది తప్ప, మిగతా మూడింటిలో ఏదోఒకటి గుర్తుపెట్టారు. నాలుగైదు రోజుల తర్వాత పేపర్లు దిద్ది ఇచ్చారు. పట్టలేని ఆనందం. నాకొక్కడికే నూటికి నూరు మార్కులు వచ్చాయి. నేను గుర్తుపెట్టిందే కరక్టయింది. పారాయణం అంటే అర్థమైనా కాకపోయినా చదవడం, అర్థం చేసుకోకుండా చదవడం వల్ల ఏ ప్రయోజనం లేదనే ఆయన అభిప్రాయం కూడా. అర్థం చేసుకొని భగవద్గీతను జీవితంలో అనుసరించాలని ఆయన ఉద్దేశం. ఒకరోజు సభ పెట్టి, చిన్న ఉపన్యాసం ఇచ్చి నాకు పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు. వాటిలోనే నా వ్యక్తిగత గ్రంథాలయం ప్రారంభమైంది. ఆయన చాదస్తుడు కాదని నాకర్థమైంది. హిందూ ధర్మం గురించే ప్రచారం చేసినా, ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఇచ్చేవారు.
అందుకే మా ఇంకో అధ్యాపకుడు, ఆధ్యాత్మికవాది అయిన గొట్టుముక్కల రామకృష్ణమూర్తి గారు ఆయనకు ‘వేదిక్ నక్సలైట’ అని పేరు పెట్టారు. నిజంగానే ఆయనకు నక్సలైట్లంటే గౌరవం ఉండేది. నాతోనే`‘ఈ దేశానికి అలాంటివాళ్ళు అవసరం’ అని ఒకటి రెండుసార్లు అన్నారు. వై.ఎస్. శాస్త్రిగారు ఆయుర్వేద వైద్యుడు కూడా. ఇంట్లో స్వయంగా ఆయుర్వేద మందులు తయారుచేసేవారు. చాలామంది ఊహలో కూడా లేని ఇంకో విషయం ఏమిటంటే కొండపల్లి సీతారామయ్య గారికి ఆయన ఆయుర్వేద మందులు ఇచ్చేవారట. ఈ విషయం నాకు చాలా కాలం తర్వాత తెలిసింది, కె.వి.ఆర్. ద్వార
ఎస్వీ యూనివర్సిటి ఎం.ఏ. జ్ఞాపకాల గురించి చెప్పండి.
1972లో డిగ్రీ పూర్తయింది. వెంటనే ఎస్వీ యూనివర్సిటీలో ఎం.ఏ.లో చేరాను. డిగ్రీలో నేను చరిత్ర, రాజనీతి శాస్త్రాలకంటే తెలుగు పైనే ఎక్కువ దృష్టి పెట్టాను. అందులోనూ వ్యాకరణంపై చాలా ఆసక్తి. డిగ్రీ ఫైనలియర్‌లో ఉండగా నేను, నా మిత్రుడు కోటం రాజు ఇద్దరం భుజంగరాయశర్మ గారింట్లోనే రాత్రిపూట ఉండి పరీక్షలకు తయారయ్యేవాళ్ళం. అప్పట్లో రెండో సంవత్సరంలో లాంగ్వేజస్, మూడో సంవత్సరం గ్రూపు సబ్జెక్టుల పరీక్షలుండేవి. మూడు సంవత్సరాల గ్రూపు సిలబస్‌పైన ఒక్కో సబ్జెక్టుకు 3పేపర్లు. మొత్తం 9 పేపర్లు ఒక్కసారే రాయవలసి వచ్చేది. నేను తెలుగుపైన ఎక్కువ దృష్టి పెట్టడంతో గ్రూప్ తెలుగులో మంచి మార్కులు వచ్చాయి. 300కు 226 మార్కులు వచ్చాయి. అంటే 75.34 శాతం. ఆ సంవత్సరం యూనివర్సిటీ ఫస్ట్ ఇదే. ఎం.ఏ.లో చేరేటప్పుడే ఈ కారణంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు నాకొచ్చింది. మా క్లాసులో అందరికీ మొదట్లోనే నేను తెలిసిపోయాను.
వాకాడు హైస్కూల్‌లో ఉండగా, వార్షికోత్సవానికి వచ్చి, తన ఉపన్యాసంలో నన్ను ప్రభావితం చేసిన భుజంగరాయ శర్మ గారి గురించి చెప్పాలి. P.U.C.లో ఆయన క్లాసుకు రాలేదు. చాలా అసంతృప్తికి గురయ్యాను. అయితే వారం వారం జరిగే తెలుగు సాహితీ సమావేశాలలో ఆయనను చూసేవాణ్ణి. అప్పుడప్పుడూ ఆయన మాటలు కొద్దిగానైనా వినేవాణ్ణి. ఎలాగైనా సరే ఒక సాహితీ సమావేశంలో మాట్లాడి ఆయన మెప్పు పొందాలని మూడు నెలలుగా ఆలోచిస్తున్నాను. దసరా సెలవులు దగ్గరకొస్తున్నాయి. లైబ్రరీకి వెళ్ళి ఏదైనా పుస్తకం తీసుకుని సెలవుల్లో బాగా ప్రిపేర్ అయి 10 నిమిషాలైనా మాట్లాడాలని నా కోరిక.
ఒకరోజు లైబ్రరీకి వెళ్ళాను. ఎన్ని పుస్తకాలు తిరగేసినా, నాకు నచ్చిన పుస్తకం దొరకలేదు. అలా వెతుకుతూ ఉంటే సంజీవదేవ్ రాసిన ‘రస రేఖలు’ అనే పుస్తకం దొరికింది. అందులో చాలా వ్యాసాలున్నాయి. వాటిలో ‘ఏది ఉత్తమ కళ?’ అనేది ఒకటి. లైబ్రరీలోనే ఆ వ్యాసం చదివాను. నాకు బాగా నచ్చింది. ఆ పుస్తకాన్ని టికెట్‌పై తీసుకుని ఇంటికొచ్చాను. సెలవుల్లో దాన్ని ఎన్నిసార్లు చదివానో తెలియదు. దాన్ని గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. మనసులోనే మాట్లాడ్డం ప్రాక్టీస్ చేశాను. సెలవుల తర్వాత జరిగే మొదటి సాహితీ సమావేశంలోనే 20 నిమిషాల సేపు మాట్లాడాను. ఇంకో ఇద్దరు ముగ్గురు డిగ్రీ విద్యార్థులు కవితలు చదివారు. గొట్టిముక్కల రామకృష్ణమూర్తి గారు చివర్లో సమీక్ష చేశారు. 10 నిమిషాల సేపు నా ఉపన్యాసం గురించే మాట్లాడారు. ఒక P.U.C. విద్యార్థి ఇంత లోతైన విషయం గురించి తడబడకుండా మాట్లాడ్డం గొప్ప విషయం అన్నారు. నా జీవితంలో మొదటి ఉపన్యాసం అదే. నేను సాధించిన తొలి అవార్డు అది. ఇంతకూ నేను మాట్లాడింది సంజీవదేవ్ గారి వ్యాసంలోని విషయం అనేదాన్ని ఎవరూ ప్రస్తావించలేదు. ఆ ఉపన్యాసం ద్వారా నేను భుజంగరాయశర్మ గారి దృష్టిలో పడ్డాను. క్యాంపస్‌లో ఆయన ఎదురైనప్పుడు నవ్వుతూ పలకరించేవారు. నా జన్మ ధన్యమైందనుకున్నాను.
