అరబిక్: ఘస్సన్ కనఫాని
తెలుగు: చైతన్య చెక్కిళ్ల
అబ్దుల్ జబ్బార్ ఒక తత్వవేత్త. తన చిన్నతనం నుండీ అతను జీవితాన్ని సిద్ధాంతాలతో అంచనా వేసేవాడు. తనకు తాను ఒక ప్రశ్నను తయారుచేసుకుని దానిలో ఒక వారం మొత్తం నిమగ్నమై ఉండేవాడు. అతని ఆలోచన అంత లోతుగా ఉండేది. చిక్కుముడి ఇదీ: జనం టోపీలు తలలపైన, బూట్లు కాళ్ళకి ఎందుకు వేసుకుంటారు? మరోసారి “నాలుగు కాళ్ళమీద నడవడం ఎక్కువ సౌకర్యవంతమైన రవాణా విధానం కదా! మరి మనుషులు జంతువుల్లా నాలుగు కాళ్ళ మీద ఎందుకు నడవరు” అని ఊహాగానాలు చేశాడు.
కాలం గడిచేకొద్దీ, అతని ఆలోచనల్లో పరిణితి వచ్చింది. అలా ఒక సంక్షిప్త సూత్రాన్ని రూపకల్పన చేశాడు: “మనుషులు తమ ప్రమేయం లేకుండా పుడతారు కాబట్టి, తాము ఎలా చనిపోవాలో ఎంచుకునే స్వేచ్ఛ ఎందుకు ఉండకూడదు?” దాని ఆధారంగా, మరింత సంక్షిప్తమైన సూత్రాన్ని ప్రతిపాదించాడు: “చావే జీవిత సారాంశం.”
అతని ఆలోచనా విధానంతో వచ్చే ప్రశాంతత అన్నింటికన్నా ఎక్కువ విలువైనదిగా భావించేవాడు. తను ఎలా చనిపోవాలో ఎంచుకోవాల్సి వచ్చే సమయాన్ని ఊహించుకునేవాడు.
అబ్దుల్ జబ్బార్ తన ఇష్టానికి వ్యతిరేకంగా విప్లవంలో చేరాడని చెప్పేవాళ్ళకి ఒక విషయం తెలియదు. అతను స్వచ్ఛందంగా వాలంటీర్ సెంటర్ కి వెళ్లి, ఇంకా సరైన మిలిటరీ యూనిఫారంలు కూడా నిర్ణయించని ఆఫీసర్ ముందు నిలబడి స్థిరమైన స్వరంలో “విప్లవంలో పాల్గొనడానికి నాకొక తుపాకీ కావాలి,” అని అన్నాడు.
విప్లవంలో పాల్గొనాలంటే ఏదో ఒక రకంగా తుపాకీ సంపాదించాలనీ, అది అంత సులభం కాదనీ అతనికి తొందరలోనే అర్థమయింది.
“తుపాకీ నా చేతికొచ్చేలోపే నేను చనిపోతానేమో,” అని ఆఫీసర్ తో కోపంగా అన్నాడు. కానీ, “ఎండాకాలం ఏదో అలా సరదాగా గడిపి ఇంటికి వెళ్లిపోదామని వచ్చావా?” అన్న ఆఫీసర్ జవాబుకు అతను గమ్మునుండిపోయాడు. ఆఫీసర్ జవాబు ఊహించనిదైనా అందులో కొంత నిజముందని అతనికి అనిపించింది.
ఈ కొత్త అంచనా నేపథ్యంలో, తుపాకీ సంపాదించకముందే తాను చనిపోయే అవకాశమున్నది కాబట్టి, అబ్దుల్ జబ్బార్ తన తత్వంలో కొంత మార్పు అవసరమని అనుకున్నాడు. అందుకని అతను ఒక కొత్త సంక్షిప్త సూత్రానికి చేరుకున్నాడు. “మనుషులు చనిపోయిన తరువాత తమకు ఔన్నత్యం చేకూరడం ముఖ్యం కాదు, చనిపోకముందే తమకంటూ ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని ఎంచుకోవడం ముఖ్యం.”
