నిన్నటి సంది ఒడువని వాన. ఆకాశం బోరున ఏడుస్తున్నట్టు అనిపించింది. పట్టపగలే చీకట్లు కమ్మినయి. ఉరుములు. మెరుపులు. ఎడతెగక కురిసే వాన. కుండపోత వాన. చెరువు నిండింది. మత్తడి దుంకుతున్నది. కట్టుగాల్వ నిండా పారుతున్న వరద నీళ్లు. కిటికీ నుంచి బయిటికి సూశిన. భీకరంగా హోరెత్తే గాలికి ఊగుతున్న తాటిచెట్లు. కొమ్మలు విరిగిపడుతున్న చెట్లు. వేర్లతో సహా నేలకూలుతున్న చెట్లు.
అప్పుడే తెల్లవారింది. ఇంటిముందు ఈనాడు పేపర్ పడివున్నది. పనులన్నీ తీరినంగ చదువుదామనుకొని హాల్లో టేబుల్పై పెట్టిన. సాయంత్రం దాకా చదవటం కుదరనేలేదు. ఐదున్నరకు పేపర్ తీసుకొని ఒక్కోపేజీ చదువుతున్న.
“నక్సలైట్లకు బాంబులు సప్లై చేస్తున్న ఆరుగురి అరెస్టు” ఏడో పేజీలోని ఈ వార్త నన్నక్కడే ఆపేసింది. వార్తంతా చదివినంక లోలోపల అలజడి చెలరేగింది. ముప్పై ఏళ్లుగా వెంటాడుతున్న కల్లోల జ్ఞాపకం కండ్లల్ల మెదిలింది.
నేనప్పుడు నేను ఏడో తరగతి చదువుతున్న. మా ఊర్లె ప్రైమరీ స్కూల్ వరకే ఉంది. ఆరో తరగతి నుంచి పదో వరకు చదవాలంటే, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెమ్మికల్లుకు పోవాల్సిందే. ఇప్పుడున్నట్టు అప్పుడు బస్సుల్లేవు. అందరం పుస్తకాల సంచులు ఏసుకొని నడుచుకుంటూ వెళ్లే వాళ్లం. పదో తరగతి వాళ్లలో కొందరు సైకిళ్లు వేసుకొని వెళ్లేవాళ్లు. ఓ రోజు నాకు బడికి పోవడం లేటయింది. ఒక్కన్నే దబ్బదబ్బ నడుచుకుంటూ బడికి పోతున్న. మధ్యý ఎవరైన వస్తరా… ఆల్ల సైకిల్ అయినా ఎక్కుదాం అనుకున్న. ఎనకకు తిరిగి చూసుకుంట నడుస్తున్న. ఐనా ఒక్కరూ కన్పించలేదు. పరుగులాంటి నడకతో నెమ్మికల్లు డాంబర్ రోడ్డు దగ్గరికి ఒచ్చిన. అప్పుడే పాడెను మోస్తూ వందల మంది సాగిపోతున్నరు. ఓ వైపు చావు డప్పుల మోతలు. మరోవైపు చావుకు వచ్చిన వాళ్ల ఏడుపులు. రోడ్డుపై దద్దరిల్లుతున్నయి. ఆ పాడెను సూడంగనె భయమైంది. ఎంటనే రోడ్డుపక్కనున్న లొట్టపీసు చెట్లల్ల దాసుకున్న. ఎందుకంటే.. సచ్చిపోయినోల్లకు ఎదురు పోవొద్దని మా అమ్మ చెప్పింది. అప్పటి సంది శవయాత్ర కన్పిస్తే ఉరికొచ్చి ఇంట్లె దాసుకొనేటోన్ని. అందుకే ఇప్పుడు కూడా చెట్లల్ల దాసుకున్న. లొట్టపీసు చెట్ల మధ్యలోంచి నా పక్కనుంచే బారెడు పొడుగున్న జేరుగొడ్డు పాము మెలికలు తిరుక్కుంట సర్రున పాక్కుంట పొయింది. ఒళ్లు ఝల్లుమన్నది. గజ్జున ఒనికిన. ఆన్నించి రోడ్డుకు ఔతలిపక్క చెట్లల్లకు ఉరికిన. శవయాత్ర నాకెదురుగు ఒచ్చింది. అక్కన్నే రోడ్డుపక్కన పాడె దించిండ్రు. దింపుడుగల్లం చేస్తున్నరు.

