ఆ చూపు

కింద ఒక్కసారిగా పిల్లలందరూ గోలగోలగా అరుస్తున్న చప్పుడు.

అప్పుడే ఆరయిందా… అనుకుంటూ బాల్కనీలో ఆరేసిన బట్టలు తీయడానికి బైటికి వచ్చింది శాంతి.

పచ్చరంగు సైకిల్ ని చుట్టుముట్టి గోల చేస్తున్నారు కాలనీ పిల్లలంతా. సైకిల్ ను గిరగిరా తిప్పుతూ ఫీట్స్ చేస్తున్నాడు దానిపై కూర్చున్న దినేశ్. అతని సాహసాన్ని ఆశ్చర్యంగా చూస్తూ చప్పట్లు కొడుతున్నారు మిగతావాళ్లు. ఆ గుంపులో శాంతి పిల్లలు ఆశా, అశోక్ లు కూడా ఉన్నారు. పిల్లల ఉత్సాహాన్ని చూస్తూ నవ్వుకుంటూ బట్టలు తీసుకుని ఇంట్లోకి వెళ్లింది శాంతి.

మల్కాజగిరీ ప్రాంతంలో ఓ మధ్యతరగతికి చెందిన కాలనీ అది. నాలుగు పక్కల ప్లాట్లు ఉండి మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. ఆరయిందంటే పిల్లలంతా క్రిందకి దిగుతారు. ట్యూషన్లు, క్లాసులు అంటూ ఇతర రోజుల్లో బిజీగా ఉండేవారికి ఆదివారం వచ్చిందంటే పండగే. వీకెండ్స్ కి పిల్లలతో బైటకు వెళ్ళాలంటే ఖర్చుకు జంకే తల్లి తండ్రులే అందరూ. దీనితో ఆ రోజు కాలనీ పిల్లలంతా క్రిందకు దిగి కరువుతీరా ఆడుకుంటారు. పిల్లలు ఆ పూట చేసే హడావిడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది శాంత కూడా. వాళ్ల నవ్వులు, అరుపులతో ఆమెకు వారానికి సరిపడా ఎనర్జీ వస్తుంది.

శాంత చిన్నతనం అంతా ఒంగోలులో గడిచింది. లాయరుపేటలో ఒక రెండు గదుల పోర్షనులో అద్దెకు ఉండేది వాళ్ల కుటుంబం. సాయంత్రాలు రంగారావు చెరువు దగ్గరకు చేరి పిల్లలతో కలిసి ఆడుకున్న రోజులు ఆమెకు ఇప్పటికీ బాగా గుర్తు. స్కూలు నుండి రాగానే బాగ్ పక్కన పడేసి అమ్మ పెట్టింది తిని స్నేహితులతో ఆడుకున్న రోజులు గుర్తుకు వచ్చినప్పుడల్లా మహా ఆనందపడిపోతుంది. కాలేజీ చదువులోకి వచ్చిన తర్వాత కూడా స్నేహితురాళ్లంతా ఏదో ఓ నెపంతో సాయంత్రాలు ఓ అరగంటైనా బైట గడపడకుండా ఉండలేకపోయేవాళ్లు. తల్లి తండ్రుల అంక్షలను అంగీకరిస్తూనే తమకంటూ స్పేస్ ఏర్పాటు చేసుకుని గడిపిన ఆ సాయంత్రాలు ఆమెకు ఇప్పటికీ తీపి గుర్తులే.

పెళ్లి తర్వాత ఉద్యోగ రిత్యా శాంతా, శేఖర్ లు హైదరాబాద్ చేరారు. శేఖర్ ఒక చిన్న కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నాడు. శాంత పెళ్ళైన కొత్తలో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేసేది. పిల్లల కోసం ఉద్యోగం మానేసింది. ఇప్పుడు ఇద్దరూ హై స్కూల్ కు వచ్చాక మళ్ళీ పక్కనే ఉన్న టీ షర్ట్ ఫ్యాక్టరీ లో సూపర్ వైజర్ గా చేరింది. సాయంత్రం ఐదుకి ఇంటికి వచ్చేస్తుంది. పిల్లలను కష్టపడి చదివించుకుంటూనే వాళ్లు స్వేచ్చగా ఆడుకోవడానికి ఎప్పుడూ అడ్డు పడలేదు ఆ దంపతులు. మిగతా రోజులెలా ఉన్నా ఆదివారం పిల్లలని ఆడుకొమ్మని కాలనీ మధ్యన ఉండే ఖాళీ స్థలంలోకి క్రమం తప్పకుండా పంపిస్తుంది శాంతి. వీళ్ళను చూసి ఇంకొందరు పిల్లలు వచ్చి చేరేవాళ్ళు. అలా పది మంది పిల్లలు దాకా, ప్రతి ఆదివారం ఏదో ఒక ఆట ఆడే నెపంతో కలిసి గడపడం అలవాటు చేసుకున్నారు. దీని వెనక శాంతి ప్రోద్బలం ఎక్కువగా పని చేసిందన్నది నిజం.

అందరూ చిన్న చిన్న ఉద్యోగస్తులే అక్కడ. అందుకే ఇంటింటికి మధ్య స్త్రీల రాకపోకలు సాగుతూనే ఉంటాయి. శాంత వాళ్ళది రెండో అంతస్తులోని చిన్న ప్లాట్. అటు పక్క ఓ సింగిల్ బెడ్ రూం పోర్షనులోకి నెల రోజుల క్రితం ఓ కొత్త కుటుంబం వచ్చి చేరింది. కుటుంబం అంటే తల్లి, కొడుకు వారితో కాస్త సామాను అంతే. ఒక చిన్న ఆటోలో పట్టేటంత సామాను మాత్రమే వాళ్ళతో వచ్చింది. ఆటో పైన వెలసిపోయిన ఆకుపచ్చ రంగు సైకిల్ ను దింపుతున్న దినేశ్ ను మొదటి సారి చూసింది శాంతి. పై అంతస్తు నుండి శాంతి తననే చూస్తుందని గమనించి, అమాయకంగా నవ్విన దినేశ్ మొహం శాంతను ఆకట్టుకుంది. అశోక్ వయసువాడే అయినా సన్నగా వచ్చీ రానీ మీసకట్టుతో కళ్ళలో ఓ వింత మెరుపుతో కనిపించిన దినేశ్ మొదటి చూపులోనే శాంతను ఆకర్షించాడు.