అయితే అబ్దుల్ జబ్బార్ తాను ఊహించుకున్నంత ప్రయాస పడకుండానే, ఈ సమస్యకు తన తాత్విక సూత్రాలను ఉపయోగించకుండానే, ఒక కొత్త తుపాకీని సంపాదించుకున్నాడు. ఒకరోజు పొద్దున్న జరిగిన యుద్ధం తర్వాత అతను బయటకెళ్లినపుడు ఒక సైనికుని మృతదేహం కనిపించింది. చనిపోయినవాళ్లకు తుపాకులు అవసరం లేదనుకుంటూ అతను ఆ మృతదేహాన్ని తిప్పేసరికి దానికింద పదునైన కొన ఉన్న ఒక ఫ్రెంచ్ రైఫిల్ కనిపించింది.
బారికేడ్ల దగ్గర తన సహచరులు అబ్దుల్ జబ్బార్ ను “తత్వవేత్త” అని పిలిచేవాళ్ళు. సైనికులకు అతని తత్వంలో అప్పుడు జరుగుతున్న సంఘటనలకు సరిపడే అర్థం కనిపించేది. విప్లవకారులు చాలా మటుకు యువకులు. వాళ్ళందరికన్నా తాను సీనియర్ కాబట్టి, ప్రతీ సమరం తరువాత వాళ్లను సమావేశపరచే అధికారం తనకు ఉన్నందుకు సంతోషపడేవాడు. ఎందుకంటే ఆ సమావేశాల్లో చావు గురించి తన కొత్త సంక్షిప్త సూత్రాన్ని వాళ్లు గ్రహించేలా చెప్పవచ్చు. ఆ సూత్రం యుద్ధంలో జరిగే మరణాలను బట్టి మారిపోతూవుండేది.
ఒక రాత్రి, ఒక చదువులేని రైతు చనిపోయాడు. అతను బారికేడ్ల మీద పడిపోయేముందు ఒక నాయకుణ్ణి, అతని అనుచరుల్ని తిట్టిపోసాడు. ఆ అమరుడి మరణానికి సరిపోయే నివాళి గురించి ఆలోచించే క్రమంలో అబ్దుల్ జబ్బార్ తన కొత్త సంక్షిప్త సూత్రాన్ని రూపొందించాడు: “ఉన్నతమైన ఆదర్శం ఉండడానికి ఆలోచనల కంటే భావాలే అవసరం.” మరుసటి రాత్రి, ఒక యువకుడు గోడపక్కన పాకుతున్న శత్రుసైనికుడి మీద దాడి చేయడానికి బారికేడ్లనుండి బయటకు వెళ్ళాడు. అతను భద్రమైన చోటుకి తిరిగి వస్తుంటే కాల్చిచంపారు. అప్పుడు అబ్దుల్ జబ్బార్: “సాహసం విశ్వసనీయతకు కొలమానం” అని అనుకున్నాడు.
అబ్దుల్ జబ్బార్ కు సాహసవంతుడనే పేరుంది. అందుకే, ఎట్టకేలకు సరైన మిలిటరీ యూనిఫారాలు తెప్పించిన ఆఫీసర్, అబ్దుల్ జబ్బార్ ను రెక్కీ కోసం ఓడరేవుకు పంపించాడు. తత్వవేత్త నిర్మలమైన దిగులు ముఖం శత్రువుకు అనుమానం రాకుండా ఉంటుందని అతను అనుకున్నాడు.
