(మూడో భాగం)
విప్లవ రచయితల సంఘంలో ఎప్పుడు చేరారు?
1975 జనవరిలో అనంతపురం విరసం మహాసభల్లో చేరాను.
అప్పటి సాహిత్య, రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉండేవి?
అనంతపురం సభల్లో మొదటి సమావేశంలోనే పెద్ద రచ్చ జరిగింది. విరసంలో అప్పుడు రాజకీయంగా రెండుమూడు గ్రూపులుండేవి. అవి చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి, పీపుల్స్‌వార్ రాజకీయాల్ని అనుసరించేవిగా ఉండేవి. విరసంలో వరసగా మొదటి రెండిటికి ప్రతినిధులుగా కాశీపతి, జ్వాలాముఖి ఉండేవారు. మూడోదానికి ఒకరని చెప్పలేం. కె.వి.ఆర్., చలసాని ప్రసాద్, త్రిపురనేని మధుసూదనరావు మొదలైన వారు. ఇది మెజారిటీ గ్రూపు. రాజకీయ విభేదాల గురించి చర్చించడానికి విరసం ఎప్పుడూ జంకలేదు. ఏకాభిప్రాయానికి వచ్చినా, రాకపోయినా చర్చలు మాత్రం విస్తృతంగా జరిగేవి. ఒకవిధంగా విరసం బలం అదేనని నా అభిప్రాయం.
ఇక అనంతపురం సభల ప్రారంభ సమావేశానికి శ్రీశ్రీ అధ్యక్షుడు. ఆయన తన అధ్యక్షోపన్యాసం ప్రారంభించిన కాసేపటికే జ్వాలాముఖి తదితరులు వేదికపైకి నినాదాలతో వచ్చారు. శ్రీశ్రీ చేతిలోంచి జ్వాలాముఖి మైకు లాక్కుని మాట్లాడ్డానికి ప్రయత్నించాడు. మళ్ళీ ఆ మైకును శ్రీశ్రీ లాక్కుని` “మీరు మాట్లాడ్డానికి తప్పకుండా అవకాశం ఇస్తాను. ఇప్పుడు కూర్చోండి” అన్నాడు. జ్వాలాముఖి వినలేదు. వారందరూ వేదికపైనుంచే రచ్చ చేయడం మొదలుపెట్టారు. వేదిక ముందున్న మిగతావారూ నినాదాలివ్వడం ప్రారంభించారు. మొత్తం మీద అరగంటసేపు రచ్చరచ్చ అయింది. చివరకు జ్వాలాముఖి, ఆయన అనుయాయులు సభల్ని బహిష్కరించి బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత సభ ప్రశాంతంగా జరిగింది.i
సభల చివరి రోజు మధ్యాన్నం 3 గంటలకు ఊరేగింపు ప్రారంభం కావాల్సి ఉంది. సభలు జరిగిన ఒక ఉన్నత పాఠశాల ఆవరణంలో ఊరేగింపు కోసం అందరూ చేరారు. ఉన్నట్టుండి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మిగతా రెండు గ్రూపులవాళ్ళూ, ముఖ్యంగా యువకులు ఒకరిపై ఒకరు రాళ్ళు వేసుకోవడానికి సిద్ధమయ్యారు. కె.వి.ఆర్., కాశీపతి గార్లు ఏవో సర్ధిచెప్పారు. ఊరేగింపు మొదలైంది. నాకు మాత్రం టెన్షన్‌గా ఉంది. ఎప్పుడు ఏమవుతుందోనని. ఊరేగింపు బయల్దేరిన కాసేపటికి ఒక పెద్ద బ్యానర్‌తో ఉన్న ఒక జీబు ఊరేగింపు పక్కగుండా మహా వేగంగా ముందుకు దూసుకెళ్ళింది. అది కూడా ముందుండి ఊరేగింపులో పాల్గొంది. ఆ బ్యానర్‌పైన చారుమజుందార్ ఫొటో ఉంది. దాంతో ఊరేగింపులోనే మళ్ళీ ఉద్రిక్తత మొదలైంది. అయితే విరసం పెద్దలు ఆ జీబును ఊరేగింపులో పాల్గొనకుండా పంపించేశారు. మర్నాడు విరసం సర్వసభ్య సమావేశం. అందులో కూడా ఉన్న రెండు గ్రూపుల మధ్య కాసేపు వాదోపవాదాలు జరిగాయి. “మమ్మల్ని కూడా తరిమెయ్యండి” అని కాశీపతి అన్నారు. మొత్తం మీద ఆ ఉద్రిక్తత పోయి సర్వసభ్య సమావేశం జరిగింది. రాజకీయ విభేదాల గురించి గానీ, లేదా మరేదైనా సమస్యల గురించి గానీ, పద్ధతిగా చర్చకు పెట్టలేదు, తమ అసహనాన్ని అప్పుడప్పుడూ వెళ్ళగక్కడం తప్ప. నాకైతే విరసంలో ఎందుకు చేరానా అనిపించింది. రచయితల సభలలో ఈ గొడవలేమిటి? రచయితలు కూడా అర్ధరహితంగా గొడవలు పెట్టుకుంటారా? అందులోనూ విప్లవ రచయితలు ఎంత పద్ధతిగా ఉండాలి? నా ఆలోచనలు ఇలా ఉన్నాయి. అయితే నా మిత్రుడు కోటయ్య ఎప్పటికప్పుడు నా సందేహాలకు సమాధానాలు చెప్తుండేవాడు. విరసం కూడా ఈ చెడిపోయిన వర్గ వ్యవస్థలోనేగదా ఉన్నది? ఆ వ్యవస్థ ప్రభావం ఎంతోకొంత పడకుండా ఉంటుందా? ఇలా నాకు నేను సర్దిచెప్పుకున్నాను. సహజంగా నా స్వభావంలో సర్దుకుపోయే గుణం కొంత ఉంది.
తరువాత ఆరు నెలలు గడవకుండానే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జూన్ 25 అర్ధరాత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ముఖ్యులైన ప్రతిపక్ష నాయకుల్నీ, విరసం సభ్యుల్లో కొందరినీ ఆ అర్ధరాత్రి అరెస్టు చేశారు. మొత్తం మీద అయిదారు రోజుల్లోనే 36 మంది విరసం సభ్యులు అరెస్టయ్యారు. నన్ను అరెస్టు చెయ్యలేదుగానీ, నాకు జరిగిన పోలీసు వేధింపుల గురించి ముందే చెప్పాను. ఈ వేధింపుల కాలంలో జూన్ నుండి డిసెంబర్ వరకు నా శ్రేయోభిలాషులు చాలామంది నన్ను విరసానికి రాజీనామా చెయ్యమన్నారు. నా ప్రియమైన గురువు భుజంగరాయశర్మ గారు కూడా ఒకరోజు గంటసేపు నచ్చజెప్పారు విరసం సభ్యత్వాన్ని వదులుకోమని. ‘‘నీపై నాకు పేరెంటల్ అఫెక్షన్ ఉంది’’ అన్నారు. ఆయన మాటలతో నేను ఆలోచనలో పడ్డాను. అందరూ నన్ను భయపెట్టేవాళ్ళేగాని, ధైర్యం చెప్పేవాళ్ళు లేకపోయారు. ఈ మానసిక సంక్షోభాన్ని భరించలేక ఆ మర్నాడే ఒక రాజీనామా లెటర్ రాసుకొని జేబులో పెట్టుకుని కాలేజీకి వెళ్ళాను. పాఠం చెబుతున్నా ప్రశాంతత లేదు. ఒకరోజు కాలేజీకి సెలవు పెట్టాను. ఇంట్లోనే ఉండడం వల్ల మానసిక అశాంతి మరీ ఎక్కువైంది. మళ్ళీ కాలేజీకి వెళ్ళాను. అలా నాలుగైదు రోజులు ఆ రాజీనామా పత్రం నా జేబులోనే ఉంది. ఏమిటి, ఇలా ఆలోచిస్తున్నాను అనిపించింది. నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. అంతకుముందు కె.వి.ఆర్., త్రిపురనేని గార్లు నన్ను విరసంలో చేరమన్నప్పుడు ‘‘నేను ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకుని విరసంలో చేరతాను గాని, తొందరపడి ఆవేశంలో చేరను’’ అని చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అంతే, కాలేజీకి వెళ్తూ ఆ రాజీనామా లేఖను ముక్కలు ముక్కలుగా చించి, దారిలో ఉన్న ఒక డ్రైయినేజీలో కాలువలోనే విసిరేశాను. ఆ క్షణం నుండీ నాలో ప్రశాంతత ఏర్పడింది. ఎన్ని సమస్యలొచ్చినా విరసానికి దూరం కాకూడదని నిర్ణయించుకున్నాను.