ఏదో పని నిమిత్తం ఇంట్లోకి బైటికి తిరుగుతూ దినేశ్ చలాకీగా సామానంతా సర్ధడం, తల్లికి ప్రతి విషయంలో సహాయపడడం, ఇల్లు కడగడం నుంచి బట్టలను ఉతికి ఆరేసే సమయంలోనూ తల్లికి తోడుగా ఉండడం చూసి ముచ్చటగా అనిపించింది శాంతికి. ఆ రోజు నుండి దినేశ్ ను గమనించడం ఆమె హాబీ అయిపోయింది.

ఈ రోజు కూడా సైకిల్ పై దినేశ్ గిరగిరా తిరుగుతుంటే వాడి చలాకితనానికి నవ్వుకోకుండా ఉండలేకపోయింది. దినేశ్ పిల్లలతో చేరిన రోజు నుండి ఆశ, ఆశోక్ లు అతని పేరే జపం చేస్తూ ఉండడం ఆ పిల్లవాడిపై ఆమెకు ఆసక్తి పెరగడానికి మరో కారణం.

*

ఆ రోజు శాంతికి ఫాక్టరీలో ఆలస్యం అయిపోయింది. అసలు ప్రతి శుక్రవారం పని ఎక్కువగానే ఉంటుంది. ఇవాళ స్టాక్ లోడ్ చేసే పని కూడా తోడయింది. అంతా ముగించుకుని బైట పడేసరికి ఆరు దాటిపోయింది. పిల్లలు ఇల్లు చేరే ఉంటారనుకుంటూ హడావిడిగా నడుస్తోంది శాంతి. ఇంతలో కాలు మడతపడింది. అప్పటికే సగం అరిగిపోయిన చెప్పు తెగిపోయింది.

‘ఇదీ ఇప్పుడేనా’ విసుగ్గా చెప్పు చేతిలోకి తీసుకుంది శాంతి. పిన్నీసుతో దాన్ని సవరించుకుని కాలికి తొడుక్కునే సరికి మరో పది నిమిషాలు లేటయింది. చెప్పు తొడుక్కుంది కాని వేగంగా నడవలేకపోతోంది. పోని చెప్పులు తీసేసి నడుద్దామంటే, రోడ్డుపై కారుతున్న డ్రైనేజ్ నీరు. మెల్లిగా ఈడ్చుకుంటూ నడుస్తోంది. ఇంతలో ఎదురుగుండా సైకిల్ పై దినేశ్ వస్తూ కనిపించాడు. శాంతి పక్కనే వచ్చి సైకిల్ ఆపాడు.

“ఆంటీ మీ కోసమే వస్తున్నా” అన్నాడు దినేశ్.

‘నా కోసమా’ అనబోతున్న శాంతిని మాట్లాడనీయకుండా, ‘అశోక్ బస్సు నుండి క్రింద పడిపోయాడు ఆంటి. దెబ్బలు తగిలాయి. పట్టీ కట్టించి ఇంట్లో పడుకోబెట్టి వస్తున్నా. ఆశ ఏడుస్తుంది. మీరు రావడం లేట్ అయిందంటే మిమ్మల్ని తీసుకువెళ్లాలని వస్తున్నా’ అన్నాడు వగరుస్తూ.

శాంతికి గుండె ఆగినంత పనయ్యింది.

“బస్సు నుండి పడడం ఏంటి, ఏం జరిగింది, ఏ హాస్పిటల్” అడుగుతుండగానే ఆమె శరీరంలో సన్నగా వణుకు మొదలయింది.

సైకిల్ మీద నుండి దిగి, శాంతి చేతిలోని బాగ్ అందుకున్నాడు దినేశ్. మధ్యాహ్నం ఫాక్టరీ కాంటిన్ లో పచ్చళ్లు కొనుక్కుంది శాంతి. బాగ్ బరువుగా ఉంది. దానికి తోడు చెప్పులు సహకరించట్లేదు. అశోక్ గురించి వినగానే భయం ఆవహించింది. శేఖర్ ఊర్లో లేడన్నది గుర్తుకు వచ్చి ఆ భయం ఇంకా పెరిగింది. చెప్పులు అక్కడే వదిలేసి రోడ్డుపై పారుతున్న డ్రైనేజీ నీళ్ళ గుండానే పరుగులాంటి నడకతో ఇంటివైపుకు అడుగులు వేసింది. ఆమెను అనుసరించాడు దినేశ్.
భయంతో, కన్నీళ్ళు కారుస్తూ ఇంటి వచ్చిన శాంతికి ఆశ ‘మమ్మీ’ అంటూ ఏడుస్తూ ఎదురువచ్చింది.

‘ఏమయిందమ్మా’ శాంత గొంతు పెగలట్లేదు.

‘మమ్మీ అన్నకేమో దెబ్బ తగిలింది’, తల్లిని చుట్టేసింది ఆశ.

ఇంట్లోంచి దినేశ్ తల్లి బైటకు వచ్చింది. ఆమెతో పాటు పక్కింటి రమ అత్తగారు కూడా.

“ఏం భయం లేదు శాంతి చిన్న దెబ్బే ప్రమాదమేమీ లేదు” అంటూ ఆశను దగ్గరకు తీసుకుంది రమ అత్తగారు.

లోపల దీవాన్ పై అశోక్ పడుకుని ఉన్నాడు. నుదిటిన బాండేజీ కనిపిస్తుంది. పరుగున కొడుకు దగ్గరకు వెళ్ళింది శాంతి.

‘ఏం జరిగింది నాన్నా… ఎలా పడ్డావురా. ఇంత పెద్ద పట్టీ ఏంటీ’. అంటూ ఆ పట్టిని చేతితో స్పృశించింది.

తల్లిని చూసి అశోక్ సిగ్గుతో నవ్వాడు. ‘మమ్మీ చిన్న దెబ్బే మమ్మీ… ఆశ భయపడి ఇంత గొడవ చేసింది. నేను బాగానే ఉన్నాను’ అన్నాడు.

ఇంతలో చేతిలో బరువైన పచ్చళ్ల సంచితో ఇంట్లోకి ప్రవేశించాడు దినేశ్, అక్కడే ఉన్న రమ అత్తగారు అవి అందుకుంది.

