కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో

ఇది- ఉద్యమాలు, పోరాటాల కంచుకోట ఉస్మానియా యూనివర్సిటీకి విప్లవాన్ని పరిచయం చేసిన విద్యార్థి కథ. మతోన్మాదుల ఆగడాలపై కాగడాలా రగిలిన విద్యార్థి నాయకుని కథ. కత్తిపోట్లకూ వెరవని ధీరుని కథ. నమ్మిన విశ్వాసం, లక్ష్యాల కోసం ప్రాణమిచ్చిన సాహసి కథ. అతడే కామ్రేడ్ జార్జి రెడ్డి. 1947లో తల్లి లీలా వర్గీస్ (కేరళ ), తండ్రి రఘునాథ రెడ్డి (ఆంధ్రప్రదేశ్) దంపతులకు కేరళలో పుట్టాడు. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిచేశాడు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్ కి వచ్చి, హిమాయత్ నగర్ లో ఇంటర్మీడియట్, బషీర్ బాగ్ లోని నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచే ప్రశ్నించే తత్వం, తిరుగుబాటు బాటలో నడిచాడు. సమయాన్ని వృథా చేసుకోకుండా నిరంతరం ఏదో ఒక పుస్తకాన్ని చదువుతూ జ్ఞానాన్ని సంపాదించాడు. అది శాస్త్రీయమైన జ్ఞానం. జార్జ్ కేవలం శాస్త్రీయ సామాన్య శాస్త్రాలే కాక సామాజిక శాస్త్రాలలో, సామాజిక అంశాలలో బాగా జ్ఞానవంతుడు. అతడు నడిచే గ్రంథాలయం.

చరిత్రలో కీలక పాత్ర పోషించిన ప్రపంచంలో అనేక దేశాల ఉద్యమాలు, విప్లవాలు జార్జ్ ని బాగా ప్రభావితం చేశాయి. ప్రపంచానికి కమ్యూనిజాన్ని పరిచయం చేసిన కారల్ మార్క్స్ సిద్ధాంతం బాగా ప్రభావితం చేసింది. అలా కమ్యూనిజం గురించి తెలుసుకొని ప్రపంచ ఉద్యమాలను విశ్లేషించాడు. రష్యాలో లెనిన్ నాయకత్వంలో విజయవంతమైన విప్లవాన్ని జార్జ్ బాగా అవగాహన చేసుకున్నాడు. అలాగే హిట్లర్ ఫాసిజానికి వ్యతిరేకంగా స్టాలిన్ నిలబడ్డతీరు , చైనాలో మావో జడాంగ్ నాయకత్వంలో విజయవంతమైన విప్లవం, లాటిన్ అమెరికాలోని క్యూబాలో అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేగువేరా, ఫిడల్ కాస్ట్రో పోరాటం, వియత్నం పోరాటాల గురించి లోతుగా అధ్యయనం చేశాడు. అట్లాగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, గోదావరి లోయ ఉద్యమం, శ్రీకాకుళం పోరాటం, నక్సల్ బరి ఉద్యమం జార్జిని బాగా ప్రభావితం చేశాయి. విద్యార్థి దశనుండే జార్జ్ సమాజాన్ని అర్థం చేసుకున్నాడు. విశ్లేషించాడు. ఈ విప్లవాల వెలుగులో జీవితాన్ని సమాజం కోసం అర్పించడానికి సిద్ధమయ్యాడు.