మీ వ్యక్తిగత జీవితంలో విరసం భావజాలం తీసుకువచ్చిన మార్పులేమిటి? విరసం మిమ్మల్ని ఎట్లా తీర్చిదిద్దింది?
వ్యక్తిగత జీవితానికీ, ఆ వ్యక్తి నమ్మే భావజాలానికీ తప్పక సంబంధం ఉంటుంది, ఉండాలి. భావజాలానికి భిన్నంగా వ్యక్తిగత జీవితం ఉంటే అతన్ని చెప్పేదొకటి, చేసేదొకటిగా చూస్తారు. అందులోనూ మార్క్సిస్టు భావజాలాన్ని అనుసరించేవాళ్ళు కమ్యూనిస్టు పార్టీ సభ్యులయినా, విప్లవ రచయితలైనా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనిస్టుల వ్యక్తిగత జీవితంలోని తప్పొప్పుల్ని కాగడా పెట్టి వెతుకుతారు. కమ్యూనిస్టులకు శత్రువులు చాలామంది ఉంటారు. ఇది మరీ శృతిమించి ఒక్కోసారి తీవ్రరూపం దాలుస్తుంది. అయితే ఈ ధోరణి వల్ల ఒక సత్యం రుజువవుతుంది. కమ్యూనిస్టులకు మాత్రమే ఆదర్శప్రాయంగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది గాని, తక్కినవాళ్ళు బాధ్యతారహితంగా ఉన్నా తప్పులేదనే భావం అందులో ఇమిడి వుంటుంది. ఇది కమ్యూనిస్టుల గొప్పదనాన్నే చాటుతుంది.
1974 సెప్టెంబర్‌లో లెక్చరర్ ఉద్యోగంలో చేరాను. 1975 జనవరిలో విరసం సభ్యుణ్ణయ్యాను. 1975 జూన్ 25 రాత్రి దేశంలో ఎమర్జెన్సీ. ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే జూన్ 29న నా వివాహం. సంవత్సరంలోపే ఈ సంఘటనలన్నీ వెంటవెంటనే జరిగాయి. ఎమర్జెన్సీ అనేది నా ఉద్యోగానికీ, విరసం సభ్యత్వానికీ పోటీపెట్టింది. ఏదోఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఒక దశలో ఏర్పడింది. రెండిటినీ కాపాడుకోవడానికి తీవ్ర మానసిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అప్పటికి నాకు మార్క్సిజంపై అధ్యయనం పెద్దగా లేదు. మార్క్సిజాన్ని నమ్మేవాడు పద్ధతిగా ఉండాలి గదా అనే విషయం ఒక్కటే ఆ సంక్షోభ సమయంలో నాలో పనిచేసింది.
ఈ సందర్భంలో వివాహం అనే అంశానికి సంబంధించి ఒక విషయం చెప్పాలి. విరసం సభ్యుణ్ణి కాబట్టి మంత్రతంత్రాలతో, మేళ తాళాలతో పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు. అందుకని అందర్నీ ఒప్పించి, నొప్పించి ఆదర్శ వివాహం`సోషల్ మ్యారేజ్ చేసుకున్నాను.
నా చదువు బాధ్యతలను మా చిన్నాన్న ఒక్కడే తీసుకున్నాడు. ఆయనపై నాకు కృతజ్ఞతాభావం ఉంది. పెళ్ళి సమయంలో నాకు తెలియకుండా మా ఆవిడవాళ్ళ అన్న, మా అన్న కలిసి కట్నం ఇరవై వేలుగా ఒక ఒప్పందం చేసుకొని ఉన్నారు. ఆ విషయం పెళ్ళి అయింతర్వాత నాకు తెలిసింది. అప్పటికే పెళ్ళి ఖర్చులకైతేనేమి, అంతకుముందు చేసిన అప్పులు తీర్చడానికైతేనేమి 14వేలు ఖర్చయిపోయాయి. మిగతా ఆరువేలు నా చేతికిచ్చాడు. వెంటనే మా ఆవిడవాళ్ళ అన్న ఆ ఆరువేలూ వ్యసాయ ఖర్చుల కోసం తీసుకున్నాడు. నాకు కావలసినప్పుడు ఇస్తానన్నాడు. ఈ సంఘటనలు చకచకా జరిగిపోతుంటే నేను నిమిత్తమాత్రుణ్ణయి చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఆ మొత్తం నాకు తెలియకుండానే వచ్చి, తెలియకుండా ఎక్కువభాగం, తెలిసి కొంతభాగం ఖర్చయిపోయింది. ఆ వాతావరణం అంతా అంతా హఠాత్తుగా ఉరుములు మెరుపులుగా వచ్చి, వర్షం కురవకుండానే ముగిసిపోయింది. ఈ సంబంధానికి ముందు ఒక సంబంధం వచ్చింది. వాళ్ళు అరవై వేలు కట్నం ఇస్తామన్నా కట్నం వద్దు, పెళ్ళీ వద్దు అని తిరస్కరించాను. ఈ నేపథ్యంలో నా పెళ్ళి ఆదర్శమో, అనాదర్శమో తెలియకుండా అయిపోయింది. ఇది నా జీవితంలో మానసిక వ్యథకు గురిచేసిన తొలి సంఘటన.
ఇంకో విషయం. మా ఆవిడకు చదువురాదు. ఇది నాకు పెళ్ళికి ముందే తెలుసు. చదువులేకపోవడం అనేది నాకు అభ్యంతరకరంగా అనిపించలేదు. విద్యార్థి దశలో నాకో ఆదర్శం ఉండేది. సమాజంలో చాలామందికి విద్య లేదుగదా. చదువుకున్న అబ్బాయిలు చదువులేని అమ్మాయిల్నీ, చదువుకున్న అమ్మాయిలు చదువులేని అబ్బాయిల్నీ పెళ్ళి చేసుకుంటే అన్ని కుటుంబాలూ చదువుకున్న కుటుంబాలవుతాయనీ, ఇది సమాజంలోని చాలా సమస్యలకు పరిష్కారం అవుతుందనీ నాకో అభిప్రాయం ఉండేది. అందువల్ల నేను ఈ విషయంలో అభ్యంతర పెట్టలేదు. తర్వాత నిదానంగా చదువు నేర్పించుకోవచ్చని అనుకున్నాను. కానీ, ఇది నాకు అత్యాశే అయింది. మా ఆవిడకు ఎనిమిదేళ్ళ వయసులో గాలిచేష్ట తగిలిందని కణతలను కాల్చారట. అంతకుముందు చాలా తెలివిగా ఉన్నా, తర్వాత కాలంలో ఆమెకు మానసిక ఎదుగుదల లేకుండా పోయింది. ఈ మానసిక అపరిపక్వత వల్ల ఆమెకు చదువు నేర్పలేకపోయాను. చాలా అమాయకంగా ఉంటుంది. ఒక్కోసారి ఎంతో తెలివిగా ప్రవర్తిస్తుంది. ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో తెలియదు. ఏ విషయాన్నీ మనసులో దాచుకోదు. ఎవ్వరిముందయినా మనసులో మాటను చెప్పేస్తుంది. ఒకవిధంగా చూస్తే ఈ ప్రవర్తన తప్పు. మరోవిధంగా చూస్తే ఇందులో నిజాయితీ కనిపిస్తుంది. సమాజం అంగీకరించని ఈ కల్మషం లేని స్వభావం అనేక సందర్భాల్లో ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. వీటిని సహించే ఓపిక నాకు విరసం వల్లనే వచ్చింది. ఒక్కోసారి అనిపిస్తుంది`నాకు భార్య అయింది కాబట్టి సరిపోయిందిగాని, లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడేదో అని. ఇప్పుడు నాకు 76 సంవత్సరాలు (2026 జూన్ నాటికి). ఆమెకు 70 సంవత్సరాలు. ఈ వయసులో కూడా పనిదొంగ కాదు. తాను చెయ్యాల్సిన పనులు ఓపిగ్గా చేస్తూనే ఉంది. ఒకదశలో అటు ఉద్యోగం, ఇటు ఇంటి బాధ్యతలు, మరోవంక విరసం కార్యక్రమాలు, అధ్యయనం, రచనా వ్యాసంగం ఒక్క క్షణం తీరిక లేకుండా ఉండేవాణ్ణి. వీటన్నిటినీ ఆమె భరించింది. చదువు లేకపోయినా, ఇంటినిండా పుస్తకాలుండడాన్ని ఆమె సహించింది. ఆమె చదువులేని తనాన్ని జీవితాంతం నేను భరించాను. ఇలా ఒకర్నొకరం భరించుకుంటూ జీవన శకటాన్ని లాగుతున్నాం.