P.U.C.లో తెలుగుకు ముగ్గురు అధ్యాపకులు వచ్చినా, హిస్టరీకి మాత్రం ఒక్కరే వచ్చారు. ఆయన పేరు మలిరెడ్డి పట్టాభిరామిరెడ్డి. ఎంపీఆర్ అనేవాళ్ళు. ఆయన వరల్డ్ హిస్టరీ చెప్పారు. పాఠం చెబుతుంటే మా దృష్టి పక్కకు మళ్ళేది కాదు. కంచు కంఠం. ఇంగ్లీషులో వాక్యాలకు వాక్యాలు అలా దొర్లుతూ వస్తుండేవి. ఆయన పాఠం వింటుంటే గోదావరి బ్రిడ్డిపైన గూడ్సు రైలు పోతున్నట్టుండేది. ఇక హిందీ లెక్చరర్ పి.వి.రత్నం గారి గురించి ముందే చెప్పాను. ఇంతమంది మంచి అధ్యాపకులు నాకు గురువులైనందుకు నా ఆనందానికి హద్దుండేది కాదు.
ఇంకో వ్యక్తి గురించి చెప్పాలి. నేను P.U.C.లో ఉన్నప్పుడు ఆయన ప్రిన్సిపాల్. ఆయన పేరు కె.వి.గోపాలస్వామి. విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా చేసి రిటైరయ్యారు. కావలి కాలేజీ ‘జవహర్ భారతి’ యాజమాన్యం ఆయనను ప్రిన్సిపాల్‌గా తీసుకొచ్చింది. అప్పటికే నాకు ఆ పేరు పరిచయమైనదే. హిందీ ‘విశారద’లో ఒక తెలుగు పేపర్ ఉండేది. తెలుగు సిలబస్‌లో నాటకరంగంపై ఆయన రాసిన ఒక పుస్తకం అప్పటికే చదివున్నాను. P.U.C.లో ఉండగానే విశారద పరీక్షలు రాయవలసి వచ్చింది. హాల్‌టికెట్‌పైన గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలి. కావలిలో నాకెవరూ తెలియదు. ప్రిన్సిపాల్ దగ్గరకే వెళ్ళాను. నువ్వు ఈ కాలేజీ స్టూడెంట్‌వని నాకు రుజువెట్లా? అనడిగారు. ఎలా రుజువు చేసుకోవాలో నాకర్థం కాలేదు. గంటలో పరీక్ష. ఆయన సంతకం పెట్టకపోతే పరీక్షలు రాయలేను. ఆయన తప్ప నాకు అప్పుడు గత్యంతరం లేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చివరకు తెగించి ఇలా అన్నాను`“సార్… నేను ఈ కాలేజీ విద్యార్థిని. మీరు ఈ కాలేజీ ప్రిన్సిపాల్. మీరే కాదంటే నాకు దిక్కెవ్వరు సార్?” అని. అంతే. ఏమనుకున్నారో ఏమో, నా చేతిలోని హాల్ టికెట్ లాక్కొని సంతకం చేసి ఆఫీసు వెళ్ళి ముద్ర వేయించుకోపో అన్నారు. నాకు పోయిన ప్రాణం లేచొచ్చినట్టయింది. వెంటనే జెడ్‌పీ హైస్కూల్‌లో పరీక్ష హాల్లోకి వెళ్ళాను. అక్కడి ఇన్విజిలేటర్లు నా హాల్ టికెట్‌పై గోపాలస్వామి గారి సంతకం చూసి, ఎంతో మర్యాదతో బెంచీపై నా సీటు చూపించి కూర్చోబెట్టారు.
కె.వి.గోపాలస్వామి గారు ఆంధ్రా యూనివర్సిటిలో ఉన్నప్పుడు ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి హేమాహేమీలకు నాటక రంగంలో గురువని నాకు తర్వాత తెలిసింది, ‘అంత గొప్ప వ్యక్తితోనా, నేనలా మాట్లాడింది’ అని. అప్పుడు నాకు భయం వేసింది. అలా P.U.C. ఒక సంవత్సరం ఆనందంగానే గడిచిపోయింది.
1969 జూన్‌లో డిగ్రీకి అప్లికేషన్ పూర్తిచేసి ప్రిన్సిపాల్ దగ్గరికెళ్ళాను. గోపాలస్వామి గారు వెళ్ళిపోవడంతో P.U.C.లో మాకు హిస్టరీ పాఠం చెప్పిన పట్టాభిరామిరెడ్డి గారు ప్రిన్సిపాల్ అయ్యారు. ఆయనకు నాపై మంచి అభిప్రాయమే ఉంది. డిగ్రీలో కూడా నేను తెలుగు, హిస్టరీ, పాలిటిక్స్ (టిఎచ్‌పి) గ్రూపునే అప్లై చేశాను. అది చూసి ప్రిన్సిపల్ గారు ‘బి.కాం.కు మంచి భవిష్యత్తు ఉంది. నీలాంటి విద్యార్థి బి.కాం. చదవాలి. P.U.C.లో నీకు కామర్స్ లేకపోయినా బి.కాం.లో సీటిస్తాను. అందులో చేరు’ అన్నారు. నేను మెల్లగా నాకు కామర్స్ పై ఆసక్తి లేదు సార్’ అన్నాను. వెంటనే ఇంకేమీ మాట్లాడకుండా అప్లికేషన్ పై సంతకం పెట్టారు. అలా డిగ్రీ మూడేళ్ళు ‘జవహర్ భారతి’లోనే పూర్తిచేశాను.
యాదృచ్ఛిక సంఘటనలు ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి. డిగ్రీ ఫస్టియర్‌లో మొదటిరోజు కాలేజీకి వెళ్ళాను. మొదటి క్లాసుకే భుజంగరాయశర్మ వచ్చారు. జవహర్ భారతిలో P.U.C.లో చేరాక కూడా ఆయన పాఠం కోసం సంవత్సరం ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ కల డిగ్రీ ఫస్టియర్‌లోనే నెరవేరింది. అందరం లేచి నమస్కారం చేశాం. ఆయన ప్రతినమస్కారం చేసి కూర్చోండి అన్నారు. అంతా నిశ్శబ్దం. రెండు నిమిషాల తర్వాత ఆయన మాట్లాడారు. ‘మీకు నేను బాలవ్యాకరణం చెబుతాను’ అన్నారు. సాహిత్యం చెబుతారనుకుంటే వ్యాకరణమా? అని నిరాశ కలిగింది. మొదటి క్లాసులోనే ఆ నిరాశను పటాపంచలు చేశారు. ఆయన వ్యాకరణం చెప్పడమే మంచిదనిపించింది. సాహిత్యం ఎవరైనా చెబుతారు. కానీ వ్యాకరణాన్ని అందరూ బాగా చెప్పలేరు. భుజంగరాయ శర్మ గారు వ్యాకరణాన్ని కూడా రసవత్తరంగా చెబుతారు. తర్వాత్తర్వాత తెలిసింది`ఆంధ్రా యూనివర్సిటీలో ఆయన బీఏ ఆనర్స్ చదివేటప్పుడు ఆయనకు వ్యాకరణం చెప్పిన గురువు దువ్వూరి వేంకటరమణ శాస్త్రి గారని. బాలవ్యాకరణానికి ఆయన రాసిన వ్యాఖ్యానానికి ‘రమణీయం’ అని పేరు పెట్టడంలోనే, వ్యాకరణాన్ని కూడా రమణీయంగా చెప్పొచ్చన్న ఆయన ఉద్దేశం తెలుస్తోంది.
సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పాలి. తిరుపతి ఎస్వీ యూనివర్సిటిలో నేను తెలుగు ఎం.ఏ.లో చేరాక, సెలవులకు కావలి వచ్చాక త్వరలో వెంకటరమణ శాస్త్రి గారు కావలికి వస్తున్నారని భుజంగరాయ శర్మ గారు నాతో అన్నారు. అయితే అప్పుడు నేనూ వస్తానని చెప్పాను. 1973 సెప్టెంబర్‌లో ఆయన రానేవచ్చారు. శర్మ గారు నాకు టెలిగ్రామ్ ఇచ్చారు. వెంటనే నేను కావలి వచ్చాను. శాస్త్రి గారు వారం రోజులుంటారని తెలిసింది. నాకు పండగే. అంత గొప్ప వ్యక్తితో వారం రోజులపాటు కలిసి మాట్లాడే అవకాశం లభించడం సాధారణంగా జరగదు. ఆ అవకాశం నాకు దొరికింది. దువ్వూరి వెంకటరమణ శాస్త్రిగారు, భుజంగరాయ శర్మగారు, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు, ఆ దిగ్గజాల పక్కన నేను`ఎం.ఏ. చదువుకున్న కుర్రాణ్ణి, శాస్త్రి గారు శర్మ గారికి నన్ను పరిచయం చేశారు. నన్ను పరీక్షించడానికేమో, వెంకటరమణ శాస్త్రి గారు నాకొక ప్రశ్న వేశారు. అప్పుడే ఇంద్రగంటి గారి ‘కాళిదాస కళా మందిరం’ అనే పుస్తకం వచ్చింది. “బాబూ, నీకొక ప్రశ్న, సమాధానం చెబుతావా?” అన్నారు. చెబుతానన్నాను. ‘కాళిదాస కళా మందిరం’ పుస్తకాన్ని ఎవరు రాశారు?’ అని ప్రశ్న. ‘నేనే రాశా’నన్నాను. శాస్త్రిగారు, శర్మగారు నిర్ఘాంతపోయారు. అంతగొప్ప వ్యక్తితో పరాచకాలా? అన్నట్టు శర్మగారు నావైపు చూశారు. ఇంద్రగంటి గారు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఆయనకు అసలు రహస్యం తెలుసు.
నేను డిగ్రీ చదివేటప్పుడు ప్రతిరోజూ సాయంత్రం 2 గంటల పాటు ఇంద్రగంటి గారింటికి వెళ్ళేవాణ్ణి. ఆయన డిక్టేట్ చేస్తుంటే ఆ పుస్తకం మొత్తం నా చేత్తో నేనే రాశాను. ఈ విషయం తెలిశాక అందరూ పెద్దగా నవ్వారు. వెంకటరమణ శాస్త్రిగారు ` “ఓరి భడవా… మా సరసన ఉండదగినవాడవే” అన్నారు. వాళ్ళ సరసన కూర్చొని మాట్లాడే అర్హత సాధించినట్టయింది. ఆ వారం రోజులు నాది శ్రోత పాత్ర. ప్రధాన వక్త వెంకటరమణ శాస్త్రిగారే. ఎన్నో విషయాలు చెప్పారు. మచ్చుకు ఒక్కటి చెప్పాలని ఉంది.
దువ్వూరి వెంకటరమణ శాస్త్రిగారు విద్యార్థి దశలో జరిగిన సంఘటన. ఒకసారి ఆ పాఠశాలకు డి.ఇ.వో. వచ్చారట. సరిగ్గా అప్పుడు వ్యాకరణం క్లాసు జరుగుతూ వుంది. డి.ఇ.వో.కు వ్యాకరణం అంటే చాలా ఆసక్తి. అందుకని వ్యాకరణంలో ఒక ప్రశ్న వేశారు. విద్యార్థులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సమాధానం ఎవరికీ తెలియదు. చివరకు వెంకటరమణ శాస్త్రిగారు లేచి సమాధానం చెప్పారట. నిజానికి ఆ ప్రశ్నకు సమాధానం. వాళ్ళ గురువు గారికి కూడా తెలియదు. విద్యార్థులెవరూ చెప్పకపోతే తాను చెప్పాల్సి వస్తుందని ఆయన భయపడుతున్నారట. ఎలాగో వెంకటరమణ శాస్త్రి అనే విద్యార్థి గట్టెక్కించాడు. దానికి సంతోషపడి తన జేబులో ఉన్న పెన్నును శాస్త్రి గారికి బహుమతిగా ఇచ్చారట. ఇదీ ఆ సన్నివేశం. అయిపోయింది గదా అని భుజంగరాయశర్మ గారి సంకేతంతో నేను ఇంద్రగంటి గారిని పిల్చుకు రావడానికి లేచాను. “బాబూ, కూర్చో” అన్నారు వెంకటరమణ శాస్త్రి గారు. ఇంట్లోకి వెళ్ళి ఆ పెన్నును తెచ్చి చూపించారు. ఆశ్చర్యపోవడం మా వంతయింది. ఎంత లేదనుకున్నా, ఆ పెన్ను వయసు దాదాపు 60 సంవత్సరాలుంటుంది.
అప్పట్లో బాల్ పెన్నులు లేవు. ఇంకు పెన్నులే. ఆ గురు శిష్యుల చేతిలో ఆ పెన్ను షష్ఠిపూర్తి చేసుకున్నది. అది ఆ పెన్ను గొప్పదనమో! దాన్ని జాగ్రత్తగా వాడిన ఆ గురు శిష్యుల గొప్పదనమో!
భుజంగరాయ శర్మగారు డిగ్రీలో మూడు సంవత్సరాలుగా మాకు వ్యాకరణమే చెప్పినా, ఇంట్లో మాత్రం నాకు ఎన్నో సాహిత్య విషయాలు చెప్పారు. అధ్యాపకుల ఇళ్ళకు వెళ్ళడం, వారితో మాట్లాడడం నాకు బాగా కలిసొచ్చిన అంశం. డిగ్రీలో హిస్టరీకి పట్టాభిరామిరెడ్డి గారు, వకుళాభరణం రామకృష్ణ గారు వచ్చేవారు. వారి ఇళ్ళకూ వెళ్ళేవాణ్ణి. అప్పట్లో అధ్యాపకులు కూడా కొంత టైం కేటాయించి మాట్లాడేవారు.
