ద్వేషం, భయం, హింస, ఆధిపత్యం పునాదిగా సమాజాన్ని నియంత్రించాలని వందేళ్లుగా కలలు కంటున్న “విద్వేషపు గురువు” కండ్లల్లో భయాన్ని ప్రపంచానికి చూపించిన జెన్-జీ తరానికి ఉద్యమాభివందనాలు.
ప్రజల గొంతుకను అణచివేసి, అధికార కథనాలనే ‘వాస్తవం’గా ప్రచారం చేయాలనుకున్న పెట్టుబడి మీడియా (వీళ్లను “ప్రధాన స్రవంతి” మీడియా అని పిలవడం మానుకోవాలేమో!) కుట్రలను బద్దలు కొట్టి ప్రతిఘటనా పోరాట వార్తలను ప్రపంచ ప్రజల అరిచేతుల్లోకి తీసుకొచ్చిన సోషల్ మీడియాకు కృతజ్ఞతలు.
పోరాట తరమెల్లి పోతున్నదని, పోరాట మార్గాలు మూసుకుపోతున్నాయని నిరాశ పడేవాళ్లకు జెన్-జీ తరం ఒక కొత్త ఆశగా ముందుకొచ్చింది. అయితే ఇది కేవలం ఒక క్షణిక ప్రతిస్పందనా? కొత్త రాజకీయ-సామాజిక అధ్యాయానికి నాందియా? లేక చరిత్ర పొడవునా కొనసాగిన, కొనసాగుతున్న ప్రజా ఉద్యమాల క్రమంలో మరో ముఖ్య ఘట్టమా? అన్న ప్రశ్నలను మరింత లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
ఒక తరం మొత్తాన్ని ఒక రాజకీయ శక్తిగా, ఒక సామాజిక యూనిట్‌గా చూడటం కొత్తేమీ కాదు. ప్రతి తరానికీ తనదైన స్వరూపం, తనదైన రాజకీయ-సాంస్కృతిక ముద్ర ఉంటుంది. ఎందుకంటే తరం అనేది కేవలం ఒకే వయసు గల వ్యక్తుల సమూహం కాదు. అది ఒక నిర్దిష్ట చారిత్రక, , సామాజిక, రాజకీయ, సాంకేతిక సందర్భంలో జీవించడం వల్ల ఏర్పడే సామూహిక అనుభవం.
అయితే జీవించడం అంటే కాలాన్ని ఎలాగో అలా దాటేయడం కాదు. ఆ కాలం విసిరే అవకాశాలు, సవాళ్లు, భయాలు, ఆశలు, ఆకాంక్షలు, ఆధిపత్య ధోరణులు, అణచివేతలు, సంక్షోభాలను అనుభవించడం, వాటికి స్పందించడం, అవసరమైనప్పుడు ప్రతిఘటించడం. ఈ అనుభవాలన్నీ కలిసి ఒక తరం యొక్క సామూహిక చైతన్యాన్ని నిర్మిస్తాయి.
అందుకే ఇవాళ ‘జెన్-జీ’ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం కేవలం ఒక వయసు వర్గాన్ని గురించి మాట్లాడటం లేదు. ఒక ప్రత్యేక చారిత్రక పరిస్థితిని గురించి మాట్లాడుతున్నాం. ఈ కాలపు సామాజిక మూడ్‌ను, ఈ కాలం నాడిని గురించి మాట్లాడుతున్నాం. అంతేకాదు, తనకంటే ముందున్న తరాల పోరాట వారసత్వం నుంచి ఈ తరం ఏమి స్వీకరించిందో, తన తర్వాతి తరాలకు ఎలాంటి రాజకీయ-సామాజిక సందేశాన్ని అందించబోతుందో కూడా చర్చించాల్సి ఉంది.
ఒక విధంగా జెన్-జీ లను అర్థం చేసుకోవడమంటే గతం మిగిల్చిన పాఠాలతో వర్తమానాన్ని అర్థం చేసుకుంటూ, భవిష్యత్తు ఇంకా పూర్తిగా కోల్పోలేదనే నమ్మకాన్ని పునర్నిర్మించుకోవడమే.