ఇంకో విషయం చెప్పి దీన్ని ముగిస్తాను.1979లో తిరుపతిలో జరిగిన సాహిత్య పాఠశాలలో వేదిక ఎక్కి ఒక అంశంపై ఉపన్యాసం ఇచ్చే అవకాశం తొలిసారిగా లభించింది. ఆ పాఠశాల థీమ్ సాహిత్య విమర్శ. నేను ఆధునిక సాహిత్య విమర్శపై మాట్లాడాను. నాకు వక్తగా అర్హత వచ్చింది. వేదిక పైనుండి దిగగానే వరవరరావు గారు దాన్ని వ్యాసంగా రాస్తే సృజనలో వేస్తానన్నారు. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. అప్పటికి నేను అరుణతారలో కొన్ని పుస్తక సమీక్షలు చేశాను గాని, ఒక వ్యాసంగా విరసం సభ్యుడిగా తొలి రచన ఇదే. ఆ వెంటనే హైదరాబాద్‌లో 1980లో జరిగిన విరసం సభలలో మాట్లాడే అవకాశం వచ్చింది. కొడవటిగంటి కుటుంబరావు గారి సాహిత్యం గురించి మాట్లాడాను. ఆ ప్రసంగాన్ని చేకూరి రామారావు లాంటివాళ్ళు మెచ్చుకున్నారు గాని, సాధారణ శ్రోతలు మెచ్చుకోలేదు. దానివల్ల నాకర్థమయింది ఏమిటంటేనా ప్రసంగంలో విషయం ఉందిగాని, వ్యక్తీకరణ శిల్పం లోపించిందని. ఆ తర్వాత ఒకటి రెండు విరసం సభల్లో మాట్లాడాను. 1983 జనవరిలో విజయవాడలో జరిగిన విరసం సాహిత్య పాఠశాల నా విరసం కెరీర్ లో ఒక పెద్ద మలుపు. ‘సాహిత్యలో తిరుగుబాటు ధోరణులు (1964 -1970)అనే టాపిక్ నాది. బాగా ప్రిపేర్ అయ్యాను. అందర్నీ మెప్పించే విధంగా మాట్లాడాలని పట్టుదల పెరిగింది. ఆ రోజు రానే వచ్చింది. అప్పుడు త్రిపురనేని మధుసూదనరావు విరసం కార్యదర్శి. నన్ను పిలవగానే వేదిక ఎక్కుతుంటే ఆయన నాతో ‘ఏమోయ్… విజృంభిస్తావా?’ అన్నారు. నాకేమో గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. ఆయనకు సమాధానం చెప్పకుండానే వేదికపైకి వెళ్ళాను. అప్పుడు సమయం 12గంటలు. ఆ రోజు ఉదయం సెషన్లో చివరి ప్రసంగం నాదే. ప్రసంగం ప్రారంభించాను. పది నిమిషాల్లోనే ఊపందుకుంది. గంటన్నర సేపు మాట్లాడాను. మధుసూదనరావుగారన్నట్టు నిజంగానే విజృంభించాను. అప్పుడప్పుడూ హాస్యపు జల్లులు కురిపించినా, పాఠం సీరియస్‌గానే సాగింది. వేదిక దిగగానే నాలుగు మీటింగులకు బుక్కయిపోయాను. నాకు పరిచయం లేనివాళ్ళు కూడా నన్నభినందించారు. కొందరయితే మాకు ఆకలే తెలియలేదన్నారు. మధుసూదనరావు గారు కూడా ‘అదరగొట్టావయ్యా’ అన్నారు. నా జన్మకిది చాలనిపించింది.
1985లో మరో మంచి అవకాశం వచ్చింది. ఆ సంవత్సరం విరసం వేసవి పాఠశాలల్ని ప్రారంభించింది. విరసం సభ్యుల్లో అధ్యయన తత్వాన్ని పెంచడం వీటి ఉద్దేశం. ఆ పాఠశాల 10 రోజుల పాటు జరగాలి. ఒక్కో పాఠం మూడు రోజులు. మూడు పాఠాలు. 9 రోజులు. పదోరోజు పాఠశాలపై సమీక్ష. అప్పట్లో అధ్యయనంపై ఆసక్తి ఉన్న యువ విరసం సభ్యులకు ఇదో పెద్ద అవకాశం. ఎవరంటే వాళ్ళు హాజరవడానికి లేదు. విరసం నాయకత్వమే విద్యార్థుల్ని ఎన్నిక చేసింది. ఎంపికయిన 17మందిలో నేనున్నాను. కె.వి.ఆర్., సుబ్బారావు (సురా), చలసాని ప్రసాద్‌లు పాఠాలు చెప్పారు. వివరంగా మేం నోట్సు రాసుకున్నాం. పాఠశాలకు నెలకు ముందే కొన్ని పుస్తకాల పేర్లు చెప్పి అవి చదువుకొని రమ్మన్నారు. వాటిలో నేను చాలావరకు చదివాను. విరసం సభ్యుణ్ణయిన ఆ పదేళ్ళలో ఇది నా ఎదుగుదలకెంతో సహాయపడింది. కృష్ణాజిల్లా పల్లేర్లమూడి గ్రామంలో ఇది జరిగింది. ఆ గ్రామంలోని హైస్కూలు హెడ్మాస్టర్ పల్లేర్లమూడి దశరథరామమూర్తిగారు ‘పదరా’ పేరుతో అప్పటికే విరసం సభ్యుడు. ఆయనే ఈ పాఠశాలను నిర్వహించాడు.
1986 వేసవి పాఠశాల కూడా అక్కడే జరిగింది. దాన్నీ ‘పదరా’ గారే నిర్వహించారు. అప్పుడు కూడా 10 రోజులు. మూడు పాఠాలు. ఒక్కో పాఠం మూడు రోజులు. “మార్క్సిజం – లెనినిజం – మావో ఆలోచనా విధానం” అనేవి ఆ మూడు పాఠాలు. మార్క్సిజం పాఠాన్ని త్రిపురనేని, మిగతా రెండు పాఠాలు చలసాని ప్రసాద్ చెప్పాలి. అయితే 25 రోజుల ముందే త్రిపురనేని గారు తనను రావడానికి కుదరదని చెప్పారు. వెంటనే చలసాని ప్రసాద్ కావలికి వచ్చారు. కె.వి.ఆర్. ఇంట్లో మేం ముగ్గురం సమావేశమయ్యాం. త్రిపురనేని మధుసూదనరావు గారు చెప్పాల్సిన ‘మార్క్సిజం’ పాఠాన్ని నన్ను చెప్పమని చలసాని అన్నారు. ఆ మాట వినగానే నాపైన బాంబు పడినట్టనిపించింది. కాసేపటికి తేరుకున్నాను. మార్క్స్, ఎంగెల్స్‌లను బాగా అధ్యయనం చెయ్యాలి. 1985లో విద్యార్థిగా వెళ్ళిన నేను సంవత్సరానికే ఉపాధ్యాయుణ్ణవ్వాల్సి వచ్చింది. ఒకపక్క ఆనందం, మరోపక్క భయం. చివరికి ఒప్పుకున్నాను. అప్పుడు నాకు అదొక ఛాలెంజ్. అప్పుడు నాకు ఐదేళ్ళ కూతురు ఉంది. నా భార్యను, కూతురిని వాళ్ళ ఊరిలో వదిలిపెట్టి వచ్చాను. వాళ్ళుంటే డిస్టర్బెన్స్ అవుతుందని. గట్టిగా నాకు 22 రోజుల టైం ఉంది. మార్క్స్, ఎంగెల్స్‌ల పుస్తకాల్ని ముందేసుకొని కూర్చున్నాను. ఒక ప్రణాళిక ప్రకారం చదవడం మొదలుపెట్టాను. నోట్సు రాసుకున్నాను. పాఠం చెప్పడానికి వీలుగా ఒక క్రమపద్ధతిలో ఆ నోట్సులోని విషయాన్ని పాయింట్లుగా రాసుకున్నాను. మధ్యలో ఒకరోజు తిరుపతి వెళ్ళి త్రిపురనేని మధుసూదనరావు గారిని కలిశాను. ఆయన నాకు ధైర్యం చెప్పాడు. మూడు రోజులూ నువ్వు పాఠం చెబితే, ఏం చెప్పినా, ఎలా చెప్పినా విజయం సాధించినట్టే అన్నాడు. ముందురోజే పల్లేర్లమూడికి చేరుకున్నాను. చలసాని గారు కూడా వచ్చారు. నేను తయారుచేసుకున్న నోట్సును ఆయనకు చూపించాను. నేనూహించినదానికంటే బాగా ప్రిపేరయ్యావన్నారు. మొత్తం మీద మూడు రోజులూ పాఠం చెప్పాను. పదీ పన్నెండు మంది విద్యార్థులు. ఈ రెండు వేసవి పాఠశాలలూ నా అధ్యయన ఉన్నతికి బాగా తోడ్పడ్డాయి. ఈ స్ఫూర్తితో 1987లో వేసవి పాఠశాలను నెల్లూరు జిల్లా అల్లూరులో 10 రోజుల పాటు నేనూ, మరో విరసం సభ్యుడు బి.వి.ప్రసాద్ నిర్వహించాం. 5పాఠాలు. ఒక్కో పాఠం 2 రోజులు. అదీ విజయవంతంగా నడిచింది. ఆ తర్వాత కొన్నాళ్ళు వేసవి పాఠశాలలు 7 రోజులు, 5 రోజులు, 3 రోజులుఅలా నడిచాయి. ఆ తర్వాత అదృశ్యం అయ్యాయి.