ఆ గుంపులనించి ఓ దృశ్యం ఔపడ్డది. ఆమెకు పదహారేండ్లు ఉండొచ్చు. పాడెమీద పడి బోరున ఏడుస్తున్నది. ఆమె భుజంపై పసికందు. కాళ్లను పట్టుకుని మరో రెండేళ్ల చిన్నారి ఉంది. రోజుల వయసున్న ఆ పసికూన గుక్కపట్టి ఏడుస్తున్నది. ఆ తల్లీపిల్లల్ని చూసి, అక్కడున్నోళ్లంత తల్లడిల్లిన్రు. పిల్లల్ని పట్టుకొని కంటికి పుట్టెడు ఏస్తున్న ఆ పచ్చిబాలింతను గుర్తుపట్టిన.
ఆమె బంచరాయి భూమిల గుడిసెల బతుకుతున్న రామి. మేమంతా రోజూ ఆ గుడిసె ముందు నుంచే నేను బడికి పోయేటోల్లం. ఆ అక్క ఎందుకు అట్ల ఏడుస్తున్నదో అర్థం కాలేదు. ఆమె పెనిమిటి వేరే ఆసామి దగ్గర పని చేస్తడని యిన్న. ఆల్ల ఇంట్లె ఎవరైన ముసలోల్లో, సుట్టాలో సచ్చిపోయిండ్రనుకున్న. ఇంతల పక్కన్నే ఉన్న బాయిగడ్డమీదికి ఎక్కిన. అప్పుడు కన్పించింది, ఆ శవం ఎవరిదో… నాకు తెల్వకుంటనే కండ్లు కన్నీళ్లతో నిండినయి. పెదవులు వనుకుతున్నయి. శెంపలమీంచి కన్నీటి ధార కారుతనే వున్నది. ఆ రామక్కను చూస్తే నా గుండెల అల్లకల్లోలం చెలరేగింది. ఆమెపై పడి ఏడవాలనిపించింది. కానీ, చిన్న పిల్లలు శవానికి ఎదురుపోవద్దని అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. కొద్దిపేపట్లనే ఆ పాడె, జనం అక్కడినుంచి కొంతదూరం పొయి మూలమలుపు తిరిగిండ్రు. నేను బాయిగడ్డ దిగి, లొట్టపీసు చెట్లను దాటుకుని రోడ్డెక్కిన. కానీ, నా మనసు అప్పటికే ఆగమాగమయింది. బడికి పోవాలనిపించలేదు. రోడ్డుపక్కన ఉన్న మోరిమీద కూసొని, పీతిల్లల్ల ఉన్న రాములక్క గుడిసె దిక్కు చూశిన. ఆమె పెనిమిటి ఎట్ల సచ్చిపోయిండు? ఆయనకు ఇరవయేండ్లు సుత వుండవు. ముసలోడు కాదు. మరి ఎట్ల సచ్చిపోయిండు? ఆల్లే సంపిండ్రా? అయాల ఏం జరిగింది? నా మనసులో ఎన్నెన్నో ఆలోచనలు. సుడిగుండంలా తిరుగుతున్నయి. ఆ నాటి ఘటనే నాకు పదే పదే గుర్తుకువస్తుస్తుది. ఇది ఆల్ల పనే అనే అనుమానం నాలో బలపడింది.
**
ఆ రోజు కూడా అంతే… మా అమ్మకు జెరమొచ్చింది. బువ్వ ఒండుడు లేటయింది. మద్యానం సద్ది పెట్టకుండ అమ్మ బడికి పంపేది కాదు. బువ్వ ఉడుకంగనె మావిడికాయ పచ్చడేసి టిపిన్ల బువ్వపెట్టింది. నేను జబ్బకు పుస్తకాల సంచేసుకొని బడికి పోతున్న. సరిగ్గా ఆ రోజు కూడా డాంబర్ రోడ్డు ఎక్కంగనె ఏడుగురు పోలీసులు ఔపడ్డరు. ఆల్ల భుజాలపై ఏలాడుతున్న తుపాకులు సూడంగనె గుండె ఝల్లుమన్నది. ఒక్కసారిగ ఉరికి మోరిసాటుకు దాసుకున్న. అప్పుడు పోలీసులంటె శానా భయం. ఆల్లు ఎప్పుడు పోతరా అని తొంగి చూసిన. అప్పుడే ఓ ఇద్దరు పోలీసులు రాములక్క పెనిమిటిని కొట్టుకుంటూ… రోడ్డుపై ఈడ్చుకుంటూ వస్తున్నరు.