రాజనీతి శాస్త్రానికి కె.వి.రమణారెడ్డి, కె.వి.కోటిలింగం గార్లు వచ్చేవారు. కోటిలింగం గారి క్లాసు సరదాగా గడిచిపోయేది. రమణారెడ్డి క్లాసు సీరియస్‌గా ఉండేది. ఆయన ఇంటికి వెళ్ళడానికి విద్యార్థులు సాహసించేవారు కాదు. డిగ్రీ సెకండియర్‌లో ఉండగా నేనొకసారి వెళ్ళాను. ఆయనతో మాట్లాడాలనే కోరిక బలంగా ఉండేది. 1970లో ఏర్పడిన విప్లవ రచయితల సంఘానికి ఆయన కార్యదర్శిగా ఉండేవారు. మాది కమ్యూనిస్టు కుటుంబం గనక నాకూ ఆ వాసనలుండేవి. అందుకే రమణారెడ్డి గారిని ఇంట్లో కలవాలనే కోరిక. వెళితే ఏం మాట్లాడాలి? అదొక మిలియన్ డాలర్‌ల ప్రశ్న. నేను వారింటికి వెళ్ళేసరికి ఆయన మంచంమీద పడుకొని చదువుకుంటున్నారు. నన్ను చూసి లేచివచ్చారు. “ఏం?” అని గద్దించినట్టు అన్నారు. ముందుగానే నేను లైబ్రరీకి వెళ్ళి పొలిటికల్ థాట్‌పైన ఒక పుస్తకం పేరును, రచయిత పేరునూ చూసి గుర్తుపెటుకుని పోయాను. ఆ పుస్తకం కావాలన్నాను. వెంటనే ఇంట్లోకి వెళ్ళి రెండు నిమిషాల్లో ఆ పుస్తకం తెచ్చిచ్చారు. “ఇంకేం?” అన్నారు. “ఏమీ లేదు సార” అని వచ్చేశాను. కాసేపు కూర్చోమని మాట్లాడతారేమోనని ఆశించిన నాకు ఆశాభంగమే అయింది. ఆయన అలా ఎందుకు ఉండేవారో తర్వాత నాకు తెలిసింది.
1970కి ముందు ఆయన అభ్యుదయ రచయితల సంఘంలో కూడా నిజాయితీగా ఉండేవారు. విరసం ఏర్పడ్డాక దానికి కార్యదర్శి అయి ఆ బిజీ అలాగే కొనసాగింది. మీటింగుల కోసం ప్రయాణాలు, చదవడం, రాయడం ఆయన నిత్యకృత్యాలు. అందుకే టైం చాలేది కాదు. నేను లెక్చరర్ అయి, విరసం సభ్యుణ్ణి అయ్యాక మాత్రమే ఆయనకు దగ్గరయ్యాను. మొదట ‘అరుణతార’ పత్రిక సంపాదకత్వంలో నేను సహకరించేవాణ్ణి. అప్పుడు ప్రతిరోజూ సాయంత్రం ఆయనింటికి వెళ్ళేవాణ్ణి. వేసవిలో ఒక చివర నేను, మరో చివర ఆయన ఉండేవాళ్ళం. కనీసం 2 కి.మీ. దూరం నడిచి వెళ్ళేవాణ్ణి. అలా నాకు నడక బాగా అలవాటయింది.
76 సంవత్సరాల వయసులో ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాను. డిగ్రీ చదివేటప్పుడు సైకిల్ తొక్కేవాణ్ణి గానీ, ఆ తర్వాత అదీ పోయింది. నా ఆరోగ్య రహస్యం నడకే అని చాలామంది మిత్రులు అంటుంటారు.
మీ విద్యార్థి జీవితంలో ‘భుజంగరాయశర్మ-మహాప్రస్థానం’ విషయం గురించి చెప్పండి.
డిగ్రీ ఫస్టియర్‌లో చేరాక భుజంగరాయ శర్మగారికి బాగా దగ్గరయ్యాను. అవకాశం ఉన్నప్పుడల్లా ఇంటికి వెళ్ళేవాణ్ణి. గంటసేపైనా ఆయన తీరిగ్గా మాట్లాడేవారు. ఒకరోజు ఆయన శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ పుస్తకం ఇచ్చి చదవమన్నారు. ఇంటికివెళ్ళి చదవడం మొదలుపెట్టాను. పూర్తయిందాకా వదల్లేదు. ఏకబిగిన చదివేశాను. మనసంతా అలజడి. మనసు అటూ ఇటూ పరుగెత్తినట్టయింది. ఆ రాత్రంతా అదే ఆలోచన. అంతవరకు నేను తెలుగు సాహిత్య చదవలేదు, టెక్ట్సు పుస్తకాలలోని పాఠాలు తప్ప. ఆ పాఠాల్లో ఇలాంటి సాహిత్యం ఎక్కడా తగల్లేదు. మహాప్రస్థానం గీతాలు చదివాక మనసంతా మండుతున్న కొలిమిలా అయింది. తెల్లారి దాకా కూర్చొని మహాప్రస్థానం గురించి రాయడం మొదలుపెట్టాను. ఒక పెద్ద వ్యాసం రాసేశాను. ఏం రాస్తున్నానో నాకే తెలియదు. అలా ఐదారు అరఠావు పేజీలు రాశాక గాని నా తపన చల్లారలేదు. తెలుగులో ఇంతగొప్ప సాహిత్యం ఉందా? అని ఆశ్చర్యపోయాను. అంతవరకు శ్రీశ్రీ సినిమా పాటల రచయితగా మాత్రమే తెలుసు. మహాప్రస్థానం చదవడంతోనే శ్రీశ్రీ విశ్వరూపం తెలిసింది. తెలుగు సాహిత్యంపైన ఆసక్తి మొదలైంది. ప్రతిరోజూ లైబ్రరీకి వెళ్ళి దొరికిన తెలుగు పుస్తకమల్లా తిరిగెయ్యడం ప్రారంభించాను. ఒకరోజు బసవరాజు అప్పారావు గారి గేయాలు దొరికాయి. వాటిలోని భావం నాకు నచ్చకపోయినా రచనా విధానం నన్నాకర్షించింది. వాటిలో కొన్ని కోయిల పాటలున్నాయి.
“కోయిలా కోయిలా కూయబోకే
గుండెలూ బద్దలూ సేయబోకే”
అనే చరణాలు కనిపించాయి. అక్కడ చదవడం ఆపేసి ఆలోచించడం మొదలుపెట్టాను. కోయిలను కూయవద్దంటాడేమిటి? కోయిల కంఠం కమ్మగా ఉంటుంది గదా? కోయిల కూతతో గుండెలు బద్ధలవుతాయా? ఇలా ఆలోచనలు సాగాయి. ఇది నాకు నెగెటివ్ ఇన్‌స్పిరేషన్‌గా పనిచేసింది. కాగితం, కలం తీసుకొని రాయడం మొదలుపెట్టాను.
“కోయిలా కోయిలా ఎక్కడున్నావే?
నేడు నీ పాటలే మా బాటలవ్వాలి
నీ అమర గానమే మా నాదమవ్వాలి” అంటూ ప్రారంభించి,
“తీయ తీయని గానమీనాడు కొరగాదు
అగ్ని కణములు చిమ్మ గొంతెత్తి పాడవే” అంటూ కొనసాగించాను. ఇది ఆ సంవత్సరం కళాశాల మ్యాగజైన్‌లో మొదటి కవితగా అచ్చయింది. తెలుగులో నా సాహితీ వ్యాసంగం ఇలా మొదలైంది.