‘అసలు ఈ అబ్బాయి ఎంత ధైర్యంగా వ్యవహరించాడో. చూస్తే ముచ్చటేసింది అనుకో. స్కూల్ బస్ నుండి దిగుతూ చూసుకోకుండా క్రిందకు దూకేయడంతో అశోక్ బోర్లా పడ్డాడు. అక్కడ ఉన్న రాయి నుదిటికి తగిలి చీరుకుపోయింది. రక్తం చూడగానే ఆశ అరవడం మొదలెట్టింది. దినేశ్ ఆ బస్సు వెనగ్గా వస్తున్నాడులా ఉంది. గబుక్కున అశోక్ ను నిలబెట్టి, ఆశాని సముదాయించి ఆమెను ఇంటికి పంపి అశోక్ ను హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లాడు. చిన్న గాయమే అని కట్టు కట్టి ఓ టి. టి ఇచ్చి పంపారు. మళ్లీ ఇక్కడకు వచ్చి వాళ్ల అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లి అక్కడ కట్టి అశోక్ ను తీసుకొచ్చాడు. నువ్వు వస్తావని కాసేపు ఎదురు చూసాడు. ఆశ భయపడి ఏడుస్తుంటే నువ్వెక్కడ పని చేస్తావో కనుక్కుని నిన్ను తీసుకురావడానికి వచ్చాడు. ఎంత ధైర్యం, ఎంత నిబ్బరం వీడికి’. చెప్పుకుపోతుంది పెద్దావిడ.

అశోక్ గాయాన్ని తడిమి చూసింది శాంత, శరీరం అంతా తడిమి ఇంకెక్కడన్నా దెబ్బలు తగిలాయేమో అని చూడబోయింది. అశోక్ సిగ్గుపడిపోయాడు. ‘ఇంకేం దెబ్బలు లేవు మమ్మీ. దీని వల్లే ఇంత గోల అయింది. ఇది చిన్న దెబ్బే నాకేం కాలేదు’ అంటున్నాడు.

ఇంట్లోకి మళ్ళీ వచ్చాడు దినేశ్. ఈ సారి చేతిలో శాంతి చెప్పుల జత. కుట్టీంచినట్లున్నాడు. ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది శాంతి. తను ఆ చెప్పులను అక్కడే వదిలేసి వచ్చిందే. ఈ అబ్బాయి ఎప్పుడు వాటిని రిపేర్ చేయించాడు అనుకుంటూ, “అయ్యో చెప్పులెందుకు పట్టుకొస్తున్నావ్ దినేశ్, క్రింద పడేయ్’ అంది.

“పర్లేదు ఆంటి, అశోక్ గురించి చెప్పగానే మీరు భయపడి పరుగెత్తుకుంటూ వచ్చేసారు. ఇవి అక్కడే వదిలేశారు. చూస్తే ఒక చెప్పు తెగి ఉంది. ఆ వీధి చివరన తాత ఉంటాడు కదా. అక్కడ కుట్టించి తీసుకొచ్చాను. ఆశా, ఇక ఏడుపు ఆపొచ్చు కదా. అమ్మ వచ్చేసింది కదా’ అన్నాడు ఆశ వైపు నవ్వుతూ చూస్తూ.

అక్కడే ఉన్న దినేశ్ తల్లి ఆశను దగ్గరకు తీసుకుంది. “అంత భయం అయితే ఎలా అమ్మాయి… అన్న చూడు ఏమన్నా ఏడ్చాడా… నువ్వే అందరినీ భయపెట్టేసావు” అంది.

శాంత ఆమె చేయి పట్టుకుని “చాలా సాయం చేసారండి మీరు, మీ అబ్బాయి కూడా. హడలిపోయాను. సమయానికి ఆయన కూడా లేరు. చాలా కంగారు పడ్డాను” అంది.

“అయ్యో ఇంత దానికేనా… అయినా మా దినేశ్ కు మీ అశోక్ బెస్ట్ ఫ్రెండ్ అట. ఇంట్లో ఎప్పుడూ మీ అబ్బాయి గురించి, మీ గురించే చెబుతూ ఉంటాడు మా వాడు. ఆ మాత్రం సాయం చేసుకోలేకపోతే ఇరుగు పొరుగు ఎందుకు” అంది.
“నా గురించి కూడా చెప్తాడా” నవ్వుతూ దినేశ్ ని చూసింది శాంతి.

‘అవునండి మీరు బాగా పాడతారట. ప్రొద్దుటి పూట మీరు పూజ చేస్తూ పాడేవన్నీ వీడు క్రింది నుంచి వింటుంటాడు. ఇంగ్లీష్ బాగా మాట్లాడతారని చెప్తాడు. మీ దగ్గర చదువు చెప్పించుకోవాలని వాడి ఆశ” అంది కొడుకు వైపు చూస్తూ.
ఏదీ పట్టనట్లు కనిపించే ఈ పిల్లవాడు తనను ఇంతగా గమనిస్తున్నాడా అనుకుంటూ ఆశ్చర్యంగా దినేశ్ వైపు చూసింది శాంత. తన పాట, నేర్చుకున్న సంగీతం, ఇంట్లో పిల్లలకు, భర్తకూ తలనొప్పిగా మారుతోందని వాళ్ళు పదే పదే అంటుంటే, పూజ మంత్రాల వరకు తనను పరిమితం చేసుకుని గొంతు విప్పడం మానుకుంది. అలాంటిది ఈ పదో తరగతి కుర్రాడు, తన గొంతులో సంగీతాన్ని గుర్తించి దాన్ని శ్రద్దగా వింటున్నాడని తెలిసాక కళ్లలో నీళ్లు తిరిగాయి. దినేశ్ వైపు ప్రేమగా చూసింది. వాడు సిగ్గుపడి మెలికలు తిరుగుతున్నాడు. వాడి అమాయకత్వానికి ఆమె పెదాలు విచ్చుకున్నాయి.

ఇంతలో రమ అత్తగారు అందరికీ టీ కలుపుకు వచ్చింది. ఆ పెద్దావిడ చేతిలో ప్లేటు అందుకుని అందరికీ గ్లాసులు అందించాడు దినేశ్. ప్రతి దాన్ని నిశితంగా గమనిస్తూ పనులు చక్కబెట్టే దినేశ్ శాంతికి ఆ క్షణం పరాయి బిడ్డగా అనిపించలేదు.

