ప్రజా తాత్విక కవి గాయకుడు గద్దర్

గద్దర్ ఈ దేశ సాంస్కృతిక ప్రతీక. ప్రపంచ ప్రజా ఉద్యమాల గొంతుక. అతనో సజీవ జానపద నృత్యగానం. నియంతృత్వం పై పోరు సలిపిన నిరసన రాగం. అతని ఆటా, పాటా, మాటా సమసమాజ ఊహల ఉత్తేజం. అణగారిన ప్రజల ఆత్మగౌరవంగా ప్రజా క్షేత్రంలో ప్రవహించినవాడు. స్వేచ్ఛ, సమత, సమానత్వ కనీస రాజ్యాంగ విలువల అమలు కోసం నినదించినవాడు. అంటరాని ప్రజల విముక్తి భక్తి గీతంగా ప్రజల్లో పరవశించినవాడు. గద్దర్ ఈ దేశ సాహిత్యం, సంస్కృతి, జీవితం, పోరాటం కలిసిపోయిన అరుదైన ప్రజాస్వామిక అవతారం. ఈ రోజు గద్దర్ని తలచుకోవడమంటే సామూహిక సామాజిక గాయాలకు ఉపశమన మందు రాసుకోవడమే.

గద్దర్ ఒక తాత్విక ప్రశ్న

గద్దర్ ఒక రాజకీయ తాత్విక ప్రశ్న. ఆధిపత్య వ్యవస్థకి, అన్యాయానికి వ్యతిరేక ఆలోచనలకి, ఉద్యమాలకు వ్యక్తీకరణగా గద్దర్ ఉన్నాడు. విప్లవ, దళిత, తెలంగాణా , స్త్రీల , సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలకు , సామాన్యుడి వ్యక్తిగత సమస్య అయినా, గద్దర్ అనే మాట ఒక నిండు ధైర్యంగా, నిలవేసే ప్రశ్నగా, నిరసన పాటగా ప్రజల్లో నిలబడి వున్నాడు. మార్క్సిజమైనా, అంబేద్కరిజమైనా తన ప్రాపంచిక దృక్పథంలో అంతర్లీనం చేసుకుని, ఆచరణాత్మకంగా దాన్ని ప్రజలకు అర్థమయ్యే పదాలతో సంభాషించగలిగిన రాజకీయ చతురుడు. తన పాటల ద్వారా రాజకీయాల్ని బోధించడమే గాక, ప్రజల్ని అందులో భాగస్వాములను చేసిన ఘనత గద్దర్ కి చెందుతుంది.

ప్రజా ఉద్యమాల కలయక

ప్రజలు అనేక సామాజిక వర్గాలుగా, పోరాటాలుగా చీలిన సందర్భంలో గద్దర్ వీటన్నిలో ఒకడుగా ఉండి, ఒక ఆచరణాత్మక కేంద్రంగా, సైద్ధాంతిక మధ్యవర్తిగా ఉద్యమాలను సంఘటితం చేయడంలో నిర్వహించిన చారిత్రిక పాత్రను మరవలేం.గద్దర్ పాటల్ని, ప్రదర్శనలను విముక్తి రాజకీయాలకి అతీతంగా చదవలేము. గద్దర్ ఒక చారిత్రక గమనం. ఈ దేశ చరిత్ర తిరిగిన ప్రతి మలుపు లో గద్దర్ ఉన్నాడు, అతని పాటల ప్రదర్శన ఉంది.

రాజకీయ – ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడు

భారతీయ రాజకీయ ఆర్థిక శాస్త్రాన్ని అలవోకగా తన పాటల్లో వినిపించేడు. ప్రధాన వైరుధ్యాలను గుర్తించి, ఆ వైరుధ్యాలు నుండి పుట్టే సమసమాజ పోరాటాలను తన గొంతులో పలికించాడు.