అప్పట్నుండి తరచుగా కవితలు రాయడం ప్రారంభించాను. నేను రాసిన ఒకటి రెండు కవితలు భుజంగరాయ శర్మ గారు క్లాసులో చదివి వినిపించారు కూడా. వారి ప్రోత్సాహం మరువలేనిది.
డిగ్రీ ఫైనల్‌లో రాసిన ‘అరుణకాంతులు చిమ్మే దీపాన్ని’ కవిత నేపథ్యం చెప్పండి.
మా జవహర్ భారతి కళాశాలలో అధ్యాపకుల మధ్య ఆధ్యాత్మిక వాదం నుండి మార్క్సిజం దాకా అన్ని సిద్ధాంతాలపై చర్చలు జరుగుతుండేవి. ముఖ్యంగా గొట్టిముక్కల రామకృష్ణమూర్తి గారు ‘నేను’ అంటే ఏమిటో తెలుసుకో అంటుండేవారు. నేను విద్యార్థిని గదా? ఆయనతో చర్చించే అవకాశం లేదని డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉండగా ‘నేను’ అంటే ఏమిటో నా దృష్టిలో వివరిస్తూ ఒక కవిత రాశాను. ఆ కవిత పేరు ‘నేను’.
“అరుణకాంతులు చిమ్మే దీపాన్ని
అధికంగా పెచ్చరిల్లుతున్న తాపాన్ని” అంటూ ప్రారంభించి,
“సకల ప్రపంచానికీ దక్కవలసిన ధనాన్ని
వ్యాకుల మానవాళికి చక్కని సాధనాన్ని
విప్లవ యంత్రానికి
వినియోగింపబడు ఇంధనాన్ని” అంటూ ముగించాను.
ఈ కవిత ఆ సంవత్సరం (1971 – 72) కళాశాల మ్యాగజైన్‌లో అచ్చయింది. ఈ కవితను మొదట ‘తెలుగు సాహితి’ సమావేశంలో చదివాను. నాతోపాటు నా సహాధ్యాయులు కోటంరాజు, రాఘవులు కూడా కవితలు చదివారు. భుజంగరాయ శర్మ గారు చివర సమీక్షిస్తూ ఈ మూడు కవితలూ రేడియోలో ప్రసారం కాదగిన స్థాయిలో ఉన్నాయన్నారు. ఆ మాట ఇప్పటికీ మాకొక అవార్డులా అనిపించింది.
1972లో బి.ఏ. పూర్తి కాగానే ఎస్వీ యూనివర్సిటీలో తెలుగు ఎం.ఏ.లో చేరాను. అక్కడున్న రెండేళ్ళలో కూడా అప్పుడప్పుడూ కవితలు రాసి సమ్మేళనాలలో చదివేవాణ్ణి. 1973 ఆగస్టు 15నాడు హైదరాబాద్ రేడియో కేంద్రం వాళ్ళు ప్రముఖ కవులతో నిర్వహించిన ఒక సమ్మేళనాన్ని ప్రసారం చేశారు. అప్పట్లో రేడియోలో ప్రసారమయ్యే కవి సమ్మేళన కవితల్ని చాలా ఆసక్తితో వినేవాణ్ణి. ఆ రేడియో కవి సమ్మేళనానికి శ్రీశ్రీ రాలేకపోవడం వల్ల ఆయన గేయాన్ని ఆరుద్ర చదివాడు.
“ఓ మహాత్మా, ఓ మహర్షీ
ఓ క్షమా పీయూష వర్షీ
ఎక్కడయ్యా నీ అహింస?
ఏడ నీ కరుణా రిరంసం?” అని సాగుతుంది ఆ గేయం. ఆ గేయాన్ని శ్రీశ్రీ ఎంత బాగా రాశాడో. ఆరుద్ర అంత బాగా చదివాడు. తర్వాత అది ఒక పత్రికలో అచ్చయింది. దాన్ని ఎన్నిసార్లు చదువుకున్నానో లెక్కలేదు. అది నాపై బలమైన ప్రభావం వేసింది.
ఆ సమయంలోనే చిత్తూరు జిల్లాలోని పుత్తూరు తాలూకా రచయితల సంఘం వాళ్ళు పుత్తూరులో ఒక సాహిత్య సభను నిర్వహించబోతున్నట్టు తెలిసింది. దానికి శ్రీశ్రీ, త్రిపురనేని మధుసూదనరావులు వక్తలుగా వస్తున్నారనీ, సభానంతరం కవి సమ్మేళనం నిర్వహిస్తారనీ తెలిసింది. శ్రీశ్రీ గేయం లయలో నేనొక గేయాన్ని రాసుకుని వెళ్ళాను. ఆ కవి సమ్మేళనంలో చిట్టచివరి కవిత నాదే. అప్పట్లో నేను తిరుపతిలో ఉండడం వల్లా, నాస్తిక హేతువాద ప్రభావాల్లో ఉండడం వల్లా ఏడుకొండలవాడిపైన ఒక వ్యంగ్య కవిత రాశాను. వెంకటేశ్వరుణ్ణి సంభోదిస్తూ రాసిన గేయం అది. నేను చదువుతున్నంతసేపూ శ్రోతల్లో ఒకతను ఏదేదో అరుస్తూనే వున్నాడు. చివరి చరణాలు చదువుతుండగా అతను నా దగ్గరకొచ్చి, ఇంకాపవయ్యా చాలుని, అంటూ మైకు లాక్కున్నాడు. వేదికపై ఉన్న శ్రీశ్రీ దగ్గర వెళ్ళి “నిన్ను పుట్టించిందెవడు? దేవుడు గాదా?” అని ప్రశ్నించాడు. వెంటనే శ్రీశ్రీ`“వాడెవడు నన్ను పుట్టించడానికి? నేను పుట్టించాను వాణ్ణి” అన్నాడు. అంతటితో ఆగలేదు. దేవుడి పుట్టుక గురించీ, సమాజంలో దేవుడి పాత్ర గురించీ శ్రీశ్రీ, మధుసూదనరావులు మళ్ళీ మాట్లాడారు. మొదట జరిగిన సభ కంటే ఇది చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ సంఘటన గురించి ఇటీవల “ఒక వెంటాడే జ్ఞాపకం” పేరుతో వివరంగా ఒక వ్యాసం రాశాను. ఇది శ్రీశ్రీ గురించి సింగంపల్లి అశోక్ కుమార్ వేసిన నూరు పుస్తకాల సిరీస్‌లో అచ్చయింది.
ఆ గేయం పేరు “వెంకటేశా, శ్రీనివాసా”. అది చాలా పెద్ద గేయం. అప్పట్లో విజయవాడ నుండి వెలువడే ‘చార్వాక’ పత్రికలో నా గేయాన్ని అచ్చు వేశారు. ఆ పత్రిక కాపీని చాలా కాలం పాటు దాచుకున్నాను. తర్వాత అది ఎలా పోయిందో తెలియదు. ఇప్పుడు నాకు గుర్తున్న చరణాలు కొన్ని మాత్రమే.