*

కొద్ది కొద్దిగా ఆ కుటుంబ విషయాలు శాంతి తెలుసుకుంది. దినేశ్ తల్లి పేరు నిర్మల. ఓ టైలర్ షాపులో పని చేస్తుంది. దినేశ్ పక్కనే గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్నాడు. తండ్రి ఎక్కడో వాచ్మెన్ గా పని చేసేవాడట. గుండె జబ్బుతో సంవత్సరం క్రితం చనిపోయాడు. ఎనిమిదో తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చాడని దినేశ్ తండ్రి సెకెండ్ హాండ్ లో ఆ ఆకుపచ్చరంగు సైకిల్ ను కొనిచ్చాడట. ఆ తర్వాత సంవత్సరానికే ఆయన పోయాడు. అప్పటి నుండి ఆ సైకిల్ వాడి ప్రాణం.
అది వాడిని చేరేటప్పటికే సగం అరిగిపోయింది. కాని దాన్నే దినేశ్ శుభ్రంగా పెట్టుకునేవాడు. తాను తప్ప ఎవరినీ దానిపై ఎక్కనిచ్చేవాడు కాదు. అప్పుడప్పుడు ఒంటరిగా సైకిల్ పై అపార్ట్ మెంట్ చుట్టూ తిరుగుతూ ఉండే దినేశ్ ను గమనిస్తే వాడు మౌనంగా ఏడుస్తున్నట్లు కనిపించేవాడు. పిలిచిన రెండు క్షణాలకు తలపైకెత్తి చూసి కల్మషం లేకుండా నవ్వుతున్న వాడిని చూసి శాంతికి ఏం అడగాలో తెలిసేది కాదు. నవ్వుతూ చేయి ఊపేది. వాడూ అంతే ఉత్సాహంగా చేయి ఊపుతూ సైకిల్ స్పీడ్ పెంచేవాడు.

స్కూల్లో పాటల పోటీలు పెడుతున్నారని ఓ కొత్త పాట నేర్పించమని శాంతి దగ్గరకు భయం భయంగా ఒక రోజు వచ్చి అడిగాడు దినేశ్. వాడి ఉత్సాహాన్ని గమనించి ఓ లలిత గీతం నేర్పించి శాంత. శ్రద్దగా చెప్పినది చెప్పినట్లు రాసుకుంటుంటే వాడి తెలుగు పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయింది. అశోక్, ఆశలు హిందీ ప్రధమ భాషగా తీసుకున్నారు. వాళ్ళ తెలుగు అంత బావుండదు. ఒక్క తప్పు లేకుండా పాటంతా రాసుకున్న వాడి శ్రద్దకు ముచ్చటపడింది శాంత. వాడు గొంతు విప్పి పాడుతుంటే తన చిన్నతనం గుర్తుకు వచ్చింది. అరగంటలో చెప్పినట్లు పాడి చూపించిన వాడి నైపుణ్యానికి ఎంతో ఆనందిస్తూ వాడికి అప్పటికప్పుడు ఓ కొత్త పెన్ను బహుమతిగా ఇచ్చింది.

ఆ రోజు నుండి ప్రతి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు దినేశ్. శాంతకు చిన్న చిన్న పనులలో సహాయం చేసేవాడు. ఆమెను పొరపాటున కూడా బజారుకు వెళ్ళనిచ్చేవాడు కాదు. చివరకు శేఖర్ కూడా చిన్న చిన్న పనులు దినేశ్ కు చెప్పడం మొదలెట్టాడు. క్రమంగా శాంత దినేశ్ లేకపోతే పని జరగనంతగా వాడి మీద ఆధారపడిపోయింది. ఆశ, అశోక్ లు కుడా దినేశ్ కి చెప్పి చిన్న చిన్న పనులు చేయించుకోవడం ఆ ఇంట రివాజుగా మారింది.

ఇంట్లోకి కూరగాయలు తేవాలన్నా, శేఖర్ స్కూటర్ సర్వీసింగ్ చేయించాలన్నా, ఇంట్లో చిన్న చిన్న రిపేర్లున్నా, ఆఖరికి ఆశ షూస్ పాలిష్ చేసే దాకా అన్ని పనులను పూనుకుని చేస్తున్నాడు దినేశ్. అలా అని ఇంటినీ, తల్లిని నిర్లక్ష్యం చేయడు, చదువు మర్చిపోడు. వాడికి తల్లిపై ప్రేమతో పాటు ఏదో భయం కూడా ఉందని అనిపిస్తూ ఉంటుంది శాంతకు. తల్లి రోజంతా కుట్టుపనితో అలసి వస్తుందని, ప్రతి రోజు స్కూల్ నుండి వచ్చి టీ చేసి తయారుగా ఉంచి తల్లితో పాటు కూర్చుని తానూ ఓ గ్లాసు టీ తాగి ఆమెకు కావల్సినవి కనుక్కుని బజారుకు వెళ్తూ శాంతకు ఏం కావాలో కనుక్కుని వెళ్ళడం వాడి ప్రతి రోజు దినచర్యలో భాగం అయిపోయింది. శాంత దగ్గర ఉన్నంతసేపు కూడా ఓ కన్ను, చెవి క్రింది పోర్షనుపై వేసి ఉంచడం శాంత గమనించింది. వాడిలో అప్పుడప్పుడు అర్ధం కాని అలజడిని కూడా గమనించింది.

*

ఓ రోజు తలనొప్పిగా అనిపించడంతో ఫాక్టరీ నుండి పన్నెండింటికే ఇల్లు చేరింది శాంత. పై ప్లాటుకువస్తూ అలవాటు ప్రకారం నిర్మల ఇంటివైపు చూసింది. ఓరగా తెరిచిన తలుపు నుండి ఓ కొత్త వ్యక్తి బైటికి వస్తూ కనిపించాడు. ఆ వెనుక నిర్మల వచ్చింది. శాంతను చూడగానే నిర్మల కంగారు పడ్డట్లు అనిపించింది. శాంత దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. పలకరింపుగా నవ్వి తన ఇంట్లోకి వచ్చింది.

తన మైగ్రేన్ సంగతి శాంతకు తెలుసు. ఇంకాసేపు ఆగితే అక్కడే వాంతి అయిపోయేలా ఉంది. అందుకే ఆమె గబగబా ఇంట్లోకి వచ్చేసింది. ఆ తర్వాత రెండు రోజుల దాకా మంచం దిగలేకపోయింది. ఇంట్లో పనులన్నీ దినేశ్ సహాయంతోనే గడిచాయన్నదే ఆమెకు తెలుసు. నిర్మల కూడా ఇంటి నుండి కూరలు పంపి సహాయపడింది. పక్కింటి రమ, ఆమె కూతురు కూడా అప్పుడప్పుడు వచ్చి ఆమె అవసరాలు కనుక్కుని వెళ్ళేవారు.