అబ్దుల్ జబ్బార్ ఆయుధాలు లేకుండా వీధుల్లో నడిచాడు. ఓడరేవు చేరుకుని తనకు నచ్చినట్టు తిరిగి, బారికేడ్ల వైపు నడక కొనసాగించాడు. కానీ ఊహించినదానికి విరుద్ధంగా, ఎప్పుడో ఒక దాడిలో పాల్గొన్న ఎవరో అతన్ని గుర్తుపట్టారు. అతన్ని పట్టుకుని ఆఫీసర్ దగ్గరకు తీసుకెళ్లారు. భయపడిపోయిన ఆ ఆఫీసరు అబ్దుల్ జబ్బార్ ను చెంపదెబ్బ వేసి, ఇలా అన్నాడు:
“నువ్వు విప్లవకారుడివా?”
అబ్దుల్ జబ్బార్, “అవును,” అన్నాడు.
“ఒరే పందీ!”
“కాదు!” అతను గట్టిగా చెప్పాడు.
తనను నిర్దాక్షిణ్యంగా కొడుతుంటే, అబ్దుల్ జబ్బార్ తన కొత్త సంక్షిప్త సూత్రాన్ని రూపొందించకుండా ఊరుకోలేదు: “బందీని కొట్టడమంటే భయాన్ని అహంకారంతో వ్యక్తీకరించడం.” ఆ ఆలోచన అతనికి కొంత ఊరటనిచ్చింది.
అబ్దుల్ జబ్బార్ ఆలోచనలో నిమగ్నమై ఉండగా, ఆఫీసరు, అతని మద్దతుదారుల ప్రోద్బలంతో, తాను తెలివైనదిగా నమ్మిన ఒక నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ల బందీ మాత్రం దాన్ని భయం నుండి పుట్టే మరో అహంకారపూరిత ఆలోచన అని అనుకున్నాడు.
ఆఫీసర్ అతనితో అన్నాడు, “నువ్వు మా ముందు నడుస్తూ మీ బారికేడ్ల దగ్గరకు వెళ్ళి, నీతో పాటు తిరగుబాటులో చేరడానికి కొత్త విప్లవకారులను తీసుకొచ్చావని మీ పిచ్చి కామ్రేడ్లకు ప్రకటించాలి. నువ్వా పని చేయగానే నా సైనికులు మిగిలిన పని పూర్తి చేస్తారు.”
“మరి నా సంగతేంటీ?” అబ్దుల్ జబ్బార్ అడిగాడు.
“ప్రాణాలతో సత్కరించబడుతావు,” ఆఫీసర్ అన్నాడు, “లేదూ, మమ్మల్ని మోసగిస్తే కుక్క చావు చస్తావు.” అబ్దుల్ జబ్బార్ మనసులో అనుకున్నాడు: “ద్రోహం నీచమైన చావు.”

ఒక ఆటోమాటిక్ రైఫిల్ కొన తన వీపులో గుచ్చుకుంటుండగా, అబ్దుల్ జబ్బార్ సగర్వంగా రెండు సైనికుల వరుసల ముందు నడిచాడు. బారికేడ్లను చేరుకునే కొంచెం ముందు, ఆఫీసర్ బొంగురు గొంతుతో బుస్సుమన్నాడు: “ఇప్పుడే! కానీ!”
అతను భయపడలేదు. అతని స్వరంలో వణుకు వినిపించలేదని అతని కామ్రేడ్లు తర్వాత చెప్పారు. నిర్భయమైన గొంతుతో అతను అరిచాడు.
“మీకోసం యాభైమంది శత్రుసైనికుల్ని పట్టుకొచ్చాను.”
సైనికుల శవాల మధ్య పడివున్న అతని దగ్గరకు అతని కామ్రేడ్లు పరుగెత్తుకుని వెళ్ళేటప్పటికి అతనింకా చనిపోలేదు. అతి కష్టంగా, అందులో ఒకరు అతను చెప్పిన చివరి సంక్షిప్త సూత్రం విన్నారు: “మనలో ఒకరు చనిపోవడం ముఖ్యమైన విషయం కాదు. మనం కొనసాగడం ముఖ్యం.”
ఆతర్వాత అతను చనిపోయాడు.