“భారతదేశం భాగ్యసీమరా… సకల సంపదలకు కొదవలేదురా.. మరి దరిద్రమెట్లా ఉందిరో నాయనా” అంటూ నిత్యం అలుపెరగక శ్రమిస్తున్న శ్రామికుల శ్రమకి తగ్గ ఫలాలు అందక, శ్రమ దోపిడీకి గురవుతున్న వైనాన్ని ఈ దేశ దోపిడీ చరిత్రను విప్పి చెప్పటమే గాక, ప్రజల్ని చైతన్య పరచడం. అలానే సాంకేతికంగా, ఆర్థికంగా దేశం మారిన ప్రతి సందర్భంలో, శ్రామికులు, చేతి వృత్తుల వాళ్ళు తాము తయారు చేసిన వస్తువులకు కూడా నోచుకోకమరింత పరాయీకరణకి గురవుతున్న వైనాన్ని కళ్ళకుగట్టేలా అనేక పాటల్లో ఆవిష్కరించి వాళ్ళకి దగ్గరయ్యాడు.

శ్రీ శ్రీ “అగ్గిపుల్లా, కుక్కపిల్లా, సబ్బుబిళ్ళ కాదేది కవిత కనర్హం” అంటే, అంటరాని తనానికి ప్రతీకలుగా వున్న చెత్త కుండీ, చెప్పులు, పాయకానా, ఫ్యాన్ లాంటి వాటిని సౌందర్యాత్మకంగా సృజించి వాటిని ప్రత్యామ్నాయ పోరాట ప్రతీకలుగా మలిచాడు. అంతేగాక, ఈ సృష్టి లో పనికిరానిదంటూ ఏమీ ఉండదని, ప్రతిదానికీ తనదయిన ప్రయోజనం ఉంటుందని చెబుతాడు.

ప్రజా సాంస్కృతిక జాతీయవాది

గద్దర్ నిజమైన జాతీయుడు. ఈ దేశ ప్రజా సంస్కృతిని, సాహిత్యాన్ని, ప్రజా జీవితాన్ని, వాళ్ళ త్యాగాన్ని ముద్దాడిన అసలైన జాతీయుడు. తెలంగాణా ప్రాంతీయతని ఆత్మగౌరవంగా కప్పుకుంటూ జాతీయ భావనకు దూరంకానివాడు. శ్రామిక భారతీయాన్ని ఆవాహన చేసుకున్నా, అంతర్జాతీయ దృష్టి కలిగిన కళాకారుడు. గద్దర్ జాతీయత ప్రజల శ్రమలో, సంస్కృతి లో, జీవన సొగసుల్లో మొగ్గ తొడిగింది. గుండెకి హత్తుకున్న దేశీయ ఆదివాసీయుల రేలా రేలా పాట నుండి అడుగడుగో అమెరికావోడు వస్తున్నాడు చూడు బాంబులతో, మార్కెట్ పాలసీలతో అంటూ సామ్రాజ్యవాద సంస్కృతిని, ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు జరిపేడు. జానపద ప్రజా సంగీతాన్ని వనరుగా తీసుకుని గద్దర్, ప్రపంచీకరణతో పరుచుకున్న సాంస్కృతిక విష సాంస్కృతిక కుట్రను తిప్పికొట్టే

ప్రజాపాటలనేకం అల్లేడు. “కయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంటి కొచ్చి” అంటూ, సామ్రాజ్యవాద సంస్కృతి మన ఇళ్ళలోకి చొరబడి మన శరీరాల్ని, బుద్ధిని శూన్యం చేస్తున్న వైనాన్ని పసిగట్టి, పెట్టుబడిదారి విధానం సామ్రాజ్యవాదంగా, చివరికి యుద్ధ ఉన్మాదంగా పరిణామం చెందే విధానం మీద ఎంతో స్పష్టతతో తన బృందంతో దేశమంతా పాటల ప్రదర్శన జరిపేడు.