మూడో రోజు కాస్త నయం అయ్యాక పిల్లలకు హోం వర్క్ లో సహాయం చేయడానికి కూర్చుంది శాంతి. దినేశ్ ఆ సమయానికి రోజూ తన పుస్తకాలతో వచ్చేవాడు. ఇవాళ ఎందుకో రాలేదు. అశోక్ ని దినేశ్ విషయం అడిగింది శాంతి. వాడు ‘నాకు తెలీదు అయినా దినేశ్ రాకపోతే మాకు చెప్పవా” అన్నాడు కోపంగా. పిల్లల మధ్య ఏదో జరిగిందనిపించింది శాంతకు. ప్రతి రోజు ఇంగ్లీష్, లెక్కలు చెప్పించుకోవడానికి దినేశ్ శ్రద్దగా వచ్చేవాడు. పైగా వాడికి హాప్ ఇయర్లీ కూడా దగ్గరకు వస్తున్నాయి. చదువుతున్నాడో లేడో అనిపించి ఆశను దినేశ్ ని పిలుచుకుని రమ్మని పంపింది శాంత.

ఆశ అన్న వైపు చూస్తూ మెల్లిగా దినేశ్ ఇంటికి వెళ్లింది. అశోక్ పెదవి కొరుక్కుంటూ ఉండిపోయాడు. శాంత నవ్వుకుంది. ఒకే వయసున్న ఇద్దరు పిల్లల నడుమ కొన్ని గొడవలు వస్తూ పోతూ ఉంటాయి. వాటిని పెద్దవాళ్ళు పట్టించుకోకూడదు, కుదిరితే సర్ది చెప్పాలి అనుకుంటూ దినేశ్ కోసం ఎదురు చూస్తోంది.

దినేశ్ ఆశ చేయి పట్టుకుని మెల్లిగా లోపలికి వచ్చాడు.

“ఏంటి దినేశ్ చదువుకోవడానికి రాలేదు”… అడిగింది శాంత.

“మీకింకా నయం కాలేదుగా అంటీ అప్పుడే పని చేస్తున్నారు” అడిగాడు వాడు.

“నాకు బాలేదని చదువు మానేస్తున్నావా… పరీక్షలు లేవూ? పుస్తకాలు తీసుకుని రా” గట్టిగా అంది శాంత. చదువు దగ్గర ఆమె కాస్త కఠినంగానే వ్యవహరిస్తుంది.

ఒక్క క్షణంలో పుస్తకాలతో వచ్చేశాడు వాడు. ఆ రెండు రోజుల్లోనూ ఇంతకు ముందు చెప్పిన లెక్కలు, ఇంగ్లీషు వ్యాసంతో పాటు ఇంకొన్ని కొత్త లెక్కలూ చేసి పెట్టుకున్నాడు. అశోక్ పుస్తకం తీసిందే లేదు.

దినేశ్ బుక్ చూపిస్తూ, “చూసావా ప్రతి రోజు ఎంత బాగా వాడే చదువుకుంటున్నాడో. నువ్వు మమ్మీకి బాలేదనే సాకుతో పుస్తకమే తీయలేదు. ఇలాగయితే ఎలారా” అంది అశోక్ తో శాంత.

అశోక్ చివాలున పుస్తకం గిరాటేసి లేచి వెళ్ళిపోయాడు. దినేశ్ ముఖం మాడ్చుకున్నాడు. శాంతకు అర్ధం కాలేదు. ఇంతకు ముందు ఎప్పుడూ అశోక్ లో ఈ ఉడుకుమోత్తనం చూడలేదు. అర్ధం కాలేదామెకు. దినేశ్ వైపు చూస్తూ “మీ యిద్దరి మధ్య ఏమన్నా గొడవ జరిగిందా” అడిగింది శాంత.

దినేశ్ మౌనంగా తల దించుకున్నాడు. ఆశ వైపు చూసింది శాంత.

“నీకు బాగోలేనప్పుడు అశోక్ అన్న టి.వి చూస్తున్నాడని దినేశ్ అన్న తిట్టాడు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవయింది” చెప్పింది ఆశ.

దినేశ్ తల వంచుకునే ఉన్నాడు. ఇద్దరికి మరుసటి రోజుకి చదువుకోవల్సినవి చెప్పి దినేశ్ చేసిన లెక్కలు చూసి రెండు మూడు చోట్ల చిన్న తప్పులు సరిచేసి పంపించేసింది శాంత. వెళ్తున్న దినేశ్ తో “రేపు పరీక్ష పెడతాను టైం కి వచ్చేయి” అని చెప్పి అశోక్ పడుకున్న గదిలోకి వెళ్లింది.

గదిలో మంచంపై మోకాళ్లు కడుపులోకి లాక్కుని పడుకుని ఉన్నాడు అశోక్. శాంత మంచం దగ్గరకు వెళ్ళి ప్రేమగా కొడుకు జుట్టు నిమిరింది. వాడి వెక్కిళ్లు వినిపించాయి.

ఏంటీ వీడు ఇంతదానికే ఏడుస్తున్నాడా అనుకుంటూ ‘చిన్నా’ అంది ప్రేమగా.

అశోక్ తల్లి చేయి గట్టిగా పట్టుకుని ఆమెను తనపైకి లాక్కున్నాడు.

“మమ్మీ.. నీకు దినేశ్ అంటే ఎందుకంత ఇష్టం.. వాడు మంచివాడు కాదు. వాడికి పాటలు నేర్పిస్తావు, చదువు చెప్తావు. నాకంటే ఎక్కువ మార్కులు వస్తే వాడికి గిప్ట్ ఇస్తావు. నీవు నాకు మమ్మీవా వాడికి మమ్మీవా. నువ్వు వాడినే కొడుకులా చూస్తావ్. వాడి ముందే నన్ను తిడతావు. వాడు నా కిష్టం లేదు మమ్మీ… ప్లీజ్ వాడిని ఇంటికి రానివ్వకు’…. వెక్కుతూ అశోక్ అంటున్న మాటలను వింటూ శాంత నిర్షాంతపోయింది.