1980లో త్రిపురనేని, 1984లో వరవరరావు విరసం కార్యదర్శులయ్యారు. 1985లో వి.వి. అరెస్టు కావడంతో చలసాని ప్రసాద్ తాత్కాలిక కార్యదర్శి అయ్యారు. 1986 జనవరిలో కార్యదర్శి అయ్యారు. 1998 జనవరి ఒంగోలు విరసం సభల్లో నేను కార్యదర్శినయ్యాను. ఇది నాకు తలకు మించిన భారమే. అయినా తప్పలేదు. ఇలా విరసం నన్ను తీర్చిదిద్దిందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.
కవిగా మొదలై సాహిత్య విమర్శ వైపు మళ్ళడానికి ప్రేరణ ఏమిటి? తొలినాళ్ళలో కవిత్వం రాసి, సాహిత్య విమర్శనే ప్రధానంగా ఎంచుకోవడానికి కారణమేమిటి?
ఈ రెండు ప్రశ్నల్లో మాటలు వేరైనా భావం ఒకటే. సాధారణంగా ఏ రచయిత అయినా మొదటి కవిత్వమే రాస్తారనుకుంటాను. కవిత్వం ఎవర్నయినా వెంటనే ఆకర్షిస్తుంది. అసలు మనిషన్న ప్రతివాడిలో కవిహృదయం ఉంటుంది. అది వ్యక్తం కావడానికి తగిన ప్రేరణ ఉండాలి. అలాంటి సందర్భం ఉంటే ఎవరైనా కవిత్వం చెప్పొచ్చు. ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్పాలి. 1980లలో ఒకసారి నేనొక పల్లెటూరికి వెళ్ళాను. అక్కడ నాకు తెలిసిన ఒక రైతుతో కలిసి వాళ్ళ పొలానికి వెళ్ళాను. ఆ పొలంలో వంగచెట్లు ఉన్నాయి. ముందురోజు రాత్రి వర్షం కురిసి ఉండడం వల్ల అవి స్పష్టంగా నిగనిగలాడుతున్నాయి. వాటిని చూడగానే చదువు లేని రైతు ఇలా అన్నాడు- “ఆ వంగచెట్లు చూడు, చమురుపెట్టుకుని తలదువ్వుకున్నట్టు ఎంత బాగున్నాయో’ అని. ఇది కవిత్వం అనీ, ఇందులో ఉపమాలంకారం ఉందనీ అతనికి తెలియదు. అతను విద్యావంతుడయ్యుంటే కచ్చితంగా కవిగా లోకానికి తెలిసుండేవాడు.
నేను PUCలో ఉండగా హిందీ సాహిత్యాన్ని మాత్రమే చదివాను. అందువల్ల ఆ ప్రభావంతో హిందీలో కవితలు రాసేవాణ్ణి. బి.ఏ.లో చేరాక తెలుగు సాహిత్యం చదవడం ప్రారంభించాను. మొదటి సంవత్సరంలోనే తెలుగులో గేయాలు, వచన కవితలు, పద్యాలు రాశాను. నేను కూడా నా సాహిత్య వ్యాసంగాన్ని కవిత్వంతోనే మొదలుపెట్టాను. డిగ్రీలో ఉండగా కవిత్వంతోబాటు కథలు, నవలలు చదివానుగాని, సాహిత్య విమర్శ చదవలేదు. M.A.లో చేరగానే సాహిత్య విమర్శ వ్యాసాలు చదవడం ప్రారంభించాను. కొడవటిగంటి కుటుంబరావు ‘సాహిత్య ప్రయోజనం’, ‘కళలు`శాస్త్రీయ విజ్ఞానం’ వ్యాస సంకలనాలు నేను మొదట చదివిన సాహిత్య విమర్శ. ఆ తర్వాత కె.వి.ఆర్., త్రిపురనేని మధుసూదనరావు గార్ల వ్యాసాలు చదివాను. ఇంకా రాచమల్లు రామచంద్రారెడ్డి, మద్దుకూరి చంద్రశేఖరరావు గార్ల వ్యాసాలూ చదివాను. ఆ తర్వాత వ్యాస సంపుటాలు ఏవి దొరికితే అవి చదవాలనిపించేది. కవిత్వం చదవడం తగ్గిపోయింది. కవిత్వం కన్నా, వ్యాసాలపై ఎక్కువ మక్కువ ఏర్పడింది.
నాలో ఈ మార్పు ఎందుకొచ్చిందని నాలో నేను తర్కించుకుంటే నాకర్థమైన విషయం ఒకటే- కవిత్వం స్ఫూర్తినిస్తుంది. సాహిత్య విమర్శ అవగాహన కలిగిస్తుంది అని. రానురాను ఈ అభిప్రాయం స్థిరపడుతూ వచ్చింది. అందుకే వ్యాసరచనపై, సాహిత్య విమర్శపై అభిరుచి ఏర్పడింది. ఆ తర్వాత ఎవరో నా పేరు సూచించడం వల్ల ‘ఆంధ్రభూమి’ వారపత్రిక వాళ్ళు ముగ్గురు పరిశోధక విద్యార్థుల్ని ఇంటర్వ్యూ చేసి, వారి అభిప్రాయాల్ని ఒక వ్యాసంగా రాసి పంపమన్నారు. పంపాను. అది అచ్చయింది. ఒక పత్రికలో మొదట అచ్చయిన నా వ్యాసం అదే. ఆ ఇంటర్వ్యూ చేసిన విషయం ‘దేవుడున్నాడా?’ అనేది. ఆ తర్వాత నేను కావలి జవహర్ భారతిలో లెక్చరర్‌గా చేరడం, విరసంలో చేరడం నా సాహిత్య అధ్యయనాన్ని పెంచాయి. వ్యాస రచనా వ్యాసంగాన్ని పెంచాయి. ఎప్పుడో సందర్భం వస్తే ఏదో కవిత రాయడం తప్ప, అలవాటుగా కవితలు రాయడం ఆగిపోయింది.
2005లో మీతోపాటు మరో ముగ్గురు విరసం సభ్యులు అరెస్టయ్యారు కదా? ఆ అనుభవం మీ రచనల దృక్పథాన్ని ఎలా మార్చింది?
2005లో నాతోపాటు అరెస్టయిన తక్కిన ముగ్గురు విరసం సభ్యులు ఎన్ వేణుగోపాల్, పాణి, రవికుమార్‌లు. మాతోపాటు గంటి ప్రసాదం, సుదర్శన్ గార్లు కూడా అరెస్టయ్యారు.
