‘బేచారె’ – అణిగివున్న భావోద్వేగాల మేల్కొలుపు

‘బేచారె’ అనే ఈ పుస్తకం స్కైబాబ గారు రచించిన పదకొండు భగ్న ప్రేమ కథల సంపుటి. ఈ పుస్తకాన్ని 2015 ఆగష్టు నెలలో ప్రచురించారు. పాఠకులకు నూటపదిహేను పేజీలు చదివామనే అలసట ఏమాత్రం కలగకుండా సాగుతుందీ పుస్తకం. ఈ కథలన్నీ నిజమైన ప్రేమకు మంచి ఉదాహరణలుగా నిలుస్తాయి. ఈ పుస్తకంలోని ఒక్కో కథ ప్రేమలోని వేర్వేరు కోణాలను పాఠకులకు తెలియజేస్తాయి. ప్రేమలో ఉండే కష్టసుఖాలు, భావోద్వేగాలను పాఠకుల కళ్ళకు కడుతుందీ పుస్తకం.

ఈ పుస్తకం చదవకముందు పాఠకులు ప్రేమకు ఎంత విరోధులైనా పుస్తకం అయిపోయేసరికి ప్రేమ అనే భావోద్వేగంపై గౌరవం పుడుతుంది. ప్రేమ అంటే ఎక్కువగా భౌతిక ప్రేమ అనే అంటారు చాలామంది. కానీ, ప్రేమ అనేది కేవలం మనసుకు సంబంధించింది కూడా అయ్యివుడొచ్చు అనే అవగాహనను పాఠకులకు కలుగజేస్తుంది ఈ పుస్తకం.

మనలో చాలామంది ‘ప్రేమ’ అనగానే ఒక ఊహాజనితమైన కథను గురించి ఆలోచిస్తారు. అందులో చాలా ఆనందంగా, సాఫీగా సాగిపోయే కథలనే అనుకుంటాం. కానీ, ఇందులోని కథలన్నీ యధార్థ గాధలే. ఇందులో వర్తమాన సమాజంలో ప్రేమకు ఉండే ఆటంకాలు, ప్రేమికుల బాధలు కనిపిస్తాయి.

ఈ కథల్లోని పాత్రలు చాలా సహజంగా, మన రోజువారీ జీవితంతో పోల్చుకోగలిగేలా ఉంటాయి. ప్రేమ అనేది సినిమాల్లో చూపించేవిధంగానే ఉండదనీ, ప్రేమకు ఎన్నో ఆటంకాలు ఉంటాయని ఈ కథల ద్వారా తెలుస్తుంది. ఒకసారి కులమతాలు ఎదురైతే, ఇంకోసారి ఆర్థిక పరిస్థితులు ప్రేమికులను కట్టిపారేసే గొలుసులవుతాయి. కొన్ని సందర్భాల్లో ఒకరి రూపం మరొకరికి తెలియకున్నా మాటల ద్వారా మనసులు కలిసి ప్రేమలో పడతారు.

ఈ పుస్తకంలో మొదటి కథ ‘బేచారె’ పూర్తయ్యేలోపే మనకు కన్నీళ్లొస్తాయి. ఈ కథలో ‘జుబేదా’ తన పాత ప్రేమను గుర్తుచేసుకుని బాధపడుతుంది. పెళ్ళై ఐదేళ్లయినా ప్రేమను మర్చిపోలేక, తన నిస్సహాయ స్థితిని తలచి కుమిలిపోతుంది. జుబేదా ఆఖరికి తిరిగి అతణ్ణి కలిసే అవకాశం వచ్చినా తట్టుకోలేదని తెలిసి వదులుకుంటుంది. ‘లోహం’ కథలో ఆర్థిక స్థిరత్వం అనే ముసుగులో ఉన్న యాంత్రిక జీవితంలో చిక్కి ఉక్కిరిబిక్కిరి అవుతుంది పద్మజ.