‘ఏంటి అశోక్. దినేశ్ నీ ఫ్రెండ్. మనకు అన్ని పనులు చేసి పెడతాడు. నీ వంటే ఎంతో ఇష్టంగా ఉంటాడు. వాడేదన్నా తప్పు చేస్తే నాకో వాళ్ళ మమ్మీకో చెప్పాలి. మళ్ళీ ఇద్దరూ ఫ్రెండ్స్ అయిపోవాలి కాని ఇదేంటి? టెంత్ క్లాస్ కొచ్చావు. ఇలా బిహేవ్ చేస్తునావ్ ఏంటి? దినేశ్ గురించి నువ్వు నా దగ్గర అంటున్నట్లు వాళ్ళ మమ్మీ దగ్గర నీ గురించి దినేశ్ మాట్లాడితే ఎలా ఉంటుంది? తప్పు గదా నాన్నా…” అంటూ అశోక్ మొహం తన వైపు తిప్పుకోబోయింది శాంత.

శాంత చేయి విదిలించి కోట్టాడు అశోక్. “వాళ్ళ మమ్మీ నీలాంటిది కాదు. షీ ఈజ్ బాడ్ వెరీ బాడ్. దినేశ్ కి కూడా ఇది తెలుసు అందుకే మా మమ్మీని తన మమ్మీగా చేసుకోవాలనుకుంటున్నాడు. నీకు వాడంటేనే ఇష్టం. నాకు తెలుసు నువ్వు కూడా బాడ్ మమ్మీవి అయిపోతావు” అంటూ ఏడుస్తున్నాడు అశోక్.

శేఖర్ గదిలోకి వచ్చాడు. ఏడుస్తున్న అశోక్ ను చూసి మ్రాన్పడిపోయాడు. ఎప్పుడూ పొరపాటున కొడుకుని ఒక దెబ్బ వేసిన వాడు కాడు. అశోక్ అలా ఏడవడంతో శాంతా శేఖర్లిద్దరూ బెదిరిపోయారు.

“ఏమయింది నాన్నా” అంటూ దగ్గరకు వచ్చిన శేఖర్ చుట్టూ చేతులు వేసి “మమ్మీ బాడ్ మమ్మీ కాదు డాడీ, కాని బాడ్ మమ్మీగా అయిపోతుంది. ఆ దినేశ్ వల్ల అయిపోతుంది” అంటూ పొంతన లేని మాటలు మాట్లాడుతున్నాడు అశోక్.
కొడుకుని సముదాయిస్తూ శాంతను గదిలో నుండి బైటకు వెళ్ళమని సైగ చేసాడు శేఖర్. విషయం అర్ధం అయి అవనట్లు ఉంటే కొడుకును చూస్తూ మౌనంగా గదిలో నుండి వెళ్ళిపొయింది శాంత.

ఆ రాత్రి ఆశ, శాంతలు హాలులో పడుకుంటే లోపల అశోక్ శేఖర్లు పడుకున్నారు. రాత్రి ఇద్దరికీ వేడి పాలు పంపమని శేఖర్ అంటే ఆశతో పంపింది శాంత.

దినేశ్ పై తను చూపే ప్రేమ అశోక్ ని అభద్రతాభావంలోకి నెట్టిందన్నది ఆమెకు అర్ధం అయింది. అయినా తాను దినేశ్ ను ప్రత్యేకంగా ఎప్పుడు చూసిందో ఆమెకు అర్ధం కాలేదు. చాలా సార్లు అశోక్ చేసే చిన్న చిన్నపనులను కూడా దినేశ్ ముందు కొచ్చి తానే చేసేవాడు. అప్పుడు కూడా దినేశ్ చురుకుతనాన్ని తాను ఇష్టపడింది తప్ప అశోక్ ను ఎప్పుడూ చులకనగా చూసినట్లు ఆమెకు ఏ సంఘటనా గుర్తుకు రాలేదు. ఇంత పొజెసివ్ నెస్ అశోక్ లో ఉందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. ఇదేంటి, ఇదెలా డీల్ చేయాలి అని ఆలోచిస్తూ ఆ రాత్రి ఆమె సరిగ్గా నిద్రపోలేదు.

ప్రొద్దునే నిద్రలేచి పనులు చేసుకోవడం మొదలెట్టింది. టిఫెన్లు కట్టే హడావిడిలో ఉన్నప్పుడే దినేశ్ ఆకుకూరలు పట్టుకు వచ్చాడు. మౌనంగా అందుకుంది. స్కూల్ లో క్లాస్ టెస్ట్ ఉందని బెస్ట్ ఆఫ్ లక్ చెప్పమని వచ్చి చెప్పించుకు వెళ్తున్న దినేశ్ అమాయకమైన ముఖాన్ని చూసి ఏం చెప్పాలో అర్ధం కాలేదు శాంతకు.

శాంత ముఖం చూసి “ఇంకా మీరు మామూలుగా కాలేదు. ఇవాళ ఫాక్టరీకి వెళ్ళకండి ఆంటి. నేను టెస్ట్ అయిపోగానే స్కూల్ నుండి త్వరగా వచ్చి మీకు పనిలో హెల్ప్ చేస్తాను. రేపటికి నార్మల్ అవుతారు” అంటూ వెళ్తున్న దినేష్ తో ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది.

ఎనిమిది అవుతుందనగా గదిలో నుండి బైటికి వచ్చాడు శేఖర్. శాంత వైపు చూసి “శాంతా పిల్లలు చెప్పేదాకా ఏం గమనించుకోవా? ఎలాంటి వాళ్ళని ఇంట్లోకి రానిస్తున్నామో తెలుసుకోవల్సిన పని లేదా. ఈ రోజు నుండి ఆ దినేశ్ ఈ ఇంటికి రావడానికి వీళ్లేదు” అన్నాడు. అశోక్ పిల్లిలా తండ్రి వెనకాలే వచ్చాడు.

పిల్లల ముందు ఏమీ మాట్లాడాలనిపించలేదు శాంతకు. నిన్నటిదాకా అన్ని పనులు తానే చెప్పి మరీ దినేశ్ తో చేయించుకున్న శేఖర్ ఇవాళ ఇలా మాట్లాడడం, తనను దోషిగా చూడడం ఎందుకో ఆమెకు అర్ధం కాలేదు.