Baby Boomers, Gen X, Millennials, Gen Z వంటి సామాజిక వర్గీకరణలు ప్రధానంగా అమెరికాలో జనాభా శాస్త్రవేత్తలు, మార్కెటింగ్ పరిశోధకులు, జర్నలిస్టులు ఉపయోగించిన పేర్లు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో జననాల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో ఆ కాలంలో జన్మించిన వారిని Baby Boomers అని పిలవడం ప్రారంభమైంది. తరువాత Gen X, Millennials, Gen Z వంటి పేర్లు కూడా వరుసగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ వర్గీకరణల అసలు ఉద్దేశ్యం రాజకీయ విశ్లేషణ కాదు. కంపెనీలు తమ ఉత్పత్తులను ఎవరికీ ఎలా అమ్ముకోవాలి, యజమానులు తమ ఉద్యోగులను ఎలా నియంత్రించాలి, ప్రకటనదారులు ఏ వయసు సమూహాన్ని ఎలా చేరుకోవాలి వంటి ప్రశ్నలకు సమాధానంగా ఈ విభజనలు అభివృద్ధి చెందాయి. తరువాత సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులు కూడా వీటిని స్వీకరించి, తరాల మధ్య విలువలు, అభిరుచులు, రాజకీయ దృక్పథాల్లో కనిపించే మార్పులను అధ్యయనం చేయడానికి ఉపయోగించడం ప్రారంభించారు.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన జాగ్రత్త అవసరం. ఈ తరాల వర్గీకరణలు ప్రధానంగా అమెరికా చారిత్రక అనుభవాన్ని ఆధారంగా చేసుకుని రూపొందినవి కాబట్టి వాటిని యథాతథంగా భారతదేశం వంటి సమాజాలకు వర్తింపజేయడం కొంత సమస్యాత్మకమే. భారతదేశంలో కులం, వర్గం, లింగ అసమానతలు, ప్రాంతం, భాష, గ్రామీణ-పట్టణ విభజన వంటి అంశాలు ప్రజల జీవితాలను చాలా లోతుగా ప్రభావితం చేస్తాయి. ఒకే సంవత్సరంలో జన్మించిన ఇద్దరు వ్యక్తులు వారి సామాజిక, ఆర్థిక పునాది ఆధారంగా పూర్తిగా భిన్నమైన సామాజిక, రాజకీయ అనుభవాలను కలిగి ఉండవచ్చు.
అయినప్పటికీ, ఈ వర్గీకరణలను పూర్తిగా తిరస్కరించాల్సిన అవసరం లేదు. ఒక నిర్దిష్ట కాలంలో యువత ఎలాంటి రాజకీయ వాతావరణంలో పెరిగింది, ఎలాంటి సంఘటనలు వారిని ప్రభావితం చేశాయి, వారు సమాజాన్ని ఏ కోణంలో చూశారు అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఇవి ఉపయోగపడుతాయి. అందువల్ల Baby Boomers, Gen X, Millennials, Gen Z వంటి పదాలను ఖచ్చితమైన సామాజిక వాస్తవాలుగా కాకుండా, ఒక తరం యొక్క చారిత్రక అనుభవాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే విస్తృత ఫ్రేమ్‌వర్క్‌గా చూడటం అవసరం.
ప్రపంచవ్యాప్తంగా గత వందేళ్ల విద్యార్థి ఉద్యమాల చరిత్రను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి తరం తన కాలంలోని ప్రధాన వైరుధ్యాన్ని గుర్తించింది. దానిని రాజకీయ ప్రశ్నగా మార్చింది. దాని చుట్టూ కొత్త పోరాటాలను నిర్మించింది. తరం తరానికి కాలాలు మారాయి. ప్రజా ప్రత్యర్థులు మారారు. పోరాట పద్ధతులు మారాయి. కానీ ఒక విషయం మాత్రం మారలేదు: సమాజాన్ని మరింత న్యాయబద్ధంగా, మరింత ప్రజాస్వామ్యంగా మార్చాలనే ఆకాంక్ష.
అందుకే విద్యార్థి ఉద్యమాల చరిత్రను కేవలం విద్యాసంస్థల చరిత్రగా చదవలేం. అది సమాజం తన గురించి తాను వేసుకున్న ప్రశ్నల చరిత్ర. ఒక తరం తన కాలపు ఆధిపత్యాన్ని ఎలా అర్థం చేసుకుంది? దానికి ఎలా ప్రతిఘటించింది? భవిష్యత్తు గురించి ఎలాంటి కలలు కనింది? అనే ప్రశ్నలకు సమాధానాల చరిత్ర.