రాములక్క పోలీసుల కాళ్లపై పడి, “కొట్టొద్దు సారూ… నా పెనిమిటి అసొంటోడు కాదు. పిల్లల్ని కన్నోల్లం. మాకు ఏ పాపం దెల్వది. ఒదిలిపెట్టురి దొరా…” అంటూ చేతులెత్తి మొక్కింది. పోలీసుల కాళ్లు పట్టుకొని ఒదిలిపెట్టలేదు. ఐనా, ఆల్లు కనికరించలేదు. ఆమెను బలంగా తన్నుకుంటూ, ఆమె పెనిమిటిని గొర్రెని ఈడ్చినట్టు ఈడ్చుకొస్తున్నరు. జీబు దిగి ఆల్లకు ఎదురుగా వెళ్లిన అమీన్ సాబు.. ‘వడ్డెరి లం.. కొడుకులు మా ప్రాణాలు తీస్తానికి ఉన్నార్రా.. లం.. కొడకా.. నక్సలైట్లకు బాంబులు ఇస్తవారా…? నీ అమ్మని దెం.. ఈ వడ్డెరి లం.. కొడుకును సంపుర్రి…” అంటూ బండబూతులు తిడుతూ గొడ్లను తోల్కపోతున్న ముసలామె చేతిల ఉన్న కర్రను తీసుకుని నడిరోడ్డు మీదనే రాములక్క పెనిమిటిని గొడ్డును బాదినట్టు బాదిండు. ఐనా, అమీన్ సాబుకు కోపం తగ్గలేదు. పిచ్చిపట్టినోనిలెక్క అరుస్తూ అక్కడ ఉన్నోళ్లందర్నీ తరిమికొట్టిండు. అడ్డం పోయిన రాములక్కను డొక్కల ఈడ్చి తన్నిండు. “వడ్డెరి లం.. బోగం లం.. నీ గు.. మొ.” అంటూ ఇష్టం వచ్చినట్టు బూతులతో విరుచుకుపడ్డడు. ఇద్దర్నీ కొట్టుకుంటూ జుట్టు పట్టుకొని జీపు దగ్గరికి గుంజుకపోయిండు. ఆమె పెనిమిటిని కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి జీపుల కుదేసింన్రు. “ఒదిలిపెట్టురి దొరా…” అంటూ కాళ్లు పట్టుకోబోయిన రాములక్క కడుపు మరోసారి బూటు కాలుతో తన్నిండు. ఆమె కిందపడ్డది. విలవిలలాడుతూ రోడ్డుపై దుమ్ముల పొర్లాడింది.
ఆమె ప్రసవం అయ్యి అప్పటికి తొమ్మిది రోజులే ఐంది. పెద్దాప్రీషన్ చేయించుకున్నది. పోలీసోడు కుట్ల మీద తన్నడంతో స్పృహతప్పి పడిపోయింది. మళ్లీ లేవలేదు. అక్కడే ఉన్న గ్రామ సర్పంచ్ కూడా పోలీసులకు అడ్డు చెప్పలేదు. వీళ్లచేత బావులు తవ్వించుకున్న పెద్ద రైతులు, గ్రామ పెద్దలు ఉన్నా పోలీసులను అడ్డుకోలేదు. ఒడ్డెరోనికి ఇదేం పోయే కాలం? అంటూ తిట్టిండ్రు.
అమీన్ సాబ్ సర్పంచ్ మల్లారెడ్డిని పిలిచి, “ఈ ఒడ్డెరి లం.. కొడుకు బరాల బండిని నడిపిస్తూ ఆ నక్సలైట్ నా కొడుకులకు బాంబులు (జిలెటిన్ స్టిక్స్) ఇస్తున్నడు. ఆ దొంగ లం.. కొడుకులు మమ్ముల్ని చంపుతానికి తిరుగుతున్నరు. వీణ్ని వదలం.. వరంగల్ స్టేషన్కు తీస్కపోతున్నం. సర్పంచ్వి కాబట్టి నీకు చెప్తున్న. మల్ల ఏదైన సమాచారం ఉంటే వాకబు చేస్త” అంటూ జీప్ స్టార్ట్చేసుకొని బర్ర్ర్ర్ర్ర్…మంటూ దుమ్ములేపుకుంటూ అక్కడినించి పోయిండు. అప్పటిదాకా వేడుకలా చూసినవాళ్లంతా జీపు పోగానే రాములక్క దగ్గరికి ఒచ్చిండ్రు.