“వెంకటేశా శ్రీనివాసా
చాలులే ఇక నీ తమాషా
పనికిరావని తేలిపోయెను
ఏల నీపై భరోసా” అని ప్రారంభమయ్యే ఆ గేయంలో`
“బ్రహ్మ సత్యం జగన్మిథ్యని
గీతలో నువు చెబితివి
డబ్బుకోసం కొండపైన
లార్జిస్కేలిండస్ట్రి పెడితివి” అంటూ సాగుతుంది.
నా బాల్య, విద్యాభ్యాసంలో ఇవి కొన్ని సంఘటనలు మాత్రమే. విద్యార్థి జీవితం కవితా వ్యాసంగంతో పాటు కొనసాగడం వల్ల నా జీవితం మొత్తం సాహితీ వ్యాసంగంతో పెనవేసుకుపోయింది. విద్యార్థి దశలోనే కొడవటిగంటి కుటుంబరావు, త్రిపురనేని మధుసూదనరావు, కె.వి.రమణారెడ్డి గార్ల సాహితీ వ్యాసాలు చదవడంతో నా సాహిత్య వ్యాసంగం వ్యాసాల వైపు మళ్ళింది. ఎం.ఏ. అయిపోగానే 1974లోనే ‘జవహర్ భారతి’లో తెలుగు అధ్యాపకుడిగా చేరే అవకాశం రావడం కూడా నా సాహిత్య వ్యాసంగానికి చాలా ఉపకరించింది.
తిరుపతి వెళ్ళేటప్పుడు మా ప్రాంతంలో స్థానిక కమ్యూనిస్టు నాయకుడు దామా చెంచయ్య గారు ఒకవ్యక్తిని కలవమని నాకొక ఉత్తరం ఇచ్చారు. ఆయన పేరు తన్నీరు కోటయ్య. ఆయనది మా పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాయే. యూనివర్సిటీలో ఎకనమిక్స్ డిపార్ట్‌మెంట్‌లో టైపిస్ట్‌గా చేస్తుండేవాడు. ఆయన్ను కలిసి ఉత్తరం ఇచ్చాను. నన్నుచూసి` “ఇంత చిన్నపిల్లవాడు ఎం.ఏ.లో చేరుతున్నాడా?’ అని ఆశ్చర్యపోయాడట. నాకు తర్వాత చెప్పాడు. ఆరోజు మధ్యాన్నం సెలవుపెట్టి నన్ను తన రూముకు తీసుకెళ్ళాడు. మాటలు కలిశాయి. ఆయన విప్లవ రచయితల సంఘంలో సభ్యుడని తెలిసింది. ‘జ్యోతి’ కలం పేరుతో కవితలు రాసేవాడు. అదేరోజు సాయంత్రం నన్ను త్రిపురనేని మధుసూదనరావు గారింటికి తీసుకెళ్ళి పరిచయం చేశాడు. గంటసేపు ఆయనతో మాట్లాడాం. విప్లవ రచయితలతో నాకిది తొలి పరిచయం. మనసులో ఒక రకమైన సంతోషం. ఎం.ఏ. చదివిన రెండు సంవత్సరాల కాలంలో నాలుగైదుసార్లు నేను కోటయ్యను కలిసేవాణ్ణి. కనీసం వారంలో రెండుమూడు సార్లు మేమిద్దరం మధుసూదనరావుగార్ని కలిసేవాళ్ళం. ఆ పరియంతో నాకు విరసం గురించీ, విప్లవ రాజకీయాల గురించీ బాగా అవగాహన వచ్చింది. అప్పటికి విరసం పుట్టి మూడు సంవత్సరాలయింది. ఎం.ఏ.లో ఉండగానే కొడవటిగంటి కుటుంబరావు వ్యాస సంకలనం ‘కళలు – శాస్త్రీయ విజ్ఞానం’ అనేదాన్ని చదివాను. దాంతో మరింత ఆసక్తి, అవగాహన పెరిగాయి. తిరుపతి పరిసరాల్లో విరసం మీటింగులు జరిగితే కోటయ్యతో పాటు నేనూ వెళ్ళేవాణ్ణి. కోటయ్య దగ్గరున్న విరసం పుస్తకాల్ని అప్పుడప్పుడూ తీసుకెళ్ళి చదివేవాణ్ణి. మా క్లాసు విద్యార్థులలో సాకం నాగరాజు అనే అతను ఎం.ఏ.లో చేరిన నెలరోజుల్లోనే పరిచయమయ్యాడు. అప్పటికే అతను కూడా విరసం సభ్యుడై వున్నాడు. వీళ్ళద్వారా చిత్తూరు జిల్లాకు చెందిన మరో విరసం సభ్యుడు ‘సంవర్త’ కూడా పరిచయమయ్యాడు. అలా విరసం సభ్యులతో పరిచయం గాఢ స్నేహంగా మారింది. నేను విరసం సభ్యుణ్ణి కాకపోయినా, విరసం విషయాలు నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండేవి. 1973లో అనుకుంటాను` నాగరాజు నన్ను గుంటూరు విరసం సభలకు రమ్మన్నాడు. కానీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల పోలేకపోయాను.
యూనివర్సిటీలో తెలుగుశాఖ అధ్యక్షుడిగా ప్రొఫెసర్ జి.ఎన్.రెడ్డి గారు ఉండేవారు. ఆయన మాకు భాషాశాస్త్రం చెప్పేవారు. పి.సి.నరసింహారెడ్డి అనే మరో ప్రొఫెసర్ కూడా భాషాశాస్త్రం బోధించేవారు. ఆయన్ను మేం పి.సి.ఎన్. అని చెప్పుకునేవాళ్ళం. ఆయన భాషాశాస్త్రం చెప్పే విధానం నాకు బాగా నచ్చింది. ఆయన పాఠం ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉండేది. నోట్సు ఇచ్చేవాడు కాదు. పాఠం చెప్పేటప్పుడు వింటూ పాయింట్సు నోట్ చేసుకుంటూ, రిఫరెన్సు పుస్తకాలు చదువుకొని మేము నోట్సు తయారుచేసుకోవాలి. అది నాకిష్టమైన పనే. కానీ, చాలామందికి అది ఇష్టం లేదు. నేను మాత్రం ఎప్పటికప్పుడు అలా నోట్సు తయారుచేసుకునేవాణ్ణి. అప్పట్లో జెరాక్స్ లేదు. నాకు నచ్చిన అధ్యాపకుడు పి.సి.ఎన్. అయితే, ఆయనకు నచ్చిన విద్యార్థివి నువ్వే కదా మా మిత్రులు అనేవాళ్ళు. పి.జి.లెవెల్‌లో కూడా చాలామంది విద్యార్థులు నోట్సు నోట్సును ఆశించేవాళ్ళు. కొందరు ప్రొఫెసర్లు కూడా నోట్సు ఇచ్చేవాళ్ళు.