ఇరవయ్యవ శతాబ్దపు తొలి భాగాన్ని వలసవాదం నిర్వచించింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని అనేక సమాజాలు విదేశీ ఆధిపత్యం కింద జీవించాయి. రాజకీయ స్వేచ్ఛ లేదు. ఆర్థిక స్వయం నిర్ణయాధికారం లేదు. జాతీయ గౌరవం లేదు. ఈ నేపథ్యంలో యువత ముందుగా ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తింది: దేశంపై అధికారం ఎవరిది? వారి సమాధానం కూడా అంతే స్పష్టంగా ఉంది. ‘దేశం వలస పాలకులది కాదు. మా నేల బిడ్డలది.’ ఈ తరం రాజకీయ అధికారానికి ప్రజలే మూలమనే భావనను ప్రపంచవ్యాప్తంగా బలపరిచింది.
భారతదేశంలో ఈ తరం జాతీయోద్యమానికి వెన్నెముకగా నిలిచింది. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. విద్యాసంస్థలను బహిష్కరించారు. జైలు శిక్షలను ఎదుర్కొన్నారు. భగత్‌సింగ్ వంటి విప్లవకారులు స్వాతంత్ర్యాన్ని కేవలం రాజకీయ లక్ష్యంగా కాకుండా సామాజిక విముక్తి మార్గంగా అర్థం చేసుకున్నారు. ఈ తరం ప్రపంచానికి అందించిన గొప్ప రాజకీయ విలువ: స్వేచ్ఛ.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జన్మించిన వాళ్లను బేబీ బూమర్ తరంగా (1946–1964) పిలుస్తారు. ఈ తరం ఒక భిన్న ప్రపంచంలో పెరిగింది. చాలా దేశాలు స్వాతంత్ర్యం సాధించాయి. కానీ “స్వేచ్ఛ” వచ్చినంత మాత్రాన ఆధిపత్యం అంతరించిపోలేదని ఈ తరం గుర్తించింది.
1968 ఫ్రాన్స్ విద్యార్థి తిరుగుబాట్లు, వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు, అమెరికా పౌరహక్కుల ఉద్యమం, స్త్రీవాద ఉద్యమాలు ఈ తరాన్ని నిర్వచించాయి. వీరు అధికారాన్ని, ఆధిపత్యాన్ని కేవలం ప్రభుత్వంలో మాత్రమే చూడలేదు. అది కుటుంబంలో, తరగతి గదుల్లో, లింగ సంబంధాల్లో, సంస్కృతిలో వివిధ రూపాలలో ఎట్లా పనిచేస్తుందో, దానిని ఎట్లా ఎదిరించాలో ఆలోచించారు. ఎదిరించారు.
అందుకే వాళ్లు “వ్యక్తిగతం రాజకీయమే” (Personal is Political) అని ప్రకటించారు. ఈ ఒక్క వాక్యం రాజకీయాల పరిధిని పూర్తిగా విస్తరించింది. మనిషి వ్యక్తిగత జీవితం కూడా అధికార సంబంధాలు, సామాజిక ఆధిపత్యాలు, రాజకీయ నిర్మాణాల ప్రభావంలోనే ఉంటుందని ఈ తరం చూపించింది.
అంతేకాదు, 1960లలో ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు విశ్వవిద్యాలయాల గోడలను దాటి యుద్ధం, సామ్రాజ్యవాదం, పితృస్వామ్యం, జాత్యహంకారం వంటి ప్రశ్నలను లేవనెత్తారు. అదే సమయంలో అన్యాయం, దోపిడీ, పీడనల సందర్భంలో నిశ్శబ్దంగా ఉండటం కూడా వాటికి సమ్మతి ప్రకటించడమే అని నినదించారు. “తటస్థత” అనేది చాలా సందర్భాల్లో యథాతథ స్థితికి, ఆధిపత్య శక్తులకు మద్దతుగా నిలబడటానికి మరో పేరని ప్రకటించారు.