2005 మే 29, 30, 31 తేదీల్లో మేం విప్లవ సాహిత్యోద్యమం గురించి వివరంగా మాట్లాడుకోవడానికి ఔరంగాబాద్‌లో కలిశాం. గంటి ప్రసాదం అప్పట్లో అజ్ఞాతంలో ఉండటం వల్ల తెలుగు ప్రాంతాల్లో కాకుండా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ను ఎంచుకున్నాం. అయితే ఇది పోలీసులకు ముందే తెలిసి మమ్మల్ని ఫాలో అయ్యారు. రెండోరోజు సాయంత్రం టిక్కెట్ల కోసం సుదర్శన్ రైల్వే స్టేషన్‌కు వెళ్ళడంతో ఒక వెళ్ళిపోతారేమోనని అతణ్ణి స్టేషన్ దగ్గరే అరెస్టు చేసి మిగతా ఐదుగురి కోసం మేమున్న రూముకు వచ్చారు. సుదర్శన్ అరెస్టు సంగతి మాకు తెలియదు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మేం పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటుండగా హఠాత్తుగా పదిపదిహేను మంది తలుపు తోసుకుని రూంలోకి వచ్చారు. రావడం రావడం మా చేతుల్ని వెనక్కి విరిచి కట్టి, కళ్ళకు గంతలు కట్టి జీబులెక్కించారు. కన్నుమూసి తెరిచేలోపల ఇది జరిగిపోయింది. వచ్చింది ఎవరో, ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారో తెలియదు. ఎవరికి వాళ్ళం మేం ఊహించుకున్నాం`పోలీసులు తప్ప ఈ పని ఇంకెవ్వరూ చెయ్యరని. మా అయిదుగురిని రెండు జీబుల్లో ఎక్కించినట్టు అర్థమయింది. రెండుమూడు గంటలసేపు జీబుల్లోనే ఉంచి ఇంటరాగేట్ చేశారు. సుదర్శన్ అరెస్టు కాలేదనీ, అతనైనా తప్పించుకున్నాడనీ నేను అనుకున్నాను. నన్నువేసిన మొదటి ప్రశ్న “మీరెంతమంది?” అని. “మేం అయిదుగురం” అన్నాను. “నిజం చెప్పండి. ఎంతమంది?” అని మళ్ళీ అడిగాడు. ఐదుమందిమే అన్నాను. “ఆప్ లెక్చరర్ హై… ఝూఠ్ మత్ బోల్నా” అన్నాడు. అవున్లే. అబద్ధాలు చెప్పే హక్కు పోలీసులకే గదా ఉండేది అనుకున్నాను. ఎంతమంది అని ఇంతగా నొక్కి అడుగుతున్నాడంటే సుదర్శన్ సంగతి కూడా వాళ్ళకు తెలిసిందేమో అని అనుమానం వచ్చిందిగాని, అప్పటికే అతనే ముందు అరెస్టయ్యాడనే విషయం తెలియదు. చాలాసేపటి తర్వాత టీ ఇచ్చారు. ఆపైన ఎక్కడికో తీసుకెళ్ళి ఒక బిల్డింగ్ పై అంతస్తులో మమ్మల్ని ఒక గదిలో కూర్చోబెట్టారు. ప్రతిఒక్కరికీ రెండు వైపులా ఇద్దరు కానిస్టేబుల్స్ కూర్చున్నారు. ఎక్కడుంచారో తెలియదు. ఏం చెయ్యబోతున్నారో తెలియదు. బహుశా అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి కాల్చేసి బూటకపు ఎన్కౌంటర్ కథ అల్లుతారేమో అనిపించింది. ఆ ఆలోచన రాగానే ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది. నా భార్య అమాయకురాలు. నా కూతురికి ఇంకా ఉద్యోగం రాలేదు. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? అనిపించింది. నన్ను ఇంకో భయం కూడా పట్టుకుంది. ఒకేరోజు నలుగురు విరసం సభ్యుల్ని ఇలా బూటకపు ఎన్కౌంటర్లో చంపేస్తే విరసం పరిస్థితి ఏమిటి? అని కూడా అనిపించింది. ఈ ఆలోచనలతోనే ఉన్నాను. ఎవ్వరికి నిద్ర పట్టలేదనే అనిపిస్తోంది. నా పక్కన వేణు ఉన్నట్టు అర్థమయింది. మేం మాట్లాడుకోబోతే, “మీతో మీరు మాట్లాడుకోగూడదన్నాడు. ఏదైనా అవసరం అయితే మమ్మల్ని అడగండి” అన్నారు. బాత్రూంకి వెళ్ళాలి అన్నాను. తీసుకెళ్ళాడు. బాత్రూం తలుపు దగ్గర చేతుల కట్లూ, కళ్ళ గంతలూ విప్పాడు. పని అయ్యాక తిరిగి బాత్రూం నుండి బయటకు రాకముందే చేతులు వెనక్కి, కళ్ళ గంతలు మళ్ళీ కట్టేశారు. మళ్ళీ ఏవేవో ఆలోచనలు. తెలియకుండానే ఎప్పటికో నిద్రపట్టింది. హఠాత్తుగా మెలకువ వచ్చింది. “టైమెంత?” అని అడిగాను. “అయిదు” అన్నాడు. అయితే ఈ రోజు ఇక ఎన్కౌంటర్ చెయ్యరు అనుకున్నాను.
కాసేపయ్యాక ముఖాలు కడుక్కోమన్నారు. కడుక్కున్నాం. టిఫిన్ తెచ్చిపెట్టారు. తిన్నాం. ఎన్ని గంటలసేపు మౌనంగా ఉండాలి? అందులో నాది మాట్లాడే ఉద్యోగం. ఇంకా మూడేళ్ళు సర్వీసుంది. మౌనంగా ఉండేవాళ్ళు మునులు అవుతారేమో. మేం అందుకు పనికిరామనిపించింది. కానీ మాట్లాడుకోవడానికి వీల్లేదు. కానిస్టేబుల్స్‌తో మాట్లాడొచ్చు కదా? ఇక మొదలుపెట్టాం. ఇంతలో నా పక్కనున్న కానిస్టేబుల్ మీకు దేవుడిపైన నమ్మకం ఉందా? అని అడిగాడు. సందు దొరికింది, విజృంభించాం. వాళ్ళూ మాటలు కలిపారు. వాళ్ళకూ పనిష్మెంటేగా? దేవుడిపై నమ్మకం ఉందా? అని అడిగాడంటే, చివరిసారి దేవుణ్ణి తల్చుకోండి అని చెప్పడానికేమో అనిపించింది. బహుశా ఈరోజు రాత్రికి తీసుకెళ్ళి కాల్చేస్తారేమో అనే అనుమానం వచ్చింది. సరే ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాం. మా చేతుల్లో ఏమీ లేదుగదా? అంతా పైవాడి చేతిలోనే ఉంది. పైవాడు అంటే దేవుడు కాదు, ముఖ్యమంత్రి. అప్పట్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి.
ఇలా మూడు రోజులు మమ్మల్ని చీకటిలో నిర్బంధించారు. రెండోరోజు సాయంత్రం టీ ఇచ్చారు. తాగాక నా పక్కనున్న కానిస్టేబుల్ “ఇంకో టీ తాగండి సార” అని రెండోది ఇచ్చాడు. “మిగతావాళ్ళకు కూడా ఇచ్చారా?” అన్నాను. “ఒక్క టీయే మిగిలుంటే మీకిస్తున్నాను సార” అన్నాడు. “అయితే నాకొద్దు” అన్నాను. “తాగండి సార” అని బతిమిలాడాడు. కళ్ళ గంతలు కూడా విప్పాడు. “మీరు మా బాబాయి లాగా ఉంటారు సార” అన్నాడు. అతని ముఖంలో నిజమైన ప్రేమ కనిపించింది. తాగకుండా ఉండలేకపోయాను. తాగాక కళ్ళకు గంతలు కట్టాడు. “ఇది మా డ్యూటీ సార” అన్నాడు దీనంగా. చేతులకు ఒక పల్చటి టవల్ కట్టినట్టు అనిపించేలాగా అలా చుట్టి పడుకోండి సార్ అన్నాడు. రెండు రోజులుగా వెనక్కి ఉన్న చేతులు ముందుకొచ్చేసరికి హాయిగా ఉంది. అందరికీ ఈ వెసులుబాటు ఇవ్వలేదు గదా? నాకెందుకు అని అనలేకపోయాను. కొద్దిసేపటికే బాగా నిద్రపట్టింది. నేను ఎంతసేపు నిద్రపోయానో తెలియదు. మెలకువ వచ్చాక ఆ కానిస్టేబుల్` “మీ చేతులు వెనక్కి కట్టనందుకు మా పై ఆఫీసర్ నన్ను తిట్టిపోయాడు సార” అన్నాడు. పోలీసుల్లో కూడా మానవత్వం ఉన్న మనుషులుంటారని చెరబండరాజు కవిత్వంలో చదివాను.