ఎం.ఏ. సెకండియర్‌లో నిర్మల మేడం గారు ద్రవిడియన్ ఫిలాలజీ చెప్పారు. పాఠం చెప్పేటప్పుడు మధ్యలో ప్రశ్నలు అడిగేవారు. ఎవరూ సమాధానం చెప్పేవాళ్ళుకాదు. నేనూ, ఇంకో ఒకరిద్దరు మాత్రమే చెప్పేవాళ్ళం. ప్రశ్నలు అడగడమే ఆలస్యం, టక్కున లేచి నిలబడతా రండి అని మిగతావాళ్ళు అనుకొనేవాళ్ళు. “పెద్ద హీరోల్లాగా లేస్తారండి, వాళ్ళకు మాత్రమే సమాధానాలు తెలిసినట్టు’ అని కూడా గుసగుసలాడుకొనేవాళ్ళు. ఈ మాటలు విని మేం కూడా ప్రతిసారి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండేవాళ్ళం. అప్పుడు మేడం` ‘కొందరు తెలియక చెప్పరు. కొందరు తెలిసీ చెప్పరు’ అనేవారు. ఆ మాట అన్నాక కూడా చెప్పకపోతే బాగుండదని నేను లేచి నిలబడి చెప్పేవాణ్ణి. పాఠంలో భాగంగా ఆమె చెప్పే ప్రతి చిన్న విషయం కూడా నేను నోట్ చేసుకునేవాణ్ణి. అదేరోజు సాయంత్రం కూర్చొని వ్యాసం తయారుచేసుకునేవాణ్ణి. అప్పుడే పి.పి.ఎన్.గారి భార్య ప్రయివేటుగా తెలుగు ఎం.ఏ. చదువుతుండేవారు. మేం ఫైనలియర్‌లో ఉండగా ఆమె ప్రీవియస్ మొదటి సంవత్సరం భాషాశాస్త్రం, రెండో సంవత్సరం ఫిలాలజీ నేను తయారుచేసిన నోట్సు పి.సి.ఎన్.గా రు తీసుకుని ఆమెకిచ్చేవారు.
పరీక్షలకు నెలరోజుల ముందునుంచే యూనివర్సిటీ వ్యాప్తంగా ఉన్న ప్రయివేటు క్యాండిడేట్స్ చాలామంది తిరుపతికి వచ్చి చదువుకుంటుండేవాళ్ళు. భాషాశాస్త్రం, ఫిలాలజీ సబ్జెక్ట్సులో వాళ్ళకు చాలా సందేహాలుండేవి. అవి చెప్పించుకోవడానికి డిపార్ట్‌మెంట్‌లో పి.సి.ఎన్. గారిని కలిసేవారు. ఆయన హాస్టల్‌లో ఉన్న నా దగ్గరకు పంపించేవారు. వాళ్ళకు చెప్పడం ద్వారా నాకూ బాగా గుర్తుండేది.
మాకు సాహిత్యాన్ని తుమ్మపూడి కోటేశ్వరరావుగారూ, మద్దూరి సుబ్బారెడ్డి గారూ, నాగయ్య గారూ చెప్పేవారు. తుమ్మపూడి కోటేశ్వరరావు గారు ప్రాచీన సాహిత్యాన్ని బాగా అభిమానిస్తారు. సుబ్బారెడ్డి గారికి ఆధునిక సాహిత్యం అంటే ఇష్టం. సిలబస్‌లో వాళ్ళ అభిమాన సబ్జెక్టుల్నే బోధించేవాళ్ళు. నాగయ్య గారు సాహిత్య చరిత్ర చెప్పేవారు. కోటేశ్వరరావు గారికి ఒక అలవాటు ఉండేది` తెలివైన విద్యార్థుల్ని ఒకరిద్దరిని ఎంచుకుని తన అనుయాయులుగా మార్చుకోవడం. అలా మా సీనియర్స్‌లో బ్రహ్మానందం అనే అతను ఆయనకు సన్నిహితంగా ఉండేవాడు. మా క్లాసు విద్యార్థుల్లో నేను అలా సన్నిహితంగా అవుతానని ఆయన ఆశించారు. నేను మార్క్సిస్టు భావజాల ప్రభావంలో ఉండేవాణ్ణి. కోటేశ్వరరావు గారు మంచి అధ్యాపకుడుగా నాకు నచ్చాడుగాని, ఆయన భావజాలం ఆధ్యాత్మికం కాబట్టి నేను ఆయనకు దగ్గర కాలేకపోయాను. ఎం.ఏ.లో చేరాక, 3, 4 నెలలు చూసి, ఒకరోజు నన్ను తన రూముకి పిలిపించుకున్నారు. “ఏమోయ్… విప్లవం ద్వారానే సమాజం మారుతుందంటావు, అంతేనా?” అని అడిగారు. నేను నీళ్ళు నమలకుండా ‘అవును సార’ అన్నాను. అంతే, అప్పట్నుండి మళ్ళీ నా జోలికి రాలేదు.
ఇక బాల, ఫ్రౌఢ వ్యాకరణాలను జాస్తి సూర్యనారాయణ గారు చెప్పారు. ఆయనకు సబ్జెక్టు బాగానే తెలుసు. సంస్కృతంలో కూడా మంచి అభినివేశం ఉంది. అయితే పాఠం ఎలా చెప్పాలో తెలియదు. నాకు బీ.ఏ.లో భుజంగరాయశర్మ గారి వల్ల వ్యాకరణంలో మంచి పునాది పడింది కాబట్టి ఆయన ఎలా చెప్పినా నాకు ఇబ్బంది ఉండేది కాదు. ఆయనలో కొంత అమాయకత్వం కూడా ఉండేది. మిగతా ప్రొఫెసర్‌లతో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి కాదు. కొందరైతే ఆయన్ను పిచ్చోడి కింద జమకట్టేవారు.
ఒకసారి యూనివర్సిటీలో విద్యార్థి ఎన్నికలు జరిగాయి. ప్రతి క్లాస్ నుండి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. అక్కడ రాజకీయ చైతన్యంతో కన్న, కులతత్వంతో విద్యార్థి సంఘాలుండేవి. మా క్లాసు విద్యార్థులు నన్ను క్లాసు ప్రతినిధిగా పోటీచెయ్యమన్నారు. నేను పోటీచేస్తే కచ్చితంగా గెలుస్తాను. కానీ నాకు ఆసక్తి లేదు. విప్లవ విద్యార్థి సంఘం ఏదీ లేదుగాని, అక్కడక్కడా వేళ్ళమీద లెక్కబెట్టినట్టుగా కొందరు విప్లవాభిమానులైన విద్యార్థులుండేవారు. వారు మా క్లాసు ప్రతినిధిగా సాకం నాగరాజును నిలబెట్టాలని అనుకుంటున్నారు. రెడ్డి సంఘం తరఫున ఒకతను పోటీచేశాడు. ఇద్దరికీ 16 16 ఓట్లు వచ్చాయి. డ్రా అయింది. చివరకు టాస్ వేశారు. నాగరాజు గెలిచాడు. టాస్ రెప్రజెంటేటివ్ అని కొందరు సరదాగా అంటుండేవారు.