అవి ఆయన పీజీ చదువుతున్న రోజులు. ఉస్మానియా యూనివర్సిటీలో భౌతికశాస్ర్తం చదువుతున్నాడు. భౌతిక శాస్త్రంలో లోతైన అధ్యయనం చేశాడు. భౌతిక శాస్త్రంలో జార్జ్ దే మొదటి స్థానం. ఏదో ఒకటి నేర్చుకోవాలని విద్యార్థులంతా జార్జి వెంటే వుండేవాళ్లు. ఆయనకు ఎన్నో యూనివర్సిటీల నుంచి పిలుపు వచ్చింది. కానీ ఇక్కడ ఉన్న సమస్యలపై పోరాడి విద్యార్థులలో చైతన్యం కలిగించాలనే లక్ష్యంతో ఇక్కడే ఉండిపోయాడు జార్జ్. అనుక్షణం సీనియర్లు చేసే ర్యాగింగ్ కి వ్యతిరేకంగా నిలబడి స్నేహితులను రక్షించేవాడు. ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటిలో ఎక్కడచూసినా అరాచకం దౌర్జన్యం రాజ్యమేలేవి. ఈ పరిస్థతి జార్జ్ ని కలవరపెట్టింది. ఆయన తెలంగాణ ప్రాంతీయుడు కాకపోవడంతో కొంత అవమానం, అసమానతలు ఎదుర్కొన్నాడు. మరోవైపు ఆయన ఒక క్రిస్టియన్ కాబట్టి కొంతమంది మతోన్మాదులతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా ఇంత దౌర్జన్యమా అని, వాటికి వ్యతిరేకంగా నిలబడాలని సమరానికి పూనుకున్నాడు.

అప్పుడు క్యాంపస్లో రెండు విద్యార్థి సంఘాలు ఉండేవి. ఒకటి అధికారి పార్టీ అనుబంధం అయిన NSUI, ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం అయిన ABVP రెండు క్యాంపస్లో ఎప్పుడూ ఏదో ఒక దౌర్జన్యం చేస్తూ ఉండేవి. మహిళలను ఏడిపించడం, జూనియర్లను ర్యాగింగ్ చేయడం, క్యాంటీన్ మెస్ లలో వివక్ష చూపెట్టడం లాంటివి చేసేవి. NSUI అధికార మదంతో ఉండేది. ABVP కార్యకర్తలు మతోన్మాదంతో ఎల్లప్పుడూ క్యాంపస్ లో కల్లోలాలు సృష్టించేవి. ఇవన్నీ మంచివి కావని గ్రహించిన జార్జ్ సరికొత్తగా విద్యార్థి సంఘం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో PDS (ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థులు) అనే సంఘాన్నిస్థాపించాడు. అన్యాయానికి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడాలంటే దానికి ఎరుపు రంగు సరైనది అనే ఉద్దేశంతో కమ్యూనిస్టు భావజాలంతో సంఘాన్ని మొదలుపెట్టాడు. ఆయన అప్పటికే బాక్సింగ్ కరాటే లాంటి వాటిలో ఛాంపియన్. ఆయనను చూస్తే ప్రత్యర్ధులు వణికేవాళ్లు. ఆయన మానసికంగా, శారీరకంగా చాలా దృఢమైన వ్యక్తి. PDS ఏర్పాటు చేసిన తర్వాత క్యాంపస్ లో జరిగే ఒక్కొక్క అన్యాయాలను కలుపు మొక్కల్లా ఏరేస్తూప వచ్చాడు. అది సహించని ABVP, RSS మతోన్మాదులు చాలాసార్లు ధూల్ పేట లాంటి ప్రాంతాల నుంచి గుండాలను తెప్పించి ఆయనను చంపడానికి చాలాసార్లు ప్రయత్నాలు చేశారు. కానీ, ఆయన సహచర విద్యార్థులతో కలిసి శత్రువులను తరిమికొట్టాడు. అలా అలా విద్యార్థులందరినీ సంఘటితం చేశాడు. నిరంతరం ఏదో ఒక విషయంపై చర్చిస్తూ నేర్పిస్తూ, సమ సమాజం వైపు అడుగులు వేశాడు జార్జ్.