పోలీసులు ఎల్లిపోవడంతోటి, నేను కూడా ఆ గుంపు దగ్గరకు పోయిన. రాములక్క అత్త బుచ్చమ్మ ఒచ్చి ఆమెను పైకి లేపే ప్రయత్నం చేసింది. కానీ, రాములక్క లేవలేదు. పోలీసోడు కడుపుల తన్నడం వల్ల కుట్లు పిగిలినట్టుంది. చీరంతా రక్తంతో తడిసిపోయింది. అయినా ఊళ్లోల్లు కనికరం చూపించలేదు.“ఈ ఒడ్డెరోళ్లు ఊకె బండలు కొట్టుకుంటూ, ఊరిబయిట బండమీద బతుకక బాంబులు పెట్టేదేంది?” అంటూ తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింన్రు.
రాములక్క కండ్లు తెరవకపోయేసరికి ముసలి అత్త గోడుగోడున ఏడ్చుకుంటూ నీళ్ల తెచ్చి తాపుత అంటూ పైకి లేశింది. అప్పుడే లోట పట్టుకుని దొడ్డికి పోతున్న ఓ భూస్వామి భార్య లోటల నీళ్లను రాములక్క మొకంపై సల్లింది. తాగమని నోట్లె పోసింది.
“అయ్యో దొర్సానీ… దొడ్డికిపోయే నీల్లు తాపితివి” అన్నది ముసలామె.
“మీ ఒడ్డెరి ముండలకు పన్నీరు తెచ్చిపోయాల్నా? గివ్వి పోసుడే ఎక్కువ” అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. శానాసేపటి తర్వాత రాములక్క లేశింది. పెనిమిటిని పోలీసులు తీస్కపోయిండ్రని తెలిసి బాగ ఏడ్శింది. గుడిసెకాడ పిల్లలు ఏడుస్తున్నరని చెప్పి, ముసలమ్మ రాములక్కను తీస్కపోయింది. అదే ఆమెను చివరిసారిగా చూడటం. మళ్లీ ఈ రోజు ఇట్లా చూస్తున్న. మరి రాములక్క భర్త ఎట్ల సచ్చిపోయిండు? ఆయన్ని తీస్కపోయిన పోలీసులే చంపిన్రా? ఏం జరిగింది..? మళ్లీ నాలో అనేకానేక ప్రశ్నలు.
**
రాములక్క పెనిమిటి వరంగల్ల ఓ క్వారీ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నడు. అది క్వారీల్ల బరాల్ పెట్టి బండలు పగలకొట్టే పని. పొద్దు పొడిచినప్పటి నుంచీ సూర్యుడు నిద్రలోకి జారుకునేదాకా గొడ్డులెక్క పనిచేయించేటోడు, ఆ కాంట్రాక్టర్. ఐనా, రాములక్క భర్త ఎదురుచెప్పకుండా పని చేసేటోడు.
రాములక్క నీలాడిందని తెలిసి ‘‘ఇంటికి పోత” అంటే వారం రోజులకు పంపించిండు, కాంట్రాక్టర్. రాములక్క పెనిమిటి ఇంటికి ఒచ్చి బిడ్డనుచూసి మురిసిపోయిండు. అప్పటికే ఓ బిడ్డ ఉన్నా.. రెండో బిడ్డ కూడా తన ‘అదృష్ట దేవత’ అంటూ సంబురపడ్డడు. “ఈ నెలంతా కాంట్రాక్టర్ దగ్గర పనిచేసి, వచ్చే నెల నుంచి ఇక్కన్నే గుట్టమీద బండలు కొట్టుకుంట బతుకుదాం” అని రాములక్కకు చెప్పిండు. “వచ్చే నెల నుంచి పని మానేస్తనని కాంట్రాక్టర్కు కూడా చెప్పిన. ఇప్పట్నించి పిల్లలను చూసుకుంట ఇక్కన్నే ఉంట” అని ఆ రాత్రి రాములక్కకు చెప్పి హాయిగ నిద్రపోయిండు.