“మాలోని వాడివే మా వాడివే నువ్వు
పొట్టకూటికి నీవు పోలీసువైనావు” అని. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. కాదు, కళ్ళు మూసుకుని చూస్తున్నాను.
రెండో రోజు రాత్రి కూడా ఎన్కౌంటర్ జరగలేదు. బహుశా ఇక జరగదేమో అనిపించింది. ఆ రోజు (2 జూన్) సాయంత్రం మమ్మల్ని మళ్ళీ జీబులెక్కించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కాలేదు. ఒక చోట ఆపి మా కళ్ళ గంతలు, చేతుల కట్లు విప్పి ఒక బిల్డింగ్‌లోకి తీసుకెళ్ళారు. అది ఎస్పీ ఆఫీసు. ఆయనెదురుగా పదీ పదిహేను మంది కూర్చుని రాసుకుంటున్నారు. మమ్మల్ని వాళ్ళు ఫొటోలు తీసుకున్నారు. వాళ్ళు జర్నలిస్టులని అర్థమైంది. మా అరెస్టు గురించి మేం చెప్పాలని అనుకుంటుండగానే గబగబా బయటికి తీసుకొచ్చి మళ్ళీ జీబులెక్కించారు. మేం నినాదాలివ్వడం తప్ప ఏమీ చెప్పలేకపోయాం. మమ్మల్ని పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్ళారు. ఒక పెద్ద గదిలో కూర్చోబెట్టారు. చేతులకు కట్లు లేవు. కళ్ళకు గంతలు లేవు. మర్నాడు కోర్టులో పెడతారని అర్థమైంది.
ఆ రోజు సాయంత్రమే ఈ వార్త టీవీల్లో వచ్చిందట. మా అమ్మాయి ఆ సమయంలో టీవీ చూస్తుండగా స్క్రోలింగ్‌లో మేం అరెస్టయినట్టు మా పేర్లు చూసిందట. అప్పటిదాకా 3 రోజుల పాటు మేం ఇలా చీకటి గది నిర్బంధంలో ఉన్నట్టు ఎవరికీ తెలియదు. వరవరరావు గారు`నాలుగో రోజే వీళ్ళు రావాలి గదా, ఇంకా రాలేదేమిటని అనుకున్నారట. పోలీసులే ఏదో చేసుంటారని అనుమానించి హైకోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడుతుండగా టీవీ వార్తను ఆయనా చూశారట.
ఆ మర్నాడు కోర్టులో హాజరుపర్చారు. మా అందరి తరఫున గంటి ప్రసాదం గారు తెలుగులో మాట్లాడడం ప్రారంభించారు. ఇంతలో జడ్జి “ప్లీజ్ స్పీక్ ఇన్ ఇంగ్లిష” అన్నారు. వెంటనే వేణు అందుకొని ఇంగ్లిష్‌లో చెప్పడం ప్రారంభించాడు. మమ్మల్ని హాజరు పర్చింది నిజామాబాద్ కోర్టులో. ఔరంగాబాద్‌లో అరెస్టు చేసినా, అరెస్టు చేసింది ఏపీ పోలీసులు కాబట్టి ఆ రోజు రాత్రి మమ్మల్ని బోధన్‌కు తీసుకొచ్చారు. నిజామాబాద్ కోర్టులో హాజరుపర్చారు. చేతులు వెనక్కి కట్టి, కళ్ళకు గంతలు కట్టి మూడు రోజుల పాటు అమానవీయంగా నిర్బంధించిన విషయం అంతా పూసగుచ్చినట్టు వివరించాడు వేణు. ఇవన్నీ మర్నాడు పత్రికల్లో వచ్చాయి.
విచారణ పూర్తయ్యేదాకా మమ్మల్ని నిజామాబాద్ జిల్లా జైలులో పెట్టారు. ఆ జైలు కొండపైన ఉంటుంది. దానికి పెద్ద చరిత్ర ఉంది. తెలంగాణా పోరాట కాలం(1946`51)లో వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి వంటి రచయితలు ఉన్న జైలు అది. ఆ విషయం తెలిసి మేం గర్వంగా ఫీలయ్యాం. అంతకు కొన్ని సంవత్సరాల ముందు బాలగోపాల్‌ను ఇలాగే అక్రమంగా అరెస్టుచేసి ఒక రోజంతా కళ్ళకు గంతలు కట్టి రహస్యంగా ఉంచారు. అప్పుడు ఆయన రోజంతా అలా ఎలా ఉండగలిగాడా అని మేం ఆశ్చర్యపోయాం. మేం 3 రోజులు అలా ఉండి ఆ రికార్డును బద్ధలుకొట్టాం. ఆ జైలులో 25 రోజులు ఉన్నాం. రెండుసార్లు బెయిలుకు అప్లై చేశారు. కానీ రాలేదు. ఒకసారి వరవరరావు గారు మమ్మల్ని చూడ్డానికి వచ్చారు. వారివారి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఒకరోజు నాకు ధైర్యంచెప్పి నన్ను ఓదార్చడానికి వచ్చిన మా అమ్మాయి మాధవి, కాబోయే అల్లుడు రాజు ఏడవడం ప్రారంభిస్తే, నేనే వాళ్ళను ఓదార్చాల్సి వచ్చింది. మాకేమీ కాదు, కాకుంటే కొన్నాళ్ళు జైల్లో ఉండాలి, ఎప్పటికైనా కేసు కొట్టేస్తారని చెప్పాను.
జైలు జీవితం గురించి చెప్పాలి. మేం ఆరుగురం ఉన్నాం కాబట్టి మాకు సరదాగా, ఉపయోగకరంగా గడిచిపోయింది. “మీరు మాట్లాడుకోవడానికి 3 రోజుల టైం ఏం సరిపోతుంది? అందుకని మిమ్మల్ని అరెస్టుచేసి జైల్లో పెట్టాం. స్వేచ్ఛగా ఎన్ని రోజులైనా మాట్లాడుకోండి” అన్నట్టు అనిపించింది మాకైతే. మా ఆరుగుర్నీ ఒకే బ్యారక్‌లో ఉంచారు. ఒక్కొక్కరిని ఒక్కో బ్యారక్‌లో వేస్తే అందర్ని చెడగొడదామని వాళ్ళ భయం. వాళ్ళ భయం మాకు కలిసొచ్చింది. రోజూ రెండుమూడు గంటలు మేం మాట్లాడుకునేవాళ్ళం. సాహిత్యం గురించీ, రాజకీయాల గురించీ, దేశ, ప్రపంచ పరిస్థితుల గురించీ`ఒకటేమిటి, ఏ విషయం గురించైనా మాట్లాడుకోవడానికి మాకు బోలెడు టైముంది. ఒక్కో రోజు ఒక్కో బ్యారక్‌కు వెళ్ళి ముద్దాయిలతో, ఖైదీలతో మాట్లాడేవాళ్ళం. ఉదయం 6గంటలకు వచ్చి, తలుపుల్ని లాఠీలతో కొడుతూ, జాగో జాగో అని లేపేవాళ్ళు. కొంతమందిమి అంతకుముందే లేచి ఉండేవాళ్ళం. ఆ తర్వాత కాసేపటికి ఒకతను వచ్చి హాజరువేసేవాడు. మా పేరు పిల్చినపుడు చెయ్యెత్తి ‘యెస’ అనేవాళ్ళం. పాణి పేరు పిల్చినప్పుడల్లా మాకు నవ్వు వచ్చేది. అరెస్టయి మూడు రోజుల తర్వాత జైలుకు వెళ్ళినపుడు ‘పాణి’ పేరును ‘పినాకపాణి’ అని రాయించాం. ఆ పేరు పలకడం చేతకాక వాళ్ళు ‘పినేకా పానీ’ అనేవాళ్ళు. ‘పీనే కా పానీ’ అన్నట్టుండేది. అంటే తాగే నీరు అని అర్థం. తన పేరును చెడగొడుతున్నందుకు పాణి బాధపడుతుంటే, అర్థం బాగానే ఉందిగదా అని అనేవాళ్ళం. మా ఆరుగురిలో రవి (ప్రొద్దుటూరు) ఎక్కువగా నిద్రపోతుండేవాడు. బహుశ అతనికి ఇంటికన్న జైలే పదిలం అన్నట్టుండేది.