ఇంతలో యూనివర్సిటీ ఎన్నికలు వచ్చాయి. PDS తరపున అభ్యర్థిగా నిలబడి భారీ మెజారిటీతో ప్రతిపక్షాలపై విజయం సాధించాడు. విద్యార్థుల నుంచి జార్జికి బాగా ఆదరణ వచ్చింది. అలా క్యాంపస్లో అధికార పక్షపు దౌర్జన్యాలు, మతోన్మాదులకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. “జీవించాలంటే మరణించడం నేర్చుకో , అడుగు అడుగున పోరాడడం నేర్చుకో ” అనే నినాదం ఇచ్చాడు. జార్జి రెడ్డి నిజాం కళాశాలలో ఉన్న సమయంలో తరగతి గదిలో కేవలం చదువులోనే కాకుండా, ఇతర కార్యక్రమాలలో కూడా చాలా చురుకుగా ఉండేవాడు. క్రీడా ప్రాంగణంలో క్రీడలు ఆడేవాడు, బాక్సింగ్ లో ఛాంపియన్. కరాటే చేసేవాడు.కేవలం చదువుకే పరిమితం కాకుండా ఎల్లప్పుడూ సమాజంలో జరిగే విషయాలు మిత్రులతో చర్చిస్తూ ఉండేవాడు. సమయం దొరికినప్పుడల్లా గ్రంథాలయంలో కూర్చొని ఏదో ఒక పుస్తకం చదువుతు ఆలోచన శక్తిని పెంచుకునేవాడు. తనకు తెలిసిన విషయాలను మిత్ర బృందానికి చెప్పి వాళ్లకు కూడా ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండేవాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్ళిన తర్వాత చాలా అసమానతలు ఎదుర్కొన్నాడు.

అది ఆంధ్ర వలస పాలకుల నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తొలి అడుగులు పడ్డ రోజులు. 1956 పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఎలాంటి హామీలు నెరవేర్చలేదని చెప్పి ముల్కీ ఉద్యమాన్ని తీసుకొచ్చారు తెలంగాణ వాసులు. ముల్కీ అంటే ప్రాంతీయవాసి. ప్రాంతీయవాసులు కాకుండా వేరే వాళ్లకు చోటు లేదని చెప్పి ఉద్యమాన్ని చేస్తున్న రోజులు అవి. జార్జి రెడ్డి కేరళ నుంచి రావడం వల్ల ఆయన ప్రాంతీయుడు కాకపోవడంతో పెద్ద ఎత్తున అవమానాలు అసమానతలు ఎదుర్కొన్నాడు. జార్జ్ వాటన్నిటినీ ఎదుర్కొని నిలబడ్డాడు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు చేసిన ఉద్యమాన్ని బాగా విశ్లేషించాడు, దానితోపాటు క్యాంపస్ లో ఉన్న అరాచక శక్తులపై పోరాటం చేయాలనుకున్నాడు. సమాజానికి కావాల్సింది కులం, మతం కాదనీ, కారల్ మార్క్స్ కలలుగన్న వర్గరహిత సమాజం కావాలని జార్జ్ ఆచరణలోకి దిగాడు. ఉద్యమానికి సిద్ధమయ్యాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో NSUI, ABVP వాళ్ల ఆగడాలు ఎక్కువయ్యాయి. NSUI అధికారపక్షమైన కాంగ్రెస్కు అనుబంధంగా ఉండడంతో అరాచకాలకు పాల్పడ్డారు. ABVP హిందుత్వ ఫాసిస్టు సిద్ధాంతంతో ఇతర మతాలను ఇబ్బంది పెట్టడమే కాకుండా క్యాంపస్లో అమ్మాయిలపై అరాచకాలు, ర్యాగింగ్ చేయడం లాంటివి మొదలుపెట్టారు. ఎన్నికల సమయంలో ఓటు వేయకపోతే దూల్పేట్ లాంటి ప్రాంతాల నుంచి రౌడీలను గుండాలను తెప్పించేవారు. ఇవన్నీ చూసిన జార్జి అరాచకాలని గ్రహించి ఆ రెండు జండాలకు మరో జెండా వ్యతిరేకంగా నిలబెట్టాలనుకున్నాడు.