పండుగ వాతావరణాన్ని వర్ణిస్తూ ఉన్న జమ్మి, మజ్బూర్, ఉర్సు లాంటి కథలు ఈ తరం వారికి ఆ కాలాన్ని, అప్పటి ఆచారాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. వీటిలో కొన్ని కథలు బాధగా ముగిస్తే మరికొన్ని కథలు ఆఖరికి ఆనందంగా ముగుస్తాయి. ‘ఏక్ నాయి ఖిడికీ’ అనే కథలో మారుతున్న తరాన్ని ఫేస్ బుక్ వాడకం ద్వారా చూపించారు. అన్ని సంవత్సరాలుగా ఎడబాసిన ప్రేమికులు టెక్నాలజీ ద్వారా మళ్ళీ కలుసుకోవడం ఆనందంగా అనిపిస్తుంది.

‘అన్ మోల్ రిస్తే’ అనే కథ చదివితే ఇక అందరికీ తాము కోల్పోయిన తొలిప్రేమలు గుర్తుకురావడం ఖాయం. భార్యాభర్తల సంబంధం గురించి, వారి మధ్య ఉండాల్సిన ఏకీభావాన్ని గురించి ఈ కథ చాలా అందంగా తెలియజేస్తుంది. పుస్తకం పూర్తయ్యే సరికీ పాఠకులు తమ ప్రేమ జ్ఞాపకాల్లో మునిగిపోతారు.

ఈ పుస్తకంలోని కథల్లో నాకు ఎక్కువగా నచ్చింది, ‘లవ్ యు షహీదా’. రక్త సంబంధం లేని ఇద్దరి మధ్య ప్రేమ అంటే భౌతిక ఆకర్షణలు మాత్రమే అని అందరూ అనుకుంటారు. కానీ, ఏ సంబంధం లేకపోయినా వారి మధ్య ప్రేమానురాగాలు చిగురించవచ్చని ఈ కథ మనకి తెలుపుతుంది. షహీదా తన కొడుకు ప్రేమకు దూరం అయ్యి యూసఫ్ ను అతని స్థానంలో చూసింది. ఆమె రూపం, వయసు ఇవేవీ తెలియని యూసఫ్ తనను పట్టించుకోకపోవడం బాధను కలిగిస్తుంది. ఆమె ఆఖరి క్షణాల్లో ఆమె దగ్గరకు చేరుకున్న యూసఫ్ తానేం చేసానో తెలుసుకుని పశ్చాత్తాప్పడతడు. షహీదా యూసఫ్ లో విదేశాల్లో ఉన్న తన కొడుకుని చూసిందని తన మాటల ద్వారా మనకు తెలుస్తుంది.

‘బేచారె’ పుస్తకాన్ని రచయిత స్కైబాబారు అందమైన తెలంగాణ జీవభాషలో రాశారు. ఇతర రచయితల్లాగా ప్రామాణిక భాషకు ప్రాధాన్యత ఇవ్వకుండా తెలంగాణ ప్రజల వాడుక భాషలో ఈ కథలు రాశారు. ఈ పుస్తకంలోని భాష తెలంగాణ మాండలికం, ఉర్దూ పదాలు కలగలిసి అందంగా కనిపిస్తుంది. తెలంగాణలో నివసించే సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా ఈ భాష ఉంటుంది. ఐతే, ప్రామాణిక పత్రికా భాష మాత్రమే చదవడం అలవాటు ఉన్నవాళ్లకు లేదా తెలంగాణ భాషపై ఎక్కువగా అవగాహన లేనివాళ్లకు ఈ పుస్తకం చదివి అర్థం చేసుకోవడం కొంచెం కష్టమని చెప్పొచ్చు. ఈ పుస్తకం చదివే ముందు ‘ప్రేమ’ అంటే కేవలం ఒక భావోద్వేగం మాత్రమే అనేది నా భావన . కానీ, చదివాక ప్రేమలో ఉండే బాధ వర్ణనాతీతం అని తెలుసుకున్నాను. అలాంటి ప్రేమకథలను అందంగా, అత్యంత సహజంగా రాశారు రచయిత. ప్రేమలో ఉండే బాధని ఎలాంటి అతిశయోక్తులు లేకుండా పాఠకుల కళ్ళకు కట్టారు స్కైబాబగారు.

కవయిత్రి. పుట్టింది హైదరాబాద్. నిజాం కళాశాలలో బి.ఏ. మొదటి సంవత్సరం చదువుతోంది.

Leave a Reply