మా క్లాస్‌లో నాగరాజు, నేను విప్లవాభిమానులం. లా కాలేజీ విద్యార్థి శివారెడ్డి మాకంటే వయసులో రెండేళ్ళు పెద్ద. ఆయనకు విప్లవ రాజకీయాలపైన మా కంటే మంచి అవగాహన ఉండేది. ఇప్పుడు వై.సి.పి. నాయకుడు భూమన కరుణాకరరెడ్డి కూడా అప్పుడు విద్యార్థి` బహుశా ఇంటర్మీడియట్ చదువుతుండేవాడనుకుంటాను. అతను అందరికంటే మిలిటెంట్‌గా ఉండేవాడు. అతని అన్న భూమన్ విరసం సభ్యుడు. ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్. మొత్తం మీద యూనివర్సిటీలో 15, 20 మంది విప్లవాభిమానులైన విద్యార్థుల్ని శివారెడ్డి, నాగరాజు కూడగట్టారు. ఒకరోజు శివారెడ్డి, మరో ఇద్దరు విద్యార్థులు త్రిపురనేని మధుసూదనరావు గారి దగ్గరకు వెళ్ళారు. యూనివర్సిటీలో విప్లవ విద్యార్థి సంఘాన్ని స్థాపించాలి, మంచి పేరు పెట్టండని ఆయన్ను అడిగారు. పేరు ఎలా ఉండాలో సూచన ఇస్తూ, శివారెడ్డి రాడికల్‌గా ఉండాలన్నాడట. అంతే, మధుసూదనరావు గారు ‘అయితే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనే పేరు పెట్టుకోండి’ అన్నారట.
అలా తిరుపతిలో 1973లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్.ఎస్.యు.) ఏర్పడింది. అప్పటికి ఇది ఏ పార్టీకీ అనుబంధ సంస్థ కాదు. స్థానికంగా ఒక విద్యార్థి సంఘం మాత్రమే. అప్పటికి 1967 నుండి బెంగాల్‌లో మొదలైన నక్సల్బరీ పోరాటం, దాని ప్రభావంతో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళ పోరాటం ఉధృతంగా జరిగి, కొంత చల్లారిపోయి ఉన్నాయి. ఆ ప్రభావంతో 1969లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్`లెనినిస్ట్) ఏర్పడింది. దాన్నే C.P.I.(M.L.) అంటాం. 1972 నాటికి అందులో కొన్ని విభేదాలు ఏర్పడి చీలికల దిశగా పోతున్నది. బహుశా 1974లో పీపుల్స్‌వార్ పార్టీ ఏర్పడింది. దాని నాయకుడు కొండపల్లి సీతారామయ్య ప్రజాసంఘాలకు ప్రాధాన్యం ఇచ్చి, తిరుపతిలో స్థానికంగా ఏర్పడి ఉన్న R.S.U.ను పార్టీ విద్యార్థి యూనియన్‌గా, రాష్ట్రవ్యాప్త సంస్థగా మార్చారు. అప్పుడే రాడికల్ యువజన సంఘం కూడా ఏర్పడింది. రాడికల్ విద్యార్థి, యువజన సంఘాలలోని రాడికల్స్ కొంతకాలం పాటు రాజకీయ చైతన్యంతో ఒక వెలుగు వెలిగిన చరిత్ర అందరికీ తెలిసిందే.
శాఖాచంక్రమణం అనుకోకపోతే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. అది రాడికల్స్‌కు సంబంధించిందే. పీపుల్స్‌వార్ పార్టీ, రాడికల్స్ సంఘాలు ఏర్పడిన కొత్తల్లో ఒకరోజు రాత్రిపూట రాడికల్స్ పీపుల్స్‌వార్ పార్టీ వాల్ పోస్టర్‌లు గోడలకు అంటిస్తున్నారట. పోలీసులు వచ్చి ‘ఎవరు మీరు?’ అని అడిగారట. ‘మేం పీపుల్స్‌వార్ పార్టీ వాళ్ళం సార’ అన్నారట. ‘అవునా, అయితే వేసుకోండి. మేమింకా రాడికల్స్ అనుకున్నాం లే’ అని వెళ్ళిపోయాట. అంటే రాడికల్స్ అప్పటికే ప్రజల్లోకెళ్ళి బాగా పనిచేస్తున్నార. పార్టీ పేరు ఇంకా ప్రచారంలోకి రాలేదు.
మళ్ళీ మనం యూనివర్సిటీలోకి వద్దాం. 1973. తిరుపతిలో స్థానికంగా రాడికల్ విద్యార్థి సంఘం ఏర్పడిన సందర్భం. అందులో సభ్యులు 20, 30మందికన్నా ఎక్కువ లేరు. నేనూ, సాకం నాగరాజు కూడా అందులో సభ్యులమే. మాకు ఒక ఆలోచన వచ్చింది. వరవరరావు, చెరబండరాజు, త్రిపురనేని మధుసూదనరావులతో తెలుగుశాఖ ఆధ్వర్యంలో ఒక సాహితీ సభ నిర్వహిద్దామని. జి.ఎన్.రెడ్డి గారిని అడిగాం. ఆయన ఒప్పుకోలేదు. సరే, ప్రత్యామ్నాయంగా కె.వి.ఆర్.ని ప్రతిపాదించాం. దీనికి అర్ధమనస్కకంగానే అంగీకరించారు. సభ జరిగింది. ఆ తర్వాత నెలరోజులకు జి.ఎన్.రెడ్డి గారు నెలరోజుల పాటు విదేశాలకు వెళ్ళారు. అప్పుడు తెలుగు శాఖకు తాత్కాలిక అధిపతిగా జాస్తి సూర్యనారాయణగారు. మేమిద్దరం ఆయన దగ్గరికి వెళ్ళి , ఆయన్ని కాస్త పొగిడి, ‘‘వరవరరావు, చెరబండరాజు, జ్వాలాముఖి, త్రిపురనేని మధుసూదనరావు గార్లను పిలుస్తున్నాం, మీరు ఆ సభకు అధ్యక్షత వహించాలి, మీరు తప్ప ఆ పని ఇంకెవ్వరూ చెయ్యలేర’’ని చెప్పాం. ఆయన ఉబ్బిపోయాడు. అంగీకరించాడు. సభ జరిగింది. అంతటితో ఆగలేదు. రెండురోజుల పాటు పద్మావతీ మహిళా కళాశాలలోనూ, ఓరియంటల్ కళాశాలలోనూ, గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలోనూ, కోనేటి కట్ట వద్ద ఒక బహిరంగ సభ నిర్వహించాం. తిరుపతి మొత్తం విప్లవ భావాలతో దుమ్ము లేపేశారు. అదే అదునుగా భావించి అధిక ధరలకు వ్యతిరేకంగా పెద్ద ఊరేగింపు జరిపాం. కరపత్రాలను ఊరంతా పంచాం. పెద్దయెత్తున జనం కదిలొచ్చారు. మంచి స్ఫూర్తితో, ఉద్వేగంతో ఆ ప్రదర్శన జరిగింది. ఆ రోజుల్లో ‘అధిక ధరలు’ పెద్ద సమస్యగా ఉన్నా, ఏ రాజకీయ పార్టీవాళ్ళు అలాంటి నిరసన ప్రదర్శన జరపలేదు. అందుకే ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. మేం యూనివర్సిటీలో ఉన్న రెండేళ్ళలో ఇలాంటి కార్యక్రమాలతో స్థానిక రాడికల్ విద్యార్థి సంఘానికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పరిణామాలు పైన వివరించాను.
(ఇంకా ఉంది.)