పిల్లల మధ్య మొదలయ్యే ఈర్ష్య అసూయలను దూరం చేయాల్సింది పెద్దలే. ఇది దినేశ్ కు సంబంధించిన విషయమే కావచ్చు. కాని మరో సందర్భంలో అశోక్ ఇదే పొజెసివ్నెస్ తో వ్యవహరిస్తే ఎలా డీల్ చేయాలి. అశోక్ లోని ఈ ఈర్ష్య తప్పని మంచి మాటలతో చెప్పాల్సింది కూడా తామే కదా. లేకపోతే వాడి ఎదుగుదల ఎలా సాధ్యం?

ఇలాంటి మంకు పట్టు అశోక్ ని ఎలా తయారుచేసుందన్నది ఆలొచించకుండా భర్త ఈ అల్టిమేటం ఇవ్వడం ఆమెకు నచ్చలేదు. కాని లోన నీరసం, రాత్రంతా సరిగా నిద్రలేకుండా గడపడంతో ఆమెకు తలనొప్పి తిరగబెట్టినట్లు అనిపించింది. మౌనంగా పిల్లలను భర్తను స్కూలుకు ఆఫీసుకు పంపించింది. ఆ రోజు తానే పిల్లలను స్కూల్ లో దింపుతానని స్కూటర్ పై వాళ్ళను తీసుకెళ్ళాడు శేఖర్.

శాంతి రాత్రి భోజనం చేయలేదు. పిల్లలకు భర్తకు ఉన్న పిండితో దోసెలు వేసి పంపింది. ఆకలి వేస్తుంది. కాని ఏమీ వండుకోబుద్ది కాలేదు. అలాగే పడుకుండిపోయింది. అలసిపోయిందేమో వెంటనే నిద్రపట్టేసింది. మెలుకువ వచ్చేసరికి ఒంటి గంట.

శరీరంలో అలసట. ఆకలి దహించేస్తోంది. చేసుకునే ఓపిక లేదు. వాచ్మెన్ కు చెప్పి పక్క హోటెల్ నుండి ఏదన్నా తెప్పించుకుందాం అని ఓపిక చేసుకుని గుమ్మం బైట కారిడార్ లోకి వచ్చింది. అక్కడి నుండి వాచ్మెన్ ఇల్లు నేరుగా కనిపిస్తుంది.

కాస్త గట్టిగానే శంకర్ అని పిలిచింది. ఓ రెండు సార్లు చేయి ఊపి పిలిస్తే అతను చూసాడు. రమ్మనమని సైగ చెస్తే పరుగెత్తుకుంటూ పైకి వచ్చేసాడు.

కొంచెం టిఫెన్ తీసుకొచ్చి పెట్టమని నీరసంగా చెప్పి లోపలికి డబ్బు కోసం వెళ్లింది శాంతి. తిరిగి వచ్చి చూస్తే క్రింది ఇంటివైపుకి తల వంచి చూస్తున్నాడు శంకర్. అతని మొహంలో ఓ వికృతమైన నవ్వు.

శాంత శంకర్ చూస్తున్న వైపుకి చూసింది. ఓరగా తీసిన తలుపు నుండి ఓ వారం క్రితం తను చూసిన వ్యక్తి బైటకు వస్తున్నాడు. అతని వెనుక చుట్టూ చూస్తూ నిర్మల. శాంతకు రాత్రి అశోక్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. తుళ్లిపడింది. విషయం మొత్తం అర్ధం అయింది.

తనకు పక్కగా వచ్చి నిలబడ్డ శాంత నీడ పైన పడిందేమో ఆమె వైపు తిరిగి చూసాడు శంకర్. మనిషి తడబడ్డాడు. కాని అంతలో తేరుకుని… “ఇదమ్మా వరస. రోజు మధ్యాహ్నం ఇద్దరూ రావడం, ఓ గంట తర్వాత ఇలా వెళ్ళడం. ఆయనేమో స్కూటర్ మీద వెళ్ళిపోతాడు. ఈమె నడుచుకుంటూ వెళ్తుంది. వచ్చేవారం ఈమె ఆ పక్క సందులో సొంత టైలరింగ్ షాప్ తెరుస్తోంది. అక్కడ చీరలు అవీ కూడా పెట్టీ అమ్మబోతుందట. ఈయన సూపర్వైజర్ గా పని చేస్తున్న కాంప్లెక్స్ లోనే ఓ పెద్ద షాప్ రెంట్ కి ఇప్పించాడు. మా బామ్మర్ధి అక్కడ కూరగాయల షాప్ పెట్టాలనుకున్నాడు. రెంట్ కూడా ఎక్కువే ఇస్తానన్నాడు. కాని ఆ ఓనర్ వీడి దోస్త్ అట. వాడి మాట విని ఈమెకు సగం రెంట్ కే ఇచ్చాడు. ఇది ఎన్నేళ్ళ నుండో నడుస్తున్న కథ అంట. అంతకు ముందు పక్క కాలనీలోనే వాళ్ళు ఉండేవాళ్ళట. ఈ సంగతి తెలిసే ఆ మొగుడు చచ్చాడట. అక్కడ అందరికీ కథ తెలిసిందని ఆ కాలనీ వదిలి ఇదిగో ఇక్కడ చేరింది. ఆ కొడుకుకి కూడా తల్లి సంగతంతా తెలుసు. అందుకే కాపలా కాసుకుంటాడు. వాడు ఉన్నప్పుడు వీడు రాడు. వాడిని స్కూలుకి పంపి రోజు మధ్యాహ్నం ఇదే పని. ఈ అపార్ట్మెంట్ లో పిల్లలకి పెద్దలకి అందరికీ ఇది తెలుసు. మీరే అనవసరంగా ఆ తల్లీ కొడుకులను ఇంటికి రానిస్తున్నారు. జాగ్రత్తమ్మా. సత్తె కాలం మనుషులు మీరు. ఖరీదైన వస్తువులు ఆ పిల్లవాడి కంట పడకుండా పెట్టుకోండి. అయినా మొన్న సెక్రటరీ ఆమె దగ్గరకు వెళ్లి ఇల్లు ఖాళీచేయమని చెప్పాడట. అతనితో గొడవ పెట్టుకుంటే ఆ ఫ్లాట్ ఓనర్ కి ఫోన్ చేసి చెప్పాడట. ఆయన రేపో ఎల్లుండో వచ్చి ఇల్లు ఖాళీ చేయిస్తాడు. అయినా ఆమెకేం లే ఆ సూపర్వైజర్ గాడే ఎక్కడో ఇంకో ప్లాట్ ఇప్పిస్తాడు”. అంటూ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు.