మంచి పనోడు పోతే తనకు లక్షల్లో నష్టం వస్తుందని భావించిన కాంట్రాక్టర్ తెల్లారేసరికి దొంగ కేసును బనాయించాలని పథకం పన్నిండు. జిలెటిన్స్టిక్స్ దొంగిలించి నక్సలైట్లకు అందజేస్తున్నడని, వాళ్లతో సంబంధాలను కొనసాగిస్తున్నడని ఆ కాంట్రాక్టర్ రాములక్క భర్తపై తప్పుడు కేసు పెట్టిండు. అప్పటికే నక్సలైట్లపై కోపంతో ఉన్న పోలీసులు రాములక్క భర్తను స్టేషన్ను ఈడ్చుకపోయి మూడురోజులు అన్నం పెట్టకుండా చావబాదిన్రు. ఆ దెబ్బలకు తట్టుకోలేని రాములక్క భర్త స్టేషన్లోనే ఊపిరొదిలిండు. కానీ, పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రిలో పడేసి అనారోగ్యంతో చనిపోయిండని చెప్పి, శవాన్ని అప్పగించిండ్రు. చదువులేని ఒడ్డెరోల్లు పోలీసులను ప్రశ్నించలేకపోయిండ్రు. అన్నీ తెలిసిన సర్పంచ్ నోరు మెదపలేదు. గ్రామస్తులకు అసలు నిజం తెలిసినా, వాళ్లు ఎక్కన్నించో ఒచ్చిన ఒడ్డెరోల్లు, ఆల్ల సంగతి మనకెందుకులే అని పట్టించుకోలేదు. చావుబతుకుల మధ్య ఉన్న రాములక్కకు ముడ్డి కడుక్కునే నీళ్లు తాపించి తన అహంకారాన్ని చూపించిండ్రు. భార్యాభర్తలను పోలీసులు కొడుతున్నా.. మా కులపోల్లని కాదు కదా అన్నట్టు జనమంతా కళ్లప్పగించి చూసిండ్రు. ఒడ్డెరలు తొవ్విన బాయి నీటితో పంటలు పండించుకుంటరు. ఒడ్డెరలు తీసిన చేతబావుల నీటిని కడుపార తాగుతరు. కానీ, ఒడ్డెరలకు ఆ బాయి నుంచి చెంబెడు నీళ్లు తాగే అర్హత లేదన్నట్టు అంటరానితనాన్ని పాటిస్తరు. ఇంకా ఈ లోకం మారేదెప్పుడు? మనిషి అనే వాడు చచ్చిన తర్వాతనా..?
**
నిజం ఎప్పటికీ దాగదు కదా? రాములక్క భర్త మరణం వెనక దాగి ఉన్న చీకటి కోణాన్ని ఓ జర్నలిస్టు వార్త కథనం ప్రచురించి ప్రపంచం దృష్టికి తెచ్చిండు. ఓ సంస్థ ఆధ్వర్యంలో రాములక్క, ఆమె పిల్లలకోసం కొంత డబ్బుని పోగుచేసి ఆమెకు అందించడానికి ఒచ్చిండు. కానీ, అక్కడ రాములక్క లేదు. ఎన్నుకు అంటుకపోయిన డొక్కలతో ఏడుస్తున్న ఇద్దరు చిన్నారులు మాత్రమే ఉన్నరు. వాళ్లకు తోడుగా పిల్లల అమ్మమ్మ ఉన్నది. తాటాకు గుడిసె ఎనగర్రకు ఓ యువతి ఫొటో ఏలాడుతున్నది. గాలికి అటూ ఇటూ ఊగుతున్నది. ఆ ఫొటోకు మోదుగుపూల దండేసి వున్నది. పోలీసులు రాములక్కను సైతం కొట్టడం వల్ల, పెనిమిటి మరణాన్ని తట్టుకోలేక ఆయన చనిపోయిన మూడో రోజే పిల్లలను అనాథలను చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.