జూన్ 15 వచ్చింది. ఆ రోజు శ్రీశ్రీ వర్ధంతి. జైల్లోనే అది జరపాలనుకున్నాం. మా బ్యారక్‌లో సుమారు 60మంది దాకా ఉండేవారు. మొదటి బ్యారక్‌లోనే అందరం రెండు వరుసలుగా నిలబడి ప్రదర్శన చేశాం. ‘శ్రీశ్రీ అమర్ హై’ అంటూ నినాదాలిస్తూ ఉత్సాహంగా ఊరేగింపు జరిపాం. మా ఉత్సాహం చూసి బయట ఉన్న పోలీసులు నిస్సహాయంగా, నిరుత్సాహంగా చూస్తూ ఉండిపోయారు. ‘వాళ్ళదీ జీవితం అంటే’ అని అసూయపడ్డారు కూడా. ఊరేగింపు అయిపోయాక అందర్నీ కూర్చోబెట్టాం. నేను, గంటి ప్రసాదం వక్తలం. అందరూ ఆసక్తిగా విన్నారు. శ్రీశ్రీ మహాప్రస్థానం, మరో ప్రస్థానాల గురించే గాక, ఆయన రాసిన సినిమా పాటల్ని కూడా కోట్‌చేసి మాట్లాడాను. మొత్తం మీద రెండు గంటలసేపు ఆ కార్యక్రమం జరిగింది. మిగతా ఖైదీలకు ఇది వింతగా, ఉత్సాహపూరితంగా అనిపించింది. అందరూ మాతో బాగా కలిసిపోయారు. మమ్మల్ని జైలులో ఉంచిన మర్నాడే మా అమ్మాయికి ఒక కార్డు రాశాను`కొన్ని పుస్తకాలు తీసుకురమ్మని. నేను ఉదయం 4 గంటలకే లేచి రెండు గంటల పాటు చదువుకునేవాణ్ణి.
ఉదయం 7 గంటలకు టీ ఇచ్చాక కాసేపటికి టిఫిన్. రోజూ పులిహోర ఒక గంటె మాత్రమే పెట్టేవారు. ఒకేసారి అది నోట్లో పెట్టుకోవచ్చు. అంత తక్కువగా ఉండేది. ఆ తర్వాత పదిన్నరకే అన్నం. అది కూడా కొలతే. అయితే నాకు సరిపోయేది. తక్కువ అనేవాళ్ళు మిగిలితే అవసరమైన వాళ్ళకు పెట్టేవాళ్ళు. మే 12దాకా ఉండి అప్పుడు అనేవాళ్ళం. సాయంత్రం 6గంటలకే అన్నం పెట్టేవాళ్ళు. దాన్ని మేం 8గంటలకు తినేవాళ్ళం. వారానికి ఒకరోజు చికెన్ పెట్టేవాళ్ళు. త్రాసులో 100గ్రాములు తూకం వేసి పెట్టేవాళ్ళు. నాకు ఆశ్చర్యం వేసింది. జైలర్‌ని అడిగానుఇదేమిటి సార్ తూకం వేసి పెడుతున్నారు అని. ఆయనమీకు తెలియదు సార్, ఎక్కువైనా, తక్కువైనా పెద్ద గొడవలైపోతాయి అన్నాడు. ఆరుగంటలకు అన్నం పెట్టగానే తలుపులు వేసేస్తారు. ఇక రాత్రి సమయంలో బయటకు రావడానికి వీల్లేదు. నైట్ డ్యూటీవాళ్ళు పహారా తిరుగుతుంటారు.
మాకోసం ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడ్డానికి పంపిస్తారు. పూర్తి బయటకు కాదు, బ్యారక్ లోపలే. తలుపులు తాళం తీసి మమ్మల్ని పంపి వెంటనే తాళం వేసేస్తారు. సన్నటి మెష్ అడ్డం ఉంటుంది. అందులోంచి చూస్తూ మాట్లాడాలి. ఒకసారి ఆ తలుపుతోనే దగ్గిర ఉండే అతను నన్ను ఆపి, కూర్చోండి సార్ అని తన కుర్చీ నాకిచ్చాడు. అతను కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. వయసు 25 ఉండొచ్చు. తాత్కాలికంగా జైల్లో ఉద్యోగం చేస్తున్నాడు. నేను తెలుగు లెక్చరర్ని అని తెలిసే నాతో మాట్లాడాలనుకున్నాడు. తెలుగు సబ్జెక్ట్‌లో అతనికి ఉన్న సందేహాల్ని అడిగేవాడు. నేను ఎవర్నయినా చూడ్డానికి వచ్చినప్పుడల్లా దాదాపు గంటసేపు చెప్పించుకునేవాడు. నన్ను కుర్చీలో కూర్చోబెట్టి అతను కింద కూర్చునేవాడు.
జైల్లో ఒక చిన్న లైబ్రరీ కూడా ఉంది. అందులోంచి కూడా కొన్ని పుస్తకాలు తీసుకొని చదువుకునేవాణ్ణి. ఇంక నాలుగు రోజుల్లో బెయిల్ వస్తుందనగా ‘క్లియోపాత్ర’ నవల దొరికింది. సుమారు 400 పేజీల నవల అది. ఎలాగైనా దాన్ని పూర్తిచెయ్యాలి అనుకున్నాను. వాయిదాలకు మమ్మల్ని కోర్టుకు తీసుకెళ్ళేవాళ్ళు కాదు. జైల్లోనే స్క్రీన్ దగ్గరకు తీసుకెళ్తే అందులోంచి జడ్జి మమ్మల్ని చూసేవాడు. నేను ఆ టైం కూడా వృథా కాకుండా అక్కడ కూడా ఆ నవల చదువుతూ ఉండేవాణ్ణి. మొత్తం మీద గబగబా చదివి నవలను పూర్తిచేశాను. జూన్ నెలాఖరులో బెయిల్‌పై విడుదలయ్యాం.
మాకు జులై 1వ తేదీన కాలేజీ పునఃప్రారంభం. ఆ రోజు అందరి లాగే నేనూ కాలేజీకి వెళ్ళాను. నేను అరెస్టయి జైల్లో ఉన్నది వేసవి సెలవుల్లోనే. అందువల్ల ఇబ్బంది లేకుండా పోయింది. అయినా నా అరెస్టు విషయం తెలిసి ప్రిన్సిపాల్ నన్ను సస్పెండ్ చెయ్యాలని అనుకున్నాడట. కానీ యాజమాన్యం ఒప్పుకోలేదని తెలిసింది. టెక్నికల్‌గా ఇబ్బంది లేనంతవరకు మా కళాశాల యాజమాన్యం ఎవరినీ ఇబ్బంది పెట్టేది కాదు. కె.వి.ఆర్. ఎమర్జెన్సీ పీరియడ్‌లో అరెస్టయినపుడు ముU్యమంత్రి నుండి కాలేజీ యాజమాన్యానికి ఆదేశాలు వచ్చాయట నెగటివ్ రిపోర్టు ఇవ్వమని. కానీ అలా ఇవ్వలేదు.
ఇక ఈ నిర్బంధం ప్రభావం, అనుభవం నా రచనా దృక్పథాన్ని మార్చిందా? అని అడుగుతున్నారు. నా దృక్పథం మొదట్నుండీ ఇప్పటి వరకూ ఒకటే. నిర్బంధం వల్ల మార్పు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటిఈ ధోరణిని వదులుకోవడం. రెండు ఏ దృక్పథం వల్ల నిర్బంధానికి గురయ్యామో అది మరింత గట్టిపడడం. మొదటిదైతే నా విషయంలో జరగలేదు. విరసం సభ్యుణ్ణయిన తొలి సంవత్సరమే పోలీసుల వేధింపులకు కొత్తకాబట్టి కొంత ఊగిసలాడి, చివరకు వెనకడుగెయ్యకూడదని ఒక నిర్ణయానికి వచ్చానుగదా. పైగా నేను కార్యదర్శిగా 1998 నుండి 2004 వరకు మొదట ఉన్నప్పుడు రెండుసార్లు ఎన్‌కౌంటర్‌ను తప్పించుకున్నాను. ఔరంగాబాద్ అరెస్టు ఆ తర్వాతనే. ఇటీవల నేను రాసిన ఒక వచన కవిత దృక్పథం కూడా ఈ కోవకు చెందిందే. ఆ కవితలో కొన్ని చరణాలు`
“నేటి మత దురహంకార ఫాసిజాన్ని చూసి
ఒకనాటి ఫాసిస్టు నియంత సిగ్గుపడుతున్నాడు
ఫాసిజం తన జన్మహక్కని
ఇన్నాళ్ళూ విర్రవీగిన హిట్లర్
తన ఫాసిస్టు హోదా పోతోందని బాధపడుతున్నాడు”
……………………………………………………..