కొనసాగుతున్న వ్యవస్థే అంతిమం కాదని, దానికి ప్రత్యామ్నాయాలను ఊహించడం కూడా ఒక రాజకీయ చర్యేనని చెప్పారు. అందుకే 1968 తరం మనకు కేవలం కొన్ని నినాదాలను కాదు; ప్రశ్నించడం, కలలు కనడం, ప్రతిఘటించడం, ప్రత్యామ్నాయాలను సృష్టించడం అనే రాజకీయ సంస్కృతిని వారసత్వంగా అందించింది. ప్రతి తరం తన కాలంలోని కీలక వైరుధ్యాన్ని ఎదుర్కొని కొత్త భాషను సృష్టించినట్లే, ఆ తరం ‘అన్యాయాన్ని అంగీకరించకు, ప్రతిఘటనను నిత్యజీవితంలో భాగంగా మార్చుకో’ అనే సామాజిక చలన సూత్రాన్ని ప్రకటించింది.
1960ల చివరలో నక్సల్బరీ ఉద్యమం, శ్రీకాకుళ రైతాంగ పోరాటం భారత రాజకీయ వ్యవస్థలో ఒక విభజన రేఖను గీశాయి. పాలకవర్గ ఆధిపత్యం, భూ సంస్కరణల వైఫల్యం, కొనసాగుతున్న కుల-వర్గ అణచివేతల నేపథ్యంలో ఈ పోరాటాలు దళితులు, గిరిజనులు, భూమిలేని రైతులు మాత్రమే కాకుండా విద్యార్థులు, యువతను కూడా విప్లవ రాజకీయాల వైపు ఆకర్షించాయి. సామాజిక న్యాయం కేవలం ఎన్నికలు, పార్లమెంటరీ రాజకీయాల ద్వారా సాధ్యం కాదని, అణగారిన వర్గాల ప్రత్యక్ష పోరాటాల ద్వారానే సాధ్యమని ఇవి ప్రతిపాదించాయి. ఇవి పార్లమెంటరీ రాజకీయ భ్రమలను బహిర్గతం చేస్తూ, కులం, వర్గం, భూమి హక్కులు, వ్యవస్థీకృత రాజ్య హింస వంటి ప్రశ్నలను భారత రాజకీయ చర్చలలో కీలకం చేయగలిగాయి. ఈ తరం ప్రపంచానికి ఇచ్చిన వారసత్వం: సమన్యాయం జరగంత వరకు ప్రతిఘటన ఒక హక్కు మాత్రమే కాదు, ప్రజల బాధ్యత కూడా.
Gen X తరం (1965–1980) ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి, ప్రజాస్వామ్య సంక్షోభాలు, సామాజిక పునర్వ్యవస్థీకరణల మధ్య ఎదిగింది. ఒకవైపు లాటిన్ అమెరికాలో సైనిక నియంతృత్వాలు, దక్షిణాఫ్రికాలో అపార్థైడ్, మరోవైపు ప్రచ్చన్నయుద్ధం ముగింపు ప్రపంచ రాజకీయాలను కొత్త దశలోకి నెట్టింది. ఈ తరం అధికారాన్ని కూల్చడం కంటే, అధికారాన్ని జవాబుదారీగా మార్చడంపై ఎక్కువ దృష్టి పెట్టింది. అందుకే ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, పౌర స్వేచ్ఛలు, రాజ్యాంగబద్ధత, సామాజిక ప్రాతినిధ్యం వంటి అంశాలు వీరి రాజకీయ చైతన్యానికి కేంద్రంగా మారాయి. వీరు అడిగిన ప్రధాన ప్రశ్న: “సమాన అవకాశాలు లేని సమాజంలో ప్రజాస్వామ్యం ఎంతవరకు అర్థవంతం?” ఎన్నికలు ఉండటం మాత్రమే ప్రజాస్వామ్యం కాదని, అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం, గౌరవం, అవకాశాలు లభించినప్పుడే ప్రజాస్వామ్యం అర్థముంటుంది అని ఈ తరం వాదించింది.