**
‘నక్సలైట్లకు బాంబులు సప్లై చేస్తున్న ఆరుగురి అరెస్టు’ ఏడో పేజీలోని ఈ వార్త చదివినంక, ఆనాటి దు:ఖిత దృశ్యం గుర్తొచ్చి నా కన్నీళ్లతో ఆ పేపర్ తడిచిపోయింది. వాళ్లు కొండల్ని పగలగొట్టి అందమైన బంగళాలు కట్టినోళ్లు. మనందరి ఇండ్లకు పునాదులు తొవ్వినోళ్లు. మన దూప తీర్చేందుకు బావులు తొవ్వినోళ్లు. చెరువులు, కుంటలు తొవ్వినోళ్లు. గడ్డపార పోటుతో పాతాళంలోంచి నీళ్లను భూమ్మీదికి తెచ్చినోళ్లు. తమ చెమటా నెత్తురూ చిందించి ఈ లోకం దూప తీర్చినోళ్లు. ఊరికి దూరంగా ఎక్కడో బండల మీద గుడిసెలేసుకొని చీకట్లో మగ్గుతున్నోళ్లు. ఏ రాజ్యమూ వాళ్ల బతుకుల్లో వెలుగులు నింపలేదు. అలగా జనంపై జులుం చేసే ఈ అన్యాయంపై అసహ్యం వేసింది.
ఇంతల యాపచెట్టుకింద బండమీద కూసున్న లింగమ్మ, ఊతకర్ర సాయంతోటి ఆడికి ఒచ్చింది. అడుగుల అడుగేసుకుంట ఒనుకుతున్నది. చేతుల కర్ర ఊగుతున్నది. అందరిదిక్కు సూశింది. “ఒశ్శి పోరని బట్టుకొని గొడ్డును బాదినట్టు బాదుతాంటె ఒక్కడన్న సప్పుడుజెయ్యకపోతిరి. బండగొట్టుకొని బతుకుడు తప్ప ఆనికి ఏ అన్యాలం దెల్వదు. బండ తప్ప ఊరి సుద్దే ఎరకలేని పోరడు. ఆల్లకు ఇద్దరు పసికూనలున్నరు. ఆల్లకు ఏ దిక్కు లేకుంటయిపాయె. దిక్కులేని పచ్చులైరి. అమాయికుల బట్టుకొని కొట్టిసంపుడు ఏ కానూన్ల ఉన్నదిరా. ఇది ఊరా? కాష్టాల గడ్డా? ఒక్కడన్న అడ్డమొచ్చి పోలీసోల్ల ఆపరైతిరి. పోరని రౌతాలు కారేటట్టుకొడ్తాంటె బాగోతం సూశినట్టు సూశిస్తిరి. ఓ పాపిరెడ్డీ… గుట్టకింద నీ పదెకురాల శెలకల బండలుగొట్టి బాయిదొవ్విందెవలు? పడావుబడ్డ నీ బూమిని తడిపిందెవలు? మీరు తినే బువ్వ యాన్నించొచ్చింది? ఈ ఒడ్డెరోల్ల రెక్కల కష్టం గాదా? ఎండిపొయిన నీ పాతబాయిల నీల్ల ఊటలు పుట్టిచ్చిందెవలు? ఈల్లు గాదా? వరదారెడ్డి పటేలా… నీ యింట్లె చేతబాయి తొవ్విందెవలు? ఇప్పుడు నీ ఇంటిల్లిపాది తాగుతున్న నీల్లెక్కడియి? ఓ నాల్లప్పయ్య శేటూ… నీ ఇంటి బున్యాది తొవ్విందెవలు? నీ తాతల తండ్రుల ఇండ్లకు తాడిశెట్టెత్తు మట్టిగోడలు కట్టిందెవలు? ఈ ఒడ్దెరోల్లు గాదా? ఈ జులుమ్మీద మీద మన్నువడ. సక్కని మనుసులు మాయమాయె. ఇదేం నాయం. గీ అన్యాలం పాడుగాను. ఆల్లను సంపినోల్లకు అగ్గిదలగ” అని రెండు దోసిళ్లతోటి మట్టి తీసుకొని, అక్కడున్న ఊరి పెద్దమనుషులపై గుప్పింది. ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని దిక్కులేని పక్షిలెక్క నిలబడ్డ బుచ్చమ్మను, ఎంటబెట్టుకొని తన గుడిసెకు తీస్కపోయింది.
తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పిల్లలిద్దరూ ఇప్పుడు –
ఏ కొండ కోనల్లో బర్మార్లై పేలుతున్నరో.
ఏ అన్యాయాలకు అగ్గిపెడుతున్నరో.
**