“పాలకుల మాటల్లోని ఆంతర్యాన్ని గమనించండి
మావోయిస్టు రహిత సమాజాన్ని సాధిస్తామంటున్నారు గాని
దోపిడీ రహిత సమాజాన్ని సాధిస్తామనడం లేదు”
……………………………………………………..
“ఓ మనిషీ
బతికే స్వాతంత్య్రం లేదని చచ్చేకంటే
చచ్చే స్వాతంత్య్రం ఉందని బతకడం నేర్చుకో
ఆత్మస్థైర్యం, గుండె నిబ్బరం
నీలో జీవం, చేవ ఇంకా మిగిలి ఉంటే
నిన్ను నువ్వు రక్షించుకో…” ఇలా సాగింది ఆ కవిత. ఇది 2025 అక్టోబర్‌లో రాసింది. ఈ విషయంలో ఇంతకు మించి ఇంకేమీ చెప్పనక్కరలేదు.
2006 – 2008 మధ్య విరసం కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న ప్రధాన సవాళ్ళు ఏమిటి?
2006లో నేను రెండోసారి విరసం కార్యదర్శి కావడం కేవలం అపద్ధర్మ బాధ్యతను నిర్వర్తించడానికే. 2000లో ఆలకూరపాడు (ప్రకాశం జిల్లా)లో జరిగిన విరసం సభల్లో కళ్యాణరావు గారు దిగిపోయి పాణి కార్యదర్శి బాధ్యతల్ని తీసుకున్నాడు. 2004లో పాణి దిగిపోయి కృష్ణాబాయి గారు కార్యదర్శి అయ్యారు. ఆమె వయసురీత్యా రెండేళ్ళ కంటే ఎక్కువ కాలం పనిచెయ్యలేని స్థితి. అప్పుడు వెంటనే ఎవరూ సిద్ధపడక ………… 2006 – 2008 మధ్య నేను కార్యదర్శిగా ఉండవలసి వచ్చింది. అప్పుడు కార్యదర్శిగా ఉండవలసి రావడమే నాకెదురైన సవాల్. అంతకుమించి ఇంకేమీ లేవు. కానీ, మొదటిసారిగా 1998లో నేను కార్యదర్శి అయినప్పుడు నిజంగానే సవాళ్ళు ఎదుర్కొన్నాను. అంతకుముందు విరసం బాధ్యతల్ని ప్రధానంగా నలుగురు పంచుకునేవాళ్ళు. కార్యదర్శి, ఎడిటర్, మేనేజర్, కోశాధికారి. 1998లో నేను కార్యదర్శి అయినప్పుడు అందరూ అస్త్ర సన్యాసం చేసినట్టు ఈ నాలుగు బాధ్యతల్ని నేనే నిర్వర్తించవలసి వచ్చింది. అసలే నేను అనుభవం లేనివాణ్ణి. ఒక చిన్న టౌన్ కావలిలో ఉన్నాను. నేను, కె.వి.ఆర్. తప్ప కావలిలో ఇంకెవరూ విరసం సభ్యులు లేరు. అప్పటికే కె.వి.ఆర్. రిటైరై ఉన్నాడు. ఏఐఎలఆర్సి కార్యకలాపాల్లో ఇతర రాష్ట్రాలు తిరుగుతూ ఆయన వయసుకు మించి పనిచేస్తున్నాడు. కావలిలో ‘అరుణతార’ను అచ్చువెయ్యడానికి చెప్పుకోదగ్గ ప్రెస్సులు కూడా లేవు. నేను కార్యదర్శి అయినప్పటి పరిస్థితి ఇది.
ఉద్యోగం, ఇంటి బాధ్యతలతో బాటు విరసం బాధ్యతలు. పైగా 1984, 85 ప్రాంతాల నుండి స్థానికంగా ఉన్న సమస్యలపై స్పందించి ప్రజాసంఘాలు పనిచేస్తుండేవి. విరసం తరఫున నేనే బాధ్యుణ్ణి. అంతేగాకుండా ప్రజాసంఘాల ప్రతినిధులు నన్ను వాటికి నాయకత్వం వహించమనేవారు. సాయంత్రం కాలేజీ అయిపోయాక 5గంటల నుండి 8గంటల దాకా నెలలో కనీసం 15 రోజులు ఈ పనులుండేవి. మిగతా రోజుల్లో కాలేజీ నుండి ఇంటికి రాగానే విరసం పనుల్లో మునిగిపోయేవాణ్ణి. కార్యదర్శిగా వచ్చే ఉత్తరాలకు సమాధానాలు రాయాలి. ‘అరుణతార’కు వచ్చే రచనల్ని పరిశీలించాలి. కావలిలోనే ఒక చిన్న ప్రెస్సుతో సంబంధాలు పెట్టుకుని దగ్గరుండి పనిచేయించుకునేవాణ్ణి. ప్రూఫులు దిద్దాలి. పత్రిక అచ్చయ్యాక వాటిని ప్యాక్ చెయ్యాలి. అడ్రసులు రాయాలి. పోస్టాఫీసుకు రిక్షాలో తీసుకెళ్ళి ఈ బండిల్స్‌ను వాళ్ళకు అప్పజెప్పాలి.
కొంత సమయం అధ్యయనం, రాయడం కాకుండా ప్రయాణాలు, మీటింగులు ఉండేవి. కార్యదర్శిగా ఇవి తప్పవు. మొదటి రెండు సంవత్సరాలు ఒంటిచేతి మీదుగా ఈ పనులు నిర్వహించవలసి వచ్చింది. తర్వాత మన అభిమానులుగా ఉన్న కొంతమందిని కూడగట్టాను. మనం తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉంటాయి గదా. వారానికొకసారి సమావేశం అవుదామని ఒప్పించి, ప్రతి బుధవారం సాయంత్రం 2గంటలసేపు చర్చించుకునేవాళ్ళం. అలా ఒక టీం తయారైంది. వాళ్ళలో అయిదారుగుర్ని ఎంచుకొని, ‘అరుణతార’ ప్యాకింగ్ చేసేవాళ్ళం. అలా రెండేళ్ళు గడిచింది. అంటే నేను కార్యదర్శి అయి నాలుగేళ్ళు పూర్తయింది. ఈ బాధ్యతలు నా నుండి మరొకరికి వెళ్ళిపోతాయని అందరూ ఆశించారు. కాని అలా జరగలేదు. ఇంకో రెండేళ్ళు నేనే విరసం కార్యదర్శిగా, అరుణతార ఎడిటర్‌గా కొనసాగాను. ఒక్కొక్కరు ఈ పనికి దూరం కావడం మొదలయింది. మళ్ళీ నేనొక్కణ్ణే అన్ని పనులూ చెయ్యవలసి వచ్చింది. ప్యాకింగ్ రేపర్లు కాలేజీకి కూడా తీసుకెళ్ళి విరామ సమయాల్లో అడ్రసులు రాసుకునేవాణ్ణì. ‘అరుణతార’కు వచ్చిన రచనల్ని కూడా చాలావరకు కాలేజీలో ఉండగానే పరిశీలించేవాణ్ణి. 1994లో కార్యదర్శి బాధ్యత తప్పిపోయినా, కొత్త కార్యదర్శి కళ్యాణరావు నన్నే ఎడిటర్‌గా కొనసాగమన్నారు. అలా 1998 జనవరి దాకా నేనే కొనసాగాను. మొత్తం మీద 1988-1994 ఈ ఆరేళ్ళ కాలం నాకు ఊపిరి సలపని విధంగా ఒత్తిడి ఉండేది. ఆ పీరియడ్‌తో పోలిస్తే 2006 – 08 కాలంలో అంత ఒత్తిడి లేదు.
(ఇంకా ఉంది)