నైతిక మత మార్గదర్శి

గద్దర్ నడిచిన దారి భక్తి కవుల ఆత్మ విముక్తి మార్గం. వీర శైవ బసవన్న వారసత్వం నుండి అంబేద్కర్ బౌద్ధం దాకా నడిచినవాడు. ఈ దారిలో అనేక మజిలీలలో వేమన, వీరబ్రహ్మం లాంటి వాళ్ళు ఎందరో. ఒక వైపు మత మూఢత్వంను, మతం పేర దోపిడీని విమర్శిస్తూ, మరో వైపు పేద ప్రజల విశ్వాసాల్ని గౌరవిస్తూ, అటువంటి భక్తి సందర్భాల్ని కూడా తన పాటల ద్వారా ఒక సామాజిక న్యాయ నిర్దేశంగానే, నిస్సహాయుల విముక్తి విశ్వాసంగా పాడి ప్రజల్ని జాగృత పరిచాడు.

మానవీయ గౌరవం కోసం

సాయుధ విప్లవ ఉద్యమాల నుండి పార్లమెంటరీ ప్రజాస్వామిక ఉద్యమాలలో మనిషిని మనిషిగా గుర్తించి గౌరవించే రాజకీయం ప్రథమ కర్తవ్యంగా ఉండాలని, ఆ ఆశయంతో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విలువలుగా వున్న రాజ్యాంగం మానవ హక్కుల పత్రంగా భావించి ఆ దిశలో తన ఉద్యమాన్ని నడిపే ప్రయత్నం చేశాడు.

ప్రపంచ ప్రజా గాయకుడు

గద్దర్ భావజాల పరంగా ఎంతో విస్తృతి గల మేధావి. విప్లవోద్యమం నుండి మానవ గౌరవ పోరాటాల వరకు తనలో పాటల్లో ఇముడ్చుకున్న వాడు. శ్రామికుడి అణిచివేత నుండి పోలీసోడి బాధ దాకా, జానపదుల జాతర నుండి అంతర్జాతీయ శ్రామిక సంఘటన దాకా పడటమే గాక, పాటని, కళా ప్రదర్శనను ప్రజాస్వామీకరించాడు. ప్రపంచంలోనే నిరసన గాయకుల సరసన నిలిచే ప్రముఖుడిగా గద్దర్ ఉన్నాడు. పాల్ రాబ్సన్, బాబ్ మార్లే , బాబ్ డిల్లాన్ , విక్టర్ జారా , ఫెలా కూటి లాంటి ప్రపంచ గాయకుల బృందంలో గద్దర్ కి ప్రత్యేక స్థానం ఉంది.

వీరంతా వలస వాదానికి, జాత్యహంకారానికి , సామ్రాజ్యవాదానికి, యుద్ధానికి వ్యతిరేకంగా మానవ హక్కులు, సమానత్వం,సామాజిక న్యాయం , శాంతి కోసం గొంతెత్తిన, నిరంకుశ ప్రభుత్వాలకు తమ నిరసన తెలిపిన మహా సాంస్కృతిక విద్వాంసులు.

ప్రజా తాత్విక కవి గాయకుడు

గద్దర్ విప్లవోద్యమాలకి పాటలు సాయం చేసే కళాకారుడిగా , ప్రజల్ని సమ్మోహ పరచే ప్రదర్శనకారుడిగా మాత్రమే లేడు . ఒక ప్రజా మేధావిగా, తాత్వికుడిగా, ప్రదర్శనా కవిగా, ప్రజా పోరాట నాయకుడిగా, ఒక విప్లవ నైతిక సాధకుడిగా, ఈ దేశ ప్రత్యామ్నాయ సాహిత్య సారథిగా, ప్రజాస్వామ్య సాంస్కృతిక జాతీయతావాదిగా, ఒక ప్రపంచ నిరసన గాయకుల నాయకుడిగా, ప్రజల్ని సంఘటిత చైతన్యానికి గుర్తుగా ఈ నిరంకుశత్వ కాలంలో గద్దర్ మానవీయ దేశ భవిష్యత్తు భరోసాగా ఉంటాడు.

ప్రత్యామ్నాయ సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలపట్ల ఆసక్తి. తత్వశాస్త్ర అధ్యాపకుడు. "దళిత ఉద్యమం, వెలుగునీడలు" (వ్యాససంపుటి), "పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ అంబేద్కర్," థీయరిటికల్ అండర్ స్టాండింగ్ ఆఫ్ దళిత్ మూవుమెంట్" రచయిత. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తుంటాడు.

Leave a Reply