తల దిమ్ముగా అనిపిస్తూ ఉంటే ఇంట్లోకి వెళ్ళడానికి వెనక్కు తిరిగింది శాంత. వెనగ్గా నిలబడి ఉన్న దినేశ్ కనిపించాడు. వాడి కళ్ళలో భయం గొలిపే శూన్యం. శాంత కళ్ళలోకి దీనంగా చూస్తున్న వాడి చూపు. కడుపులో దేవినట్లయింది శాంతకు. శరీరం పట్టు తప్పింది. క్రిందకు జారిపోతున్న శాంతను రెండు చిన్ని చేతులు పట్టుకున్నాయి.

*

ఓ అరగంట తర్వాత కళ్ళు తెరిచింది శాంత. హాలులో దివాన్ పై ఉంది. పక్కనే నుంచుని చూస్తున్నాడు దినేశ్. వాడి చేతిలో మంచి నీళ్ళ గ్లాసు. అందుకుని తాగేసింది.

అదే దెబ్బ తిన్న లేడి చూపులు వాడి మొహంలో. పక్కనే వాచ్మెన్ ఇచ్చి వెళ్లిన టిఫెన్ తీసి ప్లేటులో పెట్టి ఇచ్చాడు. తినలేకపోయింది శాంత. కాని వాడివైపు చూస్తూ కూర్చోలేకపోతుంది. అందుకే ఆ టిఫెన్ మౌనంగా తినేసింది. వాడు మౌనంగా ప్లేట్ తీసుకెళ్ళి సింక్ లో కడిగి సర్ది పెట్టి వచ్చాడు.

“ఆంటి ఇక పడుకోండి. నేను వెళతాను” అంటూ బైటకు వెళుతూ హఠాత్తుగా శాంతి కాళ్ళు పట్టుకున్నాడు. శాంత ఏదో చెప్పబోయింది.

ఇంతలో ఆశోక్, ఆశ ఇంట్లోకి అడుగు పెట్టారు. అశోక్ దినేశ్ ని చూడగానే నిన్నటిలాగే మళ్ళీ వయలెంట్ అయిపోయాడు. “ఎందుకు వచ్చావ్ మా మమ్మీ దగ్గరకు? బ్రోకర్ యు ఆర్ ఏ బ్రోకర్. మా మమ్మీని కూడా బాడ్ గా చేస్తావ్.” అంటూ దినేశ్ మీద పడి కొట్టబోయాడు.

దినేశ్ తల దించుకునే ఉన్నాడు. పిల్లల వెనక వచ్చిన శేఖర్ దినేశ్ ను శాంతను మార్చి మార్చి చూసాడు. ఇంతలో అశోక్ వాళ్ళ నాన్న వైపు తిరిగి ‘డాడీ రమ ఆంటీ, అమ్మమ్మ వీళ్ల అమ్మ గురించి చెబితే, వీడి కోసం నేను వీళ్ల యింటికి వస్తున్న ఆ అంకుల్ ని ఒక రోజు చూసి నీకు చెప్తానని బెదిరించా. ఆయన వీడి కోసమే వీళ్ళ మమ్మీ ఆ అంకుల్ కి గర్ల్ ఫ్రెండ్ గా ఉంటుందని, వీడే వాళ్ల మమ్మీని బాడ్ చేసాడని చెప్పాడు. మన మమ్మీని కూడా బాడ్ చేయడానికే నాతో ఫ్రెండ్ షిప్ చేస్తున్నాడని చెప్పాడు. చూడు డాడి మళ్ళీ ఇంటికివచ్చాడు. మమ్మీ మళ్ళీ వీడితో మాట్లాడుతుంది.” అంటూ అరవడం మొదలెట్టాడు.

దినేశ్ తల దించుకునే ఉన్నాడు…

శేఖర్ లో ఆవేశం కట్టెలు తెంచుకుంది. “యూ బ్రూట్, గెట్ అవుట్. వెళ్ళిక్కడి నుంచి” అంటూ దినేశ్ ని తలుపు వైపు ఒక్క తోపు తోసాడు. గుమ్మం దగ్గర పడిపోయాడు దినేశ్.

ఆశ ఏడుపు అందుకుంది. “డాడి వీడిని మమ్మీ దగ్గరకు రానివ్వద్దు”… హిస్టరిక్ అవుతున్నాడు అశోక్.

శాంత ఇక ఆగలేకపోయింది. “కన్నా” అంటూ అశోక్ ని దగ్గరకు తీసుకుంది. “కన్నా నీ కిష్టం లేని వాళ్ళెవ్వరినీ మమ్మీ ఇంట్లోకి రానివ్వదురా. ప్రామిస్ నీ కిష్టం లేకుండా ఎవ్వరూ మమ్మీ దగ్గరకు రారు. దినేశ్ ఇంకెప్పుడూ మా యింటికి రాకు. మా అశోక్ వైపు కూడా చూడకు” కళ్లు నిప్పులు కురుస్తుండగా గట్టీగా అంది.

అశోక్ తల్లి గుండెల్లో తల దూర్చి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. దినేశ్ గాజు కళ్ళతో శాంత ముఖంలోకి చూసాడు మౌనంగా, నిర్వేదంగా… ఆ చూపు శాంత గుండెల్లో గుచ్చుకుంది. ఎంతో అనుకుంది దినేశ్ కు సైగ చేయాలని, ఏదో చెప్పాలని కాని వాడు ఆమె వైపు చూడలేదు. ఆమె ముఖం నుండి చూపు మరల్చుకున్నాడు. శాంత గుండెల్లో సన్నటి నొప్పి. కాని ఆమె గుండెపై తల పెట్టుకుని ఏడుస్తున్న అశోక్ ను ఆమె పక్కకు తోసెయ్యలేకపోయింది. దినేశ్ గడపదాటి కారిడార్ లోకి నడుచుకుంటూ వెళ్ళిపోవడం చూస్తూనే ఉంది. కళ్ళు మసకబారేదాకా.

*

“క్రింది పిలగాడు ఉరేసుకుని సచ్చిపోయిండమ్మా” శంకర్ మరుసటి రోజు మధ్యాహ్నం వచ్చి చెప్పేదాకా ఎవరికీ ఈ సంగతి తెలియలేదు. తెలిసినా అది ఓ రెండు రోజుల్లో అందరూ మర్చిపోయే విషయమే.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

Leave a Reply