భారతదేశంలో ఈ తరం ప్రజాస్వామ్యంలోని కీలక వైరుధ్యాలు ఒక్కసారిగా బహిర్గతమైన కాలాన్ని అనుభవించింది. మండల్ కమిషన్ సిఫారసుల అమలు, సామాజిక న్యాయం, ప్రాతినిధ్యం, రిజర్వేషన్ల ప్రశ్నను జాతీయ చర్చగా మార్చింది. మరోవైపు బాబ్రీ మసీదు విధ్వంసం లౌకికవాదం, మత రాజకీయాలు వంటి ప్రశ్నలను ముందుకు తెచ్చింది. ఇదే కాలంలో ఆర్థిక సరళీకరణలకు రంగం సిద్దం కావడంతో మార్కెట్, రాజ్యం, ప్రజాస్వామ్యం మధ్య సంబంధాలను ఈ తరం కొత్తగా నిర్వచించింది. మొత్తంగా ఈ తరం రాజకీయ అనుభవం కేవలం పాలకులు వర్సెస్ ప్రజలు అనే వైరుధ్యానికి పరిమితం కాలేదు. సామాజిక న్యాయం వర్సెస్ మెరిట్, లౌకికవాదం వర్సెస్ మత జాతీయవాదం, సంక్షేమ రాజ్యం వర్సెస్ మార్కెట్ సంస్కరణలు వంటి సంక్లిష్ట వైరుధ్యాల మధ్య రూపుదిద్దుకుంది. అందుకే Gen X తరం యొక్క చారిత్రక పాత్ర ప్రజాస్వామ్యాన్ని కేవలం ఒక రాజకీయ వ్యవస్థగా కాకుండా, ప్రాతినిధ్యం, హక్కులు, సామాజిక న్యాయానికి సంబంధించిన నిరంతర పోరాటంగా నిర్వచించడంలో ఉంది.
ఇక ప్రపంచీకరణ యుగంలో రాజకీయంగా రూపుదిద్దుకున్న తొలి తరం మిలీనియల్స్ (1981–1996). ఇంటర్నెట్ విస్తరణను వీళ్ళు ప్రత్యక్షంగా చూశారు. డిజిటల్ కమ్యూనికేషన్, గ్లోబల్ మార్కెట్లు, అంతర్జాతీయ వలసలు, సమాచార విప్లవం తెచ్చిన కొత్త అవకాశాలను, ఇబ్బందులను అనుభవించారు. అయితే ఇదే కాలంలో ఆదాయ అసమానతలు పెరిగాయి. ఉపాధి భద్రత తగ్గింది. విద్య క్రమంగా ఒక హక్కు నుంచి మార్కెట్ సరుకుగా మారడం ప్రారంభమైంది. ఫలితంగా ఈ తరం ప్రపంచీకరణను కేవలం పురోగతి కథగా కాకుండా, వైరుధ్యాలతో కూడిన అనుభవంగా చూసింది.
అందుకే ఈ తరం వేసే ప్రధాన ప్రశ్నలు: “ఆర్థిక అభివృద్ధి ఎవరి కోసం?” సంపద పెరుగుతుంటే అసమానతలు ఎందుకు పెరుగుతున్నాయి? ఉత్పాదకత పెరిగినా ఉద్యోగ భద్రత ఎందుకు తగ్గుతోంది? అభివృద్ధి ఫలాలు ఎందుకు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్నాయి? ముఖ్యంగా 2008 ఆర్థిక మాంద్యం తర్వాత ఈ ప్రశ్నలు మరింత పదునెక్కాయి. అందుకే “Occupy Wall Street” ఉద్యమం ద్వారా వినిపించిన “మేమే 99 శాతం” అనే నినాదం కేవలం ఒక నిరసన నినాదంగా కాకుండా, ఆర్థిక అసమానతలపై ఒక తరం యొక్క రాజకీయ ప్రకటనగా నిలిచింది. ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల వ్యవస్థ మాత్రమే కాదని, ఆర్థిక అవకాశాలు సమానంగా పంపిణీ జరగకపోతే ఆ ప్రజాస్వామ్యం అసంపూర్ణమని ఈ తరం వాదించింది.
భారతదేశంలో మిలీనియల్స్ “ఇండియా షైనింగ్”, ఆర్థిక వృద్ధి, ఐటీ విప్లవం, మధ్యతరగతి విస్తరణ వంటి ఆశావాద కథనాల (భ్రమల) మధ్య పెరిగారు. అదే సమయంలో నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, ఉన్నత విద్య ఖర్చుల పెరుగుదల, ప్రాంతీయ, సామాజిక అసమానతలను కూడా ప్రత్యక్షంగా అనుభవించారు. ప్రజాస్వామ్యాన్ని కేవలం రాజకీయ హక్కుల ప్రశ్నగా కాకుండా, సామాజిక, ఆర్థిక న్యాయం ప్రశ్నగా ఈ తరం నిలబెట్టింది.