చిన్నప్పటి నుంచీ విప్లవాత్మక భావాలతో పెరగడం, మార్క్సిజం చదవడం, ప్రపంచ విప్లవోద్యమాలను ఉద్యమాలను, సోషలిస్టు రాజ్యాల గురించి చదవడం, విశ్లేషించడం వల్ల జార్జ్ లో పరిణతి వచ్చింది. అరాచక శక్తులకు వ్యతిరేకంగా నిలబడాలంటే ఎర్రజెండానే సరైనది అని గ్రహించి.. ఎర్రజెండా తీసుకొని దానిపై PDS అని రాశాడు. అది ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థులు. పేరులోనే ప్రగతిశీలత ఉన్నది. ఎలాంటి అసమానతలు లేని ప్రజాస్వామ్యంలో ఉన్నది. విద్యార్థుల శ్రేయస్సు కోసం చదువుకునేవారికి చదువుతో పరిష్కారం చెప్పడానికి సంఘాన్ని ప్రారంభించాడు. దానికి గుర్తుగా తిరుగుబాటుకు చిహ్నం అయిన పిడికిలి పెట్టారు. తర్వాత క్యాంపస్లో విద్యార్థులందరినీ ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చి వాళ్లతో ఎప్పుడూ చర్చిస్తూ ఉండేవాడు. సమాజం పట్ల , సమాజంలో జరుగుతున్న సమస్యలపట్ల, వాటిని పరిష్కరించాలంటే ఏం చేయాలి ఇలాంటి విషయాలను చెప్పేవాడు. ఆయన జ్ఞానం, మాటతీరు చూసిన క్యాంపస్ విద్యార్థులు విద్యార్థి సంఘాల ఎన్నికల్లో మొదటిసారిగా ఆయనను గెలిపించారు. ఆయన గెలిచాక ABVP, NSUI కంగుతిన్నాయి. జార్జ్ గెలిచాక కుల శక్తులను మతశక్తుల తిరోగామి ఆలోచనలనలకు వ్యతిరేకంగా విద్యార్థులందర్నీ సంఘటితం చేశాడు. పోరాటంలోకి తీసుకొచ్చాడు. అది సహించని ABVP కార్యకర్తలు, RSS లాంటి మతోన్మాద సంస్థ కలిసి పాతబస్తీ నుంచి రౌడీలను తెప్పించి, జార్జ్ పై హత్య ప్రయత్నం చేశారు. చాలాసార్లు జార్జ్ తప్పించుకున్నాడు. కానీ, 1972 ఏప్రిల్ 14న ఎన్నికల సమయంలో ABVP వాళ్లు పగడ్బందీగా ప్రణాళిక వేసి ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర రాత్రి సమయంలో లఖన్ సింగ్ అతని అనుచరులు రౌడీలతో జార్జిని కత్తులతో పొడిచి చంపారు. ఎలాంటి అసమానతల్లేని సమాజం కోసం పోరాడిన జార్జ్ ని చంపేశాడు. కానీ, జార్జ్ కలలుగన్న సమాజాన్నీ, ఆయన ఆశయాలనూ చంపలేకపోయారు. 1972 ఏప్రిల్ 14న అర్ధరాత్రి అరుణతార జ్యోతి ఆరిపోయింది. ఆయన చనిపోయిన మరుక్షణం క్యాంపస్ లోని విద్యార్థులంతా ఏకమై కొన్ని లక్షల మంది హైదరాబాద్ మొత్తం నిండిపోయింది. ఆయనకు చివరిసారిగా వీడ్కోలు చెప్పి నారాయణగూడ స్మశాన వాటికలో సమాధి చేసేసారు. ఆయన మరణం ఎంతోమంది విద్యార్థుల నాయకులను ప్రభావితం చేసింది. ఆయన ఆశయాలు స్ఫూర్తినిచ్చాయి. ఆయన వారసత్వానికి కొనసాగిస్తూ జంపాల చంద్రశేఖర ప్రసాద్ PDSU స్థాపించాడు. తరువాత చేరాలు, రంగవల్లి లాంటి ఎంతోమంది సమ సమాజ స్థాపనకి వాళ్ల ప్రాణాలు అర్పించారు. వాళ్ల వారసత్వంగా PDSU విద్యార్థులు సమ సమాజ స్థాపన కోసం నిరంతరం పోరాడుతున్నారు. జార్జ్, జంపాల చంద్రశేఖర ప్రసాద్ లాంటి అనేక మంది వీరుల ఆశయాలను కొనసాగించడమే మనం వాళ్లకిచ్చే అసలైన నివాళి.

‘‘జీనా హైతో మర్నా సీఖో
కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో…’’

యువ కవి. పుట్టి పెరిగింది సాయి రెడ్డి గూడ గ్రామం, రంగారెడ్డి జిల్లా.  నిజాం కళాశాలలో బీఏ (హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్) చదువుతున్నాడు.  ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాడు.

Leave a Reply