1997–2012 మధ్య జన్మించిన Gen Z లు ఇంటర్నెట్, సోషల్ మీడియా, ప్రపంచీకరణ, ఆర్థిక అస్థిరత, వాతావరణ సంక్షోభం వంటి పరిణామాల మధ్య పెరిగింది. అందువల్ల ఈ తరం సమాజాన్ని ఒక స్థిరమైన వ్యవస్థగా కాకుండా, నిరంతరం ప్రశ్నించాల్సిన, సవరించాల్సిన, న్యాయబద్ధంగా మార్చాల్సినదిగా చూస్తుంది. అయితే వీళ్ళను మిగతా సమాజం సీరియస్‌గా తీసుకోరు. వీళ్ళను “మొబైల్ పిల్లలు,” “రీల్స్ జనరేషన్,” “అటెన్షన్ స్పాన్ లేని తరం,” “సామాజిక భాద్యత లేని తరం” అనే భావిస్తారు. వాళ్ళ ఆలోచనలను కొట్టిపారేస్తారు. అయితే వీరి దృష్టిలో రాజకీయాలు కేవలం ఎన్నికలు, పార్టీలు, ప్రభుత్వాలతో మాత్రమే సంబంధం కలిగినవి కావు. గుర్తింపు, భద్రత, గౌరవం, ప్రాతినిధ్యం, లింగ సమానత్వం, పర్యావరణ న్యాయం, భౌతిక, మానసిక ఆరోగ్యం వంటి అంశాలు కూడా రాజకీయ ప్రశ్నలే.
భారతదేశ సందర్భంలో Gen Z ల అనుభవం మరింత సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ తరం ఒకేసారి రెండు ప్రపంచాల్లో జీవిస్తోంది. ఒకవైపు ఇంటర్నెట్, సోషల్ మీడియా, ప్రపంచీకరణ ద్వారా ప్రపంచంతో అనుసంధానమై ఉంటుంది. మరోవైపు కులం, మతం, ప్రాంతం, భాష, లింగం వంటి చారిత్రక అసమానతలతో నిండి ఉన్న భారతీయ సామాజిక వాస్తవికతలో బతుకుతోంది. అందుకే వీరి రాజకీయ ఆలోచనల్లో ప్రపంచవ్యాప్త విలువలు, స్థానిక అనుభవాలు రెండూ కలిసి కనిపిస్తాయి.
వీరి రాజకీయ ఊహలలో, వ్యక్తీకరణలలో గౌరవం లేని స్వేచ్ఛ, అస్తిత్వం లేని సమానత్వం, ప్రజా ప్రాతినిద్యం లేని ప్రజాస్వామ్యం అసంపూర్ణం. అందుకే ఈ కొత్త తరం భాషా, భావాలు అర్థం చేసుకోవడంలో పాలకులే కాదు మొత్తం సమాజం వెనుకబడి ఉంది. వాళ్ళతో ఎట్లా, ఏమి మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే వాళ్ళ రాజకీయాలను, పోరాట పఠిమను అంచనా వెయ్యడం కష్టంగా మారింది.
నేటి ఉద్యమ సందర్భంలో పరీక్షా లీకులు, నిరుద్యోగం, భవిష్యత్తుపై అనిశ్చితి, అధికార నిర్లక్ష్యం వంటి భావనలు ముందుగా సోషల్ మీడియాలో మీమ్‌లు, జోకులు, పోస్టుల రూపంలో తిరిగాయి. తర్వాత అవే వీధుల్లోకి వచ్చి సామూహిక ఆందోళనలుగా మారాయి.
వీళ్ళు ఒకవైపు రాజ్యశక్తులతో ప్రత్యక్షంగా తలపడుతూనే, మరోవైపు తమ చేతుల్లోని డిజిటల్ పరికరాలను రాజకీయ ఆయుధాలుగా మార్చుకున్నారు. వ్యంగ్యం మీమ్‌గా మారింది. ఎద్దేవా రీల్‌గా మారింది. అసంతృప్తి స్క్రీన్‌షాట్‌గా మారింది. ఒకప్పుడు గుసగుసగా ఉన్న మాట ఇప్పుడు వైరల్ అయ్యి లక్షల మందికి చేరుతోంది. కేవలం జంతర్ మంతర్‌లోనే కాదు, దేశమంతటా యువత తమ నిరసనలను, ఆకాంక్షలను, ఆవేదనలను అత్యంత సృజనాత్మకంగా వ్యక్తపరుస్తోంది.
యువత కొత్త రాజకీయ భాషను సృష్టిస్తుంటే, అధికార అనుకూల శక్తులు మాత్రం పాత కథలనే మళ్లీ మళ్లీ చెబుతున్నాయి. నిరసనకారులు నిజమైన విద్యార్థులు కారట. వాళ్లు అసాంఘిక శక్తులట. వాళ్ల వెనుక విదేశీ కుట్రలట. వాస్తవానికి ఈ ఆరోపణలు ఇప్పుడు కొత్తవి కాదు. దాదాపు ప్రతి ప్రజా నిరసన ఎదుర్కొనే ప్రచార వ్యూహాలుగా మారిపోయాయి.
కాషాయ రాజకీయాలకు కడుపు నొచ్చినా విదేశీ కుట్రే, కాలకృత్యాలు తీరకపోయినా దేశద్రోహమే. వాళ్ళకు ఈ ఆరోపణలు చేయడం ఒక వ్యసనంగా మారిపోయింది. కానీ ఈ వాదనలు వినేవాళ్లు క్రమంగా తగ్గుతున్నారు. ఎందుకంటే ప్రజల జీవితాల్లోని వాస్తవాలను ఏ ప్రచారం కూడా పూర్తిగా చెరిపేయలేదు.
నిరసనకారులపై తీవ్ర హింసను ప్రయోగించి, అదే రాత్రి సోషల్ మీడియాలో “ఫ్రాండ్స్” అంటూ స్నేహపూర్వక సందేశాలు పంపితే సమస్య ముగిసిపోతుందని భావించడం అధికార అహంకారానికి నిదర్శనం. నిరసన జంతర్ మంతర్‌కు మాత్రమే పరిమితమై ఉంటే పాలకులు అంతగా ఆందోళన చెందేవాళ్ళు కాదు. కానీ అది సమాజపు నలుమూలలకు చేరుతుందని, అది కేవలం ఒక నిరసన కాకుండా ఒక సామాజిక, మానసిక స్థితిగా మారుతోందని వాళ్లకు అర్థమైంది. అందుకే స్నేహపూర్వక పలకరింపుల కుట్ర మొదలు పెట్టిండ్రు.
అయితే ఈ విద్యార్థి ఉద్యమాలను కేవలం పరీక్షల అవకతవకలపై లేదా విద్యా విధానంపై వచ్చిన ఆగ్రహంగా మాత్రమే చూడలేం. ఇది మరింత లోతైన అసంతృప్తి వ్యక్తీకరణ. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఉద్యమం రేపు ఆగిపోవచ్చు. రోడ్లు ఖాళీ కావచ్చు. బ్యానర్లు మాయమవచ్చు. కానీ ఈ తరం ప్రభావితం చేస్తున్న సమాజం ఇక నిన్నటిలా ఉండకపోవచ్చు. అదే ఈ క్షణంలో అత్యంత ఆశాజనకమైన విషయం.
అందుకే ఇది “జంగ్ సైరన్.” అయితే ఇదేమి యుద్ధ పిలుపు కాదు. కాని ఒక హెచ్చరిక. జనంలో ఏదో కదులుతోందన్న హెచ్చరిక. మౌనం పగులుతోందన్న హెచ్చరిక. భయం శాశ్వతం కాదన్న హెచ్చరిక. అధికారం కేవలం మతంతోనో, మత్తుతోనో, భయంతోనే శాశ్వతంగా నిలవలేదన్న హెచ్చరిక.
చరిత్రలో ప్రతి మార్పు మొదట పిడికెడు మంది గుసగుసగానే మొదలవుతుంది. కానీ కొన్నిసార్లు ఆ గుసగుసలు సైరన్‌లుగా మారుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నది అలాంటి క్షణమే. ఒక అహంకారి అవమానంగా విసిరిన పదాన్ని, ఈ తరం తన రాజకీయ గుర్తింపుగా మార్చుకుంది. అవమానంగా పిలవబడిన బొద్దింకలు ఇప్పుడు దేశ ముఖచిత్రంపైకి గర్వంగా ఎగబాకుతున్నాయి. ఆశనే తమ పతాకంగా ఎగరేస్తున్నాయి. ఈ పరిణామాన్ని ఆహ్వానిద్దాం. రేపటి తరానికి అండగా ఉందాం.